Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఇది మాత్రమే తరుణమా? - 1/2

ఎమ్బీయస్‌: ఇది మాత్రమే తరుణమా? - 1/2

కొంతమంది తెలుగువాళ్లలో హఠాత్తుగా చురుకు పుట్టింది. తెలుగువాళ్లందరూ ఏకమై, ఏకతాటిపై నడిచి బిజెపిని ఎదుర్కునే తరుణమిదే అంటూ బోల్డు వాట్సప్‌లు వచ్చి పడిపోతున్నాయి. ఇది మాత్రమే తరుణమా, యింతకు ముందు రాలేదా? అని నా అనుమానం. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? హోదా లేదు, పేరుకే ప్యాకేజీ తప్ప అదీ ఉత్తుత్తిదే అని. ఈ పరిస్థితి యిప్పుడే, యీ నెలలోనే వచ్చిందా? లేదే! హోదా తిరస్కరించడం నాలుగేళ్లగా ఉంది. ప్యాకేజీ యిస్తానని ఊరించడం రెండేళ్లగా ఉంది.

అప్పటి నుంచి ఆంధ్ర ముప్పు ఎదుర్కుంటోంది. టిడిపికి ముప్పంటారా యిప్పుడొచ్చింది. మహాప్రస్థానం ముందుమాటలో చలం అన్నాడు - 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ', ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ' అని. ప్రపంచంలోని కష్టజీవుల వ్యథలను తలచుకుని శ్రీశ్రీ బాధపడతాడు. భావకవి ఐన కృష్ణశాస్త్రి 'నా ప్రేయసి నన్ను విడిచిపోయింది' అంటూ బాధపడుతూ మనల్ని బాధపెడతాడు. టిడిపి భావకవి లాటిది. దానికి కష్టం వస్తే మననూ బాధపడమంటుంది. బాబు చెప్తున్నారు - కేంద్రవైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించాలట, రోజూ ఓ అరగంట నిరనస తెలపాలట! 

ఆంధ్రను బిజెపి కొత్తగా దగా చేయలేదు. మోసం చేస్తోంది మొర్రో అని జనాలందరూ మొత్తుకుంటూ ఉంటే, 'ఛ, వాళ్లకు మనకు ఎంత చేశారు, మరే యితర రాష్ట్రానికి చేయనంత చేశారు. అంతకంటె ఎవ్వరూ చేయలేరు' అంటూ దబాయించి నోరు మూసినది టిడిపియే. 'రాజధానికి యింతే యిచ్చారు, పోలవరానికి అంతే యిచ్చారు, యిలా అయితే ఎప్పటికి పూర్తయ్యేను' అని తక్కిన అందరూ ఘోష పెడుతూంటే 'ఛా, అదేం లేదు 2019 కల్లా రెండూ పూర్తి చేసి చూపిస్తామని మభ్యపెట్టింది' టిడిపియే కదా! ఇప్పుడు యిద్దరి మధ్య చెడింది.

ఇప్పుడు బిజెపి కుట్ర చేసింది, తిట్టండి అని మనల్ని వేధిస్తున్నారు. మేం యిచ్చిన డబ్బుతో ఒళ్లు చేసిన సినిమావాళ్లు యింత కుట్ర జరుగుతూంటే నోరు మెదపరేం? అని టిడిపి ఎమ్మెల్సీ ఘాటుగా నోరు పారేసుకున్నారు. మీరు లేచినప్పుడే మేం లేవాలా? అంటూ పోసాని ఘాటున్నరగా జవాబిచ్చారు. టిడిపి వారు బిజెపిని ఉద్దేశించి 'రాజకీయంగా కక్ష ఉంటే మమ్మల్ని వేధించండి, కానీ ఆంధ్ర ప్రజలకు శిక్ష వేయకండి' అని నివేదనలు ఒకటి! అక్కడికి టిడిపివారు మాత్రమే తెలుగువారయినట్లు, తక్కిన పార్టీల వారు కానట్లు! తమకు గిట్టని రాష్ట్రం కాబట్టి ఆంధ్రకు బిజెపి నిధులివ్వలేదని అంటున్న టిడిపి వారు మాత్రం రాష్ట్రంలో ఏం చేశారు?

ప్రతిపక్ష పార్టీని ఎన్నుకున్న నియోజకవర్గాలకు నిధులు లేకుండా ఎండ గట్టలేదా? అధికార పార్టీలోకి ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యే చెప్పాడు. 'మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. జన్మభూమి కమిటీలు వేసి అధికారాలన్నీ వాళ్లకిచ్చి మమ్మల్ని నిర్వీర్యులను చేశారు. పనులు జరగకపోవడంతో మా ఊరి ప్రజలంతా అధికార పార్టీలో చేరమనడంతో వారి మాట శిరసావహించా' అని. అదే పని బిజెపి నిస్సిగ్గుగా చేస్తోంది. ఆంధ్రకు హోదా యివ్వలేదు కానీ బిహార్‌ ఎన్నికలకు ముందు వేలం పాటలో లక్షల కోట్లు ఆఫర్‌ చేశారు. కశ్మీరులోనూ అంతే. ఇక్కడ ఋణమాఫీకి నో అన్నారు కానీ యుపిలో ఎస్‌ అన్నారు. 

బిజెపి తీరు యింత అధ్వాన్నంగా ఉన్నా దానితో బాబు అంటకాగారు. ఆ విషయాన్ని ఎత్తి చూపితే టిడిపి అభిమానులు మొదటి రోజు నుంచే పోట్లాడాలా? అని వాదిస్తున్నారు. మొదటి రోజు కాదు, మొదటి ఏడాది కాదు, టెర్మ్‌లో సగకాలం రెండున్నరేళ్లు పూర్తయ్యాకైనా గుర్తించాలిగా మన ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ సారు! అప్పటికి కూడా తెలియకపోతే ఆయనేం మేధావి? ఆయనేం చాణక్యుడు, దూరదర్శి, దీర్ఘదర్శి ఎట్సెట్రా? ఆయనకు తెలుసు, కానీ బయటపెడితే ఆంధ్రులు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడతారని గుంభనంగా ఉన్నాడు అని కూడా వాదించవచ్చు. అలాటి పరిస్థితుల్లో మిన్నకుంటే పోయేది.

కానీ సన్మానాలు, సత్కారాలు, అసెంబ్లీ తీర్మానాలు, యింతకు మించిన ప్యాకేజీ లేదంటూ జనాలను మభ్యపెట్టడం తప్పు కదా! పైగా హోదా కోసం ఆందోళనలు చేస్తే జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. ఈ నెలలోనే ప్లేటు ఫిరాయించారు. ఇప్పటికైనా ఆ కేసులు ఎత్తించేయాలి కదా. 

లేటెస్టుగా తెలుగువారందరూ ఏకమై బిజెపిని ఎదిరించాలని మనకు పిలుపొకటి. సాటి తెలుగు ముఖ్యమంత్రి కెసియార్‌తో మాట్లాడినట్లు, ఒప్పించినట్లు లేదు. పార్లమెంటులో తెరాస వాళ్లు రగడ చేసి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్నారు. సరే ఆయనది పక్క రాష్ట్రం. సొంత రాష్ట్రంలో మరో తెలుగు నాయకుడు జగన్‌తో మాట్లాడానికి నామోషీ ఎందుకు? హోదా కోసం భుజం కలుపుతున్నారా? జగన్‌ అంటే వ్యక్తిగతంగా యిష్టం లేకపోవచ్చు కానీ ఆయనకూ కోట్లాది మంది ఓటేశారు. మీకంటె 5 లక్షల ఓట్లు మాత్రమే తక్కువ తెచ్చుకున్నాడు.

అఖిలపక్షం వేసి అందర్నీ కలుపుకుని పోకుండా మేమొక్కరమే పోరాటవీరులం, మీరంతా ద్రోహులు అంటే ఎలా? విజయసాయి రెడ్డి ప్రస్తుతం మోదీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మీ అవిశ్వాస తీర్మానంపై కౌంటర్‌సైన్‌ చేస్తానని వైకాపా అంది కదా. తను స్వయంగా ఓ తీర్మానం పెట్టింది కదా. అయినా దగ్గరకు రానీయరెందుకు? ఇక్కడ మీ పార్టీ ప్రయోజనాలే ఎక్కువై పోయాయా? ఇద్దరూ  కనీసం యీ విషయంలో కలిసి పోరాడితే ఏమైనా రాలుతుందేమోనని ఆశగా ఎదురు చూసే తెలుగు ప్రజల గోడు మీకు పట్టదా? నిందితులు ప్రతిపాదించిన తీర్మానంపై మేం సంతకం పెట్టం అంటారు.

ప్రతిపక్ష నాయకుల పేర్లు ఉచ్చరించడానికి కూడా యిష్టపడక ఎ1, ఎ2 అంటూంటారు. ఆ పంచాయితీ యిప్పుడు అవసరమా? నిందితులేమిటి, పార్లమెంటులో ఎంతోమంది క్రిమినల్సే ఉన్నారు. క్రిమినల్స్‌ను ఎన్నికలలో పాల్గొనకుండా చేద్దామని సుప్రీం కోర్టు సూచిస్తే కేంద్రం ఒప్పుకోలేదు. టిడిపి ఎంపీల్లో కేసుల్లో యిరుక్కున్నవాళ్లు లేరా? విజయసాయి రెడ్డి కలిశాడు అనే టాపిక్కే ఎక్కువసార్లు చెప్తున్నారు. అందులో ఆశ్చర్యమేముంది, రాష్ట్రపతి ఎన్నికల దగ్గరనుంచి వారి పొత్తు తెలుస్తూనే ఉంది కదా. ఇవాళ్లే డిస్కవర్‌ చేసినట్లు ఉలుకెందుకు? 

జగన్‌కు విశ్వసనీయత లేదు కాబట్టి దగ్గరకు రానీయటం లేదు అంటారు మీ ప్రతినిథులు. ఈ విషయంలో తమరికుందా? బిజెపి హోదా యివ్వకపోయినా, ప్యాకేజీ యివ్వకపోయినా మీవాళ్లను అక్కడ మంత్రుల్ని చేశారు, వాళ్లను మీ దగ్గర మంత్రుల్ని చేశారు, ఆహాఓహో అన్నారు. ఇప్పుడు అదంతా అబద్ధం, ఉత్తుత్తిదే అంటున్నారు. మీరు రంగు మార్చినపుడల్లా ప్రజలకు ఆ రంగు పూసేస్తున్నారు. మీరు హోదా అక్కరలేదన్నపుడు ప్రజలకు కూడా అక్కరలేదు ప్యాకేజీ కావాలని చెప్పారు. ఇప్పుడు ప్యాకేజీ కాదు, హోదా అంటున్నారు, ప్రజలూ అదే అనాలిట. అనకపోతే రాష్ట్రద్రోహులట.

మేమే ఆంధ్రరక్షకులం అని చెప్పుకోవడానికి తక్కిన అందర్నీ దోషుల్ని చేస్తున్నారు. పవన్‌ మీకు వ్యతిరేకమయ్యాడు కాబట్టి అతను దుష్టుడు, దుర్మార్గుడు అయ్యాడు. బిజెపి వాళ్లు కేంద్రం యిచ్చిన నిధులు ఎలా వాడారంటూ మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు కాబట్టి, అసెంబ్లీ సీట్లను పెంచం పొమ్మన్నారు కాబట్టి వాళ్లు వంచకులు, నమ్మకద్రోహులు అయ్యారు. ఇవన్నీ టిడిపి సమస్యలు. ఆంధ్రప్రజల సమస్యలు కావు. వాళ్లకు కావలసినది నిధులు, వాటిని సవ్యంగా వినియోగం చేసే రాష్ట్రప్రభుత్వం. అవి ఎవరు యిస్తారని వాళ్లు నమ్మితే వాళ్లకే ఓటేస్తారు. 

పార్లమెంటులో ఏదో ఒక విధంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనీయటం లేదు కాబట్టి బిజెపికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని టిడిపి యీరోజు కనుక్కుంది. అవును నిజమే, బిజెపికి చాలినంత మెజారిటీ ఉన్నా, అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని కచ్చితంగా తెలిసినా, ఆ తీర్మానంపై చర్చ జరగనీయడమే యిష్టం లేదు. ఎందుకంటే హోదా విషయంలో ఎప్పుడూ చెప్పినదే చెప్తారు కానీ ఆ తీర్మానమంటూ పెట్టాక ప్రభుత్వ వైఫల్యాల గురించి బోల్డంత చర్చ జరుగుతుంది.

దానికి ప్రభుత్వం యిచ్చే సమాధానం నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మనివాళ్లు నమ్మరు. కానీ కర్ణాటక ఎన్నికల ముందు అలాటి చర్చ రావడం పెద్ద తలకాయ నొప్పి వాళ్లకు. అందుకని ఎడిఎంకెను గిల్లి ఆ పని చేయిస్తున్నారు. తెరాస ఎజెండా తెరాసది. ఇలాటి ట్రిక్కులు కాంగ్రెస్సూ వేసింది.  కాంగ్రెసు సమైక్యవాదులు అవిశ్వాస తీర్మానం పెట్టిస్తే కమలనాథ్‌ తెలంగాణ కాంగ్రెసు నాయకులు పొన్నం ప్రభాకర్‌ లాటి వాళ్లకు చెప్పి వెల్‌లో నిలబడి గోల చేయించారు. తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బిజెపి అదే పని చేస్తోంది.

ఇలా ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కడం వారికేమైనా కొత్తా? విభజన బిల్లును అడ్డగోలుగా పాస్‌ చేయించినప్పుడు కాంగ్రెసుకు తానతందానా అన్నది బిజెపియే కదా. వీళ్ల మద్దతు లేకుండా కాంగ్రెసు అలా చేయగలిగేదా? ఈ ముక్క టిడిపివాళ్లు బిజెపిని ఎన్నడైనా అడిగారా? కాంగ్రెసును మాత్రమే తిట్టారు. ఇప్పుడు విడిపోయాక బిజెపికి కూడా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని మనకు చెపుతున్నారు అదేదో కొత్త విషయమైనట్లు! కావాలనుకుంటే లైట్లు ఆర్పేసైనా చట్టాలు చేసే క్రియలో భాగస్వామి ఐన బిజెపి పార్లమెంటులో యీ రోజు చీమ చిటుక్కుమన్నా సభ సవ్యంగా లేదంటూ చర్చను వాయిదా వేస్తోంది. 

ఇలా చేస్తే ఆంధ్రులు తమను అపార్థం చేసుకుంటారన్న చింత కూడా లేకుండా బిజెపి వ్యవహరిస్తోంది. ఏమిటో వాళ్ల ధీమా? ఇప్పుడు వాళ్ల ముందున్న ఎజెండా బాబు పరువు తీయడం. అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ, వైకాపా పాత్ర కొట్టేసింది. నాలుగేళ్లుగా రాష్ట్ర కాబినెట్‌లో పాలుపంచుకుంటూ వచ్చినా రాష్ట్ర వైఫల్యాలను బిజెపి తన ఖాతాలో వేసుకోవటం లేదు. టిడిపికే అంటకడుతోంది. ''భలేకోడళ్లు'' సినిమాలో ఓ డైలాగుంది. చలం తన సోదరులతో 'ఈ ఆకాశరామన్న ఉత్తరం మన ముగ్గురిలో ఎవరో ఒకరు రాసి ఉంటారు. మీ ఇద్దరిలో ఎవరు?' అంటాడు. అంటే అప్పటికే తను బయటకు దూకేశాడన్నమాట.

అలాగ బిజెపి ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టులో పంపుల లెక్క, దానిపై కాగ్‌ వ్యాఖ్యల దగ్గర్నుంచి లాగి టిడిపిపై నెట్టేస్తోంది. దానితో బాటు పవన్‌ ద్వారా సాఫ్ట్‌ టార్గెట్‌గా లోకేశ్‌ని దొరకబుచ్చుకున్నారు. బాబుని జైలుకి పంపిస్తే సింపతీ పుట్టి వ్యూహం దెబ్బ తింటుదన్న జంకు ఉంది. కానీ లోకేశ్‌ని పంపిస్తే సింపతీ ఉండదు. లోకేశ్‌ సాధించినందంటూ ఏమీ లేదు యిప్పటిదాకా. శృంగారసాధన మాత్రం చేశారంటూ పాత ఫోటోలు బయటకు తీసి ఆరేస్తున్నారు. మా అబ్బాయికి చాలా క్రమశిక్షణ ఉంది అని బాబు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ డెలికేట్‌ వ్యవహారాలు. మన గురించి మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల గురించి మనంతట మనమే సర్టిఫికెట్లు యిచ్చేయకూడదు. రేపు ఏం బయటకు వస్తుందో ఎవరికి తెలుసు? 

బిజెపి, పవన్‌ ఆరోపణలు చేస్తూ ఉంటే బాబు చూస్తూ ఊరుకుంటారా? గమనించారా, 'ఇది 1995 ఆగస్టు సంక్షోభం వంటిది' అంటూ పోలిక తెచ్చారు. అది ఎన్టీయార్‌ను బాబు వెన్నుపోటు పొడిచిన ఘట్టం. ఇప్పుడు బిజెపి తనను వెన్నుపోటు పొడిచిందని చెపుదామనుకుంటే దాన్ని వాడకూడదు. లక్ష్మీపార్వతి వచ్చి టిడిపి వ్యవహారాల్లో కలగజేసుకోవడంతో ఎన్టీయార్‌తో విభేదించి, కొందరు బయటకు వెళ్లి పార్టీలు పెట్టుకుని దెబ్బ తిన్నారు. బాబు అలాటి సాహసాల జోలికి వెళ్లకుండా, మీడియా సాయంతో ఉన్న పార్టీనే కైవసం చేసుకుని ఎన్టీయార్‌నే బయటకు పంపారు. ఇప్పుడా పోలిక పొసగదనిపిస్తుంది.

కానీ బాబు అంతరార్థం 'అప్పుడు ఎన్టీయార్‌ లక్ష్మీపార్వతికి ప్రాధాన్యత యిచ్చి నన్ను నిర్లక్ష్యం చేశారు. అనుభవించారు. ఇప్పుడు మీరు వైసిపికి ప్రాధాన్యత యిచ్చి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరూ ఎన్టీయార్‌లాగే అనుభవిస్తారు, మీపై నిందలు మోపి, నా అనుకూల మీడియా సాయంతో మీ ఆంధ్ర యూనిట్‌ను కబళించివేస్తా, జాగ్రత్త' అన్న హెచ్చరిక కాబోలు.  (సశేషం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?