cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: 'సోకాల్డ్‌' హేతువాదులు

ఎమ్బీయస్‌: 'సోకాల్డ్‌' హేతువాదులు

కరుణానిధి మరణంపై నేను రాసిన వ్యాసం చాలామందిని మెప్పించినా కొందర్ని నొప్పించింది. నాకూ కరుణానిధికి జన్మజన్మల పగ లేదా లక్షలకోట్ల రూ.ల ఆస్తి తగాదా ఉందాని ఒకాయన ఆశ్చర్యపడ్డాడు. 'జన్మజన్మల' అన్నది కరుణానిధి చదివి వుంటే చాలా బాధపడేవాడు. కరుణానిధి వంటి 'నాస్తికుడి' గురించి ప్రస్తావించినపుడు ఆత్మశాంతి, దేవుడు మేలు చేస్తే.., జన్మాంతర సంబంధం వంటి పదబంధాలు వాడకపోవడం ఉచితం. సరే, చాలామందికి అనుమానం ఏమిటంటే - కరుణానిధి రాముడి గురించి పలుమార్లు చేసిన కువ్యాఖ్యల వలన నాకు కోపం వచ్చిందని!

ఈ సందర్భంగా యీ సోకాల్డ్‌ హేతువాదుల గురించి నా ఫిర్యాదు ఏమిటో చెప్తాను. దీనిలోనే కత్తి మహేశ్‌, బాబు గోగినేని వంటి వారెందరో కవర్‌ అయిపోతారు. వారిని ఎదిరిస్తున్నామనుకుంటూ అవకతవకలు మాట్లాడేవారిని కూడా వారి గురించి మరో వ్యాసంలో కవర్‌ చేసేస్తాను.

కరుణానిధియే కాదు, తక్కిన ద్రవిడ నాయకులు కూడా ప్రవచించే 'నాస్తికత్వం'లోని డొల్లతనం గురించి ఆ వ్యాసంలోనే రాసేశాను. మైనారిటీల జోలికి వెళ్లరని, గ్రామదేవతల జోలికి వెళ్లరని.. యిలా. అది పూర్తిగా రాజకీయపరమైన ఉద్యమం. కత్తి మహేశ్‌ లేదా బాబు గోగినేని వంటి వారికి రాజకీయ ఎజెండా ఉన్నాగిన్నా దానికి హేతువాదం లేదా నాస్తికత్వం సాయపడదు. ఇది వాళ్ల ఐడియాలజీ అంతే. అందువలన ఎకడమిక్‌గానే చర్చించవచ్చు. ముందుగా హేతువాదం నాస్తికత్వం రెండూ సమానార్థకాలా? కాదే! నాస్తికత్వం అంటే దేవుడు లేడనడం. హేతువాదం అంటే కారణమేమిటో అన్వేషించడం. ఆస్తికులు కారణం గురించి అడగకుండా గుడ్డిగా దేవుణ్ని నమ్ముతారని, తాము కారణాలు అడిగి సత్యమేదో తెలుసుకుంటామని హేతువాదుల అభిప్రాయం. ఆ అన్వేషణలో దేవుడు ఉన్నాడని కూడా తేలితే తేలవచ్చు. కానీ అదేమిటో హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని పర్యాయపదాలుగా వాడతారు.

దేవుడు ఎవరి కంటికి కనబడడు. 'ఉండే ఉంటాడు, లేకపోతే సమస్త సృష్టి ఎలా జరుగుతోంది? ఎలా నడుస్తోంది? ఒక్కో జీవి శరీరనిర్మాణం యింత చక్కగా ఎలా అమిరింది?' అంటారు ఆస్తికులు. దేవుడి ప్రమేయం లేకుండానే యివన్నీ 'మేటర్‌'లో కాలక్రమేణా జరిగే మార్పుల కారణంగా జరుగుతాయంటారు భౌతికవాదులు. (వీరూ హేతువాదులే). అలాక్కాదు దేవుడి కారణంగానే జరుగుతున్నాయని ఆస్తికులు, సహజంగా, ప్రకృతిసిద్ధంగా జరుగుతున్నాయని వీరూ తరతరాలుగా, యుగయుగాలుగా చర్చిస్తూనే ఉన్నారు. ఏకాభిప్రాయానికి రాలేదు. దేవుడున్నాడు అనడంతో ఆగరు ఆస్తికులు. అతన్ని పూజించాలి అంటారు, దానికి పూజావిధానం యిది అని నిబంధనలు విధిస్తారు. అవి చేయనివారిని నిరసిస్తారు. ఏ మాట కా మాట చెప్పాలంటే పాపం దేవుడు తనను కొలిచేవారిని, కొలవనివారిని అందర్నీ సమానంగానే చూస్తాడు. నాస్తికుడి యింట్లో ఎండ ఎక్కువ కాయదు, వర్షం తక్కువ పడదు. ఏ తేడా చూపనప్పుడు పూజ చేయవలసిన అవసరం ఏముంది అని నాస్తికులడుగుతారు. అందుకే పరలోకం అనే కాన్సెప్టు తెచ్చారు ఆస్తికులు. ఈ లోకంలో చేసినవాటికి, చేయనివాటికి పరలోకంలో అనుభవించాల్సి వుంటుంది జాగ్రత్త అన్నారు.

