cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సంతాన చింత-4

ఎమ్బీయస్‌: సంతాన చింత-4

పిల్లల పెళ్లి విషయంలో యీనాటి తలిదండ్రులు పడుతున్న చింత అంతాయింతా కాదు. పెళ్లి జరిగేంతవరకు చింత, పెళ్లయ్యాక వాళ్ల కాపురం ఎలా నడుస్తోందోనన్న చింత. గతంలో చదువు పూర్తయి ఉద్యోగం వచ్చీ రాగానే పెళ్లి చేసేసుకునేవారు. అంటే మగవాళ్లకు 22, ఆడవాళ్లకు 20 యేళ్లు ఉండేవి. వ్యవసాయం, వ్యాపారం ఉన్న కుటుంబాల్లో అయితే 1,2 ఏళ్లు ముందే అయిపోయేవి. పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడుతూ కాపురానికి ఒక్కొక్క వస్తువూ సమకూర్చుకునేవారు.

ఆ ఎదిగే క్రమం వాళ్లిద్దరినీ దగ్గరకు చేసేది. పైగా చిన్న వయసులో ఉండే ఉత్సాహం, ఉబలాటం, పటుత్వం వాళ్ల మధ్య సాన్నిహిత్యాన్ని దృఢపరిచేది. రానురాను జీవితంలో స్థిరపడ్డాకనే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కుర్రవాళ్లలో బలపడింది. బాంకు బాలన్సు, వాహనం, ఇల్లు సమకూర్చుకుని, అప్పుడు ఇల్లాలి గురించి ఆలోచిద్దా మనుకుంటున్నారు. దాంతో మగవాళ్ల కనీసపు పెళ్లి వయసు 28 వరకు వచ్చేస్తోంది. దానికి తగ్గట్టే ఆడవాళ్లు 25 ఏళ్లు వచ్చేవరకు చేసుకోవటం లేదు. చింతతో బాధపడే కుటుంబాల గురించి రాస్తున్నాను కాబట్టి యీ అంకెలు అలాటి కుటుంబాలకు అన్వయిస్తాయని గ్రహించాలి.

చిన్నప్పటి మాట ఎలా ఉన్నా, ఉద్యోగం వచ్చి, సొంత సంపాదన ఏర్పడ్డాక యువతీయువకుల్లో స్వతంత్ర భావాలు పాదుకుని, తలిదండ్రులతో విభేదించడం మొదలుపెడతారు. త్వరగా పెళ్లి చేసుకో అని వాళ్లు చెప్పినా వినరు. 'నువ్వనుకున్న లక్షణాలన్నీ ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి దొరకడం కష్టం. అవతలివాళ్లు ఒప్పుకున్నారు కాబట్టి నువ్వూ ఒప్పేసుకో' అంటే తల ఊపరు. ఇంకోటి చూద్దాం అంటారు సింపుల్‌గా. ఇలా అయితే పెళ్లి ఎప్పటి కయ్యేను అని తలిదండ్రులు తల పట్టుకుంటారు. 

గతతరం కంటె యువతీయువకుల మధ్య చనువు పెరిగింది. స్నేహమో, ప్రేమో పక్కవాళ్లకే కాదు, తమకు కూడా అర్థం కానంత సన్నిహితంగా మెలగుతున్నారు. కొందరితో కొంతకాలం మసలాక, విసుగు పుట్టి పక్కకు జరుగుతున్నారు. ఎవరైనా నచ్చినా, పెళ్లి చేసుకుంటే బాగుంటుందో లేదో తేల్చుకోలేక పోతున్నారు. అలాయిలా చాలాకాలం తాత్సారం చేసి, అప్పుడు సంబంధాలు చూడండి అని యింట్లో చెప్తున్నారు. ఉద్యోగస్తులయ్యాక అనేక విషయాల్లో నా యిష్టం అంటూ ప్రకటించే యువత, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎరేంజ్‌డ్‌ మేరేజ్‌ వైపు మొగ్గు చూపడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

