Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: త్రిపుర నాయకత్వంలో మనస్పర్ధలు - 3/3

ఎమ్బీయస్‌: త్రిపుర నాయకత్వంలో మనస్పర్ధలు  - 3/3

ప్రమాదకరమైన ఆట - సిపిఎంను ఎలాగైనా బలహీన పరచాలని అందువలన విచ్ఛిన్నకారులతో చేతులు కలిపే దుస్సాహసం చేశారు. గిరిజనుల కోసం  'త్విప్రలాండ్‌' పేర ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్న ఇండిజెనస్‌ ఫ్రంట్‌ పీపుల్స్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో పొత్తు కుదుర్చుకున్నారు. అది కుదరడంలో ఒక నాటకీయ పరిణామం జరిగింది. 1996 నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్న గిరిజనోద్యమం రకరకాల పేర్లు మార్చుకుని 2001లో ఇండిజెనస్‌ ఫ్రంట్‌ పీపుల్స్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)గా పేరు పెట్టుకుంది. 2003, 2008 ఎన్నికల్లో ఓడిపోవడంతో 2009లో చీలిపోయింది. దానికి 2016లో బిజెపి జీవం పోసి సఖ్యంగా ఉండసాగింది.

అయితే బిజెపితో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ఐపిఎఫ్‌టీ వెనకాడుతోంది. అలాటి సమయంలో ఆ పార్టీలో సీనియర్‌ నాయకుడి కొడుక్కి గుండెజబ్బు వచ్చింది. ఆపరేషన్‌ చేయించాలంటే డబ్బు కావాలి. అసాం నుంచి పార్టీ పని మీద త్రిపుర వచ్చిన హిమంతకు ఆ విషయం తెలియవచ్చింది. వెంటనే అతనితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా గువాహటిలోని డా. దేవీ షెట్టి అనే కార్డియాలజిస్టుతో ఎపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసి యీ కుర్రవాడికి అక్కడ ఆపరేషన్‌ తన ఖర్చు మీద జరిపే ఏర్పాటు చేశాడు. అంతే ఆ నాయకుడు ఫిదా అయిపోయాడు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో కీలకమైన పాత్ర వహించాడు. హిమంత ఐపిఎఫ్‌టి చీఫ్‌ ఎన్‌సి దేవ్‌వర్మను దిల్లీ తీసుకుని వచ్చి మోదీతో, రాజనాథ్‌ సింగ్‌తో మాట్లాడించాడు. అదే పార్టీలోని రాజేశ్వర్‌ దేవ్‌వర్మ వర్గాన్ని బిజెపిలో కలిసేందుకు ఒప్పించాడు. 

వాళ్లతో పొత్తు పెట్టుకుంటే సాధారణంగా 70% జనాభా ఉన్న బెంగాలీలకు కోపం వచ్చి దూరమవుతారు. కానీ 'అత్తతో అమ్మి, కోడలితో కొనడం' వంటి అసాధ్యమైన పనిని సునీల్‌, అతని టీము సాధించారు. 'వైరుధ్యాలను మేనేజ్‌ చేయడమే రాజకీయం. అసాంలో బోడోలు వేరే రాష్ట్రాన్ని అడుగుతున్నారు. కానీ వాళ్లతో పొత్తు పెట్టుకున్నాం, రెండేళ్లగా వాళ్లని ఆపి ఉంచాం.' అన్నాడు హిమంత. అలాటి రాజకీయం మన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెసు, టిడిపి మనకు రుచి చూపించాయి. వేర్పాటువాదులైన తెరాసతో పొత్తు పెట్టుకుంటూనే ఆంధ్ర ప్రాంతంలో ఓట్లు సంపాదించాయి. వాళ్లను ఒప్పిస్తామని యిక్కడా, వీళ్లను ఏమారుస్తామని అక్కడా చెప్పుకొచ్చారు. అదే పని బిజెపి అక్కడ చేసింది.

ఐపిఎఫ్‌టీతో పొత్తు పెట్టుకుంటూనే రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తున్న బెంగాలీలతో తాము ప్రత్యేక గిరిజన రాష్ట్రానికి మద్దతు యివ్వటం లేదని చెప్పుకుంది. బెంగాలీలు అది నమ్మారు. 2017 డిసెంబరు 15 న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అగర్తలాలో బహిరంగ సమావేశం పెడితే 35 వేల మంది హాజరయ్యారు. అంటే ఒక నియోజకవర్గ ఓటర్లన్నమాట. (2018 ఎన్నికలలో ఐపీఎఫ్‌టి పోటీ చేసిన 9 స్థానాల్లో 8 గెలిచింది. సిపిఎం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. గతంలో 19 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఉపముఖ్యమంత్రి, గిరిజనుడు అయిన దేవ్‌బర్మన్‌ కూడా ఓడిపోయాడు). గిరిజనులకు త్రిపుర రాజవంశమంటే ఎనలేని గౌరవం. అందువలన ఆ కుటుంబానికి చెందిన 59 ఏళ్ల జిష్ణుదేవ్‌ బర్మన్‌ను బిజెపిలోకి ఆహ్వానించారు. త్రిపుర అభ్యర్థులందరిలోను ఆయనే మిక్కిలి ధనవంతుడు.  గిరిజనుడు, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్త ఐన రామ్‌పాద్‌ జమాటియాకు గిరిజనులను ఒప్పించే పని యిచ్చారు.  

అలుపెరుగని ప్రచారం - సునీల్‌ రెండున్నరేళ్లలో మొత్తం నియోజకవర్గాలను మూడు సార్లు చుట్టి వచ్చాడు. 2009లో బిజెపి సభ్యుల సంఖ్య 10 వేలు. దేవధర్‌ 2015 నాటికి దాన్ని 1.75 లక్షలకు తీసుకువచ్చాడు. ఏడాది క్రితం 4 లక్షలైంది. అంటే ఓటర్లలో ఆరోవంతు బిజెపి సభ్యులే అన్నమాట. 2014లో ఆరెస్సెస్‌ శాఖలు 60 ఉంటే యిప్పుడవి 265కి పెరిగాయి. ఆ శాఖలు సామాజిక సేవ ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, రైతు విభాగాలు ఏర్పరచి ఆందోళనలు చేపట్టారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చే ముస్లిములకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

ప్రజల సెల్‌ఫోన్లు సేకరించి వాటికి వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రాంలు, వీడియోలు, కార్టూన్లు, ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌ అన్నీ పంపి వాళ్లను ఆకట్టుకున్నారు. యువతను బిజెపి వైపు ఆకర్షించే పని యువమోర్చాకు అధ్యక్షుడిగా ఉన్న టింకూ రాయ్‌కు అప్పచెప్పారు.అవతల సిపిఎం సాంప్రదాయ పద్ధతులనే నమ్ముకుంది. మాణిక్‌ సర్కార్‌ స్మార్ట్‌ ఫోన్‌ వాడే వారు కాదు. దీని ప్రభావం యువతపై బాగా పడింది. ఉద్యోగాలు కల్పిస్తామనడంతో తలిదండ్రులు సిపిఎంకు వేసినా పిల్లలు బిజెపికి వేశారు. ఆరెస్సెస్‌ నచ్చకపోయినా మోదీ నచ్చాడు వాళ్లకి. కనీసం 10% యిలా క్రాస్‌ ఓటింగు జరిగి ఉంటుందని బిజెపి నాయకుల అంచనా. 

బూత్‌ మేనేజ్‌మెంట్‌ - ఒక్కో బూత్‌లో 17-18 పేజీల ఓటర్ల జాబితా ఉంటుంది. ఒక్కో పేజీకి ఒక్కో పన్నా (పేజీ) ప్రముఖ్‌ను నియమించారు. ఆ పేజీలో ఉన్న 60 మంది ఓటర్ల చేత ఓట్లేయించడం అతని బాధ్యత. మొత్తం 3214 బూతులుంటే 5 తప్ప అన్నిటికి ఏజంట్లున్నారు. ప్రతి 5 బూత్‌లకు శక్తి కేంద్ర విస్తారక్‌ పేర యిన్‌చార్జి. మిస్డ్‌ కాల్‌ యిస్తే స్పందించి 2 లక్షల మంది కొత్త ఓటర్లను నమోదు చేయించింది. రైళ్లలో బిజెపి వాలంటీర్లు కరపత్రాలు పంచేవారు. నీటి సరఫరా, గ్యాస్‌ సప్లయి వంటి సమస్యల గురించి సమాచారం సేకరిస్తూ, దాన్ని తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఎన్నికలకు ముందు అసాం నుంచి 400 మందిని రప్పించుకున్నారు.

మొత్తం 5 వేల మంది బిజెపి, ఆరెస్సెస్‌ కార్యకర్తలు బయట నుంచి వచ్చారట. ఎన్నికలకు ముందు జరిగిన దాడుల్లో గాయపడిన కార్యకర్తల కోసం బిజెపి రూ. 15 లక్షలు ఖర్చు పెట్టింది. మోదీ దూత్‌ యోజనా అనే పేరు మీద బిజెపి కార్యకర్తలు మోదీ బొమ్మున్న టీషర్టులు వేసుకుని కేంద్రసంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించేవారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్‌లైన్‌లో కూడా ఆమోదించి యిబ్బడిముబ్బడిగా సభ్యులను పెంచాడు. ఎన్నికలలో డబ్బు విస్తారంగా ప్రవహించింది. ఓటు అమ్ముకోవడం తెలియని త్రిపుర వాసులకు డబ్బు, లాప్‌టాప్‌లు, ఖరీదైన బట్టలు రుచి చూపించారు. 'రెండువేల రూపాయల నోటు కూడా చూడని త్రిపుర కుటుంబాలకు 20 వేల చొప్పున యిచ్చారని విన్నాను' అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు. 

మాణిక్‌పై ప్రచారం - మాణిక్‌ మీరనుకుంటున్నంత సింపుల్‌ మనిషేమీ కాదు, ఫాబ్‌ ఇండియా వాళ్లచేత తన కుర్తాలు డిజైన్‌ చేయించుకుంటాడు, అతని కళ్లజోడు చాలా ఖరీదైనది, తన వ్యవసాయక్షేత్రం ఆర్గానిక్‌ కూరలు పండించుకుంటాడు - వంటి చిల్లర ఆరోపణలు మొదలెట్టారు. ఇవి విని మాణిక్‌ నవ్వేశాడు. నా కళ్లజోడు ఖరీదు 1500 రూ.లు. ఇక నా బట్టలకు బిల్లులిమ్మంటే యిస్తాను. ఇవన్నీ పట్టించుకోవడం టైము వేస్టు అన్నాడు. అతని ప్రభుత్వంపై అవినీతి ముద్ర కొట్టడం అసాధ్యం. అందువలన రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ స్కాములో అతని అనుచరులు యిరుక్కున్నారని ప్రచారం చేశారు. చిట్‌ఫండ్‌ అధినేత గౌతమ్‌ కుండు యిప్పుడు జైల్లో ఉన్నాడు.

త్రిపురలోని కమ్యూనిస్టు పాలనలో వచ్చిన అవినీతి, రాజకీయ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, బంధుప్రీతి, కేంద్రంపై విషం చిమ్మడం వంటి ఆరోపణలతో ముంబయి జర్నలిస్టు దినేశ్‌ కానాజీచేత మరాఠీలో ఒక 92 పేజీల పుస్తకం రాయించి, దాన్ని బెంగాలీలోకి 'మాణిక్‌ రాజార్‌ దేశే' పేర అనువదింపచేసి ఎన్నికలకు నెల్లాళ్ల ముందు అగర్తలాలో ఆవిష్కరింప చేశారు. సుశీల్‌ బర్మన్‌ అనే అతని చేత ''లాల్‌ సర్కార్‌'' అనే పేర డాక్యుమెంటరీ కూడా తీయించారు. ఈ రెడీమేడ్‌ సరుకు పెట్టుకుని యిప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి బిజెపి వారు వారిపై కేసులు పెట్టి విచారణ సాగిస్తారో లేదో చూడాలి. వదిలేస్తే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినట్లే అనుకోవాలి. 

త్రిపుర ప్రభుత్వం 2010, 2013లో ప్రభుత్వ స్కూళ్లలో 10,323 మంది టీచర్లగా నియమించింది. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2009 ప్రకారం వారికి సరైన అర్హతలు లేవు కాబట్టి వారి నియామకం చెల్లదంటూ 58 మంది పిటిషన్లు పెడితే, అవును చెల్లవు అంటూ హైకోర్టు 2014 మేలో తీర్పు యిచ్చింది. త్రిపుర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవు పిటిషన్‌ వేసింది. 2017 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ  తీర్పు యిచ్చింది. అయితే 2017 డిసెంబరు వరకు ఉద్యోగాలు కొనసాగించడానికి అనుమతి యిచ్చింది. ఆ గడువు అయిపోతూ ఉండగా మరో ఆర్నెల్లు పొడిగించింది. ఇది మాణిక్‌ సర్కార్‌కు యిబ్బందికరంగా మారింది. బిజెపి వాళ్లకు దారి చూపుతానంది. ఏం చేస్తుందో చూడాలి. 

ఐటీకి అడ్డుపడ్డాడా?- మాణిక్‌ బెంగాలీ దురభిమాని అని, గిరిజనులకు ఉద్యోగాలివ్వలేదని గిరిజన ప్రాంతాల్లో ప్రచారం చేశారు. బెంగాలీల్లో ఎవరికీ ఉద్యోగాలు యివ్వలేదని ప్రచారం చేశారు. 2015 ఆగస్టులో త్రిపుర రాజధాని అగర్తలాలో ఐటీ కాన్‌క్లేవ్‌ జరిగింది. త్రిపురలో చాలామంది పెట్టుబడులు పెడతామని అన్నారు. ముంబయి, చెన్నయ్‌ తర్వాత అగర్తలా దేశంలోని మూడో ఇంటర్నెట్‌ గేట్‌వే అన్నారు. త్రిపురలో ఐటీ పరిశ్రమ పెరిగితే అది బంగ్లాదేశ్‌ ఐటీ ఇండస్ట్రీకి బ్యాక్‌అప్‌గా పనికి వస్తుందని ఆ సదస్సు నిర్వహించిన నిర్వాహకులు అన్నారు. వారి ఆశాభావానికి మూలం ఏమిటంటే అంతకు ముందే బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ అనే తీరపట్టణం నుంచి అగర్తలా వరకు యింటర్నెట్‌ కేబుల్‌ వేయడానికి, బంగ్లాదేశ్‌ నుంచి అదనంగా వున్న బాండ్‌విడ్త్‌ కొనడానికి యిరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ సదస్సు తర్వాత కథ ముందుకు సాగలేదు. దానికి కారణం ఏమిటో యితమిత్థంగా తెలియదు. ఇన్నాళ్లూ త్రిపురకు నిధులు విదల్చని కేంద్రం యిప్పుడు బిజెపి ప్రభుత్వం వచ్చాక రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, అవీ వేసి యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేసి, టూరిజం పెంచడంతో బాటు టిసిఎస్‌ చేత అక్కడో యూనిట్‌ పెట్టించి ఐటీ పార్కు పెడదామని సన్నాహాలు చేస్తోంది. చివరకు త్రిపురలో తటస్థులు కూడా 'మాణిక్‌ మంచివాడే కానీ, ఒకసారి మార్చి చూద్దాం' అనుకోసాగారు. బిజెపి ఆ మూడ్‌ను బాగా పట్టుకుని 'చలో, పల్‌టాయ్‌' (మార్చిచూద్దాం పదండి) అనే నినాదం యిచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు - 25 ఏళ్లగా ఒకే పార్టీ పాలిస్తూన్నపుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడం సహజం. ఆ ఓటు బిజెపి, కాంగ్రెసు, తృణమూల్‌ మధ్య చీలిపోవాలి. కానీ చీలలేదు. తన పార్టీని చీల్చి 6గుర్ని లాక్కుపోయినందుకు కాంగ్రెసుకు తృణమూల్‌పై కోపం వుంది. అందువలన ఎన్నికలలో పొత్తు కుదుర్చుకుందామనే ప్రతిపాదన వచ్చినపుడు 'మీ నాయకులను బిజెపి ఎగరేసుకుని పోయింది. ఇక మీ బలమేముంది? 5 సీట్లు యిస్తా చాలు' అంది. ఇటు తృణమూల్‌ ఏకంగా 30 సీట్లు అడిగింది. పొత్తు కుదరలేదు. చివరకు కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేసింది. తృణమూల్‌ ఐఎన్‌పిటి అనే గిరిజన వేర్పాటువాద పార్టీతో పొత్తు పెట్టుకుంది. 24 మందిని నిలబెట్టింది. సోదిలోకి లేకుండా పోయింది. కాంగ్రెస్‌ వైఫల్యం ఎంతలా వుందంటే 2013లో 36.5% ఓట్లు, 10 సీట్లు వస్తే యీసారి సగం బూతులలో మాత్రమే వాళ్లకు ఏజంట్లున్నారు. రాష్ట్రమంతా కలిపి కాంగ్రెసుకు వచ్చినది 41 వేలే. 1.8%. సీట్లు శూన్యం. అందుచేత ప్రభుత్వ, వామపక్ష వ్యతిరేక ఓటు మొత్తం బిజెపి కైవసం చేసుకుంది. 

ఫలితాలు - బిజెపి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సిపిఎం కార్యకర్తలు పెద్దగా ప్రయత్నించలేదు. 20 ఏళ్లు వరుసగా అధికారంలో ఉండడంతో వారిలో నిర్లక్ష్యం, అహంకారం, రౌడీయిజం బాగా పెరిగాయి. తాము ఓడిపోవడం జరగదనే అతివిశ్వాసంతో ఉన్నారు. అంతిమంగా చూస్తే బిజెపికి 43% ఓట్లు వస్తే, సిపిఎంకు 42.7% (2013లో కంటె 6.3% తగ్గాయి) వచ్చాయి. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఐపిఎఫ్‌టికి 7.5% ఓట్లు వచ్చాయి.

సీట్ల విషయానికి వచ్చేసరికి వాళ్లిద్దరికీ కలిపి 35 ప్లస్‌ 9, 44 వస్తే సిపిఎంకు 16 వచ్చాయి. 2013 అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం 55 స్థానాల్లో నిలబడి 49 స్థానాల్లో గెలిచింది. . బిజెపి గెలుపు మార్జిన్లు కూడా ఘనంగా ఉన్నాయి. బిజెపి కూటమికి గెలిచిన 44 స్థానాల్లో నాలుగోవంతు స్థానాల్లో మాత్రమే 2 వేల కంటె తక్కువ మార్జిన్‌ వచ్చింది, సిపిఎంకు 9 స్థానాల్లో మాత్రమే 2 వేల కంటె ఎక్కువ వచ్చింది. బిజెపి గెలుపు అసంభవం అనుకున్న మాణిక్‌ ఫలితాలు విని తేరుకోలేక పోయాడు. ఆయన సమీప ప్రత్యర్థి కంటె 16% మార్జిన్‌తో నెగ్గాడు.  

వర్తమానం - ఇటువంటి అపూర్వవిజయం సాధించి పెట్టిన సునీల్‌ దేవ్‌ధర్‌ పట్ల విప్లవ్‌ దేవ్‌ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రిగా తను తగడని గతంలో అధిష్టానానికి చెప్పాడనే కోపంతో అతను సునీల్‌ను దూరంగా పెట్టాడు. ఎన్నికల అనంతరం పార్టీ సమావేశాలకు సునీల్‌ను, అతని అనుచరులను పార్టీ సమావేశాలకు పిలవడం మానేశాడు. ఒక సమావేశంలో యిరు వర్గాలకు మధ్య వాగ్వివాదం కూడా జరిగింది.

రాష్ట్రంలో తను తప్ప వేరేవారెవరికి ప్రాముఖ్యత ఉండకూడదని అతని ఆశ. సునీల్‌ యిటీవల అగర్తలా ఓ ఆటోమొబైల్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లడం అతనికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విభేదాలు ఎంత ముదిరాయంటే రాజధానిలో ఏప్రిల్‌లో జరిగిన బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సమావేశానికి సునీల్‌ హాజరుకాలేదు. కార్మికుల సదస్సుకు కూడా వెళ్లలేదు. పాత్రికేయులు కారణం అడిగితే 'నేను రెండేళ్లపాటు యీ రాష్ట్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో కొన్ని సంస్థాపరమైన పనులు బకాయి పడ్డాయి. వాటిని చూసుకోవాల్సి వస్తోంది.' అన్నాడు. అతనిప్పుడు నెలలో ఐదారురోజులు మాత్రం ఉంటున్నాడు. 

విప్లవ్‌-సునీల్‌ గొడవల కారణంగా త్రిపురలో తాము సాధించిన అద్భుత విజయం యీనగాచి నక్కలపాలయినట్లు అవుతుందన్న భయం బిజెపికి ఉంది. సమర్థనిర్వహణ, మాణిక్‌ సర్కార్‌ కంటె మెరుగైన పాలన అందించకపోతే త్రిపుర ప్రజలు మళ్లీ సిపిఎం వైపు తిరిగిపోతారన్న భయం ఉంది. విప్లవ్‌ ఎంపికలో తాము పొరబడ్డామా అనే సందేహం కూడా బిజెపి అధిష్టానానికి కలుగుతోంది. విప్లవ్‌ను దిల్లీకి పిలిపించి మోదీ, అమిత్‌ మాట్లాడుతున్నారు. పార్టీ ప్రతిష్ఠ కాపాడడానికి సునీల్‌ను అక్కడ నుంచి తప్పించి 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యింకో రాష్ట్రం చూడు అని పంపించి వేయవచ్చు. విప్లవ్‌ను సరైన మార్గంలో నడిపించడానికి కొత్త అధ్యక్షుడిగా అనుభవశాలిని వేయవచ్చు. (సమాప్తం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?