హిందువులైతే పరజన్మ కూడా తెచ్చారు. లోకంలో కొందరికి ఉత్తిపుణ్యాన మేలు జరగడం, మరి కొందరికి అకారణంగా కీడు జరగడం చూస్తూంటాం. దానికి ప్రత్యక్షకారణం ఏమీ కనబడకపోవడం చేత పూర్వజన్మలో చేసిన పనుల ఫలమని, అది మన 'కర్మ' అని హిందూమతం ప్రతిపాదించింది. అది మన భారతీయులకు నరనరాలా పట్టేసి అంతులేని సహనశక్తిని కలగజేసింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా కర్మ కాన్సెప్టు బాగా ఎక్కింది. ఎందుకంటే మంచివాడికి మంచి జరగకపోవడం, చెడువాడికి హాని జరగకపోవడం అక్కడా చూస్తున్నారు వాళ్లు. దేవుడుంటే అలా జరగనిస్తాడా అనే సందేహమూ కలుగుతోంది. అందువలన కర్మ అనేది ఒకటుంది అనే సిద్ధాంతం వాళ్లకు నచ్చుతోంది. మనిషి విశ్వాసాలు ఎప్పుడూ ఒకలా వుండవు. జ్ఞానం సంపాదిస్తున్న కొద్దీ సందేహాలు ఎక్కువ వస్తాయి, వచ్చిన కొద్దీ చిన్నప్పటి నమ్మకాలు సడలుతాయి. అనుభవాలు ఎన్నో విషయాలు నేర్పుతాయి. వయసు గడుస్తున్న కొద్దీ ప్రశ్నలే ప్రశ్నలు. వీటిల్లో సమాధానాలు వెతుక్కోవడానికి మనిషి నిరంతరం ప్రయత్నిస్తాడు. చాలామంది దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయం లోతులకి వెళ్లకుండా మొదటి నుంచి యింట్లో వస్తున్న ఆచారాలను మొక్కుబడిగా ఆచరిస్తూ, కాలం గడిపేస్తారు. చుట్టూ ఉన్న సమాజంతో మంచిగా ఉంటే చాలు, అదే పదివేలు అనుకుంటారు.

దేవుడు మనిషిని సృష్టించాడో లేడో కానీ తన అవసరాల కోసం మనిషే దేవుణ్ని సృష్టించాడని కొందరు ప్రతిపాదిస్తారు. సమాజంలో నీతినియమాలు, నిబంధనలు పదిలంగా ఉంచడానికి దేవుడి పేరు చెప్పి, పరలోకం పేరు చెప్పి పౌరులను నియంత్రించడానికి చూశారని వాదన. అది నిజమే కావచ్చు, ఎందుకంటే దేశం ఏదైనా, మతం ఏదైనా కానీ పాలకుడు ఎప్పుడూ దేవుడున్నాడని, తాను దైవానికి ప్రతినిథిననీ చెప్పుకుంటూ వచ్చాడు. పురోహిత వర్గంలో కొందరిని చేరదీసి, ఆదరించి, వారి చేత కూడా ఆ విషయాన్ని ప్రజలకు చెప్పించాడు. పాలక-పురోహిత వర్గం తక్కిన వర్గాలను అదుపు చేయడానికి దేవుణ్ని విస్తారంగా వాడుకున్నారు. పాపపుణ్యాలను వర్గీకరించి, ఈ మార్గం ద్వారా వారిని ఆ బాటలో నడిపించారు. ఏది పాపం, ఏది పుణ్యం అనేది నిజానికి సమాజమే నిర్ణయిస్తుంది. పాపానికి యీ శిక్ష, పుణ్యానికి యీ మేలు అని పురోహితవర్గం చేత పాలకులు చెప్పించారు.

