cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మూడు రాజధానుల ముచ్చట

ఎమ్బీయస్‌: మూడు రాజధానుల ముచ్చట

ఏ రాష్ట్రంలోనూ లేనట్లు ఆంధ్రలో మూడు 'రాజధానులు' రాబోతున్నాయి. చూడబోతే యిది పేర్లలో గమ్మత్తులా ఉంది. హైకోర్టు ఉన్నంత మాత్రాన జ్యుడిషియల్‌ రాజధాని అనేస్తారా? ఉత్తర ప్రదేశ్‌లో హైకోర్టు ఇలహాబాద్‌లో ఉంది. అంత మాత్రం చేత దాన్ని రాజధాని అంటున్నారా? అసెంబ్లీ సెషన్లు వేర్వేరు ప్రాంతాలలో జరగడం జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్రల విషయంలో చూస్తున్నాం. అసెంబ్లీ సెషన్‌ జరిగినంత మాత్రాన జమ్మూను, నాగపూర్‌ను రాజధాని అనటం లేదు కదా. ఇక్కడ తేడా ఏమిటంటే అన్ని అసెంబ్లీ సెషన్లు ఒకే చోట జరుగుతాయి. అందుకని దాన్ని 'లెజిస్లేటివ్‌ రాజధాని' అనేస్తున్నారు! ఇక అసలైన రాజధాని అనగా - సెక్రటేరియట్‌ వగైరాలు ఉన్నది. దానికి ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అంటున్నారు. అమరావతే రాజధాని అంటూనే ఆచరణలో వైజాగ్‌ను రాజధాని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తోస్తోంది. 

రెండు రాజధానుల ఖర్చు అవసరమా అనేది మౌలికమైన ప్రశ్న. అవసరమే అనుకుంటే, ఏది ఎక్కడ ఉండాలి అనేది ఉపప్రశ్న.

మొదటగా మెచ్చుకోవలసినది రాయలసీమకు హైకోర్టు యివ్వడం! గతంలో కర్నూలును రాజధాని చేసినపుడు, గుంటూరుకు హైకోర్టు యిచ్చారు. ఇప్పుడు గుంటూరుకు రాజధాని యిచ్చినపుడు కర్నూలుకు హైకోర్టు యివ్వడం న్యాయం. కానీ బాబు దాన్ని విస్మరించడంతో రాయలసీమకు అన్యాయం జరిగిందని రాయలసీమేతరులు కూడా అనుకున్నారు. నిజానికి హైకోర్టుతో న్యాయవాదులకే పని. వాది, ప్రతివాది కూడా వెళ్లనక్కరలేదు. అక్కడ న్యాయవాదుల వాదనలు మాత్రమే వుంటాయి. న్యాయవాదులు, న్యాయాధిపతులు, లిటిగెంట్లకు కోర్టులతో పని వుంటుంది. సెషన్స్‌ కోర్టులు ఎక్కడి కక్కడ ఎలాగూ ఉంటాయి. కానీ హైకోర్టు యివ్వడం రాయలసీమ కొంతవరకు ఉపశమించడానికి పనికి వస్తుంది. 

రాయలసీమ లాగే ఉత్తరాంధ్రకు కూడా చాలా ఫిర్యాదులున్నాయి. వెనుకబడిన ప్రాంతమైనా తమను ఎవరూ పట్టించుకోలేదన్న బాధ ఉంది. అందువలన వారికి కూడా ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉంది. వైజాగ్‌లో ఏదో ఒక రాజధాని పెట్టడం ఆ ప్రాంతాన్నీ తృప్తి పరుస్తుంది. తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ యీ ప్రాంతాల గోల లేదు. కానీ మన తెలుగువారం ప్రత్యేకజీవులం అని నిరూపించుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే గుమ్మరించి, మనలో మనం కొట్లాటలు తెచ్చుకున్నాం. దాంతో తక్కిన ప్రాంతాలకు అభివృద్ధి లేకుండా పోయింది. సణుగుడు ప్రారంభమైంది. తమాషా ఏమిటంటే రాజధాని ఉన్న తెలంగాణ ప్రాంతం కూడా తమకు అన్యాయం జరిగిందని వాదించి, నెగ్గింది. ఈ రోజు తమిళులు, కన్నడిగులు కలిసి వున్నా తెలుగువారు మాత్రం విడిపోయి, జలవివాదాలు, ఉద్యోగవివాదాలలో మునిగి తేలుతున్నామంటే దానికి కారణం హైదరాబాదు! 

అది గుర్తించి ఆ హైదరాబాదు సిండ్రోమ్‌ను వదిలించుకునివుంటే ఐదేళ్ల క్రితమే రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగి, బాగుపడేది. ప్రభుత్వం కొంత పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులు ప్రారంభిస్తే ప్రయివేటు పెట్టుబడులు వాటంతట అవే వచ్చి, సహజంగా ఆ ప్రాంతమంతా బాగుపడుతుంది. కానీ బాబు ఆ సిండ్రోమ్‌తో బాధపడి, హైదరాబాదును తలదన్నే రాజధాని కడతానని చెప్పి బొక్కబోర్లా పడ్డారు. ఐదేళ్లలో జరిగిన లేదా జరగని పనుల పట్ల అసంతృప్తి చెందిన ప్రజలు - ఆ ప్రాంతం వారితో సహా - టిడిపిని ఓడించారు. జగన్‌ వచ్చిన దగ్గర్నుంచి వికేంద్రీకరణ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆచరణలో చేసి చూపిస్తామంటున్నారు. రెండు రాజధానుల నిర్వహణా భారం మోయడానికి కష్టమేనని వాదిస్తున్నారు కొందరు. నిజానికి రెండేసి లెజిస్లేచర్‌ నగరాలు నిర్వహించడం, జమ్మూకశ్మీర్‌కు, మహారాష్ట్రకు భారమే కదా. వాటితో పోలిస్తే ఆంధ్రకు తక్కువే అవుతుంది, ఎందుకంటే వైజాగ్‌లో అసెంబ్లీ భవనం మేన్‌టేన్‌ చేయనవసరం లేదు.  

మంత్రుల క్వార్టర్స్‌ యిక్కడా కట్టాలి కాబట్టి కొంత ఖర్చే అనవచ్చు. కానీ తెలుగు వారి మనస్తత్వం దృష్ట్యా అది అవసరమైన ఖర్చే అనిపిస్తోంది. ఎందుకంటే బాబు అన్నీ అమరావతిలోనే పెట్టడం చూసి యితర జిల్లాల వారు భగ్గుమంటూ వచ్చారు. రాజకీయ నిరుద్యోగులు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మూడు రాజధానుల కాన్సెప్టు ద్వారా తెలుగు వారు మళ్లీ విడిపోయే ప్రమాదాన్ని నివారించడం జరుగుతోంది. అయితే దేన్ని లెజిస్లేటివ్‌ కాపిటల్‌ చేయాలి, దేన్ని ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ చేయాలి అనే దగ్గర చర్చకు అవకాశం ఉంది. లెజిస్టేటివ్‌ కాపిటల్‌ అనేది పెద్ద విశేషం కాదు. అసెంబ్లీ సెషన్లు జరిగినప్పుడు మాత్రం అది చురుగ్గా ఉంటుంది. తక్కిన సమయాల్లో అక్కడ పనేమీ ఉండదు. ఎగ్జిక్యూటివ్‌ కాపిటలే ప్రధానం. సెక్రటేరియట్‌, దాని స్టాఫ్‌ నివాసాలు, మంత్రుల నివాసాలు వగైరా అక్కడే ఉంటాయి. దాన్ని అమరావతిలో పెట్టాలా లేక వైజాగ్‌లో పెట్టాలా అనేది కమిటీ తేల్చవచ్చు. పాలకులు ఒకసారి తమ మనోభావాన్ని వ్యక్తపరిచాక కమిటీ వేరేలా రిపోర్టు యిస్తుందని భావించనక్కరలేదు.

సాధారణంగా సామాన్యుడు సెక్రటేరియట్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఇన్నేళ్ల నా జీవితంలో నేను వెళ్లినది ఒక్కసారే - అదీ ఒక ప్రధానాధికారిని ఒక ఫంక్షన్‌కు ఆహ్వానించడానికి! ఇప్పుడు ఆన్‌లైన్‌ వ్యవహారాలు వచ్చాక అనేక పనులు యింట్లోంచే చేసేసుకుంటున్నాం. కొన్ని కొన్ని శాఖలను వేర్వేరు జిల్లాలలో పెడతారని కూడా విన్నాను. ఎండోమెంట్స్‌ శాఖను తిరుపతిలో, మైనింగ్‌ శాఖను కడపలో.. యిలా! అది కూడా జరిగితే రాష్ట్రంలోని ప్రజలు రాజధానికి స్వయంగా వెళ్లవలసిన అవసరం పడదు. అలాటి వికేంద్రీకరణ జరగకపోతే మాత్రం రాష్ట్రంలో ఒక మూల ఉన్న వైజాగ్‌కు బదులు మధ్యలో ఉన్న అమరావతే ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌గా ఉండటానికి అర్హత కలిగి వుంది. వైజాగ్‌ను లెజిస్లేటివ్‌ కాపిటల్‌ చేయవచ్చు.

తక్కిన అంశాలను పరిగణిస్తే అమరావతిలో కంటె వైజాగ్‌లో భూమి ఖరీదు తక్కువ నుకుంటాను. అమరావతి ప్రాంతపు సస్యభూములు నాశనం కాకుండా ఉంటాయి. వైజాగ్‌కు డిఫెన్సు వారి అభ్యంతరాలు ఉంటూంటాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఆ మధ్య వచ్చిన హుదూద్‌ లాటిది మళ్లీ వస్తే ఊరు నాశనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మాటకు వస్తే అమరావతికి భూకంప భయం ఉందన్నారు. వైజాగ్‌కు రాజధాని మారితే హైదరాబాదు నుంచి వెళ్లిన ఉద్యోగుల నోట్లో కరక్కాయ పడినట్లే. ఇప్పుడైతే ఫ్యామిలీని హైదరాబాదులో పెట్టి విజయవాడకు అప్‌ అండ్‌ డౌన్‌ వ్యవహారంలా ఉంది. సీట్లో ఉండేది తక్కువ అంటున్నారు. వైజాగ్‌ అయితే షిఫ్ట్‌ అవ్వక తప్పని పరిస్థితి. ఇక నగర వాతావరణం గురించి మాట్లాడితే హైదరాబాదు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కాస్మోపోలిటన్‌ కల్చర్‌ ఉన్నది, పరరాష్ట్రీయులను, పరభాషీయులను ఆకర్షించేది వైజాగ్‌ మాత్రమే. విజయవాడ, గుంటూరు కావు. ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

దీనిపై విస్తృతంగా చర్చలు ఎలాగూ జరుగుతాయి. కొత్త పాయింట్లేవైనా చర్చకు వస్తే వాటిపై మళ్లీ మాట్లాడుకోవచ్చు. వికేంద్రీకరణ నిజంగా చేస్తున్నందుకు హర్షణీయం. అదే విధంగా జగన్‌ పాలనలో, పార్టీలో కూడా వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది. సిఎం ఆఫీసులోనే అధికారమంతా కేంద్రీకరించడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఉద్వాసన జరిగింది. ఉపముఖ్యమంత్రులతో సహా మంత్రులందరికీ ఏ మాత్రం వాయిస్‌ ఉంటోందో తెలియటం లేదు. పార్టీలో కూడా పాలిట్‌బ్యూరో లాటిది వుందో, లేక జగనే సర్వాధికారిగా ఉన్నాడో తెలియదు. ఇటు ప్రభుత్వం, అటు పార్టీ రెండూ మేనేజ్‌ చేయలేక బాబు వంటి అనుభవజ్ఞుడే దెబ్బ తిన్నారు. జగన్‌ దాని నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనబడటం లేదు. పార్టీ పని వేరే వాళ్లకు అప్పగించకపోతే పాలన కుంటుబడుతుంది.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2019)
mbsprasad@gmail.com