Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: తబస్సుమ్ ఇంటర్వ్యూలు

 ఎమ్బీయస్‍: తబస్సుమ్ ఇంటర్వ్యూలు

2022 నవంబరులో మృతి చెందిన తబస్సుమ్ అనే హిందీ నటి గురించి యీ వ్యాసం. మరి శీర్షికలోనే యింటర్వ్యూల గురించి ప్రస్తావించారేమిటి? అనే సందేహం రావచ్చు. తబస్సుమ్‌కు నటిగా పెద్ద పేరు రాలేదు. నా తరం వాళ్లలోనే చాలామందికి తబస్సుమ్ నటించిన సినిమాల పేర్లు గుర్తుకు రావు. కానీ దూరదర్శన్‌ వారి ‘ఫూల్ ఖిలే హైఁ గుల్షన్ గుల్షన్’ కార్యక్రమంలో యింటర్వ్యూయర్‌గా ఆమె గుర్తుంటుంది. ఆమె గురించి, ఆమె చేసిన ఆ కార్యక్రమం గురించి తెలియని వాళ్లకు యింటర్వ్యూలు చేసే కళ ఎలా ఉండాలో చెప్పడానికి యీ వ్యాసం రాస్తున్నాను. అందువలన నటిగా ఆమె గురించి తక్కువగా రాసి, యీనాడు వస్తున్న యింటర్వ్యూల తీరుతెన్నులపై వ్యాఖ్యానించడానికి దీన్ని ఉపయోగించు కుంటున్నాను.

గతంలో పత్రికల్లో, టీవీల్లో జర్నలిస్టులు మాత్రమే యింటర్వ్యూలు చేసేవారు. ఒక్కోప్పుడు ఒక రంగంలోని ప్రఖ్యాతుణ్ని, అదే రంగంలోని మరో ప్రఖ్యాతుడి చేత యింటర్వ్యూ చేయించేవారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక ఎవరైనా సరే, ఎవరినైనా సరే యింటర్వ్యూ చేసేస్తున్నారు. ఏవో కొన్ని బాగుంటున్నాయి తప్ప, చాలా భాగం విసుగు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే యింటర్వ్యూ యివ్వడం, చేయడం రెండూ సామాన్యమైన విషయాలు కాదు. ముందుగా యివ్వడం గురించి చెప్పాలంటే, విద్వత్తు ఉండడం వేరు, దాన్ని ప్రదర్శించడం వేరు, భావాలు ఉండడం వేరు, వాటిని వ్యక్తీకరించడం వేరు. ప్రశ్న వేయగానే తనకు తెలిసినదంతా చెప్పాలని చూడకూడదు. ఎందుకంటే చదివే పాఠకుడికి లేదా చూసే ప్రేక్షకుడికి ఏ మేరకు యింట్రస్టు ఉంటుందో తెలియదు. ప్రేక్షకుడి సంగతి తర్వాత, అసలు యింటర్వ్యూ చేసేవాడికి ఎంత కావాలో తెలియదు. అందుకని క్లుప్తంగానే చెప్పాలి. ఆ చెప్పడంలో కూడా పృచ్ఛకుడికి సప్లిమెంటరీ ప్రశ్న వేసే అవకాశం యిచ్చేలా ఆపాలి.

పృచ్ఛకుడు మీ నేపథ్యం చెప్పండి అనగానే సోది చెప్పకూడదు. ప్రేక్షకుడికి మీ సొంత ఊరు, అమ్మానాన్నల పేర్లు, పాఠాలు చెప్పిన అయ్యవార్ల పేర్లు అన్నీ అనవసరం. మీరు ఫలానా ఊళ్లో పుట్టారని తెలిస్తే మీ ఊరివాళ్లు గొప్పగా చెప్పుకుంటారేమో కానీ తక్కినవాళ్లకు తేడా ఏమీ పడదు. అక్కినేని కృష్ణా జిల్లాలో పుట్టినా, గుంటూరు జిల్లాలో పుట్టినా, వాళ్ల పూర్వీకులు విజయనగరం నుంచి వలస వచ్చినా, హౌ డజ్ యిట్ మేటర్? ఆయన గొప్ప నటుడు, దట్సాల్. ఆ మేరకే టిక్కెట్ కొనుక్కునే సినిమా ప్రేక్షకుడు పట్టించుకునేది. మన తెలుగు సినిమా విలన్లలో ప్రదీప్ రావత్, అశీష్ విద్యార్థి, సయాజీ షిండే వగైరాలు ఏ రాష్ట్రం వాళ్లో మనమెప్పుడైనా పట్టించుకున్నామా?

