cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కొండలరావుగారితో అనుబంధం

ఎమ్బీయస్: కొండలరావుగారితో అనుబంధం

1994 అక్టోబరులో ముళ్లపూడి వెంకటరమణగారి అబ్బాయి వరా ముళ్లపూడి పెళ్లి రిసెప్షన్‌లో రావి కొండలరావుగారిని తొలిసారి ప్రత్యక్షంగా కలిశాను. సినిమా తెర మీద, రంగస్థలవేదిక మీద అంతకుముందే చూశాను. వెళ్లి పరిచయం చేసుకుని ‘ముళ్లపూడి వెంకటరమణగారి పాత రచనలు సేకరిస్తున్నాను. వాటి ఒరిజినల్స్ ఆయన దగ్గర లేవు. అవి వెతికేటప్పుడే చార్ దర్వేష్ తరహాలో మీరు  ఆంధ్రపత్రిక వీక్లీలో రాసిన కథలు చూశాను. అవి పుస్తకరూపంలో రాలేదు. మీ దగ్గర లేవా?’ అని అడిగాను.

ఆయన పోయేందుకు వారం రోజుల ముందు మాట్లాడినప్పుడు ‘నా రచనలన్నిటి మీద హక్కులు వేరేవారికి అమ్మేశానండి’ అని చెప్తూ వుంటే యీ కథల గురించి గుర్తు చేశాను. ‘రాసినట్లే గుర్తు లేదండీ’ అన్నారాయన. మామూలుగా ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. కానీ అప్పటికే 87 ఏళ్లు వచ్చేశాయి కాబట్టి మర్చిపోయారేమో! అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకుంటే బాగుంటుంది.

ఇంతకీ అవేళ అలా అడిగినప్పుడు ఆయన నవ్వుతూ ‘నేనూ, రమణగారూ నిరుద్యోగులుగా వుండేటప్పుడు ఒకే గదిలో వుండేవాళ్లం. మాతో పాటు ఇంకో అతనూ వుండేవాడు. అతనికి ఓసారి ‌డబ్బు అవసరం పడి మేం దాచుకున్న మా రచనలన్నీ చిత్తుకాగితాల వాడికి అమ్మేశాడు.’ అన్నారు. ఆ చెప్పడంలో ఏ మాత్రం కోపం, విసుగు, రోషం ఏమీ లేవు. అదే ఆయన స్టయిల్. 2001లో ‘‘హాసం’’ పెట్టిన నుంచి ఎంతో ఆత్మీయులమై అనేక మంది గురించిన అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఎవరి గురించి చెప్పినా యిదే ధోరణి. అస్సలు ఆవేశకావేషాలు కనబడేవి కావు. తన గురించి గొప్పలు వుండేవి కావు. డబ్బులు ఎగ్గొట్టినవారి గురించి, తనను నష్టపరిచినవాళ్ల గురించి క్రోధమూ వుండేది కాదు.

కరోనా సమయంలో ఆయనకు ఒక నిర్మాత 50 వేల రూ.లు ఆర్థికసాయం అందించారు అనే వార్త చదివి, చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, కొండలరావు గారి పరిస్థితి అంత దీనంగా వుందా? కాంతారావు, రాజనాలలా యీయనా గుఱ్ఱప్పందాలు ఆడి, ఆస్తులు తగలేసి, ఆఖరి దశలో అవస్థలు పడుతున్నారా? అని. ‘నాకు తెలిసి ఆయనకు ఏ వ్యసనాలూ లేవు. అయినా సినిమా నటులందరికీ ఊహూ డబ్బులిచ్చేయరు. 

చాలాకాలం పాటు సినిమాకు రూ.2500 యిచ్చేవారని ఓసారి చెప్పారు. 1980ల మధ్యకు వచ్చేసరికి ఏ 20 వేలో యిచ్చేవారట. 500 సినిమాల్లో వేశారు కాబట్టి, భార్యాభర్తా యిద్దరూ వేషాలు వేశారు కాబట్టి డబ్బు కురిసేసి వుంటుందని అనుకోకండి. ఓసారి మా యింటికి వస్తానన్నపుడు డ్రైవర్‌కు ఫోనివ్వండి, దారి చెప్తాను అంటే నాకు డ్రైవరెందుకండి? నేనే డ్రైవర్‌ని అన్నారాయన నవ్వుతూ. డబ్బు జాగ్రత్త మనిషి. మద్రాసులో అభిరామపురంలో యిల్లుంటే అది అమ్మేసి, కొంత కొడుక్కి యిచ్చి మిగిలినదానితో మా ‘హాసం’ ఆఫీసుకి దగ్గర్లోనే మోతీ నగర్‌లో త్రిబెడ్‌రూమ్ ఫ్లాటు కొన్నారు. ఆయన ఎలాటి దుస్థితిలోనూ లేరు.’ అని వాళ్లకు చెప్పి ఆయనకు ఫోన్ చేసి అడిగాను ‘ఎందుకు తీసుకున్నారండీ?’ అంటూ.  

‘ఆర్టిస్టులందరికీ యిచ్చారండి. అందరికీ ఐదేసి వేలు యిస్తూ వుంటే, కొండలరావుగారు పెద్దవారు కదా, 50 యిద్దాం, అదీ యింటికి వెళ్లి యిద్దాం అనుకున్నారు. వచ్చి యిచ్చినపుడు ఫోటోలు తీసుకున్నారు. పేపర్లో వేశారు. వేస్తారనుకోలేదు.’ అన్నారు నిర్లిప్తంగా. ‘వద్దనలేకపోయారా? మీ గురించి యిలా వినాల్సి వచ్చింది.’ అన్నాను. ‘వద్దనడం అంటే.. యిప్పుడు నాకు రెగ్యులర్ ఆదాయం ఏముంది చెప్పండి? వేషాలు లేవు కదా, ఇల్లుంది కానీ కొరుక్కుతినలేం కదా. కొడుకు మీద ఆధారపడడం నాకిష్టం లేదు. గౌరవంగా యిచ్చారు, పుచ్చుకున్నాను’ అని చెప్తూ విజయా నుండి రావలసిన రూ.5 లక్షలు పోయిన సంగతి చెప్పారు. ఉలిక్కిపడ్డాను, నాగిరెడ్డిగారు డబ్బు ఎగ్గొట్టడమేమిటి? అంటూ.

‘కావాలని ఎగ్గొట్టలేదు. వాళ్లకు మూడు సినిమాలు చేసినప్పుడు మేమంతా అంటే కొందరు టెక్నీషియన్స్‌మి, మాకు రావలసిన పారితోషికాలు తీసుకోలేదు. వాళ్ల దగ్గరే వుంచాం. ఇంతలో వాళ్ల మీద ఇన్‌కమ్‌ టాక్స్ రెయిడ్ అయింది. అంతా పోయింది. వాళ్లే అవస్థల్లో వున్నారు. ఇక మాకేం యిస్తారు? నాకు ఐదు లక్షలు పోయింది.’ అన్నారు. విన్న నాకే మనసు అదోలా అయిపోయింది. 1996లో 5 లక్షలంటే చాలా ఎక్కువే.  హైదరాబాదులో శ్రీనగర్ కాలనీ టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ వచ్చేది. కానీ ఆయన అతి సాధారణంగా, ఏ ఆక్రోశమూ లేకుండా, మేటర్ ఆఫ్ ఫాక్ట్‌లీగా చెప్పారు. అదీ కొండలరావు గారి కారెక్టరు. అది తెలియాలనే వ్యక్తిగతంగా చెప్పిన ఆర్థిక విషయాల గురించి కూడా చెప్పాను.

