Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: దర్శకుడిగా కొండలరావు

ఎమ్బీయస్: దర్శకుడిగా కొండలరావు

రావి కొండలరావు గారు ‘‘హాసం’’ పత్రికలో ‘‘హ్యూమరథం’’ శీర్షిక నడిపారని చెప్పాను కదా. 15 రోజుల కోసారి ఒకటి రాయాలి. హాస్యంగా వున్నదే రాయమని మా పట్టుదల. ‘ప్రతీసారీ హాస్యంగా ఏం రాస్తామండీ? ఈ సారికి వదిలేద్దాం’ అనేవారాయన. ‘కాదూ, కూడదు గట్టిగా ఆలోచించి, గుర్తు తెచ్చుకోండి’ అని మేం పట్టుబట్టేవాళ్లం. అగ్రనటుల గురించి ఏదైనా వుంటే రాయండి అంటే ‘మనలో మనం అనుకోవచ్చు కానీ రాస్తే బాగుండదు’ అనేవారు. గట్టిగా పట్టుబట్టగా కిందది రాసిచ్చారు. ఎన్టీయార్‌కు దర్శకుడిగా వున్న అలవాటేమిటంటే – యాక్టరు టేక్ చేయడానికి యిబ్బంది పడుతూంటే ‘టేక్ యువర్ ఓన్ టైమ్’ (కావలసినంత సమయం తీసుకోండి) అనేవారట గ్రాండ్‌గా. ఉత్తరక్షణంలోనే ‘షాట్ రెడీ’ అనేవారట, ప్రిపేర్ కావడానికి టైమివ్వకుండా. ఆయన దగ్గర టైము వేస్టు చేయడమంటే అందరికీ భయం.

‘‘వరకట్నం’’ సినిమాలో కొండలరావుగారు ‘మహాప్రభో’ అనే ఊతపదంతో విలన్ దగ్గర పొగడ్తలు పొగిడేవాడిగా పాత్ర వేసి చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాని షూటింగు సందర్భంగా తనని తనే వెక్కిరించుకుంటూ రాసిన రచన యిది. చదవండి. ఎన్టీయార్ బయట మాట్లాడే పద్ధతిని అక్షరరూపంగా ఎలా అనుకరించారో గమనించండి. పెద్దసైజు అరటిపళ్ల గురించి కామెంట్ మిస్ చేయకండి.

టేక్‍యువర్‍ ఓన్‍ టైమ్‍.. రెడీయా?

ఎన్‍.టి. రామారావు ‘వరకట్నం’ (1968) సినిమా తీశారు. ఆయనే దర్శకుడు. రామారావు గారి పక్కన ఇతర చిత్రాల్లో వేషాలు వేస్తూన్నానుగాని, ఆయన సొంత సినిమాలో వెయ్యలేదు. నాది భట్రాజు పాత్ర. ‘ఎన్‍ఎటిలో వేషం’ అంటే  అదో గొప్ప! దాంతో నాకు కంగారు!

ఓ రోజు ఇన్‍డోర్‍లో పెద్ద సెట్టు. ఆ సెట్లో రాజనాల, సత్యనారాయణ అరటిపళ్లు తింటుంటే నేను పెద్ద డైలాగు చెబుతూ, రావాలి. ముందుగా డైలాగ్సు ఇచ్చారుగాని, ఏది తర్వాత తీస్తారో, ఏది ముందో తెలీదు...

‘‘బ్రదర్‍....రండి....ఆ రెండో పేరా చెప్పండి’’ అన్నారు దర్శకులు.

రెండోపేరా! అది చూసుకోలేదే... మొదటిది తీసిన తర్వాత కదా, రెండోది తీస్తారు...

‘‘ఏమ్‍ రెడీయా?’’ అన్నగారు.

‘‘ఒక్కసారి చూసుకుంటాను’’ నేను.

‘‘టేక్‍యువర్‍  ఓన్‍  టైమ్‍.. రెడీయా?’’

ఏం రెడీ... అరపేజీ డైలాగుంది.. అంతలో ఎలా వస్తుంది?....

‘‘లైట్స్.. రెడీ.. రండి.... అక్కడినుంచి చెప్పుకుంటూ ఇక్కడి దాకా రండి’’

ఇప్పటిలాగా అప్పుడేమన్నా ప్రామ్టింగ్‍లా? డైలాగ్‍ రికార్డింగ్‍ అంతా అక్కడే... తప్పులు పలకడానికి లేదు. నాకొక్క ముక్క రాలేదు...

