cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఏది మతం? ఏది ఆచారం?

ఎమ్బీయస్‌: ఏది మతం? ఏది ఆచారం?

మతం గురించి గొప్పగా చెప్పుకోవాలంటే అన్నీ తెలిసి ఉండాలా అని ఒకరి సందేహం. మతమే కాదు, మీ భాష, మీ ప్రాంతం, మీ కుటుంబం, మీ కులం - వేటి గురించైనా మీరు గొప్పగా ఫీలవ్వచ్చు. 'మా అమ్మ గొప్పది' అని చెప్పుకోండి తప్పు లేదు. కానీ మీ అమ్మ కంటె గొప్పది, ఈ ఊళ్లో అందరు అమ్మల కంటె గొప్పది, ప్రపంచంలో యిలాటి అమ్మే ఉండదు - యిలాటి స్టేటుమెంట్లు యిచ్చేటప్పుడు చాలా డేటా ఉండాలి. అలాగే మన ప్రాంతం గురించి, మన భాష గురించి క్షుణ్ణంగా తెలియకుండానే వాదనకు దిగవద్దు. మన అభిప్రాయాన్ని మన దగ్గరే ఉంచుకోవడం మంచిది. దేనికైనా ప్రతినిథిగా మాట్లాడడానికి గోదాలో దిగినప్పుడు సర్వసన్నద్ధంగా ఉండాలి.

ఒక రాజకీయ పార్టీకి కోట్లాది సభ్యులుంటారు. కానీ అందర్నీ అధికార ప్రతినిథిగా నియమించరుగా. ఎవరికౖౖెతే పార్టీ విధానాల పట్ల అవగాహన, ప్రత్యర్థి పక్షాల లోపాల పట్ల సమాచారం, గతచరిత్ర జ్ఞానం, వాక్పటిమ ఉంటాయో వారినే పెడతారు. అలాగే ఆటల పోటీల్లో ఒక రాష్ట్రం నుంచి ఒక టీము పంపించేముందు అనేక పరీక్షలకు గురి చేసి మరీ పంపుతారు. హిందూమతం ప్రతినిథిగా మాట్లాడడానికి ముందుకు వచ్చేవాళ్లకి యిలాటి టెస్టులు ఏమీ అక్కరలేదులా వుంది. పైన కప్పుకోవడానికి ఒక శాలువా ఉంటే చాలనుకుంటా. 

పురోహితుడికి కాని, పూజారికి కాని మంత్రాలు వస్తే చాలు. వాటి అర్థాలు తెలియవలసిన అవసరం లేదు. ఉపనిషత్తులు, యితర వేదాంత గ్రంథాలు చదవవలసిన పని లేదు. ఇతర మతాల గురించి తెలుసుకోవలసిన అగత్యం అసలే లేదు. మంత్రాలతో, ఆగమాచారాలతో ఆయన దేవుణ్ని శ్రద్ధగా అర్చిస్తున్నారు. సంతోషం. కానీ మేధోపరమైన చర్చలకు వచ్చేటప్పుడు తెలుసుకోవలసిన విషయాలు, చర్చకు కావలసిన వాదనాశైలి యివన్నీ సమకూర్చుకుని రావాలి. ఎందుకంటే చర్చల్లో అవతలివాళ్లు విద్యాధికులు, తమ సబ్జక్టులో నిష్ణాతులు, మంచి వక్తలు. వీటన్నిటికి తోడు వాళ్లు దేనికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ప్రశ్నలు దట్టించడమే వారి పని.

గ్రహణం నాడు ఆహారం ఎందుకు తీసుకోకూడదు? వరుణ యాగం చేస్తే వర్షం ఎలా పడుతుంది? సర్పయాగం చేస్తే పాములు కాటేయడం మానేస్తాయా? - ఇలా నాలుగువైపులా నలుగురు తగులుకుంటే మధ్యలో ఉన్న యీ ఆస్తికత్వ ప్రతినిథి 'అలా అవుతాయని మన వేదాల్లో రాశారండీ, మన ఋషులు చెప్పారండీ' అంటూంటాడు. 

ఒక జోక్‌ ఉంది - మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి అంటే సీత, సావిత్రి, అనసూయ.. అని చెపుతూంటే ఆపి 'ఏం మీ అమ్మ పేరు, భార్య పేరు ఎందుకు చెప్పలేదు?' అని అడుగుతాడు. ప్రశ్న కరెక్టే కదా! అలాగే యీ పండితులు వేదకాలంలో ఋషుల మహిమ గురించి చెప్తారు తప్ప 'నేను యాగం చేసి చూపిస్తాను. వర్షం కురిపించకపోతే అప్పుడడగండి.' అని ఛాలెంజ్‌లు చేయరు. రుజువులు చూపించరు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పొండి అన్నట్లు ఉంటారు.

అసలు దేవుడితో వచ్చిన చిక్కే ఎవరికీ కనబడకపోవడం. నాకైతే కనబడలేదు కానీ వేరెవరికో కనబడ్డాడట అని పరమభక్తులు కూడా చెప్పుకోవలసిన పరిస్థితి. అందువలన ఫలితాల వలన మాత్రమే ఆయన ఉనికికి నిరూపించవలసిన అగత్యం వచ్చింది. 'గాలి కనబడదు, కానీ గాలి ఉన్నట్లు నువ్వు ఫీలవుతున్నావు కదా! కరంటు తీగలో విద్యుత్తు కనబడదు, కానీ ముట్టుకుంటే షాక్‌ కొడుతోంది కదా, అలాగే దేవుడు కూడా ఉన్నాడు కానీ కనబడడు' అని ఆస్తికులు వాదిస్తూ ఉంటారు. గాలి విషయంలో ఆకులు కదలడం కంటికి కనబడుతోంది, షాక్‌ కొట్టడం శరీరానికి తెలుస్తోంది.కానీ దేవుడి విషయంలో యిలాటివి ఏవీ కనబడవు, తెలియవు. 

ఆ మాట చెపితే 'భక్తి ఉన్నవాడికే అవన్నీ తెలుస్తాయి, నీ బోటి నాస్తికుడికి తెలియవు' అని దబాయిస్తారు. గాలి, విద్యుత్తు వంటివి అందరికీ ఎఱికలోకి వస్తాయి. దేవుడి ఉనికి రాదు. భక్తి ఉంటే తప్ప ఉనికి తెలియదు, ఉనికి తెలిస్తే తప్ప భక్తి రాదు అన్నట్టు తయారైంది వ్యవహారం. దేవుడున్నాడు, మంచివాళ్లకు మేలు చేస్తాడు, చెడ్డవాళ్లకు కీడు చేస్తాడు అనే ఫార్ములా కూడా ఆచరణలో నిరూపించబడటం లేదు. చూడబోతే దేవుడు మనం అనుకున్న ఏ నియమానికి, ఏ సూత్రానికీ లొంగుతున్నట్లు లేదు. తన చిత్తం వచ్చినట్లు తను వ్యవహరిస్తున్నాడు. గుళ్లల్లో అమ్మవారి చీరలు మాయమై పోతున్నాయి, అయ్యవారి వజ్రాలు మాయమై పోతున్నాయి, గుడి మాన్యాలు అన్యాక్రాంతమై పోతున్నాయి. భక్తుల ధనమానాల సంగతి సరే, సొంత ఆస్తిపాస్తులే కాపాడుకోలేక పోతున్నాడు దేవుడు. దేవుడు లేడనడానికి యింతకంటె రుజువేం కావాలి? అంటారు హేతువాదులు. చూస్తూ ఉండండి, కొట్టేసినవాడికి కడుపునొప్పి వస్తుంది, వాళ్ల కుక్క కాలు విరుగుతుంది, వాళ్లబ్బాయి వేసిన సినిమా ఫెయిలవుతుంది అంటూంటారు ఆస్తికులు. కథలో అయితే రెండు పేజీల్లో నేరమూ శిక్షా రెండూ పడిపోతాయి. కానీ నిజజీవితంలో దశాబ్దాలు గడిచినా నేరానికి శిక్ష పడదు. దేవుడి కోర్టు మన కోర్టుల కంటె అన్యాయం. మనం బతికుండగా తీర్పు కళ్ల జూడం. 

ఈ కారణాల వలన దేవుడి ఉనికి గురించి రుజువులు చూపడం మహా కష్టం. ఓ సామెత ఉంది 'నమ్మేవాడికి ఏ రుజువూ అక్కరలేదు, నమ్మనివాడికి ఏ రుజువూ చాలదు' అని. అందువలన దేవుడి ఉనికి గురించి ఎన్ని శతాబ్దాలు చర్చించినా తేలదనుకుని పక్కన పెట్టినా, యీ ఆచారాల గురించి, కర్మకాండ గురించి చర్చించినపుడు రుజువుల కోసం అడగడంలో తప్పేముంది? వరుణయాగం చేస్తే వర్షం వస్తుందంటారా? వచ్చిన దాఖలాలు చూపండి.

గతంలో ఫలానా చోట చేసినప్పుడు వర్షం రాలేదు కదా! అని అడిగితే తప్పేముంది? పోనీ మండు వేసవిలో రాజస్థాన్‌లో యాగం చేయండి, వర్షం పడుతుందో లేదో చూద్దాం అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా 'త్రేతాయుగంలో..' అని మొదలెడితే ఎలా? మీరు యాగం చేసినది యీ యుగంలో, యీ సంవత్సరంలో! వర్షాకాలంలో వర్షం వచ్చినపుడు దీని కారణంగానే అని బుకాయిస్తే కుదరదు. యాగం చేసిన ఎన్నాళ్లకు వర్షం పడుతుందో కచ్చితంగా చెప్పండి, చూసి మీ మాట నిజమో కాదో తేలుస్తాం అంటే 'నాస్తికవాదం మానవత్వానికి హానికరం, దేవుడు హర్షించడు' అంటూ మాట తప్పిస్తే ఎలా?

యాగాలే కాదు, యీ న్యూమరాలజీ దగ్గర్నుంచి ఏదీ తర్కానికి నిలవడం లేదు. హరికృష్ణ యాక్సిడెంటు చూడండి, ఆయన కారు నెంబరు, కొడుకు కారు నెంబరు చూస్తే 2323 అనేది వాళ్ల లక్కీ నెంబరు అని, కావాలని ఆ నెంబర్లు పెట్టించుకున్నారని తెలుస్తుంది. ఇద్దరూ కారు ప్రమాదంలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రగాయాలతో బయటపడి వుంటే 'అసలు ప్రాణాలు పోవలసినది, లక్కీ నెంబరు వలన గాయాలతో ఆగింది' అని వాళ్ల న్యూమరాలజిస్టు వాదించేవాడు. కానీ రెండు కేసుల్లోనూ ప్రాణాలే పోయాయి. అంటే యీ లక్కీ నెంబరు ప్రాణాలు కాపాడలేదు, కారునీ కాపాడలేదు. మరి ఎందుకీ గోల? పేరు స్పెల్లింగ్‌ మార్చుకుంటే కష్టాలు తొలగిపోతాయి అని టీవీల్లో వచ్చి చెప్పేవాళ్ల మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోప్పుడు ధాటీగా చెప్తూ ఉంటారు - 'ఆర్‌తో (ఉదాహరణకి) పేరు మొదలైనవారు ఎవరూ పైకి రాలేదు' అని. అలా వచ్చిన 10 మంది పేర్లు నాకు వెంటనే తడతాయి.

ఇక ఇంగ్లీషు అక్షరాలకు హిందూ గ్రహాల పేర్లు జోడించి లెక్కలు వేసేస్తూ ఉంటారు. జ్యోతిషశాస్త్రం రాసినపుడు యీ ఇంగ్లీషు అక్షరాలు ఎక్కడున్నాయి? ఫలానా గ్రహాలు ఫలానా మ్లేచ్ఛ అక్షరాలను శాసిస్తాయి అని ఎలా చెప్పగలరు? ఇక స్పెల్లింగు మార్చుకుంటే అదృష్టం మారిపోతుందా? అంటే ఆ గ్రహం మనపై ప్రసరించే ఆకర్షణ శక్తి కానీ, వికర్షణ శక్తి కానీ స్పెల్లింగ్‌ చూసి తగ్గిపోతుందా? లేక ఆటోకరక్షన్‌ ఆప్షన్‌ ఉపయోగించి, మన స్పెల్లింగును మామూలుగా మార్చేసి ఆ శక్తిని యథాతథంగా ఇస్తుందా?

అబ్బే అలా క్కాదు, అవతలివాళ్లు మన పేరు పిల్చినపుడు వెలువడే శబ్దతరంగాల్లో మార్పు వచ్చి పాజిటవ్‌ ఎనర్జీ, నెగటివ్‌ ఎనర్జీ, వైబ్స్‌.. యిలా ఏవేవో చెప్పి కన్‌ఫ్యూజ్‌ చేస్తారు. నాపేరులో ఒక ఆర్‌ ఎక్కువ పెట్టాననుకోండి - నన్ను ప్‌ఱ్ఱసాద్‌ అని పిలుస్తారా? ఒక ఎస్‌ ఎక్కువ పెడితే ప్రస్సాద్‌ అని పిలుస్తారా? రాసుకునేటప్పుడు తేడా వస్తుంది కానీ పిలుపులో తేడా రాదు. ఇక అదృష్టంలో మార్పు ఎలా వస్తుందో ఊహించలేం. అలాగే రాళ్లు, రత్నాలు. 'మీరు చెప్పినట్లే పెట్టుకున్నా, మార్పు కనబళ్లేదు' అంటే 'కింద క్లోజ్‌ చేయించి వుంటారు, చర్మానికి తగలాలి, గ్రహకిరణాలను అది ఆకర్షించి, మీ ఒంట్లోకి పంపాలిగా' అంటారు. చర్మానికి తగులుతోందండి, అయినా పని చేయడం లేదు అంటే 'అయితే మీరు కొన్న వజ్రం మంచిది కాదు, నాకు తెలిసున్నవాడి దగ్గర కొనండి, సరైనది యిస్తాడు' అంటారు. ఇలా ప్రతిదానికీ ఏదో ఒకటి చెప్తారు.

ఇక జ్యోతిష్యం గురించి కూడా నాలుగు మాటలు చెప్పాలి. తరచుగా ఏవో కొన్ని గ్రహాలు ఒక రాశిలో కూడడం, వెంటనే టీవీ వాళ్లు ఆ కూటమి ఫలితాలపై చర్చకు పెట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ కూటమి వలన కొంపలు మునిగిపోతాయని చెప్పే పండితులు సాధారణంగా చేసే పొరపాటు ఒకటి ఉంటుంది.

అమావాస్య ఎప్పుడు వస్తుందో, గ్రహణం ఎప్పుడు వస్తుందో, ఏ గ్రహం ఎప్పుడు తిరోగమిస్తోందో మన పూర్వీకులు చెప్పగలిగారు. అందువలన జ్యోతిషాన్ని నమ్మాలి అంటారు వాళ్లు. ఖగోళశాస్త్రం (అస్ట్రానమీ) వేరు, జ్యోతిషం (ఆస్ట్రాలజీ) వేరు. ఖగోళశాస్త్రంలో రాశులు, నక్షత్రాలు, గ్రహాలు, వాటి గతులు వీటి గురించి చెప్పినవన్నీ శాస్త్రబద్ధమైనవే. కాలాన్ని ఒకళ్లు సూర్యుడి ఆధారంగా కొలవవచ్చు, మరొకరు చంద్రుడి ఆధారంగా కొలవవచ్చు. రోజు లెక్క కచ్చితంగా తెగదు కాబట్టి, కొన్నాళ్లు పోయిన తర్వాత అధికమాసాల పేరుతో లెక్క సరిచేస్తారు. అయితే గ్రహాల ప్రభావం మానవజీవితంపై, సస్యాలపై, తక్కిన జీవకోటిపై ఎలా పడుతుంది అనే విషయాన్ని చెప్పేది జ్యోతిషం. అది యిప్పటిదాకా శాస్త్రీయం కాదు. అందుకే ఒక్కొక్కళ్లు ఒక్కోలా చెపుతూంటారు. నూరు డిగ్రీల వద్ద నీరు వేడెక్కుతుంది అనేది శాస్త్రం. మీరు వేడి చేసినా, నేను వేడి చేసినా వేడెక్కుతుంది. ఇద్దరు పండితులు ఒకే గ్రహగ్రతి సమాచారాన్ని ఎదురుగా పెట్టుకుని వాటి ప్రభావాలపై వేర్వేరు ఫలితాలను ఊహిస్తే అది శాస్త్రీయం కానేరదు. 

జ్యోతిషం పరిపూర్ణ శాస్త్రమే అని తెలుగునాట వాదించేవారిని ఉగాదిపూట రాజకీయ పార్టీ ఆఫీసుల వద్దకు తీసుకెళ్లి పంచాంగ శ్రవణంలో కూర్చోబెట్టాలి. అదే పంచాంగం, అవే గ్రహగతులు, ఫలితాలు మాత్రం వేరేవేరేగా చెప్తారు పండితులు. అధికార పార్టీ పంచాంగశ్రవణం ఒకలా, ప్రతిపక్ష పంచాంగశ్రవణం దానికి వ్యతిరేకంగా ఉంటోంది. పుట్టిన సమయంపై ఆధారపడిన జ్యోతిషాన్ని దేశాలకు, రాష్ట్రాలకు ఎలా అన్వయిస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వ్యక్తుల వరకూ చూసినా ఒకే జాతకం చూసి ఒక జ్యోతిష్కుడు చెప్పిన దానికి, మరొకరు చెప్పినదానికీ తేడా వస్తోంది. వైద్యుల్లో కూడా యిలాటి వైరుధ్యాలు వస్తున్నాయి కదా, అందువలన వైద్యం కూడా శాస్త్రం కాకుండా పోతుందా, అదీ అంతేనా అంటే, అంతే. ఒకే వైరస్‌ ఒక్కో మనిషిపై ఒక్కో ప్రభావం చూపుతోంది, ఒక మందు నాపై వాడితే సెడ్‌ ఎఫెక్టు వస్తోంది, మీపై వాడితే రావటం లేదు. ఎందుకు? శారీరక స్థితి, మానసిక స్థితి, బయటి వాతావరణం, కుటుంబ వాతావరణం యిలాటి ఎన్నో అంశాలు చికిత్సను ప్రభావితం చేస్తున్నాయి. అందువలన వైద్యుడు మందులు మారుస్తున్నాడు, ప్రయోగాలు చేస్తున్నాడు. ఔషధ తయారీ సంస్థలు నిరంతరం రిసెర్చి చేస్తున్నాయి. కొత్త కొత్త మందులు తయారు చేస్తున్నాయి.

జ్యోతిషంలో యిలాటి రిసెర్చి ఎక్కడ జరుగుతోంది? జోస్యం తప్పినపుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి, రికార్డు చేసే అలవాటు ఉండాలి, దాన్ని యితరులతో పంచుకునే సహృదయం ఉండాలి. ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకు వెళ్లాలి. వేల సంవత్సరాల క్రితం అప్పటికి సంపాదించిన జ్ఞానంతో రాసిన పుస్తకాలే పరమావధి అనుకోరాదు. వాటిలో వైరుధ్యాలున్నాయన్న సంగతి జ్యోతిష్కులకు తెలుసు. అందుకని వాటిలో ఒకటి రెండిటినే వారు అనుసరిస్తారు. వారి వారి అనుభవాల బట్టి సవరిస్తూ ఉంటారు. ఒక్కోప్పుడు వారి వాదనలకు 'ఆధారమేమిటి?' అని ఎదుటి జ్యోతిష్కుడు ప్రశ్నించినప్పుడు 'స్వానుభవం' అని సమాధాన మిస్తారు. ఇటువంటివన్నీ సైన్సు పేపర్లలాగానే పబ్లిష్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ ఉండాలి. వాటి ప్రామాణికతను నిర్ధారించే ఒక నిపుణుల కమిటీ ఉండాలి. సైన్సు విషయాల్లో అటువంటి అంతర్జాతీయ సంస్థలున్నాయి. జ్యోతిషం విషయంలో ఎవరి కుంపటి వారిదే. అందువలన ఏ జోస్యం ఎందుకు కరక్టవుతోందో, ఎందుకు తప్పుతోందో చెప్పలేకపోతున్నారు. ఈ హడావుడిలో మిడతంభొట్లు పెరిగిపోతున్నారు. ఏదో చెప్పడం, కరక్టయితే డప్పు వాయించుకోవడం, తప్పయితే కనుమరుగు కావడం!

చర్చల్లో పాల్గొనేవారు యింత ఓపెన్‌గా మాట్లాడరు. గ్రహణం ఎప్పుడు వస్తోందో కరక్టుగా చెప్పగలిగారు కాబట్టి, ఆకస్మిక ధనలాభం ఎప్పుడు కలుగుతుందో కూడా చెప్పగలమంటారు. అక్కడే వస్తుంది పేచీ. దీన్ని ఒక సగటు తెలివితేటలున్నవాడు కూడా ఖండించగలుగుతాడు. అయినా దేవుడి ఉనికికి, హిందూమతానికి, దీనికి సంబంధం ఏముంది? జ్యోతిష్కులు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లోనూ ఉన్నారు. నీ జోస్యం తప్పినంత మాత్రాన నిక్షేపంలా అప్పటి దాకా ఉన్న దేవుడు హఠాత్తుగా గైరుహాజరై పోడు. ఒకలా ఆలోచిస్తే - దేవుడు గతాన్ని తెలుసుకునే శక్తి యిస్తూనే తెలుసుకోలేని విధంగా భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. జ్యోతిషం ద్వారా ఆయన అభిమతానికి విరుద్ధంగా వెళుతున్నావు. ఆయన దాచేసిన రహస్యాన్ని ఛేదిస్తున్నావు. ఆయన నీతో చదరంగం ఆట ఆడుతున్నాడు. నువ్వు కాస్త తెలుసుకోగానే, ఎత్తు మార్చేసి, పావులు కదిపేస్తున్నాడు. అనేక విషయాల్లో అలాగే నీకు పరిమితులు కల్పించాడు. కానీ నువ్వు పట్టుదలతో వాటిని అధిగమిస్తున్నావు. జలచరంలా నీటిలో ప్రయాణిస్తున్నావు, వాయుచరంలా గాలిలో ఎగురుతున్నావు. అలాగే ఓపెన్‌ మైండ్‌తో ఆలోచిస్తే దీని గుట్టుమట్లు తెలుసుకోగలవేమో! 'ఇప్పటిదాకా నీకున్న జ్ఞానం అసంపూర్ణం. సమాచారం పరిమితం. నిరూపణకు నిలవటం లేదు.' అని ఎవరైనా జ్యోతిష్కుడికి చెపితే అతను ఒప్పుకోవాలి తప్ప 'నువ్వు నాస్తికుడివి' అని ఎదుటివాణ్ని నిందించకూడదు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం ఉండి, జ్యోతిషం మీద నమ్మకం లేని వారు ఎందరో ఉన్నారు.

జ్యోతిషం, వాస్తు, యాగాలు, ఆచారాలు, కర్మకాండ, పురాణాలు, బాబాలు - యిలా ఎన్నో విషయాలు కలగలిపేసి హిందూమతంపై రుద్దడం అనేది ఆస్తికులు, నాస్తికులు యిద్దరూ చేస్తున్నారు. వీటిల్లో లోపాలు కనిపెట్టి, హిందూమతం చెత్త అని కొందరు నాస్తికులు అంటూంటే, వీటిని విమర్శించేవారు హిందూదైవదూషణకు పాల్పడుతున్నారని కొందరు ఆస్తికులు అంటున్నారు. ఇద్దరిదీ తప్పే!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com