అంతేకాదు, యింటర్వ్యూలో ‘చిన్నపుడు నేను చాలా కష్టపడ్డాను. ఎంతో ప్రాక్టీసు చేశాను...’ వగైరాలు కూడా బోరే. సాధన లేనిదే నువ్వు యింతవాడివి అయ్యావు తప్ప కాళికాదేవి నీ నాలుక మీద బీజాక్షరాలు రాసిందని యీ కాలంలో ఎవడూ నమ్మడు. ఇక ‘ఒక దశలో నేను ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాను..’ వంటి డైలాగులు ఎప్పుడో ముప్ఫయి ఏళ్ల క్రితం ఆసక్తిగా చదివేవాణ్ని తప్ప దాన్ని ప్రతీవాడూ వాడడంతో నవ్వేసి ఊరుకుంటున్నాను. ఇక సినిమా రంగంలో సీనియర్లను తప్పనిసరిగా అడిగే ప్రశ్న ఉంటుంది – ‘ఆ తరం నటీనటులకు, యీ తరం నటీనటులకు మీరు గమనిస్తున్న తేడా ఏమిటి?’ అని. దీనికి – ‘అప్పటివాళ్లలో వృత్తి పట్ల నిబద్ధత ఉండేది, యిప్పటివాళ్లలో అది కానరాదు’ అని జవాబు వచ్చిందంటే దాని అర్థం సదరు నటి లేదా నటుడికి వేషాలు లేవన్నమాట. ‘అప్పట్లో మాకు ఏమీ తెలిసేది కాదు, పని చేస్తూ కష్టపడి నేర్చుకునేవాళ్లం. ఇప్పటివాళ్లు అన్నీ తెలుసుకుని వస్తున్నారు. సాంకేతికత కూడా పెరిగింది. చేసినదాన్ని యింప్రొవైజ్ చేసుకునే సౌకర్యం ఉంది, దాన్ని చక్కగా వినియోగించు కుంటున్నారు.’ అని లౌక్యంగా చెపితే వేషాలు యింకా వస్తున్నాయన్నమాట.

ఏ రంగానికి చెందినవారైనా సరే ‘ఈ రంగంలోకి వద్దామనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్న వేయగానే ‘ఈ రంగంపై యిష్టంతో రండి, కష్టపడి పనిచేయండి, శీఘ్రఫలితాలను ఆశించకండి’ అనే సమాధానం కూడా వినివిని విసుగు పుట్టింది. సలహాలు చెపితే యింట్లో భార్య లేదా భర్త, పిల్లలు కూడా వినటం లేదు. ఇక బయటివాళ్లు ఏ మేరకు వింటారు? ఒక పారిశ్రామికవేత్త యిలాటి సమాధానం యిచ్చినపుడు ఆ రంగంలోకి వద్దామనుకుంటున్న ఔత్సాహికుడు ‘సలహాల కేమొచ్చె గానీ, మీ దగ్గరకు ఏదైనా ప్రపోజల్‌తో వస్తే ఉద్యోగం యిస్తారా? పెట్టుబడి పెడతారా? అది చెప్పండి చూదాం’ అనుకుంటాడు మనసులో. గుళికల్లాటి యిలాటి సలహాలు, ఉపదేశాల కంటె వాళ్ల జీవితంలో జరిగిన ఉదంతాలు చెపితే ప్రేక్షకుడు తనంతట తానే ఏం చేయాలో తెలుసుకుంటాడని నా భావన. ఆ ఉదంతాల్లో వాస్తవం ఉంటుంది, కథనం ఉంటుంది, మెలోడ్రామా ఉంటుంది.

అయితే ఆ ఉదంతాన్ని ఉత్తేజకరంగా చెప్పే కళ యీ ప్రముఖుడికి ఉండాలి. మాట్లాడే నేర్పు సులభంగా పట్టుబడదు. ఎంత సైంటిస్టయినా, పారిశ్రామికవేత్తయినా, ఆర్థికవేత్తయినా, రచయిత ఐనా, సినిమా దర్శకుడైనా, తన రంగంలో నిష్ణాతుడయితే కావచ్చు కానీ ఆకట్టుకునేలా మాట్లాడడమనేది అభ్యాసం వల్లనే అబ్బుతుంది. సినిమా నటులు తెరపై అనర్గళంగా డైలాగులు చెప్తారు కానీ బయటి సభల్లో మాట్లాడాలంటే తడబడతారు. మా ‘‘హాసం క్లబ్’’లో అనేకమంది హాస్యనటుల్ని సన్మానించాం. చాలామందికి వేదికపై మాట్లాడడం రాలేదు. సభకు వచ్చినవారు నిరుత్సాహపడేవారు.