దేవుడు, పరలోకం భయం లేకపోతే సమాజంలో పాపాత్ములు ఎక్కువై పోతారని చాలామంది నమ్ముతారు. అందువలన దేవుడు ఉన్నాడా లేదా అనే చర్చ పండితులు, ఉన్నతవర్గాల మధ్య జరగాలి తప్ప చదువురాని వాళ్లు, సమాజంలో అట్టడుగు వర్గాల మధ్య జరగకూడదని వాళ్లు వాదిస్తారు. ఎందుకంటే దేవుడు లేడనే నిర్ధారణకు వాళ్లు వస్తే ఎంతకైనా తెగిస్తారని వాళ్ల భయం. అందుకే కార్ల్‌ మార్క్‌స్‌ 'మతం జనసమూహం పాలిట నల్లమందు లాటిది' అన్నాడు.

మన రాజులు 'తాము విష్ణువు అంశతో పుట్టామని, తమను ఎదిరిస్తే దైవద్రోహం చేసినట్లేననీ, నరకానికి పోతారనీ' వాళ్లను భయపెట్టి తిరుగుబాటు జరగకుండా చూసుకున్నారు. పాపభీతి పేరుతో సామాన్యులను అదుపు చేసిన పాలకులను కానీ ఉన్నతవర్గాల వారిని కానీ పాపాలు చేయకుండా దైవభావన ఆపలేకపోయింది. వారు రాజ్యం కోసం, ధనం కోసం, అధికారం కోసం, ఆనందం కోసం, అహంకారం కోసం యజమానులను, సోదరులను చంపారు, యితరుల సొత్తును అపహరించారు, యితరుల భార్యలను వాంఛించారు. ఆధునిక సమాజంలో కూడా ఎందరో సంఘవిద్రోహులు దినదినాభివృద్ధి చెందడం చూసిన సామాన్యుడు 'ఇవన్నీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడు?' అనే సందేహంలో పడుతున్నాడు.

ఇలాటి సందర్భంలో ప్రశ్నలు ఉదయిస్తాయి. గుడ్డిగా దేన్నయినా నమ్మడానికి యిష్టపడక కారణాలు తెలుసుకోగోరతాడు. ఆ ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో గమ్యం చేరతారు. గతంలో సమాజం, పెద్దలు ఏర్పరచిన యినుపచట్రం నుంచి బయటపడి ఆలోచించే స్వేచ్ఛ నేటి యువతరానికి ఉంది. వారిలో ప్రశ్నలు రేకెత్తించ గలిగే, ఆలోచన రగిల్చే ప్రజ్ఞ హేతువాదానికి ఉంది. అందువలన హేతువాదులు యువతను, ఆలోచనాపరులను విపరీతంగా ఆకర్షిస్తారు. అయితే యిక్కడ తెలుసుకోదగినది ఏమిటంటే - తాము లేవనెత్తే ప్రశ్నలకు హేతువాదుల వద్దా సమాధానాలు లేవు, ఒకవేళ ఉన్నా జ్ఞానపిపాసికి అవి రుచించకపోవచ్చు. అసమగ్రంగా ఉన్నాయని తోచవచ్చు. అందువలన సత్యాన్వేషణ అనేది నిరంతరం సాగాలి. మధ్యలో విసుగుపుట్టి మానేసినా మానేయవచ్చు. కానీ హేతువాదులు ప్రజల్ని ఆలోచించేందుకు పురికొల్పాలి. ఈ క్రమంలో వారు ఆలోచనల్లో స్పష్టత చూపాలి, సంయమనం పాటించాలి. పాటించటం లేదనే నా ఫిర్యాదు.

త్రిపురనేని రామస్వామి చౌదరిని హేతువాది, నాస్తికుడు అని కొనియాడుతారు. ఆయన తన కార్యస్థలానికి సూతాశ్రమం అని పేరు పెట్టాడు. 'సూతపురాణం', 'శంబూకవధ' పుస్తకాలు రాశాడు. కమ్మపురోహితులను తయారు చేశాడు. ఇదంతా గందరగోళంగా లేదూ? నాస్తికుడు ఉత్తర రామాయణం జోలికి పోవడం దేనికి? దేవుణ్ని పూజించవద్దంటూ బ్రాహ్మణ పురోహితులకు ప్రతిగా కమ్మ పురోహితులను నిలబెట్టడం దేనికి? ఆయన కుమారుడు గోపీచంద్‌కు యిలాటి గందరగోళం లేదు. ఆయన 'మన తత్త్వవేత్తలు' అనే అద్భుతమైన పుస్తకం రాశాడు.

నిజానికి హేతువాదం, భౌతికవాదం, నిరీశ్వరవాదం యివేవీ భారతీయ సంస్కృతికి తెలియనివి కావు. వేదాలతో పాటే యివీ వర్ధిల్లాయి. కొందరు వీటిని ఆదరించారు, అనుసరించారు కూడా. అందుకే దర్శనాల్లో కొన్ని నిరీశ్వర దర్శనాలున్నాయి. ఫిలాసఫీ అంటే తెలుగులో వేదాంతం అని అనువదించేస్తాం కానీ దాని అసలైన అర్థం జ్ఞానం పట్ల ప్రేమ అని. మన వాళ్లు ఫిలాసఫీని తత్త్వాలనే అన్నారు తప్ప వేదాంతం అనలేదు - వేదాన్ని ఆమోదించని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి! ''కర్మణ్యేవాధికారస్తే..'' వంటి గొప్ప భగవద్గీత శ్లోకం సాంఖ్యదర్శనం నుంచి తీసుకున్నదే. సాంఖ్యాన్ని ప్రతిపాదించిన కపిలుడు 'ఈశ్వరుడు ఉన్నాడని ప్రమాణం సిద్ధించటం లేదు' అని స్పష్టంగా ప్రకటించాడు. తర్వాతి రోజుల్లో దాన్నే కృష్ణుడి ముఖత: చెప్పించారు. ఇంకా కొన్నాళ్లకు కపిలుణ్ని విష్ణువు 24 అవతారాల్లో ఒకదానిగా చేసేశారు. తమకు నచ్చని సిద్ధాంతాన్ని, సమాచారాన్ని అణగదొక్కడానికి యీ ఆధునిక యుగంలో కూడా ఎలాటి ప్రయత్నాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ప్రజలు మెచ్చిన సిద్ధాంతానికి తమ రంగు పూసేసి, వాటిని రూపుమాపడమూ చూస్తున్నాం. రాజరికపు రోజుల్లో అలా జరగడంలో వింతేముంది?

కణాదుడు విశ్వమంతా అణువులతో నిర్మితమైంది తప్ప దీనిలో దేవుడి ప్రమేయం లేదన్నాడు. చార్వాకుడు చాలా సైంటిఫిక్‌గా మాట్లాడాడు. అతని వాదాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ యిన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అతని పేరు, సిద్ధాంతం సజీవంగానే ఉన్నాయి కదా. అలాగే బుద్ధుడు - ఆత్మ లేదు, పునర్జన్మ లేదు పొమ్మన్నాడు. వేల సంవత్సరాల క్రితమే మనవాళ్లు అంతటి హేతుబద్ధమైన ప్రశ్నలు వేయగా లేనిది, యిన్ని తరాలుగా సంతరించుకున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా యీ కాలపు హేతువాదులు యింకా ఎన్నో ప్రశ్నలు వేసి, కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించవచ్చు. కానీ వీళ్లు ఎంతసేపూ రాముడు, కృష్ణుడిపై పడతారు. వేదాలు, ఉపనిషత్తుల గురించి కూడా చర్చించరు.

పరికించి చూస్తే ప్రతీ దేశానికి, ప్రతి సమాజానికి తమవైన పురాణాలున్నాయి. వాటిల్లో తర్కానికి అందని ఘట్టాలుంటాయి. మానవుల్లో వుండే సమస్త వికారాలు ప్రదర్శించిన దేవుళ్ల కథలుంటాయి. వాటిని గుర్తు చేస్తూ బొమ్మలుంటాయి, విగ్రహాలుంటాయి, స్మారక చిహ్నాలుంటాయి. వాటిని మ్యూజియంలో పెట్టి భద్రపరుస్తారు. తర్వాతి తరానికి ఆ పురాణపురుషుల కథలను అందిస్తూంటారు. అవన్నీ నిజంగా జరిగాయని నమ్మినట్లుగా ఎక్కడా ప్రస్తావించరు. జరగలేదని వాదనకు దిగరు. అవి తమ సంస్కృతిలో భాగం అనుకుని ఊరుకుంటారు. చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు పాతకాలపు గాథలకు ఆధారాలున్నాయా అనే విషయం, ఒక దేశపు పురాణానికి, మరో దేశపు పురాణానికి గల పోలికలున్నాయా అన్న సంగతి శోధిస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు.

