Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజతరంగిణి- కలశుడి కథ

ఎమ్బీయస్‌: రాజతరంగిణి- కలశుడి కథ

మన దేశంలో చరిత్ర పుస్తకాలు చాలా చాలా తక్కువ. ఉన్నవాటిలో కూడా నమ్మశక్యం కానివే ఎక్కువ. రాజాశ్రయం కోరి వారిని, వారి పూర్వీకులని ఇంద్రుడని, చంద్రుడని పొగడడమే పనిగా కావ్యాలు రాశారు. వీరందరి కంటె భిన్నమైనవాడు కశ్మీరుకి చెందిన కల్హణుడు. 12వ శతాబ్దికి చెందినవాడు. కశ్మీర రాజ్యాన్ని పాలించిన తరతరాల రాజుల చరిత్రతో ‘‘రాజతరంగిణి’’ అని క్రీ.శ. 1148 ప్రాంతంలో సంస్కృతంలో రాశాడు. ఆయన తండ్రి హర్షుడు (పాలనాకాలం క్రీ.శ. 1089-1101) అనే రాజు దగ్గర మంత్రిగా చేశాడని కొందరు, కాదు ఆయనే చేశాడని కొందరు అంటారు. ఆయన తన గాథలను క్రీ.పూ. 2448 నుండి ప్రారంభించాడు. వేలాది సంవత్సరాల చరిత్రను జనశ్రుతంగా విని వుంటాడు. వెరిఫై చేసుకునే సాధనసంపత్తి ఉండి వుండదు. అందువన కొన్ని అధ్యాయాలు యిప్పుడు తెలిసిన చరిత్రతో ట్యాలీ కావటం లేదు. కానీ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే రాజు మంచిచెడ్డలు రెండూ రాశాడు. ఆ పుస్తకంలో పైన చెప్పిన హర్షుడి తండ్రి కలశుడు (పామనాకాలం క్రీ.శ. 1063-89) కథను కింద యిస్తున్నాను. ఇతను కల్హణుడి కాలానికి దగ్గరగా వున్న రాజు కాబట్టి కథలో పొరపాట్లు తక్కువ వుండవచ్చు.

తండ్రిని, సోదరులను చంపి రాజ్యంలోకి రావడం ముస్లిము రాజులతోనే ప్రారంభమైందని చాలామంది అనుకోవడం గమనించాను. అది పొరపాటు. రాజరికం, అధికారం కోసం రక్తబంధువులను ఖైదు చేయడం, చంపడం ప్రపంచమంతా, ఎల్లకాలాలలోనూ ఉంది. అంతెందుకు రామాయణంలో ఏం జరిగింది? భరతుడంటే రాముడికి అంత యిష్టం కదా! అతను లేకుండా యువరాజ పట్టాభిషేకం ఎందుకు తలపెట్టారు? సింహాసనంపై భరతుడికి హక్కు ఉంది కాబట్టి అతను ఊళ్లో లేకుండా చూసి ఈ కార్యక్రమం ముగించేద్దామని దశరథుడు తొందరపడ్డాడు.

భారతమైతే చెప్పనే అక్కరలేదు. దుర్యోధనుడు తండ్రిని దబాయిస్తూ, నోరు మూయిస్తూ వచ్చాడు.  దాయాదులైన పాండవులు అడ్డు వస్తున్నారని లక్క యింట్లో కాల్పించేశాడు. భాగవతంలో చూస్తే కంసుడు తండ్రిని గద్దె దింపి తను కూర్చున్నాడు. ఇప్పుడీ కలశుడు ఒక ఏంటీ హీరో లాటి వాడు. ఒకలా చూస్తే గుళ్లు, గోపురాలు కట్టించాడు. ఇంకోలా చూస్తే తండ్రి పై దండెత్తాడు. కొడుకుని ఖైదు చేశాడు. అందువలన రసవత్తరమైన అతని జీవితాన్ని చక్కటి జానపదకథగా చెప్పుకోవచ్చు.

కలశుడి తండ్రి అనంతుడు మహారాజు. తల్లి సుయ్యమతి. అనంతుడు చెడు అలవాట్లతో డబ్బంతా తగలేయడంతో భార్య తన ఆస్తితో ఆర్థికంగా ఆదుకుంది. ఇక అప్పణ్నుంచి అతను భార్యావిధేయుడై పోయాడు. ఆవిడకు కొడుకు కలశుడంటే పిచ్చి ప్రేమ. వాడికి సర్వ దుర్లక్షణాలు వున్నాయని తెలిసినా భర్తతో పోరి ఆయన ఆరోగ్యంగా ఉండగానే కొడుక్కి రాజుగా పట్టాభిషేకం చేయించేసింది. రాజయ్యాక కలశుడు దుస్సాంగత్యంతో మరీ చెలరేగి పోయాడు. ముందే కాముకుడు. సోదరితో కూడా సంబంధం పెట్టుకున్నవాడు.

ఇప్పుడిక చెలరేగిపోయి ఓ అర్ధరాత్రి వేళ ఊళ్లో ఒకరింట్లో చొరబడి వారి కోడల్ని అనుభవించబోయాడు. దాంతో కాపలాదారులు దొంగ అనుకుని చావగొట్టారు. వెలుతురులో చూస్తే రాజుగారు. ఈ విషయం బయటకు తెలిసిపోయి అల్లరై పోయింది. అనంతుడికి కొడుకు మీద కోపం వచ్చి భార్యను తిట్టిపోశాడు. ‘‘ఇహ యిక్కడుంటే పరువు దక్కదు. రాజధాని వదలి విజయేశ్వరం అనే చోటకి వెళ్లిపోయి ఉందాం.’’ అన్నాడు. భార్య ఏమీ చేయలేక సరేనంది.

అప్పుడు మంత్రి ఒకాయన ‘‘మీ కొడుకు లాటి భ్రష్టుడికి ఐశ్వర్యమంతా అప్పగించి వెళితే యింకా అనర్థం కదా! మీ దగ్గర డబ్బు లేకపోతే మీ మొహం ఎవడు చూస్తాడు? పట్టుకెళ్లగలిగినదంతా పట్టుకుపోండి.’’ అని సలహా యిచ్చాడు. తండ్రి ఐశ్వర్యమంతా పట్టుకుపోయాడని తెలియగానే కొడుకుకి కోపం వచ్చింది. అప్పు చేసి, సైన్యాన్ని సమకూర్చుకుని తండ్రిపై దండెత్తి వచ్చాడు. అనంతుడేమీ జంకలేదు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాణి కంగారుపడింది. కొడుక్కి రహస్యంగా కబురంపింది- ‘పరాక్రమవంతుడైన మీ నాన్నమీద దండెత్తితే ఆయన కత్తికి బలి కావడం ఖాయం. వెనక్కి వెళ్లిపో. మీ నాన్న కోపాన్ని నేను తగ్గిస్తానులే’ అని.

కలశుడికి అదీ నిజమే అనిపించింది. వెనక్కి వెళ్లిపోయాడు కానీ తండ్రి మీద కోపాన్ని ఆయన అనుచరులపై చూపించి, వాళ్ల ఆస్తులు హరించి, జైల్లో పెట్టించాడు. ఇదంతా చూసి మధ్యలో కొందరు కలగచేసుకుని, తండ్రీ కొడుకుల మధ్య రాజీ కుదిర్చి అనంతుణ్ని రాజధానికి రప్పించారు. భార్య బలవంతంమీద ఒప్పుకోవలసి వచ్చింది. కలశుడి ప్లాను వేరు. తండ్రిని సజీవదహనం చేయించి ఆస్తి కొట్టేయాలని ఓ రాత్రి అతని భవనానికి నిప్పు పెట్టించాడు. ఇలా జరుగుతుందని అనుమానించి అనంతుడు ఆ రాత్రే రాజధాని విడిచి, విజయేశ్వరం చేరాడు. అయితే కలశుడి సేనలు అక్కడకు కూడా వచ్చి వాళ్లకున్నదంతా దగ్ధం చేసేశారు.

అయితే రాణికి నదిలో వజ్రవైఢూర్యాలు పొదిగిన లింగం ఒకటి దొరికింది. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్లు మళ్లీ నిలదొక్కుకున్నారు. చితిమంటల్లో కూడా కొంత బంగారం దొరకడంతో నగరాన్ని మళ్లీ నిర్మిద్దామనుకున్నారు కానీ అనంతుడు అనుమతి యివ్వలేదు. కశ్మీరం వదిలి వెళ్లిపోమని కబురుపై కబురు పంపసాగాడు. రాణి కూడా అలా చేద్దామనడంతో రాజుకి వెర్రి కోపం వచ్చింది. ‘నీ పుత్రప్రేమకు లొంగి నేను నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నాను. వీడి లక్షణాలు చూస్తూంటే అసలు వీడు నాకు పుట్టాడా అని అనుమానం వస్తోంది. పుట్టిన బిడ్డ పోతే ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నీ బిడ్డగా పెంచావని జనాలు అనుకుంటూంటారు. చూడబోతే అదే నిజం అనిపిస్తోంది.’ అని భార్యను తిట్టాడు.

దాంతో ఆవిడ రెచ్చిపోయి ‘‘నా అండ లేకపోతే నీ రాజ్యం నిలిచేదా? అప్పులపాలై అడుక్కు తింటూ వుండేవాడివి’’ అని ఝాడించేసింది. ఇదంతా పదిముందూ జరగడంతో అనంతుడి అహం దెబ్బ తింది. తొడలో చాకుతో పొడుచుకుని రక్తస్రావం జరుగుతూండగా చచ్చిపోయాడు. భర్త మరణంతో రాణికి పశ్చాత్తాపం కలిగింది. కొడుకు పట్ల తన గుడ్డిప్రేమ ఎంతకు దారి తీసిందో గ్రహించింది. భర్తతో పాటు చితి ఎక్కింది. ఎక్కేముందు తన ఐశ్వర్యమంతా మనుమడు హర్షుడికి అప్పగించే ఏర్పాట్లు చేసింది.

ఈ హర్షుడు కలశుడికి భువనమతి అనే భార్యద్వారా పుట్టినవాడు. తెలివైనవాడు. అనేక భాషల్లో ప్రవీణుడు. యోగ్యుడని ప్రజల్లో మంచి పేరు ఉంది. పైగా యిప్పుడు నాయనమ్మ నుంచి ఆస్తి కలిసింది. ఇన్నాళ్లూ కలశుడికి తండ్రి ప్రత్యర్థి, యిప్పుడు కొడుకు! అతనికి డబ్బుంది, ప్రజల్లో పలుకుబడి వుంది. గత్యంతరం లేక అతనితో రాజీ పడ్డాడు. అతన్ని, అతని ఆస్తులను కాపాడడానికి నెలకింత అని కొడుకు దగ్గర్నుంచి వసూలు చేస్తూ గడిపాడు. ఇద్దరూ రాజధానిలోనే ఉండడంతో మధ్యలో కొందరు మంత్రులు యిద్దరి మధ్యా విద్వేషాలు రాజేశారు. తండ్రిపై తిరుగుబాటు చేయమని హర్షుణ్ని ప్రేరేపించారు.

తండ్రి చచ్చిపోయాక అతని పట్ల చేసిన పాపాల నివృత్తి కోసం కలశుడు కొన్ని గుళ్లు కట్టించాడు. కానీ త్వరలోనే స్వబుద్ధి పడగ విప్పింది. కొడుకు మీద అనుమానం ప్రబలింది. మంత్రులు ‘వీడు బతికి వుంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే, చంపించేయండి, లేదా గుడ్లు పీకించేయండి’ అని సలహా యిచ్చారు. కానీ కలశుడికి ధైర్యం చాలక హర్షుడి ఆస్తంతా హరించి, అతన్ని జైల్లో పెట్టించాడు. అతని వెంట ప్రయాగుడు అనే నౌకర్ని మాత్రం అనుమతించాడు. ఇది విని హర్షుడి తల్లి గొంతు కోసుకుని మరణించింది.

