cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : ఫేలుదాగా గుర్తుండిపోయిన సౌమిత్ర చటర్జీ

ఎమ్బీయస్ : ఫేలుదాగా గుర్తుండిపోయిన సౌమిత్ర చటర్జీ

2020 తీసుకుని పోయిన నటప్రముఖులలో బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ ఒకరు. నవంబరు 15న తన 85వ యేట కరోనాతో పోయారు. ఆయన బెంగాలీలో తప్ప వేరే భాషాచిత్రాలలో వేయకపోవడం వలన దేశంలోని తక్కిన ప్రాంతాలలో అంత పాప్యులర్ కాదు. అయితే సత్యజిత్ రాయ్ తీసిన 14 సినిమాలలో వేయడం చేత రాయ్ అభిమానులకు పరిచితుడే. ఆయన పోయినప్పుడు నివాళి అర్పిస్తూ మమతా బెనర్జీ ‘ఫేలుదా మరి లేరు. అపూ గుడ్‌బై చెప్పాడు’ అంది. ఫేలుదా, అపూ రెండూ బెంగాలీ సాహిత్యంలోని పాత్రలే. సౌమిత్ర నటజీవితంతో పాటు వాటి గురించి కూడా చెప్తాను. ఓపికుంటే చదవండి.

సత్యజిత్ రాయ్‌కు, భారతదేశానికి అంతర్జాతీయ నవ్య సినిమా రంగంలో విశేషంగా పేరు తెచ్చిన సినిమాలు ‘అపూ త్రయం’ (ట్రయాలజీ)గా పిలవబడే ‘‘పథేర్ పాంచాలీ’’- పథగీతం (1955), ‘‘అపరాజిత’’ (1956), ‘‘అపూర్ సంసార్’’ అపూ లోకం (1959) సినిమాలు. ఇవి విభూతి భూషణ్ బంధోపాధ్యాయ్ అనే రచయిత రాసిన ‘‘పథేర్ పాంచాలీ’’, ‘‘అపరాజిత’’ అనే నవలలపై ఆధారపడి తీసినవి. అపూర్వ కుమార్ రాయ్ అనే గ్రామీణ బెంగాల్‌కు చెందిన కుర్రవాడి జీవితం గురించి కథ నడుస్తుంది. అతని బాల్యంలో వాళ్ల కుటుంబం వారణాశికి వెళ్లడం, అక్కడ తండ్రి చనిపోవడంతో మళ్లీ వాళ్ల వూరికి వెళ్లిపోవడం, కుర్రవాడు కాస్త పెద్దయ్యాక కలకత్తా వెళ్లి చదువుకోవడం, అక్కడ రచయితగా మారే ప్రయత్నంలోనే పెళ్లి చేసుకోవడం, ప్రసవంలో భార్య చనిపోవడం.. యిలా నడుస్తుంది కథ.

ఈ మూడో సినిమాలో యవ్వనంలోకి వచ్చిన అపూ పాత్రను సత్యజిత్ రాయ్ సౌమిత్రకు యివ్వడంతో అతను సినీరంగ ప్రవేశం చేశాడు. అతని పక్కన వేసినది 14 ఏళ్ల శర్మిలా టాగూర్. సౌమిత్ర (సుమిత్ర తనయుడు లక్ష్మణుడని అర్థం) తండ్రి లాయరు, నాటకప్రియుడు, నటుడు. గ్రాజువేషన్ అయ్యాక కొడుకుని నటనలోకి వెళ్లమని ప్రోత్సహించాడు. శిశిర్ భాదుడీ అనే బెంగాలీ రంగస్థల దిగ్గజం వద్ద తర్ఫీదు యిప్పించాడు. రాయ్‌కు కావలసిన అండర్ యాక్టింగ్‌తో సౌమిత్ర అతనికి అత్యంత ఫేవరేట్ యాక్టరై పోయాడు. బెంగాల్ చిత్రసీమకు రారాజు, స్టార్ అనదగినవాడు ఉత్తమ్ కుమార్. అతనితో రాయ్ చేసిన సినిమాలు రెండే – ‘‘నాయక్’’ (1966). ‘‘చిడియా ఖానా’’ (1967). కానీ సౌమిత్రతో 14 సినిమాలు చేశాడు. అన్నీ వేర్వేరు రకాలవే.

