Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కెనడా వెళ్లేదాకానే మొగుడు

ఎమ్బీయస్‍: కెనడా వెళ్లేదాకానే మొగుడు

ఒక పల్లెటూరి పెద్దాయన. కూతురికి చదువుసంధ్యలబ్బలేదు. పేదరికంలో వున్న మేనల్లుణ్నో, దూరపు బంధువులబ్బాయినో సొంత ఖర్చుతో పట్నానికి పంపి చదివించాడు, ఉద్యోగం తెచ్చుకుని, తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే షరతు మీద. తీరా ఆ అబ్బాయి ఉద్యోగస్తుడయ్యాక యీ పల్లెటూరి గబ్బిలాయి నాకు వద్దు అన్నాడు. తండ్రి లబోదిబో మన్నాడు. పాత సినిమాల్లో యిలాటివి చాలా చూసే వుంటారు. నిజజీవితంలో కూడా యిలాటి కేసులు తారసిల్లే వుంటాయి. ఇప్పుడు కేసులు తిరగబడుతున్నాయి. ప్రమీలా రాజ్యంలో అంతా ఉల్టా అన్నట్లు గతంలో పెళ్లికూతుళ్ల తండ్రులు చెప్పులరిగేలా తిరిగితే, యిప్పుడు పెళ్లికొడుకుల తండ్రులు తిరుగుతున్నారు. అప్పట్లో అబ్బాయిలు కొమ్మెక్కి కూర్చుంటే, యిప్పుడు అమ్మాయిలు చిటారు కొమ్మెక్కారు. అమ్మాయి నచ్చిందో లేదో అబ్బాయి ఓ పట్టాన చెప్పేవాడు కాదు, యిప్పుడు అబ్బాయి నచ్చాడో లేదో అమ్మాయి ఓ పట్టాన చెప్పదు, గివ్ మీ సమ్ టైమ్ అంటోంది. వీటన్నిటిలాగానే అత్తవారి డబ్బుతో ఫారిన్ చదువయ్యాక, మొగుణ్ని గిరవాటు వేస్తున్నారు పంజాబీ యువతులు.

పంజాబ్, హరియాణాలలో (ముఖ్యంగా హరియాణాలో) ఆడపిల్లలంటే చులకన. పుట్టగానే ఆడపిల్లను చంపడం హరియాణాలో సర్వసాధారణం. ప్రకృతి సాధ్యమైనంత వరకు అన్ని జాతులలోనూ ఆడా, మగాను సరిసమానంగానే పుట్టిస్తుంది. కానీ గర్భంలో ఆడ శిశువు ఉందనగానే అబార్షన్ చేయించడం చేతనే సెక్స్ రేషియో మారిపోతూ వుంటుంది. వెయ్యి మందికి ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారు అనేది తెలిస్తే ఆ జాతి ఎంత నాగరికంగా వుంది అనేది తెలిసిపోతుంది. 2013-15లో ఇండియాలో జాతీయ సగటు 900, కేరళలో అది 967, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 918. ఏ రాష్ట్రంలోనైనా జాతీయ సగటు కంటె తక్కువుంది అంటే రాష్ట్ర ప్రజలు సంకుచిత భావాలున్న వారు, తిరోగమనవాదులు అని అర్థం. వాటిలో పంజాబ్ 889, గుజరాత్ 854, హరియాణా 831. వీళ్లందరూ తమ పాపాలకు అనుభవించే రోజులు వచ్చాయి, యింకాయింకా వస్తున్నాయి. హరియాణాలో పెళ్లాడడానికి ఆడపిల్లలు దొరక్క బిహార్ నుంచి పేద పిల్లలను తెచ్చుకుని, యింటికి కోడళ్లుగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం చెప్తున్నది పంజాబీ యువకుల తలిదండ్రుల వ్యథ.