అనేకమంది మాటల కోసం తడుముకుంటారు. ఆలోచనాస్రవంతికి ఒక దారిని ముందే ఊహించి పెట్టుకోకపోతే ఎక్కడో మొదలుపెట్టి, దారి తప్పి వేరే సబ్జక్ట్‌కి వెళ్లిపోతారు. కొందరు గంభీరపదాలతో ఆరంభించి మధ్యలో మాటలు దొరక్క తేలిక పదాలతో తేల్చేస్తారు. పెద్ద వాక్యంతో ప్రారంభించి, మధ్యలో విభక్తి ప్రత్యయాలను గందరగోళ పరచి, కర్త, కర్మలను కలగాపులగం చేసి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లలోకి మారిపోతూ చివరకు ఎలాగోలా వాక్యం ముగించి చప్పట్ల కోసం ఎదురు చూస్తారు. శ్రోత బిక్కమొహం వేసుకుని ఉండడం చూసి చిన్నబోతారు. టీవీ యింటర్వ్యూలలో ప్రధానంగా విసిగించే అంశం, వక్త ఇంగ్లీషు లేన్ లోంచి, తెలుగు లేన్‌లోకి వెళ్లి, అక్కడ మాట దొరక్క మళ్లీ యింగ్లీషు లేన్‌కి వచ్చేసి మాట్లాడుతూండడం. రోడ్డు మీద ఆ తీరుగా వెళ్లే వాహనాన్ని చూసి ఎంతో కోపం వస్తుందో, వీళ్లని చూసినా అంతే కోపం వస్తుంది.

ఇలాటి యిబ్బందులు ఏవీ లేకుండా చక్కగా మాట్లాడే వక్త దొరికినా, ఆయన చేత ఆ ఉదంతం చెప్పించే నేర్పు యింటర్వ్యూ చేసేవారికి ఉండాలి. దాని కోసం వక్త జీవితం గురించి, అనుభవాల గురించి అతను ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. శ్రోతంత ఫ్రెష్‌గా అతనూ ఉంటే కార్యక్రమం మటాషే. నిజానికి వాళ్లిద్దరూ కలిసి మన కోసం నిర్వహించే జాయింటు కార్యక్రమం అది. దానికై ముందుగా చాలా కసరత్తు జరగాలి. వక్త గురించి అన్ని వివరాలూ తెలుసుకున్నాక, వాటిలో గతంలోనే మీడియాలో వచ్చేసినవేమిటో వాటిని పరిహరించి, వక్తతో ముందుగా మాట్లాడి, ఆయనపై వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు చదివి, ఆయన జీవితాన్ని మథించి, యీయనలో కొత్తకోణమేదైనా చూపగలమా అని ఆలోచించాలి.

ఎదురుచూడని ప్రశ్న కానీ, కోణం కానీ వచ్చినపుడే వక్తకు ఉత్సాహం వస్తుంది. ఆయన చెప్పిన వివరాలు నోట్ చేసుకుని వాటిలో శ్రోతకు ఏవి ఆసక్తికరమో పృచ్ఛకుడు ఎంచుకుని, ఫలానా ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానంగా ఫలానా అనుభవం చెపితే, దానిపై మరో ప్రశ్న వేసి, యింకో ఉదంతం చెప్పడానికి ఛాన్సిస్తాను అని ఒక బ్లూప్రింట్ యివ్వాలి. డైలాగులు రాసివ్వనక్కరలేదు కానీ ఏ ప్రశ్న తర్వాత ఏది వస్తుందో యిద్దరికీ ఒక ఐడియా ఉండాలి. అప్పుడే ప్రోగ్రాం రక్తి కడుతుంది.

ఎంత బాగా ప్లాన్ చేసినా, మాట్లాడేటప్పుడు కాస్త హమ్మింగ్ అండ్ హాయింగ్ తప్పదు. అంటే అడిగినదానికి త్వరగా సమాధానం చెప్పకుండా ఆచితూచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఆఁ, ఊఁ అని సాగదీస్తూ, ‘వీళ్ల నోట్లోంచి మాట ఎప్పుడు ఊడిపడుతుందా’ అని శ్రోతలు ఎదురు చూసేట్లు చేయడమన్నమాట. ప్రముఖులలో చాలామందికి యీ రోగం ఉంది. లైవ్‌లో ప్రోగ్రాం పెడితే యీ బాధ తప్పదు. అందుకని ఎడిట్ చేసి బ్రాడ్‌కాస్ట్ (అప్‌లోడ్) చేయడమో మంచిది. ఎడిటింగు టైములోనే అనవసర విషయాలు, సాగతీతలు, పునరుక్తులు తీసిపారేయాలి.

