cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: శబరిమల వివాదం

ఎమ్బీయస్‌: శబరిమల వివాదం

శబరిమలలో ఒక వయసులో ఉన్న మహిళలు గుళ్లోకి రావచ్చా లేదా అన్న విషయంపై వివాదం చెలరేగుతోంది. పాత వివాదమే, కానీ అందర్నీ అనుమతించవచ్చనే సుప్రీం కోర్టు తీర్పు కారణంగా, యిప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి. కేవలం మతపరమైనదే అయితే కాస్త సద్దు మణిగేదేమో కానీ రాజకీయ పార్టీలు కూడా వీటిపై ఒక స్టాండ్‌ తీసుకుని వివాదాన్ని మరింత రగిలిస్తున్నాయి. కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే మహిళల ఆలయ ప్రవేశంపై అనేక సందేహాలు తలెత్తుతాయి. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలకు ప్రవేశం లేదట. ఆ వయసులో ఉన్న స్త్రీలు ఆలయం వైపు వెళుతూండగా మహిళా వాలంటీర్లే వెతికి, వేటాడి, తన్ని పంపించేస్తున్న ఫోటోలు పేపర్లలో వచ్చాయి. 50 ఏళ్ల వరకు మెనోపాజ్‌ జరగదు అని ఎవరైనా కచ్చితంగా చెప్పగలరా? 45 ఏళ్లకే అయిపోయినవాళ్ల సంగతేమిటి? 35 ఏళ్లకే గర్భసంచి తీసేసిన వారి సంగతేమిటి?  వాళ్ల నెందుకు రానివ్వకూడదు?

అసలు బహిష్టు కావడం అంత అపరాధమా? బహిష్టు ప్రక్రియ లేకపోతే సృష్టే లేదు, ఈ అడ్డుకుంటున్న భక్తులు యీ భూమిపై ఉండే అవకాశమే లేదు. బహిష్టయ్యే మహిళను అంత విలన్‌గా చూడవలసిన అవసరం ఉందా? గతంలో బహిష్టు రోజుల్లో స్త్రీలను నానాహింసా పెట్టేవారు. గాలీ, వెలుతురు రాని గదుల్లో నేలమీద పడుక్కోమనేవారు. తాకేవారే కాదు. ఇప్పుడు చాలా యిళ్లల్లో ఆ పద్ధతి మారింది. దాని గురించి చర్చించడమే అపరాధంగా అనుకునేవారు. ఇప్పుడు టీవీ యాడ్స్‌లో సగానికి సగం ఆ సమయంలో తీసుకునే జాగ్రత్తల గురించే చెప్తున్నారు. దానివలన ప్రపంచం తలకిందులు కాలేదు. ఆడవాళ్ల ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. ఇంటావిడ ఆరోగ్యంగా ఉంటేనే యింటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఆ సమయంలో ఆఫీసులకు వెళుతున్నారు, షాపింగులకు వెళుతున్నారు. ఇంట్లో అందర్నీ ముట్టుకుంటున్నారు. ఈ అనాచారం వలన అనర్థం జరిగిన దాఖలాలున్నాయా?

ఇన్ని చేసినా ఆ రోజుల్లో యింట్లో పూజ చేయరు, గుడికి వెళ్లరు. ఏదైనా పుణ్యకార్యాలుంటే బహిష్టుని వాయిదా వేసుకోవడానికి మందులు వేసుకుంటారు. అది ఒక నమ్మకం. ఆ రోజుల్లో శరీరం అపవిత్రమౌతుందని భావన. నిజానికి విరేచనాలు పట్టుకున్న రోజుల్లో కూడా అలాగే ఫీలవ్వాలి. లేదా గాయపడి, రక్తస్రావం అయ్యే రోజుల్లో కూడా అలాగే ఫీలవ్వాలి. కానీ బహిష్టు సమయంలోనే అలా ఫీలవుతారు ఎందుకో! ఇంట్లో ఎవరైనా పోతే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదని, తీర్థయాత్రలు చేయకూడదనీ అనేవారు, కానీ యిప్పుడు దానికి సవరణలు వచ్చాయి. వెళ్లవచ్చు కానీ తీర్థం తీసుకోకూడదని, తీసుకున్నా ఫర్వాలేదనీ... యిలా ఏవేవో చెప్తున్నారు.  కొంతమంది ఇంట్లో పూజ కూడా మానేస్తారు, అబ్బే నిత్యపూజ మానకూడదు అని కొందరంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఏటి సూతం ఉండగా గుడికి ఎందుకు వచ్చావు అని పూజారి నిలదీయడు, సాటి భక్తులు అడగరు. దానివలన కలిగే పాపపుణ్యాలు నీవే అనుకుంటారు.

