cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఇది మాత్రమే తరుణమా? - 2/2

ఎమ్బీయస్‌: ఇది మాత్రమే తరుణమా? - 2/2

నిజానికి టఫెస్ట్‌ జాబ్‌ బిజెపిది. టిడిపిపై జనాలు నమ్మే స్థాయిలో అవినీతి ఆరోపణలు చేయాలి. ఇన్నాళ్లూ యింత అవినీతి జరుగుతున్నా తాము మౌనంగా ఎందుకు ఉన్నామో చెప్పుకోగలగాలి. రాష్ట్రానికి తాము హోదా, నిధులు యివ్వకపోవడానికి తప్పంతా టిడిపిమీద చాకచక్యంగా తోసేయాలి. హోదా యికపై ఉండదని బిజెపి చెపితే నమ్మామనీ, కానీ యిప్పటికే హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు పొడిగించడంతో తాము యిప్పుడు కంగు తిన్నామని టిడిపివాళ్లు చెపుతున్నారు.

వాళ్లకు హోదా కొనసాగించాలన్న నిర్ణయం 10 మంది సిఎంలు కలిసి తీసుకున్నదని, దానిలో ఆంధ్ర ప్రతినిథి ఉన్నారని బిజెపి వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఇక హోదాకు బదులుగా యిస్తానన్న ప్యాకేజీ గురించి టిడిపి ఎన్‌డిఏలోంచి బయటకు వచ్చిన మర్నాడే జేట్లే ప్రకటన చేశాడు. '6 ప్రాజెక్టులకు రూ.16,725 కోట్ల ఋణాన్ని ఇపిఏ ద్వారా యిప్పిస్తామని, దానిలో 90% తిరిగి చెల్లించే బాధ్యత మాదేననీ 2016 సెప్టెంబరులోనే ప్రతిపాదించాం. రాష్ట్రం దానికి సరేనంది. కానీ అడుగు ముందుకు వేయలేదు.

2018 జనవరిలో వచ్చి అబ్బే ఇపిఏ ద్వారా వద్దు నాబార్డ్‌ ద్వారా అంది. స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పివి) పెట్టుకోండి, నాబార్డ్‌ ద్వారా యిప్పిస్తాం అన్నాం. ఫిబ్రవరి 7 న రాష్ట్ర అధికారులు వచ్చి వివరాలు కనుక్కుని చెపుతామన్నారు. అప్పటినుంచి యిప్పటిదాకా ఉలుకూ, పలుకూ లేదు. మేం వాళ్ల గురించి కాచుకుని ఉన్నాం.'' అన్నాడు. ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి పార్లమెంటులో ఎప్పటికైనా చర్చ జరిగినా జేట్లే యివే చెప్తారు. దీనికి టిడిపి సరైన సమాధానం ఎలా చెప్పగలదు? ఋణభారం 10% మాత్రమే అయినా ఇఎపి ఎందుకు వద్దన్నారు? ఆ ఋణాలతో పాత అప్పులు తీర్చుకోవడం ఇపిఏలో, ఎస్‌పివిలో కుదరదు. అప్పు తీసుకుని దాన్ని ఆ ప్రాజెక్టుల మీద కాకుండా వేరేలా ఖర్చు పెడదామనుకున్నాం అని ప్రజలకు ఎలా నచ్చచెప్పగలదు?

ఇక నిధులు ఎలా ఖర్చు పెట్టారన్నదానిపై యుసిలు యివ్వలేదని జేట్లే అన్నాడు. ఇచ్చామని జవాబివ్వవలసినది ఎవరు ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి లేదా ఆర్థిక శాఖ సెక్రటరీ. వారికి బదులుగా కుటుంబరావు చెపితే ఎలా? ఆయనకు జేట్లేని ఖండించేటంత స్టాండింగ్‌, స్టేచర్‌ ఉందా? ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడుతున్న బాబు యుసి గురించి పెదవి విప్పటం లేదు. ఎంతసేపు చూసినా బిజెపి, వైసిపి, పవన్‌ కుమ్మక్కయ్యాయి అని ఆరోపించడం తప్ప మరొకటి చేయటం లేదు.