రాయ్ అనగానే యీసురోమనే దరిద్రపు సినిమాలు తీస్తాడనే అభిప్రాయం కొందరిలో వుంది. కానీ ఆయన కామెడీల నుంచి పిల్లల సినిమాల దాకా, జానపదాల నుంచి నుంచి ఫాంటసీల దాకా అన్ని రకాల సినిమాలూ తీశాడు. అన్నిటిలోనూ సౌమిత్ర ఒదిగిపోయాడు. దానికి కారణం ఉత్తమ్ స్టార్ కాగా, సౌమిత్ర నటుడు. ఇద్దరూ పోటీ పడి నటించిన సినిమాలూ వున్నాయి. ‘‘ప్రిజనర్ ఆఫ్ జెండా’’ నవల ఆధారంగా తీసిన ‘‘ఝిందేర్ బందీ’’ (1961) సినిమాలో ఉత్తమ్ ద్విపాత్రాభినయంలో రాణించగా, విలన్‌గా సౌమిత్ర అదరగొట్టాడు. ఎవరు గొప్ప అని అభిమానుల్లో చర్చోపచర్చలు జరిగాయి కానీ వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘‘దేవదాస్’’ (1979)లో వేశారు. సౌమిత్ర దేవదాసు పాత్ర ధరించగా, ఉత్తమ్ అతనికి మద్యం అలవాటు చేసిన భగవాన్ పాత్ర (తెలుగులో పేకేటి శివరాం వేసినది) వేశాడు. ఉత్తమ్ 1980లో 57 ఏళ్లకే మరణించాడు. సౌమిత్ర 85 ఏళ్లు జీవించి ఆఖరి రోజు వరకు నటిస్తూనే వున్నాడు.

సత్యజిత్ రాయ్ సినిమాలు ‘‘దేవీ’’, ‘‘తీన్ కన్యా’’, ‘‘అభిజాన్’’, ‘‘చారులత’’ (దీని గురించి ఎపుడైనా వేరే వ్యాసం రాస్తాను), ‘‘కాపురుష్ ఓ మహాపురుష్’’, ‘‘అరణ్యేర్ దిన్‌ రాత్రి’’, ‘‘అశని సంకేత్’’, ‘‘సోనార్ కెల్లా’’ (1974), ‘‘జయ్ బాబా ఫేలూనాథ్’’ (1979), హీరక్ రాజేర్ దేశే’’, ‘గణశత్రు’’, ‘‘శాఖా ప్రశాఖా’’ వంటి వాటిల్లో సౌమిత్ర వేశాడు. అలా అని అతను రాయ్‌కు మాత్రమే అంకితమై పోలేదు. బెంగాలీలో యితర ప్రఖ్యాత దర్శకులకు కూడా అతను ఫేవరెట్టే. వారిలో కమ్మర్షియల్ సినిమాలు తీసిన తపన్ సిన్హా, అసిత్ సేన్, అజయ్ కర్. తరుణ్ మజుందార్ వంటి వాళ్లూ ఉన్నారు, ఆఫ్‌బీట్ సినిమాలు తీసిన మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ వంటి వాళ్లూ ఉన్నారు. తెలుగులో వచ్చిన ‘‘వివాహబంధం’’ (హిందీలో ‘‘కోరా కాగజ్’’), ‘‘వాగ్దానం’’ సినిమాల బెంగాలీ ఒరిజినల్స్‌లో యితనే హీరో.

రాయ్ తీసిన ‘‘సోనార్ కెల్లా’’, ‘‘జయ్ బాబా ఫేలూనాథ్’’ సినిమాలలో సౌమిత్ర ఫేలుదా పాత్ర వేశాడు. బెంగాలీ సాహిత్యంలో 1930ల నాటి డిటెక్టివ్‌గా ప్రసిద్ధి కెక్కిన ‘వ్యోమకేశ్ (బ్యోంకేశ్) బక్షీ’’ పాత్రను ఉత్తమ్ కుమార్ చేత ‘‘చిడియాఘర్’’లో వేయించి, విఫలమైన సత్యజిత్ ఫేలుదా పాత్రను సౌమిత్రకు యిచ్చాడు. ‘‘అపూర్ సంసార్‌’’లో పాత్ర ద్వారా బెంగాలీ ప్రేక్షకుల మదిలో అపూగా నిల్చిపోయిన సౌమిత్ర యీ సినిమాల ద్వారా ఫేలుదాగా కూడా నిల్చిపోయాడు. ఫేలుదా అనేది సత్యజిత్ రాయ్ సృష్టించిన డిటెక్టివ్ పాత్ర. 

