cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: దక్షిణ కర్ణాటక దృశ్యం

ఎమ్బీయస్‌: దక్షిణ కర్ణాటక దృశ్యం

తుమకూరు, చిక్కబళ్లాపూరు, కోలారు, హాసన్‌, మైసూరు, రామనగరం, కొడగు, చామరాజనగర్‌,  బెంగుళూరు రూరల్‌ ప్రాంతాలు దీని కింద వస్తాయి. 57 స్థానాలున్నాయి. తమిళం మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కళిగలు జనాభాలో 8% ఉంటారు. 70 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా యీ ప్రాంతంలో బలంగా ఉన్నారు. దేవెగౌడ వారికి నాయకుడిగా ఎదిగాడు. ఒక్కళిగలు అతనికే ఓటేస్తున్నారు. జెడిఎస్‌ ప్రధానబలమంతా యిక్కడే. ఇక్కడ బిజెపికి పెద్దగా బలం లేదు. అందువలన ఒక్కళిగ మఠాలను ఆశ్రయిస్తోంది. జెడిఎస్‌ 25 సీట్ల దాకా గెలుస్తుందని అంచనా. 2013లో ఇక్కడ కాంగ్రెసు 27, జెడిఎస్‌ 25, బిజెపి 4 గెలిచాయి. జెడిఎస్‌ సీట్లు నాలుగైదు తగ్గి, అవి బిజెపి, కాంగ్రెసు సగంసగం పంచుకోవచ్చని అంచనా.  

జెడిఎస్‌ అంటే ఫక్తు రాజకీయవాది ఐన దేవగౌడ, అతని కుటుంబమే. హాసన్‌లో పుట్టి జనతా పార్టీ నాయకుడిగా ఎదిగిన దేవెగౌడ ఆ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి పదవికి రామకృష్ణ హెగ్డేతో పోటీపడ్డారు. హెగ్డే తను దిగిపోతూ ఎస్‌ఆర్‌ బొమ్మయ్‌ ముఖ్యమంత్రిని చేశారు. దాంతో అలిగిన దేవెగౌడ జనతా పార్టీ నుంచి విడిపోయి సమాజవాదీ జనతా పార్టీ అని పెట్టాడు. తర్వాతి ఎన్నికలలో రెండు వర్గాలూ ఓడిపోయాయి. 1993లో యిద్దరూ ఒక్కటై జనతా దళ్‌ పేరుతో పోటీ చేసి గెలిచాయి. హెగ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుదామనుకుంటే అడ్డుకొట్టి దేవెగౌడ అయ్యాడు.

లోకసభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని కూడా అయ్యాడు. హెగ్డేను జనతాదళ్‌ నుంచి బహిష్కరించి కసి తీర్చుకున్నాడు. ప్రధాని అయినా కర్ణాటకపై పట్టు పోకూడదని, ముఖ్యమంత్రిగా ఉన్న జెఎచ్‌ పటేల్‌ను కంట్రోలు చేయబోయాడు. దాంతో పార్టీ రెండుగా విడిపోయింది. జనతాదళ్‌ (సెక్యులర్‌)కు దేవెగౌడ అధ్యక్షుడు. సిద్ధరామయ్య అతనికి అండగా నిలిచాడు. మరో వర్గమైన జనతా దళ్‌ (యునైటెడ్‌) కనుమరుగైంది. 

జెడిఎస్‌కు 1999 ఎన్నికలలో 10 స్థానాలే వచ్చాయి కానీ 2004లో 59 వచ్చాయి. దాంతో కాంగ్రెసుతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచినపుడు సిఎంగా కాంగ్రెసు నాయకుడు ధరం సింగ్‌, డిప్యూటీ సిఎంగా జెడిఎస్‌ తరఫున సిద్ధరామయ్య పని చేశారు. జెడిఎస్‌ కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకుని, బిజెపితో జట్టు కట్టినపుడు, 2005లో ముఖ్యమంత్రిగా మొదట జెడిఎస్‌ వంతు అన్నపుడు తనకే ఆ ఛాన్సు ఉంటుందనుకున్నాడు సిద్ధరామయ్య. కానీ దేవెగౌడ తన కొడుకు కుమారస్వామికి ఆ పదవి కట్టబెట్టడంతో సిద్ధరామయ్య తిరగబడ్డాడు.

దాంతో దేవెగౌడ యితన్ని పార్టీలోంచి తీసేశాడు. ఇక అప్పణ్నుంచి ఆ పార్టీ దేవెగౌడ కుటుంబానికే పరిమితమైంది. దేవెగౌడ, మూడో కొడుకు కుమారస్వామి, రెండో కొడుకు రేవణ్ణలతో బాటు అనేకమంది రాజకీయాల్లో ఉన్నారు. జెడిఎస్‌ నుంచి తక్కిన కులాల నాయకులందరూ వెళ్లిపోయారు. ఒక్కళిగ పార్టీగానే మిగిలింది. 2008లో 28, 2013లో 40 స్థానాలు గెలిచింది. ఈసారి కింగ్‌మేకర్‌ స్థానానికి పోటీ పడుతోంది.