ఇవన్నీ ఎప్పణ్నుంచో అందరికీ తెలిసున్నవే. కానీ యీ మధ్య యూ ట్యూబులు, వెబ్ టీవీ ఛానెల్స్ వచ్చాక, యీ సూత్రాలు పాటించడం మానేశారు. హోం వర్క్ చేయడానికి పృచ్ఛకులకు టైము లేదు. పలు రంగాల వాళ్లని వారానికి రెండు, మూడు యింటర్వ్యూలు చేయాలి కాబోలు. ఎన్ని రంగాల్లో వీళ్లకు ప్రావీణ్యత లేదా ప్రవేశం ఉంటుంది? అందుకని అవతలివాళ్ల గురించి పెద్దగా తెలుసుకోకుండానే మైకు పట్టుకుని బయలుదేరుతున్నారు. ఏమడగాలో తెలియక, ఎక్కడ పుట్టారు? ఈ రంగంలోకి ఎలా వచ్చారు? కొత్తవాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి? యువతరానికి మీ సలహా ఏమిటి? వంటి సాధారణ ప్రశ్నలు వేసి, సిలబస్ అయిపోయిందనిపించి చప్పట్లు కొట్టించేస్తున్నారు. ఎల్ విజయలక్ష్మి, వెన్నిరాడై నిర్మల వంటి ముందుతరం ఆర్టిస్టులను యింటర్వ్యూ చేసినవాళ్లు ఎంత రసహీనంగా చేశారో చూశాను.

పెద్దవాళ్లవుతున్న కొద్దీ ప్రముఖులకు మతిమరుపు వస్తుంది. పృచ్ఛకుడు వాళ్లకు మాట అందించే స్థితిలో ఉండాలి. దాని కోసం తెలుసుకుని వెళ్లాలి. అదేమీ జరగటం లేదు. తట్ట తగలేసినట్లు ఏదోలా కార్యక్రమం ముగించడం సరే, ఆ వీడియోకు అసందర్భమైన థంబ్‌నెయిల్ పెట్టి వినువీధులకు ఎక్కించేస్తున్నారు. ‘చిరంజీవి గురించి వెన్నిరాడై నిర్మల ఏమందో వింటే మీరు షాకవుతారు...’ వంటి కాప్షన్ ఏదో పెడతారు. చచ్చీచెడి వీడియో చూస్తే ఆవిడ ‘ఏమోనండి, ఆయనతో నటించినట్లే గుర్తు లేదు’ అని అన్నా ఆశ్చర్యపడనక్కరలేదు. థంబ్‌నెయిల్స్ గురించి అందరూ తిట్టుకుంటూనే ఉన్నారు, మళ్లీ వాటి వలలో పడుతూనే ఉన్నారు. వ్యూయర్‌షిప్ పెరిగి, యాడ్స్ వస్తూంటాయి కాబట్టి వాళ్లు యిలాటి అడ్డదారులు తొక్కడం నానాటికీ పెరిగిపోతోంది.

ఇంటర్వ్యూల గురించి యింత రాశాను కాబట్టి, నా అనుభవాలు కాస్త రాస్తాను. నేను మద్రాసులో ఉండగా మిత్రులు, బహురంగాల్లో నిష్ణాతుడు ఐన విఎకె రంగారావు గార్ని యింటర్వ్యూ చేశాను. దాని కోసం మూడు సార్లు వాళ్లింటికి వెళ్లి, ఒక్కోసారి మూడేసి గంటలు కూర్చుని ఏమేమి అడగాలి అని ప్రాక్టీసు చేసుకుని చివరకు చేశాను. అది 1996లో అనుకుంటా ‘‘వార్త’’లో ఫుల్‌పేజీ యింటర్వ్యూ వచ్చింది. చాలామంది మెచ్చుకున్నారు. ‘నన్ను చాలామంది యింటర్వ్యూ చేశారు కానీ ప్రసాద్ చేసినది బాగా వచ్చింది’ అని రంగారావు ఐదారేళ్ల క్రితం కూడా ఒక అభిమానితో చెప్పారు. రంగారావు గారి వంటి చండప్రచండ విమర్శకుడి నుంచి అలాటి ప్రశంస పొందడం గొప్పే.

వ(ర)ల్డ్ స్పేస్‌ శాటిలైట్ రేడియోలో ఆర్‌జెగా ఉండగా బాపుగార్ని యింటర్వ్యూ చేయమని నిర్వాహకురాలు గీతగారు అడిగారు. చేయనన్నాను. అంతకు పదేళ్ల క్రితమే బాపు గార్ని ప్రశ్నావళి ద్వారా లిఖితపూర్వకమైన యింటర్వ్యూ చేశాను. ఆయన ఏమీ చెప్పరు. నాకు బొమ్మలు వేయడం పెద్దగా రాదండీ అంటారు, సినిమాలో యిలా తీయాలని ఎలా తోచింది అని అడిగితే ‘అంతా రమణ గారి గొప్పేనండి, ఆయన రాసిచ్చినది నేను తీశాను’ అంటారు. ‘రాముడికి నీలం రంగు ఉండడం అసహజంగా తోచలేదా?’ అని అడిగితే ‘..లేదు’ అంటారు. ఇలా అతి క్లుప్తంగా సమాధానాలిస్తూ, నేను చేసిందేమీ లేదు అంటూ ఉంటే శ్రోతకు ఏం వినబుద్ధేస్తుంది? తను చేసినది పదిమందితో చెప్పాలనే ఆసక్తి వక్తకు ఉండాలి. అది లేనప్పుడు యింటర్వ్యూ చేయడం దండగ. అందుకే బాపుగారితో ఎంత స్నేహం ఉన్నా ఇంటర్వ్యూ చేస్తే రక్తి కట్టదంటూ మానేశాను.

ఇక నన్ను యింటర్వ్యూ చేస్తానంటూ వచ్చేవాళ్లని డిస్కరేజ్ చేస్తాను. ఎందుకంటే ఏ పృచ్ఛకుడికీ నా గురించి పూర్తిగా తెలుసుకునేటంత ఓపిక, తీరిక ఉండవు. నేను ప్రఖ్యాతుణ్నయితే అవి తెచ్చుకునే వారేమో కానీ ప్రస్తుతానికి అలాటి పరిస్థితి లేదు. నా బ్యాంకింగ్ కెరియర్ వదిలేసినా, కథారచయితగా వందల కొద్దీ కథలు రాశాను, వేల కొద్దీ వ్యాసాలు రాశాను, అనువాదాలు చేశాను, ముళ్లపూడి వెంకటరమణ గారి సాహితీసర్వస్వం సంకలనం చేశాను, ‘‘హాసం’’కు మేనేజింగ్ ఎడిటరుగానే కాక, దాని వ్యవహారాలు పూర్తిగా చూశాను, శాటిలైట్ రేడియోలో ఆర్‌జెగా, టీవీలో ప్రోగ్రాం నిర్వాహకుడిగా చేశాను. తక్కినవాటి గురించి కాస్తకాస్త తెలుసుకున్నా, కథలు, వ్యాసాల్లో కనీసం ఒక శాతమైనా చదవాలి కదా! అంత తీరిక ఎవరికుంటుంది? కథాసంకలనాలు చేసేవాళ్లు ‘మీ కథ ఏదైనా పంపండి’ అంటారు. ‘కథలు పంపుతాను, వాటిలో మీకేది నచ్చిందో అది ఎంచుకోండి’ అంటే వినరు. ‘అంత టైము లేదండి, మీరే ఏదో ఒకటి పంపేయండి. తక్కిన అందరూ అలాగే పంపుతున్నారు’ అని మొండికేస్తారు. అయితే నన్ను వదిలేయండి అని తప్పుకుంటాను.

మనం రాసే కథలన్నీ మనకు నచ్చుతాయి. అవతలివాళ్లు ఓ కథను నిశితంగా చదివి, మనం వాచ్యా చెప్పనిదో, మనకు కూడా తట్టనిదో ఒక అంశమో, కోణమో ప్రస్తావించి ప్రశ్న అడిగితే సంతోషిస్తాం. అభిమాన పాఠకులు ఆ పని చేస్తారు. కానీ వాళ్లు ప్రొఫెషనల్ యింటర్వ్యూయర్లు కారు. ప్రొఫెషనల్‌గా చేసేవాళ్లకు చదివే, సమాచారం సేకరించే టైముండదు. సంకలనం చేయడానికి ఆర్నెల్ల టైమున్నా మన కథలు చదవలేమనే వాళ్లున్న యీ కాలంలో, రెండు, మూడు రోజుల వ్యవధిలో యింటర్వ్యూ చేయాలనుకునే వాళ్లకు సమయమెలా దొరుకుతుంది? ఇది నా ఒక్కడి సమస్యే కాదు, నా బోటి, నా స్థాయి రచయితలందరికీ ఉన్న సమస్య. అందువలన ఎవరైనా యింటర్వ్యూ చేస్తానంటే మనమే ప్రశ్నలు, సమాధానాలు తయారు చేసి పెట్టుకుని ఇంటర్వ్యూ చేసేవాళ్లను డైరక్ట్ కూడా చేయాలి. ఆ శ్రమ పడలేక వద్దంటాను. ఓసారి ఆలిండియా రేడియో ఎఫ్‌ఎమ్ వాళ్లు చేస్తానంటే ‘నా గురించి వద్దు, ఆధునిక సమాజంలో హాస్యం ప్రాముఖ్యత’ అనే సబ్జక్టు తీసుకుని చేదాం అని ప్రతిపాదించి, ఒప్పించాను.