‘‘రండి...రిహార్సల్‍...’’

ఏదో చెప్పుకుంటూ వచ్చాను..

‘‘ఇట్నుంచి, ఇలా ఈ లైట్‍లో రండి’’ అన్నారు కెమెరామేన్‍.

అదొకటా! డైలాగే సరిగా చెప్పనా.... లైటింగ్‍ కోసం దారే వెతుక్కోనా..

డైలాగు రెండు వాక్యాలే నోటికొచ్చింది. తర్వాత బండి ఆగిపోతోంది.

‘‘ఏమ్‍ ! చదువుకోలేదా...! ముందుగా చూశారు కదా సీను?’’

‘‘చూశాను ..అదీ.. ఇంకా .. నోనో... నోటికి...’’ నత్తొచ్చింది నాకు.

లైట్స్ ఆఫ్‍ అన్నారు. చూసుకోండి అన్నారు. వెంటనే రెడీ అన్నారు. నిదానం, నిర్భయం అయితే డైలాగు నోటికి వచ్చేస్తుంది గాని, ఇలా కంగారుపడిపోతూ వుంటే ఏం వస్తుంది? పైగా సత్యనారాయణ, రాజనాలలకి డైలాగ్‍ లేదు...స్వేదజలంతో నాకు స్నానం...లైట్లు వెలిగాయి...మరీ వేడి...

‘‘టేక్‍ వన్‍’’ క్లాప్‍ కొట్టారు.

‘‘బ్రదర్‍ రండి.....’’

వచ్చాను. డైలాగు రెండు వాక్యాల తర్వాత మూడో వాక్యం పెగల్లేదు. ‘‘ప్పెప్పెప్పె’’ అన్నాను.

‘‘కాట్‍’’ అన్నారు .. అంతే! వన్‍మోర్‍..

‘‘మామాజీ!.. సత్యనారాయణా.. అరటిపండ్లు బాగా తినాలి. ఒలుచుకుని తినడం కనిపించాలి.. ప్రొడక్షన్‍ వాల్యూ కోసం పెద్దసైజువి తెప్పించాను’’ అన్నారు రామారావు.

‘‘అలాగే సార్‍’’ అన్నారా ఇద్దరూ....కథ  ముందుకి జరగడంలేదు.

డైలాగ్‍ బండి ఎక్కడో దగ్గిర బ్రేక్‍ కొడుతోంది....

‘‘టేక్‍ సిక్స్’’ అన్నారు...‘‘సెవెన్‍’’ అన్నారు.

నేను అలిసిపోయాను. నాకంటే అలిసిపోయారు పెద్దాయన. అరటిపళ్లు టేక్‍ టేక్‍కీ తినలేక అలిసిపోయారు ఆ ఇద్దరూ.

రాజనాల తన దగ్గరికి నన్ను పిల్చి రహస్యంగా ‘‘తొందరగా ఓకే చేయించవయ్యా నాయనా... ఇప్పటికి ఏడు అరటిపళ్లు తిన్నాం. నువ్వు టేకులు, మేమూ అరటిపళ్లు తినడమే తినడం! పొట్టపగిలి చస్తాం’’ అన్నారు. అసలే నేను నా గ్రహాల్ని  నిందించుకుంటూ వుంటే  వీళ్ల బాధ వీళ్లదీ!

‘‘రెడీయా?..టచప్‍..’’

టచప్‍ చేసుకుంటూ, లోలోపల సంభాషణ మననం చేసుకుంటూ ‘‘రెడీ’ అనడం- మధ్యలో ఆగిపోవడం!

...‘‘టేక్‍ లెవెన్‍’’ అన్నారు. అది వినగానే, పంచప్రాణాల్లోనూ రెండు ప్రాణాలు తమని కాపాడుకోడానికన్నట్టు పారిపోయాయి. ఒక్కో నెంబరు అనౌన్సు చేస్తూంటే  ఈ శరీరం మీద ఔన్సుల కొద్దీ స్వేదం..! కుదరడంలేదు. ఎన్ని టేకులయినా ఇది వచ్చేలా లేదు.