ఒక అధ్యయనం ప్రకారం 2013 ఎన్నికలలో ఒక్కళిగల ప్రాబల్యం ఉన్న 53 సీట్లలో కాంగ్రెసు 18, బిజెపి 11, జెడిఎస్‌ 20 గెలిచాయి. ఇతరులకు 4 వచ్చాయి. ఒక్కళిగల్లో తెగలున్నాయి. మండ్యా, మైసూరులలో ఎక్కువగా ఉన్న గంగాట్కర్‌ ఒక్కళిగలు జెడిఎస్‌కు ఓటేస్తారు. చిక్‌మంగళూరు, శివమొగ్గలలో ఉన్న మలనాడు ఒక్కళిగలు బిజెపికి మద్దతిస్తారు. కోలారు, చిక్‌బళ్లాపూర్‌, బెంగుళూరులో ఉన్న మారాసు ఒక్కళిగలు కాంగ్రెసుకు ఓటేస్తారు. 

ఎవరితో కావాలంటే వాళ్లతో చేతులు కలపగల సమర్థుడు దేవెగౌడ. సిద్ధాంతపరంగా కొడుకుతో అప్పుడప్పుడు విభేదం ఉన్నట్లు నటిస్తాడు కానీ ఇద్దరూ ఒక్కటే. తమ ప్రాబల్యాన్ని ఉత్తర కర్ణాటకకు కూడా విస్తరించాలని ఆ బాధ్యతను కుమారస్వామికి అప్పగించాడు కానీ అతను అనారోగ్యపీడితుడై బెంగుళూరులోనే ఉంటున్నాడు. సిద్ధరామయ్యను ఓడించడమే దేవెగౌడ కుటుంబం జీవితలక్ష్యం.

బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని బిజెపి గెలిచే స్థానాల్లో బలహీనమైన జెడిఎస్‌ అభ్యర్థులను నిలిపిందని, జెడిఎస్‌ గెలిచే స్థానాల్లో బిజెపి బలహీనమైన అభ్యర్థులను నిలిపిందని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలు జరగగానే హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని సూచనలు రాగానే కుమారస్వామి సింగపూరు వెళ్లి కూర్చున్నాడు. అక్కడ బిజెపితో మంతనాలు జరుపుతున్నాడని అనుమానం. కనీసం 30 సీట్లు వస్తాయని, అవి చూపించి బేరాలాడవచ్చని అతని ఊహ. తక్కువ సీట్లున్నా తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని అతను మడతపేచీ పెట్టవచ్చు.

కాంగ్రెసు, బిజెపిలలో ఎవరు దానికి సమ్మతిస్తే వారితో కలుస్తాడు. ఈ ఏడాదిలో జరగబోయే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో గెలవాలంటే కర్ణాటకలో అధికారం దక్కాలనే లెక్కతో కాంగ్రెసు సిద్ధరామయ్యను, బిజెపి ఎడియూరప్పను బలిపెడితే పెట్టవచ్చు. ఎడియూరప్ప స్థానంలో అనంతకుమార్‌ పేరు అప్పుడే వినబడుతోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి నేనే అని చెపుతూ వచ్చిన సిద్ధరామయ్య యివాళ 'నేను తప్పుకుని దళిత నాయకుణ్ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధం' అని ప్రకటించాడు. 'అతన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమోదించాలనుకోండి..' అంటూ మెలిక పెట్టినా! 

హంగ్‌ ఎసెంబ్లీ ఏర్పడితేనే యివన్నీ అవసరమౌతాయి. ఏర్పడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెపుతున్నాయి. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. టుడేస్‌ చాణక్య అంచనాలు కరక్టవుతాయనే ప్రధ వుంది కానీ గుజరాత్‌ విషయంలో అది బిజెపికి 135 సీట్లు వస్తాయంది. తీరాచూస్తే 100 కూడా రాలేదు. పంజాబ్‌లో కూడా కాంగ్రెస్‌, ఆప్‌ సమానస్థాయిలో ఉంటాయంది. కానీ ఆప్‌ ఘోరంగా ఓడింది.

యుపిలో బిజెపి అద్భుత విజయం సాధిస్తుందని, ఎస్పీ, బియస్పీ పూర్తిగా దెబ్బతింటాయని ఎవరూ చెప్పలేకపోయారు. రేపు కర్ణాటకలో కూడా స్పష్టమైన తీర్పువస్తే యీ పొత్తుల గొడవ, యీ రాజీలు ఉండవు. ఎందుకంటే భాగస్వామిగా జెడిఎస్‌ రికార్డు బాగాలేదు. కాంగ్రెసు, బిజెపి యిద్దరితో పొత్తు పెట్టుకుంది, యిద్దరితోనూ పేచీ పెట్టుకుని ప్రభుత్వాలను కూలదోసింది. అదే పునరావృతమైతే కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి, ప్రజలకు అవస్థలు తప్పవు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com