ఇక తనకు అడ్డూ, ఆపూ లేదని కలశుడు విచ్చలవిడిగా ప్రవర్తించాడు. నిస్సంతానంగా మరణించిన వాళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకునేవాడు. కనబడిన ఆడవాళ్లనల్లా చెరిచాడు. ఒక గుడిలోని సూర్యదేవుడి తామ్రవిగ్రహాన్ని పెకలించి, కరిగించి వేశాడు. హర్షుడి భార్య సుగలాదేవితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ సుగలాదేవి తన భర్తను కారాగారంలోనే చంపించి వేయమని కోరడంతో ఇద్దరు వంటవాళ్లను పంపించి, విషాహారం పెట్టించాడు. అయితే సరైన సమయంలో ప్రయాగుడికి అనుమానం వచ్చి హర్షుణ్ని రక్షించాడు.

విచ్చలవిడి శృంగారంతో కలశుడికి గనోరియా అనే సుఖవ్యాధి సంక్రమించింది. పండితులను అడిగితే శివాలయంలో కుంభప్రతిష్ట చేయమన్నారు. చేసినా వ్యాధి తగ్గకపోగా ముక్కు నుంచి నిరంతరం రక్తం కారుతూ నిస్సత్తువను కలిగించింది. చావు దగ్గరపడిందని గ్రహించి, హర్షుడికి పట్టం కడదామని అనుకున్నాడు. కానీ అప్పటిదాకా దుర్మార్గపు ఆలోచలనిస్తూ అతన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న మంత్రులు దానికి ఒప్పుకోలేదు. దాంతో మరో భార్యకు పుట్టిన ఉత్కర్షుడనే వాడికి పట్టం కడతానని ఒప్పుకున్నాడు.

అతను వేరే నగరం నుంచి వచ్చేలోపున మరణశయ్య మీద ఉండే తన ధనాన్ని అందరికీ పంచాడు. హర్షుడికి కొంత డబ్బిచ్చి దేశం వదిలి వెళ్లిపోమని చెప్దామనుకున్నాడు. కానీ మంత్రులు అది పడనివ్వలేదు. హర్షుణ్ని వేరే చోటకి పంపించి వేసి, అక్కడ బంధించి వేశారు. ఇదంతా తెలిసినా కలశుడు నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. గతంలో సూర్యవిగ్రహాన్ని పెకలించి, కరిగించినందుకే యిన్ని అనర్థాలు కలిగాయని భావించి, చావుఘడియల్లో తనను మార్తాండాలయానికి తీసుకెళ్లమని అడిగాడు. అక్కడ చనిపోయాడు. అది క్రీ.శ.1089. ఉత్కర్షుడు రాజయ్యాడు. బందిఖానాలో ఉన్న హర్షుడు రాజెలా అయ్యాడన్నది వేరే కథ.

ఏ రాజుదైనా సరే నిజాయితీగా కథ రాస్తే యిలాగే ఉంటుంది. కుట్రలు, కూహకాలు, మోసాలు, దౌష్ట్యాలు, వావివరసలు మరచి వర్తించడం, రక్తపాశాన్ని మరచి పోటీదారులను కారాగారం పాలు చేయడం, సంహరించడం.. యిదే అసలైన చరిత్ర. అందుకే శ్రీశ్రీ అన్నాడు- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. దీనికి ఏ ప్రాంతమూ, ఏ మతమూ మినహాయింపు కాదు. రాజతరంగిణి ఇంగ్లీషు వెర్షన్‌ మార్కెట్లో దొరుకుతుంది. వీలైతే చదవండి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?