బెంగాలీలందరూ వయోభేదం లేకుండా యిప్పటికీ విశేషంగా ప్రేమించే పాత్ర. 2017లో ఫేలుదా పేరు మీద కలకత్తాలో ఎగ్జిబిషన్ పెడితే చూడడానికి జనం విరగబడి వచ్చారు. రాయ్ సినిమా దర్శకనిర్మాత మాత్రమే కాదు, రచయిత, సంపాదకుడు, చిత్రకారుడు, పబ్లిసిటీ డిజైనర్ కూడా. ‘‘సందేశ్’’ అనే పిల్లల పత్రికకు సంపాదకత్వం వహించే రోజుల్లో ఏదైనా సైన్స్ ఫిక్షన్ సీరియల్ రాద్దామనుకున్నాడు.

ఆయన భార్య విజయకు క్రైమ్ రచనలు చాలా యిష్టం. రాయ్‌కు కూడా షెర్లాక్ హోమ్స్ అభిమాన పాత్ర. ఆవిడ పిల్లల కోసం డిటెక్టివ్ కథలు సీరియల్‌గా రాయండని సూచించింది. ‘డిటెక్షన్ అంటే హింస, ప్రేమ, కామ వ్యవహారాలు అన్నీ వుంటాయి. పిల్లల కోసం అంటూ అవెలా రాస్తాం?’ అన్నాడు రాయ్. ‘అవి లేకుండా రాసి మెప్పించండి.’ అని ఆమె ఛాలెంజ్ విసిరింది. సరే అని ఫేలుదా (దా అంటే అన్న అని అర్థం) అనే ముద్దుపేరున్న ప్రదోష్ మిత్ర డిటెక్టివ్ పాత్ర సృష్టించాడు. 

అతనికి తమ్ముడు వరసైన 14 ఏళ్ల కుర్రవాడు తపేశ్ (ముద్దుపేరు తాప్షే) యితని వెంటే తిరుగుతూ, యితని సాహసాల గురించి పాఠకులకు చెప్తూ వుంటాడు. వీళ్లిద్దరూ కాక జటాయు అనే కలం పేరుతో క్రైమ్ ఫిక్షన్ రాసే లాల్‌మోహన్ గంగూలీ పాత్ర కూడా పర్మనెంట్‌గా వుంటుంది. 1966 తొలి కథ మూడు విడతల్లో వెలువడగానే విపరీతంగా హిట్టయ్యింది. పిల్లలే కాక, పెద్దలు కూడా ఉత్తరాలు రాసి, ఫోన్లు చేసి అభినందించడంతో రాయ్ ‘నా సినిమాలకు కూడా యింత రెస్పాన్స్ రాలేదు’ అంటూ మురిసిపోయాడు.

పత్రిక అమ్మకాలు కూడా ఉధృతంగా పెరగడంతో, ఆయన అదే వరవడిలో, అవే ముఖ్య పాత్రలతో 35 కథలు, నవలికలు రాశాడు. వాటిల్లో మరీ పెద్ద క్రైమ్ లేకుండా, స్త్రీ పాత్రలు లేకుండా చూశాడు. కొన్ని అడ్వెంచర్ కథల్లా, మరి కొన్ని ట్రావెలాగ్‌లా, మరి కొన్ని విజ్ఞానదాయకంగా, మరి కొన్ని వినోదాత్మకంగా రాస్తూ పోయాడు. రాయ్ ప్రతిరూపమే ఫేలుదా అంటారు చుట్టూ వున్నవాళ్లు. ఆరడుగుల మనిషి. హైదరాబాదులో తయారయ్యే చార్మినార్ బ్రాండ్ చవక సిగరెట్లు కాలుస్తాడు. పంక్చువాలిటీ అంటే ప్రాణం. 

సరదా మనిషే కానీ క్రమశిక్షణ కలవాడు. ఆలోచనాపరుడు. ఏమైనా తెలియకపోతే తన సిద్ధూ పెదనాన్నను అడిగి తెలుసుకుంటూంటాడు. అచ్చమైన బెంగాలీయే కానీ, ఛాందసత్వం లేదు. విశ్వమానవుడి వంటి వాడు. కథ చెప్పడంలో కూడా సినిమా టైపు నేరేషన్ కనబడుతుంది. రాయ్ పోయిన తర్వాత అతని కొడుకు సందీప్ ఫేలుదా కథల ఆధారంగా నిర్మించిన టీవీ సీరియల్‌లో ఫేలుదా పాత్ర వేసిన సవ్యసాచి చక్రవర్తితో తన తండ్రిని అనుకరించమని చెప్పాడు.

ఈ కథలకు రాయ్ స్వయంగా బొమ్మలు వేశాడు. పుస్తకాలుగా ప్రచురించి, అవి విశేషాదరణ పొందడంతో ‘‘సోనార్ కెల్లా’’ను సినిమాగా తీద్దామనుకుని ఫేలుదా పాత్రను సౌమిత్రకు యిచ్చాడు. నేను సత్యజిత్ ‘రే’కు బదులుగా తప్పు రాస్తున్నానని అనుకునేవాళ్లు పైన యిచ్చిన ఫోటోలో ఆ పుస్తకం కవర్ పేజీపై రచయిత పేరును చదవడానికి లేదా చదివించుకోవడానికి ప్రయత్నించమని కోరుతున్నాను. రే అనే యింటిపేరు బెంగాలీలో లేదు. ఆయన తన పేరును రాయ్ అనే రాసుకుంటాడు. ఇంగ్లీషుకి వచ్చేసరికి స్టయిల్‌గా వుంటుందనో, మరో దానికో స్పెల్లింగ్ మార్చాడు. నా పేరు ప్రసాద్. ఇంగ్లీషులో స్పెల్లింగ్ చూసి ఎవరైనా ప్ర‘శాడ్’ అంటానంటే ఎలా? తెలుగులో రావు పేరును యింగ్లీషులో Rao, Rau, Row… యిలా పరిపరివిధాలుగా రాస్తారు. ఆ స్పెల్లింగ్ బట్టి ఉచ్చారణ మారిస్తే ఎలా? కానీ తెలుగు మీడియా యావత్తు సత్యజిత్ రే అని రాస్తున్నారు.

ఫేలుదాగా సౌమిత్ర నిల్చిపోవడంతో బాటు జటాయు పాత్రలో సంతోష్ దత్తా ఎంత బాగా ఒదిగిపోయాడంటే ఆ సినిమా తర్వాత రాయ్ తన ఫేలుదా కథల బొమ్మల్లో జటాయు పాత్రకు దత్తా పోలికలు వుండేట్లు చూశాడు. నాటకరంగం నుంచి సినిమాలకు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ నాటక రంగాన్ని విస్మరించి, తన తమ్ముడికి అప్పగించేశాడు కానీ, సౌమిత్ర 1978 నుంచి నాటకాలు వేస్తూనే వున్నాడు. అతని కుమార్తె పౌలోమీ బోస్ రంగస్థల నటీమణి. ఉత్తమ్ రాజకీయాల జోలికి వెళ్లలేదు కానీ యితను సిద్థాంతరీత్యా లెఫ్టిస్టు. ఎన్నికలలో పాల్గొనలేదు కానీ రైట్‌వింగ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినప్పుడు పాల్గొనేవాడు. తాజాగా సిటిజన్‌షిప్ చట్టానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టిన 500 మందిలో ఒకడు.

సౌమిత్ర నాటక రచయిత, కవి, వ్యాసరచయిత, చిత్రకారుడు. ఒక సినిమా డైరక్టు చేశాడు కూడా. హిందీ రంగం నుంచి పలు ఆఫర్లు వచ్చినా, మాతృభాషలో తప్ప వేరే భాషలో నటించలేనంటూ తిరస్కరించాడు. ఎంత మంచి నటుడైనా జాతీయ స్థాయిలో 2006 వరకు ఉత్తమ నటుడిగా ఎవార్డు రాలేదు. అంతిమ దశలో దాదా సాహెబ్ ఫాల్కే ఎవార్డు 2012 లో యిచ్చారు. కళాకారులకు ఫ్రాన్స్ దేశం యిచ్చే అత్యుత్తమ అవార్డు 2018లో వచ్చింది. 2004లో పద్మభూషణ్ వచ్చింది. చివరిదాకా క్రమశిక్షణతో జీవిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నటిస్తూనే వున్నాడు. 200 పై చిలుకు సినిమాల్లో వేశాడు. 2019లో ఆయన నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. 2020లో 12 సినిమాల్లో పాత్రలు వేశాడు. కొన్ని రిలీజు కావలసి వుంది. చాలా సున్నితంగా, హృద్యంగా, హిస్ట్రియానిక్స్ లేకుండా నటించే అతని స్టయిల్ నాకు యిష్టం. ఆ మహానటుడికి యిదే నా నివాళి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×