Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తెలుగు మీడియం లాభాలు?

ఎమ్బీయస్‌: తెలుగు మీడియం లాభాలు?

జగన్‌ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడతానన్న దగ్గర్నుంచి మాతృభాష గురించి, తెలుగు ఔన్నత్యం గురించి టీవీ చర్చల్లో హోరెత్తించారు. రకరకాల వాదనలు వినబడ్డాయి. రేపోమాపో తెలుగు కనుమరుగు అయిపోతున్నట్లు, దాని రక్షణకు నడుం బిగించకపోతే లాభం లేదన్నట్లు బిల్డప్‌లు యిచ్చేశారు. రాజధానుల రగడ వలన టీవీల్లో కాస్త వెనకబడింది కానీ వాట్సప్‌లు పుంజుకున్నాయి. ప్రాథమిక దశలో మాతృభాషామాధ్యమంలో చదవడం ఎంత గొప్పదో కలాం గారి కొటేషన్‌తో సహా చాలా వచ్చిపడుతున్నాయి. ఇన్నాళ్లూ 90%కు పైబడి ప్రయివేటు బడులలో, మూడోవంతు ప్రభుత్వ బడులలో ఇంగ్లీషు మీడియంలో బోధన సాగుతోంది. తక్కినవాటిలో కూడా పెడతామనగానే మిన్ను విరిగి మీద పడినట్లు యింత హంగామా జరిగింది.

మీడియం మారుతోంది కానీ భాషగా తెలుగు ఎక్కడికీ పోవటం లేదు. ఒక సబ్జక్టుగా కొనసాగుతుంది. ప్రయివేటు స్కూళ్లల్లో - కనీసం స్టేటు సిలబస్‌లో - దాన్ని నిర్బంధం చేయాలని తెలుగు భాషాభిమానులు అడగాలి, ఉద్యమాలు చేయాలి కానీ అది మానేసి ప్రభుత్వస్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియానికి అభ్యంతర పెట్టడం అర్థరహితం. ప్రతిపక్షాలు యాగీ చేశాయంటే, అది వాటి జన్మహక్కు. కానీ మామూలు ప్రజలు, మేధావులు అందరూ కూడా యిదే ధోరణిలో మాట్లాడడం చూసి విస్తుపోతున్నాను. ఈ సందర్భంగా వాళ్లు లేవనెత్తిన పాయింట్లు, నా వ్యాసానికి స్పందనగా వచ్చిన వ్యాఖ్యలు సమీకరించి, వాటిపై నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. 

ముందుగా కొందరు ఇంగ్లీషు మీడియాన్ని సమర్థిస్తున్నావ్‌, తెలుగు మాయమైపోయి, నీ వ్యాసాలు చదివేందుకు ఎవరూ మిగలరు చూస్కో అని హెచ్చరించారు. మీడియం లేకపోయినా తెలుగువాళ్లుంటారు, వాళ్ల భాష ఉంటుంది. తెలుగు సినిమాలు వస్తూనే ఉంటాయి. హాలీవుడ్‌ సినిమాలు తెలుగులో అనువాదం అయితే తప్ప మార్కెట్‌ పెంచుకోలేని పరిస్థితి కొనసాగుతుంది. సెల్‌ఫోన్‌లో తెలుగు లిపి వాడే సౌకర్యమూ ఉంటుంది. పోనీ తెలుగు భాష సిలబస్‌లో ఒక సబ్జక్టుగా కూడా తీసేసే దశ వచ్చి, లిపి ఎవరికీ అర్థం కాకపోయినా ప్రజలు తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. ఆఫీసులో ఇంగ్లీషు మాట్లాడినా, తిట్టుకోవడానికైనా తెలుగు బూతులు నేర్చుకుంటారు. నేను బతికుండగానే తెలుగు చదివేవారు లుప్తమై పోయే పరిస్థితి వస్తే, నేను రాయడం మానేసి, యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడడం మొదలుపెడతాను. అందువలన నా భవిష్యత్తు గురించి వర్రీ కావద్దు. 

కొందరు ఇంగ్లీషు గొప్పేమిటి? ప్రపంచంలో దాన్ని మాట్లాడేవారు 20%యే కదా అంటున్నారు. జ్ఞానం పెంచుకోవడానికి, ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో పని చేయడానికి మనకు ఏదో ఒక అంతర్జాతీయ భాష అవసరం ఉంది. మనను ఇంగ్లీషు వాళ్లు పాలించారు కాబట్టి ఇంగ్లీషు అంటున్నాం. ఫ్రెంచ్‌ వాళ్లు పాలిస్తే ఫ్రెంచ్‌ అనేవాళ్లం. రెండూ వద్దు, స్పానిష్‌ నేర్చుకుందాం, చైనీస్‌ నేర్చుకుందాం అంటారా, ఆ ముక్క చెప్పాలి. తెలుగు, హిందీలతోనే కాలక్షేపం చేసేద్దామంటే మాత్రం కుదరదు. హిందీ అన్ని రాష్ట్రాలలోనూ చెల్లదు. ఇండియా కున్న లింకు భాష ఇంగ్లీషే! తెలుగు, హిందీల ద్వారా మనకు అవసరమైనంత జ్ఞానం సమకూరదు - ప్రస్తుతం వాటిల్లో తగినన్ని పుస్తకాలు లేవు కాబట్టి! భవిష్యత్తులో వస్తే అప్పటి ముచ్చట అప్పటిది.

కలాం గారి కాలానికీ, వెంకయ్య నాయుడు గారి కాలానికీ యిప్పటికీ పోలిక కుదరదు. అప్పట్లో అందరూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగించారు. ఇప్పుడు కొందరు మాతృభాష, కొందరు ఇంగ్లీషు మీడియం కావడంతో ఇంగ్లీషు మీడియం వాళ్లకున్న ఆత్మవిశ్వాసం తక్కినవాళ్లలో సమకూరక వాళ్లు నష్టపోతున్నారు. హిందీ మాధ్యమంలోనే చదివిన ఉత్తరాది వాళ్లు ఇంగ్లీషు విషయంలో వెనుకబడి, ఆ విషయంలో సిగ్గుపడుతూంటారు. ఉత్తరాదిన దక్షిణాది వారికి వైట్‌కాలర్‌ ఉద్యోగాలు విస్తారంగా దొరుకుతాయి, దక్షిణాది వాళ్లంటే వాళ్లు ఇంగ్లీషులో దిట్టలని అక్కడ అభిప్రాయం. మన దగ్గర ఇంగ్లీషు రాని హిందీవాళ్లకు ఆఫీసు ఉద్యోగాలు రావు. వాళ్లు వచ్చి వ్యాపారాలు, పనులు చేసుకుని బతకాల్సిందే. 

నేను ముఖ్యంగా అనే పాయింటు చాలా మంది మిస్‌ చేశారు - ఇంజనీరింగు, పోస్ట్‌ గ్రాజువేషన్‌ వంటి చదువుల వరకు మాతృభాషలో కొనసాగించ గలిగితే మనం జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలతో పోల్చుకోవాలి. మధ్యలో ఇంగ్లీషు మీడియంలో మారాల్సిన అగత్యం ఉన్నపుడు ఆ పనేదో ఎంత త్వరగా చేస్తే అంత మంచిది కదా అన్నాను. నేను గతంలోనే రాశాను. 12వ తరగతి వరకు నాది తెలుగు మీడియం. బియస్సీ ఇంగ్లీషు మీడియం కాబట్టి లెక్కలు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల గురించి ఇంగ్లీషులో చర్చించగలను. కానీ బయాలజీ, జూవాలజీ మాత్రం తెలుగు పదాలే నోట్లో ఆడతాయి. గుండె గురించి ఎవరితోనైనా చర్చించాల్సిందంటే కర్ణిక, జఠరిక అనే తప్ప చప్పున ఇంగ్లీషు పదాలు తట్టవు. అలాగే భూగోళం కూడా! అక్షాంశాలు, రేఖాంశాలు అనేదే నోట్లో ఆడుతుంది. దేన్ని లాంగిట్యూడ్‌ అంటారు, దేన్ని లాటిట్యూడ్‌ అంటారు కాస్త ఆలోచించుకుని మాట్లాడవలసి వస్తుంది.

మనం ఇంగ్లీషులో తడబడడానికి కారణం యిదే! తెలుగులో ఆలోచించుకుని, దాన్ని ఇంగ్లీషులో తర్జుమా చేసుకుని మాట్లాడతాం. అందువలన అది నేచురల్‌గా తోచదు. రెండు భాషల ఇడియమ్స్‌ వేరు. నేను ఇంగ్లీషులో కథ రాసినపుడు, ఆలోచన దగ్గర్నుంచి ఇంగ్లీషులోనే చేస్తాను. వాక్యాలు ఇంగ్లీషులోనే పేర్చుకుంటాను. తెలుగునుంచి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషునుంచి తెలుగులోకి అనువాదాలు చేశాను. అప్పుడు ఒరిజినల్‌ చదివేసి పక్కన పెట్టేసి, దాన్ని వేరే భాషలో ఆలోచించుకుంటూ రాస్తాను. మధ్యమధ్యలో వెరిఫై చేసుకుంటాను. 

విదేశాల్లో ఉన్న మనవాళ్లల్లో చాలామంది తెలుగు భావాలను ఇంగ్లీషులో వ్యక్తీకరించి, నవ్వులపాలవుతూంటారని విన్నాను. మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదివి, ఇంగ్లీషు సినిమాలు, సీరియల్స్‌ చూసిచూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ల ఎక్స్‌ప్రెషన్లు నేచురల్‌గా ఉంటాయి. వాళ్ల కంటె మన ఒకాబిలరీ ఎక్కువ ఉన్నా మన ఇంగ్లీషులో కొంత కృతకత, ఉచ్చారణాదోషం ఉంటూంటుంది. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారందరికీ మంచి ఉచ్చారణ ఉంటోందని చెప్పలేం. నేర్పిన ఉపాధ్యాయుల బట్టి ఉంటుంది. రేపు 100% మంది ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయినంత మాత్రాన చాకులై పోతారని గ్యారంటీ లేదు. కాస్త ఎడ్వాంటేజి పెరుగుతుందంతే. 

తమిళులు చూడండి, వాళ్లకి మాతృభాష పట్ల ఎంత భక్తో అంటున్నారు. అవును నిజమే, వాళ్ల కుంది. అంతమాత్రం చేత వాళ్ల పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడం మానటం లేదు. స్కూల్లో తమిళం సబ్జక్టుగా లేని సందర్భాల్లో యింట్లో నేర్పుతున్నారు. మనం అది అనుకరించాలి. రాష్ట్రం వెలుపలకి బదిలీలు ఉంటాయి కదాని పిల్లల్ని సిబిఎస్‌ఇలో చేర్పించి తెలుగు కంపల్సరీ కాకుండా చూసుకుంటాం. కానీ యింట్లో తెలుగు రాయడం, చదవడం నేర్పం. అది చేయకుండా ఇంగ్లీషు మీడియం పనికిరాదని వాదన చేయడం, పనికిమాలిన పని. తమిళనాడు వాళ్లకి హిందీతో సమస్య ఉంది. వాళ్ల ప్రభుత్వం ప్రభుత్వస్కూళ్లల్లో హిందీ నేర్పదు. ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లీషుతో బాటు, హిందీ అవసరం కూడా ఉందని గ్రహించిన తమిళులు విడిగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే పరీక్షలకు పంపించి, పిల్లలకు హిందీ నేర్పిస్తారు. అంతే తప్ప, తమిళం ఒక్కదానితోనే ఊరేగుతాం అనరు.

ఇంగ్లీషు జోలికి పోకుండా మాతృభాషలోనే సర్వం నిర్వహిస్తాం అనే రాష్ట్రాల ప్రజల గురించి చెప్తాను వినండి. గుజరాత్‌లో మొరార్జీ దేశాయ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తమంతా గుజరాతీ మీడియం చేసేశాడు. దాని కారణంగా గుజరాతీలు ఘోరంగా దెబ్బతిన్నారు. నేను పని చేసిన స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర ప్రధాన కార్యక్షేత్రం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం. 1974లో తొలిసారి అక్కడకు వెళ్లినపుడు వాళ్ల ఇంగ్లీషు భాషాలేమిని చూసి దడుచుకున్నాను. 

నిజానికి వాళ్లలో ఎంతోమంది తెలివైనవారున్నారు, కానీ ఇంగ్లీషులో ప్రావీణ్యత లేని కారణంగా, ఉద్యోగాలకై యితర రాష్ట్రాలకు వెళ్లలేక పోయేవారు. ప్రమోషన్లు వచ్చేవి కావు. ఇంగ్లీషు మ్యాగజైన్లు కొనేవారు కారు, ఇంగ్లీషు నవలలు చదివేవారు కారు. దాంతో వాళ్ల నాలెజ్‌ పరిమితంగానే ఉండేది. దానికి వాళ్లు సిగ్గుపడుతూ ఉండేవారు. మా దగ్గరకి వచ్చి ఇంగ్లీషు నేర్పమని అడిగేవారు. 45, 50 ఏళ్లు దాటిన వారికే ఇంగ్లీషు బాగా వచ్చేది. గుజరాతీ మీడియం చేశాక చదువుకున్న వారందరూ ఇంగ్లీషులో వీక్‌యే. నిజానికి గుజరాత్‌లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ అనేది బరోడా (వడోదరా)లో మాత్రమే కనబడుతుంది. అహ్మదాబాద్‌లో ఆ రోజుల్లో మెయిన్‌ బస్‌స్టాండ్‌లో కూడా బోర్డులన్నీ గుజరాతీ భాషలోనే (వాళ్ల అంకెలు కూడా వేరు) ఉండేవి. 

నేను చెప్తున్నది, గుజరాత్‌లో పెరిగిన గుజరాతీల గురించి మాత్రమే. బొంబాయిలో పెరిగిన గుజరాతీలు యితరుల్లాగానే ఉంటారు. గుజరాత్‌లో పెరిగిన గుజరాతీల్లో కూడా ఇంగ్లీషు బాగా వచ్చినవారు ఉన్నారు. కానీ వారి శాతం బాగా తక్కువ. బయట నుంచి అక్కడకు వెళ్లినవారు అవస్థ పడతారు. దక్షిణాదిన కేరళ వెళితేనే మనం భాషాపరంగా యిబ్బంది పడతాం. వాళ్లకు స్కూళ్లలో ఇంగ్లీషు, హిందీ నేర్పినా సరే వాళ్లు మలయాళంలోనే మాట్లాడతారు. బోర్డులూ అవీ ఎక్కువగా మలయాళంలోనే ఉంటాయి. ఇక గుజరాత్‌ వెళితే హిందీ రాకపోతే అంతే సంగతులు. అందువలన మాతృభాషపై మరీ అంత ఎంఫసిస్‌ మంచిది కాదు.

కొంతమంది వాదించారు - ఒక పేద బాలిక తన మాతృభాషా మాధ్యమంలోనే చదవాలి అనుకుంటే ఈ కొత్త రూలు కారణంగా చదవలేక పోతుంది కదా, అది ఆమె ప్రాథమిక హక్కుకు భంగం కదా అని. వాదనకు యిది బాగానే ఉంది కానీ, పేదలెప్పుడూ మధ్యతరగతి వారినే అనుకరిస్తారు. మొదట్లో వాళ్లు చదువు గురించి పట్టించుకునేవారు కారు. కానీ మధ్యతరగతి యిళ్లలో పని చేసి, వాళ్లను గమనించి, వాళ్ల పిల్లల్లా మన పిల్లల్లా చదువుకుంటే తెల్ల చొక్కా వేసుకుని కుర్చీలో కూర్చుని డబ్బు సంపాదిస్తారు, లేకపోతే మనలాగే జీవితాంతం చాకిరీ తప్పదు అనుకున్నారు. 

అందుకే కష్టార్జితంలో చాలా భాగం వెచ్చించి పిల్లల్ని స్కూళ్లకు పంపుతున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంటు స్కీము వచ్చాక ఇంజనీరింగులు కూడా చేయిస్తున్నారు. మధ్యతరగతివాళ్లు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో వేస్తూ ఉంటే వాళ్లూ తప్పకుండా వేస్తారు. కానీ వీళ్లు తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లల్లో, ఇంగ్లీషు మీడియంలో వేస్తూన్నంత కాలం వాళ్లూ శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకుని ప్రయివేటు స్కూళ్లకు పంపడానికే చూస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే వాళ్లకు భారం తగ్గుతుంది.

పేదలనే కాదు, డబ్బున్నవాళ్లు కూడా తమ పిల్లలు ఆధునికత వైపు మళ్లాలని కోరుకుంటారు. మా మార్వాడీ ఫ్రెండ్స్‌ 'మా కోడలు పిల్లలకు మార్వాడీ భాష నేర్పటం లేదు, వాళ్లతో హిందీలోనే మాట్లాడుతోంది' అని ఫిర్యాదు చేస్తూంటారు. సంగతేమిటంటే మార్వాడీ భాషకే అంటిపెట్టుకుంటే ఆ పిల్లలు తాత, తండ్రుల్లా వ్యాపారానికే అంటిపెట్టుకుని పోతారని, అప్‌గ్రేడ్‌ అయితే ఉద్యోగస్తులవుతారని వాళ్ల అంచనా. ఇంగ్లీషుకి అప్‌గ్రేడ్‌ చేసే స్థాయి ఆ కోడళ్లకు లేదు, అందువలన తాము హిందీ నేర్చుకుని (మార్వాడీలకు సులభంగా వచ్చేస్తుంది) పిల్లలకు మొదటిమెట్టుగా హిందీయే నేర్పుతున్నారు. అలా అయితే 'స్టయిల్‌' వస్తుందని వాళ్ల లెక్క. 

కొందరు రాశారు - తెలుగు మీద అభిమానంతో మా పిల్లల్ని తెలుగు మీడియంలోనే వేశాను. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్దవాళ్లయి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు అని. సంతోషం, కానీ వాళ్లు వాళ్ల పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారో, చదివించబోతున్నారో గమనించండి. 'తెలుగు మీడియం వలన మేం పైకి రావడానికి అవస్థ పడవలసి వచ్చింది, మా పిల్లలకు ఆ అవస్థ తప్పిస్తున్నాం' అంటూ ఇంగ్లీషు మీడియంలో వేయడానికే అవకాశం ఎక్కువ వుంది. 

చదివేది ఏ మీడియం ఐనా, చదివే ఆసక్తి ఉండాలి, తెలివితేటలుండాలి. కానీ ఇంగ్లీషు మీడియంలో చదవడం వలన నేను నష్టపోయాను అని ఎవరూ చెప్పుకోరు - ఒక్క పవన్‌ కళ్యాణ్‌ తప్ప! దాని కారణంగా నాకు చదువు మీద ఆసక్తి పోయింది అన్నాడాయన. ఆయన తెలుగు మీడియంలో ప్రైవేటుగా డిగ్రీకి కట్టి పాసయితే ఆ మాటకు విలువ వస్తుంది. లేకపోతే ఆసక్తి పోవడానికి యితర వ్యాపకాలు కారణమనుకోవాల్సి వస్తుంది.

ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు తగినంత మంది ఉండాలి, సమయానికి రావాలి, సరిగ్గా బోధన చేయాలి, పర్యవేక్షణ ఉండాలి.. అంటూ చాలా మంది రాశారు. మీడియం ఏదైనా యివి కావలసినవే. ఇంగ్లీషు మీడియం పెడితే చాలు, యివేమీ పట్టించుకోనక్కరలేదు అని నేనెక్కడా రాయలేదు. ఆ మాట కొస్తే ప్రయివేటు స్కూళ్లలో, కాలేజీల్లో కూడా విద్యాప్రమాణాలు బాగా లేవు. లైబ్రరీలు, లేబరేటరీలు, ప్లే గ్రౌండ్స్‌ లేవు, వాటి గుర్తింపు కాన్సిల్‌ చేస్తాం అని గ్రాంట్స్‌ కమిషన్‌ వాళ్లు హెచ్చరిస్తూనే ఉంటారు. వీళ్లు అవేమీ చేయకుండా లైసెన్సు రెన్యూ చేయించుకుంటూనే ఉంటారు. 

విద్య, వైద్య యీ రెండు రంగాలనూ ఎంత బాగా నిర్వహిస్తే అంత మంచిది. ప్రయివేటు స్కూళ్లు వసూలు చేసే ఫీజులు - అదీ నగదు రూపంలో - చాలా ఎక్కువై పోయి, వాటికి ప్రభుత్వాన్ని శాసించేటంత బలం వచ్చేసింది. ముందుగా ఆ ఫీజుల్ని నియంత్రించి వాళ్ల మదాన్ని అణచాలి. అది చేయాలంటే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, ప్రజలకు ఒక మెరుగైన ప్రత్యామ్నాయం చూపాలి. లేకపోతే ప్రయివేటు స్కూళ్ల వారు తలిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేయగలరు. మధ్యతరగతి వాళ్లను కూడా ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించినపుడే అవి మెరుగుపడతాయి. ఆకర్షించడానికి మంచి ఉపాయం - ఇంగ్లీషు మీడియం. 

జగన్‌ చేసినది మంచిదే అయినా, మేధావులతో చర్చించి చేయాల్సింది అని కొందరంటారు. ఈ మేధావుల్లో హిపోక్రాట్స్‌ ఎక్కువ. తమ పిల్లల్ని తెలుగు సబ్జక్టుగా కూడా లేకుండా ఇంగ్లీషు మీడియంలో చదివిస్తూనే పైకి మాత్రం 'తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచాలి, మీరంతా తెలుగు మీడియంలో చదవాలి' అని సూచనలు చేస్తారు. టీవీ చర్చల్లో టీవీ యాంకర్‌ ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మీ పిల్లల సంగతేమిటి? అని అడిగినప్పుడల్లా వాళ్లు నీళ్లు నములుతున్నారు తప్ప జవాబు చెప్పటం లేదు.

ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం గురించి, మేధావులు, భాషావేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన పడుతున్నారు కానీ దానివలన ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే బడుగు వర్గాల వారు అభ్యంతర పెట్టటం లేదు. వారికి నోరు లేదనుకోనక్కరలేదు. వరదలు వచ్చినపుడు బాధితులు తిరగబడటం లేదా? వారి తరఫున ఎవరైనా లాయరైనా కేసు పెట్టి ఉండేవాడు. చివరగా - మనకు ఇంగ్లీషు, తెలుగు రెండిటి అవసరమూ ఉంది. రెండూ నేర్చుకుందాం. ప్రయివేటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు ఒక సబ్జక్టుగా ఉండాలని అడుగుదాం. హిందీ అంటారా, వస్తే మంచిదే, రాకపోయినా చల్తా హై. దేశంలో మంచి హిందీ మాట్లాడేవారి సంఖ్య తక్కువ. పైగా మనం 'మద్రాసీ'లమని మన మొహమే చెప్తుంది. మన హిందీదోషాలను క్షమించేస్తారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?