‘‘బ్రదర్‍ కాల్‍షీటు టైమ్‍ వేస్టవుతోంది... ఫిలిమ్‍ చార్జవుతోంది.... ఫిలిమ్‍ ఖరీదు ఎంతో మీకేమైనా తెలుసా?’’ పెద్దాయనకి విసుగు. ఓర్పు నశిస్తోంది.

‘‘సారీ.. అన్నగారు.. నన్ను క్షమించండి... ఎక్కడ పోతోందో ఎందుకు పోతోందో.. నావల్ల కావడంలేదు.. ఒక్క పావుగంట.. నన్ను....’’  నా  ఏడుపుమొహం చూసి, అన్నగారు నవ్వుమొహం పెట్టారు.. ‘‘ఇట్సాల్‍ రైట్‍...టైమెంత ?’’ అన్నారు.

‘‘ఐదు’’ అన్నారెవరో.

‘‘ఆరుగంటలకి బ్రేక్‍ చెయ్యాలి. బ్రదర్‍ కోసం గంట ముందు బ్రేక్‍ చేద్దాం.. బ్రదర్‍, మీరెవరితోనూ కలవకండి. ఆ మూల  కూచోండి. మీకు టిఫిను అక్కడికే పంపిస్తాను. డైలాగు పూర్తిగా కంఠతా పట్టండి... ఓకే?’’ అభయహస్తం కనిపించింది. 

టిఫిను కూడానా నాకు? విందుభోజనం లభించిందే!

రామారావుగారు దగ్గరకొచ్చారు. ‘‘వాటీజ్‍ ది డిఫికల్టీ? ...ఏమైంది మీకు? పేజీల డైలాగులు అనర్గళంగా వూదేస్తారే.... ఏం జరిగిందిక్కడ?’’ అన్నారు చిన్న పిల్లాడిని బుజ్జగిస్తున్నట్టు.

మాస్టారి దగ్గర విద్యార్థిలా భయపడుతూ చెప్పాను.

‘‘డోంట్‍ వర్రీ - చూస్కోండి’’ అన్నారాయన. చూసుకున్నాను. రెడీ అనిపించి చెప్పాను.

బ్రేక్‍ కాగానే టేక్‍ చేశారు. మళ్లీ మొదలు పెట్టిన తర్వాత, ఫస్ట్ టేక్‍ ఓకే. అప్పుడు గాని పారిపోయిన రెండు ప్రాణాలు తిరిగి ఈ గూటికి చేరుకోలేదు. ఓరీ బాబోయ్‍, ఏం టెన్షను అందరికీ నా వల్ల.

‘‘రామారావు గారి సినిమా షూటింగంటే ముందురోజు రాత్రే మొదలవుతుంది దడ’’ అని రామలింగయ్య గారు చెప్తే ఏమిటో అనుకున్నాను. అనుభవిస్తే గాని తెలియలేదు. అవునుమరి. అన్నింటిలోనూ కచ్చితం పాటిస్తారు కదా రామారావు గారు!

ఈ పుస్తకం చాలా అందంగా వచ్చింది. దాని ఆవిష్కరణ సమయంలో కొండలరావుగారు మాట్లాడుతూ ‘‘హాసం’’ చాలా మంచి పత్రిక. ఎందుకు మూతపడిందో ఆశ్చర్యంగా వుంది. మళ్లీ ప్రారంభిస్తే మేమందరం సహకరిస్తాం.’’ అంటూ మాట్లాడారు. దాంతో వేదిక మీద ఉన్న వరప్రసాద్ చాలా అపాలజిటిక్‌గా సమాధానం చెప్పారు. నేను అప్పటికే మాట్లాడివున్నా మళ్లీ మైకు తీసుకుని ‘‘మాకు రచయితల సహకారం ఎప్పుడూ వుంది. కానీ ప్రకటనదారుల సహకారమే లేదు. దానికి కారణం తగినంతమంది పాఠకులు పుస్తకాలు కొనకపోవడమే. ఈ విషయం విజయచిత్రకు సంపాదకత్వం వహించిన కొండలరావు మర్చిపోయి ఆశ్చర్యపడడం వింతగా వుంది. పబ్లిషింగ్ రంగంలో దిట్టలై ‘‘చందమామ’’ను దిగ్విజయంగా నడుపుతున్న విజయా వాళ్లు ‘విజయచిత్ర’ను ఎందుకు మూసేశారో చెప్పమనండి. వారం వారం వచ్చే సినిమా పత్రికల పోటీ తట్టుకోలేక అంటే మీరూ వారం వారం తేవచ్చు కదా. ‘ఇండియా టుడే’ పక్షపత్రికగా వుండేది. ‘ఔట్‌లుక్’ వారపత్రికగా వచ్చి పోటీ యిచ్చేసరికి యిదీ వారపత్రికగా మారింది. ‘విజయచిత్ర’ తమిళ వెర్షన్ ‘బొమ్మయ్’ను మాసపత్రికగానే కొనసాగించారు కదా! దీన్నెందుకు మూసేశారు?

