cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఇది కూడా సుప్రీం కోర్టే చెప్పాలేమో!

ఎమ్బీయస్: ఇది కూడా సుప్రీం కోర్టే చెప్పాలేమో!

విజయవాడలో కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆ సెంటర్ నిర్వహిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని అనగా ఎండీగా ఉన్న డా. రమేశ్‌ను, చైర్మన్‌గా వున్న సీతారామ మోహనరావును మహరాజులా విచారించవచ్చు అంది. అరెస్టులు చేయనక్కరలేదు కానీ పిలిచి ప్రశ్నలడిగి విచారణ జరపడానికి అభ్యంతరం లేదంది. ఆ విచారణకు సహకరించాలని రమేశ్‌కు చెప్పింది. 

అసలు ఆ సెంటరు పెట్టడానికి అనుమతించిన ప్రభుత్వాధికారులపై, అనగా జిల్లా కలక్టరు, విజయవాడ సబ్-కలక్టరు, జిల్లా వైద్యాధికారులపై కేసులు పెట్టి, తర్వాతనే ఆసుపత్రి యాజమాన్యం జోలికి రావాలని యిచ్చిన హైకోర్టు వింతతీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళితే వాళ్లు చెప్పినదిది.

మీరేదైనా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి పట్టుబడ్డారనుకోండి, పోలీసుతో పక్కవాడికి హెల్మెట్ లేదు కదా, అవతలివాడు ఒన్‌వేలో వచ్చేస్తున్నాడు కదా, వాణ్ని పట్టుకోకుండా నన్నే పట్టుకున్నావేం అని వాదిస్తే అతను ఊరుకుంటాడా? వాళ్ల సంగతి తర్వాత ముందు నువ్వు తప్పు చేశావు కాబట్టి జరిమానా కట్టు అంటాడు.

అబ్బే, వాళ్లందరినీ శిక్షిస్తే తప్ప నేను జరిమానా కట్టను, కట్టడం మాట అటుంచు, అసలు నువ్వు అడగనే కూడదు అని మొండికేయగలరా? ఓ లంచగొండి అధికారి దొరికాడు. అతని మీద కేసు పెడతారు. ‘అబ్బే, నా ఒక్కడి మీదా కాదు, నేను లంచం తీసుకోవడానికి దోహదపడిన పరిస్థితులు కల్పిస్తూ యిన్నేళ్లగా నా పైన అధికారులుగా, మంత్రివర్యులుగా వ్యవహరించిన అందరిపైనా కేసులు పెట్టి అప్పుడు నా దగ్గరకు రండి.’ అని అతను వాదించగలడా?

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీము పెట్టింది. అక్రమంగా వేసిన లేఔట్లకు రెగ్యులరైజేషన్ ఫీజు కట్టి వాటిని సక్రమం చేసుకోవచ్చు అంటోంది. ‘నేను కట్టడానికి ముందు, అసలా లేఔట్ వేయనిచ్చిన ఆఫీసర్లను కట్టమనండి, ఇంటికి విద్యుత్, నీరు కనక్షన్లు యిచ్చిన అధికారులను కూడా శిక్షించండి, వాళ్లకు జరిమానాలు వేయండి’ అని అడగగలమా? ..అడగగలం అని హైకోర్టు చెప్పినట్లయింది.

విజయవాడ కేసులో స్వర్ణ పాలెస్ హోటల్ మేనేజ్‌మెంట్, దాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చి, నిర్వహిస్తున్న రమేశ్ ఆసుపత్రుల యాజమాన్యాలు రెండూ ప్రధానంగా దోషులు. వాటికి అనుమతులు యిచ్చిన అధికారులది కూడా తప్పుంది. కానీ వారిది రెండో వరుస. ప్రధాన దోషుల జోలికి రాకూడదంటూ వారికి రక్షణ వలయం కట్టేస్తే ఎలా? హోటల్, ఆసుపత్రుల యాజమాన్యాలు అనగానే డాక్టర్ రమేశ్ మీద వ్యక్తిగతమైన దాడి అని ఎందుకనుకోవాలి? ఆయనను డాక్టరైనందుకు తప్పు పట్టటం లేదు. ఒక సంస్థ హెడ్‌గా ఆయనను జవాబుదారీగా వుండమంటున్నారు. ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉన్నాక ఒక్కోప్పుడు కొన్ని తప్పులు జరుగుతూంటాయి. చేసినవారు కింది స్థాయి వారైనా, పైవారే బాధ్యత వహించాలి.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో యూనియన్ కార్బయిడ్ చీఫ్ ఏండర్సన్‌ను తప్పు పట్టారా లేదా? భోపాల్ మేజిస్ట్రేట్ అతనిపై అరెస్టు వారంటు జారీ చేశాడు కదా! అతన్ని అరెస్టు చేయకుండా అప్పటి ప్రభుత్వం కాపాడిందని గొడవైందా లేదా? అతనిపై కేసు పెట్టి, తమకు అప్పగించమని అమెరికాను మనవాళ్లు కోరారు కదా! ఏం, ఏండర్సన్ స్వయంగా వచ్చి గ్యాస్ లీక్ చేశాడా? లేదు కదా! అయినా కంపెనీ అధినేత కాబట్టి అతను బాధ్యుడన్నారు.

ఎల్‌జి పాలిమర్స్ విషయంలో ఏం జరిగింది? ఎవరో మేన్‌టెనెన్స్ సిబ్బంది పొరబాటు. అయినా సిఇఓ, డైరక్టరు (వాళ్లిద్దరు కొరియన్ జాతీయులు), ఆపరేషన్స్ ఎడిషనల్ డైరక్టరుతో 11 మంది మీద కేసు పెట్టారా లేదా? వాళ్లకు వెంటనే బెయిల్ దొరికిందనుకోండి. అలాగే రమేశ్‌కు కూడా జరిగివుండేది. ఆయన రోగులను కావాలని చంపాడని ఎవరూ అనలేరు. కానీ సంస్థ అధినేతగా జవాబు చెప్పవలసిన బాధ్యత ఆయనకుంది.

అందుకే అరెస్టు, బెయిల్ వెంటవెంటనే జరుగుతాయి. ఎక్కడైనా జరిగేది యిదే పద్ధతి. చివరకు ఆయన ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కో ఎవరికో శిక్ష పడవచ్చు. జరిమానా లాటిది విధిస్తే అది ఆసుపత్రి యాజమాన్యమే కట్టేస్తుంది. ఎందుకంటే యివి కావాలని చేసిన హత్యలు కావు. పనిలో నిర్లక్ష్యం కారణంగా జరిగిన చావులు. ఎల్‌జీ కేసులోనూ అంతే. అక్కడ ఒకలా మాట్లాడి, యిక్కడ యింకోలా మాట్లాడకూడదు.

రమేశ్ గారు గొప్ప డాక్టరని ప్రతీతి. కానీ ప్రస్తుత చర్చ డాక్టరుగా ఆయన సామర్థ్యం గురించి కాదు, ఎడ్మినిస్ట్రేటర్‌గా వుంటూ ఆయన చూపిన నిర్లక్ష్యం గురించి. పర్యవేక్షణకు సరైన వ్యక్తులను నియమించుకోక పోవడం, వారిని అజమాయిషీ చేయలేకపోవడం వంటి పొరపాట్లకు ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవాలి కదా. అది పేరుప్రతిష్ఠల రూపేణా చెల్లిస్తున్నారు. 

దీనిలో యింకో యిబ్బంది ఏం వచ్చిందంటే కోవిడ్ సెంటర్‌గా సెలక్టు చేసుకున్న హోటల్ స్వర్ణ పాలెస్ వాళ్ల బంధువులదిట. దాని ఎలక్ట్రికల్ వైరింగ్ అధ్వాన్నంగా వుందని, నిర్వహణ బాగా లేదని తేటతెల్లంగా తెలుస్తోంది. మరి వాళ్లతో ఒప్పందం పెట్టుకునేముందు, తన ఆసుపత్రి ఇమేజిని దృష్టిలో పెట్టుకునైనా, సరిగ్గా చెక్ చేయించి వుండాల్సింది.

ఆ హోటల్‌కు వాణిజ్యపరమైన కట్టడంగా అనుమతులు లేవట. 1984లో ఒకసారి అనుమతి అడిగి లేదనిపించుకుని 1989లో నివాసంగా రికార్డుల్లో చూపించి అనుమతి తెచ్చుకున్నారట. హోటల్‌గా అనుమతి లేకుండానే 30 ఏళ్లగా నడుపుతూ మధ్యలో ఓ ఫ్లోర్ అదనంగా కూడా వేసేశారట.  ఫయర్ డిపార్టుమెంటు దగ్గర్నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోలేదట.

ఏదైనా ప్రమాదం జరిగితే, లోపలున్నవాళ్లు తప్పించుకునే వెనుకదారి లేకుండానే పెద్ద హోటల్ నడిపేస్తున్నారు. బొత్తిగా దైవాధీనం సర్వీసు. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం నడిచినా వాళ్ల హవా నడుస్తూ వస్తోందన్నమాట. ఆ హవా అలా నడిచేట్లా చేస్తూ వచ్చినందుకు ప్రస్తుత అధికారులనే కాదూ, గత అధికారులను కూడా శిక్షించాలి, సంబంధిత మంత్రులను కూడా వదలకూడదని కోర్టు అంటే...?

ఇప్పుడీ యాక్సిడెంటు జరిగి వుండకపోతే యీ లోపాల సంగతి బయటకు వచ్చేది కాదు కదా! జగన్ అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చేసి, రాష్ట్రంలో అక్రమకట్టడాలు కూల్చివేతకు యిదే శ్రీకారం అంటే భేష్ అనుకున్నాను. తర్వాత చంద్రబాబు అద్దెకున్న యింటి మీదకు వెళ్లడం, వాళ్లు కోర్టుకి వెళ్లి ఆపించుకోవడం విని అయ్యోపాపం అనుకున్నాను.

మరి యీ హోటల్ సంగతి వింటూంటే, జగన్ ఉత్సాహం ప్రజావేదిక బిల్డింగు ఒక్కదానితోనే చల్లారి పోయిందాని అనుమానం వస్తోంది.  ఆ బిల్డింగు తర్వాత రాష్ట్రంలో ఎన్ని అక్రమనిర్మాణాలు కూల్చారో ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే నా బోటి వాళ్ల సందేహాలు తీరతాయి. లేకపోతే ఆ కూల్చివేత రాజకీయకారణాలతో చేసిందే తప్ప, తప్పులు సరిదిద్దాలనే ఆశయంతో చేసింది కాదని నమ్మాల్సి వస్తుంది.

ఇప్పుడీ హోటల్ విషయమే వుంది. పదిమంది చచ్చిపోతే తప్ప యిది అక్రమనిర్మాణమని తెలియరాలేదా? తక్కిన అక్రమనిర్మాణాల సంగతి బయటకు రావాలంటే మరెంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాలో! దీనిలో ఫయర్ డిపార్టుమెంటు వాళ్లు రక్షించారు కాబట్టి కానీ లేకపోతే మరో యిరవై మంది పోయేవారట. ఇలాటి అగ్నిప్రమాదం వినోదాల కోసం వెళ్ళే  ఏ బార్‌లోనే జరిగితే అదో సంగతి. రోగం నుండి కాపాడుకోవడానికి, బతకడానికి ఆసుపత్రికి వెళితే అక్కడే చావు ఎదురైతే ఎలా? కలకత్తాలో పాత ఆసుపత్రులలో యిలాటి సంఘటనలు వింటూ వుంటాం. 

కానీ విజయవాడలో, అదీ 30 ఏళ్ల క్రితమే కట్టిన హోటల్‌ ఫయర్ ఎస్కేప్ రూట్ లేకుండా కట్టారంటే, కట్టి దిగ్విజయంగా నడిపేస్తున్నారంటే ఎంత ధీమాయో చూడండి. మామూలు రోజుల్లో అగ్నిప్రమాదం జరిగితే, అతిథులు పారిపోయే స్థితిలో వుంటారు. కానీ అదే రోగులైతే పారిపోయే ఓపిక వుండదు కదా. ఆసుపత్రికి లీజుకి యిచ్చేటప్పుడైనా తప్పులు సవరించుకోవద్దా? ఇలాటివి వేరే చోట్ల జరగకుండా చూడాలంటే యీ కేసు గట్టిగా నడవాలనే మామూలు వాళ్లందరం కోరుకుంటాం.

ఎందుకంటే ఆ చనిపోయినవారిలో మనం కూడా ఉండే ఛాన్సుంది. కోవిడ్ తారతమ్యాలు చూడకుండా అందరికీ సోకేస్తోంది. ఇంట్లో వుండి చికిత్స చేయించుకుందామనే అనుకుంటున్నాం కానీ అన్నివేళలా అది కుదరకపోవచ్చు. ఊపిరందకపోతే ఆసుపత్రిలో చేరితీరాలి కదా! అక్కడ వెంటిలేటరు ద్వారా ఊపిరందుతుందని వెళితే నిప్పుపొగలు వ్యాపించి ఉక్కిరిబిక్కిరయి ఛస్తే ఏం బాగుంటుంది? మనం చచ్చాక మన కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం యిస్తే మనకేం లాభం? మనకు దానిలో 50 పైసలైనా పరలోకానికి బట్వాడా చేయలేరు కదా!

అవునూ, నష్టపరిహారమంటే గుర్తుకు వచ్చింది. ఎల్‌జి వాళ్ల విషయంలో అప్పటిదాకా కనీవినీ ఎరుగనంత భారీ మొత్తంలో కోటి రూ.ల నష్టపరిహారం చెల్లించారు. ప్రభుత్వానికి భరించలేనంత భారం కదా అని అడిగితే, అబ్బే, దాన్ని ఎల్‌జి వాళ్ల దగ్గర వసూలు చేస్తామన్నారు. మరి ఈ 50 లక్షల పరిహారం రమేశ్ ఆసుపత్రి నుండి వసూలు చేసి ఖజానాను పూరిస్తారా? డా. రమేశ్‌గారు బాధ్యత గల వ్యక్తి, సమాజంలో పేరున్న వ్యక్తి. ఆయన పోలీసులకు లొంగిపోయినా, అరగంటలో బెయిల్ లభించవచ్చు.

కానీ డాక్టర్ రమేశ్ అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యం కలిగించింది. దుర్ఘటన తర్వాత విడుదల చేసిన వీడియోలో నిర్వహణ బాధ్యత హోటల్‌దని, మెడికల్ సౌకర్యాలు అందించడం వరకే ఆసుపత్రి బాధ్యత అని ఆయన స్పష్టంగా చెప్పారు. (అక్కడ ఎమర్జన్సీ ఎక్విప్‌మెంటు లేదని కమిటీ వాళ్లన్నారు.

అది ఆసుపత్రి చూసుకోవలసినదే కదా) ఆ విధంగా ఒప్పందంలో రాసుకునే వుంటారు. ఆ ముక్కే పోలీసుల ఎదుటపడి, చెప్పేస్తే పోయేది కదా. విజయవాడ, గుంటూరులలోనే కాక, రాష్ట్రమంతా ప్రఖ్యాతి తెచ్చుకుని సామాజికంగా ఎంతో ఉన్నతస్థాయిలో వున్న ఒక వైద్యుడు చట్టాన్ని తప్పించుకుని తిరుగుతున్నారనడం వినడానికే బాగా లేదు. రేపు ఆయన బాధితుడిగా మారే పక్షంలో నిందితుడు యిలాగే మాయమై పోతే ఎంత బాధపడతారో ఊహించుకోమనండి.

కనబడకుండా పోయిన డాక్టర్ రమేశ్ గారిని చంద్రబాబు గారు ఒక్కమాటా అనటం లేదు. ఎల్‌జీ పాలిమర్స్ విషయంలో అంతగా చెలరేగిపోయిన బాబు యీ కేసులో మౌనంగా వున్నారు. మృతి చెందినవారి స్మృతికి నివాళి అర్పించినపుడు, ఆ మృతికి కారకులైనవాళ్లకు శిక్ష పడాలని కోరాలి కదా.

ఆసుపత్రిదో, హోటల్‌దో ఎవరిదో ఒకరిది తప్పుందని అనక తప్పదు కదా! భద్రత సరిగ్గా వుందో లేదో చూడకుండా అనుమతించిన అధికారులదీ తప్పుంది. వారికీ శిక్ష పడాలి. కానీ ప్రాథమికంగా తప్పుచేసిన వారికి పెద్ద శిక్ష పడాలి. ఆ ముక్క చెప్పడానికి శషభిషలెందుకు? ఇక టీవీ చర్చల్లోకి వచ్చే టిడిపి నాయకులైతే చెప్పనే అక్కరలేదు. ప్రముఖ వైద్యుణ్ని యీ ప్రభుత్వం అవమానం పాలు చేసిందట, ఇకపై రాష్ట్రానికి పేరున్న డాక్టర్లెవరూ రారట, కార్పోరేట్ ఆసుపత్రులు రావట, పెట్టుబడులు రావట.., ఎట్సెట్రా.

ఎల్‌జి వంటి పరిశ్రమల విషయంలో సైతం యిలాగే అనగలమా? పెట్టుబడులు రావాలంటే జాగ్రత్తలు గాలికి వదిలేయండని చెప్పగలరా? మామూలుగా అయితే ఎల్‌జిని దుయ్యబట్టినంత తీవ్రంగా ప్రధాన ప్రతిపక్షం రమేశ్ ఆసుపత్రి, స్వర్ణ పాలెస్ హోటల్‌లను నిందించేది. దుర్ఘటనను ఖండిస్తూ నిష్పక్షపాత విచారణ జరగాలని, దోషులకు శిక్ష పడాలని, అప్పుడే పోయిన ప్రాణాలకు ఆత్మశాంతి కలిగేదని పిలుపు నిచ్చేది. కానీ అదేమీ చేయకుండా టిడిపి కిమ్మనకుండా వుంది. ఎందుకంటే పైల్స్ పేరు చెప్పి నెలల తరబడి తమ పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడికి డా. రమేశ్ ఆశ్రయం యిచ్చి కాపాడారనే కృతజ్ఞతాభారం ఒకటి వుండిపోయింది.

