Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రామపట్టాభిషేకంలో రాజకీయ కోణం

ఎమ్బీయస్‌: రామపట్టాభిషేకంలో రాజకీయ కోణం

దశరథుడు తలపెట్టిన రాముని యువరాజ పట్టాభిషేకంలో రాచరికపు ఎత్తుగడలున్నాయని నేను రేఖామాత్రంగా ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపట్టారు. వాల్మీకి రామాయణం చదవమని సలహా యిచ్చారు. నేను చదివే రాశాను. ఇదే కాదు, ఏది రాసినా ఒకటికి రెండు సార్లు చూసుకునే రాస్తాను. పొరపాట్లు దొర్లితే చెప్పమని అర్థిస్తాను. కానీ కొందరు పాఠకులు నేను రాసినదాన్ని వదిలేసి, నేననుకున్నది రాయలేదేం, నేననుకున్నట్లు రాయలేదేం అని తెగ అడుగుతూంటారు. లక్షసార్లు చెప్పాను - అందరికీ తెలిసినది నేనెందుకు రాయడం? ఆరెస్సెస్‌ ప్రచారం చేయడానికి నేనెందుకు? వాళ్లు టీములు పెట్టుకుని, అదే ఉద్యోగంగా, ఉద్యమంగా సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. వాట్సప్‌లతో సెల్‌ నింపేస్తున్నారు. పాఠకులు నేను రాసిన దాన్ని ఖండిస్తూ ‘దిలీప్‌ ఘోష్‌ ఇలా అనలేదు, ఆరిఫ్‌ ఖాన్‌ అలా అనలేదు’ అని రాస్తే అదో అందం. అది చేయరు. నీ బుద్ధే సరిలేదు అంటూ కామెంట్స్‌ పెడతారు.

ఇక పురాణాల గురించి నా ఉద్దేశం చెప్తాను. వాటిని తప్పక చదవాలి. ఎందుకంటే మానవస్వభావాలను, వాటి ఫలితాలను అవి చెప్తాయి. చాలా వాటికి చారిత్రక ఘటనలు మూలంగా ఉంటాయి. అయితే కాలక్రమంలో అతిశయోక్తులు, అద్భుతాలు, ప్రక్షిప్తాలు చోటు చేసుకుంటాయి. అందువలన విచక్షణతో చదవాలి. పైగా ఎప్పుడూ విజేత కథలే గాథలవుతాయి. 2014లో చంద్రబాబుపై పుస్తకాలు వస్తాయి. 2019లో జగన్‌పై పుస్తకాలు వస్తాయి. నెగ్గినవారిని గొప్పగా వర్ణించి, వారి తప్పులను వైట్‌ వాష్‌ చేసి, ఓడినవారిని తక్కువగా చూపి, వారి లోపాలను హైలైట్‌ చేయడం జరుగుతుంది. పురాణాలలో అయితే వాటికి పూర్వజన్మ వృత్తాంతాలు, శాపాలు, వరాలు వాడుకుంటారు. భారతాన్ని కౌరవుల పరంగా రాస్తే మరోలా తోస్తుంది. ఇన్ని కన్సెషన్లతో మనం పురాణగాథలను తరచి చూడగలగాలి. వాటిని చరిత్ర పుస్తకాలుగా చూడడానికి వీలులేదు. అవి జాతికి నీతిబోధకాలు. మంచి లక్షణాలుంటే ఎలా పైకి వస్తారో, ఎంతటివాడినైనా సరే చెడు లక్షణాలు ఎలా కిందకు లాగుతాయో, రసవత్తరంగా చెప్తాయి.

