Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజధాని మార్పు - తుగ్లక్‌

ఎమ్బీయస్‌: రాజధాని మార్పు - తుగ్లక్‌

ఆంధ్ర రాజధానిని అమరావతి నుంచి మారుస్తారు అనే ఊహాగానం ప్రారంభం కాగానే అందరూ తుగ్లక్‌ చేసిన రాజధాని మార్పు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా మాట్లాడేవారికి చరిత్ర ఎంత తెలుసో మనకు తెలియదు కానీ మన మటుకు మనం తెలుసుకుంటే మంచిదనిపించింది. రాజధాని మార్పు జరగవచ్చు, జరగకపోవచ్చు. బొత్స చేసిన వ్యాఖ్య - 'ఇక్కడైతే రెట్టింపు ఖర్చు అవుతోంది, సురక్షితం కూడా కాదు, వర్షాలొస్తే మునిగిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికీ ఖర్చు ఉంది.' అన్న దాంట్లో తభావతు లేదు. 'వీటి వలన ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అమరావతిపై మా విధానాన్ని త్వరలో ప్రకటిస్తాం' అనడంతోనే అదిగో మారిపోతోంది అని చర్చలు మొదలుపెట్టేశారు. రియల్‌ ఎస్టేటు జూదగాళ్లు దొనకొండలో భూములపై పడ్డారట. ఈ జూదగాళ్లు గతంలో నూజివీడు భూముల మీదా పడ్డారు, అమరావతి భూముల మీదా పడ్డారు, ఇప్పుడు దొనకొండట! షేర్‌ మార్కెట్‌ ఆటుపోట్ల లాటివే యీ రియల్‌ ఎస్టేటు లావాదేవీలు. వీటి పెరుగు, తరుగుల వలన జరిగే అభివృద్ధి యిసుమంతైనా లేదు. వీరి కోసం రాజధాని మార్చరు. అదంటూ జరిగితే వేరే కారణాలుంటాయి.

తుగ్లక్‌కి దక్షిణాదిన మంచి యిమేజి లేదు కానీ, ఉత్తర భారతంలో ఫర్వాలేదు. అందుకే తుగ్లకాబాద్‌ అనే ప్రాంతం (దిల్లీలో భాగం) ఉంది. దిల్లీలో తుగ్లక్‌ రోడ్డూ ఉంది. వాటి పేరు మార్చలేదు. మనం ఎవరినైనా పిచ్చివాడు అనాలంటే తుగ్లక్‌ అనేస్తాం. కానీ అతను పిచ్చివాడు కాదు. 26 ఏళ్ల పాటు (1325-1351) దిల్లీని పాలించాడు. యువరాజుగా ఉండగానే కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ప్రతాపరుద్రుణ్ని ఓడించాడు. పర్షియన్‌, అరబిక్‌, టర్కిష్‌, సంస్కృత భాషల్లో నిష్ణాతుడు. వైద్యం, గణితం, కవిత్వం, ఫిలాసఫీలలో దిట్ట. తన పరిపాలనాకాలంలో 22 తిరుగుబాట్లు ఎదుర్కుని నిలిచిన సాహసి. కొత్తగా ఆలోచించడానికి జంకకుండా సంస్కరణలు చేపట్టాడు కానీ అవి ఆచరణలో విఫలమయ్యాయి. వ్యక్తిగా ఉదారత్వమూ ఉంది, పరమ కాఠిన్యమూ ఉంది. ఎవరైనా బహుమతి యిస్తే దానికి మూడు రెట్లు ఎక్కువగా తిరిగి బహుమతి యిచ్చేవాడట. అలాగే తన మాటకు ఎదురు చెప్తే చంపించడానికి వెనుకాడేవాడు కాడుట.

అతని వైఫల్యాలలో చెప్పుకోవలసినవి - వ్యవసాయంలో సంస్కరణలు, రాగి నాణాలు, రాజధాని మార్పు. వ్యవసాయంపై ఎంత ఆదాయం రావాలో, ఎంత వస్తోందో తెలుసుకోవడానికి రిజిస్టర్‌ మేన్‌టేన్‌ చేయడం మొదలుపెట్టాడు. పంట విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయాభివృద్ధికి పథకాలు వేశాడు. ప్రాంతాన్నంతటినీ మండలాలగా విభజించి, ఒక్కో దానికి అధికారిని నియమించి. రైతులకు ఋణాలు యివ్వడం, పాత పంటల స్థానంలో మేలు రకాలు పండించేందుకు (బార్లీ బదులు గోధుమ, గోధుమ బదులు చెరుకు, చెరుకు బదులు ద్రాక్ష) ప్రోత్సహించడం యీ అధికారి పని. అధికారుల అలసత్వంతో యిది విఫలమైంది. పంట శిస్తును శాస్త్రీయంగా అంచనా వేయబోయి, అధికారుల కారణంగా బోల్తా పడ్డాడు. ఉత్పత్తి ఎంత అవుతోందనే విషయంలో లెక్క తప్పడంతో శిస్తు భారమై పోయి, రైతులు కుదేలయ్యారు.

ఇక నాణాల గురించి చెప్పాలంటే - అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వెండికి కొరత ఏర్పడింది. బంగారు, వెండి నాణాలు ముద్రించడం కష్టమైంది. దీన్ని అధిగమించడానికి చైనాలో కాగితపు కరెన్సీ ప్రవేశపెట్టారు. పర్షియాలో కూడా అలాటి ప్రయోగమే చేసి విజయవంతమయ్యారు. అందువలన 1329లో తుగ్లక్‌ బంగారు, వెండి నాణాలకు బదులు రాగి నాణాలు ప్రవేశపెట్టి వీటికి వెండితో సమాన విలువ ఉందన్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ ప్రయివేటు వ్యక్తులు వాటిని తయారు చేయకుండా జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో కంసాళ్లందరూ యింట్లోనే రాగి నాణాలు తయారు చేసి మార్కెట్లోకి తెచ్చేశారు. చైనాలో, పర్షియాలో అలా జరగకుండా జాగ్రత్త పడ్డారు. కానీ యిక్కడ   నకిలీ నాణాలు బజారును ముంచెత్తి డబ్బు విలువ పడిపోయింది. 1330 నాటికి తుగ్లక్‌ జరిగిన పొరపాటు గ్రహించి, రాగి నాణాలను ఉపసంహరించి, వాటిని ఖజానాలో యిచ్చివేసి, వెండి నాణాలు తీసుకోవచ్చన్నాడు. దాంతో ప్రభుత్వం విడుదల చేసిన నాణాలతో బాటు, దొంగ కరెన్సీ కూడా ఖజానాకు చేరిపోయి, ప్రభుత్వధనం తరిగిపోయింది.

ఈ ప్రయోగానికి ముందే 1327లో తుగ్లక్‌ చేసిన మరొక ప్రయోగం - రాజధానిని దిల్లీ నుంచి దేవగిరికి మార్చడం. తార్కికంగా ఆలోచిస్తే అది సరైన నిర్ణయమే. ఎందుకంటే అప్పటిదాకా దిల్లీ సల్తనత్‌ ఉత్తర భారతానికే పరిమితమైంది. ఇతని తండ్రి హయాంలోనే దక్కన్‌, కింది భాగాలు మధురై వరకు విస్తరించింది. దిల్లీకి మంగోలుల దాడి భయం ఎక్కువైంది. పైగా దక్షిణాదిన తిరుగుబాట్లు ఎక్కువ కావడంతో రాజ్యం మొత్తాన్ని చూసుకోవాలంటే ఎక్కడో దిల్లీలో ఉంటే సరిపోదు అనుకుని మహారాష్ట్రలోని దేవగిరికి (దిల్లీకి అప్పటికే తుగ్లకాబాద్‌ అనే పేరుంది కాబట్టి దీని పేరు దౌలతాబాద్‌ అని  మార్చాడు)కు తరలిద్దా మనుకున్నాడు. దేవగిరిని చాలా ప్లాన్‌డ్‌గా, సెక్టార్లగా విభజిస్తూ కట్టించాడు. దాన్ని రెండో రాజధానిగా పిలిచాడు. అయితే చిక్కెక్కడ వచ్చిందంటే ఇక్కడకు మారగానే ఉత్తర భారతంలో, బెంగాల్‌లో తిరుగుబాట్లు రాసాగాయి. అది ముఖ్యం అనుకుని వెనక్కి మళ్లాడు. దేవగిరి ప్రయోగం ఎనిమిదేళ్ల ముచ్చటే అయింది.

ఇంతవరకే అయితే యిబ్బంది లేకపోను. కానీ తుగ్లక్‌ చేసిన పని కొత్త రాజధానికి దిల్లీ నుంచి జనాల్ని కూడా తరలించాలనుకోవడం. నిజానికి దేవగిరిలో జనాభా లేకపోలేదు, కానీ రాజధానికి సరిపడా లేదనుకున్నాడు. దిల్లీ నుంచి అందరూ తరలి రావాలని హుకుం వేశాడు. ప్రభుత్వోద్యోగులే కాదు, మామూలు జనాభా కూడా. ఈ తరలింపులో దిల్లీ నుంచి కుక్కా, పిల్లీతో సహా తరలించాడని, రానన్న వాళ్లను రథానికి కట్టి యీడ్పించాడని కొందరు చరిత్రకారులు రాసినది అసత్యమని తర్వాతి చరిత్రకారులు నిరూపించారు. ఆ సమయంలో దిల్లీలో కొంతమంది ఉండి నాణాల ముద్రణ కొనసాగించారని, ఊరు ఎడారి కాలేదని తేలింది. అధికారులను, పురప్రముఖులను, సూఫీ సన్యాసులను, వారి పరివారాన్ని తరలించారన్నమాట మాత్రం వాస్తవం. రెండింటికి మధ్య 700 మైళ్ల దూరముంది కాబట్టి, విశాలమైన రహదారి వేయించాడు, అటూయిటూ నీడ నిచ్చే చెట్లు నాటించాడు. మధ్యలో ప్రతి రెండు మైళ్లకు విశ్రాంతి గృహాలు కట్టించి భోజనవసతి కూడా కల్పించాడు.  అయినా ఎండలకు వెళ్లే దారిలో చాలామంది చచ్చిపోయారు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడూ చాలామంది చచ్చిపోయారు.  ఈ విఫలయత్నమే మన తెలుగువాళ్లకు బాగా గుర్తుండిపోయి, తుగ్లక్‌ అనగానే దీన్నే చెపుతూంటారు.

ఇప్పుడు జగన్‌ రాజధాని మారుస్తాడేమో అనే మాట రాగానే తుగ్లక్‌ నామస్మరణ చేస్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే తుగ్లక్‌ రాజధాని మార్చేనాటికి దిల్లీ 120 సంవత్సరాలుగా రాజధానిగా వర్ధిల్లుతోంది. అక్కడ అనేక వసతులు, భవంతులు అవీ చాలా ఉన్నాయి. ఇక్కడ అమరావతిలో అలాటివి ఏమీ లేవు. ఉన్నవి కూడా 'తాత్కాలికమైనవే'. అమరావతి అని గూగుల్‌లో కొడితే బాబు గీయించిన గ్రాఫిక్సే కనబడుతున్నాయి తప్ప నిర్మాణం పూర్తయిన భవనాలు అతి తక్కువ (నాకు తెలిసినంత వరకు సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు, పోలీసు భవనం) కనబడుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చాక 20% నిర్మాణం పూర్తయినవే పూర్తి చేద్దామని, అసలు మొదలు పెట్టని వాటిని పక్కన పెట్టేద్దామని నిర్ణయించినట్లు చదివిన గుర్తు. అక్కడేదో పెద్ద రాజధాని కట్టేసినట్లు, అది వదిలేసి వేరెక్కడికో జనాలతో సహా తరలి వెళ్లిపోతున్నట్లు బిల్డప్‌ అనవసరం. అమరావతి ప్రాంతంలో ముందు నుంచీ ఉన్న జనాభా ఎలాగూ ఉన్నారు. కొత్తగా వచ్చినది ప్రభుత్వోద్యోగులు. తరలిస్తే తరల వలసినది, తరలింపులో బాధపడేది - వారు మాత్రమే.

ఒకవేళ రాజధాని తరలించినా అక్కడున్న భవంతులు పాడుపడిపోవు. ఆ జిల్లాలకు అవసరమైన ఆఫీసులకు ఉపయోగపడతాయి. అక్కడ నెలకొల్పే ప్రభుత్వ సంస్థలకు కేటాయించవచ్చు. ఏవైనా ప్రయివేటు కంపెనీలు అక్కడ నెలకొల్పుతానంటే లీజుకి యివ్వవచ్చు. అయితే అసలు సమస్యంతా ఎక్కడ వచ్చిందంటే అక్కడ స్వర్గలోకం వెలుస్తుందని ఆశ చూపి రైతుల నుంచి నయానో, భయానో సేకరించిన 33 వేల ఎకరాలను ఏం చేయాలి? అని. అమరావతిని భారీ స్థాయిలో కట్టి బయటివాళ్లకు ఆకాశాన్నంటే ధరలో మిగులు భూమిని అమ్మగలిగితేనే, రైతులకు యిస్తానన్నది యివ్వగలరు. అమరావతికి ఆ భోగం పట్టటం లేదని బాబు హయాంలోనే తెలిసిపోయి స్వచ్ఛందంగా భూమి నిచ్చిన రైతులు దిగాలు పడ్డారు. ప్రపంచ బ్యాంకు అధికారులు వచ్చి పరిశీలించి, రాజధాని యిక్కడైతే మేము అప్పివ్వం అని చెప్పగానే పూర్తి క్లారిటీ వచ్చేసింది.

కొత్త ప్రభుత్వం బజెట్‌లో రూ. 500 కోట్లు  మాత్రమే కేటాయించడం చూసి, ఆశ కొడిగట్టి ఉంటుంది. వాళ్ల పిల్లలకు యితర విద్యలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చేయిస్తామని చెప్పిన బాబు అదేమీ చేయలేదు. మూడు నెలలుగా ప్రభుత్వం యివ్వాల్సిన నెలవారీ కౌలు కూడా రావటం లేదు. జగన్‌ ప్రాధాన్యతల్లో అమరావతి లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో రాజధానిగా కొనసాగించినా, ఏదో మొక్కుబడిగా ఎడ్మినిస్ట్రేటివ్‌ రాజధానే తప్ప గ్రాఫిక్స్‌లో చూపిన రాజధాని రాదని తెలిశాక భవిష్యత్తు మరీ అగమ్యగోచరం అయి వుంటుంది. 'మా భూమి మాకిచ్చేస్తే అదే పదివేలు, ఎప్పటిలాగా సాగు చేసుకుని బతుకుతాం' అనుకుంటూండవచ్చు. కానీ అలా యివ్వడం సాధ్యపడుతుందా లేదా అన్నది తెలియరావటం లేదు.

మొన్న ఒక టీవీ చర్చలో టిడిపికి సలహాదారు కుటుంబరావుగారు మాట్లాడుతూ 'రిజిస్టరైంది 178 ఎకరాలే, దాంట్లో వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యం?' అన్నారు. 33 వేల ఎకరాలు సేకరిస్తే అన్నే రిజస్టరవడ మేమిటి? భూమంతా ప్రభుత్వం పేర దఖలు పడలేదా? లేక యీయన ప్రయివేటు లావాదేవీల గురించి మాట్లాడుతున్నారా? భూమిని యివ్వడానికి యిచ్చగించక కోర్టులో కేసులు వేసిన రైతుల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ గతంలో ఒకసారి మాట్లాడుతూ 'ఇది బైపార్టయిట్‌ (యిరుపక్షాల మధ్య) ఎగ్రిమెంటు కాదు, తన భూమిని ప్రభుత్వానికి యిస్తున్నట్లు రైతు చేత సంతకం పెట్టించుకుంటున్నారు తప్ప ప్రభుత్వం తరఫున కమిట్‌మెంట్‌ లేదు' అన్నారు. ప్రభుత్వం ఆ లేఖలు మాత్రమే పెట్టుకుంది తప్ప తన పేరిట రిజిస్టర్‌ చేయించుకోలేదా? మరి అలా సేకరించిన వాటిల్లో కొన్ని ఎకరాలను బాబు సర్కారు కొంతమందికి చౌకగా కట్టబెట్టింది కదా. రిజిస్ట్రేషన్‌ లేకుండానే అమ్మే హక్కు తెచ్చుకుందా? ఏమీ అర్థం కావటం లేదు. జగన్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే తప్ప అమరావతి భూముల ప్రస్తుత పరిస్థితి గురించి ఒక అవగాహన ఏర్పడదు.

టైటిల్‌ క్లియర్‌గా లేని స్థలాల్లో భవంతులు కడితే ప్రభుత్వానికైనా సరే కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. స్టేల కారణంగా పనిలో జాప్యమై, అంచనా వ్యయం పెరిగిపోతుంది. ప్రభుత్వం తన సొంత స్థలంలో కట్టుకుంటే  యీ బాధలే ఉండవు. అందుకే రాజధాని నిర్మాణం అనగానే జనాలంతా ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయా అని వెతికి, అక్కడే రాజధాని వస్తుందని ఊహలు చేశారు. అయితే బాబు ఆలోచనలు వేరుగా ఉండడంతో ప్రభుత్వ భూములను వదిలేసి, ప్రయివేటు భూములపై పడ్డారు. వాటినైనా సాంతం సొంతం చేసుకోలేదు. ఆశలు రేపి తీసుకున్నారు. రైతులకు ఆశాభంగం అయినపుడు వాళ్లెలా తిరగబడతారో తెలియదు. కొత్త ప్రభుత్వం యీ తలనొప్పిని భరించలేక, భరించడానికి సిద్ధపడక, ఎవరి భూములు వాళ్లకు యిచ్చేసి, వేరే చోటకు పోతే గొడవ వదిలిపోతుంది కదా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ చట్టపరమైన చిక్కులతో బాటు, నిర్మాణ వ్యయం కూడా ఓ ఫ్యాక్టరే. బొత్స చెప్పినవి నిజమని ఎవరికైనా ఒప్పుకోక తప్పదు. అక్కడ నేల మెత్తగా ఉంటుంది కాబట్టి, పునాదులు లోతుగా తీయాలి. దాని కంటె మెరక నేల మీద కడితే ఖర్చు తగ్గుతుంది.

ఎక్కడో వర్షాలు పడి వరదలు వస్తేనే అమరావతికి యింత యిబ్బంది వచ్చిపడింది. ఆ వర్షాలు యిక్కడే పడి వుంటే...? బాబోయ్‌, అక్కడకి వెళ్లడమే కష్టమౌతుంది. రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, నీటిలో మునిగితే ఎలా? రోడ్లు బురదబురద అయితే ఎలా? అక్కడ భూకంపాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ హెచ్చరించిందని చదివిన గుర్తు. 'ఇవన్నీ వట్టిమాటలు. మొన్న వరదలు కూడా కావాలని తెప్పించినవి' అని టిడిపి వారు తెగ వాదిస్తున్నారు. పడవలు ముంచో, గేట్లు తెరిచో, వరద నీటిని దారి మళ్లించగలిగే ఉపాయమే ఉంటే వరద బాధితులు, కరువు బాధితులు ఉండనే ఉండరు. పోతే పోతాయి, నాలుగు పడవలు - జలప్రవాహాన్ని ఎటు కావాలంటే అటు తిప్పేసేయవచ్చు. కంటితో చూస్తున్న వాస్తవమేమిటి? ఒకే వూళ్లో లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి, మెరకగా ఉన్న పేటల్లో వాటర్‌ ట్యాంకుల్లో నీళ్లు పోయించుకుంటున్నారు. నీటి వాలుకి అడ్డంగా యిళ్లు కట్టడం వలన నగరాలలో చెరువులు నిండటం లేదు. జీవనదుల్లో నీరు వృథాగా సముద్రంలో పోతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నాం.

లిటరల్‌గా బాబు కొంప ముంచడానికే బరాజ్‌ గేట్లు ఆలస్యంగా తెరిచారని, పడవలు ముంచేశారని చెప్పుకుంటున్న మాట నిజమే అయితే, ఆయన మీద కోపం ఉన్నవారు అలా చేయగలగరని ఒప్పుకున్నట్లేగా! ఇవాళ యీయన అయ్యాడు, రేపు బాబు స్థానంలో టిడిపి అధ్యక్షుడవుదామనుకున్న మరొక వ్యక్తి కావచ్చు. బాబుపై పగ బట్టిన మోదీ కావచ్చు - ఏ అర్ధరాత్రో పడవలు ముంచేసి, యింట్లోకి నీళ్లు వచ్చేట్లు చేసి, మర్నాడు పొద్దున్న షికారుకి వచ్చినట్లు వచ్చి పరామర్శించవచ్చు. ఇవన్నీ కాదు, మహారాష్ట్ర, కర్ణాటకలలో యిప్పటి కంటె భారీ వర్షాలు పడ్డాయనుకోండి, అప్పుడేమవుతుంది? బరాజ్‌లో పగుళ్లు వచ్చాయనుకోండి, గేట్లలో సమస్య వచ్చిందనుకోండి. ఇంతకంటె పెద్ద స్థాయిలో ప్రమాదం జరగవచ్చుగా!

ఏది ఏమైనా రిస్కు ఉందని టిడిపి వారే ఒప్పుకుంటున్నట్లయింది. బాబు ప్రస్తుత ముఖ్యమంత్రి అయి వుంటే ఆ రిస్కుని ఎదుర్కోవలసి వచ్చేది కదా. అది రాష్ట్రానికి ఎంత రిస్కు! అలాటి ప్రమాదాలకు తావున్న ప్రాంతం రాజధానిగా ఎలా పనికి వస్తుంది? హైదరాబాదు నుంచి వైజాగ్‌కి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని ఓ దశలో భారీ ప్రచారం సాగింది, ముఖ్యంగా సినీ పరిశ్రమ! అంతలో హుదూద్‌ వచ్చింది. అమ్మో, యింత రిస్కు ఉన్న ప్రాంతానికి రావడం ఎలా జంకారు. 2013లో వర్షాలు వచ్చి బీభత్సం సృష్టించాక చార్‌ధామ్‌ యాత్రికులు తగ్గే వుంటారు. నిజంగా రాజధాని మారుద్దామని ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటే తేనెతుట్టను కదిపినట్లే. ప్రతి ఊరు నుంచి డిమాండు రావచ్చు. రాష్ట్రం విడిపోవడం తథ్యం అని తెలియగానే కొత్త రాజధాని ఒంగోలు జిల్లాలో అయితే మంచిది అనుకున్నాను నేను. అక్కడ నాకేమీ ఆస్తులు లేవు, నేను ఆ జిల్లా వాడినీ కాను.

నా లాజిక్‌ ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే కోస్తా-రాయలసీమ తగాదాలు రావచ్చు. రాయలసీమ వారిలో అసంతృప్తి చెలరేగితే మరో వేర్పాటు ఉద్యమం తలెత్తవచ్చు. వాళ్లకు కోస్తా వాళ్ల మీద ప్రేమ ఏమీ ఒలికిపోవటం లేదు. 'రాయల తెలంగాణ' ప్రతిపాదన వచ్చినపుడు అక్కడి నాయకులు ఉత్సాహపడ్డారు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడానికి ముందు కర్నూలు రాజధానిగా ఉంది. ఇప్పుడు విడిపోయింది కాబట్టి మళ్లీ మాకు రాజధాని కావాలి అంటారేమోనని నా శంక. కోస్తా, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలు - వేటి కల్చర్‌ వాటిదే. అయితే ఆ మూడూ కలిసినది ఒంగోలు జిల్లా. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని వెనుకబడిన తాలూకాలన్నీ కలిపి ఆ జిల్లా ఏర్పరచారు. అందువలన ఆ ప్రాంతాలన్నిటికి ఒంగోలుతో ఎఫినిటీ ఉంది. ఆ సౌకర్యం మిగతా జిల్లాలకు లేదు.

అయితే బాబు ఆలోచన వేరుగా ఉంది. కృష్ణ కమిటీ రిపోర్టుకు సోనియా ఎంత విలువ నిచ్చిందో, శివరామకృష్ణ కమిటీకి రిపోర్టుకు బాబు అంతే విలువ నిచ్చారు. అమరావతిలోనే రాజధాని, హైకోర్టు అన్నారు. అవే కాదు, కనబడినవీ, కలలోకి వచ్చినవీ అన్నీ అమరావతిలోనే అన్నారు. చివరకు ఏమీ చేయలేక విఫలమయ్యారు. అన్ని ప్రాంతాల వారి చేత తిరస్కరించబడ్డారు. అది చూసి జగన్‌ మేలుకున్నారేమో, వరదలు, అదనపు ఖర్చు కారణాలుగా చూపి ఒంగోలయితే బెటరు అని అందరూ అనుకునేట్లా చేస్తారేమో! దానిలో దొనకొండ అయితే చాలా లాభాలున్నాయని కొందరు చెప్తారు, అబ్బే నీటి వసతి లేదు, జనం లేరు అని కొందరు నోరు చప్పరిస్తారు. భూమి సేకరణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే నీటి వసతి ఏర్పాటు కయ్యే ఖర్చు తక్కువేమో! ఏదైనా సరే, శాస్త్రీయదృక్పథంతో అంచనా వేయాలి తప్ప, రాగద్వేషాలతో కాదు. జనాల దేముంది, ఎక్కడ పని వుంటే అక్కడకు వస్తారు.

ఒంగోలు జిల్లా కాకపోతే మరొకటి, ఎక్కడైతే భూసేకరణకు ఖర్చవదో, ఎక్కడైతే నిర్మాణవ్యయం అతి తక్కువగా ఉంటుందో అక్కడ రాజధాని కట్టుకోవచ్చు. ఎక్కడ కట్టినా భారీ స్థాయిలో అక్కరలేదు, అవసరమైనంత మేరకే కట్టవచ్చు. పైగా అన్నీ ఒకే చోట కేంద్రీకరించ నక్కరలేదు. కొత్త స్థలమైతే ప్రపంచ బ్యాంకుకు ఫ్రెష్‌గా లోన్‌కై అప్లయి చేయవచ్చు. అమరావతి నుంచి రాజధానిని తరలించినా బ్రహ్మాండం బద్దలవదు. ఎందుకంటే అక్కడ పూజలు జరిగాయి తప్ప, పనులు జరగలేదు. అక్కడ కడితే వాస్తు ప్రకారం మంచిదని కెసియార్‌ చెప్పారట. బాబు ఆయన మాట నమ్మేరేమో! ఎవరికి మంచో చెప్పలేదులా వుంది. బాబుకి కలిసి రాలేదు, ఆయన పార్టీకి కలిసి రాలేదు, రాష్ట్రానికి కలిసి రాలేదు. అందువలన ఆ వెర్రిలో పడకుండా సాధ్యాసాధ్యాలు గమనించి చేయడం మంచిది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?