ఆడపిల్లను వద్దని, మగవాడిని కని వీళ్లు ఉద్ధరిస్తున్నది ఏమీ లేదు. వాళ్లకు చదువుసంధ్యలు అబ్బటం లేదు. కానీ గాలిమేడలు కట్టడం మానరు. ఎలాగోలా విదేశాలకు వెళ్లి అక్కడ ఎలాటి పనైనా చేసి, డబ్బు సంపాదించాలన్న ఆశ ఈ పంజాబీలకు! పంజాబ్ నుంచి 12వ తరగతి చదివిన స్టూడెంట్స్ ఏటా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది దాకా విదేశాలకు వెళుతూంటారు. వీళ్లు కాక మరో రెండు లక్షల మంది ఉద్యోగనిమిత్తం వెళుతూంటారు. గతంలో యుకెకు వెళ్లేవారు, తర్వాత కెనడాకు, వీలైతే అమెరికాకు! ఇప్పుడు కాబూలు గురుద్వారాలో చిక్కడిన 150 మంది శిఖ్కులు, హిందువుల సంగతి చూడండి. ఇండియన్ ప్రభుత్వం ‘రండిరా, మిమ్మల్ని క్షేమంగా ఇండియాకు తీసుకెళ్లిపోతాం’ అని గడ్డం పట్టుకుని బతిమాలినా వాళ్లు ససేమిరా అన్నారు. ఎందుకంటే వాళ్ల గమ్యం కెనడా లేదా అమెరికా. శరణార్థులమని పేరు చెప్పుకుని ఆ రెండు దేశాల పౌరసత్వం పుచ్చుకుందామని వాళ్ల ఆశ. ఇండియా వస్తే ఏముంది అని చిన్నచూపు.

మానవ విషాదం ఒకవైపు ఉన్నా, యిలాటివాళ్ల దురాశ మరో వైపు చికాకు కలిగిస్తుంది. శ్రీలంకలో టైగర్ల బెడద రాగానే అక్కడి తమిళులు మాకు మా దేశంలో రక్షణ లేదు. మేం రాజకీయ బాధితులం, పునరావాసం యివ్వాలి అంటూ యూరోప్ దేశాల్ని కోరారు. ఇలాటి వాళ్లకు పౌరసత్వం యివ్వడం ఆ దేశాలకు ఓ ఫాన్సీ. రండి అంది. దెబ్బకు అనేకమంది తమిళులు యూరోప్ దేశాల్లో స్థిరపడిపోయారు. ఈ రోజు లండన్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళులు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. అలాగే ఉగాండాలో ఈదీ అమీన్ భారతీయ సంతతి వాళ్లను తరిమివేసినప్పుడు వాళ్లు ఇండియా రాలేదు. యుకెకు వెళ్లారు. అక్కడ చాలా బ్రహ్మాండంగా సంపాదించి, తమని తరిమివేసినందుకు అమీన్‌ ఫోటోకి దండాలు పెట్టుకుంటున్నారు. దాని మీద గతంలో ఓ ఆర్టికల్ రాశాను కూడా. ఇప్పుడు ఆఫ్గన్‌లో వున్న పంజాబీలదీ అదే లక్ష్యం.  ఈ వంక పెట్టుకుని కెనడాలో మకాం పెట్టేయాలని.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నపుడే యిలాటి ఆలోచనలుంటే తాపీగా వున్న వూళ్లో వుంటే యింకెలాటి ఆలోచనలు వుంటాయో ఊహించండి. కెనడా వెళ్లాలంటే చదువు ఉండాలి. ముఖ్యంగా ఆంగ్లభాషలో మాట్లాడే ప్రావీణ్యతను నిరూపించే ఐఇఎల్‌టిఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్ష పాసవ్వాలి. పొట్ట కోస్తే విస్కీ తన్నుకు రావచ్చు కానీ అక్షరాలు రాలని కుర్రాడు అది పాసవడం ఎలా? కెనడా వెళ్లడం ఎలా? దానికి వాళ్లు కనిపెట్టిన మార్గమేమిటంటే ఆ పరీక్ష పాసయిన ఒక అమ్మాయిని పట్టుకుని, తమ ఖర్చులతో అక్కడకు పంపించి, చదివించి, అక్కడి శాశ్వతనివాసం (పెర్మనెంట్ రెసిడెన్సీ – పిఆర్) సంపాదించుకునేట్లా చేసి, ఆ తర్వాత ఆమె స్పౌజ్ వీసాతో ఆమె చున్నీ పట్టుకుని కెనడాకో, ఆస్ట్రేలియాకో, యుకెకో ఎగరడం!