ఇక రామాయణానికి వస్తే - సీతాపరిత్యాగం, శంబూకవధ వృత్తాంతాలున్న ఉత్తరకాండను పక్కన పెట్టేయాలి. అది వాల్మీకి కృతం కాదనే అనాలి. పట్టాభిషేకంతో వాల్మీకం పూర్తవుతుంది. దాని ప్రకారం రాముడి పాత్ర ఆదర్శప్రాయమైనది. పురుషోత్తముడనే బిరుదుకు తగినవాడు రాముడు. నరుడిగానే ఉంటూ ధర్మాన్ని పాటించి చూపాడు. అయితే అతని చుట్టూ వున్నవాళ్లంతా గొప్పవాళ్లు కానక్కరలేదు. ఎవరి వికారాలు వారికి ఉన్నాయి. అది మనం గుర్తెరగాలి. యువరాజ పట్టాభిషేకం ఘట్టానికి వస్తే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ఎత్తిపొడిచాడు - వశిష్టుడు పెట్టిన ఆ ముహూర్తం ఎంత దరిద్రంగా ఉందంటే సింహాసనం దక్కలేదు సరి కదా, రాముడు అడవులపాలై పోయాడు, అతని తల్లులు విధవలై పోయారు అని. నిజానికి ముహూర్తం దశరథుడు పెట్టాడు. వశిష్టుడు ఆమోదించాడు. అయినా భగ్నమైంది, ఎందువలన అంటే పొలిటికల్‌ ఇంట్రిగ్యూ కారణంగా అనుకోవాలి.

ఇక్కణ్నుంచి వాల్మీకి రామాయణంలో ఉన్నది రాస్తాను. దానిపై నా వ్యాఖ్యానం బ్రాకెట్లలో రాస్తాను. `రాముడు రాజ్యపాలనం చేస్తూ వుంటే చూసి సంతోషించి చనిపోవాలి అని దశరథుడు అనుకున్నాడు. మంత్రులతో నాకు వార్ధక్యం వచ్చింది, ఉత్పాతాలు కనబడుతున్నాయి. అందువలన రాముణ్ణి యువరాజును చేయాలి అని చెప్పాడు. మంత్రులు సరేనంటూ ఒక సభ ఏర్పాటు చేయమన్నారు. దానికి నానానగర ముఖ్యులనూ, రాజముఖ్యులనూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. దూరదేశస్థులు అయినందువల్లనూ, వ్యవధి లేకపోయినందువల్లనూ, కేకయ మహారాజుకు, జనక మహారాజుకూ ఆహ్వానాలు పంపించలేదు. (కేకయులంటే కైక పుట్టింటివారు. జనకుడు రాముడి మామగారు. వారిని పిలవడానికి వ్యవధి లేకపోవడమేమిటి? అల్లుడికి అంతటి ముచ్చట జరుగుతూంటే జనకుణ్ని పిలవకపోవడమేమిటి? దశరథుడికి వార్ధక్యం ఎప్పుడో వచ్చింది. ఇవేళ ఏదో ప్రమాదం జరిగింది లేదా యుద్ధంలో గాయపడ్డాడు అనుకోవడానికి లేదు. కేకయులకు తెలియకుండా తంతు జరిపిద్దామని దశరథుడు చూశాడు అనేది స్పష్టం)

(జన్మక్రమాన్ని బట్టి రాముడి తర్వాత భరతుడే. సుమిత్ర పిల్లలైన లక్ష్మణుడు రాముడి వెంట, శత్రుఘ్నుడు భరతుడి వెంట తిరుగుతూ వచ్చారు కాబట్టి వాళ్లతో యిబ్బంది లేదు. కైక భరతుణ్ని తన పుట్టింటికి తరచుగా పంపుతూండడంతో అతను అక్కడే పెరిగాడు. రాముడు రాజధానిలోనే ఉండి ప్రజలకు యిష్టుడయ్యాడు. ఈ విషయాలు మంథర కైక చేసిన పొరపాట్లు ఎత్తి చూపేటప్పుడు ప్రస్తావించిందని వాల్మీకి రాశాడు.  ఈ వట్టాభిషేకం తలపెట్టినపుడు భరతుడు, శత్రుఘ్నుడు కేకయ రాజ్యంలోనే ఉన్నారు. దశరథుడికి ఉన్నదే నలుగురు కొడుకు. లేకలేక పుట్టారు. వారిలో యిద్దరు ఊళ్లో లేనపుడు అర్జంటుగా యింత మహోత్సవం పెట్టుకోవసిన అవసరం ఏమొచ్చింది?)

దశరథుడు ఆ సభలో తన మనసులో మాట చెప్పగానే వశిష్ట వామదేవులతో సహా అందరూ ఆమోదించారు. ‘‘ఇది చైత్రమాసం. పరమపావనమైనది. రాముడి యువరాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు అన్నీ యిప్పుడే చేయించాలి. రామాభిషేకానికి ఏ యే కర్మలు చేయాలో యిప్పుడే చెప్పండి.’’ అన్నాడు. రాముణ్ని పిలిపించి, తన నిర్ణయాన్ని చెప్పాడు. రాముడు సరేనన్నాడు. కొలువు చాలించాక దశరథుడు మళ్లీ రాముణ్ని తన అంతఃపురానికి పిలిపించి ‘‘నా అంతఃకరణము నీ రాజ్యాభిషేకానికి తొందర పెడుతోంది. ఈనాడు పునర్వసు నక్షత్రం. రేపు పుష్యమి. రాజ్యాభిషేకానికి బాగుందని జ్యోతిష్కులు చెప్పారు. నీ అభిషేకం రేపే అయిపోవాలి. నువ్వు యిప్పటి నుంచే నియమబద్ధుడిగా ఉండాలి.’’ అని చెప్పాడు. (ఇంతటితో ఆగలేదు. ఇంకా చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైనది. భరతుడు తిరగబడతాడన్న భయాన్ని దశరథుడు వ్యక్తం చేశాడు చూడండి)

‘‘రామా, ఇప్పుడు భరతుడు దూరదేశంలో ఉన్నాడు. వాడు యిక్కడికి వచ్చేలోపునే నీ రాజ్యాభిషేకం అయిపోవాలి. నీ తమ్ముడు పెద్దల దారిని పోయేవాడే కావచ్చు, జ్యేష్ఠుడవని నిన్ను అనుసరించేవాడే కావచ్చు. ధార్మికుడు, దయాహృదయుడు, జితేంద్రియుడు కావచ్చు. కానీ మానవుల చిత్తం అనిత్యం. ఎప్పుడూ ఒకలా వుండదు. ధర్మపరాయణలు సైతం యితరులు కల్పించే మిత్రభేదాదులకు లొంగిపోవడం కద్దు. అందువల్ల రేపే నీ రాజ్యాభిషేకం జరగాలి.’’ అన్నాడు. (మేనమామ యింటి నుంచి తిరిగివచ్చాక భరతుడు ప్రవర్తించిన తీరు చూస్తే దశరథుడు అతన్ని ఎంత తప్పుగా అంచనా వేశాడో అర్థమవుతుంది. తనకు వచ్చిన రాజ్యాన్ని వదులుకున్న ధార్మికుడు భరతుడు. దురూహ, కల్మషం దశరథుడి మనసులోనే ఉంది. భరతుడికే కాదు, కైకకు కూడా చివరి నిమిషం దాకా తెలియకుండా ఉండడానికి అతను చేసిన తక్కిన ఏర్పాట్ల గురించి వాల్మీకి విపులంగా రాయకపోయినా  మనం గ్రహించవచ్చు)

రాముడు ఆ తర్వాత తల్లి కౌస్యల అంతఃపురానికి వెళ్లాడు. అక్కడ సీతతో బాటు సుమిత్రాదేవీ, లక్ష్మణుడు కూడా ఉన్నారు. అందరూ సంతోషించారు. (ఇక మిగిలినది కైక. రాముణ్ని ఎంతో అభిమానించింది. మంథర రామపట్టాభిషేకం మాట చెప్పినపుడు సంతోషించి ఆమెకు బహుమానంగా నగ యివ్వబోయింది. అలాటి కైక వద్దకు రాముడు వెళ్లి చెప్పడం ధర్మం. కానీ ఎందుకు చెప్పలేదు? భరతుడి విషయంలో తండ్రి చేసిన హెచ్చరిక కారణంగా అనుకోవచ్చు. ధర్మాధర్మాల గురించి తండ్రితో చర్చ చేసే కారెక్టరు కాదు రాముడిది. ఆయన ఏది చెపితే అది చేయడమే! సమయం లేదేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే అవేళ సాయంత్రం రాముడు తన స్నేహితులతో కాస్సేపు ముచ్చట్లాడాడని వాల్మీకి రాశాడు) రాముడు, సీత రాత్రి ఉపవాస దీక్ష పట్టి తెల్లవారడానికి యింకా ఒక ఝాము ప్రొద్దు ఉందనగా నిద్ర లేచారు. అలంకారం మొదలైంది. తెల్లవారగానే రామాభిషేకం జరుగుతుంది కదాని పౌరులందరూ ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ ముందు రోజు సాయంత్రం కైకేయి పుట్టింటి నుంచి వచ్చిన దాసి మంథర అనుకోకుండా రాజప్రాసాదం కేసి వెళ్లింది. అంతా అడావుడిగా వుంది. కౌసల్య దాసులందరికీ కానుకలు యిస్తోంది. ‘ఎప్పుడూ ఎవరికీ ఏమీ యివ్వని కౌసల్య యివాళ అందరికీ బహుమానాలు యిస్తోందేమిటి?’ అని ఒక దాసిని అడిగితే అది సంతోషం పట్టలేక, వృత్తాంతం దాచలేక తెల్లవారితే రామాభిషేకం అని మంథరకు చెప్పివేసింది. (‘దాచలేక’ అని రాసినది వాల్మీకే. అంటే అది దాపరికపు వ్యవహారమన్నమాట. ఊరందరికీ తెలిసినా అంతఃపురంలో ఉన్న కైకకు తెలియకూడదన్నమాట. అందుకే ఆమె సవతులు కానీ, మహారాజు కానీ, యువరాజు కాబోతున్న రాముడు కానీ ఎవరూ చెప్పలేదు. ఆఖరి నిమిషంలో పట్టాభిషేక మహోత్సవానికి వెళ్లబోతూ రాజు వచ్చి చెప్పబోయాడు, ఆ నిమిషంలో తెలిసినా ఏమీ చేయలేదు కదాన్న ధైర్యమో ఏమో! కానీ ఆ లోపునే వ్యవహారం లీక్‌ అయిపోయి, కైక వైల్డ్‌గా రియాక్టయింది)