మరి 'బహిష్టు విషయంలో మాత్రం యింత రచ్చ దేనికి? అదీ ఆ ఒక్క గుడికే?' అని అడిగితే 'అదే మేమూ అడుగుతున్నాం, ఆ ఒక్క గుడికే వద్దంటే దానికే వెళతామని పట్టుబడతారేం?' అని అడుగుతున్నారు ఆందోళనకారులు. ఆ ఒక్క గుడికే ఎందుకు వద్దంటున్నారో తర్కబద్ధంగా చెప్పాలి కదా. ఆయన ఒక్కడే దేవుడా? తక్కినవాళ్లు దేవుళ్లు కారా? ఈయన బ్రహ్మచారి కాబట్టి అంటే హనుమంతుడు బ్రహ్మచారి కాదా? మహారాష్ట్రలో, బెంగాల్‌లో కుమారస్వామి బ్రహ్మచారి, తమిళనాట గణేశుడు బ్రహ్మచారి. వాళ్లెవరూ ఆడవాళ్లను చూసి చలించరు, యీయన మాత్రమే చలిస్తాడా? అంత నిగ్రహం లేదా? వీటికి సమాధానం చెప్పలేక 'దేవుడికి ఆ వయసు మహిళలను చూడకూడదని అనుకునే హక్కు ఉంది, అది కాపాడాలి' అని సుప్రీం కోర్టులోనే వాదించారు. అంటే గుడి ఉన్న మేరకే ఆయన యిల్లా? దేవుడి హక్కు ఆ గుడి ఉన్నంత మేరకే పరిమితమా? విశ్వమంతా ఆయనదే కదా. లోకంలో ఆ వయసు మహిళలు ఎక్కడా లేకుండా చేయవచ్చు కదా! వీళ్ల తమ వాదనలతో దేవుణ్ని మనిషి స్థాయికి దింపేస్తున్నారు. మన కంటె అన్ని విధాలా అతీతుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అనుకున్నపుడే దైవభావనకు అర్థం ఉంటుంది.

ఆ వయసు ఆడవాళ్లను రానివ్వవద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. గుడి ఏర్పరచినవాళ్లు పెట్టిన నియమమది. సాధారణంగా గుడి అనేది ఎలాగైనా ఏర్పడవచ్చు. గిరిజనులు చెట్టుకింద ఓ రాయి పాతి అమ్మవారిగా తలచి, కోళ్లు, మేకలు బలి యిచ్చి మొక్కులు మొక్కుతారు. అవి ఫలిస్తే ఆవిడకు పేరు వస్తుంది. వెంటనే పూజారి వర్గం దిగిపోతుంది. నాలుగు గోడలు కట్టేస్తారు. పైన కలశం పెట్టేస్తారు. ధ్వజస్తంభం అంటారు. ఓ స్వాములారిని పిలిచి కుంభాభిషేకం అంటారు. శుక్రవారం కుంకుమ పూజలంటారు, సుప్రభాతాలంటారు. మడి కట్టుకుని రావాలంటారు. ఇక అప్పణ్నుంచి తొలిభక్తులైన గిరిజనులకు కూడా గర్భగుడిలోకి ప్రవేశం లేకుండా పోతుంది. దేవుడు యివన్నీ చూస్తూనే ఉంటాడు. గతంలో ఎంత మహిమ చూపించాడో, యిప్పుడూ అంతే చూపిస్తాడు. ఈ కొత్త ఆర్భాటాల వలన ఏమీ ఎక్కువ చూపించడు. ఈ విషయాన్ని మనవాళ్లు అనేక కథల ద్వారా ఎన్నోసార్లు చెప్పారు. తిన్నడికి ప్రత్యక్షమైన శివుడు, ఆలయపూజారికి ఓ పట్టాన దర్శనం యివ్వలేదు. తిన్నడు ఎంత అడ్డదిడ్డంగా పూజ చేసినా స్వీకరించాడు.