ప్లానంతా బాగానే వుంది అక్కడకు వెళ్లాక, ఆ అమ్మాయికి యీ మొరటు మొగుడు నాకెందుకు అనుకుంటే..? అనుకుంటే ఏమిటి, కొందరు అనుకుంటున్నారు. ఫారిన్ వెళ్లాక ఫోన్లు ఆపేస్తున్నారు. అందకుండా పోతున్నారు. మొగుడు ఎలాగోలా అక్కడకు చేరి, నా సంగతేమిటి అని గొడవ చేస్తే తప్పుడు కేసులు బనాయించి, జైలుకి పంపిస్తున్నారు. దాంతో వీళ్లు నెత్తీనోరూ కొట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్‌లో వేలాది కేసులు ఫైలయ్యాయి. కరక్టుగా చెప్పాలంటే 2019లో 4268, 2020లో 3829, 2021లో జూన్ వరకు 2248. ఒక్కో కేసులో రూ. 24-50 లక్షల దాకా వెచ్చిస్తున్నారు. ఇటువంటి వాళ్లు పోగొట్టుకున్న మొత్తం సొమ్ము కలిపితే రూ.150 కోట్ల దాకా వుంటుందట. వాటి గురించే యీ కథనం.

ఆడపిల్లలను చదువుకోనిచ్చిన దగ్గర్నుంచి వాళ్లు చదువులో మగవాళ్లను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నారు. పంజాబ్ లాటి చోట్ల కష్టపడి బతికి బట్టకట్టిన బాపతు కాబట్టి మరీనూ! డిగ్రీ పూర్తవగానే ఐఇఎల్‌టిఎస్ పాసయి పోతున్నారు. కానీ విదేశాలు వెళ్లి చదువుకోవాలంటే డబ్బు లేదు. అలాటి పరిస్థితిలో మేరేజి బ్రోకర్ యీ అమ్మాయి వివరాలు, ఈ పరీక్ష పాసయిన సర్టిఫికెట్టు పట్టుకుని అబ్బాయిల తలిదండ్రుల దగ్గరకు వెళుతున్నారు. ‘ఫలానా యూనివర్శిటీలో సీటు వచ్చింది, చూస్కోండి. యూనివర్శిటీ ఫీజు, వెళ్లడానికి, అక్కడ వుండడానికి యిన్ని లక్షలవుతుంది. ఆ ఖర్చూ, పెళ్లి ఖర్చూ మీదే. వీటికి మీరు ఒప్పుకుంటే పెళ్లి కుదురుతుంది. మీ కోడలిగానే అక్కడకు వెళ్లి రెండేళ్లలో చదువు పూర్తి చేసుకుంటుంది. అక్కడ ఉద్యోగం రావడం ఖాయం. రాగానే పర్మనెంటు రెసిడెంటు స్టేటస్ వస్తుంది. ఆ తర్వాత మీ అబ్బాయిని జీవిత భాగస్వామి వీసాపై రప్పించుకుంటుంది. మీ అబ్బాయికి రెక్కలు వస్తాయి. అక్కడకి వెళ్లి వాలతాడు. తనూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటాడు. ఇద్దరూ ఎంచక్కా ఫారిన్‌లో సెటిలై పోవచ్చు’ అని చెపుతున్నారు.

వీళ్లూ అమ్మయ్య ఫారిన్ వెళ్లడానికి యీ కాంట్రాక్ట్ మేరేజి అడ్డదారి దొరికింది అని ఒప్పుకుంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగినవాళ్ల కథ పోలీసు స్టేషన్ దాకా రాదు కదా! సవ్యంగా జరగని వాళ్ల కథలు ఒక్కోటి ఒక్కోలా వున్నాయి. మండీ గోవిందగఢ్‌కు చెందిన 26 ఏళ్ల హర్‌ప్రీత్ సింగ్ తండ్రి – ‘‘మా అబ్బాయికి 2018 జులైలో పెళ్లయింది. 2019 జనవరిలో మా కోడల్ని స్టడీ వీసాలో పంపాం. కెనడా చేరిన తర్వాత ‘నేనిక్కడ మరో అబ్బాయితో సెటిలవుదా మనుకుంటున్నాను. మన సంబంధానికి రాంరాం.’ అని చెప్పింది. పెళ్లికి, పంపడానికి రూ.28 లక్షలైంది. దాంతో మధ్యవర్తుల ద్వారా చెప్పించి, చివరకు స్పౌజ్ వీసా తెప్పించి మా అబ్బాయిని పంపాం. అక్కడకు వెళ్లాక డైవోర్స్‌కి అప్లయి చేసింది. నేనిక్కడ అమ్మాయి మీద, ఆమె తలిదండ్రుల మీద 420, యితర సెక్షన్ల కింద కేసు పెట్టాను.’’ అన్నాడు.

ఫిరోజ్‌పూర్‌లోని అమృత్ లాల్ చెప్పేదేమిటంటే – ‘‘మా అబ్బాయి ఓంకార్ సింగ్‌కు ఓ అమ్మాయి నిచ్చి 2018 ఏప్రిల్‌లో పెళ్లి చేశాం. ఆ అమ్మాయికి కెనడాలో సీటు వచ్చింది. ఆస్తులమ్మి రూ. 46 లక్షలు ఆమె చేతిలో పోశాం. చదివే రోజుల్లో మూడు సార్లు ఇండియాకు వచ్చింది. మేం చెప్పగాచెప్పగా 2019 సెప్టెంబరులో మా అబ్బాయిని స్పౌజ్ వీసా మీద తీసుకెళ్లింది. అక్కడకు వెళ్లగానే గృహహింస, బలాత్కారం నేరాలపై జైలుకి పంపింది. కెనడా పోలీసులు వాడి పాస్‌పోర్టు లాక్కున్నారు. చచ్చీచెడి ఇండియాకు తిరిగి వచ్చి, ట్రక్ మెకానిక్‌గా బతుకుతున్నాడు. అక్కడ ఆ అమ్మాయి సుఖంగా కులుకుతోంది.’’ ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల జోబన్‌జీత్ సింగ్ - ‘‘మాకు 2012లో పెళ్లయింది. నా భార్య పరీక్ష పాసయితే లక్షలు ఖర్చు పెట్టి 2014 జనవరిలో కెనడా పంపించాను. వెళ్లిన కొన్నాళ్లు టచ్‌లోనే వుండేది. తర్వాత ఫోన్లెత్తడం మానేసింది. వెళ్లి మా అత్తమామలకి చెపితే ‘ఇదిగో స్పౌజ్ వీసా పంపుతుంది, అదిగో పంపుతుంది’ అంటూ కాలక్షేపం చేశారు. చివరకి నా భార్య తరఫున 2020లో విడాకులకు అప్లయి చేశారు. నేను పంజాబ్ ఎన్నారై సెల్‌లో ఫిర్యాదు చేశాను.’’ అని మొత్తుకుంటున్నాడు.

జలంధర్‌కు చెందిన చమన్ లాల్ కొడుకు గౌరవ్‌ను పరీక్ష పాసయిన ఒకమ్మాయికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన పైనెలలోనే కెనడాకు వెళ్లి యూనివర్శిటీలో చేరింది. మొగుడి కుటుంబం నెలనెలా వేలాది డాలర్లు పంపారు. మొత్తం మీద రూ.35 లక్షలైంది. ఆస్తులు తాకట్టు పెట్టాల్సివచ్చింది. చివరకు ఆమె స్పౌజ్ వీసా పంపింది. గౌరవ్ వెళ్లాడు. భార్య ఎయిర్‌పోర్టులో కనబడలేదు. ఫోన్ చేస్తే దొరకలేదు. ఇతను వచ్చే లోపున ఫోన్ మార్చేసింది. దాంతో అతని వీసా కాన్సిల్ అయింది. ఒక ఫ్రెండ్ యింట్లో తలదాచుకున్నాడు. విజిటర్ వీసా గడువు కూడా అయిపోవస్తోంది. ఇండియాకు తిరిగి రావాలి, లేదా కెనడా జైలుకి వెళ్లాలి. కేంద్రానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టెర్నల్ ఎఫయిర్స్‌లో నమోదైన కేసులు 3300 వుంటే వాటిలో 3 వేలు పంజాబ్‌వే నట. గత మూణ్నెళ్లలో లూధియానా నుంచి 30 కేసులు, జలంధర్ నుంచి 70 కేసులు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాలూ కలిపి గత ఆర్నెల్లలో నమోదైనవి 200 కేసులు. అంటే రోజుకి కనీసం ఒక కేసు అన్నమాట!