సినీ ప్రముఖులైతే లైమ్‌లైట్‌లో ఉంటారు కాబట్టి, వాళ్లకు యింటర్వ్యూలు యిచ్చేయాలన్న తహతహ ఉండదు. వాళ్ల సినిమా రిలీజు కాబోతుందంటేనే మీడియాతో యింటరాక్ట్ అవుతారు. అదీ పెద్ద ఛానెల్స్‌తో! చిన్న యూట్యూబ్ టీవీ ఛానెల్స్‌ వాళ్లు ఎవరు దొరుకుతారా అని చూస్తారు. వాళ్ల ప్రతినిథులూ మరీ అంత తర్ఫీదు పొందినవాళ్లు ఉండరు. ఈ మధ్యే చూశాను, బాబూ మోహన్ యింటర్వ్యూ చేసే అతన్ని ప్రశ్నలడగడం రాకపోతే ఎలా? అని విసుక్కున్నారు. కొన్ని యింటర్వ్యూలలో అడిగేవాళ్లు తమకు అన్నీ తెలుసని చూపించుకోబోతారు. మొత్తమంతా తామే చెప్పేసి అవతలివాళ్లను ఔను కదా అని అడుగుతారు. జవాబు చెప్పనీయకుండా అడ్డు తగులుతూంటారు. జవాబు చెప్పడానికి యిష్టపడనివాళ్లను తిప్పితిప్పి అదే ప్రశ్న వేసి, చికాకు పెట్టి అది తమ ప్రజ్ఞగా ఫీలయ్యేవాళ్లున్నారు. వీళ్లకు విపర్యంగా యింకో రకం ఉంటారు, అవతలివాళ్లని ఒక ప్రశ్న అడగడం, వాళ్లు చెప్పుకుపోతూ ఉంటే తల ఊపడం తప్ప యింకేమీ చేయరు. ఆ విషయం అర్థం చేసుకుంటూ, దానికి అనుబంధ ప్రశ్న వేసే సామర్థ్యం వారికున్నట్టు తోచదు. అలాటప్పుడు చెప్పేవాడికి ఉత్సాహం ఏముంటుంది?

ఇలా రకరకాల వ్యక్తులు యింటర్వ్యూలు చేసేస్తున్నారు. యూట్యూబు వచ్చిన దగ్గర్నుంచి యీ వృత్తిలోకి వచ్చే ఔత్సాహికులు పెరుగుతున్నారు. వారు తబస్సుమ్ గురించి, ఆమె యింటర్వ్యూ చేసే కళ గురించి తెలుసుకోవాలని నా సూచన. 1944లో పుట్టిన తబస్సుమ్ బాలతారగా తన మూడవ ఏట సినీరంగంలో అడుగిడింది. ఆమె తండ్రి అయోధ్యానాధ్ సచ్‌దేవ్ అనే స్వాతంత్ర్యయోధుడు, జర్నలిస్టు. తల్లి ఆస్గరీ బేగమ్ అనే ముస్లిమ్. ఆవిడ తన కూతురికి కిరణ్ బాల అని పేరు పెట్టింది. తండ్రి సినిమాల్లో ప్రవేశపెట్టేటప్పుడు తబస్సుమ్ అనే తెరపేరు పెట్టాడు. తొలి సినిమా ఫేమస్ స్టూడియోస్ వారి ‘‘నర్గీస్’’ (1947). నర్గీస్ (‘‘దీదార్’’), మీనాకుమారి (‘‘బైజూ బావ్‌రా’’) వంటి హీరోయిన్ల చిన్నప్పటి పాత్రల్లో తబస్సుమ్ కనబడేది. ‘‘దీదార్’’లోని ‘బచ్‌పన్ కే దిన్ భులా న దేనా’ అనే పాప్యులర్ పాటలో బేబీ తబస్సుమ్‌ను చూడవచ్చు. బిమల్ రాయ్ ‘‘బాప్ బేటీ’’లో తబస్సుమ్, ఆశా పరేఖ్ బాలనటులుగా కనబడ్డారు.

యుక్తవయసు వచ్చాక, హీరోయిన్ స్నేహితురాలి వేషాలు, హీరో చెల్లెలి వేషాలు వచ్చాయి. చూడడానికి బాగానే ఉండేది, యాక్షన్ బాగా చేసేది, డైలాగులు బాగా చెప్పేది. అయినా హీరోయిన్ మెటీరియల్ కాదనుకున్నారు దర్శకనిర్మాతలు. ప్రసిద్ధ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ ప్రోత్సాహంతో ఆమె రేడియో సిలోన్‌లో జోక్స్ ప్రోగ్రాం నిర్వహించేది. కానీ ఆమెకు చిరకీర్తి సంపాదించిన కార్యక్రమం 1972లో దూరదర్శన్ ముంబయి వాళ్లు ప్రారంభించిన ‘‘ఫూల్ ఖిలే హైఁ గుల్షన్ గుల్షన్’’ అనే తొలి టాక్ షో. సినీరంగంలోనే ఉంటూ అందరు ఆర్టిస్టులతో, టెక్నీషియన్లతో ఆత్మీయంగా మెలుగుతూ మంచి పేరు సంపాదించుకున్న 28 ఏళ్ల తబస్సుమ్‌ను హోస్ట్‌గా తీసుకుని ఆమెలో ఉన్న మరొక కోణాన్ని వెలికి తీశారు దూర్‌దర్శన్ వారు. ఆమె కలుపుగోరుతనం, హిందీ, ఉర్దూ భాషలపై ఆమెకున్న పట్టు, సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి, హాస్యప్రియత్వం అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి.

హిందీ స్టార్లంటే అహంకారానికి, ముభావానికి పెట్టింది పేరు. ఏం చెపితే ఎవరితో ఏ చిక్కులు వస్తాయోనని భయపడే రకం. కానీ వారితో అనునయంగా మాట్లాడుతూ ఆడియన్స్ వారి నుంచి ఏం తెలుసుకోదలచుకుంటున్నారో దాన్ని వారి ప్రతినిథిగా ఆమె రాబట్టేది. దానికి ఆమె ప్రియభాషణం, చిరునవ్వులు (తబస్సుమ్ అంటే చిరునవ్వు) చిందించే మోము సహకరించాయి. దుర్గా ఖోటే వంటి సీనియర్ దగ్గర్నుంచి, దీప్తి నావల్ వంటి జూనియర్ దాకా, తెరపై యాంగ్రీమ్యాన్ అమితాబ్ బచ్చన్ దగ్గర్నుంచి నిజజీవితంలో కోపిష్టి ఐన కమాల్ అమ్రోహీ దాకా అందరూ నోరు విప్పి మాట్లాడేలా చేసేదామె. అమ్రోహీని ‘‘నటిగా మీనాకుమారి ఔన్నత్యం మా అందరికీ తెలుసు. భార్యగా మీనాకుమారి ఎటువంటిది?’’ అని ప్రశ్నించే ధైర్యం చేసిందామె.

ఇంటర్వ్యూ తర్వాత యీ ప్రముఖులెవ్వరూ ఫిర్యాదు చేసేవారు కూడా కాదు. ఎందుకంటే వారికి అభిమానులు మరింత పెరిగేవారు. వెలుగులో ఉన్న వారినే కాదు, వెలుగులోకి రానివారిని సైతం పరిచయం చేసిందామె. హేమమాలినికి, రేఖకు డ్యూప్‌గా పని చేసిన రేష్మా పఠాన్‌ను కూడా యింటర్వ్యూ చేసిందామె. టీవీ ఆర్టిస్టులను యింటర్వ్యూ చేసింది. తర్వాతి రోజుల్లో యిలాటి టాక్‌షోలు చేసిన సిమి గ్రేవాల్‌కు, కరణ్ జోహార్‌కు యిన్‌స్పిరేషన్ తబస్సుమే. ‘‘ఫూల్ ఖిలే...’’ ప్రోగ్రాం ఎంత హిట్ అయిందంటే ఏకంగా 21 ఏళ్ల పాటు అంటే 1993 వరకు నడిచింది. ప్రయివేటు ఛానెళ్లు వచ్చిపడ్డాక యింక అందరూ యిటువంటి టాక్ షోలు మొదలు పెట్టేశారు. ఇప్పట్లో అయితే అనేక టీవీ ఛానెళ్లున్నాయి కానీ అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే కదా. టీవీ తారలందరినీ ఇంటికి వచ్చిన అతిథుల్లా ఫీలయ్యేవారు ప్రేక్షకులు. దాంతో తబస్సుమ్ యింటింటికి తెలిసిన పేరై పోయింది.

ఈ పాప్యులారిటీతో ఆమె స్టేజిపై కంపియర్‌గా కూడా చేసేది. ముంబయిలో ఫంక్షన్లకేం కొదవ? ఎప్పుడూ బిజీగా ఉండేది. తబస్సుమ్‌కు భాషపై కూడా పట్టుండడంతో ‘‘గృహలక్ష్మి’’ అనే హిందీ మాసపత్రికకు 15 ఏళ్ల పాటు సంపాదకురాలిగా ఉంది. దిల్లీ ప్రకాశన్ అనే పెద్ద పబ్లిషింగ్ సంస్థ ప్రచురించే ఆ పత్రికకు సర్క్యులేషన్ బాగా ఉండేది. 2001 ప్రాంతాల్లో తెలుగు వెర్షన్ కూడా పెట్టి, నడవక మూసేశారు. తబస్సుమ్ అనేక జోక్స్ బుక్స్ కూడా రాసింది. ఆమె భర్త విజయ్ గోవిల్. మరిది అరుణ్ గోవిల్‌ను తబస్సుమే రామానంద సాగర్‌కు పరిచయం చేసింది. ఆయన తీసిన ‘‘రామాయణ్’’ టీవీ సీరియల్‌లో రాముడిగా అతను ఖ్యాతి గడించాడు. కొడుకు హోషంగ్ గోవిల్‌ను హీరోగా పెట్టి 1985లో ‘‘తుమ్ పర్ హమ్ కుర్బాన్’’ అనే సినిమాకు కథ సమకూర్చి తన దర్శకత్వంలో నిర్మించింది. దానిలో మిమిక్రీ ప్రోగ్రాంలు చేసే జానీ లీవర్‌ను హాస్యనటుడిగా పరిచయం చేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినా జానీ లీవర్ స్థిరపడ్డాడు.

2006లో టీవీకి తిరిగి వచ్చి సీరియళ్లలో నటించింది. ఇంటర్వ్యూ చేయడంలో సిద్ధహస్తురాలు కాబట్టి ఆమె తర్వాతి రోజుల్లో కూడా వివిధ టీవీలకై ఇంటర్వ్యూలు చేసేది. హిందీ సినిమా పాతరోజులను గుర్తు చేస్తూ ‘అభీ తో మైఁ జవాఁ హూఁ’ పేర టీవీ ఏసియాకు టాక్ షోలు చేసింది. 2016లో ‘‘తబస్సుమ్ టాకీస్’’ పేర యూట్యూబులో పాత సినిమా కబుర్లు చెప్తూ వచ్చింది. అది చాలా పాప్యులర్ అయింది. నేనూ చూసేవాణ్ని. వివాదగ్రస్త విషయాలను ఆమె హేండిల్ చేసే తీరు చాలా ముచ్చటగా ఉండేది. 2022లో కూడా అంటే 78 ఏళ్లు వచ్చినా ఆమె దాన్ని నిర్వహించింది. తబస్సుమ్ కొడుకు మరో రెండు సినిమాల్లో వేశాడు కానీ పేరు తెచ్చుకోలేదు. అతని కూతురు ఖుశీ కూడా సినిమాల్లోకి వచ్చింది. కరోనా సమయంలో తబస్సుమ్ అస్వస్థురాలైనప్పుడు ‘‘తబస్సుమ్ టాకీస్’’ను ఆమె కొన్ని వారాలు నడిపింది.

చివరి వరకు తబస్సుమ్ గ్రేస్‌ఫుల్‌గానే కనిపిస్తూ వచ్చింది. జ్ఞాపకశక్తి, వచోశక్తి చెదరలేదు. హిందీ సినిమారంగం గురించి జ్ఞాపకాల భాండాగారంగా నిలిచింది. చివరకు 2022 నవంబరు 18న తన 78వ ఏట చనిపోయింది. ‘ఫూల్ ఖిలే గుల్షన్ గుల్షన్’ కోసం గీతకారుడు ఆనంద్ బక్షీతో ఆమె చేసిన కార్యక్రమం లింకు యిస్తున్నాను. ఆ కవీశ్వరుడికి దీటుగా ఆమె భాషాపటిమ, ఉచ్చారణావైశిష్ట్యం ఉండడాన్ని గమనించవచ్చు. 

తబస్సుమ్ టాకీస్’ లింకు మధుబాల గురించి చేసిన 15 ని.ల డాక్యుమెంటరీని చూపిస్తుంది. సౌందర్యం, విషాదం కలబోసిన మధుబాల జీవితాన్ని తబస్సుమ్ ఎమోషనల్‌గా చెప్తూనే బాలన్స్ చెదరకుండా చూసింది. 75 ఏళ్ల వయసులో ఆవిడ ఆ వీడియో చేస్తే 15 లక్షల మంది చూశారంటేనే తెలుస్తోంది ఆవిడ ప్రతిభ ఎటువంటిదో! ఆ ప్రతిభామూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)

[email protected]

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా