Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: లాంతరులో తేజస్వి వెలుగు నింపగలడా?

ఎమ్బీయస్: లాంతరులో తేజస్వి వెలుగు నింపగలడా?

బిహారు ఎన్నికలలో మామూలుగా చూస్తే బిజెపి-జెడియు కూటమి గెలుపు ఖాయం. 15 ఏళ్లగా బిహార్‌ను అవిచ్ఛిన్నంగా పాలిస్తూ ‘సుశాసన్ బాబు’గా పేరు తెచ్చుకుని, అవినీతి ఆరోపణల్లో చిక్కుకోని నీతీశ్ కుమార్ పార్టీ ఐన జెడియు, మోదీ ప్రభతో దూసుకుపోతూ, బిహార్‌లో క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటూ వస్తున్న బిజెపి చేతులు కలిపిన తర్వాత అవతలివాళ్లు ఎవరున్నా, ఓటమిపాలవక తప్పదని అనుకోవాలి. అధికారం వాళ్ల చేతిలో వుంది, నిధులకు కొరత లేదు, కులాల గణన ప్రకారం చూసినా అగ్రవర్ణాలు బిజెపితో, కూర్మీలు, ఇబిసి (అత్యంత వెనకబడినవారు) కులాలు నీతీశ్ వెంట వున్నారు. పైగా స్వతహాగా సోషలిస్టు ఐన నీతీశ్ పట్ల ముస్లిములకు కూడా ఆదరం వుంది.

దాన్ని చెడగొట్టకూడదనే నిన్న నీతీశ్ తన భాగస్వామి పార్టీ నాయకుడు, సాటి ముఖ్యమంత్రి ఐన యోగి ఆదిత్యనాథ్‌ను ఖండించవలసి వచ్చింది. అతను వాడిన ‘చొరబాటుదారులు’ అనే పదం ముస్లిములను ఉద్దేశించి అన్నదే అని అందరికీ తెలుసు. ‘‘అందరూ భారతీయులే అయినప్పుడు, ఎవరూ మరొకరిని దేశం నుంచి బయటకు గెంటేయలేం. చొరబాటుదారులని అనేవారు ప్రజలను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు, వారికి మరొక పని లేదు.’’ అని కఠినంగానే మాట్లాడాడు. మరి అన్ని విధాలా దృఢంగా కనబడుతున్న కూటమికి నాయకత్వం వహిస్తున్న నీతీశ్ నిన్ననే ‘‘ఇవే నా చివరి ఎన్నికలు’’ అనడమేమిటి? 69 ఏళ్లనేది రాజకీయాల్లో పెద్ద వయసేమీ కాదు. కానీ అతనలా అన్నాడంటే ఒక అలసట కనబడటం లేదా? ఎందుకా అలసట? తేజస్విని చూశా!?

అది నిజమే అయితే అంతకంటె ఆశ్చర్యం వుండదు. ఎందుకంటే నీతీశ్ ఎంతో పాలనానుభవం, రాజకీయానుభవం వున్న కాకలు తీరిన యోధుడు. కేంద్రమంత్రిగా కూడా చేశాడు, 15 ఏళ్లగా ముఖ్యమంత్రిగా వున్నాడు. అనేకమందితో చేతులు కలిపాడు, విడిపోయాడు, మళ్లీ కలిపాడు. ఎవరితో కలిసినా ఆమోదయోగ్యుడిగానే వున్నాడు. ఇక బిజెపి తరఫున ముఖ్యనాయకుడు, రేపు నీతీశ్‌తో చెడితే చిరాగ్ పశ్వాన్ సాయంతో ముఖ్యమంత్రి పదవి అధిరోహించేవాడు ఐన సుశీల్ మోదీ కూడా తక్కువవాడు కాదు. వయసు 68. ఎమ్మెల్యేగా, ఎంపీగా. చీఫ్ వ్హిప్‌గా, ప్రతిపక్షనాయకుడిగా, ఉపముఖ్యమంత్రిగా (2005-2013, 2017-2020) ఉన్న అతిరథుడు. అతని వెనుక జ్వాజ్వలంగా వెలుగుతున్న మోదీ గారి అభయహస్తం వంది. మోదీ, నీతీశ్‌ల జాయింటు యిమేజీల ముందు – ముఖ్యంగా వారు ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకుంటున్న యీ సమయంలో – ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు.

అయినా బిజెపి-జెడియు కూటమి, భయపడుతున్న అనడానికి మనసొప్పదు కానీ, సీరియస్‌గా తీసుకుంటున్న వ్యక్తి తేజస్వి. అతనికి 30 ఏళ్లు. క్రికెట్ క్రీడారంగంలో తప్ప, రాజకీయక్రీడారంగంలో అనుభవజ్ఞుడు కాడు. ఐదేళ్ల క్రితమే ఎమ్మల్యే అయ్యాడు. 2015 నుంచి 20 నెలల పాటు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. 2017లో అతనిమీద కేసు పెట్టారు, 14 ఏళ్ల వయసులో అతను అవినీతికి పాల్పడ్డాడని! ఆ కేసు కత్తి నెత్తి మీద వేళ్లాడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో మహాగఠ్‌బంధన్ (ఎంజిబి) పేరుతో కాంగ్రెసు, యితర పక్షాలతో జట్టుకట్టి పోటీ చేస్తే 40 పార్లమెంటు స్థానాల్లో ఒక్కదానిలో కూడా గెలవలేదు. 39 ఎన్‌డిఏ కూటమికి పోగా, 1టి మాత్రం కాంగ్రెసుకి దక్కింది. అతని తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ పగ్గాలు యితనికి అప్పగించి జైల్లో కూర్చున్నాడు. తల్లి, మాజీ ముఖ్యమంత్రిణి ఐన రబ్డీ దేవి రిటైరై పోయి యింట్లో కూర్చుంది. అన్నగారు తేజ్ ప్రతాప్ తన నియోజకవర్గంలో గెలవడానికే అవస్థలు పడుతున్నాడు.

ఇలాటివాడు ఒక బలీయమైన శక్తిగా ఎదిగితే అది రాజకీయ పరిశీలకులకు నిజంగా ఒక టెస్ట్‌కేస్ అవుతుంది. ‘అతను రాజకీయవారసుడు. (మోదీ భాషలో యువరాజు నెంబర్ టూ, కానీ రాజుగారి కొడుకునే యువరాజు అంటారు తప్ప, ఓడిపోయి, జైల్లో మగ్గుతున్నవాడి కొడుకుని అంటారా?) ఆర్‌జెడికి సంప్రదాయబద్ధంగా వస్తున్న ముస్లిమ్-యాదవ్ ఓటు బ్యాంకు 20 శాతం వుంది. దీనిలో అతని గొప్పేముంది?’ అని తీసిపారేయవచ్చు.  కానీ యీ వారసత్వ ఓటు బ్యాంకు ఉన్నా 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఓటమి తర్వాత, లాలూకున్న నాయకత్వ లక్షణాలు యితనికి లేవంటూ భాగస్వామ పక్షాలైన కూటమి విడిచి వెళ్లిపోయాయి. ఈ ఎన్నికలు ప్రకటించగానే 12 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలు అతని పార్టీ విడిచి పెట్టి జెడియులో చేరిపోయారు. లాలూకి ఎన్నో దశాబ్దాలుగా అనుచరుడైన రఘువంశ ప్రసాద్, చనిపోవడానికి మూడు రోజుల ముందు, పార్టీని విడిచిపెడతానని లేఖ రాశాడు. దిక్కూదివాణం లేని కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీలు మాత్రమే తేజస్విని అంటిపెట్టుకుని వున్నాయి.

వెళ్లిపోయిన పార్టీలు మాంఝీ హిందూస్తాన్ అవామీ లీగ్, కుశావహా యొక్క రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, ముకేశ్ సాహ్నీ యొక్క వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ. ఈ పార్టీలు ప్రాతినిథ్యం వహించే కులాలకు మొత్తం జనాభాలో దాదాపు 25 శాతం వరకు ఓట్లున్నాయట. వాళ్లు యితని ఎంజిబి కూటమిని విడిచిపెట్టి ఎన్‌డిఏలో చేరిపోయారు. ఇక అతని దగ్గర మిగిలిన సైన్యం ఏముంది? ఇక లాలూ యిచ్చిన వారసత్వం ఆస్తా? అప్పా? అంటే అప్పే అని చెప్పాలి. ఎందుకంటే లాలూ పరిపాలించిన 15 ఏళ్లు ఆటవిక రాజ్యంగా యిప్పటికీ చెప్పుకుంటారు. ‘‘అప్పట్లో బిహార్‌లో నడిచిన యిండస్ట్రీ కిడ్నాపుల పరిశ్రమ ఒక్కటే. చీకటి పడితే చాలు, మగవాళ్లు కూడా బయటకు రావడానికి దడిసేవాళ్లు.’’ అని నీతీశ్ రెండు రోజుల క్రితమే గుర్తు చేసుకున్నాడు.

తన 15 ఏళ్ల (2005-20) పరిపాలనను లాలూ, రబ్డీ పాలించిన 15 ఏళ్ల కాలం (1990-2005) తో పోల్చి చూడమని ప్రజలకు మాటిమాటికీ చెప్తున్నాడు. అప్పట్లో యాదవులే మొత్తం పదవులన్నీ ఆక్రమించి, తక్కిన బిసిలను అణగదొక్కేశారని గుర్తు చేస్తున్నాడు. పరిపాలన మొత్తం అవినీతిమయమని, అందుకే లాలూ కటకటాలు లెక్కపెడుతున్నాడనీ కూడా! ఇవన్నీ ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం విషయాలు. ఓటర్లకు యిప్పుడు అర్జంటుగా గుర్తు చేయవలసిన అవసరం ఏమొస్తోంది? ఎవరైనా భవిష్యత్తులో తాము ఏం చేయబోతామో చెప్తారు తప్ప, గతాన్ని తవ్వి అప్పుడలా జరిగింది, యిప్పుడిలా జరిగింది అని పురాణం చెప్తూ కూర్చోరు కదా! ఆలోచిస్తే, తేజస్వి ఎదుగుతున్నాడు కాబట్టే లాలూ పాలన పేరు చెప్పి ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారని తోస్తుంది.

ఇక్కడ ఒక పోలిక తోస్తుంది. జగన్ తమ పార్టీలోంచి బయటకు వెళ్లి, వేరే పార్టీ పెట్టాకనే కాంగ్రెసుకు వైయస్ అవినీతి గురించి గుర్తుకు వచ్చింది. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రినే ముద్దాయిని చేస్తూ పార్టీ హైకమాండ్ కేసులు నడిపించడం వేరెక్కడా చూడలేదు. టిడిపి కూడా కాంగ్రెసు ముఖ్యమంత్రులు అనేకులు వుండగా, వారెవరి గురించీ మాట్లాడకుండా వైయస్ హయాంలో జరిగిన అవినీతి అంటూ యిప్పటికీ మాట్లాడుతూంటారు. కాంగ్రెసు హయాంలో జరిగిన అక్రమాలన్నిటికీ వైయస్‌నే తప్పుపడుతూ టిడిపి మాట్లాడుతుంది, వైయస్ పాలించినది 2004-09 మధ్య ఐదేళ్ల నాలుగునెలలే ఐనా! చెన్నారెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి సంతానం కూడా జగన్ తరహాలో పాప్యులర్ లీడర్‌గా, తమకు పోటీదారుగా ఎదిగివుంటే అప్పుడు వాళ్ల గురించీ మాట్లాడేవారేమో!

తేజస్వి కూడా ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాడన్న అనుమానం వస్తోందనడానికి ఒక కారణం – ఇండియా టుడే నిర్వహించిన ఒక సర్వేలో ఎవర్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని బిహార్ ఓటర్లను అడిగితే 31 శాతం మంది నీతీశ్ పేరు చెప్పగా, 27 శాతం మంది తేజస్వి పేరు చెప్పారు. సుశీల్ మోదీ పేరు చెప్పినవారు 4 శాతం మందే! ఆశ్చర్యంగా వుంది కదా! ఇలా ఎందుకు జరుగుతోంది? రాజకీయాలకు, పాలనకు కొత్త ఐన తేజస్వి ఎందుకింత పాప్యులర్ అవుతున్నాడు అంటే అతను యువతను ఆకర్షిస్తున్నాడని సమాధానం వస్తోంది.

ఓటర్లలో 23 శాతం మంది 29 ఏళ్ల వయసు కంటె తక్కువ వాళ్లే. వారికి లాలూ అధ్వాన్న పాలన గుర్తు లేదు. నీతీశ్ అధికారంలోకి వచ్చేముందు పరిస్థితి తెలియదు. ప్రస్తుత పరిస్థితుల పట్ల వారికి అసంతృప్తి వుంది. దాన్ని సవరించడానికి తేజస్వి వస్తున్నాడు. యువకుడు, మన సమస్యలు అర్థం చేసుకునేవాడు కాబట్టి ఆదరిద్దాం. ఇంతే వాళ్లకు తెలుసు. నిజానికి బిహార్ వంటి అతి క్లిష్టమైన రాష్ట్రాన్ని యిన్నాళ్లూ నీతీశ్ సమర్థవంతంగానే పాలిస్తూ వచ్చాడు. ఒకటి మాత్రం వాస్తవం – అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుంటే మొదటి ఐదేళ్లూ పాలించినంత బాగా రెండో టెర్మ్ పాలించలేదు. రెండో టెర్మంత మూడో టెర్మ్ బాగా లేదు. అయినా అతని విజయాలు చాలానే వున్నాయి.

శాంతిభద్రతలు బాగా కాపాడడంతో బాటు, కోటి యిళ్లకు కుళాయి, టాయిలెట్స్ నిర్మాణంలో 80 శాతం లక్ష్యాన్ని చేరడం, విద్యుత్ సౌకర్యం పెంచడం వంటి పనులపై చాలా మెరుగైన ఫలితాలు చూపాడు. గతంలో పట్టణాల్లో 10-12 గంటలు, పల్లెల్లో 6-8 గంటలు విద్యుత్ వస్తూంటే, యితని హయాంలో అది 22-24, 20-22 గంటలకు పెరిగింది. మద్యనిషేధం అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా రోడ్లు, వంతెనల విషయంలో నీతీశ్ చేసినది అద్భుతం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను ఏటా 15 శాతం చొప్పున పెంచుకుంటూ పోయాడు. 2019 నాటికి 75 శాతం గ్రామాలకు రోడ్లున్నాయట. మహిళలకు ప్రభుత్వోద్యాగాలలో 35 శాతం రిజర్వేషన్లు యిచ్చాడు.

ఇంత చేసినా నిరుద్యోగసమస్యపై మాత్రం నీతీశ్ పెద్దగా సాధించలేకపోయాడు. ‘లాలూ హయాంలో మొత్తం 15 ఏళ్లలో 96 వేల మందికే ఉద్యోగాలు యిస్తే, నా హయాంలో 10 లక్షల మందికి ట్రైనింగ్ యిప్పించా, ఈ ఏడాది 70 వేల మందికి ఉద్యోగాలు యిప్పిస్తున్నా’ అని నీతీశ్ చెప్పుకుంటున్నాడు. కానీ బిహార్‌లో 2018లో నిరుద్యోగిత 7.2 శాతం వుంటే 2019 నాటికి అది 10.2కి పెరిగిందని గణాంకాలు చెపుతున్నాయి. కోవిడ్ పుణ్యమాని ఏప్రిల్ నాటికి అది 46.6 శాతానికి పెరిగిందట. నిజానికి కోవిడ్ కారణంగా వచ్చిపడిన వలస కార్మికుల సమస్య బిహార్ యిమేజిని పూర్తిగా చెడగొట్టింది. నడుస్తూ వచ్చిన కార్మికులలో యుపి, బిహార్ వాళ్లే ఎక్కువ కనబడ్డారు. 20 లక్షల మంది వెనక్కి తిరిగి వచ్చారంటే దాని అర్థం వారికి సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దొరకనట్లేగా!

కోవిడ్ శిబిరాల్లో ఏదో ఒక మాదిరిగా చూసుకున్నా తర్వాత తమను పట్టించుకోలేదని చాలామంది వలస కార్మికులు టీవీల్లో కనబడి చెప్పారు. 500 రూ.లు, 5 కిలోల బియ్యం చేతిలో పెట్టి పొమ్మన్నారని, తర్వాత ఉపాధి కల్పిస్తామని చెప్పినా కల్పించలేదని, వారు చాలా ఆగ్రహంగా వున్నారు. వేరెవరైనా అయితే యింతకంటె బాగా చేయగలిగేవారో కాదో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం తిరిగి వచ్చిన ప్రజలు జెడియు-బిజెపి సంయుక్త ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్నారు. వీళ్ల పరిస్థితి చూసి, రాష్ట్రంలో వున్న నిరుద్యోగులు రేపు మన గతి కూడా యింతే కదా అని హడిలిపోతున్నారు.

తేజస్వి సరిగ్గా అదే పాయింటు పట్టుకున్నాడు. తను అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు యిస్తానన్నాడు. 10 లక్షలు యివ్వడం అసాధ్యం, ఏదో ఉపాధి కల్పించి అదే ఉద్యోగం అనుకోమంటాడు అని ఎన్‌డిఏ వెక్కిరించింది. ‘కాదు, ప్రభుత్వోద్యోగాలే యిస్తాను. నా తొలి సంతకం దాని మీదే అన్నాడితను. బిహార్ బజెట్‌లో 40 శాతం ఉపయోగించడం లేదు. అది ఉపయోగిస్తే చాలు ఉద్యోగాలు సృష్టించవచ్చు.’ అన్నాడు. జగన్ తరహాలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కల్పిస్తాడు కాబోలు. జనాలంతా చప్పట్లు కొట్టారు. దాంతో బిజెపి అతను 10 యిస్తే మేం 19 లక్షల ఉద్యోగాలు యిస్తాం అని మానిఫెస్టోలో హామీ యిచ్చింది, తాము వెక్కిరించామన్నమాట మర్చిపోయి! దాంతో తేజస్వి చెప్పినది అసాధ్యమైన విషయమేమీ కాదని బిహార్ ప్రజలు అనుకోసాగారు.

తనకు సొంత యిమేజి పెరుగుతోంది కానీ, తండ్రి తాలూకు గతం తనను వెంటాడుతోందని అతనికి తెలుసు.  అందువలన వాల్‌పోస్టర్ల మీద నుంచి తల్లి, తండ్రిల ఫోటోలు తీసేశాడు. కుటుంబపాలన అంటున్నారని చెప్పి అన్న, అక్క ఫోటోలు కూడా తీసేశాడు. వాళ్లెవరితో కలిసి వేదిక పంచుకోవడం లేదు. తనొక్కడే చచ్చేట్లా రోజుకి 20 సభలు నిర్వహిస్తూ తిరుగుతున్నాడు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుంటే తన పార్టీ 144టిలో పోటీ చేస్తోంది, 70 కాంగ్రెసుకు యిచ్చింది. 29 స్థానాలను సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్‌లకు యిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 80 సీట్లు వచ్చాయి కానీ అప్పుడు జెడియుతో పొత్తు వుంది. ఇప్పుడు లేదు. అందువలన దాని కంటె తక్కువగా ఏ 50 సీట్లో గెలుచుకున్నా అదీ గొప్పే.

అది జరిగితే, యిటు జెడియు కంటె బిజెపికి గణనీయంగా  సీట్లు ఎక్కువ వస్తే, రాజకీయ సమీకరణాలు మారినా మారవచ్చు. బిజెపి, ఎల్‌జెపి సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూడవచ్చు. నీతీశ్ జెడియు, కాంగ్రెసుల సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చూడవచ్చు. ఏదైనా సాధ్యమే! ఫలితాల కోసం వేచి చూడాలి. ఈ లోపున ప్రస్తుతానికి తోస్తున్నదేమిటంటే తేజస్వి వాళ్ల పార్టీ ఎన్నికల చిహ్నమైన లాంతరులో కిరోసిన్ బాగానే పోస్తున్నాడు. వత్తి అంటుకుని వెలుగు వస్తుందో లేదో ఫలితాల రోజున తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?