cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రత్నగిరి ప్రాజెక్టుకు బిజెపి ఎస్‌, శివసేన నో

ఎమ్బీయస్‌: రత్నగిరి ప్రాజెక్టుకు బిజెపి ఎస్‌, శివసేన నో

ఇటీవలి ఎదురుదెబ్బలతో బిజెపి అధిష్టానం దిగివచ్చి పార్టీ సీనియర్లతో, మిత్రపక్షాలతో సయోధ్య కోసం చూస్తోందని వార్తలు వచ్చాయి. అమిత్‌ షా ఉద్ధవ్‌ ఠాక్రే యింటికి వెళ్లి, ఫడ్‌ణవీస్‌ను బయట కూర్చోబెట్టి  మంతనాలు సాగించాడట. తక్కినవాటితో బాటు వాళ్లిద్దరి మధ్య రాజీకి రావలసిన అంశం ఒకటి - కేంద్రప్రభుత్వం మహారాష్ట్రలో చేపడుతున్న రత్నగిరి రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌పిసిఎల్‌) ప్రాజెక్టు! భారత్‌ పెట్రోలియం, హిందూస్తాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ల కన్సార్టియం సౌదీ అరేబియా నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ ఐన సౌదీ ఆరామ్‌కోతో 50-50 వాటాలతో కలిసి పెడుతున్న రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టు అది. ఏడాదికి 6 కోట్ల మెట్రిక్‌ టన్నుల ముడి చమురును అది ప్రాసెస్‌ చేస్తుంది.

దానికి రత్నగిరి జిల్లాలో రాజాపూర్‌ తాలూకాలోని 12 గ్రామాలు ప్లస్‌ సింధుదుర్గ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 15 వేల ఎకరాలు కావాలి. ప్రభుత్వభూమి 126 ఎకరాలు మాత్రం ఉంది. తక్కినది ప్రజల నుంచి సేకరించాలి. దీని కారణంగా 20 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.50 లక్షల పరోక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెపుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం దీనిపై చాలా ఆసక్తి కనబరుస్తోంది. కానీ ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. బిజెపి భాగస్వామి ఐన శివసేన కూడా వారితో చేరింది. వివాదానికి కారణం - ఇలాటి ప్రాజెక్టుల్లో సహజంగా ఎదురయ్యే భూసేకరణ సమస్య, పునరావాస సమస్య, వాతావరణ కాలుష్య సమస్య. 

భూసేకరణకు యుపిఏ హయాంలో వచ్చిన 2013 లాండ్‌ ఎక్విజిషన్‌ యాక్ట్‌ ఉపయోగించి ఉండాల్సింది. అదైతే ప్రభావితమయ్యే గ్రామాల్లోని ప్రజల్లో 70% మంది ప్రాజెక్టుకి అంగీకారం తెలపాలి. వాళ్లను అంగీకరింప చేయలేమన్న భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం 1951 నాటి ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ని ఉపయోగించింది. ఆర్‌ఆర్‌పిసిఎల్‌ కంపెనీ ప్రతినిథి మాట్లాడుతూ ''మాకు కావలసిన 15 వేల ఎకరాల్లో 80% బంజరు భూమి అని ప్రభుత్వం మాకు చెప్పింది. (చెప్పింది అంటున్నాడు తప్ప ఆ అంకె కరక్టే అని నిర్ధారించటం లేదు) ఆ ప్రకారం 3 వేల ఎకరాల్లో పంట నాశనమవుతుంది. నియమాల ప్రకారం మాకిచ్చిన 15 వేల ఎకరాల్లో 30% మేము గ్రీన్‌ బెల్ట్‌ మేన్‌టేన్‌ చేయాలి. మొత్తం 4500 ఎకరాల్లో మేం మామిడి, జీడిమామిడి తోటలు వేస్తాం.'' అంటున్నాడు.