ఈ రోజుల్లో నాకు తెలిసిన చాలామంది తలిదండ్రులు ఫలానావారినే చేసుకోవాలని పట్టుబట్టటం లేదు. మాట యిచ్చాను.., మేనరికం ఉంది.., నువ్వు కాదంటే స్నేహం పోతుంది... వంటి డైలాగులు వినబడటం లేదు. 'నీ యిష్టానికి వ్యతిరేకంగా చేయం' అనే అంటున్నారు. 'మనం బలవంతం పెట్టి పెళ్లి చేసి బావుకునేదేముంది, మనం బతికేది ఏ పదిపదిహేనేళ్లో! 30,40 ఏళ్లు కాపురం చేయవలసినవాళ్లు వాళ్లు సఖ్యంగా ఉంటే చాలు' అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. 'నీ స్నేహితుల్లో, కొలీగ్స్‌లో నీకు నచ్చినవాళ్లెవరైనా ఉంటే చెప్పు, ఆ సంబంధం చూద్దాం' అంటున్నారు కూడా.

కులాంతరం అయితే ఒప్పుకోవడానికి ఏడాది, రెండేళ్ల పాటు తర్జనభర్జన పడి సరే అంటున్నారు కూడా. మతాంతరం అయితే మాత్రం ఓ పట్టాన ఒప్పుకోవటం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 'మీరు జనాభాలో కొద్దిమందినే దృష్టిలో పెట్టుకుని యీ సీరీస్‌ రాస్తున్నారు' అని కొంతమంది అంటున్నారు. కరక్టే. జనాభాలో 35% వరకు చదువు రానివారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు. 10-15% వరకు ధనికులు, అధిక సంపన్నులు ఉన్నారు. వారెవరూ యివి చదవరు.

కొంత చదువు ఉండి, తీరిక ఉండి, యింటర్నెట్‌ అందుబాటులో ఉన్న మధ్యతరగతి వారే దీని పాఠకులు. వారిలో అధికాంశం మంది ఎలా ప్రవర్తిస్తారో అదే రాస్తున్నాను. 'ఉత్తర ప్రదేశ్‌లో కులాంతర వివాహం సహించక సజీవదహనం చేశారు, హరియాణాలో ఆడపిల్లను చదివించరు, పాత బస్తీలో చిన్నపిల్లను అరబ్‌ షేక్‌కు అమ్మేశారు..' అని పోలికలు తెచ్చి వాదిస్తే వారికో నమస్కారం.

గతతరంలో కంటె తలిదండ్రులు స్వేచ్ఛ నిచ్చినా యువత దానిని ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? దీనికి సరైన సమాధానం వారే చెప్పగలరు. నా పరిశీలన మాత్రం - స్నేహితుల కాపురాలు చూసి, వారు పెళ్లంటే భయపడుతున్నారు. ఉద్యోగాలు మార్చడంలో చూపే చొరవ పెళ్లి చేసుకుని స్థిరపడడంలో చూపటం లేదు. పరిచయం ఉన్న వ్యక్తి ప్రేమ వరకు ఓకే కానీ పెళ్లి అయ్యాక యిలా ఉండదేమో, ఉండడేమో అనే సందేహం వారిని పీడిస్తోంది. కొన్నేళ్లపాటు ప్రేమించుకుని, కొన్ని సందర్భాల్లో సహజీవనం చేసిన వారి వివాహాలు సైతం భగ్నం కావడం వారిని భయపెడుతోంది.

పక్కవాళ్ల ప్రేమ వివాహానికి తోడ్పడడం సమాజసేవ అనుకుంటున్నారు కానీ తమ వద్దకు వచ్చేసరికి వెనకాడుతున్నారు. తెలిసిన వ్యక్తిలో కనబడే లోపాలు, తెలియని వ్యక్తిలో ఉండవేమోనని ఆశ పడుతున్నారు. ఫెమిలియారిటీ బ్రీడ్స్‌ కంప్టెప్ట్‌ అంటే యిదే కాబోలు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లూ విఫలం కావడం చూస్తున్నా రిస్కు తక్కువేమో, ఏమైనా జరిగితే కుటుంబం అండగా నిలుస్తుందేమోనన్న ఆశ ఉంటోంది. అందుకే ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత ఉన్నతోద్యోగం చేస్తున్నా  పెళ్లి కుదిర్చే బాధ్యత పెద్దలకు అప్పగిస్తున్నారు.

పెద్దలకు అప్పగించగానే మన కులంలోనే చేసుకోవాలని అంటారనీ, దాని వలన ఛాయిస్‌ తగ్గిపోతుందనీ తెలిసినా రాజీ పడుతున్నారు. ప్రేమలో పడిన కొందరు యువతీయువకులు తలితండ్రుల అనుమతి అడుగుతున్నారు, అది వచ్చేదాకా ఆగుతున్నారు. మరి కొందరు ఆగటం లేదు. ఇంకా కొందరు అనుమతి అడగడమే అనవసరం. పెళ్లి చేసుకున్నాక చెప్పవచ్చు అనుకుంటున్నారు. అలాటి వ్యవహారాలు చూసిన తలిదండ్రులు సంబంధం కుదిర్చే బాధ్యతను పిల్లలు తమకు అప్పగించినందుకు సంతోషించడంతో బాటు భారంగా కూడా ఫీలవుతున్నారు. ఇది వారికి అన్నిటికంటె పెద్ద బాధ్యతగా పరిణమించింది.

50 ఏళ్ల ప్రాంతంలో ఉన్న ఏ తల్లినీ, తండ్రినీ అడిగినా 'పిల్లల పెళ్లి చేయడం మహా కష్టమండీ, అదే వర్రీగా ఉంది' అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎవరైనా మధ్యవర్తులు సంబంధాలు చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పేవారు బాగా తగ్గిపోయారు. కాపురం సరిగ్గా సాగితే ఫరవాలేదు కానీ, ఏవైనా యిబ్బందులు వస్తే 'అలాటివాళ్లని తెలిసి తెలిసి మాకెందుకు అంటగట్టారు?' అని మధ్యవర్తుల మీద ఎగిరిపడుతున్నారు. ఎవరైనా కుటుంబం గురించి అంతోయింతో చెప్పగలరు కానీ పిల్లవాడు లేదా పిల్ల గుణగణాల గురించి, స్వభావాల గురించి కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు? ఆట్టే మాట్లాడితే అమ్మానాన్నలకే పిల్లల గురించి అవగాహన తగ్గిపోతోంది.

హాస్టళ్లలో ఉంటున్నారు, ఫ్రెండ్స్‌తో తిరుగుతారు, ఇంట్లో తక్కువ సమయం గడుపుతారు, ఉన్న కాస్సేపు సెల్‌ఫోన్లో ఉంటారు, వేరే ఊళ్లో ఉద్యోగం చేస్తారు, వచ్చాక ఫ్రెండ్స్‌ యింటికి పోతామంటారు, బంధువుల, స్నేహితుల యిళ్లల్లో ఫంక్షన్లకు రారు, అమ్మానాన్నలకు తెలిసిన సర్కిల్స్‌ అంటే నమస్కారం పెట్టి పారిపోతారు. ఒకే యింట్లో ఉంటున్నా అమ్మానాన్నలది పగటి జీవితం, పిల్లలది రాత్రి జీవితం. ఎవరి లోకం వారిదే. అందువలన వధువు లేదా వరుడి గురించి తెలిసేది వాళ్ల స్నేహితులకు, సహోద్యోగులకు మాత్రమే. వాళ్లెలాగూ పెద్దలకు అందుబాటులో ఉండరు.

ఈ రిస్కులతో పెళ్లిపెద్దలెవరూ సంబంధాలు చెప్పడం మానేశారు. అందువలన అందరూ మారేజి బ్యూరోలను, మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వాళ్లకు వధూవరుల గురించి సమాచారం సేకరించే వ్యవస్థ ఉండదు. మీరు ఏం రాస్తే అదే వెబ్‌సైట్‌లో పెడతారు. ఐన్‌స్టీన్‌దీ నాదీ ఐక్యూ ఒకటే అంటే ఓహో అలాగా అనుకుంటారు తప్ప పరీక్షకు పెట్టరు. ఉద్యోగం ఫలానా, జీతం యింత, వయసు యింత, మా నాన్న కోటీశ్వరుడు అంటే దానికి తగ్గ సర్టిఫికెట్టు జతపరచు అని పట్టుబట్టరు. అందువలన వాటిని నమ్మడానికి పెద్దలు జంకుతారు, కానీ గత్యంతరం లేదు. అందుకే వాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది.

గతంలో తలితండ్రులకు యీ బాధలు లేవా అంటే ఉన్నాయి. కానీ వాళ్లు భగవంతుడి మీద భారం వేసి బండి నడిపించేవారు. 'పిల్లల్ని కన్నాం కానీ వాళ్ల రాతలను కన్నామా?' అనుకుంటూ చాలా వాటిల్లో ఛాన్సు తీసుకునేవారు. అవి ఎలా పరిణమించినా దైవనిర్ణయం అంటూ తలదాల్చేవారు. కానీ యీ తరం తలితండ్రులకు సొంత ప్రజ్ఞ మీద నమ్మకం పెరిగింది. దేవుడి పేర మొక్కులు మొక్కుతూనే, యింకో పక్క మన చేతిలో చాలా ఉంది అనే ధీమాతో ఉన్నారు. అందువలన ఏదీ ఛాన్సుకి వదిలేయకుండా ప్రతీదీ క్షుణ్ణంగా పట్టించుకో నారంభించారు.

దాంతో మెదడుకు భారం పెరిగింది. పెళ్లి విషయంలో జాతకాలతో సహా ప్రతీ సంబంధాన్నీ కాచి వడపోస్తున్నారు. నిజం చెప్పాలంటే గతంలో జాతకాలను సంప్రదించడం చాలా తక్కువ కుటుంబాల్లోనే ఉండేది. ఇప్పుడు అది అనేక కుటుంబాలకు వ్యాపించింది. మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ వాళ్లే జాతకాలు నప్పాయో లేదో పాయింట్లు వేసి యిచ్చేస్తున్నారు. ఇక టీవీల్లో అయితే చెప్పనక్కరలేదు. ఏవేవో చెప్పి అడలగొడుతున్నారు. దాంతో ఎవరికైనా ఫోను చేసి 'మా అమ్మాయి లేదా అబ్బాయి ఉన్నాడు' అనగానే 'నక్షత్రం ఏమిటి? ఫలానానా? అది మాకు నప్పదు' అని యింట్లో ఆడవాళ్లే చెప్పేస్తున్నారు. 'జాతకం సమగ్రంగా చూడరా?' అంటే 'అక్కరలేదు, నాకు తెలుసు' అనేస్తున్నారు. జ్యోతిషవిద్య తెలిసినవారెవరూ అలా చెప్పరు.

అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుని చెప్తారు. కానీ యీ మిడిమిడి జ్ఞానం చాలా సంబంధాలు కుదరకుండా చేస్తోంది. నిజానికి యీ రోజుల్లో అనేకమంది జ్యోతిష్కులు తిరస్కరించడంలో ఘనాపాఠీలయ్యారు. గతతరం జ్యోతిష్కులు 'ఫరవాలేదు చేసేయండి, అదే సర్దుకుంటారు' అనేవారు. కానీ యీనాటి వాళ్లు 'అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా దోషం కనబడుతోంది. కాంప్రమైజ్‌ కావడం దేనికి? మరోటి చూడండి' అంటున్నారు. ఆ శంక పెట్టగానే తలితండ్రుల అడుగు ముందుకు పడటం లేదు. అన్ని విధాలా నచ్చిన సంబంధం జాతకాల దగ్గర ఎగిరిపోతోంది. జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లనివాళ్లు కూడా వెబ్‌సైట్‌లో చూపెట్టే మాచింగ్‌ స్కోరు చూసి వెనకడుగు వేస్తున్నారు.

ఇవన్నీ ఒక యెత్తు. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఒప్పుకోవడం రెండు యెత్తులు. ఎవరూ తృప్తి పడడం లేదు. 'కారో, యిల్లో కాదు కదా నచ్చకపోతే మార్చేందుకు, జీవితంలో ఒకే ఒక పెళ్లి. జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి' అనుకుంటూ, యింకా మెరుగైన సంబంధం వస్తుందేమోనని వద్దకు వచ్చినదాన్ని తోసిపుచ్చుతూ ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. ప్రేమించిన కేసుల్లో ఏ కన్సిడరేషనూ ఉండదు, ఎరేంజ్‌డ్‌ మారేజిల్లో మాత్రం అన్నీ పట్టిపట్టి  స్తనశల్యపరీక్ష చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే అవతలివారి నుంచి అన్నీ కోరుకునే తమ వద్ద, ఎదుటివాళ్లను మెప్పించే గుణాలేమున్నాయని సమీక్షించి చూసుకోరు.

చాలామందికి మేట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ఎలాటి ఫోటో పెట్టాలో కూడా తెలియదు. తమ గురించి తాము చక్కగా ఎలా రాసుకోవాలో తెలియదు. ఎదుట పడినప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. అనేకమందికి తమ చదువు, వృత్తికి సంబంధించిన విషయాల గురించి తప్ప తక్కిన ఏ విషయం గురించీ తెలియదు, తెలుసుకోరు. విదేశాల్లో అయితే డేటింగ్‌ ఉంటుంది. స్మాల్‌ టాక్‌ చేసో, స్మార్ట్‌ టాక్‌ చేసో ఎదుటివారిని మెప్పించడం అలవాటవుతుంది. ఇక్కడ అది లేదు, మగాడైతే చాలు అవతలివాళ్లు గెంతుకుంటూ వస్తారనుకుంటారు, చూడచక్కగా ఉంటే చాలు, అబ్బాయిలు పరిగెట్టుకుంటూ వస్తారనుకుంటారు.

అందువలన అపరిచితులను యింప్రెస్‌ చేసేందుకు ప్రత్యేక కృషి చేయరు. ఆడైనా, మగైనా సరే యింట్లో వాళ్లు ఆకాశానికి ఎత్తేసి, ఎక్కడో ఉంచుతారేమో, పెళ్లిచూపుల్లో కూడా ఆ అహం కనబరుస్తారు. చదువు, ఉద్యోగం, స్థితిగతులు అన్నీ చూశాకే పెళ్లిచూపుల దాకా వస్తాయి. అక్కడ మీ ఏటిట్యూడ్‌, మాటతీరు, సివిక్‌ బిహేవియర్‌ నచ్చితేనే అవతలి వ్యక్తి సరేనంటారు. కానీ అక్కడే తన్నేస్తోంది. సంబంధాలు కుదరటం లేదు. ఇవన్నీ గమనిస్తూ ఉన్న తలితండ్రులు 'పిల్లలకు యీ విషయంలో కూడా కోచింగ్‌ యిప్పించాల్సింది' అని వాపోతూ, వాళ్ల పొరపాట్లను ఎత్తి చూపితే కించపడతారేమోనని జంకుతూ, పెళ్లి ఎప్పుడవుతుందని జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతూ చింతాక్రాంతులవుతూంటారు.

పెళ్లి అయ్యాక పడే చింత గురించి మరోసారి.

ఎమ్బీయస్‌: సంతాన చింత

ఎమ్బీయస్‌: సంతాన చింత - 2

ఎమ్బీయస్‌: సంతాన చింత - 3

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com