cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎస్వీయార్‌ శతజయంతి

ఎమ్బీయస్‌: ఎస్వీయార్‌ శతజయంతి

ఇవాళ ఎస్వీయార్‌ శతజయంతి. పత్రికల్లో, టీవీల్లో ఆయన గురించి విస్తారంగా వస్తోంది. మీరూ ఏదైనా రాయండి అంటూ కొంతమంది పాఠకులు మెయిల్స్‌ రాస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే (8 ఏళ్లు దాటి ఉంటుంది) గ్రేట్‌ ఆంధ్రాలోనే రాశాను. ఆర్కయివ్స్‌లో దొరక్కపోవచ్చు కానీ మళ్లీ దాన్ని మొత్తం రాస్తే గతంలో చదివినవాళ్లకు బోరు కొడుతుంది. అందువలన ఆ వ్యాసంలో ఆయన జీవిత విశేషాల భాగం వదిలేసి, నేను చేసిన కామెంట్స్‌ వరకు మళ్లీ అందిస్తున్నాను. జీవిత విశేషాల గురించి, మీరు పత్రికల్లో, టీవీల్లో చదివేసి, చూసేసి ఉంటారు. కామెంట్స్‌ అనేవి వ్యక్తిగతం కాబట్టి గతంలో మిస్‌ అయినవాళ్లు చదవవచ్చు. 

'... నాకు తెలుగులో బాగా నచ్చిన సినిమా మాయాబజార్‌. అందునా బాగా నచ్చిన పాత్ర ఘటోత్కచుడు. అదేమిటి, కష్ణుడు బాగా చేయలేదా, మాయా శశిరేఖ బాగా చేయలేదా? అంటూ పంచాయితీ చేయకండి. మాయాబజార్‌ చూసినపుడు నేను పిల్లవాణ్ని. ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడూ పిల్లవాణ్ని అయిపోయి చూస్తాను కాబట్టి అవే ఫీలింగ్స్‌. చూస్తూన్నంత సేపూ ఇంటర్వెల్‌ ఎప్పుడు వచ్చేస్తుందా ఎప్పుడు ఘటోత్కచుడు వచ్చేస్తాడా అని ఒకటే ఎదురుచూపులు. ఘటోత్కచుడు రాగానే 'హమ్మయ్య, ఇక ఫర్వాలేదు, కథ ఒడ్డున పడింది, కష్టాలు గట్టెక్కాయి' అని ఊరట.

కృష్ణుడు ఏవేవో ట్రిక్కులు వేసి కథ నడిపించి వుండవచ్చు. అవన్నీ పెద్దయ్యాక తెలుస్తాయి. చిన్నప్పుడు మనకు కావలసినవి ఇన్‌స్టంట్‌ సొల్యూషన్స్‌. శత్రువును పట్టుకుని చావగొట్టేయాలి. అంతే! ఆ పని చేసేవాడు ఘటోత్కచుడు కాబట్టి హైహై నాయకా. లంబూ జంబూలే కాదు, నేను కూడా అలాగే అరిచేవాణ్ని తెరమీద ఎస్వీయార్‌ ఘటోత్కచుని రూపంలో కనబడగానే. అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై.. పద్యం పాడుతూంటే ఒళ్లు జలదరిస్తుంది. అసలు రాడార్‌ లాటి డ్రమ్‌ మీద 'ఘటోత్కచ' 'ఘటోత్కచ' అంటున్నపుడే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఢామ్మని ఇంతెత్తు హైట్‌తో ఎస్వీ రంగారావు ప్రత్యక్షమవగానే చప్పట్లే చప్పట్లు. ఏం రూపం, ఏం వర్చస్సు, ఏం తేజస్సు, ఏం వాయిస్సు.. రాక్షసుడయితే అయ్యాడు కానీ వెళ్లి దణ్ణం పెట్టుకో బుద్ధవుతుంది.

అసలు మా నాయనమ్మకు నాకూ ఇక్కడే గొడవ వచ్చేది. ఆవిడకు పురాణాలన్నీ కంఠోపాఠం. అవన్నీ మాకు చెప్పేది. తక్కినవన్నీ బాగానే చెప్పేది కానీ ఘటోత్కచుడు విషయంలో తప్పులు చెప్పేది. అతను రాక్షసుడు అని చెప్పేది. అంత బలశాలి బతికుంటే ప్రమాదమని కృష్ణుడే మాయోపాయం పన్ని కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిచేత చంపించేశాడని చెప్పేది. నేను నమ్మేవాణ్ని కాను. 'నువ్వు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నావు మామ్మా, కృష్ణుడు, ఘటోత్కచుడు ఫ్రెండ్స్‌. ఘటోత్కచుడు చాలా మంచివాడు. పెళ్లివాళ్లకు మిగల్చకుండా లడ్డూలు తినేసినంత మాత్రాన రాక్షసుడు అనకూడదు' అని వాదించేవాణ్ని. 