కళాకారులు చాలామందిలో అహంకారం చూస్తాం, నాకెంతో టాలెంటు వుంది, తగిన గుర్తింపు రాలేదనే ఆవేదన చూస్తాం. ఈయనలో అదేమీ వుండదు. సాటి కళాకారుల గురించి చులకనగా ఎప్పుడూ మాట్లాడరు. తెలిసీతెలియకుండా పిచ్చివాగుడు వాగిన నిర్మాతల గురించి (పాటకు హార్మనీ మీద ట్యూన్ కడుతున్న సంగీతదర్శకుడితో ఒక నిర్మాత ‘అంత సేపు ఎందుకు పడుతోందంటే, కాస్సేపు నల్లమెట్లు నొక్కుతున్నావు, కాస్సేపు తెల్లవి నొక్కుతున్నావు, ఏదో ఒకటి నొక్కు, త్వరగా అవుతుంది.’ అని విసుక్కున్నాడు) చెప్పినపుడు కూడా జోవియల్‌గా చెప్పేవారు.

ఆయన రంగస్థల, సినీ నటుడు, రచయిత మాత్రమే కాదు, సినీ చరిత్రకారుడు కూడా. మద్రాసు వెళ్లిన దగ్గర్నుంచి అందరి వద్దా సమాచారం సేకరించి గుర్తు పెట్టుకునేవారు, రాసి పెట్టుకున్నారేమో కూడా. 1963లో విజయవాడలో ప్రారంభించిన ‘‘జ్యోతి’’ సంపాదకవర్గంలో బాపు-రమణ-విఎకె-నండూరి లతో పాటు వుంటూ మద్రాసు నుంచి ‘సుకుమార్’ పేరుతో సినిమా వార్తలు పంపేవారు. ఆ రోజుల్లో కొడవటిగంటితో ఏర్పడిన పరిచయమే ‘‘విజయచిత్ర’’లో సంపాదకుడిగా ఉద్యోగం తెచ్చిపెట్టింది. 

తెలుగు సినిమా రంగమంతా (పాఠకులతో సహా) యిప్పటికీ ఆప్యాయంగా తలచుకునే ఆ పత్రికకు 26 ఏళ్లు పనిచేసి విజయాధిపతుల ఆదరాన్ని చూరగొన్నారు. ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి చూసి నాగిరెడ్డి గారి సంతానం నిర్మాతలుగా మారినప్పుడు యీయన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పెట్టుకున్నారు. ఎవరిలోనైనా వంకలు పెట్టగలిగే విఎకె రంగారావు గారు ‘నేను అసూయ పడే జర్నలిస్టు ఎవరైనా వున్నారా అంటే కొండలరావు ఒకడే’ అంటారు.

నటుడిగా వేషాలు తగ్గి మద్రాసు నుంచి వైజాగ్‌కు మకాం మార్చే సన్నాహాలు చేస్తూండగానే ఆంధ్రప్రభ వీక్లీ ఎడిటర్ వల్లూరి రాఘవరావు ఆయన చేత ‘‘బ్లాక్ అండ్ వైట్’’ అనే శీర్షిక రాయించారు. పాత సినిమాల కబుర్లు ఆయన చేత ఆసక్తికరంగా చెప్పించారు. ఇక అప్పణ్నుంచి ఆయన ఏదో ఒక పత్రికలో అలాటి శీర్షిక రాస్తూనే వున్నారు. ‘‘హాసం’’ పెడదామని అనుకున్నపుడు 2001లో ఆయన్ని కలిసి అడిగాం. ‘‘హ్యూమరథం’’ పేర నటీనటుల గురించి, షూటింగులో సరదాల గురించి ప్రతీ సంచికలోనూ ఆర్టికల్స్ రాసేవారు. ఎంతో ప్రజాదరణ పొందింది ఆ కాలమ్. తర్వాత ‘‘సితార’’లో ‘‘పాతబంగారం’’ పేర రాస్తూనే వున్నారు.

‘‘హాసం’’ ఆయనకు యిష్టమైన పత్రిక. ఆయనకు హాస్యం మాత్రమే కాదు, సంగీతంలోనూ అభినివేశం వుంది. సుకుమార్ ఆర్కెస్ట్రా అని నడిపారు. మా పత్రికలో ‘సంగీతా రహస్యాలు’ అని అప్పుడప్పుడు రాస్తూండేవారు. ఆయన గతంలో ఆంధ్రపత్రిక వీక్లీలో రాసిన ‘‘సినీతిచంద్రిక’’ అనే సీరియల్ నాకు చాలా యిష్టం. అసిస్టెంటు డైరక్టర్ల అవస్థల గురించిన ఆ హాస్యరచనను ‘హాసం’లో సీరియల్‌గా వేశాం. హాసం బుక్స్‌లో వేశాం. ఆయన హాసంకు ఎందరో సినీ ప్రముఖులను రచయితలుగా పరిచయం చేశారు. వైజాగ్‌లో వుండగా హ్యూమర్ క్లబ్ అని ప్రారంభించి విజయవంతంగా నడిపారు. వైజాగ్‌లో సాహితీసమావేశాల వాతావరణం, హాస్యవాతావరణం చాలా బాగుంటుంది. ఆడియన్స్ బాగా వస్తారు.

హైదరాబాదు వచ్చాక కొండలరావుగారు యిక్కడా హ్యూమర్ క్లబ్ పెడతానన్నారు. ‘‘హాసం’’ తరఫున మేము స్పాన్సర్ చేస్తామన్నాం. మొదటి సభకు చీఫ్ సెక్రటరీగా వున్న మోహన్ కందాగారిని పిలిచాం. డివి నరసరాజు గారు క్లబ్‌కు అధ్యక్షులు. డైరక్టరు విఎన్ ఆదిత్య తండ్రి సత్యప్రసాద్ గారు సెక్రటరీ. కొండలరావు గారు కన్వీనర్. కొంతకాలం బాగానే నడిచింది కానీ తర్వాత జనాలు రావడం తగ్గించేశారు. 

మొదటి సమావేశానికి కొండలరావు గారు తనను ప్రత్యేకంగా పిలవలేదని అలిగి మా ఎడిటరు గారు హ్యూమర్ క్లబ్ విశేషాలను హాసం పత్రికలో వేయనిచ్చేవాడు కాదు. మీరే స్పాన్సర్ చేస్తున్నపుడు నేను ప్రత్యేకంగా పిలవడం దేనికండి? మిమ్మల్నీ పిలవలేదు కదా అన్నారు కొండలరావు గారు. తక్కిన అన్ని పత్రికల్లో వస్తోంది కానీ హాసంలో రావడం లేదని అందరూ అడుగుతున్నారని బాధపడేవారు. చివరకు హ్యూమర్ క్లబ్ కార్యకలాపాలు నీరసించడంతో అప్పుడు ‘‘హాసం క్లబ్స్’’ అని 2004లో అనేక ఊళ్లలో ప్రారంభించాం. నెలనెలా కార్యక్రమాలుంటాయి. పత్రిక మూసేసినా క్లబ్స్ కంటిన్యూ అయ్యాయి.

హైదరాబాదు హాసం క్లబ్‌లో ఆయనకు సన్మానం చేశాం. రాజమండ్రి హాసం క్లబ్ వారు ఓ వార్షికోత్సవానికి రకరకాల హాస్యం మీద రోజంతా సెమినార్ పెట్టారు. కొండలరావు గారు ఓ సబ్జక్ట్ మీద మాట్లాడారు. అప్పుడు ఆయన్ను రాజమండ్రిలో ఓ హోటల్లో బస చేయించాం. ఆయన రూమ్మేట్‌గా మా హాసం క్లబ్స్ స్టేట్ కన్వీనర్, మిత్రులు ఎస్.వి.రామారావు గారున్నారు. రామారావు గారికి రాత్రి కాస్త మందు వేసే అలవాటుంది. ఈయనకు లేదు. 

మర్నాడు పొద్దున్న రామారావు గారు ‘‘కార్యక్రమం ప్రారంభమయ్యే లోపున దగ్గర్లో మందపల్లి శనీశ్వరుణ్ని చూసి వద్దామా?’ అని అడిగారు. ఈయన వెంటనే ‘మీరే మందేశ్వరులు, వేరే ఎవర్నో చూడడం దేనికి?’ అని చమత్కరించారు. అలా అలవోకగా, ఆశువుగా జోకులు వేయడం, యితరులను అనుకరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నేను అనేకమంది కమెడియన్స్‌ను చూశాను. వాళ్లు తెరమీద నవ్వించగలరు కానీ బయట గొప్పగా మాట్లాడలేరు. కొండలరావుగారు బయట నవ్వించినంతగా తెరపై నవ్వించలేరని నా అభిప్రాయం. ఆయనతో కబుర్లు చెపుతూంటే గంటలు గంటలు గడిచిపోతాయి.  

2004 డిసెంబరులో హాసం పత్రిక మూసేసిన తర్వాత హాసం బుక్స్ వేశాం. ఆయన రాసిన మూడు పుస్తకాలు వేశాం. ముళ్లపూడి వారి ఆత్మకథ ‘‘కోతికొమ్మచ్చి’’ పుస్తకావిష్కరణ సమయంలో ఆయన చేత తెలుగు మాస్టారు పాత్రతో కార్యక్రమం పెట్టాం. అంతకు చాన్నాళ్ల క్రితం ‘బాపూరమణీయం’ విజయవాడలో రిలీజైనప్పుడు బాపురమణలకు పొగడ్తలు యిష్టం వుండవు కాబట్టి, కొండలరావు గారి చేత తెలుగు మాస్టారి వేషం కట్టించి, తమను తాము తిట్టించుకున్నారు. అదే ట్రిక్కు మేమూ ప్లే చేశాం. బాగా పండింది. 

కొండలరావు గారు సినిమాలో, నాటకాలలో యువ పాత్రలలో తప్ప, వేరే ఏ పాత్రలోనైనా యిట్టే యిమిడిపోగల కారెక్టర్ ఆర్టిస్టు. ధనికుడి నుంచి పేదవాడి దాకా, పురోహితుడి నుంచి తాగుబోతు దాకా ఏదైనా సరే. అదే ఆయనకు ఒక విధంగా మైనస్ అయింది. ఫలానా పాత్రకి కొండలరావు గారు తప్ప వేరెవ్వరూ పనికి రారు. ఎంత ఖర్చయినా సరే, ఆయన్నే పిలిపించాలి అనుకునే పరిస్థితి రాలేదు.

తొలిదశలో రమణగారు తను రాసే సినిమాల్లో ఆయనకు వేషాలు రికమెండ్ చేసేవారు. ‘‘ప్రేమించి చూడు’’ సినిమాలో వేషం ఆయనకు టైలర్‌మేడ్. తాము సొంతంగా సినిమాలు తీయనారంభించాక ఆయనకు వేషం వుండేట్లు చూసేవారు. ఈయన వివాదరహితుడు కాబట్టి ఎవరి క్యాంప్‌లోనూ వుండేవారు కారు. వేషాల కోసం మెరమెచ్చు మాటలు చెప్పడం, అక్కడ మాటలు యిక్కడికి మోయడం యిలాటివి లేవు. వేషం యిస్తే బుద్ధిగా వేసుకుని వచ్చేయడం అంతే. అందుకే అందరూ యీయన్ని ఆదరించారు, గౌరవంగా చూశారు.

ఒకసారి సభలో ఆయన ఎదురుగా ప్రసంగిస్తూనే చెప్పాను ‘కొండలరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక విద్యలు వచ్చు. కానీ అన్నిటికంటె అతి కష్టమైనది, క్లిష్టమైనది ‘‘విజయచిత్ర’’ సంపాదకత్వం’’ అని. ఎందుకంటే 1966 జులైలో ఆ పత్రిక ప్రారంభమై యీయనికి సంపాదకత్వం ఆఫర్ చేసినప్పుడు యీయన కాస్త జంకారు. అప్పుడప్పుడే వేషాలు వస్తున్నాయి, పత్రికాఫీసులో వచ్చి కూర్చుంటే వేషాలు పోతాయేమోనని భయపడ్డారు. ‘మాది మాసపత్రిక. తీరిక వేళలో వచ్చి శీర్షికలు రాసేసి, యిచ్చేసి, మీ వేషాలు మీరు చూసుకోండి. 

లే ఔట్ అదీ తక్కిన వాళ్లు చూసుకుంటారు.’ అన్నారు నాగిరెడ్డి. ఈయన ఒక్కోప్పుడు షూటింగ్ గ్యాప్స్‌లో మేకప్‌తోనే స్కూటర్ మీద వెళ్లి రాసి యిస్తూండేవారట. ఆ పత్రిక కోసం ఎన్నో కొత్త రకాల శీర్షికలు ప్రవేశపెట్టారు. ‘విచి’ పేరుతో సినిమా రంగంలోని వివిధ శాఖలను పరిచయం చేసేవారు. పుస్తకం రిచ్‌గా వుండేది. పాత సంచికలు దొరికితే చూడండి. కంటికి, మనసుకి చాలా ఆహ్లాదకరంగా తోస్తుంది. అది లక్ష కాపీల సర్క్యులేషన్ వరకు చేరింది. సినీ వారపత్రికలు వచ్చిపడడంతో నెలకోసారి వచ్చే దీనికి డిమాండ్ పడిపోయింది.

దానిలో యీయన ఎన్నో సినిమాల స్క్రిప్టులు రాశారు. నాగయ్యగారికి స్వీయచరిత్ర రాసిపెట్టారు. దానిలో ఆయన రెండో పెళ్లి ఘట్టాన్ని చాలా సుతారంగా డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ మాట ఆయనతో అంటే ‘చెప్పిన విధానాన్ని నాగయ్యగారూ మెచ్చుకున్నారండీ’ అన్నారు. నిజానికి ఓ పక్క సినిమాలో వేషాలు వేస్తూ సినిమా పత్రికకు సారథ్యం వహించడం కష్టం. ‘మన సినిమా గురించి మీ పత్రికలో న్యూస్ రాయవచ్చుగా, మన స్టిల్స్ వేయవచ్చుగా’ అని నిర్మాతలు పెట్టే మొహమాటాలను లౌక్యంగా తప్పించుకోవడం యిబ్బందే. ఏదైనా సినిమా షూటింగ్ దృశ్యం ఫోటో వేస్తే పబ్లిషరు ‘ఏవయ్యా, నీకు వేషం యిస్తారని వేశావా? నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నావా?’ అనవచ్చు. కత్తిమీద సాము లాటి ఆ ఉద్యోగాన్ని ఆయన 26 ఏళ్ల పాటు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

సినీజీవితపు అనుభవాలతో, యితర నటీనటుల సినీజీవితాలలోని హాస్యఘట్టాలతో ఆయన రాసిన ‘‘హ్యూమరథం’’ శీర్షిక జనాదరణ పొందడంతో దాన్ని హాసం బుక్స్‌లో రెండు భాగాలుగా వేశాం. ఆయన దగ్గర అనేక సినిమాల స్టిల్స్ వున్నాయి. కానీ పత్రిక నడిపే రోజుల్లో ఎడిటర్ గారి మీద నమ్మకం లేక ఆయన యివ్వలేదు. పత్రిక మూతపడ్డాక నామీద నమ్మకంతో అవన్నీ నాకు యిచ్చారు. ఆ స్టిల్స్‌ వేయడం వలన పుస్తకాలకు చాలా అందం వచ్చింది. వాటిల్లోంచి చాలా ఉదంతాలను పత్రికలు ఎత్తి వేసుకున్నాయి. పుస్తకాలు పునర్ముద్రణలు పొందాయి. 

మొదటి దానిలో ఆయనే ఉదంతాలుగా రాసినవి ఉంటాయి. రెండో దానిలో ఆయన హాస్య నటుల జీవితచిత్రణ వుంటే దాన్ని నేను ఉదంతాలుగా విడగొట్టి మరీ వేశాను. ఆ ప్రజంటేషన్ ఆయనకు బాగా నచ్చింది. హ్యూమరథం మొదటి భాగం విడుదల గుమ్మడి వెంకటేశ్వరరావుగారి చేతుల మీదుగా జరిగింది. ఆ సభలో మా యిద్దరి మధ్య బహిరంగంగా జరిగిన చర్చ గురించి, ఇటీవలి కాలంలో ‘‘మిసిమి’’ పత్రిక మమ్మల్నిద్దర్నీ ఎలా యిబ్బంది పెట్టిందో వాటి సంగతి వచ్చే వ్యాసంలో రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×