Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: యుపిలో ఎస్పీ హరివిల్లు

ఎమ్బీయస్‍:  యుపిలో ఎస్పీ హరివిల్లు

ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న యుపిపై అందరి చూపూ వుంది. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఒక్కటే ఆసక్తికరమైతే యిలాటి వ్యాసాలు చదవడం వేస్టు. గతంలో 403టిలో 312 గెలిచిన బిజెపియే మళ్లీ అధికారంలోకి వస్తుంది, కానీ యీసారి కొన్ని సీట్లు తగ్గుతాయి అని సర్వేలు చెపుతున్నాయి. అది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటేనే యివి చదవాలి. ఎందుకంటే 20 ఏళ్లగా ఏ ప్రభుత్వమూ కంటిన్యువస్‌గా గెలవటం లేదు. ఈసారి బిజెపి అది సాధిస్తే విశేషంగానే చెప్పుకోవాలి. దేశం మొత్తంలో మోదీకి ఎదురులేకుండా వున్న యీ సమయంలో బిజెపి ఆధిక్యతను యుపిలో ప్రతిపక్షాలు తగ్గించగలిగాయంటే దాన్నీ విశేషంగానే చెప్పుకోవాలి. బిజెపి కానీ, ప్రతిపక్షాలు కానీ యీ ఫలితం కోసం పన్నుతున్న వ్యూహాలేమిటి అనేది వివరించడానికే యిలాటి వ్యాసాలు.

మాయావతి, అఖిలేశ్ తప్ప కాంగ్రెసు, బిజెపి పార్టీలకు చెందిన యుపి ముఖ్యమంత్రులెవరూ ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. బిజెపి తరఫున యోగి ఆ రికార్డు బద్దలు చేస్తున్నారు. ఆయన పాలన గురించి కూడా వ్యాఖ్యానించవలసి వుంటుంది. ఈ వ్యాసంలో సమాజవాది పార్టీ (ఎస్పీ)ని ఫోకస్ చేస్తున్నాను. ప్రతిపక్షాల్లో కాంగ్రెసు, బియస్పీలు చప్పబడి వుండగా ఎస్పీ మాత్రమే కాస్త హడావుడి చేస్తోంది. కాంగ్రెసు కి 6% ఓటు బ్యాంకుందని గత అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో తేలింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో ఓటు శాతం పెరిగిందన్న దాఖలాలు లేవు. అధిష్టానం నిరాసక్తత వలన, నాయకుల నిష్క్రమణ వలన తగ్గిందేమో కూడా! రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ దానికి పట్టు లేదు. ప్రియాంక ఏదో తంటాలు పడుతోంది కానీ దానివలన బలం పెరుగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు.

బియస్పీ మాట కొస్తే ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించింది కానీ బద్ధకం వదుల్చుకోలేదు. రంగంలోకి దిగి, ర్యాలీలు ప్రారంభించలేదు. 2007లో 206 సీట్లతో యుపి పీఠాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ 2012 వచ్చేసరికి ఎస్పీ కంటె 3.2% తక్కువ ఓట్లు తెచ్చుకుంది కానీ సీట్ల విషయంలో చాలా తేడా కనబడింది. బియస్పీకి 80 రాగా ఎస్పీకి 224 వచ్చాయి. బిజెపి విషయానికి వస్తే 2007లో 51, 2012లో 47 వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మోదీ వేవ్ ప్రారంభమై, 80లో బిజెపికి 71 సీట్లు వచ్చాయి. ఆ ప్రభావం 2017 అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడింది. 2016-17లో బిజెపి ఒబిసి ఓట్లు సంపాదించడంతో ఎన్‌డిఏకు 40% ఓట్లతో 312 సీట్లు వస్తే బియస్పీకి 22% ఓట్లతో 19 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఇక అక్కణ్నుంచి యిది మునిగిపోయే ఓడ అనుకుని చాలామంది గోడ దూకేశారు. కొంతమంది ఎదురు తిరిగారు. వారిని మాయావతి బహిష్కరించింది. మాయావతి మొండిగా వ్యవహరిస్తూ, తన ధోరణిని మార్చుకోకపోవడంతో, నూతన విధానాలను అవలంబించక పోవడంతో, బంధుప్రీతితో వ్యవహరించడంతో (ఆమె తమ్ముడు ఆనంద్ కుమార్, అతని కొడుకు ఆకాశ్ ఆనంద్‌కు ముఖ్యపదవులు యిచ్చింది) ఆమె పార్టీ ప్రభావం కుంచించుకుపోతూ వచ్చింది. ఆర్నెల్ల క్రితమే ఆమె కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది కానీ వాళ్లు పార్టీ విడిచి వెళ్లిపోవడంతో మళ్లీ కొత్తవాళ్లని వెతకవలసి వచ్చింది. 2017 ఎన్నికలకు ముందు కూడా యిలాగే జరిగింది. స్వామి ప్రసాద్ మౌర్య అనే బిసి లీడరుతో సహా అనేక మంది నాయకులు మాయావతి పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటోందని ఆరోపిస్తూ బిజెపిలోకి మారిపోయారు. ఇప్పుడు అలాటి ఆరోపణలేమీ చేయకుండానే వెళ్లిపోతున్నారు. మాయావతి తరఫున వారితో మాట్లాడి ఒప్పించేందుకు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరూ లేరు.