లూధియానా జిల్లాలోని రుడ్కా గ్రామంలోని అవనీందర్ సింగ్ ఒకమ్మాయిని 2018 జులైలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే అబ్బాయి అమ్మానాన్నా అమ్మాయి తలిదండ్రుల ఖాతాకు రూ. 10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. తీరా చూస్తే అమ్మాయి వీసా సాంకేతిక కారణాల చేత రిజెక్ట్ అయింది. అంతే, కెనడా వెళ్లడానికి వీలుపడకపోతే యీ మొగుడెందుకు అనుకుంటూ ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది. అవనీందర్‌కు విదేశయాన భాగ్యమూ లేదు, భార్యా లేదు. పోనీ పది లక్షలైనా తెచ్చుకుందామని అత్తింటికి వెళితే వాళ్లు అతనిపై గృహహింస, కట్న వేధింపుల కేసు పెట్టారు. అవన్నీ తెముల్చుకుని వీళ్లు చీటింగ్ కేసు పెడితే అమ్మాయిని, ఆమె అమ్మానాన్నను అరెస్టు చేశారు. వీళ్ల డబ్బయితే యింకా తిరిగి రాలేదు.

ఈ అమ్మాయి ఇండియాలో వుంది కాబట్టి అరెస్టయింది. కెనడా చెక్కేసిన జాణల విషయంలో ఇక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇండియన్ కాన్సలేట్లకు రాయడం, విదేశ వ్యవహారాల శాఖకు రాయడం.. యిదంతా పేపర్ వర్కే తప్ప, పని జరగటం లేదు. గత ఐదేళ్లలో ఎన్నారైలకు వ్యతిరేకంగా ఉన్న కేసుల సంఖ్య 15 వేలు. వాటిలో వివాహాది విషయాలకు సంబంధించినవే ఎక్కువగా వుంటున్నాయి. ప్రియుడు అమెరికాలో వుంటే, అతన్ని చేరుకోవడానికి ఎవరో ఎన్నారై అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని, అతని భార్యగా వీసాతో అక్కడ అడుగు పెట్టి, ఎయిర్‌పోర్టులోనే మొగుణ్ని వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయిన కేసులు విన్నాను. అదేమిటని గట్టిగా అడగబోతే ‘కావాలంటే విడాకులు ఇయ్యి తప్ప గోల చేస్తే గృహహింస కేసు పెడతా’ అని బెదిరిస్తారు వాళ్లు. ఇలాటి కథాంశంతో ఏదైనా సినిమా వచ్చిందో లేదో తెలియదు కానీ, అక్షయ కుమార్, కత్రినా కైఫ్ నటించిన ‘‘నమస్తే లండన్’’ సినిమా మరోలాటి మోసాన్ని చూపించింది. అమ్మాయిలు మోసపోయిన థీమ్స్‌పై సినిమాలు చాలా వచ్చాయి. ఇలా అబ్బాయిలు మోసపోయిన కథల మీద కూడా సినిమా కథ రాయవచ్చని సూచించడానికే యిన్ని ఉదాహరణలిచ్చాను. ఇవన్నీ కలిపితే మంచి రసవత్తరమైన కథ తయారు కావచ్చు. (ఫోటో –ఇలాటి పెళ్లిళ్లు కుదిర్చే ఓవర్‌సీస్ కన్సల్టెంట్ల ఆఫీసులు జలంధర్ బస్టాండ్‌ పక్కన పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన దృశ్యం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?