మంథర వచ్చి చెప్పగానే కైక రామాభిషేకం జరగబోతున్నందుకు, అంతవరకూ ఆ విషయం తనకు తెలియనందుకూ ఆశ్చర్యపడ్డది. ఎంతో సంతోషపడ్డది. మంచి ఆభరణం తీసి మంథరకు యిచ్చింది. అప్పుడు మంథర తిట్టిపోసింది - ‘ఇదేమైనా సంతోషకరమైన వార్తా? రాముడు రాజయితే భరతుణ్ని దేశాంతరమో, అవసరమైతే లోకాంతరమో పంపేస్తాడు. కౌసల్య రాజమాత అయి, అధికారం చెలాయిస్తుంది. నువ్వు ఆమె కింద ఊడిగం చేయాల్సి వస్తుంది.’ అని బెదిరించింది. ఇక్కడితో వాల్మీకి రామాయణాన్ని కోట్‌ చేయడం అయిపోయింది.

తర్వాత కైక అలగడం, దశరథుడికి వరాలు గుర్తు చేయడం, పట్టాభిషేకం ఆగిపోవడం, రాముడు అడవిదారి పట్టడంతో దుఃఖం పట్టలేక దశరథుడు చనిపోవడం అందరికీ తెలిసినవే. ఇక్కడ భరతుడు రాజు కావాలని అడగడంతో ఆగకుండా రాముణ్ని పధ్నాలుగేళ్లు వనవాసం చేయమని ఎందుకు అడగాలి అనే ప్రశ్న వస్తుంది. ప్రజాదరణ పొందిన రాముడు రాజధానిలోనే ఉంటే తిరుగుబాటుకు కేంద్రం కావచ్చు. అదీ కాకుండా ఎవరైనా 14 ఏళ్ల పాటు ఏ ఆస్తినైనా అనుభవించకపోతే దానిపై వాళ్లు హక్కు కోల్పోతారు అని నియమం ఉండేదట. రామాయణ కాలంలో అది 14 ఏళ్లయితే, భారతకాలానికి అది 12 ఏళ్లయిందట. అందువలన 12 ఏళ్ల వనవాసం అనే షరతు పెట్టారు. ఇది నేను ఎక్కడో చదివిన వ్యాఖ్యానం. తప్పయితే కావచ్చు.

వాల్మీకి రామాయణంలో రాసినది మాత్రం ‘దేవీ,  రాముడు పధ్నాలుగేండ్లు అయోధ్యానగరంలో లేకుండా పోయేట్లయితే, భరతుడే రాజుగా స్థిరపడిపోతాడు.’ అని మంథర చేత అనిపించారు. అది ఏ పదో లేక పదిహేనో కాకుండా 14 మాత్రమే కావడమెందుకు అంటే ఆనాటి యీ నియమం కారణం కావచ్చు. ఇదంతా చదివితే కలిగే సందేహం - తక్కిన యిద్దరి మీద లేని సందేహం దశరథుడికి భరతుడి మీదే ఎందుకు కలిగింది? అప్పటిదాకా జరిగిన కథలో అతని కారెక్టరుపై ఎలాటి మచ్చ లేదు కదా! ప్రియభార్య ఐన కైకకు తెలియకుండా యీ వ్యవహారం గోప్యంగా నడపడం దేనికి? అని.