బియస్పీ నాయకుల్లో చాలామంది ఇప్పుడు ఎస్పీవైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీలో తొలినుంచి వున్న బిసి నాయకులు లాల్జీ వర్మ, రామ్ అచల్ రాజ్‌భర్ ఎస్పీలో చేరారు. ఇంద్రజిత్ సరోజ్, త్రిభువన్ దత్, మిఠాయిలాల్ భారతి వంటి దళిత నాయకులు సైతం ఎస్పీలో చేరారు. ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలలో కేవలం ముగ్గురు మాత్రమే పార్టీలో మిగిలారు. దీనికి కారణం ఆమె ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఆందోళనలు ఏవీ చేపట్టలేదు. ఒబిసిలు, దళితులు అత్యాచారాలకు గురైనప్పుడు కూడా బాధితుల పక్షాన కూడా ర్యాలీలు చేయటం లేదు. ఎంతసేపూ జనాభాలో 12-13% ఉన్న జాతవులు తనకెలాగూ ఓటేస్తారు కాబట్టి దానికి బ్రాహ్మణ, ఒబిసిలలో సగం మంది వేసినా నెగ్గేయవచ్చు అనే కులసమీకరణాలు వేసుకుని, తనకు ఓట్లేసే కులాల వారు చచ్చినట్లు యీసారీ వేస్తారన్న ధీమాతోనే కూర్చుంది. వచ్చే నెలలో ఎన్నికలు ప్రారంభం కాకపోతున్నా ఆమె యింటి గడప దాటలేదు. అవతల మోదీ, యోగీ, అఖిలేశ్, ప్రియాంక తెగ తిరిగేస్తున్నారు. బియస్పీ తరఫున మాయావతి బ్రాహ్మణ సచివుడు సతీశ్ చంద్ర మిశ్రా ఒక్కడే రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని భార్య, కొడుకు, అల్లుడు, మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కూడా తిరుగుతున్నారు. వాళ్లు బిజెపి హిందూత్వ భాషను ఒంటబట్టించుకుని వల్లె వేస్తూండడంతో అఖిలేశ్ బహుజన ఓట్లను ఆకర్షించసాగాడు. ఈ సారి జాతవుల్లో కూడా కొందరు అతనికి ఓటేయవచ్చని అంటున్నారు.

బిజెపితో ముఖాముఖీ పోరాడగలిగేది తామొక్కరే అని ఎస్పీ చూపించ దలచుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో, 2019 పార్లమెంటు ఎన్నికలలో బియస్పీతో పొత్తు పెట్టుకుని చతికిలపడిన అనుభవం వుంది కాబట్టి, యీసారి వాటితో జత కట్టదలచుకోలేదు. వాటి కంటె చిన్న పార్టీలతో చేయి కలుపితే మేలనుకుంది. బిజెపి కున్న ఓటు బ్యాంకు విస్తృతమైనది. దానిలో అగ్రవర్ణాలు, జాతవేతర హరిజనులు, యాదవేతర బిసిలు ఉన్నారు. ఆ ప్రభావాన్ని అధిగమించాలంటే ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు గట్టిగా వీచాలి. ఇప్పటిదాకా అదేమీ కనబడటం లేదు. లఖింపూర్ ఘటన ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితమైనట్లు అనిపిస్తోంది. ఎస్పీ ఓటు బ్యాంకు బలంగా వున్నది యాదవులలోనే ముస్లిములు బిజెపిని ఓడించగలిగే పార్టీకై వెతకడంతో నియోజకవర్గం బట్టి ఒక్కో పార్టీని ఎంచుకుంటున్నారు. అందుకే అఖిలేశ్ బ్రాహ్మణులను ఆకట్టుకోవడంతో బాటు, బిసిలలో వివిధ కులాల ఆధారంగా ఏర్పడిన చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు.

24 కోట్ల యుపి జనాభాలో బిసిలు 40-45% ఉన్నారు. వారిలో 19% ఉన్న యాదవులు ఎస్పీ మద్దతుదారులు. అందుకని యితర పార్టీలన్నీ యాదవేతర బిసిల ఓట్లకై ప్రయత్నిస్తాయి. దాన్ని నివారించడానికి అఖిలేశ్ కేశవ్ దేవ్ మౌర్యకు చెందిన మహాన్ దళ్‌తో పొత్తు పెట్టుకున్నాడు. దానికి 7 జిల్లాలలో శాక్య, సైనీ, కుశావహా, మౌర్య, కాంభోజ్ వంటి కులాలలో పలుకుబడి వుంది కానీ ఒక్క ఎమ్మల్యే కూడా లేడు. సంజయ్ చౌహాన్‌కు చెందిన జనవాది పార్టీ (సోషలిస్టు)కి 5 జిల్లాలలో నౌనియా-చౌహాన్ కులస్తులలో పలుకుబడి వుంది. దానికీ ఎమ్మెల్యే లేడు. దాన్నీ కలుపుకున్నాడు.

రాజ్‌భర్ కులస్తులు, వాళ్ల ఉపకులాలు (బన్సీ, అర్కవంశీ, బింద్, ప్రజాపతి, పాల్, విశ్వకర్మ...) కలిపి యుపిలో ఓ ముఖ్యమైన గ్రూపు. పూర్వాంచల్, అవధ్ ప్రాంతాలలోని 24 జిల్లాలలో వాళ్లు 20 వేల నుంచి 90 వేల దాకా వుంటారు. ప్రత్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా వున్నపుడు యీ ఓట్లకు ప్రాముఖ్యత వస్తుంది. మొత్తం మీద పూర్వాంచల్‌లో 20 అసెంబ్లీ సీట్లలో ఎక్కువగా, తక్కిన 133 అసెంబ్లీ సీట్లలో ఫలితాలను అంతో యింతో ప్రభావితం చేయగల రాజ్‌భర్‌ల పేర ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అనే అతను సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) పార్టీ పెట్టాడు. 2017లో బిజెపితో కలిసి 8 సీట్లు పోటీ చేసి, నాలుగు గెలిచాడు.

అయితే 2018 మార్చిలో అతనికి బిజెపితో గొడవలు వచ్చాయి. బిజెపి సకలదీప్ రాజ్‌భర్ అనే అతన్ని రాజ్యసభకు ఎంపిక చేసేసరికి తనకు పోటీగా మరో రాజ్‌భర్ నాయకుణ్ని తయారుచేస్తోందని అతనికి కోపం వచ్చింది. ఆ ఏడాది డిసెంబరులో కేంద్రం ఆ కులానికి చెందిన మహారాజా సుహేల్‌దేవ్ పేర స్టాంపు విడుదల చేసేసరికి రాజ్‌భర్‌ల ఓటు బ్యాంకు గుంజుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నంగా ఫీలై, ఆ సభకు ఎగ్గొట్టాడు. రాజ్‌భర్‌లను దువ్వే ప్రయత్నాలను బిజెపి కొనసాగిస్తూ వచ్చింది. పూర్వాంచల్ నుంచి ఎన్నికైన రాజ్‌భర్ ఎమ్మెల్యే అనిల్ రాజ్‌భర్‌ని యుపి మంత్రివర్గంలో సహాయమంత్రిగా తీసుకుంది. ఈ ఓంప్రకాశ్‌కు బిసి సంక్షేమ శాఖ మంత్రిత్వ పదవి యిచ్చింది. ఆ శాఖలో వుంటూనే అతను యోగి ప్రభుత్వం బిసిలకు ఏమీ చేయటం లేదని అస్తమానూ విమర్శించేవాడు.

2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి అతను బిజెపితో పొత్తు తెంచుకుని, 39 సీట్లలో పోటీ చేశాడు. ఎక్కడా డిపాజిట్టు దక్కలేదు. ఫలితాలు రాగానే యోగి యితన్ని మంత్రివర్గంలోంచి తీసేసి అనిల్ రాజ్‌భర్‌ను కాబినెట్ హోదాకు ప్రమోట్ చేశాడు. బిజెపిపై కోపంతో రగులుతున్న ఓంప్రకాశ్ యీ ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరిపి, అవి విఫలం కావడంతో నవంబరులో అఖిలేశ్‌తో చేతులు కలిపాడు. ఎస్పీతో చేతులు కలిపిన పార్టీలలో ప్రముఖమైనది రాష్ట్రీయ లోకదళ్. చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ స్థాపించిన యీ పార్టీ మాటిమాటికీ భాగస్వాములను మారుస్తూ వచ్చింది. అజిత్ కరోనాతో మరణించడంతో అతని కొడుకు జయంత్ చౌధురీ యిప్పుడు పార్టీ అధినేత అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేదు. పశ్చిమ యుపిలో జాట్లు ఆ పార్టీకి సమర్థకులుగా వున్నారు కాబట్టి, ప్రస్తుతం రైతులు బిజెపిపై ఆగ్రహంగా వున్నారు కాబట్టి యీసారి కొన్నయినా సీట్లు వస్తాయని వాళ్ల ఆశ. దానికి ఎస్పీ సహకరిస్తుందనే లెక్కతో అఖిలేశ్‌తో చేతులు కలిపాడు. ఎస్పీ ముస్లిములకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తుందని ఫిర్యాదు చేసే జాట్లు ఏ మేరకు యీ పొత్తును హర్షిస్తారో చూడాలి.

వారణాసి ప్రాంతపు కూర్మీల పార్టీ ఐన  అప్నా దళ్‌కు ఓ కథ వుంది. డా. సోనేలాల్ పటేల్ అనే అతను ఆ పార్టీ పెట్టాడు. 2009లో అతను యాక్సిడెంటులో పోయాక అతని భార్య కృష్ణా పటేల్ పార్టీ అధ్యక్షురాలు కాగా, పెద్ద కూతురు అనుప్రియ, ఆమె భర్త అశీష్ పార్టీ వ్యవహారాలు నడపసాగారు. 2012లో పార్టీ ఓ ముస్లిం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన అనుప్రియ ఎమ్మెల్యేగా నెగ్గింది. రెండేళ్లు పోయాక ముస్లిము పార్టీతో తెగతెంపులు చేసుకుని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఏలో చేరింది, రెండు పార్లమెంటరీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఉపయెన్నికలో ఓ అసెంబ్లీ సీటు కూడా గెలిచింది. అనుప్రియ పార్లమెంటు స్థానానికి గెలిచి అసెంబ్లీ సీటుకి రాజీనామా చేయడంతో వచ్చిన ఉపయెన్నికలో తన భర్తను అభ్యర్థిగా పెడదామనుకుంది. కానీ తల్లి ఒప్పుకోలేదు. పెద్ద కూతురు, అల్లుడు పెత్తనం చలాయిస్తున్నారని ఆమె అభిప్రాయం. చిన్నకూతురు మద్దతుతో ఆవిడే నిలబడింది. అనుప్రియ ప్రచారం చేయకపోగా ఆమె ఓటమికి కారకురాలైంది కూడా.

దాంతో కోపం తెచ్చుకున్న తల్లి కూతుర్ని, అల్లుణ్ని, వాళ్ల అనుచరుల్ని పార్టీలోంచి తీసేసింది. వాళ్లు బయటకు వెళ్లి 2016 డిసెంబరులో అప్నా దళ్ (సోనేలాల్) పేర పార్టీ పెట్టుకున్నారు. తల్లి పార్టీ పేరు అప్నా దళ్ (కామేర్‌వాదీ). మూణ్నెళ్ల క్రితం కృష్ణా పటేల్ తన పెద్దల్లుడు బిజెపి ఏజంటని, తన ఆస్తి మీద కన్నేశాడని ఆరోపించింది. తన భర్త మరణం తర్వాత సమస్త చరస్థిరాస్తులు తనవేననీ, వాటి విషయంగా కూతుళ్లిద్దరి మధ్య గొడవలున్నాయనీ, అల్లుడి కారణంగా తనకు ప్రమాదం వుందని ప్రకటించింది. ఇప్పుడు ఆ పార్టీ ఎస్పీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. వాళ్లకు అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. అప్నా దళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీతో బాటు ఎన్‌డిఏలో కొనసాగుతోంది.

ఎస్పీతో పొత్తు పెట్టుకున్న మరో పార్టీ అతని చిన్నాన్న శివరాజ్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా). ఎస్పీలోంచి బయటకు వెళ్లి 2018 ఆగస్టులో పెట్టుకున్న పార్టీ. దానికి ప్రస్తుత ఎసెంబ్లీలో ఒక్క సీటు మాత్రమే వుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించి విరమించుకుంది. చర్చలు జరిపారు కానీ బేరాలు కుదరలేదు. 403 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అంటోంది ఆ పార్టీ. లెక్క ప్రకారమైతే అఖిలేశ్ చేతులు కలుపుతున్న చిన్నపార్టీలలో కాంగ్రెసు కూడా వుండాలి. కానీ కాంగ్రెసు తను చిన్న పార్టీ అనుకోవటం లేదు. పొత్తు అనగానే చాలా సీట్లు అడుగుతుంది, సీట్లు పోగొట్టుకుని భాగస్వాములకు కూడా నష్టం చేస్తుంది.

అది కాక, కాంగ్రెసుతో అంటకాగడం అఖిలేశ్‌కు యిష్టం లేదు. 2019లో కాంగ్రెసుకు మొత్తం మీద 6% ఓట్లు రావడానికి కారణమేమిటంటే ముస్లిముల్లో 14% మంది దానికి ఓటేశారు. ఇప్పుడు కాంగ్రెసుతో చేతులు కలిపితే అఖిలేశ్ కూడా ముస్లిములను బుజ్జగిస్తున్నాడు అని బిజెపి ఆరోపించి హిందూ ఓట్లను సంఘటితం చేస్తుందన్న భయం వుంది. గతంలో అయితే ముస్లిం, యాదవ్ కాంబినేషన్‌తోనే ఎస్పీ నెట్టుకుని వచ్చింది. కానీ యిప్పుడు హిందూత్వ రాజకీయాలు వీరవిహారం చేస్తున్న యీ సమయంలో ఆ ముద్ర యిష్టం లేదు. అందుకని హిందువుల్లోనే వివిధ కులాల వారిని ఆకట్టుకుంటూ బిజెపికి ప్రత్యమ్నాయం తనే అని చూపుకుంటున్నాడు. ఆ విధంగా పరోక్షంగా ముస్లిములకు సందేశం యిస్తున్నాడు - బిజెపిని ఓడించాలంటే మా పార్టీయే మీకు దిక్కు, కాంగ్రెసు కాదు అని. దిల్లీలో ఆమ్ ఆద్మీ, బెంగాల్‌లో తృణమూల్ అలాగే లాభపడ్డాయి.

ఎస్పీ కూటమిలో పేరుకి యిన్ని పార్టీలున్నా ఉప్పూపత్రీ లేనివే ఎక్కువ. ప్రస్తుతం ఎస్పీకి 56 సీట్లున్నాయి. ఏది ఏమైనా దాని సీట్లు మాత్రం ఏదో ఒక మేరకు పెరగడం ఖాయమనిపిస్తోంది. ఇక తక్కినవాళ్లంటారా, యీ హరివిల్లులో ఎన్ని రంగులు మెరుస్తాయో, ఎన్ని వెలిసిపోతాయో ఫలితాల తర్వాత తెలుస్తుంది. బిజెపి గురించి, యుపిలో సంభవిస్తున్న పరిణామాల గురించి వచ్చే వ్యాసాల్లో వివరిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?