మనదేశంలో మాత్రం పురాణపురుషులపై గత శతాబ్దకాలంలో చర్చ ఎక్కువైంది. అర్ధశతాబ్దిగా మరీ ఎక్కువైంది. ఇటీవల ఒకటి, రెండు దశాబ్దాలలో యిది వేలంవెర్రిగా కూడా మారింది. తమాషా ఏమిటంటే వీటి గురించి విపరీతంగా చర్చించేవాళ్లు నాస్తికులు, హేతువాదులు అని చెప్పుకునేవాళ్లే. ఒక పక్క భక్తులు పాతకాలం దేవుళ్లతో బాటు కొత్తగా పరిచయమవుతున్న దేవుళ్లకు కూడా మొక్కేస్తున్నారు, గుళ్లు కట్టేస్తున్నారు. వాళ్లకు పురాణాల గురించి రేఖామాత్రంగానే తెలుసు. మరీ లోతుకి వెళ్లి చర్చలు జరపరు. భక్తితో దణ్ణం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, తమ పిల్లలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటారు.

అయితే 'వాటిని నమ్మం, యివన్నీ ట్రాష్‌' అనేవాళ్లు పురాణాలను కూలంకషంగా అధ్యయనం చేస్తారు. భక్తితో కాదు, రంధ్రాన్వేషణ కోసం! ఒక పక్క అవి యితిహాసాలు కావు, చరిత్ర కాదు, కట్టుకథలు అంటూన్నపుడు, మరి వాటి ఆధారంగా రాముణ్నో, కృష్ణుణ్నో ఫలానా పని ఎలా చేశాడు అని విమర్శించడంలో తర్కమేమిటో అర్థం కాదు. రాముడు నిజంగా ఉన్నాడు, చారిత్రక పురుషుడు అని నమ్మితేనే అతని చర్యల గురించి వ్యాఖ్యానించాలి. లేకపోతే ఫలానా సినిమాలో హీరో విలన్‌ను ఎందుకు చంపాడు, పోలీసులకు అప్పగించవచ్చు కదా? అని వాదించినట్లుంటుంది. కాల్పనిక పాత్ర ఎలా అయినా ప్రవర్తించవచ్చు. ఒకవేళ చారిత్రక పురుషుడే అనుకున్నా అతని చర్యల గురించి మీ దగ్గరున్న సమాచారం నిర్దుష్టమైనదనే హామీ ఎక్కడిది?

మొదట్లో యీ యితిహాసాలన్నీ మౌఖికమైనవి (ఓరల్‌), తర్వాతి రోజుల్లో గ్రంథస్తం చేశారు, తాటియాకుల మీద రాసినప్పుడు, వాటి నకళ్లు తయారుచేసినప్పుడు స్ఖాలిత్యాలు జరిగాయి, ప్రక్షిప్తాలు (ఇంటర్‌పొలేషన్స్‌) జరిగాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వెర్షన్లు లభ్యమౌతున్నాయి. వీటిల్లో ఏది కరక్టు వెర్షన్‌ అని తేల్చి చెప్పడానికి అథారిటీ ఎవరున్నారు? రాముడో, కృష్ణుడో దిగి వచ్చి చెప్పాలి. ఒకవేళ మీ చేతికి వచ్చినది కరక్టు వెర్షనే అనుకుందాం. దాని ప్రకారం యిది మంచి, యిది చెడు, యిది సవ్యం, యిది అపసవ్యం అని తీర్పులు చెప్పగలవా? కాలానికి అనుగుణంగా సమాజంలో మార్పులు వస్తాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోనక్కర లేదా? కొన్ని దశాబ్దాల క్రితం బాల్య వివాహాలు ఒప్పు, యీనాటి చట్టం ప్రకారం తప్పు. కొన్ని దశాబ్దాల క్రితం హిందువుల్లో బహుభార్యాత్వం, బహుభర్తృత్వం ఒప్పు, యీనాటి చట్టం ప్రకారం తప్పు. ఈనాడు విడాకులు తీసుకునే సౌలభ్యం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అది లేదు. మన కళ్లెదురుగా జరిగిన మార్పులే యిలా వుంటే, ఎప్పుడో శతాబ్దాల క్రితం, సహస్రాబ్దుల క్రితం జరిగిన విషయాలను యీనాటి కళ్లతో చూసి తీర్పులు చెప్పడం సమంజసమా?

అందరూ ఔనన్నదాన్ని కాదనడం, ఎస్టాబ్లిష్‌మెంట్‌కు విరుద్ధంగా ఆలోచించడం యువత లక్షణం. రాముడు గొప్పవాడు, రావణుడు చెడ్డవాడు అని తలిదండ్రులు చెపితే, దానికి వ్యతిరేకంగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తారు. ఈ ధోరణి కనిపెట్టి, యిటీవలి కాలంలో విలన్లందరినీ హీరోలుగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, వీళ్లంతా అణగారిన వర్గాల వారని, గొప్ప పాలకులని, సహృదయులని, అగ్రవర్ణాల దేవతలు వారిని అణచివేయడమే కాక వారిని చెడ్డవారిగా చిత్రీకరిస్తూ పుస్తకాలు రాయించారనే వాదన ప్రారంభమైంది. ఈ తరహా వాదనకు ఆధారమేమిటో ఒక్కరూ చూపించటం లేదు. పాత పురాణంలోనే తమ భావాలు చొప్పించి, ప్రచారం చేస్తున్నారు. నిజానికి దుష్టుడైన దుర్యోధనుణ్ని ప్రధానపాత్రలో పెట్టి భాసుడు అనాడే సంస్కృత నాటకాలు రాశాడు. కానీ పురాణసత్యాలను వక్రీకరించలేదు. ఇప్పుడు ట్రెండ్‌ ఎలా వుందంటే, పోనుపోను బకాసురుడు, కీచకుడు, హిడింబాసురుడు కూడా ఉదాత్త పురుషులు, ఆదర్శ పురుషులు అయిపోయేట్లున్నారు.

ఇదంతా కొన్ని వర్గాలలో ఒక యింటలెక్చువల్‌, ఎకడమిక్‌ ఎక్సర్‌సైజ్‌గానే మిగులుతోంది తప్ప జనసామాన్యం దృష్టిలో వాళ్లు ఏర్పరచుకున్న యిమేజిలు చెరగటం లేదు. రాముడు పురుషోత్తముడు. మాట తప్పడు. మంచి కొడుకు, మంచి భర్త. మంచి రాజు. ఏకపత్నీవ్రతుడు. సీతారాములది అన్యోన్య దాంపత్యం. రావణాసురుడు గొప్పవాడే కానీ వేరే వారి భార్యను ఎత్తుకుపోయి నాశనమయ్యాడు. పరస్త్రీవ్యామోహం మంచిది కాదు. - ఇదీ మాన్‌ యిన్‌ ద స్ట్రీట్‌ను రామాయణం గురించి అడిగితే చెప్పే సారాంశం. అగ్నిప్రవేశం చేయమనడం రైటా రాంగా, లక్ష్మణుడిది బానిస మనస్తత్వమా? అతను ఊర్మిళను నిర్లక్ష్యం చేయడం తగిన పనా? - యివన్నీ వాడికి పట్టవు.

ఇక భారతం. పాండవులు మంచివాళ్లు, ధర్మరాజు వ్యసనం వలన నానా కష్టాలూ పడ్డారు. తమ హక్కుల కోసం పోరాడి గెలిచారు. దుర్యోధనుడు అహంకారి, అసూయ చేత కులనాశకుడయ్యాడు. పాండవుల పట్ల ధర్మం ఉంది కాబట్టి కృష్ణుడు వాళ్లకు సాయపడ్డాడు. కౌరవులు చెడ్డవాళ్లు. ఒక స్త్రీని నిండు సభలో అవమానించి సర్వనాశనమయ్యారు. - ఇంతే అతనికి అర్థమయ్యేది. రాజ్యంలో పాండవులకు హక్కు ఉందా లేదా, భీముడు దుర్యోధనుణ్ని నాభి కింద గదతో కొట్టడం తప్పా రైటా? నిన్ను ఎలా చంపాలి అని భీష్ముణ్నే వెళ్లి అడగడం సరైనదేనా? అనే ధర్మవిచారం వాళ్లకు అనవసరం.

ఇన్ని సహస్రాబ్దాలు గడిచాయి, పిల్లలకు రాముడు, లక్ష్మణుడు, భీముడు, అర్జునుడు, కృష్ణుడు, రాధ, లక్ష్మి, సీత, దుర్గ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ రావణ, దుర్యోధన, కంస, మహిషాసుర, శూర్పణఖ పేర్లు పెట్టుకోవటం లేదు కదా! ఆ పేర్లతో ఎవరైనా తారసిల్లితే దాని అర్థం వాళ్లు పేరు మార్చుకున్నారని! మాట్లాడితే రాముణ్ని వెక్కిరించే కరుణానిధి కూడా తన పిల్లలకు రావణుడు, లంకిణి అని పేర్లు పెట్టలేదని గుర్తించాలి. ఒక విషయం మనం గ్రహించాలి. పురాణపురుషుల్ని నిందించి, కొందరు గుర్తింపు తెచ్చుకుంటున్నారనేది సత్యం.

కత్తి మహేశ్‌ రాముణ్ని దగుల్బాజీ అనడం కానీ, బాబు గోగినేని సీత రాముడి వద్ద కంటే రావణుడి వద్ద సుఖంగా ఉండేది అనడం కానీ యీ కోవకే వస్తాయి. వాళ్లు చార్వాకుడి గురించి, కణాదుడి గురించి మాట్లాడి ఉంటే మనం తల తిప్పి కూడా చూడం. అసలు వాళ్ల గురించి తెలుసుకున్నారో లేదో కూడా మనకు తెలియదు. కరుణానిధి కూడా అదే బాపతు. నాస్తికత్వం గురించి గంభీరమైన, తాత్త్విక చింత ఎన్నడూ చేయగా చూడలేదు. ఎందుకంటే వాటిపై అధ్యయనం చేయాలి, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఒప్పించాలి. అదంతా పెద్ద కసరత్తు. దాని కంటె రాముణ్ని తిట్టిపారేయడం  సులభం ! విదేశీయుల్లో కూడా యిదే ధోరణి! వెండీ డోనిగర్‌్‌ రాసిన 'హిందూయిజం' అనే పుస్తకం ముఖచిత్రం ఏమిట్రా అంటే కృష్ణుడు గోపికల చీరలు అపహరించి చెట్టెక్కి కూర్చోవడం. హిందూయిజం సారాంశం అదా? వాట్‌ నాన్సెన్స్‌! ఇలాటి విమర్శ వచ్చిందనే తర్వాతి ఎడిషన్స్‌లో కవర్‌ మార్చినట్లున్నారు.

ఈ సోకాల్డ్‌ హేతువాదులు దేవుడు లేడని వాదిస్తే సరిపోతుంది. కానీ అలా అంటే రసవత్తరంగా ఉండదని భయమో ఏమో. పురాణాలను చీల్చి చెండాడి, పబ్లిసిటీ పొందుతారు. ఇది యితర దేశాల్లో చూడం. హెర్క్యులిస్‌కు నిజంగా అంత బలం ఉందా లేదా అనీ, అపోలో ఎకిలిస్‌పై ద్వేషంతో ట్రాయ్‌ రాకుమారుడు పారిస్‌ బాణాన్ని ఎకిలీస్‌ మడమకు తగిలేట్లు చేయడం న్యాయమా అని డిస్కషన్‌కు పెట్టరు. దేవాధిదేవుడు జ్యూస్‌ భార్యకు తెలియకుండా అనేకమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని అతని ఆలయాన్ని కూల్చేయాలని డిమాండు చేయరు. ఈజిప్టు రాజు ప్రాపకం కోసం తన భార్యను చెల్లెలిగా పరిచయం చేసి అతనికిచ్చి పెళ్లి చేసిన అబ్రహామ్‌ పేరు పెట్టుకోవడం మానేయరు. కన్నకొడుకుని తనకు బలివ్వమని అబ్రహాంను దేవుడు కోరడంలో ఔచిత్యాన్ని చర్చించరు. ఇదంతా మన దగ్గర పైత్యమే, అది కూడా సొంత పబ్లిసిటీ కోసం! జనాల్లో పట్ల శాస్త్రాల పట్ల అవగాహన పెంచి మూఢనమ్మకాలు పోగొట్టడం కావలసిన పని, మంచి పని. దాని కోసం పురాణపురుషుల నింద అక్కరలేదు.

వీళ్లకు వ్యతిరేక దిశలో ఉండి మొండి వాదనలు చేసే వారి గురించి మరోసారి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com