ఆవిడ నెత్తి కొట్టుకుని 'పెద్దయితే తప్ప నీకు అర్థంకాదులే' అని మొత్తుకునేది. పెద్దయ్యాక మాయాబజారు కట్టుకథనీ, భారతంలో లేదనీ, ఘటోత్కచుడు అంటే నెత్తిమీద ఒక వెంట్రుక కూడా లేకుండా తలకాయ కుండలా వుండేవాడనీ అన్నీ తెలిసాయి. మనసు పాడైపోయేదే కానీ బుద్ధిని హృదయం జయించేట్లా చేసిన మహానుభావుడు ఎస్వీ రంగారావ్‌. ఆయన వేసిన ముద్ర ఎంత గట్టిగా వుందంటే నా చిన్ననాటి మధుర స్మ్రుతి అలాగే వుండిపోయింది. ఇప్పటిక్కూడా మాయా శశిరేఖ చేసే పనులకు నవ్వు వచ్చినపుడు అది సావిత్రి ఘనత అని గుర్తుకురాదు. ఆమె లోపల ఎస్వీయార్‌ దాగున్నాడు కాబట్టే అలా చేస్తోందని అనిపిస్తుంది. 

మీకు తెలుసా? మొదట్లో ఆ పాత్ర రంగారావుగారికి యివ్వడానికి జంకారు కెవి రెడ్డి. ఘటోత్కచుడు అభిమన్యుడి వయసువాడు. చిన్నగా, నేవళంగా వుండాలి. రంగారావుగారు చూస్తే నాగేశ్వరరావుగారి కంటె అయిదేళ్లు పెద్దవాడు. భారీ విగ్రహం. కాస్త తర్జనభర్జన పడి 'ఏది ఏమైనా రాక్షసుడు కదా, అందువల్ల భారీగా వున్నా ఫర్వాలేదు.' అనుకుని రంగారావు గార్ని బుక్‌ చేశారు. మనల్ని రక్షించారు. 

ఘటోత్కచుడు ఒక్కటేనా, రంగారావు ఏ పాత్ర వేసినా ఆ వాయిస్‌, ఆ డైలాగ్‌ డెలివరీ, ఆ రూపం.. అలా కళ్లముందు నిల్చిపోవాల్సిందే. డైలాగులు అలవోకగా ఆయన పలికే తీరు అనితర సాధ్యం. 'పాండవ వనవాసం' ఎన్టీయార్‌ 'ధారుణి రాజ్యసంపద' అంటూ చచ్చేట్లా పద్యం పాడితే ఈయన 'హు బానిస, బానిసల కింత అహంభావమా' అని ఒక్క మాటలో కొట్ట్టిపడేస్తే - ఆ డైలాగు కొట్టినది విలన్‌ అన్న విషయం తట్టక - చప్పట్లు కొట్టేసేవాళ్లం. సింహాసనంపై ఆ కూచోడం, తల తిప్పడం, కాస్త వంగడం, మాటను విసురుగా, దూకుడుగా వదలడం - హేలా విలాసం అంటారు ఇదే కాబోసు అనిపించేది. మన తెలుగునటుల్లో ఆయనకున్నంత ఈజ్‌ ఎవరికుంది చెప్పండి. మనకు చాలామంది గొప్పనటులున్నారు. కానీ వాళ్లందరూ ఎంతోకొంత హోమ్‌వర్క్‌ చేసుకువచ్చి నటిస్తున్నారు అనిపిస్తుంది. కానీ యస్వీయార్‌ మాత్రం అప్పటికప్పుడు ఎఫర్ట్‌లెస్‌గా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. 

అలా ఎవర్ని చూసినా అనిపించదు. (ఒక్క మినహాయింపు. 'పెద్దమనుష్యులు'లో విలన్‌గా వేసిన గౌరీనాథ శాస్త్రిగారిలో కూడా ఆ ఈజ్‌ కనపడింది. ఆయన తక్కిన పాత్రలుకూడా యింత యీజ్‌తో వేశారా, లేదా అన్నది నాకు తెలియదు) ఆ యీజ్‌తోనే స్టయిల్‌ వచ్చింది. ఈ వజ్‌ యే స్టయిలిష్‌ ఏక్టర్‌. విలన్‌ వేసినా జేజేలు అందుకునేంత స్టయిల్‌. తెర మీద ఆయన వస్తే చాలు ఉత్తేజం కలుగుతుంది. హిజ్‌ ప్రెజెన్స్‌ వాజ్‌ ఎలక్ట్రిఫైయింగ్‌. బొబ్బిలియుద్ధంలో చూడండి. చివర్లో అంతా ఘోరం. విషాదం. హీరో, హీరోయిన్లు అందరూ చచ్చిపోయారు. ఏడుపు వస్తూ వుంటుంది. కథ ముందే తెలుసు కాబట్టి తాండ్ర పాపారాయుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ వుంటాం. 

అంతలోనే వస్తాడు. శవాలను చూసి బాధపడతాడు. పవర్‌ఫుల్‌ డైలాగులు కొడతాడు. కోపం తెచ్చుకుంటాడు. 'పులి, బొబ్బిలి పులి' అంటూ విజయరామరాజుమీద పడతాడు. ఆ సీన్లు చాలు, కళ్లముందు రంగారావు నిలిచిపోవడానికి. బుస్సీమీద, విజయరామరాజుమీద ప్రేక్షకుడి కసి తీరేది తాండ్ర పాపారాయుడి ద్వారానే. మనం మమేకం అయిపోతాం. ఆ పాపారాయుడు బతికుంటే రంగారావు లాగానే వుంటాడనుకుంటాం. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని అభినయం.

తరచి చూస్తే అనేక సినిమాల్లో రంగారావుగారు వేసిన సీన్సు తక్కువే. కానీ సినిమాహాలునుండి బయటకు రాగానే హీరో హీరోయిన్ల తర్వాత గుర్తుకు వచ్చేది ఆయనే. చాలా వాటిల్లో ఆయనది తండ్రో, మామగారో, యిలాటి పోర్షన్లే. అదే వేరెవరైనా వేస్తే ఆ పోర్షన్‌ ఎవరేశారబ్బా అని తంటాలు పడి గుర్తుకు చేసుకోవాలి. కానీ ఈయన వేయడంతో వాటికి ఓ ప్రాముఖ్యత ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. ఆయన తెరమీదకు రాగానే ఒక హుషారు వచ్చేస్తుంది. హఠాత్తుగా తెర జీవం పోసుకుంటుంది. సన్నివేశంలో ఎక్కడలేని హడావుడీ వచ్చి పడుతుంది. 

ఆయన సీనులో వున్నాడంటే అవతలి వాళ్లను తినేయడమే. అంటే అవతలివాళ్లు కంటికి ఆనరు. జమునగారు చెప్పుకున్నారు - వాళ్లిద్దరూ కలిసి నటించే సినిమాల్లో ఆయన ఉడికించేవాట్ట. 'ఇదిగో అమ్మాయ్‌, కాస్కో, ఈ సీనులో నిన్ను తినేస్తా' అని. ఈవిడ జవాబిచ్చేదిట - 'గొంతు కడ్డం పడతా, మీరూ చూస్కోండి' అని. అంటే అర్థమేమిటి? 'మీరు నిన్ను తినలేరు. నేనూ మీ అంత ప్రతిభావంతంగా నటిస్తాను, చూస్కోండి' అని అన్నమాట. అంతేగానీ 'మిమ్మల్ని తినేస్తా, జాగ్రత్త' అనటం లేదు. అంత మాట అనే సాహసం ఎవరికీ లేదు. అంటే ఆయన చంపేస్తాడని కాదు, అది జరిగే పని కాదు అని అందరికీ తెలుసు. 

మహా అయితే ఆయనకు మాచింగ్‌గా చేయగలరేమో అంతే! అంతే గానీ ఆయన్ని డామినేట్‌ చేయడం జరగని పని. అంతెందుకు మహానటుడు ఎన్టీయార్‌కే ఎస్వీయార్‌ని తట్టుకోవడం మహా కష్టం. వాళ్లిద్దరూ తెరమీద వున్నారంటే మంచి పోటాపోటీగా వుంటుంది. ఇద్దరూ కలిసి మనని అలా తెరకేసి కళ్లప్పగించి చూసేట్లా చేసేస్తారు. అసలు ఇటు నాయకుడు రామారావయితే, అటు ప్రతినాయకుడు రంగారావయితేనే తూకంగా వుంటుంది. ఈయన రాముడైతే ఆయన రావణుడు. ఈయన కృష్ణుడయితే, ఆయన దుర్యోధనుడు. ఆయన రేచుక్కయితే, ఈయన పగటిచుక్క. 

తెరమీద తన పాత్ర ఎలా పోర్ట్రే చేయాలి అన్న విషయం ఎస్వీయార్‌కి బాగా తెలుసు. దానికి సంపూర్ణ రామాయణంలో చివర్లో రావణుడి సభలో దృశ్యం గురించిన సంఘటన మంచి తార్కాణం. బాపు-రమణలు తీసిన ఆ 'సంపూర్ణ రామాయణం'కు రమణగారు, ఆరుద్రగారు రచయితలు. యుద్ధం ముగిసిపోతుందనగా రావణాసురుడు ఓ రాత్రిపూట తన సభాస్థలానికి వెళ్లి అక్కడి సింహాసనాలు చూస్తూ తనవాళ్లందరూ యుద్ధంలో కూలిపోయిన విషయాల్ని గుర్తుకు చేసుకుని ఆవేదన పడతాడు. ఈ ఘట్టాన్ని ఆరుద్రగారు ఇండోనేసియన్‌ రామాయణంలోంచో దేంట్లోంచో తీసుకున్నారట. మంచి గ్రీక్‌ ట్రాజెడీలో హీరోను చూస్తున్నట్టు వుంటుంది. అక్కడ మంచి డైలాగులున్నాయి కదా. రంగారావుగారికి ఆ డైలాగులు ముందురోజు వెళ్లాక అవి చూసి ఆయన మురిసిపోలేదు. ఇంత చక్కటి డైలాగులు అదరగొట్టేసి తనే పేరు తెచ్చుకోవాలని ఆశపడలేదు. వెంటనే బాపు, రమణలకు కబురంపించారు. 

