Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: రాజస్థాన్‌లో బిజెపికి తలనొప్పులు

ఎమ్బీయస్‍:  రాజస్థాన్‌లో బిజెపికి తలనొప్పులు

ఈ నెలలో ఫలితాలు వచ్చిన ఉపయెన్నికలలో బిజెపి ఓటమి పాలైన రాజస్థాన్‌లో కాంగ్రెసు ముఖ్యమంత్రి అశోక్ గెహ్‌లోత్‌కి, యువనాయకుడు సచిన్ పైలట్‌కు పడటం లేదు. ఓ దశలో పైలట్, సింధియా తరహాలో బిజెపి వైపు వెళ్లిపోతాడని కూడా అనుకున్నారు. కానీ గెహ్‌లోత్ సోనియా సహాయంతో తిరుగుబాటును అణచివేయగలిగాడు. ఈ ఉపయెన్నికలలో సచిన్ ఏదైనా కిరికిరి చేస్తాడేమో, కాంగ్రెసు ఓడిపోతుందేమోనని అందరూ ఎదురు చూశారు. కానీ అలా జరగలేదు. రెండిటికి ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఒకదాన్ని (వల్లభ్ నగర్) 20 వేల ఓట్ల తేడాతో నిలుపుకుని, మరోదాన్ని (ధరియాడావాడ్) బిజెపి నుంచి 19 వేల తేడాతో గెలుచుకుంది, వీటిలో బిజెపి 3వ, 4వ స్థానాల్లో నిలిచింది. పైలట్ అందించిన సహకారానికి బదులుగా గెహ్‌లోత్ అతని అనుయాయులను కాబినెట్‌లోకి తీసుకోబోతున్నాడు.

గెహ్‌లోత్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన 7 ఉపయెన్నికలలో 6టిలో కాంగ్రెసు గెలిచింది. బిజెపి ఒక దానిలోనే గెలిచింది. బిజెపిలోని అంతఃకలహాలే దీనికి కారణం. ధరియావాడ్ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి నాగరాజ్ మీనా గెలిచాడు. తన్వర్‌చంద్ అనే స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో వచ్చాడు. వల్లభ్ నగర్‌లో కాంగ్రెసు అభ్యర్థి ప్రీతీ షెకావత్ నెగ్గగా ఆర్‌ఎల్‌పి (రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ) అభ్యర్థి ఉదయ్‌లాల్‌కు ద్వితీయస్థానం దక్కింది. ఇక్కడ యిద్దరు బిజెపి రెబెల్స్ నిలబడడంతో బిజెపికి 4వ స్థానం దక్కింది. ఈ ప్రీతీ,  పైలట్‌తో బాటు తిరుగుబాటు చేసిన అనుయాయి గజేంద్ర సింగ్ షెకావత్ భార్య. అతని మరణంతో ఖాళీ ఏర్పడింది. చనిపోయినవారి కుటుంబసభ్యులకు టిక్కెట్టివ్వడం అనే పద్ధతి ధరియావాడ్‌లో మాత్రం పాటించలేదు. అక్కడ స్థానిక పరిస్థితులను గమనించి మీనా కులస్తుడికి యిచ్చాడు.

ఆ స్థానిక పరిస్థితులేమిటో కాస్త వివరించాల్సి వుంటుంది. ఆరెస్సెస్, దాని అనుబంధ హిందూత్వ సంస్థల సహాయంతో బిజెపి దేశంలోని గిరిజన ప్రాంతాలన్నిటిలో పాగా వేస్తోందని పలుమార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొన్నిచోట్ల యిబ్బందులు కూడా వస్తున్నాయి. గిరిజన సంస్కృతి భిన్నంగా వుంటుంది. వారి మతాచారాలు కూడా వేరేలా వుంటాయి. మామూలు హిందూమతంలోని పూజాపద్ధతులు, మంత్రతంత్రాలు వాళ్లు అవలంబించరు. అయితే ఆరెస్సెస్ వారిది ‘సనాతన హిందూ ధర్మం’ అని వాదిస్తూ హిందూ పూజా పద్ధతులను వారిపై రుద్దడానికి చూస్తోంది. వారి దేవీదేవతా మూర్తులను హిందూకరణ చేస్తోంది. దీని కారణంగా తమ అస్తిత్వానికి ముప్పు వస్తోందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆరెస్సెస్, దాని ద్వారా బిజెపి అదేమీ పట్టించుకోవటం లేదు. వారిని ఉద్ధరిస్తున్నాం, నాగరీకరిస్తున్నాం, సరిదిద్దుతున్నాం అనుకుంటూ మొండిగా ముందుకు వెళుతున్నారు. రాజస్థాన్‌లో మీనా కులస్తులతో అలాగే ఘర్షణ తెచ్చుకున్నారు.

గిరిజనులైన మీనా కులస్తులు ఒకప్పుడు రాజ్యాల నేలారు. జైపూర్, ఆమేర్ రాజ్యాలు వాళ్లవే. వెయ్యి సంవత్సరాల క్రితం కచ్వా రాజపుత్రులు వాళ్లను ఓడించి పాలకులయ్యారు. మీనాలు పాలించినప్పటి ఆమాగఢ్ కోట యిప్పుడు శిథిలావస్థలో వుంది. దాని పురాతనస్థలంగా ప్రభుత్వం గుర్తించింది. దాన్ని మీనాలు ఒకప్పటి తమ ప్రతిష్ఠకు గుర్తుగా చూస్తారు. ఆ కోటలో వారు పూజించే అంబా మాతాదేవి గుడి వుంది. ఇటీవల జూన్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు గుళ్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక ముస్లిములపై అనుమానం పోయి, పోలీసులు కొందర్ని అదుపులో తీసుకుని విచారించి, ఆధారాలు దొరక్క వదిలేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందూత్వ సంస్థలు కొన్ని కొత్త విగ్రహాలను ప్రతిష్ఠాపించి, దేవతకు అంబికా దేవి అని నామకరణం చేసి ధ్వజస్తంభంపై కాషాయజెండా ఒకటి పాతారు. దానితో హిందూత్వ సంస్థలే గుడి స్వరూపాన్ని మార్చేశారని అందరికీ అర్థమైంది. జులై వచ్చేసరికి కోటపై కూడా కాషాయపతాకం రెపరెపలాడింది.

గుడిని, కోటను హిందూత్వవాదులు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం రాష్ట్రం మొత్తం మీద మీనాలకు కోపం తెప్పించింది. ఎస్టీ రిజర్వేషన్ వలన లాభపడిన కులాల్లో మీనాలు ప్రథములు. చదువులో, ఉద్యోగాల్లో వాళ్లు దూసుకుపోయారు. ఇతర గిరిజనులపై కూడా వారి ప్రభావం వుంది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాల్లో 25 స్థానాలు గిరిజనులకు రిజర్వ్ చేయబడి వున్నాయి. అవి కాక మరో 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల స్థితిలో వున్నారు గిరిజనులు. రాజస్థాన్ ఆదివాసీ మీనా సంఘ్ అని ఓ పటిష్టమైన సంస్థ వుంది. దాని అధ్యక్షుడు రామ్‌కేశ్ మీనా గంగాపూర్ సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా వున్నాడు. ఆ జండా పెట్టిన వారం రోజులకు జులై 21న అతను ఆ కాషాయ జండా పీకి, చింపి పారేశాడు.

ఆ వీడియో వైరల్ కావడంతో హిందూత్వ సంస్థలు విరుచుకు పడ్డాయి. సుదర్శన్ అనే హిందూత్వ టీవీ ఛానెల్ ఎడిటరు సురేశ్ చవ్‌హంకే ‘‘ఆగస్టు 1న హిందువులందరూ కోటపై దాడిగా వెళ్లి జై శ్రీరామ్ అని రాసిన కాషాయ జండాను ఆ గుడిపై ప్రతిష్ఠాపించాలి.’’ అంటూ పిలుపు నిచ్చాడు. అదే జరిగితే మీ సంగతి చూస్తాం అన్నాడు రామ్‌కేశ్. ఇదేదో పెద్ద గొడవగా మారబోతోందని భయపడిన ప్రభుత్వం ఆ కోటను తన అధీనంలోకి తీసుకుని ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు చేసింది. మొదట్లో బిజెపి యీ వ్యవహారంలో డైరక్టుగా కలగజేసుకోలేదు. కానీ వ్యవహారం యింతదాకా వచ్చింది కాబట్టి తమ పార్టీలో ప్రముఖుడిగా వున్న మీనా కులస్తుడు 69 ఏళ్ల కిరోడి లాల్ మీనాను రంగంలోకి దింపింది.