దీనికి సమాధానం వాల్మీకంలో దొరకదు. నేను రామాయణం గురించి చదివిన వ్యాఖ్యానాల్లో ఒకదానిలో (ఎవరిదో గుర్తుకు రావటం లేదు) ఒక అంశం చెప్పారు. కేకయ రాజ్యం అయోధ్య కంటె చాలా పెద్దదట. ఆ రాకుమారినిచ్చి పెళ్లి చేయమని దశరథుడు అడిగితే ‘నీకిప్పటికే యిద్దరు భార్యలున్నారు. వాళ్లకు పిల్లలు పుట్టినా, మా అమ్మాయికి పుట్టినవాణ్నే రాజుని చేస్తానని మాట యియ్యి’ అన్నారట. దశరథుడు సరేనంటేనే పెళ్లి జరిగింది. అందువలన భరతుడు వయసులో చిన్నవాడైనా సరే, సింహాసనం దక్కవలసినవాడు. దశరథుడు రాముడిపై ప్రేమతో ఆ షరతును ఉల్లంఘించ దలచాడు. కేకయులను అందుకే పిలవలేదు. జనకుడు ధర్మపరుడు కాబట్టి అభ్యంతరం చెపుతాడని కాబోలు పిలవలేదు. అడ్డదారి తొక్కడంతో అనర్థం జరిగింది. కైక ఎప్పుడైతే ఆ షరతును ఉటంకించిందో, దశరథుడికి చేతులు కట్టేసినట్లయింది.

అయితే వాల్మీకంలో యీ షరతుల గురించి రాయలేదు. దేవాసుర యుద్ధంలో యుద్ధం చేస్తూ దశరథుడు మూర్ఛపోతే రథం తోలుతున్న కైక రథాన్ని రహస్య ప్రదేశానికి తోలుకుని పోయి రక్షించింది. ఇలా రెండు సార్లు జరిగింది కాబట్టి దశరథుడు రెండు కోరికలు యిస్తానన్నాడు. కైక యీ సమయంలో వాటిని ఉపయోగించుకుంది అని రాశారు. ఆమె యీ సమయంలోనే అడుగుతుందని, అది కూడా యివే అడుగుతుందని దశరథుడు ముందే ఊహించలేడు కదా! అందుకే ఏదో చేయబోయాడు. మరేదో అయింది. ఏది ఏమైనా సింహాసనం విషయంలో భరతుడికి ఏదో క్లెయిమ్‌ వుంది, అతను పేచీ పెట్టవచ్చు అనే భయం దశరథుడిలో ఉంది, ఆ భయం చేతనే అతను అసహజంగా ప్రవర్తించాడు అని పూర్తిగా అర్థమవుతోంది. దీని పర్యవసానం ఏమిటో కవి చెప్పేశాడు కూడా.

పొయెటిక్‌ జస్టిస్‌ అని ఉంటుంది. ప్రపంచంలో పని ప్రతి కర్మకు ఫలితం వెంటనే కనబడకపోయినా, కావ్యంలో మాత్రం కవి కనబరుస్తాడు. దురూహతో పట్టాభిషేకాన్ని అర్జంటుగా జరిపించబోయిన దశరథుడి మనోరథం నెరవేరలేదు సరి కదా, అది అతని మరణానికే దారి తీసింది. ఇలా ప్రతి పాత్ర ద్వారా కవి మనం నడవాల్సిన మార్గం గురించి చెపుతూనే వుంటాడు. దశరథుడి చావుకి కారణం శ్రవణకుమారుడి శాపం వగైరాలు బ్యాక్‌ స్టోరీలుగా తర్వాత వచ్చి వుండవచ్చు. ఇక్కడ నీతి ఏమిటంటే యిచ్చిన మాట తప్పితే ప్రమాదమే అని కవి హెచ్చరించాడు. ఇది చూసే కాబోలు రాముడు ఆడిన మాట తప్పలేదు. అందుకే రాముడికి ఆలయాలున్నాయి, దశరథుడికి లేవు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?