cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బెంగాల్‌లో మమత హవా

ఎమ్బీయస్‍:  బెంగాల్‌లో మమత హవా

ఈ ఉపయెన్నికల ఫలితాలలో బిజెపిను బాగా బాధించినవి రెండు రాష్ట్రాలు – తను అధికారంలో వున్న హిమాచల్, మరొకటి ప్రతిపక్షంలో వున్న బెంగాల్. సెప్టెంబరులో భవానీపూర్‌లో జరిగిన ఉపయెన్నికలో మమతా బెనర్జీ గెలవడంలో ఏ ఆశ్చర్యం లేదు. అది ఆమె సొంత నియోజకవర్గం. పైగా ముఖ్యమంత్రిగా వుంటూ పోటీ చేసింది. అయినా బిజెపి తన ప్రయత్నాలు తను చేసింది. మే ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై సిబిఐ ద్వారా విచారణ మొదలుపెట్టింది. మమతను ఎదుర్కోవడానికి మాజీ త్రిపుర గవర్నరు తథాగత రాయ్‌ను నిలబెడదామనుకుంది. అతను నా వల్ల కాదన్నాడు. అప్పుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ బెనర్జీని అడిగింది. అతనూ చేతులెత్తేశాడు. దాంతో లాయరు, బిజెపి యూత్ వింగ్ లీడరు ఐన ప్రియాంక టిబ్డేవాల్‌ను నిలబెట్టారు.

ప్రియాంక మార్వాడీ కుటుంబానికి చెందినది. ఆ నియోజకవర్గంలో 75% హిందువులైతే వారిలో 35% మంది మార్వాడీలు, గుజరాతీలు, బిహారీలు, పంజాబీలు. బెంగాలీయేతర ఓట్లు తమకు పడతాయని బిజెపి అంచనా. 2016 ఎన్నికలలో జరిగిన ముక్కోణపు పోటీలో మమతకు 48% ఓట్లు, సమీప కాంగ్రెసు అభ్యర్థికి 29%, బిజెపి అభ్యర్థికి 19% ఓట్లు వచ్చాయి. బిజెపి రంగంలో లేకపోతే మమత ఓడిపోయేదే అన్నారు. 2021 మే ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెసు బలం క్షీణించింది కాబట్టి తృణమూల్ అభ్యర్థికి 58% రాగా, బిజెపికి 35, కాంగ్రెసుకు 4 వచ్చాయి. ఈసారి మమతకు 72%, ప్రియాంకకు 22%, సిపిఎంకు 4% ఓట్లు వచ్చాయి. 2016లో మమతకు 25 వేల మెజారిటీ వస్తే, యీసారి 59 వేలు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గతంలో తృణమూల్ నుంచి బిజెపికి గెంతిన వారిలో చాలామంది అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్‌కి తిరిగి వచ్చేయసాగారు. అందువలన భవానీపూర్ ఎలాగూ గెలుస్తుందనుకున్నారు. కానీ దానితో బాటు జాంగీపూర్, షంషేర్‌గంజ్‌లలో (వీటికి మేలో ఎన్నికలు జరపలేకపోవడం తర్వాత జరిగాయి) కూడా తృణమూల్ గెలిచింది, పోలైన ఓట్లలో 65% తెచ్చుకుంది. ఇక అక్టోబరు నాటి ఉపయెన్నికలు ఎన్నికలు జరిగిన ఖార్దా, శాంతిపూర్, గోసాబా, దిన్హాటాలలో  బిజెపి కొత్తగా రెండు స్థానాల్లో (ఖార్దా, గోసాబా) ఓడిపోవడం సరే, మేలో గెలుచుకున్న రెండు సిటింగ్ స్థానాలను (దిన్హాటా, శాంతిపూర్) పోగొట్టుకుంది. మూడిటిలో డిపాజిట్లు పోగొట్టుకుంది.

ఉత్తర బెంగాల్‌లో 2019లో ఎంపీగా ఎన్నికైన నిశిత్ ప్రమాణిక్‌ను 2021 అసెంబ్లీ ఎన్నికలలో దిన్హాటాలో బిజెపి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అతని చేత రాజీనామా చేయించి, కేంద్ర హోం శాఖలో సహాయమంత్రిగా వేసుకున్నారు. నిశిత్ రాజీనామాతో ఉపయెన్నిక అవసరం పడింది. ఈసారి తృణమూల్‌ అభ్యర్థి ఉదయన్ గుహాకు 1.64 లక్షల మెజారిటీ వచ్చింది. బిజెపికి డిపాజిట్ పోయింది. శాంతిపూర్‌ది కూడా యిలాటి కథే. ఆ ప్రాంతపు ఎంపీ జగన్నాథ్ సర్కార్ చేత రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అతను గెలిచాడు. రాష్ట్రంలో బిజెపికి అధికారం దక్కకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవి వుంచుకున్నాడు. ఉపయెన్నిక జరిగింది. ఈసారి తృణమూల్ అభ్యర్థి బ్రజ్ కిశోర్ గోస్వామి 65 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

దక్షిణ బెంగాల్‌లోని గోసాబాలో సిటింగ్ తృణమూల్ ఎమ్మెల్యే మరణంతో ఉపయెన్నిక అవసరం పడింది. ఉపయెన్నికలో తృణమూల్ అభ్యర్థికి సువ్రత మండల్‌కు 1.43 లక్షల మెజారిటీ వచ్చింది. పోలైన ఓట్లలో 87% ఓట్లు అతనికే! బిజెపికి 10% కంటె తక్కువ ఓట్లు వచ్చాయి. ఖార్దాది గోసాబా కథే. నెగ్గిన తృణమూల్ ఎమ్మెల్యే కాజల్ సిన్హా మరణంతో ఉపయెన్నిక అవసరం పడింది. ఈసారి తృణమూల్ అభ్యర్థి శోభన్ దేవ్ చట్టోపాధ్యాయకు 74% ఓట్లు వచ్చి 94 వేల మెజార్టీ వచ్చింది. బిజెపికి 13% ఓట్లే వచ్చాయి . అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత సెప్టెంబరులో బిజెపి 2015 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా చేస్తున్న దిలీప్ ఘోష్‌ను జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంటుగా చేసి అతని స్థానంలో సుకాంత మజుందార్‌ను నియమించింది. అయినా పరిస్థితి మెరుగుపడ లేదని ఓటింగు శాతం చూస్తే తెలుస్తోంది. 2019లో 40% ఓట్లు రాగా, 2021 మార్చి-మేలో 38% రాగా, యిప్పుడు 15% వచ్చాయి.

హిందూత్వ రాజకీయాలు బెంగాల్‌లో ఫలితాలను యివ్వడం లేదని బిజెపి గుర్తించటం లేదు. దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరిగిన మతకలహాలను బెంగాల్ ఉపయెన్నికలలో అంశంగా వాడుకోబోయింది. వాటి మాట సరే, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరల మాటేమిటి అని జనాలు బిజెపిని అడిగారు. బిజెపి ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కార్యకర్తల హింసాకాండపై ఎంత రచ్చ చేసినా, బెంగాలీలకు మమతపై మోజు పోలేదని ఒప్పుకోవాల్సిందే. మమత సంక్షేమ పథకాలతోనే నెట్టుకుని వచ్చేస్తోంది. కొత్తగా సెప్టెంబరు నుంచి ‘లక్ష్మీర్ భండార్’ స్కీము ఒకటి వచ్చి చేరింది. కానీ ఆర్థిక పరిస్థితి మరీ అంత చేటుగా ఏమీ లేదు. గత ఏడాది 13.5 లక్షల కోట్లు వున్న ఎకానమీ ఏడాదిలో 15.1 లక్షల కోట్లవుతోందని ఎస్‌బిఐ రిసెర్చ్ చెప్పింది. అఫ్‌కోర్స్ 5.25 లక్షల కోట్ల అప్పు వుందనుకోండి. ఆంధ్రలో వాలంటీరు వ్యవస్థ జగన్‌కు ఎలా ఉపయోగపడుతోందో అలా బెంగాల్‌లో పేట (బెంగాలీలో పాడా అంటారు) క్లబ్బులు తృణమూల్‌కు అలా ఉపయోగ పడుతున్నాయి.  

బెంగాల్లోనే వుండిపోయిన యువతలో నిరుద్యోగం ఎక్కువ. ఇతర ప్రాంతాల వాళ్లు వచ్చి అక్కడ చిన్నా, చితకా ఉద్యోగాలు చేసుకుని బతికేస్తూ వుంటారు కానీ బెంగాలీ యువకులలో చాలామంది పెద్దగా కష్టపడకుండా బతికేద్దామని చూస్తారు. రోజులో చాలాభాగం పేటలో ప్రభుత్వ స్థలాలలో నెలకొల్పిన క్లబ్బుల్లో క్యారం బోర్డు ఆడుతూనో, ఫుట్‌బాల్ ఆడుతూనో, కబుర్లు చెప్తూనో కాలక్షేపం చేస్తారు. మధ్యమధ్యలో సమాజసేవ కూడా చేస్తూంటారు. దుర్గా పూజల్లాటివి వచ్చినపుడు పందిళ్లు పెట్టి, ఆ పేరు మీద చందాలు వసూలు చేస్తూంటారు. లెఫ్ట్ ఫ్రంట్ పాలన వుండే రోజుల్లో వీళ్లను రక్తదాన శిబిరాలు నడపడానికి, మేడే ఉత్సవాల నిర్వహణకు, పార్టీ ఊరేగింపులకు జనాల్ని పోగేయడానికి ఉపయోగించుకునే వారు. మమత వచ్చాక వీళ్లకు ఆదాయమార్గాలు చూపి తనవైపు తిప్పుకుంది.

ఈ క్లబ్బులకు ఘనంగా గ్రాంటులు యిస్తూ వీళ్లను సంక్షేమ పథకాలకు వాలంటీర్లుగా మార్చుకుంది. రేషన్ సరిగ్గా పంపిణీ అయ్యేట్లు చూడడం, ద్వారే సర్కార్, స్వాస్థ్య సఖి వంటి కార్యక్రమాల విజయవంతమయ్యేట్లు చూడడం యిత్యాది పనులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య క్యాంపుల వద్ద జనాలను కట్టడి చేయడం, వాళ్లకు ఫారాలు నింపి పెట్టడం, ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వాధికారులకు తోడ్పాటుగా నిలవడం యిలాటివి. ఇలాటి క్లబ్బులు 25 వేలు 2012లో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యాయి. వీళ్లకు ఏటా తలా రూ.5 లక్షల గ్రాంటు యిస్తున్నారు. దుర్గాపూజ నిర్వహించడానికి 2017-18లో తలా పదివేలు యిచ్చారు. 2020-21 వచ్చేసరికి అది 50 వేలు అయింది. క్లబ్బుల సంఖ్య 40 వేలకు పెరిగింది. 2012-20 మధ్య వీటికి యిచ్చిన గ్రాంటులు రూ.1300 కోట్లు ఉంటాయని ఓ అంచనా.

ఈ క్లబ్బులన్నీ సవ్యంగానే పనిచేస్తున్నాయని అనడానికి లేదు. తమ ఏరియాలో ఏ నిర్మాణం జరిగినా, తమ ద్వారానే లావాదేవీలు జరగాలని కొన్ని క్లబ్బులు పట్టుబడుతున్నాయి. బిల్డింగు మెటీరియల్ తమ ద్వారానే కొనాలంటున్నాయి. తమ క్లబ్బు స్థలాన్ని పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు అద్దె కిచ్చి ఆ డబ్బు పోగేస్తున్నాయి. లెఫ్ట్‌ పార్టీలకు క్యాడర్ వుంది. బిజెపి ఆరెస్సెస్ కార్యకర్తలున్నారు. తృణమూల్ నాయకురాలితో మొదలై, పైనుంచి కిందకు పెరిగింది. లెఫ్ట్ నుంచి, కాంగ్రెసు నుంచి నాయకులను గుంజుకుంది. తనకు క్యాడర్ లేని లోపాన్ని యీ క్లబ్బుల ద్వారా తీర్చుకుంటోంది.

బిజెపికి ఉన్న ముఖ్యసమస్య ఏమిటంటే యితర పార్టీల నుంచి కొత్తగా వచ్చి చేరిన నాయకులపై పాతవారికి గౌరవం లేదు. హిందూత్వ వాదాన్ని ఉధృతంగా తీసుకెళ్లడంపై కొందరికి అసంతృప్తి వుంది. ఉత్తరాది రాష్ట్రాలలో పాచిన పారిక బెంగాల్‌లో పారదని, బెంగాల్ సంస్కృతి వేరని వీరి వాదన. 200 సీట్లు గెలుస్తామంటూ బిజెపి దిల్లీ అధిష్టానం ప్రగల్భాలు, ప్రచారానికి ఉత్తరాది నుంచి వచ్చిన నాయకులు చేసిన హిందూత్వ సందడి బోల్తా కొట్టడంతో, అంత అట్టహాసం చేయకుండా వుండాల్సిందని వీరంటున్నారు. తృణమూల్‌లో వుంటూ అవినీతి మరకపడిన వారిని పార్టీలో చేర్చేసుకుని, వారిపై విచారణ నిలిపివేయడం వలన మమత అవినీతిని ప్రశ్నించడానికి లేకుండా పోయిందని వారి వ్యథ.

కొద్ది నెలలలో కలకత్తా కార్పోరేషన్‌తో సహా వందలాది స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికైనా తన విధానాలు మార్చుకుంటే తప్ప పార్టీ పుంజుకోదని వారి వాదన.  ఏది ఏమైనా బిజెపి కాస్తోకూస్తో ఓట్లు తెచ్చుకుంటోంది. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసు, లెఫ్ట్ దిక్కూదివాణం లేకుండా వున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో 4% ఓట్లు తెచ్చుకున్న లెఫ్ట్ ఉపయెన్నికలలో 8% తెచ్చుకుంది.

తృణమూల్ ప్రజల నుంచి ఓట్లను తెచ్చుకోవడం సరే, బిజెపి నుంచి నాయకులను కూడా సంపాదించ గలుగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెసు నుంచి, యితర పార్టీల నుంచి నాయకులను ఆకర్షిస్తోంది. తృణమూల్ కాంగ్రెసు నుంచి విడిగా వచ్చినదే. తర్వాత కాంగ్రెసు నుంచి, లెఫ్ట్ నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో బలపడింది. 2019 తర్వాత బిజెపి ఫిరాయింపు క్రీడకు బలి అయింది.

ఇప్పుడు మళ్లీ రివర్స్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. 2021 ఎన్నికల తర్వాత బెంగాలులో ఆమె వలలో పడిన పెద్ద చేపల్లో ముకుల్ రాయ్ (తన పార్టీ నుంచి వెళ్లినవాడే, పార్టీ  శుభేందు అధికారికి పెద్దపీట వేయడం సహించలేక వెనక్కి వచ్చేశాడు), బాబుల్ సుప్రియో (2014 నుంచి కేంద్ర మంత్రిగా వుంటూ, అసెంబ్లీ ఎన్నికల కారణంగా మంత్రి పదవి పోగొట్టుకోవడంతో అలిగి, బిజెపి నుంచి బయటకు వచ్చేశాడు), రాజీవ్ బెనర్జీ (మమత కాబినెట్‌లో మంత్రిగా వుంటూ ఈ జనవరిలో బయటకు వచ్చేసి బిజెపిలో చేరాడు, అక్టోబరులో మళ్లీ వెనక్కి వచ్చేశాడు). ‘సుప్రియో ఆర్గనైజర్ కాదు, మాస్ లీడరు కాదు, తన పాటలతో జనాల్ని పోగేయగలడంతే! అయినా ఏడేళ్లు తనకు కేంద్ర కాబినెట్‌లో స్థానమిచ్చిన పార్టీని వదిలేసి వెళ్లిపోయాడు, కృతఘ్నుడు’ అని బిజెపి వర్గాలు పళ్లు నూరుకున్నాయి.

తనను బెంగాల్‌లో చిత్తుగా ఓడించిన మమతను బిజెపి వదల దలచుకోలేదు. పైగా ఆమె చూపు యిప్పుడు బెంగాల్‌ను దాటి ముందుకు వెళ్లడం మరీ దుస్సహంగా వుంది. ప్రతిపక్షాలకు నాయకత్వం వహించవలసిన కాంగ్రెసు డీలా పడింది కాబట్టి, తృణమూల్ దేశంలోని యితర రాష్ట్రాలలో కూడా విస్తరిద్దామనుకుంది. సాధారణంగా అయితే అక్కడి పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, కానీ తృణమూల్ ఏకంగా వాళ్లని తన పార్టీలో చేర్చేసుకుంటోంది. మోదీకి సవాలు విసరగల నేత మమత ఒక్కతే అనే అభిప్రాయం దేశంలోని బిజెపియేతర నాయకులలో బలపడుతోంది. తృణమూల్ ఎంపీలు రాజ్యసభలో గొడవ చేస్తూ, తాము చాలా ఎగ్రెసివ్‌గా వున్నామని చూపుకుంటున్నారు. బయట కూడా బిజెపియేతర పార్టీలతో చేతులు కలిపి నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. ఇది కొందరు యాక్టివిస్టులను ఆకర్షిస్తోంది, ఆ పార్టీలో చేరేట్లా ప్రేరేపిస్తోంది. ఆర్‌టిఐ యాక్టివిస్టు సాకేత్ గోఖలే వారిలో ఒకరు.

వీరితో పాటు రాజకీయ నాయకులను కూడా ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తోంది తృణమూల్. అసాంలో రైజోర్ దళ్ అధినేత, పౌరహక్కుల ఆందోళనకారుడు అఖిలో గొగోయ్‌ని, అసాం నుంచి స్వతంత్ర ఎంపీగా ఎన్నికైన నవకుమార్ సరానియాను కదిపి చూసింది. కావాలంటే పొత్తులు పెట్టుకుంటాం తప్ప పార్టీలో చేరం అన్నారు వాళ్లు. అసాం మాజీ ముఖ్యమంత్రి సంతోష్ మోహన్ దేవ్ కూతురు, కాంగ్రెసు పార్టీ ద్వారా గతంలో ఎంపీగా ఎన్నికై, ప్రస్తుతం కాంగ్రెసు మహిళావిభాగం అధినేతగా వున్న సుస్మితా దేవ్ ఆగస్టులో తృణమూల్‌లో చేరింది. అసాంలో బెంగాలీలు మెజారిటీలో వున్న బరాక్ లోయలో ఆమె కుటుంబానికి మంచి పేరుంది. ఆమె తండ్రికి పొరుగున ఉన్న త్రిపురలో కూడా పలుకుబడి వుంది. అందువలన ఆమె అక్కడ పని మొదలుపెట్టింది.

త్రిపురలో దశాబ్దాలుగా పాలించిన లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి, బిజెపి అధికారంలోకి వచ్చింది కానీ పార్టీలో అంతఃకలహాలతో సతమతమవుతోంది. తృణమూల్ త్రిపురపై కన్నేసింది. అసాంలో కథ ముందుకు సాగలేదు కానీ త్రిపురలో బాగానే నడుస్తోంది. 2016లో అది త్రిపుర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వుండేది. కానీ దాని ఎమ్మెల్యేలు ఆరుగురు మూకుమ్మడిగా బిజెపిలోకి ఫిరాయించడంతో 2017 ఎన్నికల్లో ప్రాధాన్యత కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ పార్టీని పునర్నిర్మించే పనిలో పడి ప్రశాంత కిశోర్‌ ఐ-పాక్ టీము సేవలు ఉపయోగించుకుంటోంది. ఇది అక్కడి బిజెపి ప్రభుత్వానికి నచ్చటం లేదు. జులైలో ఐ-పాక్ తరఫున త్రిపుర వెళ్లి అక్కడి ప్రజల మనోభావాలను సర్వే చేయబోయిన 23 మంది ఉద్యోగుల్ని అరెస్టు చేయించింది. తృణమూల్ నాయకులు వెళ్లి బెయిలిచ్చి బయటకు తీసుకుని వచ్చారు. ఇది చూసి ఏడుగురు కాంగ్రెసు నాయకులు తృణమూల్‌లో చేరారు. వారిలో మాజీ మంత్రి ప్రకాశ్ చంద్ర దాస్, మాజీ ఎమ్మెల్యే సుబల్ భౌమిక్ ఉన్నారు.

అభిషేక్ బెనర్జీ ఆగస్టు 2న అగర్తలా వెళ్లి త్రిపుర కోటలో పాగా వేయడమే మా లక్ష్యం, యికపై నెలకు మూడుసార్లు యిక్కడకు వస్తాను అని ప్రకటించాడు. నాలుగు రోజులకే బెంగాల్ నుంచి యువనాయకులు కొందరు అక్కడకు వెళ్లారు. వాళ్లపై దాడి జరిగింది. పోలీసులు వాళ్లని కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత నిరసనలు, అరెస్టులు యథావిధిగా జరిగాయి. ఇక అప్పణ్నుంచి బిజెపికి, తృణమూల్ నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. తృణమూల్ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని, బిజెపి నుంచి నాయకులను లాక్కోవాలనీ చూస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెసు, బిజెపిల నుంచి 30 మంది నాయకులు పార్టీలో చేరారు. అయినా త్రిపురపై బిజెపి పట్టు ఏ మాత్రం సడలలేదని నవంబరు 25న 13 ఊళ్లలో జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. మొత్తం 222 స్థానాల్లో 217 గెలిచింది. సుదీర్ఘంగా పాలించిన లెఫ్ట్‌కి 3 రాగా, తృణమూల్‌కు ఒక్కటే వచ్చింది. అంతకు ముందే 112 స్థానాల్లో బిజెపి పోటీ లేకుండా నెగ్గింది. అన్ని మునిసిపాలిటీలు బిజెపివే. అగర్తలా మునిసిపల్ కార్పోరేషన్‌లో తృణమూల్‌కు 24% ఓట్లు వచ్చాయి.

తృణమూల్‌లో చేరిన ప్రముఖుల్లో యశ్వంత్ సిన్హా, జెడియు మాజీ ఎంపీ పవన్ వర్మ, బిహార్ కాంగ్రెసుకు చెందిన కీర్తి ఆజాద్, హరియాణా కాంగ్రెసు అధ్యక్షుడు అశోక్ తన్వర్, ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెసుకు నాయకుడు కమలాపతి త్రిపాఠీ వారసులు రాజేశ్‌పతి త్రిపాఠి, లలిత్‌పతి త్రిపాఠి ఉన్నారు. గోవా విషయానికి వస్తే చాలామందే ఉన్నారు. గోవా రాజకీయాల గురించి చెప్పుకున్నపుడు చెప్పుకోవచ్చు. ఈ వారంలోనే మేఘాలయలో 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు తృణమూల్‌లోకి ఫిరాయించారు. ఇవన్నీ చూసి బిజెపి అధిష్టానం మమతకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తోంది. ఆమె మేనల్లుడు అభిషేక్‌పై కేసులు కొనసాగిస్తోంది. సహచరులపై పాత కేసులు తవ్వి తీస్తోంది. బొగ్గు స్మగ్లింగుకు సంబంధించిన మనీ లాండరింగుకు పాల్పడ్డాడంటూ అభిషేక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) సెప్టెంబరులో నోటీసులు పంపింది.

దానితో పాటు 2016 నాటి నారదా స్టింగ్ ఆపరేషన్ తృణమూల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీ (ఈ నెలలోనే గతించాడు), ఎమ్మెల్యే మదన్ మిత్ర, కలకత్తా మాజీ మేయరు శోభన్ చటర్జీ, మాజీ ఐపిఎస్ అధికారి మీర్జాలపై కూడా ఇడి కేసులు పెట్టింది. సెప్టెంబరులో మంత్రి మలయ్ ఘటక్‌ను కూడా విచారణకు పిలిచింది. 2015 నాటి ఐ-కోర్ చిట్ ఫండ్ స్కామ్ గురించి సిబిఐ మరో మంత్రి పార్థా చటర్జీని విచారించింది. అవినీతిపై విచారణ జరుపుతానంటే ఎవరూ వద్దనరు. అయితే టైమింగుతో, పక్షపాతంతో వస్తోంది చిక్కు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే యివన్నీ నిద్ర మేల్కొంటాయి. ఈ మార్చి నుంచి అసెంబ్లీ ఎన్నికలు అనగానే ఫిబ్రవరిలో మమత మేనల్లుడి భార్య రుజిరాపై సిబిఐ కోల్ స్మగ్లింగ్ కేసు పెట్టింది. అక్టోబరులో ఉపయెన్నికలు అనగానే సెప్టెంబరులో పైన చెప్పిన హంగామా జరిగింది. తృణమూల్ ఎంపీలు, మంత్రులతో సహా 12 మంది నాయకులు యిరుక్కున్న నారదా స్కాము 2014 నాటిది. దాన్ని అలాగే దాచి, 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేవనెత్తి ప్రచారంలో వాడుకున్నారు.

ముకుల్ రాయ్ తృణమూల్‌లో వుండగా నారదా స్కాములో నిందితుడు. బిజెపిలో చేరిన తర్వాత 2021 మేలో అతనిపై కేసు మోపడానికి ఆధారాలేవీ లేవని సిబిఐ అంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక జూన్‌లో అతను మళ్లీ తృణమూల్‌లో చేరాడు కాబట్టి, యిప్పుడు మళ్లీ ఆధారాలు కనిపెడతారేమో! నారదా స్కాములో యింతమంది నిందితులను విచారణకు పిలుస్తున్నారు కానీ తృణమూల్ నుంచి ఫిరాయించి, నందిగ్రామ్‌లో  మమతను ఓడించడానికి బిజెపికి ఉపయోగపడిన శుభేందు అధికారిని మాత్రం విచారించటం లేదు. అదేం? అంటే ‘స్కాము జరిగిన సమయంలో అతను ఎంపీ కాబట్టి, విచారణకై లోకసభ స్పీకరు అనుమతి యివ్వాలి. ఇప్పటికీ, నాలుగేళ్ల తర్వాతైనా యివ్వటం లేదు.’ అని సాకు చెప్తున్నారు.

‘అలాగైతే తృణమూల్ ఎమ్మెల్యేలను విచారించడానికి బెంగాల్ అసెంబ్లీ స్పీకరు అనుమతి తీసుకోవాలి కదా, ఆయన్ను అడక్కుండానే విచారణకు పిలిచారేం?’ అని అడిగారు. దాంతో సిబిఐ ఉలిక్కిపడింది. కలకత్తాలోని సిబిఐ స్పెషల్ కోర్టు నిందితులైన శాసనసభ్యుల పేరు నోటీసులు తయారు చేసి స్పీకరుకు పంపించి, అతన్ని జారీ చేయమంది. స్పీకరు విమాన్ బెనర్జీ ‘ఇది నా పని కాదు’ అంటూ తిరస్కరించాడు. అప్పుడు సిబిఐ కోర్టు నిందితులకు సమన్లు పంపండి అని ఇడిని ఆదేశించింది. వాళ్లు పంపారు. అప్పుడు స్పీకరు ఇడి అధికారులను పిలిచి, ‘నా అనుమతి లేకుండా ఎలా యిస్తారు?’ అని అడిగాడు.

అభిషేక్ యిరుక్కున్న కోల్ స్మగ్లింగ్ స్కామ్ గురించి చెప్పాలంటే, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లి.(ఇసిఎల్)కు అనేక జిల్లాలలో దానికి బొగ్గు గనులున్నాయి. దానిలో నుంచి చాటుగా బొగ్గు తవ్వేసి, బ్లాక్ మార్కెట్లో అమ్ముతూంటారు. అనూప్ మాఝీ అనే కాంట్రాక్టర్ పశ్చిమ వర్ధమాన్, బాంకురా, పురులియా, వీర్భూమ్‌లలోని గనుల్లోంచి యీ పని చేస్తూంటాడని ఆరోపణలున్నాయి. అతనికి తృణమూల్ యూత్ లీడర్ వినయ్ మిశ్రా, పోలీసు అధికారి అశోక్ మిశ్రా రక్షణ కల్పిస్తున్నారని, దానికి గాను డబ్బు తీసుకుంటున్నారని అనుమానాలున్నాయి. రూ.1300 కోట్ల మేరకు దొంగ రవాణా జరిగిందని, దానిలో సగం వినయ్‌కు వెళ్లిందని, దాన్ని అతను దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు ఖాతాలతో బాటు థాయ్‌లాండ్, లండన్‌లలో దాచాడని అభియోగం. ప్రస్తుతం అతను కనబడకుండా పోయాడు. సిబిఐ ఈ వినయ్‌కు అభిషేక్ దంపతులకు ఎలా ముడిపెట్టిందో యింకా బయటకు రాలేదు.

ఏం కావాలనుకుంటే అది, ఎలా కావాలనుకుంటే అలా చేసేస్తున్నారు. వీళ్లే కాదు, గతంలో కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్నవారూ యింతే! ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఒక పుస్తకం ప్రకారం ఇడి కన్విక్షన్ రేట్ (నేరారోపణ చేసి, దాన్ని నిరూపించిన సందర్భాలు) 0.6% ట. సిబిఐది 3% ట! దీని అర్థం నిరూపించదగ్గ ఆధారాలు లేకుండానే పాలకులు తమ ప్రత్యర్థులపై యీ సంస్థల ద్వారా కేసులు పెట్టించేస్తున్నారు. వాటికి విస్తృత ప్రచారం కల్పించి, రాజకీయ లబ్ధి పొందుతున్నారు. మమత కూడా తన ప్రత్యర్థులను యిలాగే వేధిస్తోంది. రాబోయే రోజుల్లో తృణమూల్ జాతీయ స్థాయి వార్తల్లో కూడా వస్తుంది. ప్రతిపక్షాలకు కేంద్రంగా ఎదగడానికి కాంగ్రెసుతో పోటీ పడుతోంది. అందుకే యివాళ కాంగ్రెసు నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి డిఎంకె, ఎన్‌సిపి, ఆర్‌జెడి, లెఫ్ట్ పార్టీలు యిత్యాది 10 ప్రతిపక్షాలు హాజరైనా, తృణమూల్ హాజరు కాలేదు. (ఫోటో – ముకుల్ రాయ్ పునరాగమనం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు