cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: టిప్పు సుల్తాన్ చేయించిన జపం

ఎమ్బీయస్: టిప్పు సుల్తాన్ చేయించిన జపం

వైయస్ చేయించిన శాంతి జపం గురించి చదివాక కొందరికి అనుమానం వచ్చింది, హైందవేతరులు కూడా జపాలు చేయిస్తారా? అని. అవసరం వస్తే, భయం వేస్తే ఎవరైనా ఏదైనా చేస్తారు. మామూలుగా ముస్లిములంటే పడనివాడు కూడా ‘మీ పిల్లవాడు మాటిమాటికీ ఉలిక్కిపడుతున్నాడు, ఏ గాలో, ధూళో పట్టి వుంటుంది. వెళ్లి తావీజు కట్టించుకుని రండి’ అంటే కట్టిస్తాడు. ఇంట్లో వాళ్లు చావు బతుకుల్లో వుంటే మరో దేవుడికి మొక్కుకుని, మతం మారతామని మొక్కుకునే వారుంటారు. ఎఆర్  రహమాన్ తల్లి అలాగే ముస్లిం అయ్యారు, అలాటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మారినవారూ నాకు తెలుసు. అలాగే యితర మతస్తులూనూ. రాజులకైతే దినదినగండం కాబట్టి వాళ్లకు చాదస్తాలు మరీ వుంటాయి. అందువలన తమకు మేలు జరగాలనో, యితరులకు కీడు కలగాలనో తమ మతాన్ని ప్రయోగించి చూసి, అది పని చేయకపోతే అన్యమతసాంప్రదాయాలను అనుసరించడంలో ఆశ్చర్యం లేదు.

1749-1795 వరకు ఆర్కాటును ఏలిన నవాబు మహమ్మదాలీ వాలాజాకు చెన్నపట్నం కోటకు గవర్నరుగా వున్న ఆంగ్లేయాధికారి పిగట్టుకు పేచీ వచ్చింది. ఫ్రెంచ్ వాళ్లను ఓడించడంలో సాయం చేశాడని మహమ్మదాలీకి ఆంగ్లేయులు వాలాజా అనే బిరుదు యిచ్చారు. అతను తన రాజధాని వెల్లూరుకు సమీపంలో ఆ పేరు మీదుగా ఓ పట్నం కట్టి వాలాజా పేట అని పేరు పెట్టాడు. ప్రస్తుతం రాణిపేట జిల్లాలో వుంది. ఎంత స్నేహం వున్నా నవాబు తంజావూరును ఆక్రమిద్దామని చూస్తే పిగట్టు పడనివ్వలేదు. దాంతో నవాబుకి అతని మీద కోపం వచ్చి 5 వేల నవరసులు ఖర్చు పెట్టి, అచ్చన్న పండితుడనే బ్రాహ్మణుడి చేత చేతబడి ప్రయోగం చేయించాడట. దాని ఫలితమో కాదో చెప్పలేం కానీ పిగట్టు 1776లో పదవీభ్రష్టుడై జైల్లో చచ్చిపోయాడు.

ఇలాటి చేతబడులు తప్పించుకోవడానికైనా అవతలివాళ్లు జపాలు చేయించుకోవాలిగా! ఇటీవల హిందూద్వేషిగా ముద్ర పడిన టిప్పు సుల్తాన్ కూడా జపాలు చేయించాడంటే పాఠకులు తెల్లబోతారేమో కానీ అది వాస్తవమే. టిప్పూ తండ్రి హైదరాలీ సామాన్య సైనికుడు. తన సాహసాలతో, అదృష్టంతో రాజయ్యాడు. అతనికి జపాలు, హోమాలపై చాలా నమ్మకం. శకునాలు, రక్షరేకులు, పూజలూ పునస్కారాలూ విశ్వసించేవాడు. అనేక గుళ్లకు మొక్కుబడులు చెల్లించాడు, గోపురాలు కట్టించాడు, వస్తువాహనాలు యిచ్చాడు, దానధర్మాలు చేశాడు. మైసూరుకి దగ్గర్లో వున్న శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి వారి దేవాలయం వుంది. హైదరాలీ, టిప్పూల భవంతులు సమీపంలో వుండేవి. అయినా వాళ్లు ఆ గుడి జోలికి వెళ్లలేదు.

ఆ గుడికి సమీపంలో వున్న ఫిరంగులకు కావలసిన మందుగుండు సామాను తయారు చేసే ఫ్యాక్టరీ వుండేది. ఓ సారి దానికి నిప్పంటుకుని, ఢామ్మని పేలడంతో ఆ అదురుకి రంగనాథుడి గుడి గోపురం విరిగి కిందపడింది. హైదరాలీ వెంటనే తన సైనికులను పంపించి వాళ్ల చేతనే ఆ గోపురాన్ని మళ్లీ కట్టించాడు. మరో సారి హైదరాలీకి ఎంతో యిష్టమైన ఏనుగుకి కంటి జబ్బు చేసింది. ఏం చేసినా నయం కాలేదు. నంజన్‌గూడులోని నంజుండేశ్వరస్వామికి మొక్కుకుంటే తప్ప కన్ను పోతుందన్నారు. హైదరాలీ మొక్కుకున్నాడు. జబ్బు నయమైంది. వెంటనే నవరత్నాలు పొదిగిన హారాన్ని దేవుడికి సమర్పించాడు. దానితో బాటు తన పేరుతో ఒక లింగాన్ని ప్రతిష్ఠాపించమని కోరి డబ్బిచ్చాడు. వాళ్లు అలాగే చేసి, దానికి ‘హైదరు లింగం’ అని పేరు పెట్టారు. మైసూరులోని చాముండేశ్వరికి కూడా ఖరీదైన ఆభరణాలు, వస్త్రాలు సమర్పించాడు. తను వేయించిన ఒక నాణెంపై సింహాసనంపై కూర్చున్న పార్వతీపరమేశ్వరులను చెక్కించాడు.

హైదరాలీకి అత్యంత ఆప్తుడైన వ్యక్తి పూర్ణయ్య అనే దేశస్త మధ్వ బ్రాహ్మణుడు. అతను ఆర్థిక వ్యవహారాలలోనే కాదు, రాజతంత్రంలో, ప్రభుత్వనిర్వహణలో కూడా దిట్ట. అతని సలహాలను హైదరాలీ పాటించేవాడు. అప్పట్లో మన దేశానికి వచ్చిన విదేశీయులు పోర్చుగీసువారు, డచ్చివారు, ఫ్రెంచ్ వారు, అందరి కంటె ఆఖరిగా వచ్చి, తక్కినవారందరినీ ఓడించిన ఇంగ్లీషు వారు. హైదరాలీ పోర్చుగీసువారితో, ఫ్రెంచ్‌వారితో సఖ్యంగా వుండడంతో ఆంగ్లేయులకు ప్రబల శత్రువయ్యాడు. వాళ్లతో చేసిన యుద్ధాలనే ఆంగ్లో-మైసూరు యుద్ధాలంటారు. హైదర్ క్రైస్తవులను తన సైనికులుగా చేర్చుకున్నాడు. తన పరిపాలనలో అధికారులుగా చేసుకున్నాడు. రోమన్ కాథలిక్‌లను చర్చిలు కట్టుకోనిచ్చాడు. తన 41వ ఏట 1761లో అధికారానికి వచ్చి 1782 వరకు పాలించాడు.

అతని మరణం తర్వాత గద్దెకు వచ్చిన టిప్పు సుల్తాన్ తండ్రిని మించిన శూరుడు. 49 ఏళ్లు మాత్రమే జీవించినా మైసూరు పులిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లీషువారిని ముప్పుతిప్పలు పెట్టాడు. రాకెట్లు తయారుచేయించి వారిపై ప్రయోగించాడు. మతం విషయంలో తండ్రి విధానాలనే చాలావరకు అనుసరించాడు. క్రైస్తవులను మైసూరులో చర్చి కట్టుకోనిచ్చాడు. చాముండేశ్వరికి నగలు, బట్టలు సమర్పించాడు. తండ్రికి ఆప్తుడైన పూర్ణయ్యనే తన సలహాదారుగా, మంత్రిగా కొనసాగించాడు. అయితే అతనికి తండ్రిలా హిందూ ఆచారాలపై పెద్దగా నమ్మకం లేదు. బ్రాహ్మణులంటే పెద్ద ఆదరమూ లేదు.

అయితే తన మీదకు శత్రువులు దండెత్తి వచ్చినపుడు మాత్రం వాళ్ల చేత జపాలు చేయించేవాడు. గవర్నరు జనరల్ కారన్ వాలీసు శ్రీరంగపట్నం మీదికి దండెత్తి వచ్చినపుడు కొందరు సలహా యిచ్చారు – నూరు మంది బ్రాహ్మలు ఉపవాస దీక్ష పట్టి నదిలో రొమ్ముబంటి నీళ్లలో నిలబడి మంత్రాలు చదువుతూ సుల్తాను గారికి యిష్టసిద్ధి కలగాలని తదేకనిష్ఠతో జపం చేస్తే యుద్ధంలో జయం కలుగుతుందని! అలాగే చేయిస్తే యుద్ధంలో గెలిచాడు. ఇక అలా చాలాసార్లు జరిగిందట. కారన్ వాలీసు రెండోసారి దండెత్తినప్పుడూ యిలాగే చేయించాడు, మళ్లీ గెలిచాడు. కానీ తర్వాత జనరల్ హారీస్ దండెత్తినపుడు జపం చేయించినా టిప్పు ఓడిపోయాడు. బ్రాహ్మల్లో ఏదో లోపం వుందని తేల్చారు తప్ప జపప్రక్రియపై నమ్మకం పోగొట్టుకోలేదు!  

టిప్పుసుల్తాన్ జయంతి వివాదం వచ్చినపుడు అతను కొడగు (కూర్గు)లో, మలబారులో హిందువులను చంపించాడనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇక్కడ చూడవలసినది వాళ్లు శత్రువులా, మిత్రులా అనేది తప్ప మతం కాదు. హిందూ రాజులే కాదు, ముస్లిం నవాబులే కాదు, క్రైస్తవ చక్రవర్తులే కాదు, తమలో తాము కలహించుకున్నారు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నారు. దీనికి కులం రంగు, మతం రంగు పులమడంతో వస్తోంది చిక్కు. కూర్గులోను, మలబార్‌లోను మతం మార్పించాడని కూడా చరిత్రకారులు రాశారు. బ్రిటిషు వారికి అతనంటే ఒళ్లంతా మంట కాబట్టి అంకెలు పెంచి రాసి వుంటే వుండవచ్చు. అంత మతపిచ్చే వుంటే తన రాజ్యంలో మిగతా ప్రాంతాలలో యీ మతమార్పిడి ఉద్యమం ఎందుకు చేపట్టలేదు, అక్కడ మాత్రమే ఎందుకు చేయించాడన్నది లోతుగా పరిశోధిస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఏ ఒక్క సంఘటన బట్టి మనిషి స్వభావాన్ని నిర్ధారించలేమని మాత్రం మనం ఒప్పుకోవాలి.

కర్ణాటకలోని శృంగేరీ మఠం ఆదిశంకరాచార్యులు స్థాపించినది. హిందువులెంతో గౌరవించేది. 1791 నాటి మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు మరాఠాలను, ట్రావన్‌కూరును, నిజామును కూడగట్టుకుని, టిప్పును ఓడించారు. కానీ యుద్ధంలో అవతలి పక్షానికీ నష్టాలు జరిగాయి. అలా నష్టపోయిన మరాఠా దళాలలో పిండారీలనే వారున్నారు. ఎవరు డబ్బిస్తే వాళ్ల తరఫున యుద్ధం చేసేవారు. తక్కిన సమయాల్లో దోపిడీలు చేసేవారు. మరాఠా సర్దారైన రఘునాథ రావు కురుండవాడ్కర్ వాళ్లను ఒక దళంగా ఏర్పరచి తన తరఫున యుద్దానికి పంపాడు. యుద్ధంలో ఓడిపోయాక తిరిగి వస్తూ దారిలో శృంగేరి పట్టణం తగిలితే నష్టాలు పూడ్చుకోవడానికి వాళ్లు దాన్ని దోచుకున్నారు. తక్కిన యిళ్లతో బాటు శృంగేరీ మఠాన్ని కూడా.

మరాఠా పాలకులకు తెలియకుండానే యిది జరిగిందట. కానీ స్వాములవారికి, వారి శిష్యులకూ అన్నవస్త్రాలకే కరువైంది. ఈ సంగతి టిప్పుకు తెలియగానే వారికి ఆహారపదార్థాలూ, బట్టలూ, డబ్బూ పంపించి, మళ్లీ దాడి జరగకుండా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ విషయంగా మఠానికి, టిప్పుకు జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలూ యిప్పటికీ ఉన్నాయట. ఈ విశేషాలన్నీ చరిత్రకారులు దిగవల్లి వేంకట శివరావు గారు 1942 నుంచి ‘కథలు-గాథలు’ అనే శీర్షికతో ‘భారతి’లో రాసిన వ్యాసాల్లో రాశారు. ఇప్పుడు విశాలాంధ్ర ప్రచురణగా పుస్తకరూపంలో లభిస్తోంది. దీనితో బాటు ఆయన అప్పట్లో ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచే కొందరు ముస్లిములు పద్మం వంటి హిందూ మతచిహ్నాలు, శ్రీ చేర్చడం వంటి సాంప్రదాయాలు వాడడం ఇస్లాంకు విరుద్ధమంటూ చేసిన వాదనలను తిప్పికొడుతూ కొన్ని చారిత్రక వాస్తవాలను ఉటంకించారు.

క్రీ.శ. 1173 నుంచి 1450 వరకు దిల్లీ రాజధానిగా పాలించిన పఠాను రాజులందరూ తమ నాణాలపైన తమ పేరుకు ముందు ‘శ్రీ హమీర’ అని దేవనాగరి లిపిలో వేయించుకునేవారు. 1173 నుంచి 1186 వరకు పాలించిన మహమ్మద్ ఘోరీ తన నాణాల మీద చౌహాన్ రాజపుత్ర ఆశ్వికుడి బొమ్మ (తను ఓడించిన పృథ్వీరాజ్ చౌహాన్ గుర్తుగానా?) మరో వైపు నంది విగ్రహం, నాగరలిపిలో తన పేరుకు శ్రీ హమీర చేర్చి వేయించుకున్నాడు. మరో నాణెంపైన లక్ష్మీ విగ్రహం, రెండో పక్క నాగరలిపిలో తన పేరు వేయించుకున్నాడు. ఇతనికి అజ్మీర్‌లో అనేక దేవాలయాలు నేలమట్టం చేసిన చరిత్ర వుంది. అయినా అది వేరే, యిది వేరే. 1121-36 మధ్య ఏలిన షంసద్దీన్ ఇల్తమష్ కూడా తన నాణాలపై ఒకవైపు చౌహాన్ ఆశ్వికుడు, నంది విగ్రహాలు, మరో వైపు శ్రీ హమీర సురితాణా సమసదీన్ అని వేయించుకున్నాడు. కొన్నిటిలో తన పేరు చివర ‘దేవ’ అని చేర్చుకున్నాడు. అతని తర్వాత రాజులు కూడా నాణాలపై నంది విగ్రహాలను వేయించుకున్నారు.

అంతేకాదు,  4, 5, 6, 8 రేకులు గల పద్మాలలో అరబ్బీ, ఫార్శీ శాసనాలు రాయించారు. ఇవన్నీ హైందవ మంత్రశాస్త్ర సంప్రదాయానికి చెందిన పద్మాలే! మొగలాయీలు తన నాణాల మీద హిందువుల దేవతా విగ్రహాలు చాలా విరివిగా ముద్రించారు. సూర్యబింబం, సింహరూపం, మీనం, నక్షత్రాలు, రాశిచక్రంలో 12 చిహ్నాలు.. యివన్నీ వేశారు. నాణాల మీద వేసిన పారశీ అక్షరాల చుట్టూ గులాబీదండలు, యితర పూలదండలు చెక్కించారు. అక్బరు తన పాలనను రామరాజ్యంగా చెప్పుకోవడానికి యిష్టపడేవాడు. 1604లో తన పాలనకు చాంద్రమాన లెక్క ప్రకారం 50 సం.లు పూర్తయ్యాయంటూ నాణాలు వేయించినప్పుడు కోదండపాణి, సీతాదేవి బొమ్మలు వేయించాడు. జహంగీరు పాలన వచ్చేసరికి ఖురాను నియమాలకు విరుద్ధంగా నాణాల మీద తన బొమ్మ వేయించుకున్నాడు. మరో పక్క సూర్యుడు, సింహం బొమ్మలు వేయించాడు. ముస్లిములు చంద్రుణ్ని ఆరాధిస్తారని అందరికీ తెలుసు. కానీ అక్బరు, జహంగీరు సూర్యారాధనను ప్రోత్సహించారు.

ఔరంగజేబు హిందూ చిహ్నాలేవీ వాడలేదు కానీ అతని తర్వాత 1707 నుంచి 1857 వరకు పాలించిన మొగలాయి చక్రవర్తుల కాలంలో నాణాల మీద గులాబీ, సూర్యబింబం, నక్షత్రం, సింహం, మీనం, త్రిశూలం కూడా వేయించారు. ఇతర దేశాల మసీదుల్లో పద్మాన్ని వాడరేమో కానీ భారతదేశంలోని మసీదుల్లో గుమ్మటాల మీద పద్మాలు వుంటున్నాయి. చివరకు ఔరంగజేబు కట్టించిన మసీదులపై కూడా! ఈ వివరాలన్నీ రాసిన శివరావుగారు హోలీ పండుగ జరిపిన ముస్లిము రాజుల గురించి కూడా రాశారు. అది కొంప ముంచిన సందర్భం గురించి కూడా రాశారు. కల్నల్ టాడ్ రాసిన ‘రాజస్థాన్ కథావళి’లో దాని ఉదంతం వుందట, దాని ఆధారంగా రవీంద్రనాథ్ ఠాగూరు ఓ ఖండకావ్యం రాశారట. కథేమిటంటే ఢాకర్, కేషర్ ఖాన్ అనే యిద్దరు పఠాను సోదరులు రాజస్థాన్‌లోని కోటా సంస్థానపు రాజు భోనాంగుణ్ని ఓడించి రాజ్యం ఆక్రమించుకున్నారు. అతను, తన భార్యతో సహా బావమరిది రాజ్యంలో తలదాచుకున్నాడు.

పరాక్రమంతో పఠాన్లను ఓడించలేమని గ్రహించిన భోనాంగుడి భార్య ఒక పన్నాగం పన్నింది. రాబోయే హోలీలో తను, మూడు వందల మంది చెలికత్తెలతో వచ్చి మీతో హోలీ ఆడుతాం అని పఠాను సోదరులకు కబురు పెట్టింది. వాళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే రాణి వేషంలో వెళ్లినది భోనాంగుడు, చెలికత్తెల వేషంలో వెళ్లినది బావమరిది సైనికులు. పరదా పేరుతో ముసుగులు వేసుకుని పల్లకీలలో కోటలోకి ప్రవేశించి, పఠాను సైనికుల మీద బుక్కా చల్లి, కళ్లు కనబడకుండా చేశారు. ఆ పై నృత్యాలు చేస్తూ వాళ్లచేత భంగు తాగించారు. ఆ తర్వాత భోనాంగుడు కేషర్ ఖాన్ నెత్తిమీద హోలీ కుండ పగలకొట్టాడు. ఆ సిగ్నల్ అందుకుని 300 మంది సైనికులు తమ పరికిణీలలోంచి కత్తులు బయటకు తీసి ముఖ్యులందరినీ చంపేసి, రాజ్యాన్ని వశపరుచుకున్నారు.

ముస్లిము రాజులందరినీ ఒకే గాట కట్టలేము. ఔరంగజేబు తోడబుట్టినవాడైన దారా షికో హిందూ అభిమాని. సోదరుల మధ్య జరిగిన యుద్ధంలో అతను గెలిచివుంటే జిజియా పన్నుల వంటివి వుండేవి కావేమో! ఔరంగజేబు మనుమడు అజీం ఉషాన్ 1696లో బెంగాల్ సుబేదారుగా వున్నాడు. అతను హిందూ దుస్తులు ధరించి కొన్ని హైందవాచారాలు పాటించాడు కూడా. ఇతను హోలీలో పాల్గొనడం విని ఔరంగజేబు చివాట్లు వేస్తూ లేఖ రాశాడట. ఔరంగజేబు వారసులు కూడా హోలీలో పాల్గొన్నారని ఇర్విక్ రాశాడట. సయ్యద్ సోదరుల్లో పెద్దవాడైన కుతుబ్ ఉల్ ముల్క్‌కు చాదస్తాలు ఎక్కువట. దర్బారులో కొలువు తీరినప్పుడు ధూపహారతులతో దిష్టి తీయించుకునేవాడట.

ఇవన్నీ చదివినప్పుడు మనం ఆశ్చర్యపడడానికి కారణం – మనకు చరిత్ర చెప్పిన తీరు. నింపాదిగా కూర్చుని ఆలోచిస్తే తక్కిన దేశాల్లో మతస్తులు ఎలా ప్రవర్తించినా, తొలి నుండీ బహుళత్వం వర్ధిల్లిన మన దేశంలో మాత్రం మతసామరస్యం వుంటూ వచ్చింది. రాజుగారు హిందూ, రాణి జైనురాలు- అన్న హిందూ, తమ్ముడు శిఖ్కు – తండ్రి హిందూ, కొడుకు క్రైస్తవుడు – బంధువులలో ఒకరు ఇస్లాంకు మారడం, మరొకరు మారకపోవడం (ఎఆర్ రహమాన్ కేసులా) యిలా కుటుంబాలలో కనబడుతూనే వున్నాయి. కానీ ఇంగ్లీషు వాళ్లు మనమంతా తరతరాలుగా కొట్టుకుని ఛస్తూ వున్నామనే కోణంలో మనకు చరిత్ర నేర్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని వివిధ సంస్థానాలను ఓడిస్తూ వచ్చినపుడు అధికాంశం ముస్లిముల చేతుల్లోనే వున్నాయి. కంపెనీ అక్రమాలు పెచ్చుమీరి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినపుడు తిరుగుబాటుదారుల లక్ష్యం దిల్లీ గద్దెపై ఆఖరి మొఘలాయీ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను కూర్చోబెట్టడం.

ఆ తిరుగుబాటులో ముస్లిము రాజులు, రాణులతో బాటు ఎందరో హిందూ రాజులు, రాణులు పాల్గొన్నారు. ఆ తిరుగుబాటు తర్వాత పరిపాలనను తన చేతిలోకి తీసుకున్న బ్రిటిషు ప్రభుత్వం యీ సంగతి గుర్తించి, వీళ్లని విడగొట్టకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించి ఆ దిశగా పథకాలను రచించింది. ఎకడమిక్‌గా వివరాలు సేకరించి, చరిత్రను అధ్యయనం చేసి, సాధ్యమైనంత వరకు నిజాయితీగా విషయాలు చెప్పిన ఆంగ్లచరిత్రకారులు ఎందరో వున్నారు. అయితే పాలకులు వారు చెప్పినవాటిని తమ దృక్కోణంలో (పెర్‌స్పెక్టివ్) పోతపోశారు. అందుకే దేశచరిత్రను హిందూ పీరియడ్, ముస్లిం పీరియడ్ అంటూ విభజించి పాఠాలు చెప్పారు. (బ్రిటిషు చరిత్రను కాథలిక్ పీరియడ్, ప్రొటెస్టండ్ పీరియడ్ అని విడగొట్టలేదు) హిందువులు వేరు, ముస్లిములు వేరు, ఒకరితో మరొకరికి ఎప్పుడూ పడదు అని నూరిపోశారు.

తమను పదవీభ్రష్టులను చేసిన ఆంగ్లేయులతో ముస్లిములకు పడేది కాదు. వాళ్లు ఇంగ్లీషు నేర్చుకోవడానికి నిరాకరించారు. వారిని ఆంగ్లేయులు నమ్మలేదు కూడా. హిందువులు ఇంగ్లీషు నేర్చుకుని ప్రభుత్వోద్యోగాలలో కుదురుకోవడం చూసి, 1875లో ఆలీగఢ్ ముస్లిము యూనివర్శిటీ స్థాపించి ముస్లిములను ఇంగ్లీషు నేర్చుకోమని, లేకపోతే వెనకబడిపోతారని ఉద్బోధించాడు. కాంగ్రెసు ఆవిర్భావం తర్వాత హిందూ, ముస్లిములందరూ ఆ జండా కింద తమను ఎదిరించడం మొదలెట్టేసరికి, బ్రిటిషు వారు కాంగ్రెసును హిందూ ప్రయోజనాలను కాపాడే పార్టీగా ముద్రవేసి, ముస్లిం లీగును దువ్వనారంభించారు. కాంగ్రెసులో వున్న ముస్లిములను ముస్లిం లీగు వారు మతద్రోహులని యీసడించేట్లా చేశారు.

తమాషా ఏమిటంటే జాతీయ ఐక్యత బోధించిన కాంగ్రెసును బ్రిటిషు ప్రభుత్వం నానా హింసలూ పెట్టింది కానీ మతం పేరు మీద జనాల్ని చీల్చిన హిందూ మహాసభ, ఆరెస్సెస్, ముస్లిం లీగులను కానీ కులం పేరు మీద జనాల్ని చీల్చిన ద్రవిడ పార్టీలను కానీ, యింకా యితర కులనాయకులను కానీ ఎన్నడూ నిషేధించలేదు. ఆంక్షలు పెట్టలేదు. హిందూ మహాసభలో కానీ, ఆరెస్సెస్‌లో కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారు వ్యక్తిగత హోదాలో పాల్గొని అరెస్టయినవారే తప్ప సంస్థాపరంగా కాదు. పైగా వారిలో కొందరు కాంగ్రెసు పార్టీలో వుండగా జైలుకి వెళ్లారు.

బ్రిటిషు వారు మన దగ్గరే కాదు, వారు వలసపాలన చేసిన ప్రతీ దేశంలోనూ యిలాటి ట్రిక్కులే వాడారు. ఇప్పటికీ ప్రపంచంలోని పాలకులందరూ ‘విభజించి పాలించు’ సిద్ధాంతాన్ని పాటిస్తూనే వుంటారు. ఆనాటి రాజులు కానీ, యీనాటి మంత్రులు కానీ ఎవరికైనా అధికారమే ముఖ్యం. దానికి సహకరించినవాడు మనవాడు, లేనివాడు పరాయివాడు. అయితే మనల్ని ఏమార్చడానికి కులం, మతం, ప్రాంతం పేర్లు వాడుతూంటారు. మనం కళ్లు తెరుచుకుని, చెవులు విప్పార్చి, మెదడును విశాలం చేసుకుని పక్షపాతరహితంగా అన్నీ గ్రహిస్తూంటే మనకే బోధపడుతుంది – యిదంతా ఓ గేమ్ అని. తలుపులు, కిటికీలు మూసేసుకుని మనకు వచ్చే వాట్సాప్‌లు మాత్రం చదివి అదే పరమసత్యం అనుకుంటే మనకూ, సమాజానికీ చేటు.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×