cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పివి వారసత్వమా..?

ఎమ్బీయస్: పివి వారసత్వమా..?

తెలంగాణ శాసనమండలి ఎన్నికలలో హైదరాబాద్– రంగారెడ్డి- మెహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీమతి సురభి వాణీదేవి గారి గురించి తెరాస యివాళ పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ యిచ్చింది. ఆవిడ విద్యావంతురాలు. 32 ఏళ్లగా విద్యాసంస్థలను విజయవంతంగా నడుపుతున్న సమర్థ మహిళ. చిత్రకారిణి. కానీ వాటన్నిటి కంటె పివి వారసురాలిగానే ఎక్కువ ప్రొజెక్టు చేస్తున్నారు. ఫోన్‌లో వచ్చే ఆవిడ వాయిస్ మెసెజీలలో కూడా నేను పివి గారి కుమార్తెను అనే చెప్పుకుంటున్నారు. ఆవిడకు ఓటేస్తే పివి వారసత్వాన్ని గౌరవించినట్లని తెరాస ప్రచారం చేస్తోంది. ఇదే నాకు మింగుడు పడటం లేదు. పివి వారసత్వమంటే ఆయన సంతానం కావడమేనా?

పివి మహానుభావుడు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో, ప్రజాజీవితంలో, ఉద్యమాలలో మునిగి తేలిన యోధుడు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ప్రధాని పదవికి ఎదిగి, భారతదేశానికి వన్నె తెచ్చిన సమర్థుడు. ఆయనకు 8 మంది పిల్లలు. 5గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వారిలో రాజకీయాల్లోకి వచ్చినవారు పివి రంగారావు, రాజేశ్వరరావు. ఈ వాణి గారు విద్యాసంస్థల నిర్వహణకే పేరుబడ్డారు తప్ప రాజకీయాల వైపు తొంగి చూడలేదు. సామాజిక కార్యకర్త అని కూడా జోడిస్తున్నారు కానీ ఆవిడ చేసిన కార్యకలాపాల గురించి ఏమీ తెలియరావటం లేదు. రాజకీయేతర టీవీ చర్చల్లో కూడా ఆవిణ్ని ఎన్నడూ చూడలేదు. ఆవిడ యింటర్వ్యూ చూస్తే ఆర్టిస్టుగా చాలా ప్రదర్శనలు నిర్వహించారని తెలిసింది. తన పనేదో తను చూసుకుంటూ యిన్నాళ్లూ గడిపారు. ఇప్పుడు ఏడుపదుల వయసులో రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు లాగుంది.

శాసనసభకు కాకుండా శాసనమండలికి వస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయి రాజకీయనాయకురాలని అనకూడదంటారేమో. స్వతంత్రురాలిగా పోటీ చేసి వుంటే అనకూడదు కానీ తెరాసలో చేరి ఆ పార్టీ తరఫున నిలబడ్డారు కాబట్టి, ఆ కండువా వేసుకున్నారు కాబట్టి రాజకీయజీవిగానే చూడాలి. విద్యాసంస్థలు నడుపుతూ టీచర్ల, విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆవిడ స్వతంత్రంగా మండలికి వచ్చి వారి గురించి మాట్లాడి వుండవచ్చు. కానీ ఆవిడ రాజకీయాల మార్గం ఎంచుకున్నారు. అది కూడా తెరాస పార్టీలో చేరి! వాళ్ల నాన్నగారు కాంగ్రెసు పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి. దేశంలో అత్యున్నత పదవిని ఆ పార్టీ ద్వారా పొందిన వ్యక్తి. సమైక్యవాది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, 1972 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. రెండో ఉద్యమాన్ని అణచడానికి తన పదవిని సైతం వదులుకున్న వ్యక్తి. మరి తెరాసకు సమైక్యమంటేనే పడదు. విభజన రాజకీయాల్లోనే పుట్టి, పెరిగి, అధికారం చేపట్టింది. ఈవిడ అలాటి పార్టీలో చేరి పివి వారసత్వం అనడం వింతగా లేదూ!

ఈవిడ తెరాస పక్షాన కానీ, ప్రత్యేక ఉద్యమపక్షాన కానీ, కెసియార్ పాలనాసామర్థ్యం గురించి కానీ ఎన్నడూ బహిరంగంగా మాట్లాడిన దాఖలాలు లేకపోయినా తెరాసకు యీవిడ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టిందో అందరికీ తెలిసిన విషయమే. సిటింగ్ ఎమ్మెల్సీ, లాయరు, బిజెపి అభ్యర్థి రామచంద్రరావు 2015లో తెరాస అభ్యర్థి దేవీప్రసాద్‌ను 13 వేల ఓట్ల తేడాతో ఓడించారు కాబట్టి, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి యీసారి ప్రత్యర్థిగా బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెడితే వాళ్ల ఓట్లు చీలతాయనే లెక్క వేశారు.

పివి శతజయంతి సంవత్సరం కాబట్టి ఆ సెంటిమెంటూ పండుతుందేమోనన్న ఆశ ఒకటి చేరింది. అందుకే పివి నామ జపం. సమైక్యవాది పివిని తెలంగాణకు పరిమితం చేసి, పివి వారసత్వం గురించి పదేపదే మాట్లాడడం! వాణిగారి రాజకీయ భావాలేమిటో యిప్పటికీ తెలియటం లేదు. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీల విధానాలపై ఆవిడ వ్యాఖ్యానించటం లేదు. వ్యాఖ్యానించి వుంటే పివి భావజాలానికి యీవిడ ఎంతటి వారసురాలో తెలిసేది. అలా కాకపోతే పివి వారసత్వం కుటుంబం వరకే పరిమితం అనిపిస్తోంది.

ఈ పోటీలో నిలబడుతున్న అభ్యర్థుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నా దృష్టిలో మంచి అభ్యర్థి. అనేక విషయాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన వుంది. సరైన గణాంకాలతో, ఏ తడబాటూ లేకుండా, ఘంటాపథంగా వ్యాఖ్యానిస్తారు. దశాబ్దాలుగా ఆయన్ను చూస్తున్నాను, వింటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వున్నా సరే, పక్షపాతరహితంగా, నిర్భయంగా తనకున్న అభిప్రాయాలను తేటతెల్లంగా చెప్తారు. ఆయన అభిప్రాయాలతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించక పోవచ్చు కానీ విషయమైతే బోధపడుతుంది. అజ్ఞానం, అరకొర సమాచారం రాజ్యమేలుతున్న యీ రోజుల్లో సమాజానికి ఆయనలాటి వక్తల, విశ్లేషకుల అవసరం ఎంతైనా వుంది.

ఈ మధ్య ఎన్నికలలో ‘నోటా’నే నమ్ముకున్న నేను యీ ఎన్నికలలో మాత్రం ఆయనకు ఓటేయబోతున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటనే కాదు, ఆయన ఒక్కరికే వేయబోతున్నాను. ఆయన గెలుస్తారో లేదో నాకు తెలియదు. స్వతంత్రంగా మాట్లాడేవారి గొంతు నొక్కేస్తున్న యీ కాలంలో ధైర్యంగా మాట్లాడే వాళ్లని గౌరవించాలి, వెన్నుదన్నుగా నిలవాలి. పైగా ఆయన కేరాఫ్ ఫలానా అని చెప్పుకోకుండా, కులప్రాతిపదికపై ఎంపికైన అభ్యర్థిగా ముందుకు రావటం లేదు. అదీ నాకు నచ్చింది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×