కానీ కోర్టులకు ఎలాటి ఋణాలూ వుండవు కదా! అయినా హైకోర్టు రమేశ్ విషయంలో చాలా సానుభూతి, సహానుభూతి ప్రదర్శించింది. పాపం జెసి బ్రదర్స్ విషయంలో యిలాటి సానుభూతి కానరాలేదు. వాళ్లు అనుమతులు లేకుండా బస్సులు తిప్పుతున్నారని ప్రభుత్వం కేసులు పెట్టినపుడు, వాళ్లపై మాత్రమే కేసు పెట్టారేం, తిరగనిచ్చిన ఆర్‌టిఓలపై, బ్రేక్ యిన్‌స్పెక్టర్లపై కేసు పెట్టి, ఆ తర్వాత వీరి జోలికి రావాలి కదా అనలేదు. ఒక్కో జడ్జి ఒక్కోలా ఆలోచిస్తారు. అది సహజం. అందుకే లిటిగెంట్లు ఓ కోర్టు తర్వాత మరో కోర్టు తిరుగుతూంటారు, ఎవరో ఒక జడ్జి తన వాదనతో ఏకీభవిస్తాడనే ఆశతో!

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎంతటి దిక్కుమాలిన వాతావరణం ఏర్పడిందంటే ప్రతీదీ కులానికి ముడిపెట్టేస్తున్నారు. జెసి, రమేశ్ కేసులలో వ్యత్యాసానికి కులంలో తేడాయే కారణమని అనేస్తున్నారు. కేసన్నాక, న్యాయస్థానాలు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. వ్యక్తిగత రాగద్వేషాలను పక్కన పెట్టి న్యాయమూర్తులు తీర్పులు చెప్తారు. కేవలం ఫలానావాళ్లు చెప్పారనో, ముద్దాయిదో, న్యాయవాదిదో ఫలానా కులమనో అటు మొగ్గరు. 

ఏ తీర్పు వచ్చినా దాని వెనక్కాల బాబు ఉన్నారనుకోవడం కోర్టులను అవమానించినట్లే. దానివలన కోర్టులకు పోయేదేమీ లేదు కానీ పాపం బాబుకి చెడ్డపేరు వస్తోంది. న్యాయాన్యాయాల కంటె ఎంతసేపూ ఆయనకి తనవారే ముఖ్యమని, వారిని కాపాడడానికి ఎవరినైనా సరే ప్రభావితం చేస్తారనే అపప్రథ కలుగుతోంది. దానివలన తమ పార్టీ కార్యకర్తలకు ‘మా నాయకుడు తలచుకుంటే ఏమైనా చేయగలడు’ అనే నమ్మకం పెరగవచ్చు కానీ, సామాన్యజనాల్లో అందరివాడు కాదు, కొందరివాడే అనే భావం ప్రబలి పాప్యులారిటీ తగ్గుతుంది.

ముఖ్యంగా రమేశ్ ఆసుపత్రి విషయంలో మౌనం వహించడం చంద్రబాబుకి రాజకీయంగా చెఱుపు చేస్తుందని నా భావన. ఎందుకంటే కోవిడ్ కారణంగా ప్రజలందరికీ కార్పోరేట్ ఆసుపత్రులంటే ఏవగింపు కలిగింది. చికిత్స ఏమీ పెద్దగా లేకపోయినా రెండు వారాల పాటు రోజుకి 50, 60 వేలు లాగేస్తున్నారన్న కోపం వుంది. రోగం లేకపోయినా, డయాగ్నస్టిక్ సెంటర్ వాళ్లకు కేసుకి లక్ష రూపాయల కమీషనిచ్చి, పాజిటివ్ అని రాయిస్తున్నారనే మాటా ప్రబలంగా వినబడుతోంది. ఈ రమేశ్ ఆసుపత్రి కూడా వాటిల్లో ఒకటి అనే అనుమానం వుందేమో!

పైగా స్వర్ణ హోటల్లో చనిపోయిన పదిమందిలో యిద్దరికే పాజిటివ్ వుందని (తక్కినవారికి మొదట్లో పాజిటివ్ వుండి, తగ్గిపోయి వుండవచ్చుగా), బతికున్నవారిలో కూడా చాలామందికి కూడా పాజిటివ్ కాకపోయినా పాజిటివ్ అని చెప్పి చేర్చేసుకున్నట్లు విచారణ కమిటీ చెప్పింది. (ఇప్పుడు కోర్టు ఆధ్వర్యంలో యింకో కమిటీ వేసి నిజానిజాలు నిర్ధారించవచ్చు లెండి). ఇలాటప్పుడు ప్రజల సానుభూతి లేని ఆసుపత్రి యాజమాన్యపు చర్యల పట్ల మొహమాటం కొద్దీ మౌనంగా ఉండడం, తద్వారా సమర్థించినట్లు కనబడడం బాబుకు యిబ్బంది కలిగిస్తున్న సమయంలో, ఆయన హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆంధ్ర హైకోర్టు మరో వినూత్నమైన తీర్పు యిచ్చి యిబ్బందిని పెంచింది.

ఒక మాజీ అధికారిపై ఆంధ్రప్రభుత్వం వారి అవినీతి నిరోధక సంస్థ పెట్టిన కేసు విషయంలో హైకోర్టు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దానిలో విశేషమేమీ లేదు కానీ ఆ కేసు పూర్వాపరాలు మీడియాలో ఎక్కడా రాకూడదని ఆంక్ష విధించింది. ఎఫ్‌ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు అని అర్థం. ఆ యిన్‌ఫర్మేషనే జనంలోకి వెళ్లకూడదంది హైకోర్టు. ఎందుకంటే దానిలో పెద్ద తలకాయల పేర్లు వున్నాయంటున్నారు. ఇది నాకు నమ్మబుద్ధి కావటం లేదు. 

ఎందుకంటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా వున్న వ్యక్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చి, కేసు పడితే అది కూడా మీడియాలో వచ్చేసింది. నిన్నటికి నిన్న ప్రశాంత్ భూషణ్‌ సుప్రీం కోర్టు ప్రస్తుత, మాజీ జస్టిస్‌లపై వ్యాఖ్యలు చేయడం, దాంతో కోర్టే కేసు పెట్టి, జరిమానా విధించడం, అంతా మీడియాలో వచ్చేసింది. మరి వాళ్ల కంటె పేద్ధ తలకాయా యీ కేసులో వున్న వ్యక్తి లేదా వ్యక్తులు?

మనదేశంలో ఎవరైనా ఎవరి మీదనైనా కేసు పెట్టవచ్చు, ప్రస్తుత ప్రధాని మాజీ ప్రధాని శత్రుదేశంతో చేతులు కలిపి తనను చంపబోయాడని ఆరోపణ చేసేయవచ్చు. కోర్టులో అడిగితే ఆధారాలు యివ్వలేకపోవచ్చు. ఈ లోగా మీడియాలో పబ్లిసిటీ వస్తే, ఎన్నికలలో లబ్ధి పొందగలిగితే అది చాలనుకోవచ్చు.

ఆధారాలూ, గీధారాల జోలికి పోకుండా ఆరోపణలు గుప్పించి లేఖ రాసి సంతకం కూడా పెట్టకుండా పంపినా కోర్టు దాన్ని స్వీకరించి కేసులు పెట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. వేలాది కేసుల్లో పోలీసులు ఆధారాలు సేకరించక, సేకరించడం యిష్టం లేక, సేకరించడం సాధ్యం కాక దశాబ్దాల తరబడి కోర్టుల్లో కేసులు డేకవచ్చు. ఫైనల్‌గా కేసు నిరూపించబడకపోయినా సదరు వ్యక్తి అప్పటివరకు నిందితుడిగా ముద్ర మోయవలసి రావచ్చు, కొన్ని సందర్భాల్లో శ్రీకృష్ణ జన్మస్థానం సందర్శించి, కొన్నాళ్లు నివాసముండి రావచ్చు.

ఈలోగా ‘ట్రయల్ బై మీడియా’ జరిగిపోతుంది. ‘అలాగట, యిలాగట, విచారణ సందర్భంగా సదరు నిందితుడు వెక్కివెక్కి ఏడ్చాడట, ఓ సాక్షి యిదంతా ఫలానావారి వలనే యిరుక్కున్నాను అని నిట్టూర్చాడట’ – అంటూ కథనాలు మీడియావారు వండి వార్చేయవచ్చు. ఇంతలో రాజకీయ సమీకరణాలు మారి, ఆ నిందితుడు కేసుల్లోంచి బయటపడి ‘న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది’ అంటూ రెండు వేళ్ల విక్టరీ సైన్ చూపిస్తూ ఫోటోలు దిగవచ్చు. ఇదంతా ప్రజాస్వామ్యానికి మనం చెల్లిస్తున్న మూల్యం. ఖరీదైన వ్యవహారమే అయినా ప్రజాస్వామ్యం మనకు ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎన్ని లోపాలతోనైనా మనం దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనకు యీపాటి ‘సమ’న్యాయం కూడా దొరకదు.

ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే మీడియాకు స్వేచ్ఛ అవసరం. మీడియా దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు బాధిత వ్యక్తి కానీ, సంస్థ కానీ, ప్రభుత్వం కానీ దాన్ని ఎదుర్కొనేలా వ్యవస్థ వుండాలి. ఎందుకంటే మీడియా ఒక్కోప్పుడు వార్తలు, వ్యాఖ్యలు కలిపేస్తూ వుంటుంది. పుకార్లను వార్తలుగా భ్రమింపచేస్తుంది. తప్పుగానో, అసందర్భంగానో ‘కోట్’ చేసి బాధితుల పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిస్తుంది.

వార్త ఒకలా రాసి శీర్షిక (కాప్షన్) మరో అర్థం వచ్చేట్లా రాస్తుంది. ఆ సందర్భాల్లో బాధిత వ్యక్తి లేదా సంస్థ ‘రిజాయిండర్’ (ఖండన) పంపినప్పుడు మీడియా దాన్ని తగురీతిలో ప్రకటించాలి. ‘‘ద హిందూ’’ వంటి ఖ్యాతి కలిగిన పత్రికలు యీ సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తాయి. ఎందుకంటే తమ రిపోర్టరు పంపిన ప్రతి వార్త, తమ కాలమిస్టు యిచ్చిన ప్రతి సమాచారం అచ్చు వేయడానికి ముందే సరిచూసుకోవడం ఏ పత్రికకూ సాధ్యం కాదు. అందుకే సవరణ వేయడం ధర్మం.

కానీ కొన్ని పత్రికలు తప్పుడు వార్తను ప్రముఖంగా వేసి, ఖండనను లోపలి పేజీల్లో వేసి, సగమే వేసి, లేదా వేయడం మానేసి.. యిలాటి పనులు చేస్తూ వుంటాయి. వీటిని అదుపు చేయాలని, అలాటి పత్రికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో ఒక జీవో విడుదల చేసింది.

ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషల్ కమిషనర్ తప్పుడు వార్తల పత్రికలకు రిజాయిండర్ పంపడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా పరువునష్టం దావా వేయడం వంటి చర్యలు తీసుకోవచ్చని! అన్ని శాఖల వ్యవహారాలూ ఒక్క కమిషనరే చూసుకోలేక పోవడంతో అది సరిగ్గా అమలు కావటం లేదని ఫీలయిందో ఏమో కానీ జగన్ ప్రభుత్వం 2019 అక్టోబరులో 2430 జీవో విడుదల చేసింది. దాని ప్రకారం ఖండన తెలపడం వగైరా పనులు కమిషనర్ నుంచి సంబంధిత శాఖల సెక్రటరీలకు బదిలీ చేయబడ్డాయి.

ఆంధ్ర హైకోర్టు తాజాగా యిచ్చిన తీర్పును సమాచారహక్కుకి విఘాతంగా మేధావులు, జాతీయ మీడియా వర్ణిస్తున్నారు, తీర్పుని తప్పు పడుతున్నారు. ‘ఇలా తప్పు పట్టేవారు ఎపి ప్రభుత్వం 2430 జీవో విడుదల చేసినప్పుడు నోరు మూసుకున్నారేం?’ అని మన తెలుగు మీడియా సంస్థ ఒకటి అడుగుతోంది.

దానికి సమాధానం చెపుతూ ఎపి ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ‘మీడియా ప్రభుత్వంపై బురద చల్లి, వాళ్లు రిజాయిండర్ పంపినా కూడా వేయని సందర్భాల్లో మాత్రమే ఆ జీవోను అమలు చేయడం జరుగుతుంది’ అని సమాధాన మిచ్చారు. సదరు జీవోలో ఆ ముక్క నాకు కనబడలేదు. ‘దురుద్దేశపూర్వకంగా కావాలని ప్రభుత్వం యిమేజిని చెడగొట్టడానికి నిరాధారమైన వార్తలు వేసిన సందర్భంలో ఆ యా శాఖల సెక్రటరీలు రిజాయిండర్ యివ్వవచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులు పెట్టవచ్చు’ అని వుంది.

అయినా రిజాయిండర్ అనేది అచ్చులో వచ్చే పత్రికల విషయంలోనే కనబడుతోంది. మహా అయితే న్యూస్ వెబ్‌సైట్లలో వేస్తారేమో! అత్యధికమైన జనాలు చూసే టీవీల విషయంలో రిజాయిండర్లు, క్లారిఫికేషన్లు, సవరణలు, క్షమాపణలు ఎక్కడుంటాయి? ఇదిగో పులి అని ఎవరో అనగానే అదిగో తోక అంటూ టీవీ స్క్రోలింగులు వచ్చేస్తాయి. ఇంతలో ఎవరో ఆ వూరి నుంచి ఫోన్ చేసి ‘పులి కాదండీ, పిల్లి’ అని చెపితే, సరేలెండి అని ఆ స్క్రోలింగ్ మానేసి, మరో పాము స్క్రోలింగ్ వేస్తారు.

అది తాడు అని తేలేలోపుగా లక్షలాది మంది చూసేస్తారు. ఇన్నాళ్ల నుంచి టీవీ ఛానెళ్లు చూస్తున్నాను. ‘మేం ప్రసారం చేసిన వార్త పొరపాటు. చింతిస్తున్నాం’ అని ఒక్కసారీ వినలేదు. ఆలిండియా రేడియోలో వార్తలు చదివేటప్పుడు మాట తడబడితే ‘మన్నించాలి’ అనేవారు. టీవీలో సాధారణంగా అదీ అనరు.  ఇలాటి పరిస్థితుల్లో టీవీ ఛానెళ్ల విషయంలో ‘రిజాయిండర్ ప్రకటించని పక్షంలోనే కేసులు పెడతాం’ అని అమర్ ఎలా అనగలరో నాకు తెలియటం లేదు.

ఏ ప్రభుత్వమైనా కానీయండి, మీడియాను నయానో, భయానో అదుపు చేయాలని చూస్తాయి. పత్రికాధిపతులకు ఆఫీసు పెట్టుకోవడానికి చౌకగా స్థలాలిస్తాయి, వాళ్లు బిల్డింగు రూల్సు అతిక్రమించినా చూసీచూడనట్లు ఊరుకుంటాయి. జర్నలిస్టులకు ఉచితంగానో, చౌకగానో నివేశ్న స్థలాలు యిస్తాయి. సర్క్యులేషన్ లేకపోయినా ప్రభుత్వ ప్రకటనలు యిస్తాయి. 

ఇక భయాన అంటారా, ముందుగా యాడ్స్ ఆపేస్తాయి, వేధిస్తాయి, కేసులు పెడతాయి, పబ్లిక్ మీటింగుల్లో మంత్రులు ఆ పత్రికలను ఉద్దేశించి హెచ్చరిస్తారు, వారి జర్నలిస్టులను సమావేశాలకు రానీయరు. బయట కనబడి ప్రశ్నలడిగితేకోప్పడతారు. అయితే యిలాటి పరిస్థితుల్లో మీడియాను కోర్టులు కాపాడుతూంటాయి. అలాటిది ప్రస్తుత సందర్భంలో కోర్టే మీడియాపై ఆంక్షలు పెట్టిందంటే అర్థం కావటం లేదు. 

సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు తమ వ్యవస్థపై అపనమ్మకం కలిగినప్పుడు దాని వ్యవహారాలు బయటపెట్టడానికి మీడియానే ఆశ్రయించారు. మీడియా అవసరం సుప్రీం కోర్టు న్యాయమూర్తులకే వున్నపుడు ఆ వ్యవస్థను కాపాడవలసిన కోర్టే యిలా చేయడమేమిటి అని ఆలోచిస్తే ఓ హిందీ పాట గుర్తుకు వస్తోంది. 

నావ సుడిగుండంలో చిక్కుకున్నపుడు నావికుడే దాన్ని రక్షిస్తాడు. అలాటిది నావికుడే నావను ముంచేస్తే ఇక నావను రక్షించేదెవరు? అంటుందా పాట. మనకు రక్షించడానికి సుప్రీం కోర్టు వుంది. రమేశ్ ఆసుపత్రి కోవిడ్ వ్యవహారంలో లాగానే దీనిలో కూడా సుప్రీం కోర్టే కలగచేసుకుని, పరిస్థితిని సరిదిద్దుతుందని ఆశిద్దాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)

 


×