Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: నటీమణి శశికళ మృతి

ఎమ్బీయస్: నటీమణి శశికళ మృతి

1936 నుంచి 2005 వరకు ఏడు దశాబ్దాలపాటు హిందీ సినీరంగంలో అనేక ముఖ్యపాత్రలు ధరించి 2007లో పద్మశ్రీ బిరుదు పొందిన శశికళ ఏప్రిల్ 4న తన 88వ యేట మరణించారు. తెలుగు పత్రికలేవీ ఆమె మరణవార్తను ప్రచురించినట్లు లేదు. కానీ నాకు వ్యాసం రాయాలని ఎందుకనిపించిందంటే ఆమె విలక్షణ నటి. తెలుగులో రాజసులోచన లాటిది. హీరోయిన్‌గా, వ్యాంప్‌గా, కారెక్టరు ఆర్టిస్టుగా ఎలాగైనా చేయగలదు. కళ్లల్లో ఒక మెరుపు వుంటుంది, జాణతనం, చిలిపితనం చక్కగా ప్రదర్శించగలదు. మన హిందీ హీరోయిన్లలో శోకమూర్తులున్నారు, ప్రెట్టీ డాల్స్ వున్నారు, అచ్చగా వాంప్ పాత్రలు వేసేవారున్నారు. వాళ్లు రిప్లేసబుల్. ఆశా పరేఖ్ డేట్స్ దొరక్కపోతే సాధనా డేట్స్ తీసుకోవచ్చు. హెలెన్ లేకపోతే జయశ్రీ టి.ని తీసుకోవచ్చు. కానీ శశికళ పాత్రలు ఆమే వేయాలి. గాయనీమణులకు వస్తే నాకు లతా, ఆశా యిష్టమే. కానీ వారిని ఎవరైనా అనుకరించవచ్చు. కానీ గీతా దత్‌ను ఎవరూ అనుకరించలేరు. అలాటి యునీక్‌నెస్ నన్ను ఆకట్టుకుంటుంది.

శశికళా జావల్కర్ షోలాపూర్‌లో 1932లో ఒక పేద కుటుంబంలో పుట్టింది. ఆరుగురు పిల్లలను సాకలేక, వాళ్ల నాన్న బొంబాయికి తరలి వచ్చి, యీమెను బాలనటిని చేశాడు. ‘‘జీనత్’’ (1945)లో ఖవ్వాలీలో యీమెను చూసి నటి-గాయని నూర్జహాన్ భర్త ‘‘జుగ్నూ’’ (1947) సినిమాలో పెద్ద పాత్ర యిచ్చాడు. ఆమె అందచందాలు, అభినయం చూసి తర్వాత చాలా సినిమాల్లో వేషాలు వచ్చాయి కానీ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక పోయింది. అయినా ఎందరో దర్శకులు, నిర్మాతలు ఆమెకు యితర ప్రధానపాత్రలు యిచ్చారు. వి. శాంతారామ్ తన ‘‘తీన్ బత్తీ చార్ రాస్తా’’ (1953)లో మరాఠీ యిల్లాలు పాత్ర యిచ్చారు. బిఆర్ చోప్డా ‘‘కానూన్’’ (1960) విలన్ స్నేహితురాలి పాత్ర యిచ్చాడు. ఆ తర్వాత తన సినిమాలు అనేక వాటిల్లో మంచి పాత్రలు యిచ్చాడు. ముఖ్యంగా ‘‘గుమ్రాహ్’’ (1963)లో బ్లాక్‌మెయిలర్ పాత్ర బాగా ఒప్పించింది. ‘‘వక్త్’’ (1965)లో చిన్నదే ఐనా ముఖ్యమైన పాత్ర.