అతను వస్తూనే ‘హిందువులకు, గిరిజన మీనాలకు మధ్య యీ రామ్‌కేశ్, అశోక్ గెహ్‌లోత్ విభేదాలు సృష్టిస్తున్నారు.’ అంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత ‘ఆగస్టు 1న నేను నా అనుచరులతో కలిసి కోటపై జండా ఎగరవేసి తీరతాం.’ అని ప్రకటించాడు. అన్నట్టుగానే ముందు రోజు రాత్రి  అనుచరులతో సహా కీకారణ్యమార్గం ద్వారా ప్రయాణించి, పోలీసుల కన్నుగప్పి, ఆగస్టు 1 ఉదయమే కోటపైకి ఎక్కి, జండా ఎగరేశాడు. ఇక్కడ ట్విస్టేమిటంటే జండా ఎగరేశాడు కానీ అది కాషాయ జండా కాదు. మీనా కులస్తులకు ప్రత్యేకమైన మీనా పతాకం! కాషాయమూ కాదు, జై శ్రీరామూ లేదు. కానీ అనుకున్నది సాధించాను అతని అతను ప్రకటించుకున్నాడు. ఒకప్పటి మీనాల కోటపై మీనా పతాకం ఎగరవేయకూడదని ఎవరంటారు?

‘కాషాయ పతాకం ఎగరవేసినపుడు చేసిన తప్పు సరిదిద్దుకుని దాన్ని తీసేయండి అని నేను హిందూత్వవాదులను కోరాను. కానీ వాళ్లు వినలేదు. ఇప్పుడే చెప్తున్నాను. ఆ కోటపై ఎగిరితే మీనాల జండా ఎగరాలి, లేకపోతే త్రివర్ణపతాకం ఎగరాలి. ఆరెస్సెస్ వారి కాషాయజండా ఎగరడానికి వీల్లేదు.’ అని ప్రకటించాడు రామ్‌కేశ్. ఇతర రాష్ట్రాలలోని గిరిజన సంఘాల వారు కూడా యితనితో గొంతు కలిపారు. భారత్ ట్రైబల్ పార్టీ (బిటిపి) వ్యవస్థాపకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే ఐన ఛోటూభాయి వసావా, భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ వారిలో ఉన్నారు. గుజ్జర్, జాట్ నాయకులు కొందరు మద్దతిచ్చారు. బిటిపికి చెందిన రాజస్థాన్‌లోని చోరాసీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ కుమార్ రౌత్, ‘ఉదయపూర్‌ జిల్లాలోని సాలూంబార్‌లోని గిరిజనులు సోనార్‌పహాడీ గుడిని గత ఏడాది హిందూత్వవాదులు యిలాగే మార్చేయబోయారు.’ అని బయటపెట్టాడు.

గొడవ పెద్దదవడంతో బిజెపి మౌనాన్ని ఆశ్రయించింది. కానీ కొన్ని రోజులకు మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే వాసూదేవ్ దేవ్‌నాని ‘మీనాల్లో ఒక వర్గం వారిని హిందువుల నుంచి దూరం చేద్దామని చూస్తోంది. హిందువేతర గిరిజనులుగా కొందర్ని ఏకం చేసి దేశాన్ని బలహీనపరచాలని వారి కుట్ర.’ అని ప్రకటించాడు. కాంగ్రెసు పార్టీ దీనిపై ఏమీ వ్యాఖ్యానించకుండా వుంది. ఆ పార్టీ గిరిజన ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెసు అధినేత, గెహ్‌లోత్ అనుచరుడు గణేశ్ చోగ్రా మార్చి నెలలో అసెంబ్లీలో మాట్లాడుతూ ‘గిరిజనులది ప్రత్యేక సంస్కృతి. వారిపై హిందూమతాన్ని రుద్దుతున్నారు.’ అని ఆరోపించాడు. వెంటనే బిజెపి ‘గిరిజనులు హిందువులా కాదా అన్న విషయంపై మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి.’ అని కాంగ్రెసును అడిగింది. దాంతో కాంగ్రెసు యిరకాటంలో పడింది.

ఈలోగా ‘గిరిజనులు హిందువులు కాకపోతే వాళ్లకి రిజర్వేషన్స్ ఎందుకివ్వాలి?’ అంటూ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్‌లకైతే హిందువులై వుండాలనే నిబంధన వుంది కానీ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఉన్నట్లు లేదు. మార్చి 13న మరో కాంగ్రెసు ఎమ్మెల్యే గోపాల్ మీనా, పైన చెప్పిన స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌కేశ్ కలిసి జయపూర్‌లో మీనా కులస్తుల సమ్మేళనంలో మాట్లాడుతూ ‘జాతీయ ట్రైబల్ రెలిజియస్ కోడ్ అంటూ ప్రత్యేకంగా వుండాల’ని డిమాండు చేశారు. బిటిపి గిరిజనులను హిందువేతరులుగా గుర్తించాలని డిమాండు చేసింది. ఇదంతా చూసి బిజెపి కేంద్ర మంత్రి ఫాగన్ సింగ్ కులస్తే ‘మీనాలు హిందువులే, విష్ణువు సంతానం. వారిది సనాతన హిందూధర్మం.’ అని డిక్లేర్ చేసేశాడు. ఇలా మీనా కులస్తులతో బిజెపికి వైరం నడుస్తూండడం చూసి గెహ్‌లోత్ కాంగ్రెసు అభ్యర్థిగా నాగరాజ్ మీనాను నిలబెట్టి విజయం సాధించాడు.

ఇక బిజెపి అంతఃకలహాలకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధరకు, రాష్ట్ర బిజెపి నాయకత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సతీశ్ పూనియాకు పడటం లేదు. ఆమె ప్రాధాన్యతను తగ్గించడానికి శతథా ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ తిరిగి అధికారంలోకి తిరిగి రావాలంటే ఆమెకే పగ్గాలు అప్పగించాలని ఆమె అనుచరులు వాదిస్తున్నారు. ఈ ఉపయెన్నికలలో అభ్యర్థుల ఎంపికలో ఆమెనే కాదు, స్థానిక నాయకులను కూడా రాష్ట్ర బిజెపి సంప్రదించలేదు. దాంతో మా కోడలుకి ఒంట్లో అస్వస్థతగా వుందంటూ వసుంధర ప్రచారానికి వెళ్లలేదు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆమె స్తబ్దంగానే వుంటోంది. పబ్లిక్ మీటింగులకు రావటం లేదు. పైలట్ బిజెపిలోకి రాలేకపోవడానికి కారణం వసుంధర వ్యతిరేకతే అనే మాట కూడా వినబడింది. ఇటీవల ఆమె అనుచరుడు, మాజీ మంత్రి రోహితాశ్ శర్మను పార్టీ క్రమశిక్షణ పాటించటం లేదంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు.

వసుంధర అనుచరులు 20 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యకలాపాలలో పక్షపాతం చూపిస్తున్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇప్పుడీ ఉపయెన్నికలలో ఓటమి తర్వాత వసుంధర అనుచరులైన యిద్దరు ఎమ్మెల్యేలు ‘ఇప్పటికైనా నాయకత్వాన్ని ఆమెకు అప్పగించండి.’ అంటూ స్టేటుమెంటు యిచ్చారు. వసుంధరకు, పూనియాకు వున్న విభేదాలను గెహ్‌లోత్ చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. జైపూర్ కార్పోరేషన్ బిజెపి చేతిలో వుంది. మేయరుగా వున్న సోమ్యా గుర్జర్, ఆమె భర్త రాజారామ్‌లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలో చెత్త ఎత్తివేయడానికి బివిజి ఇండియా లి. అనే కంపెనీకి కాంట్రాక్టు యిచ్చే వ్యవహారంలో రూ. 20 కోట్ల లంచాలు పుచ్చుకున్నారనే ఆరోపణపై ఆమెను జులైలో సస్పెండ్ చేసి అరెస్టు చేయడం జరిగింది. ఆ కేసులో ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) రాష్ట్ర ఆరెస్సెస్ అధినేత నింబారామ్‌ను కూడా నిందితుడిగా చేర్చింది.  

ఈ నింబారామ్ సమక్షంలో కంపెనీ ప్రతినిథులను రాజారాం లంచం అడుగుతున్నట్లు వున్న ఆడియో, వీడియో టేపులు జూన్‌లో బయటకు వచ్చాయి. కంపెనీతో వ్యవహారాలపై ఎప్పణ్నుంచో వివాదం వుంది. 2021 జనవరిలో జరిగిన జనరల్ బాడీ మీటింగులో 150 మంది సభ్యులు ఆ కంపెనీతో కాంట్రాక్టును రద్దు చేయమని కోరారు. దానిపై మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ యజ్ఞమిత్ర సింగ్‌దేవ్ ఆ కాంట్రాక్టు రద్దు చేసి తాజాగా టెండర్లు పిలవాలని సూచిస్తూ ఫైలు తయారు చేసి పంపితే సోమ్య దానిపై సంతకం పెట్టకుండా తాత్సారం చేసింది. పైగా సోమ్య అనుచరులైన ముగ్గురు కౌన్సిలర్లు యజ్ఞమిత్ర ఛాంబర్‌లో ఆమెపైన దాడి చేశారు. ఈ ఘటనను హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. సోమ్య సస్పెన్షన్‌ను సమర్థించింది. ఈ సోమ్యకు వసుంధరకు పడదు. వసుంధర ముఖ్యమంత్రిగా వుండగా ఆమెను మహిళా కమిషన్ సభ్యురాలిగా చేసింది కానీ 2016 మేలో సోమ్య ఒక రేప్ బాధితురాలితో సెల్ఫీ తీసుకున్న విషయం బయటకు వచ్చి వివాదం చెలరేగడంతో ఆమె చేత రాజీనామా చేయించింది.

రాజారాం కూడా వివాదాస్పద వ్యక్తే. కరౌలి నగర బిజెపి పరిషద్‌కు చైర్మన్‌గా వున్నాడు కానీ 2019లో ఒక అధికారిని కొట్టడంతో సస్పెండ్ అయ్యాడు. అనేక రియల్ ఎస్టేటు ఫ్రాడ్ కేసుల్లో యిరుక్కుని వున్నాడు. ఈ మార్చిలో ఒకర్ని కొట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ నగరాన్ని కాంగ్రెసు ప్రభుత్వం 2019లో రెండుగా చీల్చింది. ముస్లిములు ఎక్కువగా వున్న జైపూర్ హెరిటేజిలో కాంగ్రెసు గెలిచింది. జైపూర్ గ్రేటర్‌లో బిజెపి గెలిచింది. స్థానిక బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు అభ్యంతరం తెలుపుతున్నా రాష్ట్ర బిజెపి శాఖ సోమ్యను 2020 నవంబరులో మేయరుగా చేసింది. ఎందుకంటే సోమ్యకు, రాజారాంకు ఉన్నత స్థానాల్లో వున్న బిజెపి, ఆరెస్సెస్ నాయకులతో లావాదేవీలున్నాయి. ఇప్పుడు ఆమె సస్పెన్షన్ తర్వాత నిరసన ప్రదర్శనలు చేయమంటూ రాష్ట్రనాయకత్వం పిలుపు నిస్తే స్థానిక నాయకులు వాటిలో పాల్గొనలేదు. బయటకు వచ్చిన టేపుల్లో రాజారాం, కంపెనీ ప్రతినిథితో ‘‘మాకెంత దన్నుందో తెలుసా, గడ్కరీ, ఫడణవీస్‌ల చేత చెప్పించినా మేం వినం.’’ అన్నాడు.

ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి గెహ్‌లోత్ ఒక చిట్కా వేశాడు. సోమ్య స్థానంలో యాక్టింగ్ మేయరుగా, బిజెపికే చెందిన మాజీ మేయరు శీల్ దభాయ్ అనే ఆవిణ్ని నియమించాడు. ఆమె బిజెపిదే కానీ వసుంధర వర్గానికి చెందినది. హైకోర్టు యీ నిర్ణయంతో తృప్తి చెంది, సోమ్యను తీసివేయడంలో రాజకీయ కోణం లేదంది. వసుంధర వర్గానికి అభ్యంతరం లేదు. మంట పుట్టినదల్లా పూనియా వర్గానికే. ఈ విధంగా రాజస్థాన్ బిజెపిలోని కుమ్ములాటలే ఉపయెన్నికలలో ఆ పార్టీని 3, 4 స్థానాలకు తీసుకుపోయాయి. ధరియావాడ్‌లో కాంగ్రెసు అభ్యర్థికి 70 వేలు (39శాతం) ఓట్లు వస్తే, బిజెపి అభ్యర్థి ఖేత్ సింగ్‌కు 46 వేలు (26శాతం) వచ్చాయి. వల్లభ్‌నగర్‌లో ప్రీతి షెకావత్‌కు 66 వేలు (36 శాతం) వస్తే బిజెపి అభ్యర్థి హిమ్మత్ సింగ్ ఝాలాకు 21 వేలు (12 శాతం) వచ్చాయి.  ఇది చూసి బిజెపి అధిష్టానం మేల్కొని దిద్దుబాటు చర్యలు ఆరంభించవచ్చు. (ఆమాగఢ్ కోటపై దించేస్తున్న కాషాయపతాకం, వసుంధరా రాజే)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?