‘‘..కారణం ఏమిటంటే తమిళ పాఠకులు పత్రికలు కొని చదువుతారు, తెలుగువారు కొని చదవరు. హాసం ఆన్‌లైన్ ఎడిషన్ ఫ్రీగా అయితే చదివేవారు. చందా కట్టమంటే కట్టేవారు కారు. (ఇప్పటికీ నేనేదైనా పుస్తకం గురించి రాయగానే నెట్‌లో ఫ్రీ డౌన్‌లోడ్ ఎక్కడ చేసుకోవచ్చు అని చాలామంది మెయిల్స్ రాస్తారు) పత్రికల అమ్మకాలు తృప్తికరంగా లేవు కాబట్టి ఎడ్వర్టయిజర్స్ టీవీలకు ప్రకటనలు యిస్తారు తప్ప పత్రికలకు యివ్వరు. అందుకే తెలుగు పత్రికలు ఏవీ బతికి బట్టకట్టడం లేదు. స్వాతి వీక్లీ ఒక్కటే బాగా నడుస్తోంది. స్వాతి మంత్లీకి కూడా ప్రకటనలు తగినంతగా లేవు. అయినా వీక్లీ బలం మీద ఆయన నడుపుతున్నారు. కొండలరావు గారు నడిపిన ‘‘వనిత’’ కూడా మూతపడిందని యీ విషయంలో గుర్తు చేసుకోవాలి.’’ అని రిటార్టు యిచ్చాను. ఆయన నవ్వుతూ ‘ఔనౌను, మీరు చెప్పినది నిజమే’ అనేశారు.

నా పాఠకుల్లో ఒకాయన రాస్తూంటాడు, ‘‘హాసం’’ పత్రిక నడపలేనివాడివి, నువ్వూ మోదీ గురించి రాయడమేనా?’ అని. ‘ఇంత లావున్నావు, తేలుమంత్రం రాదా?’ అని వెక్కిరించాడట వెనకటి కొకడు. ‘అరబిక్ భాష రాదు కానీ అభిప్రాయం రాసేశావే!’ అని ఆయన్ని మరొకాయన హేళన చేయవచ్చు. దానికీ, దీనికీ ఏం సంబంధం అంటే, నా రాజకీయవ్యాసాలకు, నా హాస్య-సంగీత పత్రికా నిర్వహణకు (లేదా నిర్వాకానికి) సంబంధం వుందా? అలా ముడిపెట్టి చెప్పడం మొదలుపెడితే ‘‘జయంతి’’ పత్రిక నడపలేకపోయారని విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలనూ తీసి పారేయవచ్చు. ‘‘న్యూస్‌టైమ్’’, నడపలేక మూసేసినవాడివి, నీకెందుకయ్యా ఈనాడు ఎడిటోరియల్స్‌లో పెద్ద నీతులు రాస్తావ్ అని రామోజీరావుగారిని అనవచ్చు. నవ్య వీక్లీ మూసేసినవాడివి వారంవారం కొత్త పలుకెలా రాస్తావయ్యా అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ననవచ్చు. ఆంధ్రభూమి డైలీ, వీక్లీ, మంత్లీ నడపలేనివాడివి అంటూ డెక్కన్ క్రానికల్‌ను, ఆంధ్రప్రభ వీక్లీ మూసేసినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను యీసడించవచ్చు.

డబ్బు పెట్టి పత్రికలు కొనడం తెలుగు పాఠకులు నేర్చుకోనంతకాలం పత్రికా వ్యాపారం యింతే అని రూ.35 లక్షల పెట్టుబడి నష్టపోయిన వరప్రసాద్‌కు, 28 సం.ల కెరియర్ వదిలి (నా రచనాకౌశలంపై నమ్మకంతో 50 వ ఏట కెరియర్ మార్చుకుని కార్పోరేట్ కమ్యూనికేషన్స్ వైపు మళ్లాను తప్ప బ్యాంకు ఉద్యోగం చేయలేక మానేయలేదు. ఈనాటి సాఫ్ట్‌వేర్ యింజనియర్లలో 50 ఏళ్ల తర్వాత కూడా యాక్టివ్‌గా ఎంతమంది వుండగలరో, వేరే రంగంలో ఏ మేరకు రాణించగలరో తెలియదు) ప్యాషన్‌తో దీనిలోకి దిగిన నాకూ అర్థమైంది. హాసం ఆర్థికంగా విజయం సాధించకపోవచ్చు కానీ ఖ్యాతి చాలా గడించింది. పత్రిక నడవనందుకు తెలుగువాళ్లగా, హాస్యసంగీతప్రియులుగా వరప్రసాదూ, నేనూ బాధపడతాం తప్ప యితరత్రా మాకు ఫిర్యాదులు లేవు. ఎందుకంటే పత్రిక ఆగిపోయింది కానీ ‘హాసం’ పుస్తకాల వ్యాపారం దిగ్విజయంగా నడుస్తోంది. ‘హాసం’ క్లబ్స్ కూడా నడుస్తున్నాయి. పత్రిక డిజిటల్ సంచికలు యిప్పటికీ ఇంటర్నెట్‌లో పాప్యులరే. మూసేసి 16 ఏళ్లయినా దాని సంచికల కోసం అడుగుతూనే వుంటారు. వారి కోసం లింకు యిస్తున్నాను. https://archive.org/details/HasamTelugu/

ఇక కొండలరావు గారి విషయానికి వస్తే ఆయనకు టాలెంటు ఎంతో వుంది కానీ రావలసినంత పైకి రాలేదు. మా పిల్లలను ఆరుద్ర గారింటికి తీసుకెళ్ల్ ఆయన ఎంత పండితుడో చెప్పాను. ముళ్లపూడి వారింటికీ తీసుకెళ్లి ఆయన ఘనత చెప్పాను. వాళ్లకి అప్పుడు పదేళ్ల లోపు వయసు. ‘ఆరుద్రగారు మహా పండితుడన్నావు, ఆయన యిల్లు సామాన్యంగా వుంది, మరి ముళ్లపూడి వారిది యింత గొప్పగా చెక్కమెట్లతో సహా వుంది. ఎందుకని?’ అని అడిగారు వాళ్లు. ‘సాహసం’ అని జవాబిచ్చాను నేను. ముళ్లపూడికి కష్టపడే స్వభావంతో బాటు రిస్కు తీసుకునే లక్షణం వుంది. అందుకే ఆయన నిర్మాతగా కూడా ఎదిగారు. కొండలరావుగారు ఏదైనా ఉద్యోగం చేసినట్లే చేశారు కానీ పట్టుదల తక్కువ. పైగా ఆయనకు ఏదైనా చేపడితే కొసదాకా యింట్రస్టు నిలవదు. ఉపన్యాసాలు ఒక్కోప్పుడు బాగా యిస్తారు, ఒక్కోప్పుడు ప్రిపేరై రాక, నిరాశ కలిగిస్తారు.

మద్రాసులో లజ్ కార్నర్‌లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన బులుసు సాంబమూర్తిగారి యిల్లుంది. దాన్ని పొట్టి శ్రీరాములు స్మారకమందిరంగా మార్చారు. అక్కడ తెలుగు కార్యక్రమాలు చాలా జరుగుతూంటాయి. చాలామంది సినీ ప్రముఖులు సామాన్య ప్రేక్షకులుగా వచ్చి కూర్చుంటూ వుంటారు. ఓ ఆదివారం మధ్యాహ్నం రేడియో నాటకాల గురించి రావి కొండలరావు గారు మాట్లాడతారంటే వెళ్లాను. కొండలరావు గారు వాటి గురించి ఏం మాట్లాడతాం అంటూ తేల్చేశారు. ఏమీ మాట్లాడలేదు. 8 కి.మీ.ల దూరం నుంచి వెళ్లిన నేను ఉసూరుమన్నాను. నాబోటి వాళ్ల మనోభావాలను అధ్యక్షులుగా వున్న డివి నరసరాజుగారు చదివినట్లున్నారు. ‘ఇతనింతే, ఒక్కోప్పుడు యిలా చేస్తాడు, ఆగండి నేను నా అనుభవాలు చెప్తాను’ అంటూ అనేక జోకులు కూడా చెప్పి, మా బోటి వాళ్లకు కిట్టుబాటు చేశారు.

ఆ సందర్భంలోనే ‘కొండలరావుకి కుదురు లేదు, నేను బిఎన్ రెడ్డిగారి దగ్గర, యితరత్రా ఉద్యోగాలు యిప్పించినా పనేమీ చెప్పటం లేదంటూ మానేసేవాడు. జీతం యిస్తున్నారు కదయ్యా, వెళ్లి కూర్చో అని చెప్పినా వినేవాడు కాదు. రాధాకుమారిని పెళ్లి చేసుకున్నాకే కుదురు వచ్చింది.’ అంటూ వ్యాఖ్యానించారు. కొండలరావు గారు కూడా ఔనంటూ తలూపారు. వచ్చిన దానితో తృప్తి పడి ఊరుకోవడం, పెద్దగా తాపత్రయ పడకపోవడం ఆయన స్వభావం. చెప్పాలంటే రాధాకుమారి గారికి యాంబిషన్ వుంది కానీ యీయనకు లేదు. అలాటి కొండలరావు గారు చిత్తశుద్ధితో, శ్రమ, శ్రమ కనబరుస్తూ చేసిన గొప్ప పని ‘‘కన్యాశుల్కం’’ టీవీ సీరియల్.

‘‘కన్యాశుల్కం’’ చాలా పెద్ద నాటకం కావడంతో, రంగస్థలం మీద దానిలో కొంతవరకే ప్రదర్శించేవారు. సినిమాలో కథ అసంపూర్ణం, ముగింపు మార్చేశారు. నాటకం ఉత్తరార్థంలో చాలా డ్రామా, మంచి హాస్యం వుంటుంది. పుస్తకం చదవకపోతే అది తెలియదు. ఈయన అక్షరం కూడా మార్చకుండా, పూర్తిగా, అసలైన లొకేషన్స్‌లో, అప్పటి వాతావరణంలో తీయాలని పట్టుబట్టి చేశారు. ఆయనకు ఓ మంచి నిర్మాత దొరికారు. ఎన్నో విషయాల గురించి పరిశోధన చేసుకుని, నటీనటులందరి దగ్గరా మంచి నటన రాబట్టి తీశారు. తను చిన్న వేషం వేశారంతే. సినిమాల్లో ఆయన ఓవరాక్టింగ్ చేయరు, దర్శకుడిగా నటుల చేతా చేయించలేదు.

గిరీశం పాత్రలో గొల్లపూడి అద్భుతంగా నటించినా ఆ పాత్రకు ఆయన వయసు ఎక్కువై పోవడం ఒక్కటే మైనస్ తప్ప, యితరత్రా చాలా బాగా వుంది ఆ సీరియల్. ‘‘మీరు సినిమాల్లో అసిస్టెంట్ డైరక్టరుగా పనిచేశారని తెలుసు కానీ మీ దర్శకత్వ ప్రతిభ గురించి అవగాహన లేదు. నాటకాలు డైరక్ట్ చేసినా దానిలో కెమెరా యాంగిల్స్ అవీ వుండవు. ఇది చూశాక మీ దర్శకత్వ ప్రతిభకు జోహార్ అనాల్సిందే.’’ అని చెప్పానాయనకు. వేషాలు వస్తూ వుంటే, మళ్లీ దర్శకత్వం వైపుకి వెళ్లలేదాయన. వెళ్లి వుంటే బాగుండేది. నా దృష్టిలో ‘‘కన్యాశుల్కం’’ ఆయన కెరియర్‌కి కలికితురాయి.

చివరగా –‘‘మిసిమి’’ వ్యవహారం. ‘‘మహానటి’’ సినిమా చూశాక నేను 2018 జూన్ 5న ‘‘జెమినీ గణేశన్ కెరియర్’’ అనే వ్యాసం గ్రేట్ ఆంధ్రలో రాసి సినిమాలో అతని పాత్రను ఎంత వక్రీకరించానో వివరించాను. https://telugu.greatandhra.com/articles/mbs/gemini-ganesh-career-90852.html. అది చాలా పాప్యులర్ అయిపోయి, వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఈ కొట్టడంలో మధ్యలో ఎవరో ప్రబుద్ధుడు ఆ వ్యాసానికి ముందు ‘రావి కొండలరావు గారు రాసిన యీ వ్యాసం చాలా బాగుంది. చదవండి.- ఎమ్బీయస్ ప్రసాద్’ అని చేర్చాడు. నా మీద కోపమో ఏమో, నన్ను రైటర్‌గా కాక, ప్రెజంటర్‌గా మార్చేశాడు. ఆ వాట్సప్ ‘‘మిసిమి’’ అనే పత్రిక ఎడిటోరియల్ స్టాఫ్‌కు చేరింది. ఆయన ఎడిటరుకు పంపారు. రావి కొండలరావుగారు వాళ్లకు కంట్రిబ్యూటర్. చేత్తో రాసి పంపుతారు తప్ప, వాట్సాప్‌లలో పంపరు. మీరు రాశారా, వేసుకోమా? అని ఒక్కమాట అడగకుండా తమ జులై 2018 సంచికలో ‘‘మహానటి-మరి కొంత సమాచారం’’ పేర ఆ వ్యాసాన్ని ఆయన పేర వేసేశారు.

అది చదివి తనికెళ్ల భరణి చాలా ముగ్ధులై పోయి కొండలరావుగారికి ఫోన్ చేసి అభినందించారు. కొండలరావు గారు ‘అది నాది కాదు, ఎమ్బీయస్ గారిది’ అని చెప్పడం, భరణి నాకు ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగాయి. కొండలరావుగారికి రెండు, మూడు రోజులపాటు అందరూ యిలాగే ఫోన్ చేయడం, అందరికీ ఆయన చెప్పుకోవలసి రావడం జరిగి చాలా యిబ్బంది పడ్డారు. ‘‘మిసిమి’’ ఎడిటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దానికి పారితోషికం యిస్తే తిరక్కొట్టేశారు. కోడిహళ్లి మురళీమోహన్ అనే రచయిత ఆ పత్రికకు మెయిల్ పంపి జూన్‌లోనే యిది గ్రేట్ ఆంధ్రాలో ఎమ్బీయస్ పేర వచ్చిందని తెలియపరిచారు. ఇంత జరిగినా పత్రిక తన తప్పు సవరించుకోలేదు. ‘మాకు అలా వచ్చింది. అందుకే ఆయన పేర వేశాం.’ అనే స్టాండే తీసుకున్నారు.

ఇది కొండలరావుగారికి, నాకు ఎంబరాసింగ్‌గా అనిపించింది. ఇది పత్రిక వాళ్లు చేసిన పొరపాటని తెలియని వాళ్లు ఏమనుకుంటారు? నా ఆర్టికల్‌ను నెల్లాళ్ల తర్వాత ఆయన తన పేర వాడేసుకున్నారని అనుకోరూ! ఆయన నాకంటె ఎంతో సీనియర్. ఎన్నో తెలిసిన మహానుభావుడు. ఆయనలాటి వాళ్లు రాస్తే చదువుకుని, అక్షరాలు దిద్దుకున్నవాణ్ని నేను. అలాటిది నా పేర ముందే వచ్చినది ఆయన పేర మళ్లీ రావడం ఎంత చికాకైన వ్యవహారం. పైగా ఆ ఆర్టికల్ అందరికీ నచ్చడం, ప్రతీవాళ్లూ ఫోన్ చేసి ఆయనను మెచ్చుకోవడం, ‘నాది కాదు మహాప్రభో’ అని యీయన అనగానే ‘ఆ పత్రికవాళ్లు అలా ఎలా వేశారు? గట్టిగా చెప్పలేకపోయారా?’ అంటూ లెక్చర్లివ్వడం.. యిదంతా పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరం సజీవంగా వుండగానే యిలా కర్తృత్వం మార్చేశారు, ఆధునిక సాంకేతికత యిలా దురుపయోగం అవుతోందని బాధపడ్డాం.

ఆయన ఆరోగ్యంగా వుంటూనే, సునాయాసంగా వెళ్లిపోయారు. మంచి మనిషి. ఆ ఆత్మీయుడికి యిదే నా నివాళి. (ఫోటో – ‘‘తిక్క శంకరయ్య’’ సినిమాలో రాజబాబు, ఎన్టీయార్‌లతో)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?