Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: రావిశాస్త్రి శతజయంతి

ఎమ్బీయస్: రావిశాస్త్రి శతజయంతి

అద్భుతమైన కథకుడు, ఎందరో కథకులకు మార్గదర్శకుడు అయిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు రావిశాస్త్రి. 1922 జులై 30న పుట్టారు (మరణం 1993) కాబట్టి, ఆయన శతజయంతి సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాదిలోగా ఆయన గురించి మరిన్ని వ్యాసాలు రాయాలని వుంది. వృత్తిరీత్యా లాయరు ఐన ఆయన కథలు మొదట్లో చక్కగా, చిక్కగా మంచి కథనశిల్పంతో వుండేవి. పోనుపోను ఆయనలో సామాజిక స్పృహ గురించి చింత ప్రారంభమై, సమాజాన్ని మేల్కొల్పడమే ధ్యేయంగా పెట్టుకుని కోర్టులు, పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, కేసులు, జైళ్లు వీటి చుట్టూ తిరిగాయి. ఆయన కథలన్నీ ఓ రకంగా సమాజంపై ఎఫ్‌ఐఆర్‌లే అనేశారు. ఆయన కొన్ని సీరియళ్లను ప్రారంభించి మధ్యలో వదిలేశారు. అవి చదివితే ముందుగా కథ కనస్ట్రక్ట్ చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ తన రచనలలో సమాజంలో డార్క్‌సైడ్‌ను చాలా చక్కగా చూపగలిగారు. అనేకమంది కథకులు ఆయన శైలిని అనుకరించారు.

సాధారణంగా సామాజిక స్పృహ కథలు బోరు కొడతాయి, నిస్పృహ కలిగిస్తాయి. చదివాక నీరసం వస్తుంది. నిరాశ అలుముకుంటుంది. కానీ రావిశాస్త్రిగారి కథల్లోని వ్యంగ్యం మనల్ని ఆకట్టుకుంటుంది. సమాజం తీరుతెన్నులను ఎండగడుతూనే, వ్యక్తుల్లో దౌష్ట్యాన్ని నగ్నంగా చూపిస్తూనే మన పెదవులపై చిరునవ్వు మొలిపిస్తారాయన. ఆయన వర్ణనాచాతుర్యం అమోఘం. చదువుతూంటే లైన్లకు లైన్లు అండర్‌లైన్ చేసుకుంటూ పోబుద్ధవుతుంది. ‘నచ్చిన కథలు’ సీరీస్ నడిపినప్పుడు (అవన్నీ నా కథాపరిచయాలు ఈ-బుక్‌లో వస్తాయి) రావిశాస్త్రి గారి ‘‘జాతక కథ’’ను పరామర్శించాను. 

ఇప్పుడు ‘‘రాజు-మహిషి’’ (1965 రచన) అనే అసంపూర్ణ నవలలోని కొన్ని భాగాలు ఎత్తి రాస్తున్నాను. ఇది తొలిసారి చదివినప్పుడు నాకు 13 ఏళ్లు. కొన్ని వాక్యాలు మనసులో నాటుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ చదువుతున్నా, అంతే ఉత్సుకత కలుగుతోంది. ఆ నవల కథ చెప్పటం లేదు. పాత్రల గురించి చెప్పటం లేదు. కొన్ని రచనాశకలాలు యిస్తున్నాను. ఆయన వర్ణనా చమత్కృతి, ఉపమాన సంపద, శైలీవిన్యాసం, వ్యంగ్యవైభవం, మనుషుల స్వభావవిశ్లేషణ, తర్కించే విధానం, నిత్యసత్యాలను ఆవిష్కరించే తీరు -  మీకు పరిచయం అవుతుంది, ఇంతకు ముందు మీరు ఆయన రచనలు చదివి వుండకపోతే!

‘..ఆవులు అందంగా వుంటాయి. కళాకారులు, ఆర్టు క్రిటిక్కులూ చెప్పే బ్యూటీ వాటికుంది. అందుచేతనే గోపాలకృష్ణుడు గోవులతో బొమ్మలు గీయించుకున్నాడు. కానీ గేదెలతో ఒక్క బొమ్మయినా గీయించుకోలేదు. ఆవుల్లో గేదెలు మనుష్యుల్లో నీగ్రోలవంటివి...’

‘..రాజు పోతులా వుంటాడు. తన ఇరవై గేదెల మధ్యా నిలబడ్డప్పుడు యింకా మరీ మంచి పోతులా వుంటాడు. ఆ గర్జన, ఆ ఛాతీ, ఆ జబ్బలు, ఆ పిక్కలు, ఆ హైటు, ఆ రంగుల చొక్కా, అన్నింటితోను అతను మనిషిగా మారిన కారుదున్నలా వుంటాడు... రాజు పేరు గంగరాజు. అతనికి ఆవులుకూడా ఉన్నప్పటికీ అతణ్ని ఎందుచేతనోగాని అఁదరూ కూడా గేదిల గంగరాజనే అంటారు. అతని మరదలు పేరు రాజమ్మ. భార్య పోయాక చేరదీసి పెళ్లి చేసుకున్నా కిట్టని వెధవలు ఆమెని ‘గంగరాజుగాడి మరదలు ముండ’ అంటారు. పిలవడం ‘రాజమ్మొదినా’ అని పిలుస్తారు...’

‘రాజమ్మ కోపం ప్రళయమైతే, ఆమె తెలివితేటలు కత్తివంటివి. కోపానికి ఫోర్సెక్కువైతే తెలివికి పదునెక్కువ. ఆవిడ వెయ్యిళ్లకి దీపాలు పెట్టగలదు. పదివేల కొంపలకి నిప్పంటించగలదు. దుర్దినాల్లో ఆమె కిలుంపట్టిన బిందెలా ఉండేది. రాజు అండ దొరికాక, ఇప్పుడామె బాగా తోమి ఎండలో బోర్లించిన యిత్తడి బిందెలా తళతళ్లాడుతూ ఉంటుంది.’

‘ కెకె మందిర్ సినిమాహాల్లో ఆడుతున్న సినిమా పేరు ‘‘కౌంటర్‌ఫిట్ లవ్’’. దాని ‘తెలుగు’సేత ‘‘నకిలీ ప్రేమ’’ అందు ‘నకిలీ’ ఉర్దూ, ‘ప్రేమ’ సంస్కృతం...’

‘.. హాల్లో ఓ సోఫాలో మిస్ ప్రేమ కూర్చొనుంది.  ఆ హాలు గోడలు నీలంగా వున్నాయి. గోడల్ని రెండు ట్యూబులైట్లు, సాగదీసి వెలిగించిన గాజు పాముల్లా నీలినీలిగా వెలుగుతున్నాయి. తినితిని బాగా బలిసిన వింత జంతువుల్లా నాలుగు సోఫాలు నీలంగా నిల్చున్నాయి. వాటి మధ్య, లతలు చెక్కిన మేజా ఒకటి వినయంగా వంగి నిల్చొంది. ఆ మేజా మీద, అద్దాలు పొదిగిన చక్కని చిన్నని నీలిరంగు జాడీ ఒకటి – ముస్తాబై పెద్దల మధ్య భయపడుతూ నిల్చున్న అలనాటి భోగపు కన్నెలా – అసహాయంగా నిల్చొంది. ఆ కన్నెపిల్ల తలలో పువ్వుల్లా, జెయిల్లో పసిపిల్లల్లా – ఆ జాడీలోంచి జాలిగా జారిన పూతీగెని పూసిన పూలు – నీలిరంగు పూలు బిక్కుబిక్కూ చూస్తున్నాయి.’

‘..హాల్లోకి వచ్చిన రంగారావు తెల్లని పంట్లాంలో ఎర్రటి టెర్లిన్‌షర్టు టక్ చేసుకున్నాడు. ‘నేను డాబుగా వుంటాను’ అనే ఆత్మజ్ఞానం కలిగిన డాబుగాళ్లా ఉన్నాడతను. హాల్లో అప్పటికే కూర్చుని ఉన్న గిరిజ అతన్ని చూసి నవ్వింది. దానికి అతను వయ్యారంగా జవాబునవ్వు నవ్వాడు. ఫ్రిజిడేర్‌లోంచి దాచి తీసిన నవ్వులా అది అతిచల్లగానూ, ఎంతో కృత్రిమంగాను ఉన్నదనిపించింది గిరిజకి. రాత్రి శత్రు విమానం కనిపించేసరికి దీపాలు వెంటనే ఆర్పేసినట్లు వెంటనే తన నవ్వుని ఆర్పేసుకుంది. ..’

‘..పాముల్ని చూసి పరిగెట్టారు ఆ జంట. కాస్సేపు పరిగెట్టాక మరింత పరిగెట్టలేక ఆమె కాళ్లు నిచ్చెన కాళ్లలా అయిపోయాయి. వగర్చుకుంటూ ఆగింది. అతనూ ఆగి, కొంచెం వంగి నిల్చొని ఊపిరి పీల్చి విడిచి, ‘పాఁవులు!’ అన్నాడు. ‘అవును, పాములే!’ అన్నట్టుగా తల వూపుతూ ముందుకి వంగిపోయి ‘పహాఁవులు’ అంటూ నిట్టూర్చింది ఆమె...’

‘ఉత్తమ వంశం అంటే నిర్వచనం యివ్వడం యీ రచయితకి కష్టం. ఆ మాటకి అర్థం సింపుల్ ఎగ్జాంపుల్స్ బట్టి తెలుసుకోవాలంటే.. చర్చిల్ గారిది ఉన్నతవంశం. చార్లీ చాప్లిన్‌ది కాదు. కెనెడీగారిది ఉన్నత వంశం, కాస్ట్రోది కాదు. అర్జునుడిది ఉన్నతవంశం, ఏకలవ్యుడిది కాదు. రాజుది ఉన్నత వంశం, రౌతుది కాదు. ఆ రౌతు రాజుని చంపి రాజవుతే వారి తరవాత వారందరిదీ ఉన్నత వంశమే! ఉన్నత వంశాలవారు చస్తే వారి శవాలు భౌతిక దేహాలవుతాయి! వారు అవతారాలు చాలించిన వారవుతారు. వారి ఆత్మలు శాంతిస్తాయి. బ్రహ్మసాయుజ్యం పొందుతాయి. మామూలు వారు బ్రతికున్నాసరే వెధవ పీనుగులుగా తెలియబడతారు. జనాభా లెక్కల్లో వుండరు. ఓట్లు వెయ్యడానికీ, జేకొట్టడానికీ పనికొస్తారు. చచ్చినపుడు దిక్కుమాలిన చావు చస్తారు...’

‘..పసుపుకొమ్ములున్నా పవిత్ర వివాహబంధమే అంటూ బాగానే చెప్పావు కానీ, ఏ ఆడదైనా సరే – వీలుంటే చాలు – వాటికి నూలుదారం తీసేసి బంగారు తాడు కట్టించుకొంటుంది. పసుపుకొమ్ము నూలుపోగుల కంటె బంగారం ఎక్కువ పవిత్రం అని అర్థం చేసుకో. భగవంతుడైనా అంతే. దేవాలయాల్లో బంగారు దేవాలయాలూ, మసీదుల్లో మార్బుల్ మసీదులూ అంటే మానవులకి ఎక్కువ గౌరవం అని తెలుసుకో..’

‘..దుర్మార్గులు కొంతమంది మందుల భీముడికి దైవభక్తి, పాపభీతి లేవంటారు. అవి ప్యూర్ జెలసీమాటలు, పచ్చి అబద్ధం మాటలు. అతనికి రెండూ వుండేవి. అయితే కౌన్సిలర్ అయి అన్నవరం వెళ్లి సత్యనారాయణ వ్రతం చేసివచ్చాక దైవభక్తి బాగా ఎక్కువయిపోవడంతో పాపభీతి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. పూర్వకాలంలో, అతను పాపాలు చేయకపోలేదు కానీ, అవి చెయ్యడానికి భయపడేవాడు. చేసిన తర్వాత కూడా భయపడేవాడు. ఇప్పుడతనికి తెలిసిపోయింది – అమితమైన భక్తితో, విశ్వాసంతో భగవంతుడ్ని సేవిస్తూంటే చాలు ఎంతటి పాపుల్నయినా అతను క్షమిస్తాడు అని. అతని దయ, సముద్రంలో ఉప్పులా ఎంత తీసినా తరగదు. పిల్లకోతి తల్లికోతిని పట్టుకున్నట్లు మనం ఆయన్ని పట్టుకుంటే ఆయన మనల్నెప్పుడూ జారవిడిచీడు. తల్లిపిల్లి తన పిల్లల్ని కరుచుకు తీసుకుపోయినట్లు మన భక్తికి మెచ్చిన భగవంతుడే మనల్ని ఎక్కడికో అక్కడికి తీసుకుపోయి ఓ వెచ్చని జాగాలో పడేయకపోడు...’

‘పాపాలు చెయ్యనోడు ఎవరున్నార్ సార్! అందరూ చేస్తారు. అల్లా అల్లా అని ఆళ్లు పీకలు కోసేస్తారు – మనందరం దేవుని బిడ్డలవేఁ అంటూ యీళ్లు పీక్కొరికేసి పీల్చుకు తినేస్తారు. అవుసరం ఒచ్చినపుడు పాపాలందరూ చేస్తారు. దొంగ డైరీ వ్రాయకుండా పోలీసోళ్లు బతకలేరు. దొంగ సాచ్చికాలివ్వకుండా కరణమ్మునసబులు బతకలేరు. దొంగ కేసులో దించకుండా ఏ ప్లీడరూ బతకలేడు. దొంగ జబ్బుల్లేకపోతే ఏ గుమాస్తాకీ ఏ ఆఫీసరూ సెలవివ్వడు. దొంగ సర్టిఫికెట్లూ దొంగిజక్షన్లూ యివ్వకుండా ఏ డాక్టరూ బతకడు. కూలోడి కష్టం దొంగతనం జెయ్యకుండా ఏ కంట్రాట్టిరోడూ కూడా బావుపడ్డు, బతకడు. .. పులి మేకని తింటది. మేక గెడ్డి తింటది. ఆ గెడ్డి బూవిన్దిని బతుకుద్ది. ఈ బూదేవి సూర్యచంద్రులమీద బతుకుద్ది. అంచేత ఏంటంటే ఒకణ్నొకడు తినుకుంటూ పాపం చేస్తూనే అందరూ బతకాల! ఆ పాపాలు చమించేడెఁవే భగవంతుడి ఉజ్జోగం! ఎక్కడా ఎవడూ ఏ పాపవూఁ చెయ్యకపోతే భగవంతుడికి ఉజ్జోగవే లేదు – పామ్మీద పడుకోడం, గెద్దెక్కి షికారెళ్లడం తప్ప ఆ బాబుకి మరింక ఏరే పన్లుండవు...’

‘..కిళ్లీ కొట్టు బంగారి భర్త యిదివరకు ఆ వూరికి తలవంచని పరమవీరుడు. వీరులు చాలా మంచివాళ్లే. కాని వాళ్లు వేగిరం చచ్చిపోతూంటారు. ఎక్కడైనా ముసిలివీరుడంటూ వుంటే వాడు జగదేకవీరుడైనా అవాలి, లేకపోతే అబద్ధపు వీరుడు – ఎప్పుడో ఒకప్పుడు తోకముడిచి దౌడు తీసిన దొంగవీరుడైనా అయండాలి. రౌడీల కొట్లాటలో బంగారి భర్త వీరమరణం పొందేడు. అలాటి వీరుల వల్ల పేటకి పేరొస్తుంది. కానీ వారి పెళ్లాంపిల్లలకు చేతికి చిప్ప వస్తుంది.’

‘..లోకంలో ప్రతి మానవుడికి ఏదో వీక్‌నెస్సులుంటాయి. నర్సులకి డాక్టర్లంటే వీక్నెస్సు. డాక్టర్లకి రిచ్ పేషెంట్సంటే వీక్నెస్సు. పోలీసువారికి డబ్బూహోదా అంటే వీక్నెస్సూ. పాఠకులకు రచయిత్రులంటే వీక్నెస్సు (?) రచయితలకి సినిమాలంటే వీక్నెస్సు (?) అభ్యుదయకాముకులకి కమ్యూనిస్టులంటే వీక్నెస్సు. కోటీశ్వరులూ కూలివాళ్లు, ప్రజాస్వామ్యమూ కలిసిమెలసుండాలనే వారికి కెనడీ వీక్నెస్సు...’

ఈ ఉదాహరణలు చాలనుకుంటాను. రాబోయే వ్యాసాల్లో ఆయన రచనల్లో నాకు నచ్చిన కొన్నిటి కథాంశాలను క్లుప్తంగా పరిచయం చేస్తాను. శైలి మీకు తెలిసిపోయింది కాబట్టి ఊహించుకోగలరు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?