Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: 'సోదరుడు' శివాజీ గణేశన్‌కు సావిత్రి కానుక

ఎమ్బీయస్‌: 'సోదరుడు' శివాజీ గణేశన్‌కు సావిత్రి కానుక

శివాజీ గణేశన్‌కు అమితంగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ''వీరపాండ్య కట్టబొమ్మన్‌' (తెలుగు డబ్బింగులో -.... కట్టబ్రహ్మన్న). 1959లో రిలీజైన యీ సినిమాకు దర్శకనిర్మాత బి.ఆర్‌.పంతులు.

కట్టబొమ్మన (1760-1799) తమిళనాడులో ఆనాటి మధుర సామ్రాజ్యంలో ఉన్న 72 పాలయాలలో తూత్తుకుడికి 18 కి.మీ.ల దూరంలో ఉన్న పాంచాలంకురిచి అనే చిన్న ప్రాంతానికి పాలెగాడు. ఈస్టిండియా కంపెనీవారు కప్పం కట్టమంటే కట్టనని తిరగబడితే అతడిని ఉరి తీశారు. అతని జీవితం గురించి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. ఎవరి కల్పన వారిది. ఆ కథను వీధినాటకం రూపంలో శివాజీ చిన్నపుడు చూశాడు. సినిమా నటుడయ్యాక నాటకంగా రాయించుకుని తన శివాజీ నాటక మన్రం తరఫున 1957 నుంచి ప్రదర్శనలు యిచ్చేవాడు. వాటిలో ఒకదాన్ని చూసిన బిఆర్‌ పంతులు లార్జర్‌-దాన్‌-లైఫ్‌ పాత్రలతో, చరిత్రపరంగా కావలసినంత స్వేచ్ఛ తీసుకుని, భారీ తారాగణంతో టెక్నికలర్‌లో సినిమాగా తీస్తానని ముందుకు వచ్చాడు.

''శివాజీ చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నాడు. కట్టబొమ్మన కథలో వెల్లయ్యదేవన్‌ అనే పాత్ర ఉంది. అతను కట్టబొమ్మనకు సేనాపతి, అత్యంత ఆత్మీయుడు, సాహసి. జల్లికట్టులో ఆంబోతును అడ్డగించి, వెల్లయ్యమ్మ అనే అందగత్తె (సినిమాలో పద్మిని) మనసు దోచి పెళ్లాడతాడు. కట్టబొమ్మనకు, ఈస్టిండియా కంపెనీకి జరిగిన యుద్ధంలో పోరు ముగిసాక ధర్మవిరుద్ధంగా ఒక ఆంగ్లసైనికుడు కాల్చిన తుపాకీ కారణంగా నేల కొరుగుతాడు. ఈ పాత్రను వేయమని శివాజీ ఆనాటి అగ్రశ్రేణి నటుల్లో ఒకడైన ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌ను కోరాడు. రాజేంద్రన్‌ కూడా వీరుడి పాత్రలు వేసి ప్రజాదరణ పొందినవాడు. అయితే అతను అంగీకరించలేదు. ''శివగంగై సీమై'' సినిమాలో హీరోగా వేస్తున్నాను, కాబట్టి కుదరదు అన్నాడు. 

''శివగంగై సీమై'' కూడా చారిత్రాత్మక సినిమాయే. కట్టబొమ్మన కథతో లింకూ ఉంది. కట్టబొమ్మన తమ్ముడు ఊమైదురై (అసలు పేరు దురైసింగం) అన్నగారితో పాటు ఈస్టిండియా వారి జైల్లో శిక్ష అనుభవించి, అన్నగారి ఉరితీత తర్వాత 1801లో జైలు నుంచి పారిపోయి శివగంగ చేరి దాన్ని పాలిస్తున్న మరుదు సోదరులతో చేతులు కలిపాడు. వారికి యింకో యిద్దరు పాలెగాళ్లు తోడయ్యారు. అంతా కలిసి ఈస్టిండియా కంపెనీపై దండెత్తారు కానీ ఓడిపోయి, చివరకు 1801 అక్టోబరులో పట్టుబడ్డారు. మరుదు సోదరులతో బాటు ఊమైదురై 1801 నవంబరులో ఉరితీయబడ్డాడు. ఈ కథకు కణ్నదాసన్‌ స్క్రిప్టు, పాటలు రాయడంతో బాటు కె.శంకర్‌ దర్శకత్వంలో సినిమా నిర్మించాడు. కథానాయకుడైన ముదలగు సెర్వయ్‌ పాత్ర రాజేంద్రన్‌ వేశాడు. ''దానవీర శూరకర్ణ'', ''కురుక్షేత్రం'' లా యీ రెండు సినిమాలకు సంబంధం ఉండడంతో ఒకదానికి మరొకటి పోటీగా తయారైంది. కణ్ణదాసన్‌ టీము కట్టబొమ్మన సినిమాపై విరుచుకుపడ్డారు. అతను పాండ్యసీమకు చెందినవాడే తప్ప పాండ్యుడు కాదని, తెలుగువాడని, మురుదు సోదరులైతే అచ్చమైన తమిళులని వాదించారు. ఆ మాట నిజమే. 1565లో విజయనగర సామ్రాజ్యం కూలిపోయాక ఆ సైన్యంలో ఉన్న తెలుగువారు అనేకులు దక్షిణాది ప్రాంతాలు (నేటి తమిళనాడు)కి వెళ్లి స్థిరపడ్డారు.

కులప్రకారం చెప్పాలంటే కమ్మ, రెడ్డి, కంబళ కులాల సైనికులు జీవనోపాధి కోసం వెతుక్కుంటూ మెట్టప్రాంతాలకు వెళ్లి వ్యవసాయదారులుగా మారారు. తిరునల్వేలి జిల్లాలో వెనకబడిన ప్రాంతానికి వచ్చిన కంబళ కులానికి చెందిన రైతు కుటుంబానికి చెందినవాడు కట్టబొమ్మన. సినిమాలో అతని పాత్రలో శివాజీ తమిళంలో అద్భుతంగా డైలాగుల జడివాన కురిపించినా నిజజీవితంలో అతనికి పెద్దగా తమిళం రాదు, తెలుగులోనే మాట్లాడేవాడు. ఇవన్నీ ఈస్టిండియా కంపెనీ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. కట్టబొమ్మన తెలుగుతనాన్ని ఎత్తిచూపడంతో ఆగకుండా కణ్ణదాసన్‌ అతను స్వాతంత్య్రయోధుడు కానే కాడనీ, దొంగ అనీ కూడా అన్నాడు. 

ఇవన్నీ శివాజీ గణేశన్‌కు చికాకు తెప్పించాయి. తన ఆత్మకథలో అతను 'ఇలాటి ధోరణి ఆనాడు ఉండడం బాధాకరం. దాని గురించి విపులంగా చెప్పడం అనవసరం. రాజేంద్రన్‌ వెల్లయ్యదేవన్‌ పాత్ర వేయననడంతో నేను జెమినీ గణేశన్‌ను వేయమని కోరాను. 'మీ సినిమా చిత్రీకరణంతా జయపూర్‌లో సాగుతుంది. నా భార్య సావిత్రి ప్రస్తుతం పూర్ణ గర్భవతి. తొలికాన్పు. నేను దగ్గర ఉండాలి. అందువలన మీ సినిమాలో వేయలేను.' అన్నాడు. సావిత్రి నన్ను సోదరుడిలా భావిస్తుంది. ఆ చనువుతో ఆమె వద్దకు వెళ్లి 'మీ ఆయన్ని ఆ పాత్ర వేయడానికి పంపించు. ఇది ఒక సోదరుడికి నువ్విచ్చే పెద్ద కానుక' అన్నాను. తను నా మాట మన్నించి జెమినీని జయపూర్‌ వెళ్లిరమ్మంది. మా అదృష్టమేమిటంటే, ప్రసవసమయానికి మేం జయపూర్‌లో సినిమా షూటింగు ముగించుకుని వచ్చేశాం. జెమిని ఆమె పక్కనే ఉన్నాడు.' అని రాశాడు.

రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. తమిళప్రేక్షకులు తెలుగు-తమిళ మూలాల గురించి పట్టించుకోలేదు. కట్టబొమ్మన సిల్వర్‌ జూబ్లీ ఆడింది. తెలుగు డబ్బింగ్‌, ''అమర్‌ షహీద్‌'' (1960) పేరుతో రిలీజైన హిందీ డబ్బింగు కూడా బాగా ఆడాయి. 'ఎందుకు కట్టాలి కప్పం? నారు పోశావా? నీరు పోశావా?' వంటి శివాజీ కట్టబొమ్మన డైలాగులు నాటికీ నేటికీ కూడా హోరెత్తిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా వేసిన ఎస్‌.వరలక్ష్మి ''శివగంగై సీమై''లో కూడా హీరోయినే అయినా ఆ సినిమా ఫ్లాపైంది. కుముదం పత్రిక ఆ సినిమాను సమీక్షిస్తూ ''ఈ సినిమాలో అందరికీ భారీగా మీసాలున్నాయి కాబట్టి ''శివగంగై సీమై బదులు శివగంగై మీసై (మీసం)''గా పేరు పెడితే బాగుండేది.'' అని వెక్కిరించింది. -

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?