cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: రాజ్ ‌కపూర్‌ వేసిన పాత్రలు

ఎమ్బీయస్: రాజ్ ‌కపూర్‌ వేసిన పాత్రలు

ప్రపంచంలో దుఃఖాలన్నిటికీ కారణం కోరిక అని బుద్ధుడు అన్నాడు కానీ, నన్నడిగితే కోరిక కాదు, పోలిక అంటాను. మనకున్నదానితో మనం తృప్తి పడం, పక్కవాడితో పోల్చుకుని, నా కంటె తక్కువ టాలెంటు వున్నా వాడు పైకి వచ్చేసేడే అని ఏడవడంతోనే మన జీవితం గడిచిపోతుంది. పోనీ మన కింతే ప్రాప్తం అని మనం సరిపెట్టుకున్నా లోకం వూరుకోదు.

ఇంట్లో సభ్యులతోనే పోలిక చూపి, పోటీ పెట్టి మనల్ని వేధిస్తుంది. మీ అన్నయ్య చూడు కాలేజీ ఫస్ట్ వచ్చాడు, నువ్వూ ఉన్నావ్.. అంటూ యీసడిస్తారు. అసలు యింకోరిలా ఎందుకు వుండాలి? ఉండేమాటైతే దేవుడు యిద్దర్ని ఎందుకు సృజిస్తాడు? ఒకర్నే పుట్టించి వూరుకునేవాడుగా! సినిమాల్లో కానీయండి, రాజకీయాల్లో కానీయండి, వ్యాపారాల్లో కానీయండి తండ్రితో పోల్చబడి తీసివేయబడిన వారెందరో! దాన్ని తట్టుకోవడానికి ఎంతో స్థయిర్యం వుండాలి. తనలోని ప్రతిభను ఏ దిశలో వెలుగులోకి తీసుకురావాలో ఆ వ్యక్తే గుర్తించాలి.

రాజ్ కపూర్ అదే పని చేశాడు. పృథ్వీరాజ్‌తో పోలిస్తే రాజ్ ఎంత వెలతెలా పోతాడో గత వ్యాసంలో చెప్పాను. ఆ విషయాన్ని రాజ్‌యే ముందుగా పసిగట్టాడు. తండ్రికి మంచి పర్శనాలిటీ వుంది కాబట్టి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో పాత్రలు వేశాడు కానీ రాజ్ అలాక్కాదు. సినిమాల్లో నిలదొక్కుకునే దశలో తండ్రి హీరోగా వేసిన ‘‘వాల్మీకి’’ (1946) అనే పౌరాణిక సినిమాలో నారదుడిగా, ‘‘చిత్తోర్ విజయ్’’ (1947) అనే చారిత్రాత్మక సినిమాలో వేశాడు తప్ప తక్కినవన్నీ సాంఘికాలే వేశాడు.

రాజ్ తరం వచ్చేటప్పటికి మెయిన్ హీరోలెవ్వరూ పౌరాణికాలు వేయలేదు కానీ, జానపదాలూ అవీ వేశారు. రాజ్ వేసిన వాటిలో ‘‘నీల్ కమల్’’ (1947), ‘‘అంబర్’’ (1952) జానపదాలే కానీ, వాటిలో అతనికి పోరాటాలు లేవు. ఇక సాంఘికాలలో కూడా అతను వేసినవన్నీ నాన్-హీరోయిక్ పాత్రలే. సాధారణంగా హీరో అనగానే పరిస్థితులను ధైర్యంగా ఎదిరించేవాడు, విప్లవకారుడు, కష్టాలు పడి సాధించేవాడు అయి వుండాలి. దిలీప్ కుమార్ అలాటివి ఎన్నో వేశాడు.

రాజ్ వేసిన పాత్రలలో హీరోయిజం కనబడదు. చాలా సినిమాల్లో అమాయకుడు, లోకంపోకడ తెలియనివాడు, అర్భకుడు, భగ్న ప్రేమికుడు లేదా మూగప్రేమికుడు. దేవ్ ఆనంద్ హంతకుడు, బ్లాక్‌మార్కెటీర్ వంటి నెగటివ్ రోల్స్ స్టయిలిష్‌గా వేశాడు. రాజ్ ‘‘ఆవారా’’ వంటి పాత్ర వేసినా చిల్లర దొంగగానే వేశాడు. ‘‘శ్రీ420’’లో పరిస్థితుల ప్రభావం వలన మోసగాడిగా మారినా పశ్చాత్తాప పడతాడు.

రెండిటిలోనూ అతనిలోని ప్రేమకోణమే ఎక్కువ కనబడుతుంది తప్ప, విలనిక్ టింజ్ లేదు. మానసిక సంఘర్షణ వున్న పాత్రలు వేయలేదు. నిజానికి చెప్పాలంటే అతను చాప్లిన్ విధానాన్ని నమ్ముకున్నాడు. అమాయకుడిగా వుంటూ, అందర్నీ నవ్విస్తూ, తనంతట తానుగా ఏ వీరోచితమైన సాహసమూ చేయకుండా, సమాజ స్థితిగతులను వాస్తవానికి దగ్గరగా చూపించే సినిమాలు తీశాడు, నటించాడు. దాంతో పాత్రలలో పెద్దగా వెరైటీ లేకుండా పోయింది. నటనలో వైవిధ్యం లేకుండా పోయింది.

రాజ్ నటనలో కంటె దర్శకుడిగా తన ప్రతిభ ఎక్కువగా చాటుకున్నాడు. తన సినిమాలను సంగీతభరిత చిత్రాలుగా తీర్చిదిద్దుకున్నాడు. వరుసగా హిట్లు కొట్టి, స్టూడియో పెట్టి, షోమాన్‌గా ప్రసిద్ధి కెక్కి తండ్రిని మించిన పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా కొన్ని చిత్రాలలో నటించగానే అతి త్వరగా దర్శకనిర్మాతగా మారి ‘‘ఆగ్’’ (1948) సినిమా తీశాడు. పృథ్వీ థియేటర్స్‌లో వున్నంతకాలం మేరు పర్వతం లాటి తండ్రి ముందు తను కంటికి ఆనడని గ్రహించి, యీ సాహసం చేశాడు. తనను తాను హీరోయిక్‌గా చూపించుకోలేదు. సినిమా ఓపెనింగ్‌లోనే ఫస్ట్ నైట్‌నాడు సగం కాలిపోయిన మొహంతో కనబడతాడు. నాటకరంగంలో విఫలమైన వ్యక్తిగానే పరిచయమవుతాడు. తండ్రితో తనకు చదువు గురించి వచ్చిన వివాదాన్ని యీ సినిమాలో ఉపయోగించుకున్నాడు.

హీరోది లాయర్ల కుటుంబం. అతను కూడా లాయరు కావాలని తండ్రి పట్టుబడతాడు. కానీ హీరోకి నాటకాలు వేయాలని సరదా. కుటుంబంతో పోట్లాడి బయటకు వచ్చేసి, నాటక కంపెనీ నడపడానికి నానా కష్టాలూ పడతాడు. చివరకు ఒక స్నేహితుడి సాయంతో కంపెనీ పెడతాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల్లో పాతకాలపు విలువలను అంటిపెట్టుకున్న పాతతరానికి, ‘మీదంతా బానిస మనస్తత్వం. దేశానికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత కూడా యింకా యీ శృంఖలాలేమిటి?’ అంటూ వాదించిన యువతరానికి మధ్య వాదోపవాదాలు జరిగేవి. రాజ్ యువతరానికి ప్రతినిథిగా వెలిశాడు. విషాదంలో మునిగిన వ్యక్తిగానే చిత్రీకరించుకున్నాడు. ‘జిందా హూఁ యిస్ తరహ్..’ పాట చూడండి.

ఈ సినిమా యావరేజిగా ఆడినా రాజ్ ధైర్యం చేసి వెంటనే తన రెండో సినిమా ‘‘బర్సాత్’’ (1949) పెద్ద బజెట్‌లో తీశాడు. ‘‘ఆగ్’’లో తన పక్కన తొలిసారి హీరోయిన్‌గా వేసిన నర్గీస్‌ను ప్రధాన హీరోయిన్‌గా తీసుకున్నాడు. తన బావమరిది ప్రేమ్‌నాథ్‌ను సెకండ్ హీరోగా, నిమ్మీని సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నాడు. దీనిలో ప్రేమనాథ్‌ది కాసనోవా టైపు పాత్ర. అమ్మాయిలు అతన్ని చూసే మోహపడతారు. రాజ్ సిన్సియర్ లవర్. ‘‘ఆగ్’’లో రామ్ గంగూలీకి అసిస్టెంట్లుగా పనిచేసిన శంకర్-జైకిషన్‌లకు మ్యూజిక్ డైరక్టర్లుగా ఛాన్సిచ్చాడు. గాయనిగా లతా మంగేష్కర్‌కు సువర్ణావకాశం యిచ్చాడు. ‘‘బర్సాత్’’ సూపర్‌డూపర్ మ్యూజికల్ హిట్ అయింది. రాజ్, నర్గీస్ జంట ప్రేమికులకు పర్యాయపదంగా మారిపోయింది. ఆర్కే స్టూడియోకు ఎంబ్లమ్‌గా స్థిరపడిపోయింది. అనేక సినిమాలు రాజ్-నర్గీస్‌ల ప్రేమ థీమ్ మీదే తయారయ్యాయి.

ఆ తర్వాత దర్శకనిర్మాతగా తీసిన సినిమా ‘‘ఆవారా’’ (1951). దీనిలో మళ్లీ తండ్రితో ఘర్షణ కనబడుతుంది. అయితే దాన్ని వ్యక్తిగత సంఘర్షణగా కాక, సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా తీర్చడంతో ఆ సినిమా ప్రపంచమంతా పాప్యులర్ అయిపోయింది. ముఖ్యంగా రష్యాలో రాజ్ ఆరాధ్యతార అయిపోయాడు. దీనిలో తండ్రి పాత్రను పృథ్వీ వేశాడు. అతను ఒక ధనిక న్యాయమూర్తి. పేదవారిపై ఏ మాత్రం సదభిప్రాయం వుండదు. వారంతా నేరాలవైపే మొగ్గుతారని చిన్నచూపు. దొంగ కొడుకు దొంగే అవుతాడనే లాజిక్‌తో ఆధారాలు బలంగా లేకపోయినా కెఎన్‌ సింగ్‌కు పెద్ద శిక్ష వేశాడు. అతను కోపంతో యితని భార్యను కిడ్నాప్ చేశాడు కానీ ఆమె గర్భవతి అని తెలియడంతో నాలుగు రోజుల్లోనే వదిలేశాడు. నాలుగు రోజులు పరాయి యింట వుందన్న కారణంగా జజ్ భార్యను యింట్లోంచి తరిమివేశాడు.

కొన్నాళ్లకు రాజ్ పుట్టాడు. బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడన్న కారణంగా మంచి స్కూలు నుంచి తీసేశారు. చదువు పెద్దగా అబ్బలేదు. పని దొరకటం లేదు. ఆ సమయంలో సింగ్ న్యాయమూర్తి సిద్ధాంతాన్ని తప్పని నిరూపించడానికి, యితన్ని చేరదీసి చిల్లర దొంగగా మార్చాడు. లాయరుగా తర్ఫీదు అవుతున్న, పృథ్వీ పెంపుడు కూతురు నర్గీస్‌తో రాజ్ ప్రేమలో పడి, ఆమె కోసం మంచి మార్గంలో పడదామని ప్రయత్నించాడు. ఇతనికి డబ్బు లేదని తెలియడంతో పృథ్వీ యితన్ని చిన్నచూపు చూశాడు. అతని దృష్టిలో గొప్పగా కనబడాలని యితను నెక్లెసు దొంగతనం చేసి నర్గీస్‌కు బహూకరించబోతే అది పృథ్వీ దగ్గర్నుంచి కొట్టేసినదే అని బయటపడింది. దానితో నర్గీస్‌కు యితను దొంగ అని తెలిసిపోయి, అతని తల్లిని కలిసి గతం తెలుసుకుంది కానీ ఆమెను వదిలేసిన జజ్ పృథ్వీయే అన్న సంగతి ఆమెకు తెలియదు. స్వతహాగా మంచివాడు కాబట్టి హీరోని సంస్కరిద్దామని అనుకుంది.

ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సింగ్, రాజ్ యింట్లో దాక్కుంటే, రాజ్ తల్లి అతన్ని గుర్తుపట్టి ప్రతిఘటించింది. అదే సమయానికి యింటికి వచ్చిన రాజ్ ఆత్మరక్షణ ప్రయత్నంలో సింగ్‌ను చంపేశాడు. కేసు నడిచింది. పృథ్వీయే జజ్. కేసు సందర్భంగా కోర్టుకి వచ్చిన రాజ్ తల్లి భర్తను గుర్తు పట్టింది. అతని కోసం పరిగెడుతున్నపుడు కారు గుద్దేసి, ఆసుపత్రి పాలైంది. మృత్యుముఖంలో వుండగా నర్గీస్ వెళితే పృథ్వీయే తన భర్త అని చెప్పింది. తల్లి చనిపోగానే తన దుస్థితికి కారకుడైన తండ్రిపై రాజ్ కసి పెంచుకుని, జైల్లోంచి పారిపోయి, పృథ్వీ యింటికి వెళ్లి చంపబోయాడు. కానీ పృథ్వీ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వేరే కోర్టులో కేసు నడిచింది. రాజ్ తరఫున నర్గీస్ వాదించింది. జరిగిన కథంతా చెప్పింది. పోలికలు చూస్తే రాజ్ పృథ్వీ కొడుకని తేలుతుందని, ఒక మనిషిని చెడ్డవాణ్ని చేసేది పుట్టుక కాదని, చుట్టూ వున్న సమాజమేననీ, ఆర్థిక అసమానతల వలననే నేరం పెరుగుతోందని వాదించింది. రాజ్ తను చెడ్డవాణ్నని, శిక్ష పడాల్సిందేననీ అంటూ, ‘నా గురించి కాదు, దరిద్రంలో పెరుగుతూ, నేరం వైపు ఆకర్షితులవుతున్న లక్షలాది పిల్లల గురించి ఆలోచించండి.’ అన్నాడు.

అన్ని విషయాలూ పరిశీలించిన కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష వేసింది. తన సిద్ధాంతాలు తప్పని గుర్తించిన పృథ్వీ, రాజ్ తన కొడుకని అంగీకరించాడు. జైల్లో ఉన్న కొడుకుని కలిసి, క్షమించమని కోరాడు. జైల్లోంచి బయటకు వచ్చాక మంచిమనిషిగా బతుకుతానని రాజ్ హామీ యిచ్చాడు. అప్పటిదాకా ఆగుతానంది నర్గీస్. కథ యింత గంభీరంగా వున్నా, దీన్ని చాప్లిన్ తరహా హాస్యంతో, పాటలతో, శృంగారంతో నింపేశాడు రాజ్. ముఖ్యంగా ఒక తక్కువ స్థాయి కుర్రవాడు, ఒక అండర్‌డాగ్ ఉన్నత స్థాయి అమ్మాయితో ప్రేమలో పడితే అతనిలో ఎటువంటి కాంప్లెక్స్ వుంటుందో చాలా బాగా చిత్రీకరించాడు. సినిమా చూస్తే పృథ్వీపై ఏ మాత్రం జాలి కలగదు. రాజ్ సమాజాన్ని సంస్కరించిన హీరోగా కాకుండా, దాని వలన పీడించబడినవాడిగానే తనను చూపించుకున్నాడు.

రాజా నవాథే దర్శకుడిగా రాజ్ తీసిన సినిమా ‘‘ఆహ్’’ (1953) దేవదాస్ వంటి కథ. అయితే దాన్ని సరదా సినిమాగా మొదలుపెట్టి సంగీతభరిత చిత్రంగా తీర్చిదిద్దడంతో ద్వితీయార్థంలో కథానాయకుడికి టిబి రావడం, తన ప్రేయసిని తన మిత్రుడికి యిచ్చి పెళ్లి చేసి హీరో చచ్చిపోవడం అతకలేదు. ప్రివ్యూ చూసిన తర్వాత రాజ్ విషాదాంతం మార్చేసి, హీరోకి టిబి తగ్గిపోయినట్లు చూపించి సుఖాంతం చేసేశాడు. ఈ మార్పులతో జంప్‌లు వచ్చేసి ‘‘ఆహ్’’ ఘోరంగా ఫ్లాపయ్యింది. కానీ దాని తెలుగు వెర్షన్ ‘‘ప్రేమలేఖలు’’, తమిళ వెర్షన్ ‘‘అవన్’’ పాటల కారణంగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దిలీప్ కుమార్ టైపు విఫల ప్రేమికుడి పాత్రలు తనకు నప్పవని రాజ్ గ్రహించాడు. రాజ్ సినిమాల్లో అండర్‌డాగ్ పాత్రలు, ప్రోలిటేరియట్ పాత్రలు అంత అద్భుతంగా కుదరడానికి కారణం కె ఎ అబ్బాస్ వంటి కమ్యూనిస్టు చేత కథలు రాయించడమే కాదు, రాజ్ స్వయంగా బీదాబిక్కీతో ఫ్రీగా కలిసిపోయేవాడు. రోడ్డు పక్కన జనాల దగ్గరకు వెళ్లి కూర్చునేవాడు. వాళ్ల మరాఠీ భాషలో మాట్లాడేవాడు. సాధారణ హోటళ్లలో ఇడ్లీ తింటూ, వారి సాధకబాధకాలు తెలుసుకునేవాడు, హావభావాలు జాగ్రత్తగా గమనించి, సినిమాల్లో అనుకరించేవాడు.

దీని తర్వాత రాజ్ దర్శకనిర్మాతగా తీసిన ‘‘శ్రీ420’’ (1955)లో ఒక విద్యాధికుడు నగరానికి వచ్చి ఒక సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యేవారి కారణంగా మోసగాడిగా మారి అడ్డదారిలో డబ్బు సంపాదించడం మొదలెడతాడు. దొంగ స్కీముల పేరుతో పేదలను దోచుకోవడంలో వారికి సహకరించబోతాడు. కానీ అతన్ని ప్రేమించిన ఒక లేడీ టీచర్ అతనిలో మంచితనాన్ని మేలుకొలుపుతుంది. చివరిలో మోసగాళ్లను పట్టిచ్చి, అతను తిరిగి సామాన్యుడై పోతాడు. దీనిలో కూడా కొద్ది కాలం పాటు విలాసాలు వెలగబెట్టిన అండర్‌డాగ్ పాత్రే. చాప్లిన్ ఛాయలు కనబడే మరో సినిమా హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘‘అనాడీ’’ (1959), కల్లాకపటం, లోకంపోకడ తెలియని యువకుడు తనకు తెలిసిన నిజాన్ని చెప్పి చిక్కుల్లో పడతాడు. ఇక ‘‘జిస్ దేశ్ మేఁ గంగా బహతీ హై’’ (1960) సినిమాకు దర్శకుడిగా ఫోటో గ్రాఫర్ రాధూ కర్మాకర్ పేరు కనబడినా, రాజ్‌యే చేశాడంటారు. చంబల్ లోయ బందిపోట్లను సన్మార్గానికి మళ్లించడమనే థీమ్‌తో తీసిన ఆ సినిమాలో రాజ్ పాత్ర హీరోయిక్‌గా వుండదు. పూర్తి అమాయకుడిగా వుంటుంది. ఆ పాత్ర ఎంత హిట్టయిపోయిందంటే, రాజ్‌ను మిమిక్రీ చేసేవాళ్లందరూ అతని లవర్ బోయ్ పాత్రల జోలికి పోకుండా, దీన్నే పట్టుకున్నారు.

దీని తర్వాత వచ్చిన ముక్కోణపు ప్రేమ కథ ‘‘సంగమ్’’ (1964)లో రాజ్ తనను తాను గొప్పగా చూపుకోకుండా, రాజేంద్ర కుమార్‌నే హైలైట్ చేశాడు. హీరోయిన్ వైజయంతి మాల అతన్నే ప్రేమిస్తుంది. అయితే కుటుంబం బలవంతం వలన రాజ్‌ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన కొన్నాళ్లకు పాత ఉత్తరం బయటపడడంతో రాజ్ అనుమానించే భర్తగా మారతాడు. దీనిలో ప్రథమార్థంలో రాజ్ హాస్యగాడిగా కనబడడంతో బాటు ‘‘మై క్యా కరూఁ రామ్, ముఝే బుడ్ఢా మిల్‌గయా’’ (ముసలాడు దొరికేడేమిటి దేవుడా) పాటలో తనను తాను వెక్కిరించుకున్నాడు. ఇక ‘‘మేరా నామ్ జోకర్’’ (1970)లో నైతే రాజ్ ఏకంగా సర్కస్‌లో బఫూన్‌గా వేశాడు. అతను ప్రేమించిన ప్రతిసారీ హృదయం భగ్నమవుతూనే వుంటుంది. మూడో హీరోయిన్ పద్మిని అయితే తనను తీర్చిదిద్దిన యితన్ని దగా చేసి, ఓ సినిమా హీరోని వరిస్తుంది. దీనిలో రాజ్ ఏ మాత్రం హీరోయిక్‌గా కనబడడు.

ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో రాజ్ ఆపై హీరో పాత్రలు వేయడం మానేశాడు. తన కొడుకు ఋషిని పెట్టి ‘‘బాబీ’’ (1973) అనే యూత్‌ఫుల్ ప్రేమకథను తీశాడు. దానిలో మళ్లీ హీరో తండ్రి పాత్రను నిర్దయుడిగా చూపాడు. అమిత ధనవంతుడైన ప్రాణ్, కొడుకు ఒక జాలర్ల పిల్లను ప్రేమించడాన్ని సహించడు. మానసిక వైకల్యం వున్న ఒక డబ్బున్న అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేస్తాడు. ఇది హిట్ కావడంతో తర్వాత తీసిన మూడు సినిమాలను ‘‘సత్యం, శివం, సుందరం’’ (1978), ‘‘ప్రేమ్ రోగ్’’ (1982), ‘‘రామ్ తేరీ గంగా మైలీ’’ (1985) ప్రేమ చుట్టూనే తిప్పాడు. ఇంకో ప్రేమ కథ ‘‘హెన్నా’’ తీస్తూండగా మరణించాడు.

ఆ సినిమాను అతని కొడుకు రణధీర్ కపూర్ పూర్తి చేశాడు. అతను తండ్రి, తాతల మధ్య వైరుధ్యాలను బాగా స్టడీ చేసి, తన తొలి సినిమా ‘‘కల్ ఆజ్ ఔర్ కల్’’ను (నిన్న, ఇవాళ, రేపు) మూడు తరాల సినిమాగా చిత్రీకరించాడు. పృథ్వీరాజ్ పాత తరానికి ప్రతినిథి, మనుమడు పెళ్లి విషయంలో తన మాట వినాలని పట్టుబడతాడు. మనుమడు రణధీర్ లండన్‌లో చదివి వచ్చి తన గర్ల్‌ఫ్రెండ్‌ను చేసుకుంటానని మొండికేస్తాడు. ఇద్దరికి నచ్చచెప్పబోయి, మధ్యలో యిక్కట్లు పడిన తండ్రి పాత్ర రాజ్ కపూర్‌ది. ఆ సినిమాలో హీరోయిన్ బబితతో రణధీర్ అప్పటికే ప్రేమలో పడ్డాడు. సినిమాలో చూపించినట్లుగానే నిజజీవితంలో కూడా ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పటికే రాజ్ తమ్ముళ్లు సినిమాతారలను పెళ్లాడివున్నారు. కానీ బబిత విషయంలో రాజ్ ఒప్పుకోలేదు. చివరకు ఒప్పుకున్నాడు. బబిత పిల్లలే కరిష్మా, కరీనా. రాజ్ రెండో కొడుకు ఋషి కూడా నీతూ సింగ్ అనే సినీతారను పెళ్లాడాడు.

మొత్తం మీద చూస్తే రాజ్ తండ్రి ఛాయల్లోంచి బయటకు వచ్చేసి, తనకంటూ ఒక ప్రత్యేక మార్గం ఏర్పరచుకుని, తనకు నప్పిన పాత్రలు వేస్తూ, తనకు ప్రావీణ్యత వున్న దర్శకత్వంలో, సంగీతదర్శకత్వంలో (ఆర్‌కె సినిమాల మ్యూజిక్‌లో రాజ్ వాటా చాలా వుంది), కమ్మర్షియల్ టచ్ యివ్వడంలో రాణించి, పృథ్వీ అంటే రాజ్ తండ్రి అనిపించుకునే స్థాయికి వెళ్లాడు. ఇది కొడుకులందరూ గ్రహించాలి. దేవ్ ఆనంద్ గొప్ప రొమాంటిక్ హీరో. అతని కొడుకు సునీల్ ‘‘ఆనంద్ ఔర్ ఆనంద్’’ (1984)లో సినిమాలో అలాటి పాత్రే వేయబోయి ఫెయిలయ్యాడు. దాంతో నటుడిగా విరమించుకున్నాడు. రాజేంద్ర కుమార్ జూబిలీ స్టార్. అతని కొడుకు కుమార్ గౌరవ్ అలాటి ప్రేమికుడి పాత్రలే వేయబోయాడు. తొలి చిత్రం ‘‘లవ్ స్టోరీ’’ (1981)లో విజయాన్ని చవిచూసినా, కొంతకాలానికి ‘‘నామ్’’ (1986) హిట్టయినా నటుడిగా నిలదొక్కుకోలేక పోయాడు.

40 ఏళ్ల విజయవంతమైన కెరియర్ వున్న రాజ్ కుమార్ కొడుకు పురుల్ నటుడిగా పదేళ్లు కూడా వుండలేకపోయాడు. అమితాబ్‌కు వచ్చినంత పేరు అభిషేక్‌కు రాలేదు. పృథ్వీ-రాజ్ కథ వలన తెలిసేదేమిటంటే కొడుకులు తండ్రిని అనుకరించడానికి చూడకూడదు. కొడుకు స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంటానంటే పృథ్వీలా తండ్రులు వారిని ఆ మార్గంలో ప్రోత్సహించాలి. పృథ్వీ ఆర్థిక అండదండలతోనే రాజ్ సినిమాల్లో చేరిన రెండేళ్లకే నిర్మాత కాగలిగాడు. తండ్రితో పోలిక రాకుండా జాగ్రత్తపడ్డాడు. రాజ్ వారసుల గురించి మరోసారి! (ఫోటో – పైన బర్సాత్, ఆవారా, శ్రీ 420, జాగ్‌తే రహో, కింద జిస్ దేశ్.., ..జోకర్)

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×