Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫరా!?

ఎమ్బీయస్‍: పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫరా!?

రాజకీయ పక్షపాతం మాట ఎలా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆర్కే) సీనియర్ జర్నలిస్టు. అనేక మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించగల వార్తావ్యవస్థ కలిగిన వ్యక్తి. చేరిన సమాచారాన్ని ఏమేరకు నమ్మాలి, పాఠకులకు ఎలా ప్రెజంటు చేయాలి అనేది పూర్తిగా ఆయనిష్టం. తన కొత్తపలుకులో ఆయన ప్రతీవారం జగన్‌ను తిడుతూనే ఉంటారు. ప్రజలు ఆయనతో విసిగిపోయి చంద్రబాబు కేసి చూస్తున్నారనీ రాస్తారు. నిన్న రాసిన కొత్తపలుకులో కూడా ఆ వర్గం, యీ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాలలో జగన్ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి నెలకొందని, జగన్ పోకడలను ప్రతిఘటించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని రాశారు.

ప్రజల నాడి యింత బాగా పట్టుకోగలిగిన వ్యక్తి 2019 ఎన్నికల ముందు ప్రజలు జగన్ కేసి చూస్తున్నారని, బాబు పోకడలను తిరస్కరించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని గ్రహించి, రాసి ఉండాలిగా. అప్పటికి నాడీవైద్యం నేర్చుకోలేదా, నిజం తెలిసినా అప్రియభాషణం చేసి మిత్రుణ్ని నొప్పించడమెందుకుని ఆగారా అన్నది తెలియదు. ఏది ఏమైనా ఆయన వారంవారం యిదే ధోరణిలో రాయడం, నేను పైపైన చదివి వదిలేయడం జరుగుతోంది.

అయితే నిన్నటి పలుకులో మాత్రం ఆయన చాలా విషయాలు వెల్లడించారు. కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వాటి పర్యవసానాలు ఊహించారు. వాటి గురించి ఆలోచించి, చర్చించవలసిన అవసరం నాకు కనబడింది. మొదటగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఆరోపణ లేదా సమాచారం – కెసియార్ వెయ్యి కోట్లతో పవన్‌కు వల విసిరారు అన్నది.

‘బిఎస్‌ఆర్‌తో చేతులు కలిపితే వెయ్యి కోట్లు ఖర్చయినా ఫర్వాలేదు, నేను మీకు సమకూరుస్తాను’ అని ఒకరి ద్వారా ప్రతిపాదన పంపారట. నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా అన్న పవన్, జనసైనికులు దీనికి స్పందించలేదు. ఎందుకంటే దీన్ని ప్యాకేజీగా వాళ్లు అనుకోలేదు.

రాజకీయాలను పవన్‌ ఓ వ్యాపారంగా చూస్తారని, సినిమా కాల్‌షీట్లు విక్రయించిన పద్ధతిలోనే తనను బుక్ చేసుకున్నవారి సభల కొచ్చి ఒప్పందం ప్రకారం దూషణభూషణలు చేయడానికి యింత అని పుచ్చుకుంటారనే అర్థంలో ప్యాకేజీ పదాన్ని పవన్ వ్యతిరేకులు వాడుతున్నారు. దీనికి ఆయన అభ్యంతర పెడుతున్నారు. ఈ వెయ్యికోట్లయితే జనసేన తరఫున అయ్యే ఎన్నికల ఖర్చు భరించే ఆఫర్. అంటే పార్టీ ప్రచార ఖర్చుకి, సభానిర్వహణకు, సొంత డబ్బు పెట్టుకోలేని అభ్యర్థులను గెలిపించే ఖర్చు నిమిత్తం యిస్తున్నారని అర్థం. దీనికి ఒక రైడర్ ఉంది. బిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే, రాజకీయాల్లో ఉంటూ పోరాడితేనే...! అని. ప్యాకేజీలో అలాటి షరతులు ఉండవు కదా. అందువలన దీన్ని ఆఫర్‌గానే చూడాలి.   

ఆఫర్ చేయడంలో ఎబ్బెట్టు లేదు కానీ, ఎందుకు చేశారంటే.. అని ఆర్కే చెప్పిన కారణం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఆఫర్ యివ్వడంలో మూడు ప్రయోజనాలున్నాయట. ఒకటి తెలంగాణలో కాపుల్ని ఆకట్టుకుని తను అక్కడ గెలవడం, రెండు ఆంధ్రలో కాపులను చేరదీసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును టిడిపి, జనసేనల మధ్య చీల్చి జగన్‌ను మళ్లీ గెలిపించడం, పవన్ బాబుతో కలవకుండా చూడడానికి సిఎం పోస్టు అడుగు అని ఎగదోయడం! ఈ వాదన సమర్థించుకోవడానికి ఆయన చేసిన ప్రతిపాదనలు మింగుడుపడడం కష్టం.

1)  పవన్‌కు తెలంగాణలో కాపుల మద్దతుంది 2) టిడిపి తెలంగాణకు వస్తే కమ్మలందరూ అటువైపు వెళ్లిపోతారు 3) కెసియార్ జగన్‌ను గెలిపించాలని చాలా ప్రయత్నిస్తున్నారు 4) బిఆర్ఎస్ జనసేనతో చేతులు కలపాలని అనుకుంటోంది 5) ముఖ్యమంత్రి పోస్టు కావాలని అడగమని పవన్‌ను కెసియార్ రెచ్చగొట్టవలసి వస్తోంది 6) జనసేన కన్నా బలంగా ఉన్న టిడిపి పవన్‌ డిమాండ్లకు తలవొగ్గదు 7) తమ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిని ఆంధ్రులు అవమానంగా భావిస్తున్నారు 8) ఈసారి తమ ఓటమి తప్పదనుకుంటూ వైసిపి నుంచి టిడిపిలోకి చేరాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు

1) పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రలోనే కాక తెలంగాణలో కూడా కాపులు పవన్‌తో ఉన్నారని ఆర్కే ఎలా చెప్పారో తెలియటం లేదు. పవన్ తన దృష్టంతా ఆంధ్ర మీదే పెట్టినా అక్కడ అంబ పలకటం లేదు. నాలుగేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు మర్చిపోయినా, యిప్పటికీ తనను చూడ్డానికి వస్తారు తప్ప ఓట్లేయరని ఆయనే వాపోయాడు. ఒంటరిగా పోటీకి వెళితే ఆత్మహత్యాసదృశమే అని బాహాటంగా చెప్పుకున్నాడు. ఇతరుల మాట ఎలా ఉన్నా, కాపులకు కూడా తనపై గురి కుదరలేదని గ్రహించి, ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక తెలంగాణలో ఆయన ఏమాత్రం యాక్టివ్‌గా లేడు. అలాటప్పుడు తెలంగాణ కాపులు సైతం ఆయనతో ఉన్నారని ఆర్కే ఎలా అనుకుంటున్నారో తెలియదు.

2) ఆర్కే దీని ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే, ఆయన లాజిక్ ప్రకారం టిడిపి తెలంగాణలో పునఃప్రవేశం చేయగానే కమ్మలందరూ తెరాస నుంచి టిడిపి వైపు మళ్లిపోతారు. కమ్మ ఓట్ల లోటును కాపు ఓట్లతో తీర్చుకోవడానికి కెసియార్ అర్జంటుగా పవన్‌ను చేరదీయ దల్చుకున్నారు. కమ్మయినా, మరొకరైనా పార్టీ అధినేత కులం బట్టి వేయరు. పార్టీల విజయావకాశాలు బేరీజు వేసుకుని, తమకు ఎవరు మేలు చేస్తారో లెక్కలు వేసుకుని, ఫైనల్ ఎనాలిసిస్‌లో కాస్త మొగ్గు చూపవచ్చంతే. తెలంగాణలో టిడిపి పార్టీ మొత్తం తెరాసగా రూపు మార్చేసుకుంది. టిడిపి నాయకులందరూ అధికార పార్టీలో ఉంటూ, తమ పనులు సాగించుకుంటూ, తమ కార్యకర్తలను, క్యాడర్‌ను తృప్తిపరుస్తూ కొనసాగుతున్నారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా నావను తలకిందులు చేసుకుని, చంద్రబాబుకి ఎఱ్ఱ తివాచీ పరచవలసిన పనేముంది?  

తెరాసను ఓడించి అధికారంలోకి రాగల సత్తా టిడిపికి ఉందని వారికి తోస్తేనే టిడిపి వైపు చూపు సారిస్తారు. టిడిపి ఒంటరిగా గెలవలేదని అందరికీ తెలుసు. బిజెపితో కలిసి పోటీ చేస్తే అవకాశం ఉండవచ్చు. కానీ బిజెపి దగ్గరకు రానిస్తుందా? తమకు ఏ ఛాన్సూ లేని ఆంధ్రలోనే బిజెపి టిడిపిని దూరం పెడుతోంది. కొన్ని విజయాలు సాధించి, వివిధ పార్టీల నుంచి కొందరు పెద్దనాయకులను ఆకర్షించి, గట్టి పోటీ యివ్వగల స్థాయి సంపాదించుకున్న తెలంగాణలో ‘పొట్టు తీసుకుని నువ్వు రా, నేను బఠాణీలు తెస్తాను, యిద్దరం కలిసి ఊదుకుని తిందాం’ అని టిడిపిని ఆహ్వానిస్తుందా? తెలంగాణలో బిజెపికి మేలు కలగాలంటే ఆంధ్రలో టిడిపితో చేతులు కలపాల్సిందే అని ఊదరగొడుతున్న టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్లు తెలంగాణ కమ్మలు టిడిపిని ఆదరిస్తారని అనుకోవడం అసంబద్ధం. ఒకవేళ చేసినా తెలంగాణ జనాభాలో కమ్మల శాతం ఎంత? అది పోతే కొంప మునిగిపోతుంది, కాపులతో దాన్ని భర్తీ చేయాలనుకుని కెసియార్ పవన్ వెంట పడడమేమిటి?

3) కెసియార్ జగన్‌ను గెలిపించాలని శతథా ప్రయత్నిస్తున్నారు. దానికోసం పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫర్ యివ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు అంటే నమ్మడం కష్టం. 2018లో జగన్‌కు పరోక్షంగా సాయం చేశారనే ప్రచారం బాగా ఉంది. ఆర్కేయే యీ వ్యాసంలో రాశారు, ‘జగన్‌కు భారీగా ఆర్థికసాయం చేయడంతో పాటు హైదరాబాదు నుంచి టిడిపికి నిధులు అందకుండా పోలీసుల ద్వారా కట్టడి చేశార’ని. జగన్ లక్ష కోట్లు వెనకేశాడని వీళ్లే రాస్తారు, అలాటివాడికి కెసియార్ నిధుల అవసరముందంటారా? దాని మాటెలా ఉన్నా, కట్టడి చేయడం వరకు నమ్మవచ్చు. అది చేతిలో పని. హైదరాబాదు నుంచ రాకుండా కెసియార్ కట్టడి చేస్తే, రాష్ట్రపరిధిలో నిధుల సరఫరా జరగకుండా కేంద్రం చేసిందని అంటారు. దాన్నీ నమ్మవచ్చు. బాబు తనను తిట్టినందుకు కోపంతో మోదీ ఆ పని చేశారనీ, 2018లో బాబు తెలంగాణకు వచ్చి కాంగ్రెసుతో చేతులు కలిపి తనను ఓడించడానికి ప్రయత్నించాడనే కోపంతో కెసియార్ చేశారనీ అనుకోవచ్చు.

