cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: సింధియాకు కొత్త చిక్కు

ఎమ్బీయస్:  సింధియాకు కొత్త చిక్కు

మధ్యప్రదేశ్‌లో 2019 పార్లమెంటు ఎన్నికలు జరిగే వేళ యథావిధిగా ఇన్‌కమ్ టాక్స్ శాఖ చాలా చురుగ్గా వ్యవహరించింది. కాంగ్రెసు నాయకుడు, ముఖ్యమంత్రి అయిన కమలనాథ్‌కు సన్నిహితంగా వున్నవారి పైన, అతని బంధువుల పైన 52 చోట్ల ఆదాయపు పన్ను దాడులు జరిపించింది. రూ. 14.60 కోట్ల క్యాష్‌తో బాటు మొత్తం రూ. 280 కోట్ల లావాదేవీలు జరిగాయని నిరూపించే డైరీలు, కంప్యూటర్ ఫైల్స్ దొరికాయంది.  

దానిలో రూ. 20 కోట్ల రూ.లను ముగ్గురు ఐపిఎస్ అధికారులు న్యూ దిల్లీలో వున్న ఒక పార్టీ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారని కూడా అంది. తమకు దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం యీ బ్లాక్ మనీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు, మరో 50 మంది కాంగ్రెసు నాయకులకు హస్తం వుందని అంది.

2019 ఏప్రిల్‌ నాటి ఆ స్కాండల్ పార్లమెంటు ఎన్నికలలో కేంద్రంలోని అధికార పార్టీకి ఉపయోగపడింది. మొత్తం 29 సీట్లలో బిజెపికి 28 వచ్చాయి. అంతా దాని గురించి మర్చిపోయారని అనుకుంటూండగా, 18 నెలలకు ఆ శాఖ (సిడిబిటి - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్) రథం కదిలింది. దిగ్విజయ్ సింగ్‌కు యింకా నోటీసులు కూడా రాలేదట కానీ ఓ నివేదిక యిచ్చింది. 

డిసెంబరులో ఇసిఐ (జాతీయ ఎన్నికల కమీషనర్) ఆఫీసు నుంచి మధ్య ప్రదేశ్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసుకి ఉత్తరం వచ్చింది. ‘సిడిబిటి యిచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఇఓడబ్ల్యు) చేత ఆ కేసులో నిందితులుగా పేర్కొన్న ఆ ముగ్గురు ఐపిఎస్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టండి.’ అని. ఆ ప్రకారమే చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసు, ఇఓడబ్ల్యుకు లేఖ రాసింది. 

మూడు వారాల తర్వాత ఇఓడబ్ల్యు జనవరి మొదటి వారంలో ప్రత్యుత్తరం రాస్తూ ప్రిలిమినరీ ఎంక్వయిరీకి ఆదేశించాం. మీకు అప్‌టుడేట్ చేయడానికి రెండు వారాలు పడుతుంది అంది.

మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం హుషారుగా కేసులు పెట్టి, కాంగ్రెసు వాళ్లను మరింత అప్రతిష్ఠపాలు చేసి ఆనందించి వుండాలి. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఆ నిందితుల్లో కొందరు సింధియా అనుయాయులైన కాంగ్రెసు ఎమ్మెల్యేలు. వారు యిటీవలే బిజెపిలో చేరి, ఉపయెన్నికలలో నెగ్గారు. ఇద్దరు మంత్రులయ్యారు, తక్కిన 8 మంది ఎమ్మెల్యేలుగా వుండి మంత్రి పదవులకై ఎదురు చూస్తున్నారు. 

తేనెతుట్టె కదిపితే తేనెటీగలు ఎక్కడికి వెళ్లి కుడతాయో తెలియదు. కాంగ్రెసు నుంచి ఫిరాయింపుదారులను తీసుకోవడం వరకూ ముచ్చటగానే వుంటుంది. కానీ వాళ్లు తమతో పాటు అవినీతి కేసుల లగేజీని కూడా తీసుకుని వస్తున్నారు. దాన్ని ఎక్కడ దాచాలో తెలియటం లేదు.

నిజానికి సిడిబిటి రిపోర్టు అక్టోబరు 28నే విడుదలైంది. కానీ నవంబరులో ఉపయెన్నికలున్నాయి కాబట్టి, నిందితుల్లో కొందరు బిజెపి తరఫు అభ్యర్థులు కాబట్టి దాన్ని తొక్కిపెట్టారని అనుకోవచ్చు. మరి యిప్పుడు మాత్రం ఎందుకు లీక్ చేశారు? అంటే దానికి కారణం సింధియాను యిరకాటంలో పెట్టడానికి అంటున్నారు పరిశీలకులు. 

కళంకం పడినవారిని మంత్రులుగా చేయమని సింధియా పట్టుబట్టలేడు కదా! బిజెపిలో ముందు నుంచీ వున్నవాళ్లు తమను పక్కన బెట్టి సింధియాతో పాటు వచ్చినవాళ్లకు పెద్దపీట వేయడం చూసి మండిపడుతున్నారు. వాళ్లని చల్లార్చాలంటే సింధియా గ్రూపుకు మరీ ఎక్కువ పదవులు యివ్వకూడదు. దానికి గాను దీన్ని సాధనంగా వాడుకున్నారని అంటున్నారు. 

అక్టోబరులో ఉత్తరం వచ్చినా యిప్పటిదాకా చర్య తీసుకోలేదేం? అని శివరాజ్ చౌహాన్‌ను అడిగితే ‘‘ఆ కమ్యూనికేషన్ వ్యవహారమేమిటో చూడమని మా స్టాఫ్‌కు చెప్పాను. నాకు సమాచారం రాగానే మీతో పంచుకుంటాను.’’ అని చెప్పి తప్పించుకున్నాడు.

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×