నిజమే కుమ్మక్కయ్యాయి. సో వాట్‌? మీరు చేయవలసినది ఏ మేరకు చేశారు అనేది ప్రజలకు జవాబు చెప్పుకోవలసినది మీరు. 'విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, అలాటి అవినీతిపరుల్ని వాళ్లు ఎలా రానిస్తున్నారు?' అంటూ బాబు ఊహూ మండిపడుతున్నారు. అవినీతిపరుడు అనేది నింద. రాజ్యసభ ఎంపీ అనేది పదవి. ఆ హోదాతో ప్రధానిని కలిసే హక్కుంది. టిడిపికి వ్యతిరేకంగా డాక్యుమెంట్లు సేకరించే యిచ్చే హక్కూ ఉంది. అంత ఉలికిపాటు అనవసరం. ఇంతెందుకు బాబు బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు, రాష్ట్రంలో ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టారు.

మళ్లీ బాబుకి అత్యంత సన్నిహితులు వెంకయ్యనాయుడుతో మంతనాలు జరుపుతున్నారు. (వెంకయ్య రాజకీయాలకు అతీతంగా ఉన్నారని అనుకునేవాళ్లకి ఒక దణ్ణం). టిడిపి ఎంపీలు కొంతైనా నిధులివ్వండని కేంద్రమంత్రితో బేరాలాడుతున్నారుట. మహారాష్ట్ర బిజెపి మంత్రితో టిడిపి ఎమ్మెల్యే మాట్లాడారట. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. ఇక వైసిపి సలహాదారు ప్రశాంత కిశోర్‌ అమిత్‌ షా మీటింగులో పాల్గొన్నారంటూ టిడిపి అభిమానులు ఒక వార్తను ప్రవేశపెట్టి భంగపడ్డారు. పోనుపోను యిలాటివి ఎన్ని వస్తాయో!

బాబుపై అవిరళంగా నిందలు మోపడానికి అమిత్‌ నిశ్చయించు కున్నారనేది స్పష్టమైంది. ఆంధ్ర రాజకీయాల్లోకి రామ్‌ మాధవ్‌ను రంగంలోకి దింపడంతోనే సీరియస్‌నెస్‌ తెలియవచ్చింది. రామ్‌ మాధవ్‌ అమలాపురానికి చెందిన బ్రాహ్మణుడు. అతని తండ్రి ఆరెస్సెస్‌ కార్యకర్త. హెగ్‌డేవార్‌ పేరులోని 'రామ్‌'ను గోల్వాల్కర్‌ పేరులోని 'మాధవ్‌'ను కలిపి ఆ పేరు పెట్టారు. ఎలక్ట్రికల్‌ యింజనీరింగులో డిప్లొమా, మైసూరు యూనివర్శిటీ నుంచి పొలిటికల్‌ సైన్సులో ఎమ్మే ఉన్నాయి. భారతీయ ప్రజ్ఞ అనే మాసపత్రిక నడిపాడు. మంచి వక్త, అనువాదకుడు, కాలమిస్టు, జాతీయ మీడియాతో సత్సంబంధాలు ఉన్నవాడు. 2003లో వెంకయ్య నాయుడు సిఫార్సుతో ఆరెస్సెస్‌ అతన్ని దిల్లీకి పంపింది, ఆరెస్సెస్‌కు స్పోక్స్‌పర్శన్‌గా ఉండేవాడు.

ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు, మోదీకి అత్యంత ఆత్మీయుడు ఐన అజిత్‌ దోవల్‌కు కుమారుడు శౌర్య దోవల్‌కి చెందిన ''ఇండియా ఫౌండేషన్‌'' లో డైరక్టరుగా ఉంటూ మోదీకి, దోవల్‌కు కూడా ఆత్మీయుడయ్యాడు. ప్రపంచ దేశాలన్నీ చుట్టి వచ్చాడు. వేషభాషల్లో ఆధునికంగా ఉండడమే కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా పుష్కలంగా ఉన్నవాడు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఫౌండేషన్‌ ద్వారా విదేశీ రాయబారులను, విదేశీ స్కాలర్లను, జర్నలిస్టులను గుజరాత్‌ తీసుకుని వెళ్లి అక్కడి అభివృద్ధిని చూపిస్తూ అనుకూలంగా నివేదికలు తయారేట్లు చూసేవాడు. 

మోదీ ప్రధాని అయ్యాక ఆరెస్సెస్‌ సంస్థ అతన్ని 2014లో బిజెపికి పంపించింది. నెల తిరక్కుండా జనరల్‌ సెక్రటరీ అయ్యాడు. అమెరికా వంటి విదేశాలకు వెళ్లి మోదీకి అనుకూలంగా లాబీయింగ్‌ చేసి, అక్కడ మోదీ సమావేశాలు విజయవంతం అయ్యేట్లు కృషి చేశాడు. బిజెపి థింక్‌ట్యాంక్‌లో ఒకడు. ప్రసారభారతికి చైర్మన్‌గా ఎ. సూర్యప్రకాశ్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ హిస్టారికల్‌ రిసెర్చికి చైర్మన్‌గా యల్లాప్రగడ సుదర్శనరావు అనే తెలుగువారి నియామకాలలో రామ్‌ మాధవ్‌ హస్తం ఉందంటారు. ఈశాన్య రాష్ట్రాలలో, కశ్మీర్‌లో బిజెపి సాధించిన విజయాలు అతని వ్యూహఫలాలే.

ఇప్పుడు ఆంధ్ర బాధ్యత (ఆపరేషన్‌ గరుడ అంటున్నారు) అప్పగించినట్లుంది. వస్తూనే బాబు వెన్నుపోటు దగ్గర్నుంచి చరిత్ర మొదలుపెట్టాడు. టిడిపి వాదనలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి స్థానిక బిజెపి నాయకులు చాలటం లేదనుకున్నారేమో, అమిత్‌ యిప్పటిదాకా జాతీయ రాజకీయాల్లోనే ఉన్న జివిఎల్‌ నరసింహారావును రాజ్యసభ ఎంపీ చేసి, ఆయన్ని కూడా ఆంధ్ర రాజకీయాల్లోకి దింపారు. ఆయన 'మయసభ కట్టడానికి డబ్బులిస్తారా?' అనే ఘాటైన విమర్శలు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వీళ్లందిరినీ టిడిపి వాదనలను తిప్పికొట్టడానికి వాడుకుంటారు. 

బిజెపి చేపట్టిన 'ఆపరేషన్‌ ద్రవిడ్‌', 'ఆపరేషన్‌ గరుడ' గురించి నటుడు శివాజీ చెప్పుకొచ్చిన దానిలో నాకేమీ వింత కనబడలేదు. బిజెపి యిలాటి వ్యూహాలతోనే అనేక రాష్ట్రాలలో నెగ్గింది. దానికి కౌంటర్‌గా వ్యూహాలు రచించేవాళ్లూ ఉంటారు. ఎవరు ఏ మేరకు గెలుస్తారనేది భవిష్యత్తే చెపుతుంది. రాష్ట్రంలో బిజెపికి కాలు మోపే స్థలమే లేదు, టిక్కెట్లు యిచ్చేందుకు నాయకులే లేరు అని టిడిపి నాయకులు హుంకరిస్తున్నారు కానీ టిడిపి నుంచే చాలామంది అటు వెళ్లినా ఆశ్చర్యపడనక్కరలేదు.

అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతూందంటూ టిడిపి వైసిపీ నుంచి చాలామందిని తెచ్చుకుంది. ఇప్పుడది లేకపోవడంతో టిక్కెట్లు దొరక్క భంగపడేవాళ్లు చాలామంది తయారవుతారు. వాళ్లు జనసేనలోకి దూకవచ్చు. అక్కడ అన్ని సీట్లూ ఖాళీయే. ఎక్కడ టిక్కెట్టడిగినా యిస్తారు. ఎన్నికల తరుణంలో పవన్‌ 'నాకు అనుభవం చాలదు, నిధులు లేవు, ప్రస్తుతానికి బిజెపికి మద్దతిస్తున్నాను' అని ప్రకటించి తప్పుకుంటే వాళ్లే బిజెపి అభ్యర్థులుగా మారవచ్చు. 40 మంది దాకా మాతో టచ్‌లో ఉన్నారని జనసేన చెప్పుకుంటోంది. వాళ్లందరూ ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, అసంతృప్తులు కూడా ఉండవచ్చు. 

2014లో టిడిపి-బిజెపి కూటమికి కాపులు సపోర్టు చేశారు. కాపు రిజర్వేషన్‌ బిల్లు అటకెక్కడంతో వాళ్లు అలిగివున్నారు. 2019 నాటికి వాళ్లలో చీలిక రావచ్చు. అలాగే 2014లో బ్రాహ్మణులు, వైశ్యులు టిడిపిని సపోర్టు చేశారు, జగన్‌ వస్తే మొత్తం క్రైస్తవం అయిపోతుందన్న భయంతో! ఇప్పుడు రామ్‌ మాధవ్‌ రాకతో వాళ్లు కన్‌ఫ్యూజ్‌ అవుతారు - ఓటు టిడిపికా, బిజెపికా అని. ఇక జగన్‌ విషయానికి వస్తే 2014 నాటి ఓటు బ్యాంకు స్థిరంగా అలాగే ఉందనుకోవడానికి లేదని నంద్యాల ఉపయెన్నికే చాటిచెప్పింది. వైయస్సార్‌ని అభిమానించేవాళ్లు కూడా ఆయన పోయిన పదేళ్లదాకా అవే జ్ఞాపకాలతో ఉన్నారనుకోవడం అవివేకం.

ఈ మధ్యలో చాలామంది నాయకులు వైసిపిని వీడి వెళ్లిపోయారు. అందువలన బిజెపి ఆంధ్రలో తనకు చోటు ఉందనే నమ్మకంతోనే ముందుకు వెళుతుంది. దాని కోసం ఎంతటి ప్రయత్నమైనా చేస్తుంది. మాకు యిప్పటికే 48 వేల మంది బూత్‌ స్థాయి కార్యకర్తలున్నారని అమిత్‌ చెప్తున్నాడు. బాబుని గద్దె దింపడానికి జగన్‌ ఎంతకైనా తెగిస్తాడు. కేంద్రంలో ఎవరుంటే వాళ్లతో కుమ్మక్కవుతాడు. ఎన్నికలకు ముందే బాబు ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలపై రద్దు చేయమని అడగవచ్చు. సెప్టెంబరు 1 కల్లా రద్దు చేస్తారని శివాజీ అన్నారు కూడా. కానీ అలాటి పని చేసి బాబుపై సింపతీ పెంచుతారని నేను అనుకోను.  

ఇటీవల గమనిస్తున్న దేమిటంటే - టిడిపి అభిమానులు ఉపయెన్నికలలో బిజెపి ఓటముల పట్ల చంకలు గుద్దుకుంటున్నారు. అదేదో తమకు లాభిస్తుందనుకుంటున్నారు. కానీ మనం ఒప్పుకోవలసినది ఏమిటంటే - 2019లోపున మోదీకి బలమైన ప్రత్యర్థి ఎవరూ తయారు కాలేరు. ఈ తృతీయ కూటమికి (ఏర్పడితే) ఓ 100 కంటె వచ్చే ఛాన్సు లేదు.

నాయకులందరూ అహంభావులే. ఏం కలుస్తారు? ఇక రాహుల్‌ ఎప్పటికి ఎదిగేను? బిజెపికి బలం తగ్గితే ఎన్‌డిఏని నడిపించడానికి మోదీ కాకుండా మరొకరిని తీసుకుని వస్తారనుకోవడానికీ అవకాశం కనబడటం లేదు. తను తప్ప మరొకరూ ఎవరూ వెలగకుండా మోదీ జాగ్రత్త పడ్డాడు. మోదీకి మధ్యతరగతి మద్దతు తగ్గింది కానీ కార్పోరేట్‌ మద్దతు ఏమీ తగ్గలేదు. మోదీకి ఉన్న ప్రజాకర్షణ, వాగ్ధాటి వేరెవరికీ లేవు. ఎస్పీ, బియస్పీల్లా ప్రాంతీయ పార్టీలు ఐక్యమైతేనే బిజెపిని నిలవరించగలరు. అక్కడ పామూ, ముంగిసా కలిశాయి. ఆంధ్రలో ఆ క్వశ్చనే లేదు. ఇవన్నీ గమనించిన ఆంధ్ర ఓటరు కొంతమేరకు బిజెపిని ఆదరించినా నేను ఆశ్చర్యపడను. (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com