పూజకు కావలసినది స్వచ్ఛమైన మనసు, మడిబట్టలు కాదు. చిత్తశుద్ధి లేని శివపూజలేల? అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే అనేక గుళ్లల్లో ఆచారాలు అంతగా పాటించరు, అయినా మొక్కులు తీరతాయి. కొన్ని గుళ్లల్లో గర్భగుడిలోకి వెళ్లి మూలవిరాట్టును ముట్టుకోవచ్చు. మరి కొన్ని వాటిలో గర్భగుడిలోకి ప్రవేశమే లేదు, ఇంకా కొన్నివాటిలో మూలవిరాట్టును చూడడానికే వీలు లేకుండా చందనం వేసి తాపడం చేసేస్తారు. ఎలా చేసినా అన్ని రకాల గుళ్లకూ ఆదరణ ఉంది. పూజారి గణం గుడిని ఎలా నడపాలనుకుంటే అలా నడుపుతుంది. తిరుపతి వెంకటేశ్వరుడు వైష్ణవ రూపమా, శైవరూపమా? అని వెయ్యేళ్ల క్రితం వివాదం చెలరేగింది. రామానుజుడు వైష్ణవరూపం అని వాదనల ద్వారా నిరూపించారు. ఇప్పుడు ఆ వైష్ణవంలో ఏ సంప్రదాయ ప్రకారం పూజలు జరగాలనే దానిపై యింకా జుట్టూజుట్టూ పట్టుకుంటున్నారు. తమిళనాడులో ఓ గుడిలో ఏనుగుకి వైష్ణవంలోని రెండు పద్ధతుల్లో (తెంగలై, వడగలై) ఏ పద్ధతి ప్రకారం నామం పెట్టాలన్నదానిపై సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. ఇలా తన్నుకోమని దేవుడు వచ్చి చెప్పాడా? ఇవన్నీ మన వికారాలు. ఇప్పుడు చూడండి, శబరిమల గుడికి పూజారులు తాళాలేసి వెళ్లిపోయారు, అదేదో తమ సొంత ఆస్తిలా! దేవుడి బట్టి పూజారా? పూజారి బట్టి దేవుడా?

తాము చెప్పిన నియమం ప్రకారం జరగకపోతే గుడి భ్రష్టు పట్టిపోతుందని, దేవుడికి మహిమ తగ్గిపోతుందని, దేవుడు ఆగ్రహం చూపిస్తాడని వీళ్ల వాదన. గతంలో యిలా చెప్పే హరిజనులను గుళ్లలోకి రానివ్వలేదు. తర్వాత గత్యంతరం లేక రానిచ్చారు. రామానుజుడి కాలంలోనే 'మునివాహన సేవ' పేరుతో పూజారే హరిజనుణ్ని భుజాలపై ఎక్కించుకుని లోపలకి తీసుకుని వచ్చాడు. ప్రస్తుతం హరిజన పూజారులు కూడా వచ్చారు. మరి దేవుడి మహిమ తగ్గిపోయిందా? తగ్గిపోయిందని వీళ్లు చెప్పగలరా? ఒప్పుకుంటారా? తిరుపతి గుడికి హరిజనులే కాదు, మ్లేచ్ఛులు కూడా వస్తున్నారు. పరమనీచులు, ప్రజాధనాన్ని దోపిడీ చేసినవారు, హంతకులు, పన్ను ఎగవేతదారులు మంత్రులై, విఐపిలై అర్చకగణం చేత పూర్ణకుంభాలతో ఆహ్వానాన్ని అందుకుంటున్నారు. అయినా స్వామి వారి మహిమ తగ్గిందా? తగ్గితే అంతమంది భక్తులు తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు? రోజుల తరబడి క్యూలో ఎందుకు కాచుకుంటున్నారు?

సమాజంలో కాని, మతంలో కాని సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. ఇస్లాంలో కూడా అనేక దేశాల్లో మార్పులకు గురైంది. టర్కీలో కెమాల్‌ పాషా ఖలీఫా వ్యవస్థను తీసి అవతల పారేశాడు. అతి ఛాందసంగా ఉన్న సౌదీ అరేబియాలో కూడా యిప్పుడు కొన్నిటిని సంస్కరిస్తున్నారు. ఇండోనేసియా వంటి దేశాల్లో ఉదారవాదం ఎప్పుడో ఉంది. క్రైస్తవంలో కూడా ఒకప్పుడు చర్చిదే సర్వాధికారం. శాస్త్రపరిశోధనలను అడ్డుకునేది. ఇప్పుడు దాని ప్రాబల్యం తగ్గిపోయింది. జనాలు పట్టించుకోవడం మానేశారు. మన హిందూ సమాజంలో కూడా సతీసహగమనం, బాల్యవివాహాలు వంటివి పోయాయి. వితంతువు పునర్వివాహం చేసుకుంటే ధర్మం నాశనమై పోతుంది అని గగ్గోలు పెట్టారు ఛాందసులు. వీరేశలింగం వంటి వారు గట్టిగా నిలిచి పోరాడారు. ఇది వరకు భర్త పోతే శిరోముండనం చేయించి, తెల్ల చీర కట్టించేవారు. సకేశి చేతి వంట తినేవారు కారు. మరి ఇప్పుడు? రంగు చీరలు కట్టడమే కాదు, బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. కొందరు మంగళసూత్రాలు కూడా తీయడం లేదు. 'నా భర్త నా మనసులోనే సజీవంగా ఉన్నాడు' అని ప్రకటిస్తున్నారు. ఈ 'అనాచారం' వలన సూర్యుడు తూర్పున ఉదయించడం మానేశాడా? కులగిరులు తల్లడిల్లాయా?

ఈ ఆచారాలు మనం సృష్టించుకున్నవే. దేవుడు వచ్చి చెప్పలేదు. ఈ వికారాలు మనలోనే ఉన్నాయి. సమాజం ఆమోదించినది చెల్లుబాటు అవుతుంది. సమాజం నిరంతరం మార్పు వైపు నడుస్తూ ఉంటుంది.  యువత పుట్టుకువచ్చి వ్యవస్థపై ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. సమాధానం చెప్పలేని ఛాందసులు దేవుడి పేరుతో వాళ్ల నోరు నొక్కుతూ ఉంటారు. ప్రశ్నలు అడిగేవారు ఎక్కువైనప్పుడు ఛాందసుల నోళ్లు మూతపడతాయి. కొత్త పద్ధతే ఆమోదయోగ్యం అవుతుంది. మరి కొంతకాలానికి యీనాటి కొత్తదానిపై మళ్లీ ప్రశ్నలు వస్తాయి. అప్పుడు మళ్లీ యింకో కొత్తది వస్తుంది. ఇదీ పరిణామక్రమం. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే విశ్వాసం చెదరకుండానే సంస్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని మార్పులు వస్తున్నా హైందవ సమాజంలో ఆస్తికులు, విశ్వాసుల సంఖ్య పెరుగుతోందనడానికి తార్కాణం - నానాటికీ పెరుగుతున్న గుళ్లు, వాటి ఆదాయం.

సమాజం దాని పాటికి అది మారుతూ ఉంటే మరి దానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఏం చేయాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. సంస్కరణలో న్యాయం ఉన్నట్లు తోస్తే వారికి మద్దతు యివ్వాలి. బ్రిటిషు ప్రభుత్వం అదే చేసింది. సతీసహగమనం రూపు మాపడానికి ప్రయత్నించిన రాజా రామ్‌మోహన్‌ రాయ్‌కు, వితంతువివాహాలకు కృషి చేసిన వీరేశలింగానికి ఛాందసుల బారి నుంచి రక్షణ కల్పించింది. తిరువాన్కూరు ప్రభుత్వానికి దివాన్‌కి పని చేసిన సిపి రామస్వామి అయ్యర్‌, తన రాజ్యంలోని స్త్రీలు మూఢాచారాల చేత రవిక ధరించటం లేదని గమనించి ఆ అనాగరిక ఆచారాన్ని మాన్పించడానికి రవిక ధరించకపోతే జరిమానా వేస్తానని ప్రకటించాడట.  రవిక లేకుండా ఆయన కంట పడితే శిక్షిస్తాడని మహిళలు భయపడేవారట. చివరకు పట్టుదలతో ఆయన అది మాన్పించాడు. దాని వలన అనర్థం ఏమీ రాలేదు కదా! కేరళ నాశనం కాలేదు కదా! ఏది మంచిది, ఏది కాదు అనే విషయంలో ప్రభుత్వమే దిశానిర్దేశం చేయాలి.

అయితే ప్రజల్ని ఓటుబ్యాంకులుగా చూసే పోకడను ప్రభుత్వాలను అలవర్చుకున్నాక యీ బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అన్నట్లు, ఛాందసులు, ఆధునికులు ఎవరి వైపు మొగ్గినా ఆ వర్గం ఓట్లు పోతాయనుకుని భయపడి నిర్ణయాలను కోర్టులపైకి నెట్టేస్తున్నారు. కావాలంటే వాళ్లను తప్పు పట్టమని వాళ్ల ఉద్దేశం. ఎవరేమడిగినా 'విషయం కోర్టులో ఉంది' అని చెప్పవచ్చు. అలా చెప్పే గునపాన్ని నానబెట్టినట్లు రామమందిరాన్ని కోర్టులో నానబెట్టారు. కోర్టు ప్రతీదీ జడ్జ్‌ చేయనక్కరలేదు, మత పెద్దల మధ్య చర్చ పెట్టి, ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలి. సరే కోర్టు వాళ్లు ఏళ్ల తరబడి నానావాదనలూ విని ఏదో ఒక తీర్పు చెప్పారనుకోండి. అప్పుడు కూడా దాన్ని అమలు చేయటం లేదు. దాన్ని రద్దు చేసేట్లు ఆర్డినెన్సులు తెస్తున్నారు. షా బానో కేసులో రాజీవ్‌ అదే పొరపాటు చేశాడు, ముస్లిం ఓట్లు పోతాయేమోనని. దాని ద్వారా ముస్లిం ఛాందసులను తృప్తి పరిచాను, యిక హిందూ ఛాందసులను తృప్తి పరచాలనుకుంటూ అందరూ మర్చిపోయిన రామమందిరాన్ని తెరిపించాడు. చివరకు ఏమైంది? ఎవరూ ఓట్లేయక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాడు.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాక్‌ విషయంలో మా స్టాండ్‌ యిది అని కోర్టులో ధైర్యంగా చెప్పింది, ముస్లిం మహిళల, ఉదారవాదుల, అభ్యుదయవాదుల జేజేలు అందుకుంది. ప్రభుత్వమంటే అలా ఉండాలి. ఆ ధైర్యాన్ని శబరిమల వంటి విషయాలలో కూడా ప్రదర్శించినపుడు యింకా ఎక్కువ జేజేలు అందుకుంటుంది. కానీ కేరళ బిజెపి ఏమంటోంది? శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసి, యథాతథ పరిస్థితి కొనసాగించాలట. లేదా ఆ తీర్పును తోసిరాజంటూ ఆర్డినెన్సు తేవాలట. అలా అయితే కోర్టుకి వెళ్లడం దేనికి? మామూలుగా ఉప్పూ, నిప్పూగా ఉండే బిజెపి, కాంగ్రెసులో కేరళలో  యీ విషయంలో ఒక్కటై ఉమ్మడి శత్రువైన సిపిఎం ప్రభుత్వాన్ని యిరకాటంలో పెడుతున్నాయి. కేరళ ప్రభుత్వం 'మేం తీర్పు అమలు చేస్తున్నాం, వెళదామనుకున్నవాళ్లకి రక్షణ కల్పిస్తాం' అని తీసుకున్న స్టాండ్‌ కరక్టు. అమిత్‌ షా వచ్చి కోర్టు ఆదేశాలను మన్నించడం ద్వారా కేరళ ప్రభుత్వం భక్తులను కష్టపెడుతోందని వ్యాఖ్యానించి వెళ్లాడు. అరుణ్‌ జేట్లే రాజ్యాంగవాదులు (కాన్‌స్టిట్యూషనిస్టులు) దేవుడి కంటె కోర్టు ఎక్కువనుకుంటున్నారు అని వ్యాఖ్యానించాడు.

వ్యక్తిగతంగా యీ విషయంలో నేను ఫీలయ్యేది రాస్తాను. కేరళలో ప్రధానమైన దేవుడు గురువాయూరప్పన్‌, తర్వాత అనంత పద్మనాభస్వామి. అయ్యప్ప గిరిజనుల్లో ప్రాచుర్యంలో వుండి తర్వాతి రోజుల్లో వెలుగులోకి వచ్చిన దేవుడు. అందువలన అష్టాదశ పురాణాల్లో అయ్యప్ప ప్రసక్తి కనబడదు. గిరిజనుల్లో ఉండే మూఢాచారాలతో ప్రారంభమైన గుడి తర్వాతి కాలంలో పూజారి వర్గం కైవసమై ఉంటుంది. మహిళలు రాకూడదన్న నియమం గురువాయూరులో, పద్మనాభస్వామి గుళ్లలో లేదు కానీ శబరిమలలో ఎందుకుంది అంటే అది దుర్గమారణ్యంలో ఉంది. మగవాళ్లకే భద్రత ఉండదు. ఇక ఆడవాళ్లకు మరీ కష్టం. పైగా 40 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలనే నియమం ఉంది. యాత్రలో పక్కన మహిళ వుంటే ప్రలోభానికి గురయ్యే ప్రమాదం ఉంది. శబరిమల నుంచి తిరిగి వచ్చే భక్తులు ఎంత ఆబగా తింటారో, తాగుతారో మనం కళ్లారా చూడవచ్చు. మానవసహజమైన కోరికను అణుచుకుని అన్నీ ఉగ్గబట్టుకుని వాళ్లు నియమం పాటిస్తున్నపుడు, వాళ్ల పక్కన ఆడవాళ్లను పంపించి, మరింత పరీక్షలకు గురి చేయడం భావ్యం కాదని ఆ నిషేధాన్ని పెట్టి వుండవచ్చు. ఈ మండలదీక్ష గురువాయూరప్పన్‌కు, పద్మనాభస్వామికి లేదు.

అయితే యిప్పుడు పరిస్థితులు మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా శబరిమల మార్గంలో ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. మహిళా పోలీసు స్టేషన్లు వచ్చాయి. అత్యాచారాలు జరగకుండా వాళ్లు ఆపగలరు. అందువలన మహిళలు వెళ్లినా అప్పటి మాదిరిగా ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదు. ఇక బహిష్టు విషయానికి వస్తే, ఆ సమయంలో పూజ చేయకూడదనే ఆచారాన్ని యింకా పాటిస్తున్నాం కాబట్టి ఆ దిశగానే ఆలోచిద్దాం. యుక్త వయసులో ఉన్న మహిళ 40 రోజుల పాటు బహిష్టు కాకుండా ఉండడం అసంభవం కాబట్టి వాళ్లు మండల దీక్ష తీసుకోలేరు. అందువలన వాళ్లు 18 మెట్లు ఎక్కడానికి అవకాశం లేదు. మండల దీక్ష తీసుకోకుండా మామూలుగా వెళ్లే మగభక్తులతో పాటే వాళ్లూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకు పెట్టాలి? ఒకవేళ బహిష్టు సమయంలోనే వాళ్లు గుడికి వచ్చేశారనుకోండి, దాని వలన వచ్చే పాపఫలితాన్ని వాళ్లే అనుభవిస్తారు కదా! నీకేం పోయింది. దేవుడు వాళ్ల సంగతి చూసుకోలేడా? చూడమని నీకు పవరాఫ్‌ ఎటార్నీ యిచ్చాడా? నీ పక్కనున్న మగభక్తుడు పళ్లు తోముకోకుండా వచ్చాడో, పరగడుపునే సారా పట్టించేడో నువ్వు నోట్లో నోరు పెట్టి గమనిస్తున్నావా? వాడి పాపాన వాడే పోతాడు అని ఊరుకోవటం లేదా? ఆడవాళ్ల దగ్గరకు వచ్చేసరికే యీ పోలీసింగ్‌ ఎందుకు? వాళ్లేదో వేరే స్పీసీస్‌ అయినట్లు యింత అల్లరెందుకు? నీకు జన్మనిచ్చినదే ఆడది, ఆ విషయం గుర్తు పెట్టుకుని నియమాలు ఏర్పరచు.

అయితే యీ సంస్కరణ కోసం పోరాడుతున్నాం అనే పేరుతో అన్యమతస్తులు అనుమతి లేకుండా లోపలకి చొచ్చుకు రావడం అత్యంత అభ్యంతరకరం. మనం కూడా గురుద్వారాల్లోకి, మసీదుల్లోకి, చర్చిల్లోకి వెళ్లవచ్చు. కానీ వారి నియమాలకు లోబడి ప్రవర్తించాలి. ఇంకోళ్ల యింటికి వెళ్లినపుడు కూడా చెప్పులిప్పి రండి అంటే చెప్పులు విప్పాలి. గుడి అనేది ఆ మతస్తులు ఏర్పరచుకున్న ప్రార్థనాలయం. దానిలోకి యిష్టం వచ్చినట్లు చొరబడడం వారి భావాలను కించపరిచినట్లే. కావాలంటే ఆ మతంలో రావలసిన సంస్కరణల గురించి పబ్లిక్‌ ప్లాట్‌ఫాంలపై వాదించవచ్చు, సూచించవచ్చు. ఉదాహరణకి ఇస్లాంలో బహుభార్యాత్వం అనుమతించకూడదు అని మనం వాదించవచ్చు. అంతేగానీ వాళ్ల యింట్లో పెళ్లికి వెళ్లి అల్లరి చేయకూడదు. అలా చేయగలిగే హక్కు వరుడి మొదటి భార్యకు ఉంటుంది. శబరిమలపై సుప్రీం కోర్టు అక్టోబరు 31న మళ్లీ ఏదో చెప్తుందట. ఏం చెప్తుందో చూద్దాం. ఈలోగా గ్రహించవలసిన దేమిటంటే 'భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి' అనే పేర ఆందోళన కారుల ఆటలు సాగనీయకూడదు. గుళ్లోకి మహిళలను రానివ్వకూడదనే వాళ్లు మాత్రమే భక్తులా? రానిస్తే ఏం పోయింది అనేవాళ్లు భక్తులు కారా? ఇలాటి ఆంక్షలు భరించలేకనే అనేకమంది నిమ్న వర్గీయులు క్రైస్తవంలోకి మారారు, మారుతున్నారు. అది గుర్తించాలి, యీ హిందూ ఛాందసవాదులు!
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2018)
mbsprasad@gmail.com