Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాహుల్‌ గాంధీకి ఒడుగైందా!?

ఎమ్బీయస్‌: రాహుల్‌ గాంధీకి ఒడుగైందా!?

2012 యుపి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జరిగిన సమీక్షా సమావేశంలో ఆ రాష్ట్ర బ్రాహ్మణ కాంగ్రెసు నాయకులు ''మన పార్టీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత యివ్వటం లేదు, అందుకే యీ ఓటమి'' అని ఫిర్యాదు చేసినప్పుడు ''ఇవ్వకపోవడమేం? నేను బ్రాహ్మణ్నే, అయినా పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవికి రాలేదా?'' అన్నాట్ట రాహుల్‌. దీని వీడియో బయటకు రాకపోవడం చేత, -ట వార్తగా ('రిపోర్టెడ్‌లీ సెడ్‌') రావడం చేత యిది చమత్కారంగా అన్నాడో సీరియస్‌గా అన్నాడో తెలియరాలేదు. సీరియస్‌గా అని ఉంటే అంతకు మించిన జోక్‌ మరొకటి ఉండదు. రాహుల్‌కి ఆ పదవి కులం వలన వచ్చింది కాదు, సోనియా కొడుకు కావడం వలన వచ్చింది.

అతను ఒక బ్రాహ్మణి పౌత్రుడు, సగం పార్శీకి (రాజీవ్‌ తల్లి అంత్యక్రియలు బ్రాహ్మణ సంప్రదాయం అవునో కాదో తెలియదు కానీ హిందూసంప్రదాయంలో జరిపాడు, అతని అంత్యక్రియలూ భార్య అలాగే జరిపించింది), క్రైస్తవురాలికి పుట్టినవాడు. ఆ సభలో వాళ్లను ఊరుకోబెట్టడానికి అన్నాడో ఏమో కానీ రాహుల్‌ మళ్లీ తను బ్రాహ్మణ్నని ఎక్కడా చెప్పుకోకుండా కాలక్షేపం చేశాడు. గుజరాత్‌ ఎన్నికలు వచ్చేసరికి హిందూ ముద్ర కోసం పాకులాడుతూ తను శివభక్తుణ్నని చెప్పుకున్నాడు. అంతవరకూ ఆక్షేపణ లేదు. తెల్లతోలు మ్లేచ్ఛులే కృష్ణభక్తులు అవుతూండగా లేనిది, యిక్కడ పుట్టి పెరిగిన రాహుల్‌కు శివుడంటే భక్తి కలిగితే కాదని వాదించలేం.

అంత శివభక్తి ఉంటే కన్నప్పలా ఒక కన్ను తీసి శివుడికి ఇయ్యి చూదాం అని సవాలు విసరనూ లేము. పుట్టు హిందువులం మనమే ఆ పని చేయటం లేదు. ఎన్నికల టైములో ప్రార్థనాస్థలాలకు వెళ్లడమనేది ప్రతి నాయకుడూ చేసేదే! రాహుల్‌ గతంలోనూ గుళ్లకు వెళ్లాడు. ఇటీవల హిందువు కానివాడికి రాజకీయాల్లో కష్టకాలం దాపురిస్తూండడంతో నేనూ హిందువుని, శివభక్తుణ్ని అని చెప్పుకున్నాడు. అతను అంతటితో ఆగాడు కానీ రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలా అనే కాంగ్రెసు హరియాణా ఎమ్మెల్యే మీడియాను పిలిచి 'రాహుల్‌ యజ్ఞోపవీతధారియైన హిందువు' అని ప్రకటించడంతో అంతా ముక్కు మీద వేలేసుకోవాల్సి వచ్చింది.

సుర్జీవాలా ప్రకటనలో స్ఫురిస్తున్నదేమిటంటే 'రాహుల్‌ సాధారణ హిందువు కాదు, ఏకంగా జందెం వేసుకునే హిందువే' అని చెప్పినట్లు. అంటే జందెం వేసుకోనివాళ్లు అల్లాటప్పా హిందువులా? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. అది కనక ఎవరైనా బ్రాహ్మణ నాయకుడు అని ఉంటే బ్రాహ్మణ దురహంకారం అని అందరూ విరుచుకుపడేవారే. కానీ సుర్జీవాలా జాట్‌. జందెం వేసుకోని హిందువు. రాహుల్‌ తనను మించిన హిందువు అని చెప్పదలచాడా? జందెం వేసుకుంటానని రాహుల్‌ తను చెప్పుకోలేదు, యీయనకు తెలిసినట్లుంది. ఎప్పుడు చూశాడో మరి! రాజీవ్‌ అంత్యక్రియల్లో (ఫోటోలో చూడవచ్చు) వేసుకున్నది లెక్కవేశాడా? అపరకర్మల్లో అందరి చేతా గుడ్డ జందెం వేయిస్తారు. దాన్నే రెగ్యులర్‌ జందెం అంటే ఒప్పదు.

జందెం అంటే గూట్లో ఉన్నది తీసి మెడలో వేసుకోవడం కాదు, దానికి ఓ క్రతువు ఉంటుంది. అది రాహుల్‌కి జరిగిందా? సుర్జీవాలా సాక్ష్యాలు చూపించగలడా? మామూలుగా అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనం ఉంటుంది. దాని తర్వాత వాళ్లు మరో జన్మ ఎత్తినట్లు లెక్కవేసి 'ద్విజ' శబ్దంతో సంభావిస్తారు. శూద్రులలో కూడా కొన్ని కులాల వారు జందెం ధరిస్తారు. ఇదంతా మగవారికే పరిమితం. ఆర్యసమాజం వారు ప్రతి హిందువు ద్విజుడే అంటూ ఆడా, మగా తేడా లేకుండా అన్ని కులాల వారికీ జందెం వేస్తారు. రాహుల్‌ ఆర్యసమాజంలో జందెం వేయించుకుంటే ఆ ముక్క చెప్పాల్సి వుంది. 

జందెం అనేది మెడలో పులిగోరు గొలుసు వేసుకున్నట్లు కాదు. అది పరమం, పవిత్రం. వేసుకున్నవాళ్లు కొన్ని అనుష్టానాలు ఆచరించాలి. చేసే పని బట్టి దాన్ని అటూయిటూ మారుస్తూ ఉండాలి. లేకపోతే మొలతాడుకి, దానికీ తేడా లేదు. రాహుల్‌ వెళ్లినది గుజరాత్‌లో గుళ్లకు. కేరళలో గుళ్లకు వెళ్లినపుడు బండారం బయటపడుతుంది. అక్కడ చొక్కా యిప్పిస్తారు. జందెం ఉందో, లేదో అది వేసుకోవాల్సిన తీరులో వేసుకున్నాడో లేదో అందరికీ తెలిసిపోతుంది. రోజూ వేసుకునేవాణ్నే కానీ యివాళ యింట్లో చిలక్కొయ్యకు తగిలించి వచ్చానండి అంటే కుదరదు.

ఒకసారి జందెం వేసుకున్నాక మార్చుకోవచ్చు తప్ప సాంతం తీసేయడానికి వీల్లేదు. సంసార బంధాలు తెంపుకుని, యికపై లౌకిక అనుష్టానాలు చేయక్కరలేదని తీర్మానించుకుని సన్యాసి ఐన వాడే జందెం తెంపుకోగలడు, తీసిపారేయగలడు. జందెం వేసుకునేవాళ్లందరూ మీరు చెప్పిన నియమాలు పాటిస్తున్నారా అని అడగకండి. వాళ్లెవరూ మేం యజ్ఞోపవీతధారులం అని కప్పెక్కి కూయలేదు. ఇక్కడ కూడా కూసింది రాహుల్‌ కాదు, సుర్జీవాలా. కూత వినబడగానే రాహుల్‌ 'అబ్బే ఏదో సుమారుగా హిందువునే కానీ, మరీ అంత కాదండి' అని వినయం ఒలకబోసి ఉంటే సరిపోయేది. మౌనంగా ఉండి జందెం బంధాన్ని మెడకు తగిలించుకున్నాడు. 

జందెం రకరకాలుగా పనికి వస్తుందని చూస్తూ, చదువుతూ, వింటూ వచ్చాం. వీపు గోక్కోవడానికి, తాళం చెవి పెట్టుకోవడానికి మాత్రమే కాదు, ''మృచ్ఛకటికం''లో శర్విలకుడనే బ్రాహ్మణ దొంగ తను తవ్వాల్సిన కన్నం ఎంతుండాలో కొలవడానికి కూడా దాన్ని వాడతాడు. ''కన్యాశుల్కం''లో గిరీశం అది పట్టుకుని అబద్ధపు ప్రమాణం చేసి ఫోటోగ్రాఫర్‌ను ఏమారుస్తాడు. ఆంధ్ర వర్శిటీలో కొన్నేళ్ల క్రితం ప్రొఫెసర్లలో బ్రాహ్మణపక్షపాతం పొంగి పొర్లేదని, ఎవరైనా స్టూడెంటు బ్రాహ్మడా కాదా అని తెలుసుకోవడానికి అతని భుజం మీద కాజువల్‌గా చెయ్యేసి, జందెం తగిలితే పాస్‌ చేసేసేవారనీ దాంతో మామూలుగా జందెం వేసుకునే అలవాటు లేని బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు కూడా జందెం వేసుకోవడం మొదలెట్టారని చమత్కరించేవారు. ''పాపకోసం'' సినిమాలో పోలీసు కస్టడీలో ఉన్న ఆయాకు మేనమామల మంటూ యిద్దరు దొంగలు బ్రాహ్మణ వేషాల్లో వస్తారు. ఇన్‌స్పెక్టరు వాళ్లను నమ్మడు.

ఎందుకని కానిస్టేబుల్‌ తర్వాత అడిగితే - 'జందెం ఎడమ భుజంపై ఉండాలి. వీళ్లు కుడి భుజం మీద వేసుకున్నారు. అందుకని వేషమని పసిగట్టాను, వెళ్లి వాళ్లను వెంటాడు.' అంటాడు. జందెం క్రైమ్‌ విచారణకు సహకరించిందన్నమాట. నంబూద్రీల్లో అనేక దురాచారాలు ఉండేవి. ఇమ్మెస్‌ నంబూద్రిపాద్‌ యువకుడిగా ఉండే రోజుల్లో వారిలో సంస్కరణ ఉద్యమం తీసుకుని వచ్చాడు. ఆ మార్పులకు ఛాందసుల నుండి ప్రతిఘటన వచ్చినపుడు ఆయనా, కొందరు నంబూద్రి యువకులు తమ జందాల్ని కాల్చి, ఆ బూడిదను శంకరాచార్యకు పంపారు. ఇలా నిరసన తెలపడానికీ పనికి వచ్చింది. ఇప్పుడు, యిదిగో రాహుల్‌కు హిందూత్వాన్ని ఆపాదించడానికి పనికి వచ్చింది. రాబోయే జంధ్యాల పౌర్ణమికి మీడియా వాళ్లు రాహుల్‌ యింటి దగ్గర కాపలా కాసి, జంధ్యం మార్చాడో లేదో రిపోర్టు చేస్తారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?