''ఈ డైలాగులన్నీ నేనే చెబితే బాగుండదు. మధ్య మధ్యలో మాధవపెద్ది చేత పాడిద్దాం. అప్పుడే రక్తి కడుతుంది.'' అని చెప్పి బాపు, రమణ, మాధవపెద్ది, మహదేవన్‌ - వీళ్లందరినీ తన యింటికి రప్పించి 'ఇదిగో యిక్కడ నేను మాట్లాడతాను, అక్కడ అతను పాడతాడు, రాగాలొద్దు' అంటూ ట్యూన్‌ చేయించుకుని ప్లాను చేసి, అలా చిత్రీకరించేట్లా చేశారు. ఈ విషయం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా యాక్టర్లకు పాట పాడేద్దామని మహా కుతి. మాటల్లా ఓ పాట రాయించుకుని, గట్టిగా రాగాలు తీయకుండా, శ్రుతిని పట్టించుకోకుండా, అలా అలా చదివేసి, పాట పాడేశాననిపించుకోవడం మహా సరదా. అటువంటిది ఈయన తన డైలాగులను గాయకుడికి యిచ్చి  పాడించి మాధవపెద్దికి కూడా కీర్తి వచ్చేట్లు చేశారు. రేదర్‌ తన కీర్తిలో వాటా యిచ్చారు. వింతగా వుంది కదూ!? 

గట్టిగా ఆలోచిస్తే రంగారావుగారు సంపూర్ణ రామాయణంలో చేసినది వింతేమీ కాదు. ఎందుకంటే రంగారావుగారు నటుడే కాదు, దర్శకుడు కూడా. ఆయన తీసిన సినిమాలు హిట్‌ కావడమే కాదు, ప్రభుత్వ ఎవార్డులు వచ్చాయి కూడా. అందువల్ల సన్నివేశాన్ని ఎలా రక్తి కట్టించాలి, ఏ ఎలిమెంట్స్‌ ఎంత పాళ్లల్లో వుండాలి అన్న విషయం కూలంకషంగా అధ్యయనం చేయగలడాయన. అందుకే సంపూర్ణ రామాయణంలో ఆ సీను అంత బాగా పండింది. 

రంగారావుగారు అలా సూచించాక బాపు, రమణలు 'అబ్బే కాదండీ, మేం ఇంకోలా అనుకున్నాం' అనే ప్రశ్నే లేదు. ఆయన చెప్పినదాంట్లో రీజనబిలిటీ మాట సరే, రంగారావుగారి మాటకు తెరమీదా, బయటా కూడా ఎదురే లేదు. ఆ రాజసం, ఆ ధాటీ అలాటివి. హైట్‌ ఒక్కదాని వల్లే కాదు, ఆయన చేతిలో తుపాకీ కూడా వుండేది, గుండెల్లో కోపం వుండేది. ఏదైనా అడ్డు తిరిగి సరిగ్గా జరక్కపోతే కాల్చి పారేస్తానని బెదిరించే రకం.

మీకు తెలిసే వుంటుంది. 'నర్తనశాల'లో ఆయన కీచకుడి పాత్రకు జకర్తా ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతి వచ్చింది. ఫెస్టివల్‌లో చూపించడానికి ముందే ఇండోనేసియన్‌ ప్రధాని సుకర్నోకు 'నర్తనశాల' గురించి తెలుసు. ఆయన భారత్‌ పర్యటిస్తూ మద్రాసు వచ్చారు. స్టూడియోలు తిప్పారు. ఆయన వచ్చేటైముకు 'నర్తనశాల' షూటింగ్‌ అవుతోందట. కీచకుడిగా రంగారావుని చూసి ఇంప్రెసయిపోయి 'వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌?' అన్నాట్ట. 'రంగరావ్‌' అన్నాట్ట ఈయన అతి గంభీరంగా. సుకర్నో తెల్లబోయాట్ట. ఎందుకంటే ఇండోనేసియన్‌ భాషలో 'రంగరావ్‌' అంటే 'ఖబడ్దార్‌' అనిట. ఈయన ఇలా అంటాడేమిట్రాని కాస్సేపు కంగుతిన్నాట్ట ఆ దేశప్రధాని. సుకర్నో ఉదంతం నిజమా అని గట్టిగా అడక్కండి. నాకు ఇండోనేసియన్‌ భాష రాదు. ఇంటూరి వెంకటేశ్వరరావుగారు ఎస్వీ రంగారావు జీవితచరిత్ర రాశారు నాలుగు దశాబ్దాల క్రితం. అందులోది చెప్తున్నాను. 

రాజసం అంటే ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ఆయన ముష్టివాడి వేషంలో కనబడినా 'ఇది మారువేషంలే, కాస్సేపటిలో బవిరి గడ్డం పీకేసి నేను మహారాజుని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఈ వేషంలో వచ్చాను' అంటాడేమో అనిపిస్తుంది. సబ్‌డ్యూడ్‌గా వేయడం ఆయనకు నప్పదనిపిస్తుంది. 'నమ్మినబంటు' సినిమా గురించి చెప్తాను. అందులో ఓ జమీందారు, ఓ పేద రైతు వుంటారు. జమీందారు చెడ్డవాడు. సినిమాలో ఈయనా, గుమ్మడి వేశారని నేనన్నాననుకోండి. సినిమా చూసి వుండకపోతే మీరు వెంటనే 'అయితే జమీందారు ఎస్వీయార్‌, గుమ్మడి పేదరైతు అన్నమాట' అనేస్తారు. కానీ సినిమాలో వెరైటీకో దేనికో రోల్స్‌ రివర్స్‌ అయ్యాయి. ఈయన పేదరైతు పాత్రలో చాలా బాగా వేశారు. కుటిలుడైన జమీందారు వేషంలో గుమ్మడి అత్యద్భుతంగా నటించారు. ఇక్కడివరకు ఓ పార్ట్‌. తర్వాతి పార్ట్‌ చెబుతాను. 

నమ్మినబంటు విదేశీ చిత్రోత్సవానికి వెళ్లింది. సినిమాతో బాటు రంగారావుగారు, గుమ్మడిగారు స్పెయిన్‌ వెళ్లారు. అక్కడికి రిచర్డ్‌ అటెన్‌బరో కలిశారు. ఆయన అప్పుడు 'యాంగ్రీ సైలెన్స్‌' అనే సినిమా తీసి దాని ప్రదర్శన సందర్భంగా ఫెస్టివల్‌కి వచ్చాడు. 'నమ్మినబంటు' చూశాడు. చూసి ''ఇద్దరూ బాగా వేశారు. కానీ ఆ జమీందారు పాత్ర రంగారావుగారూ, పేదరైతు పాత్ర మీరూ వేసివుంటే బాగుండేది.'' అన్నాడు. చూడండి, ఆయనకు రంగారావు ఎలాటి పాత్రలు వేస్తారూ, గుమ్మడి ఎలాటి పాత్రలు వేస్తారూ, వాళ్ల ఇమేజి ఎలాటిదీ అన్నది తెలియదు. అప్పటిదాకా వాళ్లెవరో తెలియదు. ప్రీ కన్సీవ్‌డ్‌ నోషన్స్‌ లేవు. అయినా జమీందారంటే ఎస్వీయారే అనుకున్నాడు. అదీ నేనన్న రాజసం.

అందుకే రంగారావు బ్రాహ్మడి వేషానికి అన్‌ఫిట్‌. మొదటి సినిమాలో ''వరూధిని''లో ఆయన వేసిన ప్రవరాఖ్యుడనే బ్రాహ్మణుడి వేషం వేసినా ఒక భక్తుడిలా, బ్రాహ్మడిలా ఒదిగి వుండడం ఆయనకు రాదు. ఆయన స్వభావంలో కూడా రాజసం వుంది. ఇందాకా చెప్పిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గుమ్మడిగారు ఆటోగ్రాఫ్‌ పుస్తకం తీసుకెళ్లి కనబడ్డ ఫేవరేట్‌ యాక్టర్ల వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటూ వుంటే రంగారావుగారు విసుక్కున్నార్ట - 'ఏమిటి బ్రదర్‌, మనం వాడిదగ్గరకి వెళ్లి ఆటోగ్రాఫ్‌ తీసుకోవడ మేమిటి? వాళ్లే మన దగ్గరకి వచ్చి తీసుకోవాలి.'' అన్నార్ట. ఎక్కడ ఇంటర్నేషనల్‌ సినిమా? ఎక్కడ తెలుగు ఫీల్డ్‌? వాళ్లు వచ్చి మనవాళ్ల దగ్గిర ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం కలలో కూడా ఊహించగలమా? బట్‌, రంగారావు గారంతే. హీ బిలీవ్‌డ్‌ హీ వాజ్‌ ది కింగ్‌. అందుకే అంత రాజసం వుట్టిపడింది. అలాటి రంగారావు వినయవంతుడైన బ్రాహ్మడి వేషం ఎలా వేయగలడు? భక్తపోతనలో శ్రీనాథుడు వేశారనుకోండి. కానీ శ్రీనాథుడు కూడా మామూలు బ్రాహ్మడు కాడు. భక్తి కంటె రక్తి, తామస ప్రవృత్తి ఎక్కువున్న కవి. 

....1957లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గవి - తోడికోడళ్లు సతీసావిత్రి, మాయాబజార్‌. తోడికోడళ్లులో మతిమరుపు లాయర్‌. 'వేణ్నీళ్లెందుకు పెట్టార్రా ఇంత చలిలో?' అన్న డైలాగు ఒకటి చాలు తలచుకుని తలచుకుని నవ్వుకోడానికి. తమ్ముడు మీద అపోహలు విని కాల్చేద్దామని వచ్చినవాడు అంత ఫాస్టుగానూ జావకారి పోతాడు. నిజానికి అది ఆయన స్వభావంలో వుందనుకుంటా. గుమ్మడిగారూ, ఈయనా కలిసి ఓ సారి ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లినపుడు గుమ్మడిగారు ఓ సభలో ఈయన గురించి మాట్లాడుతూ ''ఎస్వీ రంగారావు గారు తెలుగునాట పుట్టడం మన అదృష్టం, వారి దురదృష్టం. హాలీవుడ్‌లో వుండివుంటే ఆయన అంతర్జాతీయ నటుడయి వుండేవాడు.'' అన్నారు. ఇది విని రంగారావుగారు పొంగిపోయారు. ''ఇది ముఖస్తుతా? ఫీలయే చెపుతున్నారా?'' అని అడిగారట గుమ్మడిని. 'మేమంతా మీ గురించి ఇలాగే అనుకుంటామండీ. ముఖం మీద చెబితే బాగుండదని ఊరుకుంటాం గానీ' అన్నారు గుమ్మడి. 

అప్పటివరకూ ఆయనకు గుమ్మడిగారి మీద ఏదో వైమనస్యం వుండేదిట. సినిమారంగంలో చెప్పుడుమాటలు పుట్టించేవారూ, మోసేవాళ్లూ కోకొల్లలు. అందునా రంగారావుగారు రామారావుగారి క్యాంప్‌. గుమ్మడి నాగేశ్వరరావుగారి క్యాంప్‌ అనుకునేవాళ్లు. ఫిజిక్‌, స్టేచర్‌ దృష్ట్యా ఎన్టీయార్‌కి ప్రతిగా ఎస్వీయార్‌ను పెట్టేవారు. గుమ్మడి, ఎయన్నార్‌కు బాగా కుదురుతుంది. ఆపోజిట్‌ క్యాంప్‌ కాబట్టి గుమ్మడికి తనమీద తక్కువ అభిప్రాయం వుందని రంగారావుగారి ఉద్దేశం. ఈయన యిలా మాట్లాడేటప్పటికి ఈయన పొంగిపోయాడు, పసిపిల్లవాడిలాగానే. అలాగే బాపుగారు సంపూర్ణ రామాయణం తీస్తూ వుంటే ఆయన కెమెరా యాంగిల్స్‌, షాట్స్‌ చూసి ఈయన పసిపిల్లవాడిలా కేరింతలు కొట్టారుట. ఆయన అప్పటికే మద్యపానానికి బానిసై పోయాడు. నిర్మాతలకు ట్రబుల్స్‌ యిచ్చేవాడు. కానీ వీళ్ల సంపూర్ణ రామాయణంలో ఏ యిబ్బందీ పెట్టలేదు. కొంతకాలం తాగుడు మానేశారు కూడా. ''కోతికొమ్మచ్చి''లో రమణ గారు రంగారావు గురించి చాలా ఉదంతాలు రాశారు.

...1962 నాటి ''ఆత్మబంధువు''లో యజమాని-నౌకరు బంధం చక్కగా చూపించారు. ఓడలు బళ్లవడం అని వింటూంటాం. ఆ అయ్యే దశ ఎలా వుంటుందో నటించి చూపించారు రంగారావు గారు. అప్పటిదాకా ఆకాశానికి ఎత్తివేసిన కోడళ్లు డబ్బు పోగానే 'సిగరెట్లెందుకు?' అని ఎత్తి పొడిచినపుడు సిగరెట్‌ టిన్లు పారేయడం, ఆఖరికి చేతిలో సిగరెట్‌ పారేసేటప్పుడు ఒక్కసారి పొగపీల్చి పారేయడం - వాహ్‌, ఏం సీన్లవి. ముఖ్యంగా ఆ నౌకర్ని యింట్లోంచి వెళ్లిపోమంటాడు. ఆ సీను. తన తదనంతరం వాడి బతుకు ఏమవుతుందోనన్న బెంగ  కొద్దీ వాడి కాళ్ల మీద వాడు బతకాలన్న ఉద్దేశంతో ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు. ఆ నౌకరు అడుగుతాడు - 'ఇన్నాళ్లూ  కొడుకులతో సమానంగా పెంచానని అన్నావే, మరి నాకు చదువు చెప్పించావా? ఇప్పుడు బయటకు పొమ్మంటున్నావు. నాకేం పని వచ్చని? నేనెలా బతకాలని?' అని అమాయకంగానే అడుగుతాడు. 

ఇతని దగ్గర సమాధానం లేదు. తెలియకుండా చేసిన పొరబాటది. ఆ ఘట్టంలో, వాచీ అమ్మి డబ్బు తెచ్చి యిచ్చే ఘట్టంలో రంగారావు తప్ప వేరెవ్వరూ అంతబాగా చేయలేరనిపించింది. తమిళ ఒరిజినల్‌లో నౌకరు పాత్ర శివాజీగణేశన్‌ వేశారు. ఆ పాత్ర తెలుగులో ఎన్టీయార్‌ వేశారు. యజమాని పాత్ర అక్కడా యిక్కడా ఎస్వీయారే. ఆయన్ని తప్ప వేరెవరినీ ఊహించుకోలేం. 'ఎవరో ఏ వూరో పాట' ఒక్కటి చాలు థీమ్‌ మొత్తం చెప్పడానికి. ఆ పాట, దానికి రంగారావు అభినయం తలచుకుంటే చాలు యిప్పటికీ కళ్లలో నీళ్లు వస్తాయి. 

....1966 రంగారావుగారి జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. 'మొనగాళ్లకు మొనగాడు' సినిమా రిలీజయింది. ఈయనది రౌడీ పాత్ర. ఎప్పుడో చిన్నప్పుడు 15ఏళ్ల క్రితం షావుకారులో రౌడీ పాత్ర వేశారు కానీ తర్వాత అలాటి పాత్రల జోలికి వెళ్లలేదు. కానీ దీంట్లో ఫక్తు వీధి రౌడీ పాత్ర. కత్తుల రత్తయ్య అని పేరు. హీరో హరనాధ్‌ కంటె కత్తుల రత్తయ్యకే ఎక్కువ పేరు వచ్చింది. అందులో ఖవ్వాలీ కూడా పాడతాడు. 

అది హిట్‌ కావడం కొంప ముంచింది.  ఆ తర్వాత 1969లో జగత్‌ కిలాడీలు వచ్చింది. అదీ హిట్‌ అయింది. ఇక చూస్కోండి వరసగా బోల్డు సినిమాలు. ఎస్వీయారే మెయిన్‌ రోల్‌లో సినిమాలు వచ్చేశాయి. ఈయన డాన్సులు కూడా చేసేశాడు. బందిపోటు భీమన్న, జగత్‌ జట్టీలు, బస్తీ కిలాడీలు, కిలాడీ సింగన్న, దెబ్బకు ఠా దొంగల ముఠా .. యిలాటి సినిమాలు. చివరకి 'కత్తుల రత్తయ్య' పేరును కూడా ఎన్‌కాష్‌ చేసుకుందామని ఆ పేరుతో కూడా సినిమా వచ్చేసింది. అఫ్‌కోర్స్‌ కృష్ణ హీరో అనుకోండి. కానీ ఈయనది మెయిన్‌రోల్‌. నా దృష్టిలో రంగారావు గారు ఈ పాత్రల్లో శ్రుతి మించారు. మొనగాళ్లకు మొనగాడు వరకూ ఫర్వాలేదు కానీ ఆ తర్వాత్తర్వాత హుందాతనం పోయింది. విలన్‌ అన్నాక ఏవో ఊతపదాలు. 'గూట్లే' 'డోంగ్రే' లాటివి.

1966లో వచ్చిన ఇంకో సినిమా మోహినీ భస్మాసుర. అందులో ఈయన భస్మాసురుడు. పద్మిని మోహినిగా వేసింది. మెచ్చుకోదగ్గ విషయమేమిటంటే ఈయన పద్మినితో పోటీపడి నాట్యం చేశాడు. అదే ఏడాది చిలకా గోరింకలో ఈయనది మెయిన్‌ రోల్‌. జనాలు యాక్సెప్ట్‌ చేయలేదు. సినిమా ఫెయిలయింది. 1967 లో భక్త ప్రహ్లాద వచ్చింది. పిల్లల సినిమా కదా ఏం చూస్తాం అని మీరు వదిలేసివుంటే యిప్పటికైనా తప్పకుండా చూడండి. ఒక తండ్రి ఆవేదనను రంగారావు గారు ఎంతబాగా ఆవిష్కరించారో తెలుస్తుంది. అప్పటి ప్రెసిడెంటు రాధాకృష్ణన్‌గారికి కూడా ఆ పాత్రను మలిచిన విధానం, రంగారావు గారి నటనా బాగా నచ్చాయి.

...అదే సంవత్సరం 'చదరంగం' సినిమా వచ్చింది. ఆయన స్వంత సినిమా. రంగారావుగారి డైరక్టరుగా కూడా పరిచయమయ్యారు.  ఆ సినిమాకి ద్వితీయ ఉత్తమ చిత్రంగా నందీ అవార్డు గెలుచుకుంది. మరుసటి సంవత్సరం 'బాంధవ్యాలు' తీస్తే దానికి తొలి ఉత్తమ చిత్రంగా నందీ అవార్డు వచ్చింది. దానికీ ఆయనే డైరక్షన్‌. ఆయన డైరక్షన్‌లో దిగడానికి ఓ కథ వుంది.

1956, 57 ప్రాంతాల్లో నిర్మాత ఎస్‌.భావనారాయణగారు 'పెంకి పెళ్లాం' సినిమా తర్వాత యస్వీ రంగారావుగారిని ప్రధాన పాత్రగా అనుకుని సినిమా తీద్దామనుకున్నారు. 'రైప్‌నెస్‌ ఈజ్‌ ఆల్‌' అనే కథ ఆధారంగా డి.వి.నరసరాజుగారి చేత స్క్రిప్టు రాయించుకున్నారు. ఆ తర్వాత డైరక్టరును మార్చి పి.పుల్లయ్యగారిని తీసుకొచ్చారు. ఆయన 'నాలాటి పెద్ద డైరక్టరును పెట్టుకుని రంగారావుతో సినిమా తీస్తే మీకేం మిగులుతుంది?' అన్నారు. అప్పుడు ఎన్టీయార్‌తో బండరాముడు తీయించుకున్నారు. డివి నరసరాజుగారి స్క్రిప్టు ఆయన దగ్గరే వుండిపోయింది. ఇంకో పదేళ్లు గడిచాక ఎస్వీరంగారావుగారికి స్వంతంగా ఎస్‌.వి.ఆర్‌. ఫిలింస్‌ అనే బేనర్‌తో సినిమాలు తీయాలనిపించింది. అప్పటికి ఎవిఎం వారి భాగస్వామ్యంతో 'నాదీ ఆడజన్మే' తీశారు. దానికి డైలాగ్స్‌ నరసరాజుగారివే. రంగారావుగారికి నచ్చాయి. అందుచేత తన స్వంత సినిమాలకు కూడా ఈయన చేతే రాయించుకోవాలనుకున్నారు.

'సిపాయి చిన్నయ్య' కథ కన్సిడర్‌ చేశారు. కానీ నచ్చలేదు. మిగతావేవో వెతికి, వెతికి ఓ రోజు రంగారావుగారు 'అవునూ, చాలారోజుల క్రితం భావనారాయణ గారు నన్ను దృష్టిలో పెట్టుకుని మీచేత ఏదో రాయిస్తున్నానని అన్నారు. అదేమైంది?' అన్నారు. 'ఏమైంది? డైలాగ్స్‌తో సహా రాసిన స్క్రిప్టు నాదగ్గరే వుంది'' అన్నారు నరసరాజు గారు. వెంటనే తెప్పించుకుని చదివి బ్రహ్మానందపడిపోయారు. 'ఇంత మంచి స్క్రిప్టు పెట్టుకుని నెల రోజుల్నించి నా ప్రాణాలు తీస్తున్నారు కదండీ' అని 'దీన్ని ఇంకొకరి చేతిలో పెట్టడం నా కిష్టం లేదు. పిక్చరు నేనే డైరక్టు చేస్తాను.'' అని నిర్ణయం చేశారు. డైరక్టరుగా శభాషనిపించుకున్నారు కూడా. రెండో సినిమా 'బాంధవ్యాలు'కు ఆయన వేసిన ఓ తమిళ సినిమా కథ ఆధారం. డైలాగ్స్‌ నరసరాజుగారివి. డైరక్షన్‌ రంగారావుగారిది.

1972 లో వచ్చిన పండంటి కాపురంలో పెద్దన్నగారిగా మరపురాని పాత్ర.  'బాబూ వినరా' పాట ఆయనమీద చిత్రీకరించినదే.  ముఖ్యంగా చిన్నపిల్లాడు చచ్చిపోయినప్పుడు అతని సమాధిమీద మట్టి పోస్తూ చెప్పిన డైలాగులు మనసును కలచివేస్తాయి. 1973 సినిమా తాతా-మనవడు. టైటిల్‌రోల్లో సగం. మిగతా సగం రాజ్‌బాబు. దాసరి నారాయణరావుగారి తొలి సినిమా. సినిమాను నిలబెట్టినది రంగారావు గారే! బాధపడుతూనే విసిరే విసుర్లు జీవిత సత్యాలవి. స్టార్‌ వాల్యూ లేని సినిమాలు కూడా ఆడతాయని నిరూపించిన సినిమా అది. ఇంత సెంటిమెంటల్‌ రోల్‌ వేస్తున్న అదే సమయంలో  డబ్బుకు లోకం దాసోహం సినిమాలో నాగభూషణం టైపు విలన్‌ పాత్ర వేశారు. నాగభూషణంతో బాటు కలిసి వేసిన సినిమా అందరూ దొంగలే 1974లో వచ్చింది. హిందీలో విక్టోరియా 203లో అశోక్‌కుమార్‌, ప్రాణ్‌ వేసిన పాత్రలను వీళ్లు తెలుగులో అంతకంటె అమోఘంగా వేసిపడేశారు. ''యశోదా కృష్ణ'' (1975) ఆఖరి చిత్రమైంది. 

ఇలా చెప్పుకుంటూపోతే అంతేలేదు. కానీ జీవితానికి అంతం వుంటుందికదా. 1974లో తన 56 వ యేట ఆయన పోయారు. ఆయన గురించి చెప్పిన ప్రతివాళ్లు ఆయన మద్యపానం గురించి తప్పక చెప్తారు. చాలామందికి ఆ అలవాటు ఉంటుంది. అయితే యీయన తాగి షూటింగుకు రాకపోవడం, షూటింగుకు తాగి రావడం వంటి అన్‌ప్రొఫెషనల్‌ పనులు చేశారు కాబట్టి అలా పేరు బడ్డారు. కారణాలు ఏమైనా వృత్తి పట్ల నిబద్ధత ఉన్నవాళ్లు చేయవలసిన పని కాదది. ఆయన గురించి తలచుకున్నప్పుడు మనసులో కలుక్కుమనిపించే విషయమది. ఆయన అన్ని రకాల పాత్రలూ ధరించారు. ధరించిన ప్రతి పాత్రలోనూ జీవం నింపారు. తన ముద్ర కొట్టారు. పసిబాలుడి వంటి ఆయన స్వభావం గురించి చెపుతూ బాపురమణలు ...'స్వభావానికి ఉంగా రంగారావు..' అన్నారు.   రాజీ పడకుండా దర్జాగా జీవించి, దర్జా అయిన పాత్రలు వేసి దర్జాన్నరగా వెళ్లిపోయారు. 

ఇదే మీ అందరి తరఫునా ఆయనకు నా నివాళి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018)
mbsprasad@gmail.com

 


×