Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: తాతినేని రామారావు

ఎమ్బీయస్: తాతినేని రామారావు

గత నెలలో దర్శకులు తాతినేని రామారావుగారు మరణించారు. తెలుగులో 35, హిందీలో 35 మొత్తం 70 సినిమాలు డైరక్ట్ చేశారు. లక్ష్మీ ప్రొడక్షన్స్‌తో కలిసి కొన్ని సినిమాలు తీశారు. తమిళంలో 6 సినిమాలు సమర్పించారు. డైరక్టు చేసిన వాటిలో అనేక సినిమాలు విజయవంతం అయ్యాయి కూడా. అయినా గొప్ప దర్శకులలో ఆయన పేరు చెప్పరు. సినిమాల్లో అధికాంశం రీమేకులు కాబట్టి సొంత ప్రతిభ లేదనే భావం విమర్శకుల్లో ఉందేమో! కానీ రీమేకూ అంత యీజీ ఏమీ కాదు. మూలం చెడకుండా, ఏ భాషలో తీస్తున్నామో దాని ఫ్లేవర్ తీసుకురావాలి. పైగా ఆయన వ్యవహరించిన వాళ్లందరూ పెద్ద స్టార్లు. సరిగ్గా తీయలేకపోతే మంచి పేరు రాకపోగా చెడ్డపేరు వస్తుంది. తెలుగులో నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, శోభనబాబులతో, హిందీలో ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, సన్నీ దేవల్, అనిల్ కపూర్, గోవింద వంటి వారితో సినిమాలు తీసిన ఘనుడాయన. కానీ ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి కానీ, ఫలానా సీనులో వేరెవరూ చూపని విధంగా ఆయన షాటు తీశాడని కానీ ఏ వ్యాసమూ చదివిన గుర్తు లేదు.

నాకు మాత్రం ఆయన సినిమాల్లో ‘‘జీవన తరంగాలు’’ బెస్టు అనిపిస్తుంది. యద్దనపూడి రాసిన ఒక పెద్ద నవలను అంత చిక్కగా, చక్కగా తీయడం గొప్ప! యద్దనపూడి రాసిన మరో నవల ‘‘మీనా’’ను దర్శకత్వం వహించిన విజయనిర్మలకు వచ్చిన పేరులో సగం కూడా యీయనకు రాలేదు. నిజానికి రెండూ అద్భుతంగా ఉంటాయి. అలాగే తాతినేనిది ‘‘యమగోల’’ కూడా అన్ని హంగులూ ఉన్న గొప్ప సినిమా. మూలం ‘‘దేవాంతకుడు’’ కావచ్చు, దాన్ని ఎంతో మార్చి డివి నరసరాజుగారు అద్భుతమైన స్క్రిప్టు యిచ్చి ఉండవచ్చు కానీ, దాన్ని మంచి కమ్మర్షయల్ సినిమాగా యీయన మలిచాడు కదా! నటీనటులందరి వద్దా చక్కటి అభినయాన్ని రాబట్టాడు కదా! దాని గురించైనా ప్రశంసించవచ్చు కదా! కానీ తాతినేని రామారావుగారికి అలాటి చింతేమీ లేదు. ‘‘సురభి’’ పత్రిక 2016 నవంబరు సంచికకు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘నాది శక్తికి మించిన అదృష్టం’’ అని చెప్పుకున్నారు. ఆ వినయమే ఆయనకు ఏ స్టారుతోనూ, నిర్మాతతోనూ యిబ్బంది రాకుండా చూసింది.

సినీవారసత్వమనేది మనం నటులు విషయంలోనే పట్టిపట్టి చూస్తాం. ఇతర విభాగాల్లో చూడం. తాతినేని దర్శకుడైనది కుటుంబ నేపథ్యంతోనే! ఆ విషయం ఆయన ఆ యింటర్వ్యూలో స్పష్టంగా చెప్పుకున్నాడు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో తాతినేని వారు 200 కుటుంబాలుంటే వాళ్లు సౌకర్యార్థం 7 కుదుళ్లుగా విడిపోయారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు కుటుంబం, రామారావు కుటుంబం ఒకే కుదురులోకి వచ్చాయి. ప్రకాశరావు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా తిరిగి, పార్టీపై నిషేధం కారణంగా అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాల్సి వచ్చింది. చెన్నయ్ వెళితే ఎల్వీ ప్రసాద్ గారు ప్రకాశరావుగారిని తనింట్లో పెట్టుకుని, ‘‘షావుకారు’’ సినిమాకు అసిస్టెంటుగా పని యిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన దివిసీమ వాసులు కొందరు ‘‘పల్లెటూరు’’ (1952) సినిమాతో ప్రకాశరావుకి దర్శకత్వం ఛాన్సిచ్చారు. తర్వాత ఆయన పెద్ద దర్శకుడై 15 తెలుగు సినిమాలు, 12 తమిళ సినిమాలు, 15 హిందీ సినిమాలు తీశాడు. అత్యంత ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.

1938లో పుట్టిన తాతినేని రామారావు హైస్కూలు చదువు పూర్తయ్యాక, పాలిటెక్నిక్‌కై ప్రయత్నించి సీటు రాకపోవడంతో ఊళ్లో ఖాళీగా ఉన్నారు. మానికొండలో ఒక పెళ్లికి వచ్చిన ప్రకాశరావుగారిని యీయన నాన్నగారు కలిసి మావాడు ఖాళీగా ఉన్నాడని చెపితే మద్రాసు పంపించు అన్నారాయన. మ్యూజిక్ డైరక్టరు తాతినేని చలపతిరావు, రామారావుకి అన్నయ్య వరస. ఆయన యింట్లో బస చేసి, మర్నాడు ప్రకాశరావు వద్దకు వెళితే ‘‘నా దగ్గర అసిస్టెంటుగా తీసుకుందామంటే ఓ తమిళ సినిమాకు చేస్తున్నాను. ఈలోగా నువ్వు ఎచ్ ఎం రెడ్డిగారి కంపెనీలో చేరు.’’ అన్నారు. అప్పుడాయన ఎన్టీయార్ హీరోగా సినిమా తీస్తున్నాడు. తెలుగుకి బివి ప్రసాద్ సీనియర్ సహకార దర్శకుడు. ఈయన ఆయనకు అసిస్టెంటు.

వీళ్ల బంధువే అయిన ఎవి సుబ్బారావు అనే ఆయన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ (పిఎపి) అనే సంస్థ పెట్టి ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో ‘‘పెంపుడు కొడుకు’’ (1953) సినిమా తీశారు. ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత ప్రకాశరావు దర్శకత్వంలో ‘‘ఇల్లరికం’’ (1959) సినిమాకై 1957లో ప్లాను చేశారు. ఆ సినిమాకు ప్రత్యగాత్మ అసిస్టెంటు. ఈయనా వీళ్ల బంధువే. ప్రకాశరావు సోదరికి ప్రత్యగాత్మ సోదరుడు కె హేమాంబరధరరావు భర్త. రామారావు ప్రత్యగాత్మకు అసిస్టెంటు. ప్రత్యగాత్మ స్వయంగా మంచి రచయిత. రామారావుకి కథను ఎలా రూపొందించాలో చెప్తూ ఉండేవారు. ‘‘ఇల్లరికం’’ షూటింగు మొదటి రోజునే హీరో నాగేశ్వరరావు కాలికి గాయమైంది. దాంతో షూటింగు రెండు నెలలు వాయిదా పడింది. ఈలోగా ప్రకాశరావు దర్శకత్వంలో శివాజీ ద్విపాత్రాభినయం చేసిన ‘‘ఉత్తమపుత్రన్’’ (1958) తమిళంలో సూపర్ హిట్ అయింది. దాన్ని పిఎపి వాళ్లు తెలుగులో ‘‘వీర ప్రతాప్’’గా డబ్ చేయడానికి నిశ్చయించారు. ప్రత్యగాత్మకు ఆ పని అప్పగించి, నెలకు వంద రూపాయల జీతం మీద రామారావుని అసిస్టెంటుగా చేయమన్నారు. అది హిట్ అయింది.

‘‘ఇల్లరికం’’ కూడా హిట్టే. పిఎపి వాళ్లు తర్వాతి సినిమాగా ‘‘భార్యాభర్తలు’’ (1961) ప్లాను చేసి ప్రత్యగాత్మకు డైరక్టురుగా ఛాన్సిచ్చారు. ఈయన్ని సీనియర్ అసిస్టెంటు చేశారు. ఆ తర్వాత పిఎపి వాళ్లు వరుసగా ‘‘కులగోత్రాలు’’ (1962), ‘‘పునర్జన్మ’’ (1963), ‘‘మనుషులు మమతలు’’ (1965) సినిమాలు ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే తీశారు. ఈయన అసిస్టెంటు డైరక్టరు. పిఎపికి చేస్తూనే ప్రత్యగాత్మ, ఈయనా ‘‘మంచిమనిషి’’ (1964) సినిమాకు పనిచేశారు. ఇంతలో పిఎపి వాళ్లకు సావిత్రి నుండి ఒక ఆఫర్ వచ్చింది. ‘నేనూ, శివాజీగణేశన్ కలిసి వేసిన తమిళ ‘‘నవరాత్రి’’ (1964) హిట్ అయింది. దాని రీమేక్ హక్కులు నేను తీసుకున్నాను. దాన్ని మనిద్దరం కలిసి ‘పిఎపి అండ్ విజయచాముండేశ్వరి ఫిలింస్’ పేర నాగేశ్వరరావుగారితో తీద్దాం’ అన్నారావిడ. రామారావుతో ‘ఆ సినిమాను నువ్వు డైరక్టు చేయవయ్యా’ అన్నారు పిఎపి సుబ్బారావు.

అలా రీమేకు సినిమాతో ప్రారంభమైన రామారావు కెరియర్ రీమేకులతోనే సాగిపోయింది. మొదటి రోజు షూటింగు అనుభవం గురించి రామారావు చెప్తూ ‘దానిలో హీరో తొమ్మిది పాత్రలు వేస్తాడు. నాగేశ్వరరావుగారు మా కుటుంబానికి సన్నిహితులు. జైహింద్ సత్యం గారమ్మాయితో నా పెళ్లి కావడానికి అన్నపూర్ణగారే కారణం. ఆ చనువుతో ఓ సీనులో శివాజీ మిలటరీ మనిషిగా చేసిన సీను బాగుందని బెరుగ్గానే ఆయనతో అన్నాను. ఆయనకు చర్రున కోపం వచ్చింది. ఒక్కో నటుడికి ఒక్కో ఒడుపు ఉఁటుంది అన్నారు. నేనింకేమీ మాట్లాడలేదు.’ అన్నారు. సినిమా తమిళమంత హిట్ కాకపోయినా బాగానే ఆడింది.  ఆ తర్వాతి సినిమా పిఎపి వాళ్లే గుహనాథన్ కథతో నాగేశ్వరరావు, జయలలిత హీరోహీరోయిన్లగా‘‘బ్రహ్మచారి’’ (1968) తీశారు. ఇది మంచి కామెడీ. సెంటిమెంటు కూడా ఉంది. దీన్ని ప్రత్యగాత్మ హిందీలో ‘‘ఏక్ నారీ, ఏక్ బ్రహ్మచారీ’’గా తీశారు.

తర్వాత వచ్చిన ఆఫర్ మధు పిక్చర్స్ నుంచి! ఎవిఎం వారు తీసిన ‘‘పందియమ్’’ను కృష్ణ, శోభన్‌బాబులతో ‘‘మంచి మిత్రులు’’గా తీశారు. నాగేశ్వరరావుతోనే ‘‘సుపుత్రుడు’’ (1971), ‘‘రైతు కుటుంబం’’ (1972) వచ్చాక ‘‘భార్యాబిడ్డలు’’ (1972) కూడా వచ్చింది. ‘‘బతుకుతెరువు’’ అని తను తెలుగులో తీసిన సినిమాను ఎల్వీ ప్రసాద్ ‘‘జీనేకీ రాహ్’’ (1969)గా హిందీలో రీమేక్ చేస్తే దాన్ని మళ్లీ తెలుగులోకి పిఎపి వాళ్లు తీసిన సినిమా అది. ఈయనదే డైరక్షన్. దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌కై శోభన్‌బాబుతో ‘‘జీవనతరంగాలు’’ (1973) తీశారు. దాని హిందీ రీమేక్ ‘‘దిల్ ఔర్ దీవార్’’ డైరక్షన్ బాపయ్య  చేశారు. ఎన్టీయార్‌తో తొలిసారి ‘‘యమగోల’’ (1977) తీసి సూపర్ హిట్ కొట్టారు. దాని హిందీ వెర్షన్ ‘‘లోక్ పర్‌లోక్’’ (1979) కూడా యీయనే తీశారు.

అలాగే తెలుగులో తను తీసిన ‘‘ఆలుమగలు’’ను హిందీలో ‘‘జుదాయి’’గా తీశారు. ఇలా తనవే కాకుండా యితరులు తీసిన ‘‘కార్తీకదీపం’’, ‘‘సత్యభామ’’ ‘‘అంతులేని కథ’’, ‘‘న్యాయం కావాలి’’, ‘‘ముగ్గురు మొనగాళ్లు’’, ‘‘నేటి భారతం’’, ‘‘ముక్కుపుడక’’, ‘‘దీర్ఘ సుమంగళి’’, ‘‘ముగ్గురు మిత్రులు’’, ‘‘మయూరి’’, ‘‘సంసారం ఒక చదరంగం’’, ‘‘గురుశిష్యులు’’, ‘‘బలరామకృష్ణులు’’, ‘‘పెదరాయుడు’’, ‘‘నాయనమ్మ’’ ...యిలా అనేక సినిమాలు హిందీలో తీశారు. తెలుగువే కాకుండా కన్నడ, తమిళ సినిమాలు ‘చట్టం ఎన్ కైయిల్’’, చట్టం ఒరు ఇరుత్తరై’’, ‘‘నీతిక్కు దండనై’’, ‘‘పులన్ విచారణై’’, ‘‘తాయిగే తక్క మగ’’, ‘‘చక్రవ్యూహ’’ .. లాటివి కూడా హిందీలో తీశారు. హిందీలో వచ్చిన ‘‘ఆశా’’ను తెలుగులో ‘‘అనురాగ దేవత’’గా, ‘‘ప్యార్ ఝుక్‌తా నహీఁ’’ను ‘‘పచ్చని కాపురం’’గా తీశారు. గత ఇరవై ఏళ్లగా ఆయన ప్రభ తగ్గింది. సినిమాలు మానేసి, ఫ్లెక్సిబుల్ హోసెస్ వ్యాపారంలోకి దిగారు.

నేను మద్రాసు బ్రాంచిలో పనిచేసేటప్పుడు భమిడిపాటి రాధాకృష్ణగారింటికి వెళ్లి కబుర్లు వింటూండేవాణ్ని. ఈయన అక్కడకు వచ్చేవారు. ‘‘బ్రహ్మచారి’’కి సంభాషణలు రాసినప్పటి నుంచి భమిడిపాటితో ఆయనకు స్నేహం. మూడు నాలుగు సార్లు కలిశాను. ఏ భేషజమూ లేకుండా, సింపుల్‌గా ఉండేవారు. ‘‘నాకు బొత్తిగా పుస్తకాలు చదివే అలవాటు లేదు.’’ అని ఆయన తన యింటర్వ్యూలో చెప్పుకున్నారు. భమిడిపాటి కూడా అదే చెప్పారు. ‘అయితే రచయితకు చాలా మర్యాద యిస్తారు. వాళ్లు చెప్పినది ఫాలో అవుతారు. అందుకే అంత సక్సెస్.’’ అని కూడా చెప్పారు. వివాదరహితుడు రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?