బిమల్ రాయ్ ‘‘సుజాతా’’లో మంచి పాత్ర యిచ్చారు. చాలా సినిమాల్లో యీమె హీరోయిన్‌కు పోటీగా హీరోని ప్రేమించే పాత్రలు వేసింది. అన్నీ హుషారైన పాత్రలే. ‘‘హరియాలీ ఔర్ రాస్తా’’ (1962)లో మనోజ్ కుమార్‌కు ప్రియురాలిగా మాలా సిన్హా వేస్తే యీమె భార్యగా వేసింది. ‘‘జంగ్లీ’’(1961)లో శమ్మీ కపూర్ సోదరిగా వేసింది. అన్నీ యిలాటి సెకండ్ లీడ్ రోల్సే వస్తున్నాయన ఆమె భర్త ఓం ప్రకాశ్ సెగాల్ (ప్రేమించి పెళ్లి చేసుకుంది) ఆమెను హీరోయిన్‌గా, కిశోర్ కుమార్‌ను హీరోగా, మోహన్ సెగాల్ డైరక్టరుగా పెట్టి, శంకర్-జైకిషన్ సంగీతంతో ‘‘కరోడ్‌పతి’’ (1961) అనే సినిమా తీస్తే ఘోరంగా ఫ్లాపయింది. ఇక దానితో హీరోయిన్ ఆశలు వదిలేసుకుంది. ‘‘ఫూల్ ఔర్ పత్థర్’’ (1966)లో దొంగ ఐన ధర్మేంద్రను ప్రేమించే డాన్సర్ పాత్రలో అదరగొట్టేసింది. ఈ సినిమాను ‘‘నిండు మనసులు’’గా ఎన్టీయార్‌తో తెలుగులో తీసినపుడు ఎల్ విజయలక్ష్మి, తమిళంలో ఎమ్జీయార్‌తో తీసినపుడు జయలలిత ఆ పాత్రను ధరించారు.

ఒక గుజరాతీ నాటకం ఆధారంగా తారాచంద్ బర్జాత్యా ‘‘ఆరతి’’ (1962)సినిమా ప్లాన్ చేసినపుడు శశికళ దానిలో అశోక్‌కుమార్ సరసన మరోసారి వేసే అవకాశం వచ్చినా, అది కాదని గయ్యాళి ఐన ఆయన వదిన పాత్రను ఎంచుకున్నారు. అది సూపర్ హిట్ కావడంతో అప్పటినుంచి ఆమెకు నెగటివ్ పాత్రలు చాలా వచ్చాయి. అలాటి టైములో హృషీకేశ్ ముఖర్జీ పాజిటివ్ రోల్ యిద్దామని ‘‘అనుపమ’’ (1966)లో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర యిచ్చారు. హీరోయిన్ ఇంట్రావర్ట్ అయితే, యీమె ఎక్స్‌ట్రావర్ట్. తనపై రెండు మంచి పాటలున్నాయి. ఆమె చాలా క్రమశిక్షణ కలిగిన నటి, పార్టీల యావ లేకుండా టైముకి వచ్చి, టైముకి వెళ్లే నటి కావడంతో ఆమెకు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించినవారిలో విజయ భట్, అమియ చక్రవర్తి, ఎల్‌వి ప్రసాద్, రాజ్ ఖోస్లా, ఎస్‌ఎస్ వాసన్, ఎవి మెయ్యప్పన్, దేవ్ ఆనంద్, విజయ్ ఆనంద్ వంటి ప్రముఖులున్నారు.

‘‘భార్యాభర్తలు’’ సినిమాను హిందీలో రాజేంద్ర కుమార్, జమునలతో‘‘హమ్ రాహీ’’ (1963)గా తీసినప్పుడు గిరిజ పాత్ర వేసింది. ‘‘భలే కోడళ్లు’’ హిందీ రూపమైన ‘‘తీన్ బహూరాణియాఁ’’ (1968)లో యీమె, తెలుగులో రాజశ్రీ వేసిన పొరుగున వుండే సినిమా నటి పాత్ర వేసింది. ‘‘ఆస్తులు-అంతస్తులు’’ సినిమా హిందీ వెర్షన్ ‘‘పైసా యా ప్యార్’’(1969)లో హీరోయిన్ మాలా సిన్హాకు సవతి తల్లి పాత్ర వేసేటప్పుడు యిబ్బంది పడింది. పదిరీళ్ల సినిమా తీశాక, ఏదో సాంకేతిక సమస్య వచ్చి మళ్లీ మొదలుపెట్టవలసి వచ్చింది. నిర్మాత వద్దకు వెళ్లి ‘నేను వేయను, నా బదులు వేరేవాళ్లను తీసుకోండి.’ అని చెప్పింది. ఆ సంగతి అశోక్ కుమార్‌కు తెలిసి కారణం అడిగాడు. ‘‘నాకంటె నాలుగేళ్ల చిన్నదైన మాలా సిన్హాతో పోటీగా, ఆమె స్నేహితురాలిగా వేసినదాన్ని యీ రోజు తన తల్లిగా వేయడం నా వల్ల కావడం లేదు.’’ అంది. అప్పుడు అశోక్ కుమార్ నవ్వి, ‘‘మనం ప్రొఫెషనల్స్. ఇలాటివి చూడకూడదు. నేను ఇదే మాలా సిన్హాకు ప్రియుడిగా, భర్తగా, సోదరుడిగా, తండ్రిగా, తాతగా, చివరకు విలన్‌గా కూడా వేశాను. నీ పాత్రపోషణ బాగుంది. సంకోచాలేమీ పెట్టుకోకుండా చేసేయ్’’ అని చెప్పాడు. శశికళ ఆయన మాటను మన్నించింది.

దాని తర్వాత పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంది. మళ్లీ తిరిగి వచ్చాక చిత్రపరిశ్రమ ఆమెను ఆదరించింది. ‘‘దుల్హన్ వహీ జో పియా మన్‌ భాయే’’(1977 )లో హీరో ప్రియురాలి తల్లిగా వేసింది. ‘‘స్వామి’’(1977)లో గిరీశ్ కర్నాడ్ సవతి తల్లిగా వేసింది. ఈ స్టేజ్‌లోనే మళ్లీ హృషీకేశ్ ముఖర్జీ ‘‘ఖూబ్‌సూరత్’’ (1980)లో అత్తగారంటే భయపడే కోడలు వంటి పాజిటివ్ పాత్ర వేయించారు. మనోజ్ కుమార్ ‘‘క్రాంతి’’ (1981)లో, రాజ్ కపూర్ ‘‘బీవీ ఓ బీవీ’’ (1981)లో, సావన్ కుమార్ ‘‘సౌతేఁ’’ (1983)లో వేషాలిచ్చారు. ఇలా వుండగానే ఓ డైరక్టరు సెట్స్ మీద తనను అకారణంగా అవమానించాడని కోపం వచ్చి సినిమా రంగం విడిచి వెళ్లిపోయింది.

మళ్లీ 8 సంవత్సరాలకి చిత్రసీమే ఆమెను ఆహ్వానించి, వేషాలిచ్చింది. ‘బాద్‌షా’’(1999)లో షా రుఖ్ ఖాన్‌కు తల్లిగా వేసింది. ‘‘కభీ ఖుశీ కభీ గమ్’’ (2001) వంటి అనేక సినిమాల్లో వేషాలు వచ్చాయి. ‘‘పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్’’ (2005) ఆఖరి చిత్రం. వందలాది సినిమాల్లో వేసిన ఆమె టీవీ సీరియల్స్‌లో కూడా రాణించింది. మాతృభాష మరాఠీయే అయినా, ఆ భాషలో చాలా తక్కువ చిత్రాలు వేసింది. కారణం పారితోషికం తక్కువ కావడమే అని చెప్పింది. 1955లో ఓ సినిమాలో హీరోయిన్‌గా వేస్తే రూ.5 వేలిచ్చారట. తక్కినవాళ్లకు రెండు వేలే యిచ్చేవారట. ‘‘సత్యవాన్ సావిత్రి’’ అనే గుజరాతీ పౌరాణిక చిత్రంలో సతీ సావిత్రి వేషం యిస్తే గుజరాతీ చక్కగా నేర్చుకుని నటించిందట. ‘‘ఆరతి’’, ‘‘గుమ్రాహ్’’ సినిమాల్లో వేషాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. 2007లో పద్మశ్రీ వచ్చింది.

వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెకు మదర్ థెరిసా అంటే చాలా యిష్టం. కలకత్తాలో ఆమె ఆశ్రమానికి వెళ్లి సినిమా తారననే మాట అక్కడ మర్చిపోయి రోగులకు సేవలు చేసేది. తన యిద్దరు కూతుళ్లలో ఒకరు కాన్సర్‌తో చనిపోయినపుడు ఆ దుఃఖం మర్చిపోవడానికి సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసింది. నిండు జీవితం గడిపి 88వ ఏట కితం నెలలో మరణించింది. ఆమె రూపలావణ్యాలు, నృత్యకౌశలం తెలుసుకోవడానికి వీలుగా కొన్ని పాటల యూ ట్యూబ్ లింకులు యిస్తున్నాను. మొదటిది ‘‘అనుపమ’’లో ‘భీగీభీగీ ఫజా’, రెండోది ‘‘ఫూల్ ఔర్ పత్థర్’’లో ధర్మేంద్రతో ‘శీషేసే పీ’, మూడోది ‘‘భీగీరాత్’’లో ప్రదీప్ కుమార్‌ను టీజ్ చేసే ‘తూ మేరా జో నహీఁ’! శశికళ అంటేనే హుషారుగా తుళ్లిపడే చలాకీ రూపం కళ్లకు కడుతుంది. ఆమెను అలా గుర్తు పెట్టుకోవడమే నాకిష్టం. 

1. https://www.youtube.com/watch?v=UKZWX7GKRp0

2. https://www.youtube.com/watch?v=zFFwo_7vkiU

3. https://www.youtube.com/watch?v=anZG995itZ8

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021) [email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?