''ఇక్కడ 12 లక్షల మామిడి చెట్లు, 6 లక్షల జీడిమామిడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నాశనమవుతాయి.'' అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ''మొత్తం 14 గ్రామాలు కలిపి 3600 మంది ప్రభావితమౌతారు. మేం లాండ్‌ అక్విజిషన్‌కు నోటీసులు యిస్తే 14% మంది మాత్రమే తమ వ్యతిరేకత తెలిపారు. (అంగీకారం తెలిపినవారి సంఖ్య చెప్పలేదు. భూయజమానులకు నోటీసులు వెళ్లాయో లేదో తెలియదు). సేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభలు చేసిన తీర్మానాలన్నీ రాజకీయప్రేరితాలే.'' అని కంపెనీ ప్రతినిథి అన్నాడు.

ఆందోళన చేస్తున్న ఒక గ్రామంలో ప్రజలు ''మా గ్రామంలో గ్రామసభ సమావేశం ఏర్పరచినపుడు మమ్మల్ని భయపెట్టడానికి 900 మంది పోలీసులను పంపించారు. అయినా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాం. మార్చి 14 న ఫడ్‌ణవీస్‌ వచ్చి ఇంత వ్యతిరేకత ఉన్నపుడు ముందుకు వెళ్లం అన్నాడు. అయితే దిల్లీకి పిలిచి అతన్ని ఒప్పించారు లాగుంది, ఏప్రిల్‌ 11న, ఆ కంపెనీలతో కలిసి మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌పై సంతకం పెట్టేశాడు.'' అని చెప్పారు. 

''రిఫైనరీయే కాదు, ఇక్కడ 2500 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టబోతున్నారు. దాన్నుంచి వచ్చే బూడదంతా సముద్రంలో పోస్తారు. మత్స్యకారుల జీవనోపాధి పోతుంది.'' అంటున్నాయి ప్రతిపక్షాలు.  దానికి సమాధానంగా కంపెనీ ప్రతినిథి ''ప్రాజెక్టుకి విద్యుత్‌ అవసరమే కానీ థర్మల్‌ ప్లాంటే పెడతామని లేదు. ఒకవేళ పెట్టినా ఎల్‌పిజి ప్లాంట్‌ పెట్టవచ్చు.'' అంటున్నాడు తప్ప స్పష్టత యివ్వటం లేదు. ''ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్‌ ప్రాసెస్‌లో గుజరాత్‌ వాటా 37%, మహారాష్ట్ర వాటా 8%. ఇది పూర్తయితే మహారాష్ట్ర వాటా 38% అవుతుంది, రాష్ట్ర జిడిపి 10-12% పెరుగుతుంది.'' అంటున్నాడు.

ఇటువంటి కబుర్లు చాలా వింటూ రావడం చేత ప్రజలు నమ్మటం లేదు. ముఖ్యంగా వారికి ఒక విషయంలో చాలా కోపం, అనుమానం ఉంది. 2017 మేలో యీ ప్రాజెక్టు ప్రకటించడానికి కొన్ని నెలల ముందు గుజరాత్‌ నుంచి కొందరు వచ్చి యింకెక్కడా భూమి దొరకనట్లు సరిగ్గా యీ 14 గ్రామాల్లోనే ఎకరా రూ.5 లక్షల చొప్పున భూములు కొనేశారు. ఇప్పుడు వాళ్లందరూ ''ఎకరానికి రూ.కోటి యిచ్చేట్లయితే మా భూమి యిచ్చేయడానికి అభ్యంతరం లేదు'' అని లేఖలు రాసి యిచ్చారు. వీళ్లందరూ గుజరాతీలే. ఇక్కడ ఎన్నడూ వ్యవసాయం చేసినవారు కారు.

అంటే దీని అర్థం కేంద్రం నుంచి ముందస్తు సమాచారం సంపాదించిన గుజరాతీ పెట్టుబడిదారులు వాళ్ల వాళ్లకు చెప్పి భూములు కొనిపించారన్నమాట. అసలే ముంబయి ఆర్థికవ్యవస్థంతా గుజరాతీల చేతిలో ఉందని సగటు మహారాష్ట్రుడు కసిగా ఉంటాడు. ఇలాటి సంఘటనలు మరింత విద్వేషాన్ని రగిలిస్తాయి. పైగా స్థానికులు అభ్యంతరం తెలుపుతూ ఉంటే, వీళ్లు అభ్యంతరం లేదంటూ లేఖలివ్వడమేమిటి? 

స్థానికుల మనోభావాలను శివసేన గుర్తు పట్టింది. రత్నగిరి, సింధుదుర్గ్‌ జిల్లాలు ఒకప్పుడు శివసేనకు కంచుకోటలు. సింధుదుర్గ్‌లో పార్టీ తరఫున పెద్ద నాయకుడైన నారాయణ రాణే పార్టీ విడిచిపెట్టడంతో అక్కడ పట్టు పోయింది. రత్నగిరిలో మాత్రం మిగిలింది. అది చేజారకుండా చూడాలంటే తామూ ప్రాజెక్టుకి వ్యతిరేకమని చూపించుకోవాలి. అందువలన ఏప్రిల్‌ 23న శివసేన తరఫున మహారాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా ఉన్న సుభాష్‌ దేశాయ్‌ యీ ప్రాజెక్టుకై భూసేకరణ కోసం తన శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రభావిత గ్రామాల్లో ఒకటైన నానర్‌లో అతనా ప్రకటన చేసినపుడు అతని పక్కన ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నాడు. మర్నాడే ఫడ్‌ణవీస్‌ 'పరిశ్రమల మంత్రికి ఆ నోటిఫికేషన్‌ రద్దు చేసే అధికారం లేదు. ఒక హైలెవెల్‌ కమిటీ నివేదిక తయారుచేసి కాబినెట్‌కు సమర్పించాలి. అప్పుడు వాళ్లు దానిమీద నిర్ణయం తీసుకుంటారు' అని ప్రకటించాడు. తన పార్టీ ఆదేశాలను అతను మన్నించక తప్పదు కదా. ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించడంలో శివసేన, కాంగ్రెసు, ఎన్‌సిపి, ఎంఎన్‌ఎస్‌ ఏకమయ్యాయి. ప్రస్తుతం బిజెపిలో చేరిన నారాయణ రాణె కూడా తను ప్రాజెక్టుకి వ్యతిరేకమే అని ప్రకటించాడు. 

అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గటం లేదు. ప్రజలూ ఊరుకోవటం లేదు. కొంకణ్‌ రిఫైనరీ విరోధ్‌ సమితి అని పెట్టి మే 30 న 15 వేల మంది గ్రామస్తులతో నిరసన సభ ఏర్పాటు చేశారు. కొంకణ్‌ ప్రాంతం తమకు హాని కలిగించే ప్రాజెక్టులను అడ్డుకోవటంలో చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు తూత్తుకుడిలో విధ్వంసం సృష్టించిన వేదాంత స్టెరిలైట్‌ రత్నగిరిలోనే 60 వేల టన్నుల కాపర్‌ స్మెల్టర్‌ ప్లాంటు పెడతామని 1992లో 500 ఎకరాలు అడిగింది. ప్రభుత్వం యిచ్చింది కూడా. కానీ స్థానికుల ఆందోళన కారణంగా అక్కణ్నుంచి తమిళనాడుకి తరలింది.

కాస్త ముందూవెనకగా అమెరికన్‌ ఎనర్జీ కంపెనీ ఎన్రాన్‌ దభోల్‌లో ప్రాజెక్టు పెడతానంది. అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం సరేనంటే, ప్రతిపక్షంలో ఉన్న శివసేన, బిజెపి అడ్డుకున్నాయి కానీ 1995లో వాళ్లు అధికారంలోకి రాగానే సరేనన్నాయి. ప్రజలు అడ్డు చెపుతూనే ఉన్నారు. చివరకు ఆ ప్రాజెక్టు కష్టాల్లో, నష్టాల్లో మునిగింది. 2010లో యుపిఏ ప్రభుత్వం జైతాపూర్‌లో 9900 మె.వా.ల పవర్‌ ప్రాజెక్టు పెడతానంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా భూమి సేకరించారు. కానీ విద్యుత్‌ ధర గురించి తేలకపోవడంతో కథ ముందుకు సాగలేదు. మరి యీ వివాదం చివరకు ఎటు మళ్లుతుందో చూడాలి.ఈలోగా ఆరామ్‌కో తన వాటాలో కొంత భాగాన్ని అబుధబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీకి అమ్మేసింది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com