కానీ యిప్పుడా పరిస్థితి లేదే! ఇప్పుడు బాబు తెలంగాణకు వచ్చినా వేరే ఏ పార్టీ పలకరించదు. ఖమ్మంలో సభ విజయవంతం కాగానే టిడిపి ప్రభంజనం అంటూ గంతులు వేశారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలల టైము మాత్రమే ఉన్నా, యిప్పటిదాకా ఏ ముఖ్యనేతా టిడిపిలో చేరలేదు. కెసియార్ టిక్కెట్ల పంపిణీ మొదలెట్టాక, టిక్కెట్లు రానివాళ్లలో బిజెపిలో చేరినవారు చేరగా మిగిలినవారు టిడిపిలో చేరవచ్చు. టిడిపి దృష్టంతా ఆంధ్ర మీదే ఉంది. 15 నెలల తర్వాత వచ్చే ఎన్నికల కోసం పాదయాత్రలు అక్కడ జరుగుతున్నాయి తప్ప 9 నెలల్లో వచ్చే యిక్కడి ఎన్నికల కోసం టిడిపి యిక్కడ అలాటివి చేయటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం టిడిపి పెద్ద ఫోర్స్‌గా అనుకోవడానికి ఏమీ లేనప్పుడు కమ్మ ఓట్లు పోతాయని, దాన్ని కాపు ఓట్లతో పూరించడానికి పవన్‌ను డబ్బిచ్చి ఆకట్టుకుందామని కెసియార్ చూస్తున్నారని అనడం ఏమంత సమంజసం?

టిడిపి తెలంగాణలో తనకు పోటీ కానప్పుడు, చంద్రబాబుని పోటీదారుడిగా, శత్రువుగా చూడనప్పుడు ఆంధ్రలో దాన్ని ఎలాగైనా ఓడించాలని కెసియార్ జగన్‌కు ఎందుకు సాయపడతారు? 2019లో కెసియార్, జగన్ యిద్దరూ బిజెపికి ఆప్తులే. ఇప్పుడు జగన్ మరింత ఆప్తుడు కాగా, కెసియార్ బిజెపికి బద్ధవిరోధి అయ్యారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య జలవివాదాల్లో మధ్యవర్తిగా ఉండవలసిన కేంద్రం ఆంధ్రవైపు మొగ్గుచూపే అవకాశం ఎంతైనా ఉంది. అలాటి పరిస్థితి వచ్చినపుడు జగన్‌ను ఎందుకు వెనకేసుకుని వస్తున్నావని తెలంగాణ ప్రజలు కెసియార్‌ను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పుకోగలడు? పైగా జగన్‌ను గెలిపించడానికే బిఆర్ఎస్ ఆంధ్ర శాఖ పెట్టాడని అనుకుంటే ఆంధ్రలో ఎవరైనా ఆ పార్టీలో చేరతారా? ఎవరికైనా తమ బాగే ముఖ్యం.

ఈ లాజిక్‌ను మిస్ చేస్తారు టిడిపి సమర్థకులు. తమకు నచ్చనివారందరినీ ఒకే గాటన కట్టి జగన్ నెత్తిపై రుద్దుదామని ప్రయత్నిస్తారు. తమను ఘోరంగా తిట్టిన కెసియార్‌పై ఆంధ్రులు కోపంగా ఉంటారు కాబట్టి, అతన్ని జగన్‌కు అంటగట్టేస్తే తమకు లాభమని వారి ఆశ. కానీ ఆంధ్రులకు కెసియార్‌పై ఎంత కోపం ఉందో అంచనాకు అందకుండా ఉంది. బిఆర్ఎస్ పార్టీలో ఏ అంధ్రుడూ చేరరని నేననుకున్నాను. కానీ చేరుతున్నారు. కులసమీకరణాలో, మరొకటో ఏదో రకంగా ఆ పార్టీ ఆంధ్రలో పురుడు పోసుకుంది కదా! చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత బిఆర్ఎస్‌లో చేరవచ్చంటూ న్యూస్ వచ్చింది. ఆవిడ ఇంటర్వ్యూ చూశాను. ‘ఆంధ్రులకు అన్యాయం చేసింది తెలంగాణ కోరిన కెసియార్ కాదు, విభజన జరగదంటూ ఆంధ్రులను వంచించిన ఆంధ్ర ఎంపీలే’ అన్నారావిడ.

రెండో మాట నిజమే కదా, కావూరి, రాయపాటి, ఒకరేమిటి కాంగ్రెసు ఎంపీలందరూ తమ అవసరాలు తీర్పించుకుని, రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. విడగొట్టాలని లేఖ ఎందుకిచ్చావని టిడిపి ఎంపీలు చంద్రబాబును నిలదీయలేదు. అంతా కేంద్రం యిష్టమంటూ జగన్ చేతులెత్తేశాడు. కెసియార్ యిప్పుడు తెలంగాణలోని ఆంధ్రులను యిబ్బంది పెట్టటం లేదు కదా అంటూ సుచరిత వాదించారు. ఇలాటి వాదనలతో ఆంధ్రులను కన్విన్స్ చేయగలిగితే బిఆర్ఎస్ ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చేమో కూడా. అలాటి అవకాశాన్ని కెసియార్ జగన్‌తో ఏం పని ఉందని వదులుకుంటారు?

4) జనసేన నుంచి కాపు నాయకులను గుంజుకుంటూ కాపుల పార్టీగా ఎదగాలనుకుంటున్న బిఆర్ఎస్, జనసేనతో చేతులు కలపాలని చూస్తోందా? ఎందుకట? రెండు కులాలకు ప్రాతినిథ్యం వహించేవాళ్లు పొత్తు పెట్టుకుంటే సినర్జీతో ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు. ఒకే ఓటు బ్యాంకు కోసం పోటీపడే యిద్దరు కలిస్తే ఏం లాభం? తన అభిమానులతో పాట కాపు కులస్తులను కూడా కలుపుకుందామని చూస్తున్న పవన్, తన నుంచి కాపులను వేరు చేద్దామని చూస్తున్న బిఆర్ఎస్‌ను సహిస్తారా? చేరదీస్తారా? పొత్తు పెట్టుకుంటే బొత్తిగా కాపు కూటమిగా ముద్రపడి ప్రజారాజ్యానికి పట్టిన గతే పడుతుంది. ప్రస్తుతం జనసేన-టిడిపి పొత్తు పెట్టుకుంటే కమ్మ, కాపు, బిసిలు కలిసి జగన్ వర్గాలకు పోటీ యివ్వవచ్చు, బిజెపి కూడా కలిసి వస్తే యితర అగ్రవర్ణాలూ ఓటేసి వైసిపిని ఓడించవచ్చని బాబు, పవన్ లెక్కలు వేస్తూ ఉంటే కాపు ముద్ర వేయించుకోవాలని పవన్ ఎందుకనుకుంటారు?

5) టిడిపితో పొత్తు కుదరాలంటే పవన్ ముఖ్యమంత్రి పదవి అడగాల్సిందే అని వైసిపి వర్గాలు గోల చేస్తున్నాయని యిన్నాళ్లూ తెలుగు మీడియా అంటూ వచ్చింది. ఇప్పుడు కెసియార్‌ను కూడా కలిపారు ఆర్కే. వీళ్లందరూ చెపితేనే కానీ పవన్‌కు పదవీకాంక్ష పుట్టదా? 2019లోనే సిఎం పవన్ అని అభిమానులు అరిచినప్పుడు ఆయన వారించాడా? ఈసారి అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి సిఎం కావక్కరలేదని ఆయనకు వ్యక్తిగతంగా అనిపించవచ్చు. కానీ తను సిఎం అయ్యే అవకాశం ఉందని అభిమానులకు ఆశ కల్పించకపోతే తన పార్టీకి ఓట్లు పడవని, 2019లో లాగే ఓట్లు చీలిపోతాయని ఆయనకు తెలియదా? మొదటి టెర్మ్ సిఎం కాకపోయినా, డిప్యూటీ సిఎం అయినా అవుతాడని తన అభిమానులకు తోచేట్లా చేయడం అత్యావశ్యకం.

పవన్‌కు యీ ఎన్నికలు కీలకం. ఈ సారి తను ఓ సీటు గెలిచినా ఓట్లు, ఓట్లు తక్కువ వస్తే రాజకీయ భవిష్యత్తు దెబ్బ తింటుంది. బిజెపితో కలిసి వెళ్లడం కుదిరే పని కాదు. కేంద్ర బిజెపి, వైసిపి మధ్య గాఢమైత్రి నడుస్తోంది. జగన్‌ని ఓడించడమే జీవితాశయంగా పెట్టుకున్న పవన్, టిడిపితో పొత్తు పెట్టుకోక తప్పదు. అయితే పవనే చెప్పినట్లు గౌరవప్రదమైన పొత్తు కుదరాలి. చంద్రబాబును సిఎం చేయడానికి మీరంతా ఓట్లేయండి అంటే పవన్ అభిమానులు వేయరు. ఈసారి సిఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని బాబు శపథం చేసివున్నారు. పోనీ ఉపముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? బహుశా ఆ పదవి కోసమే లోకేశ్ తన యిమేజి పెంచుకునే పని పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ స్కీములో పవన్ ఎక్కడ ఫిట్‌ఇన్ అవుతారో తెలియకే యింత తర్జనభర్జన.

6) జనసేన కన్నా బలంగా ఉన్న టిడిపి జనసేనకు సిఎం పదవి గట్రా యివ్వడానికి అంగీకరించదు కనుక పొత్తు ప్రతిపాదన వీగిపోతుంది అని జగన్, కెసియార్ వ్యూహం అని ఆర్కే అంటున్నారు. టిడిపి అంగీకరించదు అని ఘంటాపథంగా ఎలా చెప్పగలరు? తక్కువ సీట్లు వచ్చినా కీలకమైన వ్యక్తిని ప్రధానిని చేసిన ఉదంతం తాజాగా నేపాల్‌లో చూశాం కదా! మెట్టు దిగి రాకపోతే టిడిపి అధికారంలోకి రాలేదనే తోస్తోంది. నాలుగేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తప్పకుండా ఉంటుందనే లెక్క వేసినా టిడిపికి ఓ 50 రావచ్చు. ఇతర పార్టీల ఓట్లు బదిలీ అయితేనే 90 చేరగలుగుతుంది. దానికి గాను త్యాగం చేయాల్సిందే. ప్రధాన పదవులన్నీ మావే, మా పల్లకీ మోయడమే మీ పని అని యితర పార్టీలకు చెప్తే, వాళ్ల ఓటర్లు ఓట్లు వేస్తారా? మేమే పాలించాలి అనే ఆలోచనాధోరణితో 2024 ఎన్నికలలో ఓటమిపాలైతే పార్టీకి గడ్డుకాలమే. అప్పణ్నుంచి బిజెపి వచ్చి పార్టీని కబళించే ప్రమాదం ఉంది. లోకేశ్ ఏ మేరకు ఆపగలరో ఎవరూ చెప్పలేరు.

7) ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రాస్తూ ఆర్కే ‘తమ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిని ఆంధ్రులు అవమానంగా భావిస్తున్నారు’ అని రాశారు. ఔనా!? అఫీషియల్ రికార్డుల ప్రకారం ఆంధ్ర రాజధాని అమరావతే. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు రాజధాని న్యూస్ అమరావతి నుంచే ఫైల్ చేస్తున్నారు. వైజాగ్ ఏకైక రాజధాని అంటూ జగన్ నుంచి బుగ్గన దాకా అనేస్తున్నారు కానీ యింకా కాలేదు. అయితే కావచ్చు. అయినప్పుడు వైజాగ్ అని చెప్పుకుంటారు. చెప్పుకోలేని దుస్థితి ఎప్పుడుంటుంది? అమరావతి చుట్టూ భూములు కొన్న కామందులకు తప్ప రాజధాని అన్నది ఒక అంశమే కాదు. రాజధాని మార్చి అనవసర ఆర్థికభారం మోపుతున్నాడని ఆగ్రహించారు అంటే అర్థవంతంగా ఉంటుంది. అంతేకానీ అవమానంగా భావించి ఓడిద్దామనుకుంటున్నారు అని రాస్తే హాస్యాస్పదంగా ఉంటుంది.

8) ఈసారి తమ ఓటమి తప్పదనుకుంటూ వైసిపి నుంచి టిడిపిలోకి చేరాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారంటూ ఆర్కే రాశారు. ఎందరో నాకు తెలియదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఊరారు, కానీ టిడిపి మాత్రం ఊరలేదు. అందుకే ఆయన యింకా క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డారు. ఆయన గతి చూసి కాబోలు ఆనంవారు గట్టు దిగలేదు. ఈసారి టిక్కెట్టు తమకు రాదు అనుకున్న వైసిపి వారు టిడిపి వైపు చూడడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారి రాకతో అప్పటికే అక్కడున్న టిడిపి వారు ఉలిక్కిపడి కాలు అడ్డం పెట్టవచ్చు. ఇలా చివరి నిమిషంలో జరిగే ఫిరాయింపులు పార్టీ పాప్యులారిటీకి సూచికలు కావు. ప్రతిపక్షం బలపడి ఉంటే యీ పాటికే గోడదూకుళ్లు ప్రారంభం కావాలి. ఉపయెన్నికలలో, స్థానిక ఎన్నికలలో ప్రతిపక్షం తన సత్తాను చాటకపోవడం వలన అసంతృప్త వైసిపివాళ్లెవరూ బయటపడటం లేదు. వైసిపి పని అయిపోయిందని మీడియాలోనే హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో రుజువులు కనబడటం లేదు.

వాలంటీర్ల వ్యవస్థతోనే తల పట్టుకున్న టిడిపి గృహసారథుల నియామకంతో కలవర పడుతోంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల ద్వారా కాకుండా వాళ్ల ద్వారానే డబ్బు పంపిణీ జరుగుతుందని ఆర్కే రాశారు. అయితే కావచ్చు. ఇక్కడ గ్రహించవలసినది ఏమిటంటే ఇందిరా గాంధీ, ఎన్టీయార్ తరహాలో జగన్ ఎమ్మెల్యేలను బైపాస్ చేసి, ప్రజలతో డైరక్ట్ కాంటాక్ట్ పెట్టుకుందామని చూస్తున్నాడు. ఇది సహజంగానే ఎమ్మెల్యేలను మండిస్తుంది. అయితే వాళ్లు చేయగలిగినది ఏమైనా ఉందా అనేదే ప్రశ్న. గౌరవం మాట ఎలా ఉన్నా నెగ్గే పార్టీలోనే ఉందామని ప్రతీ నాయకుడూ అనుకుంటాడు. వైసిపి ప్రజాదరణ కోల్పోయిందనే ఆర్కే మాట నిజమే అయితే వైసిపి టిక్కెట్టు కోసం ఎవరూ ప్రయత్నించ కూడదు. ఇస్తానన్నా వద్దు బాబోయ్ అంటూ టిడిపిలోకి వెళ్లి చేరాలి. అలా అవుతుందో లేదో త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు యీయన తర్కం ఏమేరకు కరక్టో తేలిపోతుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా