cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఉడుపి హోటల్ నుంచి యూరోప్ దాకా..

ఎమ్బీయస్: ఉడుపి హోటల్ నుంచి యూరోప్ దాకా..

నాకు జీవితచరిత్రలు చదవడం యిష్టం. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను వాళ్లు ఎలా ఎదుర్కున్నారు అనేది తెలుసుకోవడంలో ఆసక్తి. ఉద్యోగుల జీవితాల కంటె ఎంటర్‌ప్రెనార్‌ల జీవితాలు రసవత్తరంగా వుంటాయి. ఇవి తెలుసుకోవడం నేటి యువతకు చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వరంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ ఏ ఉద్యోగానికీ భద్రత లేదు. కంపెనీ మూసేయకపోయినా, పరాధీనం కాకపోయినా 45 ఏళ్ల వయసు వచ్చేసరికి, నీ జీతంతో ముగ్గురు కొత్తవాళ్లను పెట్టుకుంటాం అంటూ యింటికి పంపేస్తున్నారు. ఆయుర్దాయం చూడబోతే 75 వరకు సాగుతోంది. అందుచేత తనకున్న నైపుణ్యంతో ఏదో ఒకటి సొంతంగా వ్యాపారం పెట్టుకుంటేనే ఉపాధి దొరుకుతుంది, వృద్ధాప్యం గౌరవంగా గడుస్తుంది. వారసత్వంగా వచ్చిన వ్యాపారంలో కూడా కొత్త పుంతలు తొక్కకపోతే పోటీదారులు వచ్చి వెనక్కి నెట్టేస్తారు. వ్యాపారం పెట్టగానే సరి కాదు, ఎప్పటికప్పుడు అప్‌టుడేట్ అవుతూండాలి. అలాటివాళ్ల కథలు నేటి యువతీయువకులకు మార్గదర్శకాలు.

ముంబయిలోని ‘‘ఆర్కిడ్’’ హోటల్ దేశంలో మొట్టమొదటి ఇకోటెల్. పర్యావరణానికి అనువుగా వున్న ఫైవ్ స్టార్ హోటల్. దాన్ని నిర్మించినది విఠల్ కామత్. వాళ్ల నాన్న వెంకటేశ్ కామత్ చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి, బొంబాయిలో ఉడిపి హోటల్ పెట్టారు. విఠల్ ఆయనకు సహాయకుడిగా వుంటూ వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంటూ, సాహసాలు చేసి, పైకి ఎదిగారు. తన జీవితానుభవాలతో ‘‘ఇడ్లీ, ఆర్కిడ్, విల్‌పవర్’’ అనే పుస్తకం రాశారు. 2008  నాటికే అది 14 భాషల్లోకి అనువదింపబడింది. రెండు యూనివర్శిటీల్లో నాన్‌ డిటైల్డ్‌గా పెట్టారు. దాన్ని యండమూరి వీరేంద్రనాథ్ ‘‘ఇడ్లి-వడ-ఆకాశం’’ పేరుతో తెలుగులో స్వేచ్ఛానువాదం చేశారు. అది చదువుతూంటే ‘‘ఆకాశం నీ హద్దురా’’ సినిమా గుర్తుకు వస్తుంది. ఇండియన్ ఫుడ్‌ను విదేశంలో పరిచయం చేసిన విధానం చూస్తే ‘‘క్వీన్’’ గుర్తుకు వస్తుంది. దానిలోనుంచి కొన్ని ఘట్టాలను ఉదహరిస్తున్నాను. వీలైతే మొత్తం పుస్తకం చదవండి.

విఠల్ తండ్రి వెంకటేశ్ కొంకణ ప్రాంతంవారు. పుట్టగానే తండ్రి పోయాడు. బంధువుల దగ్గర కొంతకాలం పెరిగి ఎనిమిదవ ఏట బొంబాయి వచ్చి శ్రీనివాస కామత్ అనే ఆయన హోటల్లో క్లీనర్‌గా చేరి అన్నిరకాల పనులూ నేర్చుకున్నారు. చాలా కష్టపడి పనిచేయడమే కాదు, హోటల్ యజమాని అనుకోకుండా ఏడాదిన్నర పాటు తన ఊరెళ్లిపోతే హోటల్ చక్కగా నిర్వహించి, లాభాలు పెంచి, అణాపైసలతో లెక్క చెప్పి యజమాని చేత శభాషనిపించుకోవడమే కాదు, మా అమ్మాయిని పెళ్లి చేసుకో అనిపించారు. అప్పుడే వద్దు, నేను సొంతంగా హోటల్ పెట్టాకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి కొద్దికాలంలోనే ‘కృష్ణా భవన్’ పేర సొంత హోటల్ పెట్టుకుని అప్పుడు పెళ్లాడారు. వాళ్లకు ఆరుగురు పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. విఠల్ అబ్బాయిల్లో మధ్యవాడు. తండ్రి విపరీతమైన క్రమశిక్షణతో పెంచడంతో, ఆయనంటూ భయపడుతూనే గౌరవం పెంచుకున్నాడు.

వెంకటేశ్ 1952లో ‘సన్మాన్’ హోటల్ పెట్టి, కిచెన్‌లోనే ఎక్కువ సేపు గడుపుతూ, శుభ్రతలో అత్యున్నత స్టాండర్డ్‌స్ మేన్‌టేన్ చేస్తూ, అవసరమైతే స్వయంగా వంట చేస్తూ, పెద్దగా చదువుకోకపోయినా అనేక భాషలు నేర్చుకుని కస్టమర్లతో వారి భాషల్లోనే మాట్లాడుతూ స్నేహం పెంచుకుని, వారి అభిరుచులను గమనిస్తూ, వర్కర్లను ఆత్మీయంగా చూసుకుంటూ పిల్లలు డిగ్రీ పూర్తి చేసేనాటికి, ‘సత్కార్’ అనే మరో హోటల్ చేర్చగలిగారు. విఠల్  ఇంజనీరింగు చదివి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూండగానే, తండ్రికి వ్యాపారంలో కుదుపు వచ్చింది. ఆయన నమ్మిన బావమరిదే పూర్తిగా ముంచేయడంతో చిక్కుల్లో, అప్పుల్లో పడ్డాడు. దాంతో ప్రింటింగు కోర్సు చదివిన విఠల్ అన్న కృష్ణ ‘సన్మాన్’ హోటల్ నిర్వహణ చూసుకుంటూండగా, విఠల్ తండ్రితో బాటు ‘సత్కార్’ వ్యాపారంలో సాయపడసాగారు. వంట కూడా బాగా నేర్చుకున్నారు. ఇదంతా 1970ల మాట. 1972లో ‘‘సామ్రాట్’’ అని బొంబాయిలో మొదటిసారిగా ఫుల్లీ ఎయిర్‌కండిషన్డ్ హోటల్ పెట్టారు.

అప్పుడే చిన్న చిన్న మార్పులు చేసి చూశారు. ఇడ్లీతో పాటు యిచ్చే చట్నీలు, సాంబారు కోసం వేర్వేరు గిన్నెలు యిచ్చే పద్ధతి మానేసి ప్లేటులోనే గుంటలుండేట్లు తయారు చేయించి, వాటిల్లో అవి పోసి యివ్వసాగారు. దీనివలన గిన్నెల ఖర్చు, అంట్లు తోమే పని తగ్గి పాతిక వేలు ఆదా అయింది. ఇక్కడే తండ్రి చాటునే వుండిపోతే లాభం లేదు, యూరోప్ వెళ్లి రకరకాల ప్రయోగాలు చేయాలి అనుకుని తండ్రితో లండన్‌కు టిక్కెట్టు కొనివ్వండి. ఆపై ఖర్చంతా నేను చూసుకుంటానన్నారు విఠల్. లండన్ వెళ్లిన మూడో రోజునే ‘‘షాన్’’ అనే ఒక ఇండియన్ హోటల్లో వంటవాడిగా వారానికి 75 పౌండ్ల జీతంపై ఉద్యోగం దొరికింది. పైన యజమాని థానా యిల్లు, కింద హోటల్. యజమానురాలే స్వయంగా ఇడ్లీలు చేసేది. మినప్పప్పు, బియ్యం అప్పటికప్పుడు కలిపి రుబ్బి, ఈస్ట్ వేసి చేయడంతో అవి రాళ్లలా వుండేవి. ఇతను ఓ రోజు ముందే వాటిని బాగా కడిగి రుబ్బి, రాత్రి అవన్ దగ్గర పెట్టి వుంచడంతో చక్కగా ఫెర్మంట్ అయి మర్నాడు తెల్లగా దూదిపింజల్లా వచ్చాయి. యజమాని మెచ్చుకుని పాతిక యిడ్లీలు తనే తిన్నాడు. యజమానురాలు కూడా అసూయపడకుండా మెచ్చుకుంది. కస్టమర్లకు కొత్త యిడ్లీలు నచ్చడంతో ఇతనికి జీతం పెరిగింది.

ఆ తర్వాత కోడిగుడ్డు, ఉల్లిపాయ, మష్‌రూమ్స్ కలిపి వేయించి, దోశ మధ్యలో పెట్టి కొత్తరకం దోశ పరిచయం చేశాడితను. రెండు నెలల్లో వ్యాపారం మూడింతలైంది. మిసెస్ థానా ‘నువ్వు నాకు నచ్చావు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని, యిక్కడ స్థిరపడిపో.’ అని ఆఫర్ యిచ్చింది. ‘నాకింకా పెద్ద ఆశలున్నాయి.’ అనుకుని యితను మర్యాదగానే తిరస్కరించాడు. ఓ సారి ఓ సర్దార్జీ వచ్చి మా అమ్మాయి పెళ్లి, నాకు ఒక్క రోజులో రెండు వేల లడ్డూలు కావాలంటే మిసెస్ థానా అసంభవం అని ఆర్డర్ తిరస్కరించింది. ఇతను చాటుగా అతన్ని కలిసి ‘నేను చేస్తా’ అని బేరం ఒప్పుకున్నాడు. యజమాని దగ్గరకు వచ్చి ‘మీ ఆవిడ పడుక్కున్న తర్వాత కిచెన్‌లో చేసుకుంటా, పర్మిషన్ యివ్వండి’ అన్నాడు. ‘నా తాగుడికి మా ఆవిడ తగినంత డబ్బివ్వటం లేదు. నాకో వంద పౌన్లు యిస్తే సరేనంటా’ అన్నాడతను. ఆ రాత్రి ఆవిడ పైకి వెళ్లి నిద్రపోయాక యితను పక్కనే వున్న పబ్‌లో పని చేసే యిద్దరు బలిష్టులైన కాకేసియన్ పనివాళ్లను తెచ్చుకున్నాడు. పంచదార పాకం తయారు చేసుకుని, బూందీ దానిలో పోసి, చేతికి నూనె రాసుకుని లడ్డూ చుట్టి చూపించి, యిలా చేయాలి అని వాళ్లకు చూపించాడు. వాళ్లలో ఒకడు ఓస్ యింతేగా అంటూ నూనె రాసుకోకుండా పాకంలో చేయి పెట్టాడు. కాలి బొబ్బలెక్కి బాబోయ్ అని అరిచాడు. ఆ మంట తగ్గాలంటే స్పిరిట్ పోయాలన్నాడు మరో పనివాడు. ఇతను పక్క షాపులోకి పరిగెట్టుకుని వెళ్లి అక్కడ బకార్డీ గోల్డ్ రమ్ కనబడితే పట్టుకొచ్చి యితని చేతిమీద పోశాడు.

ఇతను అరిచిన అరుపుకి మిసెస్ థానా దిగివచ్చింది. సంగతేమిటని కనుక్కుని తన వెనుక చాటుమాటు బేరాలు చేసుకున్నందుకు మొగుణ్ని, యితన్ని తిట్టి, వంద కాదు రెండు వందల పౌండ్లు యివ్వాలంది. ఇతను సరేనన్నాడు. రమ్ కాస్త పనిచేసింది. కానీ కాస్సేపటికల్లా మంట పెట్టడంతో మధ్యేమధ్యే పానీయంలా అతని చేతిని, నోటిని రమ్‌తో తడుపుతూ పని కానిచ్చాడు. వాళ్లు లడ్డూల్ని గుండ్రంగా చుట్టలేకపోయారు కానీ సర్దార్జీకి, అతని కుటుంబానికి లడ్డూల రుచి బాగా నచ్చింది. అచ్చమైన ఇండియన్ టేస్ట్ వుందన్నారు. వెళుతూవెళుతూ సర్దార్జీ ‘మన అగ్రిమెంటులో లేకపోయినా నువ్వు కుంకుమపువ్వు కలిపావు చూడు, అందుకే మంచి గుబాళింపు వచ్చింది.’ అని మెచ్చుకున్నాడు. అది కుంకుంపువ్వు కాదు, బకార్డీ రమ్ అని యితను చెప్పలేదు! ఆ బేరంలో యితనికి 150 పౌండ్లు మిగిలాయి.

ఆ తర్వాత కొన్నాళ్లకు లండన్ విడిచి, దాచుకున్న డబ్బుతో దేశదేశాలు తిరుగుతూ, ఎక్కడికక్కడ పని సంపాదిస్తూ, కొన్నాళ్లకు వదిలేస్తూ యింకో దేశం వెళుతూ ఓ సారి వియన్నా చేరాడు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని తెలియడంతో తన దగ్గరున్న డబ్బు నాలుగు రోజుల కంటె ఎక్కువ రాదని అర్థమై, ఓ రెస్టారెంటులో దిగాలుగా కూర్చున్న సమయంలో ఫిడేల్ వాయించే కళాకారుడు ‘ఫిడ్లర్ ఆన్ ద రూఫ్’ ట్యూన్ వాయించాడు. చిన్నప్పుడు విఠల్ కొద్దికాలం నాట్యం నేర్చుకున్నాడు కాబట్టి కాస్త రిథమిక్‌గా అడుగులు వేయగలడు. పక్కనున్నాయన నుంచి టోపీ అడిగి తీసుకుని, ఆ పాటకు డాన్సు చేయసాగాడు. కస్టమర్లంతా స్టన్నయిపోయి చూసి, కాస్సేపటికి లయబద్ధంగా చప్పట్లు కొట్టారు. డాన్సు పూర్తయ్యాక టోపీ పట్టుకుని వెళితే డబ్బులు వేశారు. ఇతను ఫిడేలతనికి దానిలో వాటా యిచ్చాడు. ఆ తర్వాత యిద్దరూ కలిసి ఆస్ట్రియా అంతా అలాటి ప్రదర్శనలు యిచ్చారు.

వెనిస్ చేరేసరికి మళ్లీ డబ్బయిపోయింది. హోటల్ అద్దె ముందే చెల్లించడం చేత మూడు రోజుల దాకా ఢోకా లేదు. సంపాదన ఎలాగా అని ఆలోచిస్తూ పక్కనున్న టూరిస్టు స్పాట్ చూడడానికి వచ్చినవాళ్లు దాహంతో బాధపడుతూండడం గమనించి ఒక ఐడియా వేశాడు. ముగ్గురు హోటల్ పనివాళ్లను బేరమాడుకుని, తన రూములోనే చల్లటి నీళ్లు, పుచ్చకాయ రసం, నిమ్మకాయ, ఉప్పుచల్లిన దోసకాయ ముక్కలు ప్లేట్లలో సర్దించి, టూరిస్టులకు అమ్మించాడు. నాలుగు రోజుల్లో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడే ఓ బస్సు అద్దెకు తీసుకుని, టూరిస్టులను సిటీ టూరుకి తీసుకెళ్లేవాడు. కొన్ని టూరిస్టు స్పాట్‌లలో డాన్సు కూడా చేసి, అదనంగా డబ్బు సంపాదించేవాడు. ఈయన కథ బయోపిక్‌గా తీస్తే యిలాటి దృశ్యాలలో పాటలు, డాన్సులు నేచురల్‌గా అమరుతాయి.  గోపీనాథ్ కథలో నేలబారు డాన్సులు చొప్పించాల్సి వచ్చింది. ఇలా అప్పటికప్పుడు ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తూ ఆయన నెగ్గుకు వచ్చాడు.

పలు దేశాలు తిరిగిన అనుభవంతో, ఆయన పుస్తకం మొదట్లోనే ఒక విషయం చెప్పాడు – ‘మన భారతీయుల కున్నన్ని తెలివితేటలు, చదువు, పనిచేయాలనే తపన, జ్ఞానం ప్రపంచంలో చాలా కొద్దిమందికే ఉన్నాయి. చాలా దేశాల్లో మనుష్యులు బద్ధకస్తులు. అమెరికా లాటి దేశాల్లో బాగా పనిచేస్తారు, టెక్నాలజీ వుంది కానీ మనంత తెలివితేటలున్నవారు కారు.’ అని. ఈయన దేశాలు తిరిగి జ్ఞానం, అనుభవం సంపాదించుకుంటూ వుంటే ఇండియాలో తండ్రి, సోదరులు కలిసి హోటల్ వ్యాపారాన్ని వృద్ధి చేసి అనేక బ్రాంచీలు పెట్టారు. ఈయన తిరిగి వచ్చి వారితో కలిసి హిందూ అవిభక్త కుటుంబంగా వుంటూ మరింత విస్తరింప చేశారు. వీళ్లు తమకైతేనేం, బంధుమిత్రుల కోసమైతేనేం 400 రెస్టారెంట్లు పెట్టారు. ఒక్కో చోట ఒక్కో ఛాలెంజ్ ఎదురయ్యేది. వాటిని ఎలా అధిగమించారో విఠల్ చెప్పారు.

బొంబాయి నుంచి గుజరాత్‌కు వెళ్లే దారిలో వాపి అనే ఊరు వుండేది. అదో జంక్షనేగానీ చిన్న వూరు. అక్కడ పెద్ద హోటల్ కట్టారు వీళ్లు. అక్కడ అంత పెద్ద హోటల్ వుంటుందని వూహించని కారు వాహనదార్లు ఆగేవారు కాదు. అందువలన యీయన తన బంధుమిత్రులను ఓ నాలుగు రోజుల పాటు హోటల్ ముందు తమ కార్లను పార్క్ చేసి వుంచమని కోరాడు. అన్ని కార్లు అక్కడ ఆగి వుండడం దూరం నుంచే గమనించి, వేగంగా వెళ్లిపోయే కార్లు అక్కడ ఆగనారంభించాయి. ఆగాక హోటల్ బయటి షాపులో సిగరెట్లు, కూల్‌డ్రింక్స్ కొనుక్కుని వెళ్లిపోతున్నారని, కార్లు తుడిచే కుర్రాణ్ని నియమించాడితను. అతను యింపోర్టెడ్ క్లీనింగ్ మెషిన్‌తో కారు ఉచితంగా తుడుస్తాను, యీ లోపున లోపలికి వెళ్లి కాఫీ తాగండి అనేవాడు.

ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్లగానే భార్య టాయిలెట్‌కు వెళ్లేది. అక్కడ అద్దాలు, దువ్వెనలు, వెచ్చని నీళ్లూ, తువ్వాలూ, డస్ట్ క్లీనింగ్ లోషన్, కళ్లు చల్లబడడానికి లిక్విడ్ డ్రాప్స్, పౌడరు, డిస్పోజబుల్ మేకప్ కిట్ వుండేవి. ఫ్రీగా వాడుకోవచ్చు. దాంతో ఆవిడ బయటకు వచ్చేలోపున 15 ని.లు పట్టేది. ఈలోగా ఖాళీగా వుండడమెందుకని భర్త చిన్న చిన్న ఆర్డర్లు యిస్తే ‘మీరు పెద్ద ఆర్డర్ యిచ్చినా మేం వెంటనే తెస్తాం. ఈలోగా మీ భార్య బయటకు వచ్చేస్తే మీరు దానికి బిల్ పే చేయనక్కరలేదు.’ అని సర్వర్ చెప్పేవాడు. ప్రయాణికులు సాధారణంగా ఆర్డరిచ్చేవి ముందే తెలుసు కాబట్టి వెంటనే తెచ్చిచ్చేవారు. వెళ్లిపోయేటప్పుడు పిల్లలకు రంగురంగుల ఐస్‌క్యూబ్స్ వేసి యిచ్చిన చన్నీళ్ల సీసాలు యిచ్చేవారు. కారులో తీసికెళ్లేందుకు ఫుడ్ ప్యాకెట్స్ తయారుచేసి యిచ్చేవారు. ఇంతేకాదు, అక్కడ రూములు కట్టి, అక్కడ రాత్రి బస చేస్తే మర్నాడు పొద్దున్న బాడీ మసాజ్, స్టీమ్ బాత్ ఫ్రీ అన్నారు. దాంతో ఆ హోటల్ బాగా నిలదొక్కుకుంది. (సశేషం) 

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

mbsprasad@gmail.com

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×