Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మతానికి, భాషకు ముడి పెట్టవచ్చా?

ఎమ్బీయస్‌: మతానికి, భాషకు ముడి పెట్టవచ్చా?

''ఇంగ్లీషు మీడియం అనర్థదాయకమా?'' వ్యాసంలో చివర్లో '..దీనికీ మతం రంగు పులిమేవారికి శతకోటి నమస్కారాలు...' అంటూ ముగించాను. ఎందుకంటే అప్పటికే నా దగ్గర నలుగురైదుగురు 'ఈ ఇంగ్లీషు మీడియమంతా స్కూళ్లల్లో బైబిలు ప్రవేశపెట్టడానికే..' అనడం జరిగింది. వాళ్ల ఆలోచనాస్థాయి అలా ఉంది పాపం అనుకుంటూ జస్ట్‌ ప్రస్తావించి వదిలేశాను. పోనుపోను, యీ వాదన అనేకమంది మేధావులు కూడా చేయడం చూసి నివ్వెరపోతున్నాను.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన 'కొత్త పలుకు'లో 'ఇంగ్లీషు మీడియం బోధన వలన బాల్యం నుంచి పిల్లలను క్రైస్తవమతం వైపు ఆకర్షించడం సులువు' అంటూ ప్రతిపాదించి ఈ ఇంగ్లీషు మీడియం విస్తరించడం వెనుక జగన్‌కు రహస్య ఎజెండా ఉందని తీర్మానించారు. ఇదెక్కడ వాదన అని ఆశ్చర్యపోతూ ఉండగా బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఒక ముస్లిము సంస్కృతోపాధ్యాయుడిగా నియమించడం పట్ల కొందరు నిరసన వ్యక్తం చేయడం వార్తల్లోకి వచ్చింది. 

మతానికి, భాషకి లింకుందా అని ఆలోచిస్తే దేవుడికి ఫలానా భాషలో చెపుతూనే అర్థమౌతుందా? అనే ప్రశ్న వస్తుంది. అంటే మూగవాడి గోడు దేవుడికి అందదా? పశుపక్ష్యాదులు, వృక్షజాతి తమ బాధను దేవుడికి చెప్పుకోలేవా? హిందూ మతానికి వస్తే మంత్రాల్లో చాలా భాగం సంస్కృతంలోనే ఉంటాయి. కానీ తమిళనాడులో తమిళంలో కూడా ఉంటాయి. మరి తమిళుల ఘోష దేవుడికి అందటం లేదా? తేలు మంత్రం, బెణుకు మంత్రం లాటివి తెలుగులోనే ఉంటాయి. వాటి కేమంటాం? సంస్కృతం అంటే అర్థం ఏమిటి? 'బాగుగా చేయబడినది', 'సంస్కరించబడినది' అని అర్థం. చరిత్రలో ఒక దశలో భాషను సంస్కరించే ప్రక్రియ సాగింది. ఆ క్రియకు ముందున్న భాషను ప్రా-కృతం (చేయడానికి పూర్వం ఉన్నది) అంటారు. సంస్కృతం వాడుకలోకి వచ్చే ముందు దేవుణ్ని ఏ మంత్రాలతో కొలిచేవారు మరి? లేక అప్పట్లో దేవుడు లేడా? సంస్కృతం తయారయ్యాకనే ఆయనా దిగి వచ్చాడా?

దేవుడితో అనుసంధానం కావడానికి అతి దగ్గర మార్గం ధ్యానం అంటారు. ధ్యానంలో మంత్రం జపించవలసిన అవసరం లేదు. ఏకాగ్రతతో దేవుడి మీద మనసును లగ్నం చేస్తే చాలు. అక్కడ భాషతో పనేముంది? చిన్న పిల్లవాడు పరీక్షలో పాస్‌ చేయించమని దేవుడికి మొక్కుకుంటాడు. వాడి మాతృభాషలోనే చెప్పుకుంటాడు తప్ప దీని కోసం అర్జంటుగా సంస్కృతం నేర్చుకోడు. చదువు రానివాడూ వాడికి వచ్చిన భాషలోనే ప్రార్థిస్తాడు. ఇలా చూస్తే దేవుడికి భాషతో పని లేదు. మతానికీ అక్కరలేదు. మతవ్యాప్తికి కావాలి. ఎందుకంటే మతగ్రంథాలు జనాల్లోకి వెళ్లాలంటే వాళ్లకు తెలిసిన భాషలో రాయాలి. అందుకే పురాణాలను సంస్కృతంలోనే ఉంచేయకుండా దేశంలోని పలుభాషల్లోకి అనువదించారు. రామచరిత మానస్‌ వంటివి స్థానిక భాషల్లోనే పుట్టాయి. మొదట్లో మౌఖికంగా వ్యాప్తి అయ్యేవి, తర్వాత తాటాకు గ్రంథాలపై అయ్యాయి, అచ్చు యంత్రం వచ్చాక పుస్తక రూపాలలో వ్యాప్తి అవుతున్నాయి. 

హిందూ దేవుళ్ల కథ కాబట్టి రామాయణం సంస్కృతంలోనే ఉంచేయాలి అని ఎవరూ అనుకోలేదు. స్థానికుల భాషలోకి తీసుకుని వచ్చారు. అలాగే యితర మతగ్రంథాలూ వచ్చాయి. మతగ్రంథాలే కాదు, రకరకాల పుస్తకాలూ వచ్చాయి. తెలుగువాళ్ల మధ్య హిందూమత వ్యాప్తికై నేనేదైనా పుస్తకం రాయాలంటే అర్జంటుగా సంస్కృతం నేర్చుకోనక్కర లేదు. భాష అనేది తెలుసుకోవడానికి ఉపకరించే సాధనం తప్ప ఏ మతంతోనూ ముడిపడలేదు. ఆంబేడ్కర్‌ బౌద్ధం తీసుకున్నారు. దానికి సంబంధించిన గ్రంథాలు పాళీ భాషలో ఉన్నాయి కదాని పాళీ భాష నేర్చుకోలేదు. బౌద్ధం చైనా, జపాన్‌, ఆగ్నేయాసియా దేశాల్లో వ్యాపించింది. అక్కడి వాళ్లంతా బౌద్ధులుగా మారడానికి పాళీ భాష నేర్చుకోలేదు. తమ భాషలోనే ఆ పుస్తకాలు అనువాదం చేసుకున్నారు. ప్రచారం చేయడానికి అక్కడకు వెళ్లిన బౌద్ధసన్యాసులు స్థానిక భాష నేర్చుకుని, ఆ భాషలోనే వాళ్లతో సంభాషించి వ్యాప్తి చేశారు. మన తెలుగునాట జైనం, బౌద్ధం, హైందవం అన్నీ ఏకకాలంలో వర్ధిల్లాయి. అందరు మతస్తులూ ఒకే భాష మాట్లాడారు. రాజుగారు హిందూ అయితే, రాణిగారు జైనులైన సందర్భాలున్నాయి. మతం వేరే కదాని వేర్వేరు భాషల్లో మాట్లాడుకోలేదు. 

బౌద్ధసన్యాసుల లాగానే క్రైస్తవ ప్రచారకులూ క్రైస్తవాన్ని ప్రచారం చేయడానికి వివిధ దేశాలకు వెళ్లినపుడు స్థానికుల భాషలోనే మాట్లాడారు. లాటిన్‌లో మాట్లాడలేదు.  క్రీ.శ. 42లో మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ ప్రచారకుడు, క్రీస్తు శిష్యుడు సెయింట్‌ థామస్‌. అతనికి ఇంగ్లీషు అనే భాష ఉందో లేదో కూడా తెలిసి వుండకపోవచ్చు. అసలు అప్పటికి ఆ భాష రూపుదిద్దుకుందో లేదో! అప్పణ్నుంచి అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు వివిధ దేశాల నుంచి వచ్చి ప్రచారం చేస్తూనే వచ్చారు. అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడారా? ఇటీవలి కాలంలో ఇంగ్లీషు వాళ్ల కంటె ముందు పోర్చుగీసు వాళ్లు వచ్చి గోవా ఆక్రమించి, స్థానికులను బలవంతంగా క్రైస్తవంలోకి మార్పించిన ఘటనలు చరిత్ర కెక్కాయి. వాళ్లు బైబిలు ఇంగ్లీషులో చదివించారా? అంతెందుకు ఇస్కాన్‌ వాళ్లున్నారు, వివిధ దేశాల్లో హిందూమత ప్రచారం చేస్తున్నారు. సంస్కృతంలో చేస్తున్నారా? సంస్కృత పుస్తకాలు పంచుతున్నారా?

ఇవన్నీ చూస్తే ఇంగ్లీషుకు, క్రైస్తవానికి ముడి పెట్టేవాళ్లు ఎంత మూర్ఖులో అర్థమవుతుంది. ఒరిజినల్‌ బైబిలు ఇంగ్లీషులో ఉందా? హీబ్రూలో ఉంది. అది పట్టుకుని వచ్చి మన కిస్తే ఎటునుంచి చదవాలో కూడా తెలియక పక్కన పడేస్తాం. అందుకే స్పెయిన్‌ నుంచి వచ్చినా, ఆర్మీనియా నుంచి వచ్చినా క్రైస్తవ మత ప్రచారకులు స్థానిక భాషలోనే ప్రచారం చేశారు. ఇంగ్లీషులో కాదు. నిజానికి స్థానిక భాషల్లో నిఘంటువుల తయారీలో, పుస్తకాల ప్రచురణలో క్రైస్తవ మిషనరీల పాత్ర గణనీయంగా ఉంది. అది ఆ భాషల మీద ప్రేమ కాదు, కస్టమరును చేరడానికి వేరే మార్గం లేదు కాబట్టి! పైగా వాళ్ల ప్రాస్పెక్టివ్‌ క్లయింట్లు ఎవరు? గిరిజనులు, సమాజంలో అణగారిన వర్గాలు, విద్యాహీనులు.. వగైరా! వాళ్ల చదువే అంతంతమాత్రం! దానికి తోడు ఇంగ్లీషులో లెక్చర్లు దంచితే పారిపోతారు. అందువలన వారి మాతృభాషలోనే పుస్తకాలు అచ్చు వేసి పంచారు. మతబోధనలు వారి మాతృభాషలోనే చేశారు.

మన దేశంలో అనేక చర్చిల్లో సెర్మన్‌ (ప్రవచనం) స్థానిక భాషలోనే జరుపుతారు. బెంగుళూరులో ఓ సారి పెద్ద గొడవ అయింది. అక్కడి తమిళులు ఆధిక్యత ప్రదర్శించి, తమిళంలోనే ప్రవచనం చెప్పాలని పట్టుబట్టారు. కన్నడిగులు 'కుదరదు, స్థానిక భాష అయిన కన్నడంలోనే చెప్పాల'ని పట్టుబట్టారు. రగడ ముదిరి ఫాదర్‌ను పట్టుకుని కొట్టినట్లు పేపర్లో చదివిన గుర్తు. దీనివలన అర్థమౌతున్నదేమిటి? క్రైస్తవ ప్రచారం, మతప్రార్థనలు స్థానిక భాషలోనే జరుగుతున్నాయని! మరి ఇంగ్లీషుకి, క్రైస్తవానికి ముడి పెట్టడం దేనికి? మనల్ని పాలించిన ఆంగ్లేయుల భాష ఇంగ్లీషు, వారి మతం క్రైస్తవం. అందువలన రెండూ ముడిపెట్టేశారన్నమాట. మన తెలుగు ప్రాంతాలను కన్నడ రాజులు, మరాఠీ రాజులు, ఒడియా రాజులు, తమిళ రాజులు వేర్వేరు కాలాల్లో పాలించారు. వారందరూ హిందువులే. అందువలన హిందూమతానికి కన్నడానికి/మరాఠీకి/ఒడియాకు.. ముడి పెడతామా? ఇంగ్లీషు వాళ్లు ఇంగ్లీషు ద్వారా అందర్నీ క్రైస్తవులుగా మార్చేశారని అనుకునే మాటయితే 1947లో వాళ్లు మనల్ని విడిచి వెళ్లేపాటికి క్రైస్తవుల జనాభా 1.5% మాత్రమే నట! తర్వాత ప్రాంతీయ భాషల ప్రాధాన్యం పెరిగిన తర్వాతనే క్రైస్తవుల శాతం పెరిగింది. దానికి ఏమందాం?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడితే ఇంగ్లీషులో బైబిళ్లు పంపిణీ చేసేసి, చిన్నప్పటి నుంచే క్రైస్తవం నూరి పోసేస్తారట. తెలుగు మీడియం ఉంటే తెలుగు బైబిళ్లు యివ్వరా? ప్రయివేటు మిషనరీ స్కూళ్లల్లో బ్రెయిన్‌వాష్‌ చేసి క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తారనుకుంటే, ఇప్పుడీ ఇంగ్లీషు మీడియం మార్పు ద్వారా పేదప్రజలందరూ ప్రభుత్వ స్కూళ్లకు హాజరై, మిషనరీ స్కూళ్లకు దూరమై క్రైస్తవం బారి నుంచి తప్పించుకోవచ్చు. ఆ మేరకు యీ మార్పు హిందువులకు హర్షణీయమని ఒప్పుకోవాలి. ఆంగ్లానికి, క్రైస్తవం ముడి పెట్టే మహానుభావులున్నట్లే, ఇస్లాంకు, ఉర్దూకి ముడిపెట్టే ప్రబుద్ధులూ ఉన్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట ఉర్దూ మీడియం స్కూళ్లు పెడతామని, ఉర్దూ నేర్పిస్తామని రాజకీయ నాయకులు హామీలిస్తూ ఉంటారు. తెలుగు అధికార భాష చేసి, తెలుగు రాకపోతే ప్రభుత్వోద్యోగాలు యివ్వం అని అంటూ (ఆ జిఓలు అమలు కావటం లేదు కానీ అమలైతే..?) వీళ్లని ఉర్దూలోనే చదవమంటే దానికి అర్థమేమిటి? ఉద్యోగాలు రాకుండా చేద్దామనా?

అయినా ఉర్దూకి, ఇస్లాంకు లింకేమిటి? ఇస్లాం పుట్టింది అరేబియాలో. కురాన్‌ రాసినది అరబిక్‌లో. వాళ్ల ప్రార్థనలు అరబిక్‌లో. ఇక ఉర్దూ ఎక్కణ్నుంచి వచ్చింది? అక్బరు కాలంలో దేశం మొత్తానికి ఒక లింకు భాష ఉంటే మంచిదనుకుని, అరబిక్‌, పర్షియన్‌, సంస్కృతం, బ్రజ్‌ భాష వంటి అనేక భాషల నుంచి పదాలు తీసుకుని ఉర్దూ తయారుచేశారు. తర్వాత అది అనేక భారతీయ భాషల్లోకి చొచ్చుకుపోయింది. ఉర్దూని మతంతో సంబంధం లేకుండా అందరూ వాడారు. ప్రేమ్‌చంద్‌ కథలన్నీ ఉర్దూలోనే రాశారు. ఇప్పటికీ ఉర్దూలో కవిత్వం రాసే హిందువులు, శిఖ్కులు అనేకమంది ఉన్నారు. బెంగాల్‌, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ వంటి అనేక ప్రాంతాల్లోని ముస్లిములు స్థానిక భాషలోనే మాట్లాడతారు తప్ప ఉర్దూలో మాట్లాడరు. తెలుగునాట ముస్లిములు యిళ్లల్లో దక్కనీ ఉర్దూ వంటి భాష ఒకటి మాట్లాడతారు. అది పుస్తకాలకు ఎక్కదు. దాన్ని రాయడమూ వాళ్లకు రాదు. ఉర్దూ పుట్టేందుకు ముందు నుంచీ ఇస్లాం ఉంది. ఇస్లాం ఇండోనేసియా వంటి అనేక దేశాలకు వ్యాపించింది. అక్కడ స్థానిక భాషే మాట్లాడతారు తప్ప ఉర్దూ మాట్లాడరు. 

వాస్తవాలు యిలా ఉండగా ఉర్దూ అంటే ముస్లిముల భాష అనీ, సంస్కృతం అంటే హిందువుల భాష అని ముద్ర కొట్టేస్తున్నారు మన దేశంలో. బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్‌ విభాగంలో నవంబరు 6న ఫిరోజ్‌ ఖాన్‌ అనే సంస్కృత పండితుణ్ని సంస్కృత సాహిత్య విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా వేయడం వివాదాస్పదమైంది. ఆయన సంస్కృతంలో రిసెర్చి చేసి డాక్టరేటు కూడా తీసుకున్నాడు. అయినా 'హత్తెరీ, ఒక ముస్లిము మాకు సంస్కృత పాఠాలు చెప్పడమా?' అంటూ కొందరు హిందూ విద్యార్థులు నిరసన తెలిపి ఆయన క్లాసులు బహిష్కరించి, వైస్‌ ఛాన్సలర్‌ గది ఎదుట ధర్నా చేసి, యూనివర్శిటీ క్యాంపస్‌లో హోమం చేసి, గందరగోళం సృష్టించారు. అయితే సంస్కృత విభాగంలోని తక్కిన లెక్చరర్లు ఆయనకు మద్దతుగా నిలవడంతో యూనివర్శిటీ యాజమాన్యం గట్టిగా నిలబడింది. విద్యార్థులు వైస్‌ ఛాన్సలర్‌కి ఒక ప్రశ్నావళి అందించారు. 10 రోజుల్లో వాటికి జవాబిస్తామని సర్ది చెప్పి, 14 రోజుల తర్వాత ఆందోళన  విరమింప చేశారు వైస్‌ ఛాన్సలర్‌. ఆ ప్రశ్నావళిలో ఏముందో యింకా తెలియదు.

అదే యూనివర్శిటీలో ఉర్దూ విభాగంలో రిషి కుమార్‌ శర్మ అనే హిందూ ప్రొఫెసర్‌ ఉన్నారు. ఒక హిందూ మాకు ఉర్దూ ఎలా చెప్తాడు అని ముస్లిం విద్యార్థులు యింకా గొడవ మొదలుపెట్టలేదు. ఆ మాటకొస్తే 1920 నుంచి 30 ఏళ్ల పాటు ఉర్దూ విభాగానికి అధిపతిగా మహేశ్‌ ప్రసాద్‌ అనే హిందువే ఉన్నారు. అప్పుడూ గొడవ రాలేదు. తర్వాత కూడా ఉర్దూ విభాగానికి అధిపతులుగా అమృత్‌ లాల్‌ ఇష్రత్‌, హుకుమ్‌ చంద్‌ నయ్యర్‌ వంటి హిందువులు ఉన్నారట. ఇప్పుడీ ఫిరోజ్‌ ఖాన్‌ తండ్రి రంజాన్‌ ఖాన్‌ కూడా సంస్కృతంలో నిష్ణాతుడు. 'శాస్త్రి' బిరుదు పొందాడు. స్వరాష్ట్రమైన రాజస్థాన్‌లో హిందూ దేవాలయాల్లో భజనలు పాడతాడు. దేవుణ్ని స్తుతిస్తూ పాటలు రాస్తాడు.  ఆరతి యిస్తూ ఉంటే హార్మోనియం వాయిస్తాడు. గోశాలలో సేవలు అందిస్తాడు. దానితో పాటు మసీదుకి వెళ్లి ప్రార్థనలూ చేస్తాడు. అక్కడి హిందువులు ఎవ్వరూ దీనికి అభ్యంతర పెట్టరు. ఇక్కడ విద్యాధికులు మాత్రం గొడవ చేస్తున్నారు. 

తండ్రిలాగానే తను కూడా సంస్కృత పండితుణ్ని కావాలనే కోరికతో ఫిరోజ్‌ జయపూర్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌లో చదువు పూర్తి చేసుకుని, అక్కడ మూడేళ్లు ఫ్యాకల్టీలో పనిచేశాడు. రాజస్థాన్‌ ప్రభుత్వం అతన్ని సంస్కృత యువ ప్రతిభా సమ్మాన్‌ అవార్డుతో సత్కరించింది. అతను బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఉద్యోగానికి అప్లయి చేసినప్పుడు, యూనివర్శిటీ, యుజిసి కలిసి నిర్వహించిన పరీక్షలన్నీ దాటుకుని నిబంధనల ప్రకారమే ఎంపిక అయ్యాడు. నిరసన తెలిపే విద్యార్థులకు అతని ప్రతిభ అక్కరలేదు. అతనికి యిచ్చిన ఉద్యోగం గుళ్లో పూజారి ఉద్యోగం కాదు, క్లాసులో పాఠాలు చెప్పే ఉద్యోగం. అది కూడా వాళ్లకు కిట్టటం లేదు. 

నిజానికి యితరులు మన భాష నేర్చుకున్నారంటే సంతోషిస్తాం. మన సంస్కృత కావ్యాలు, వేదాలు యితర ప్రపంచ భాషల్లోకి అనువదితమయ్యాయంటే పొంగిపోతాం. ఈనాటికీ ఇస్కాన్‌ కారణంగానో, మరొకరి కారణంగానో 'మ్లేచ్ఛులు' భగవద్గీతను ఆలపిస్తూ ఉంటే ఆనందిస్తాం. ఈనాడు అరేబియా అంటే మొరటు షేక్‌లే గుర్తుకు వస్తారు కానీ ఒకప్పుడు అది సకల శాస్త్రాలకు నిలయం. యూరోప్‌కు, ఆసియాకు సాంస్కృతిక వారధి. వివిధ దేశాల నుంచి విజ్ఞానం సేకరించి, తమ భాషలోకి మార్చుకుని, తక్కిన దేశాలకు వ్యాపింప చేసేవారు. మన పంచతంత్రం దగ్గర్నుంచి, రామాయణాది పురాణాల దాకా సమస్తం సంస్కృతం నుంచి అరబిక్‌లో అనువదించబడ్డాయి. 

భారత్‌కి వస్తే ఔరంగజేబు అన్నగారు దారా షికో సంస్కృతంలో పండితుడంటే, 52 ఉపనిషత్‌లను పర్షియన్‌ భాషలోకి అనువదించ గలిగాడంటే మన సంస్కృత పండితులు అతనికి నేర్పినట్లేగా! ఈ ముస్లిములందరూ తాము నేర్చుకోవడమే కాక, యితరులకు కూడా నేర్పి ఉంటారుగా. మాక్స్‌ ముల్లర్‌ వేదాలను ఆపోశన పట్టి, జర్మన్‌ భాషలోకి అనువదించినప్పుడు తన సహాయకులకు కూడా నేర్పి వుంటాడుగా. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిజ్‌ యూనివర్శిటీలలోని సంస్కృత ప్రొఫెసర్ల (మతరీత్యా క్రైస్తవులు) మధ్య ఒక విషయంలో వివాదం వచ్చినప్పుడు వారణాశి పండితులు దాన్ని పరిష్కరించారనే కథ వ్యాప్తిలో ఉంది. అందువలన హైందవేతరులు సంస్కృతాన్ని నేర్చుకోవడం, నేర్పడం అనాదిగా వస్తూ ఉంది. ఇప్పుడు దాని గురించి కొత్తగా నిరసనలు తెలపడం మన సమాజంలో పెరుగుతున్న అసహనాన్ని సూచిస్తోంది.

సరే, బెనారస్‌ హిందూ యూనివర్శిటీ విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు, భావోద్వేగాలకు లోనై ప్రవర్తించారు, త్వరలోనే తప్పు తెలుసుకుంటారు అనుకుని ఊరడిల్లవచ్చు. కానీ సీనియర్‌ పాత్రికేయులు అయిన రాధాకృష్ణ కూడా మతానికి, భాషకు ముడిపెట్టి మాట్లాడితే ఎలా? ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వ పాఠశాలలో చదివే బిసిలను క్రైస్తవులుగా మార్చే కుట్రను చూస్తున్నాడాయన. జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయన వాదన ఒక్కటే - 'జగన్‌ బిసిలను క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు' అని. ఈ ఇంగ్లీషు మీడియం ఒకటో తరగతిలోనే పెట్టేస్తే క్రైస్తవంలోకి మార్చడం సులువుట! 

అసలు బిసిలు క్రైస్తవులుగా మారే అవకాశం ఎంత ఉందో చూద్దాం. మతాభిమానం కాకుండా క్రైస్తవంలోకి మారడానికి మనకు కనబడే కారణాలు రెండు - పేదరికం, అగ్రవర్ణ హిందువులు వారి పట్ల చూపే వివక్షత. పేదలందరూ క్రైస్తవులుగా మారరు, మారే మాటైతే దేశంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారి శాతం 23! క్రైస్తవుల శాతం దానిలో పదో వంతు ఉంది. ఎస్టీల విషయానికి వస్తే వారుండేది దుర్గమ ప్రాంతాలలో కాబట్టి వారికి ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉండవు. క్రైస్తవ మిషనరీలు కష్టాల కోర్చి అక్కడకు వెళ్లి స్కూళ్లు, ఆసుపత్రులు పెట్టడం చేత మతం మారితే మెరుగైన విద్య, వైద్యం లభిస్తాయనే ఆశతో కొందరు ఎస్టీలు మారుతున్నారంటారు. 

ఇక ఎస్సీలకు వస్తే వారిలో కొందరు ధనికులున్నా, పేదరికం చేత, వివక్షత చేత పీడించబడేవాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు క్రైస్తవం పట్ల ఆకర్షణ చూపుతున్నారు. మరి బిసిలలో పేదల శాతం ఎంత? ఎస్సీలలో ఉండేటంత ఉందా? రాజకీయ కారణాల చేత అనేక కులాల్ని 'వెనుకబడిన వర్గాలు'గా గుర్తించేశారు కానీ వారిలో చాలామంది అగ్రవర్ణాల కంటె మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్నారు. పేదరికం చేత వాళ్లు మతం మారతారంటే నమ్మే పరిస్థితి లేదు. ఇక సామాజిక వివక్షత! దళితులు అనుభవించే వివక్షత బిసిలు ఎప్పుడైనా అనుభవించారా? వాళ్లని అంటరానివాళ్లని ఎవరైనా అన్నారా? వాళ్లను గుడిలోకి రానివ్వమని ఎప్పుడైనా అన్నారా? చాకలి, మంగలి, కంసాలి, కమ్మరి.. లేకుండా గుడిలో దేవుడి వివాహం జరుగుతుందా? అందువలన వివక్షత కారణంగా బిసిలు మతం మారడం అసంభవం! బిసిలు మూకుమ్మడిగా మతం మారిన సంఘటనలు ఏమైనా ఉంటే రాధాకృష్ణగారు వాటిని బయటపెట్టాలి.

అసలీయన బిసి-క్రైస్తవం పాట ఎందుకు ఎత్తుకున్నారు? వైసిపికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మద్దతు ముందునుంచీ ఉంది. రెడ్లలో అధికుల మద్దతు కూడా ఉంది. టిడిపికి కమ్మ, బిసిల మద్దతు బలంగా ఉంది. 2014లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు యిత్యాది వర్గాల మద్దతు కూడా లభించింది. 2019 వచ్చేసరికి ఈ వర్గాలలో చీలిక వచ్చి, కొందరు వైసిపికి వేశారు. ముఖ్యంగా బిసిలు అధిక సంఖ్యలో టిడిపి నుంచి వైసిపికి మారారు. 

ఇది టిడిపికి చావుదెబ్బ లాటిది. బిసిలను వైసిపికి దూరం చేస్తే తప్ప టిడిపికి భవిష్యత్తు లేదు. అందువలన 'అటువైపు వెళితే మిమ్మల్ని క్రైస్తవులుగా మార్చేస్తాడు జాగ్రత్త' అని అడలగొట్టే ప్రయత్నం జరుగుతోందని అనుకోవలసి వస్తోంది. జగన్‌ను విమర్శించే అస్త్రాలలో అత్యంత పదునైనది క్రైస్తవం అని టిడిపి అభిప్రాయం. అందువలన ప్రతిదాన్నీ దానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. 'ఇప్పుడు ఆంధ్ర సమాజం హిందువులు వెర్సస్‌ క్రైస్తవులుగా విడిపోవడానికి బీజం పడుతోంద'ని రాధాకృష్ణ అభిప్రాయం. ఇప్పటివరకు కులాల వారీగా విడిపోయిందని బాధపడ్డారు. ఇప్పుడు యిది మొదలెట్టారు. 

మొన్న వల్లభనేని వంశీ టిడిపిపై విరుచుకు పడి అనేక ఆరోపణలు చేశాడు. చాలా లౌక్యంగా మాట్లాడుతూ 'ఫలానా అకృత్యం మీరు చేశారని నేనన్నానా?' అంటూ చాలా ఏకరువు పెట్టాడు. ('అన్నానా, భామినీ, ఎపుడైనా?' అనే ''సారంగధర'' సినిమా పాట గుర్తుకు వచ్చింది నాకు) చేవ వుంటే వాటిని ఖండించాలి. కానీ చిత్రంగా 'అయ్యప్ప మాల వేసుకుని అలా మాట్లాడవచ్చా?' అంటూ మధ్యలో మతాచారాన్ని తీసుకుని వచ్చారు. వంశీ అపరాధం చేస్తే దేవుడే ఆయన పని పడతాడు, మధ్యలో వీళ్ల కెందుకు? అలాగే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని అనేక కోణాలలో విమర్శించవచ్చు. కానీ క్రైస్తవవ్యాప్తికై పెట్టారని అనడం అసమంజసం, అర్థరహితం. 

ఇక - ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం గురించి కూలంకషంగా రాసేశానని అనుకున్నాను. కానీ దానిపై చర్చలు ఆగటం లేదు. సంబంధం ఉన్నవీ, లేనివీ అనేక అంశాలు తీసుకుని వస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలికలు తెస్తున్నారు. వాటినన్నిటినీ క్రోడీకరించి మరో వ్యాసం రాస్తాను. (ఫోటో - నిరసనలో భాగంగా హోమం చేస్తున్న బిఎచ్‌యు విద్యార్థులు)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?