cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: వాక్సిన్‌ల సామర్థ్యం

ఎమ్బీయస్: వాక్సిన్‌ల సామర్థ్యం

ఈ వ్యాసరచన ఉద్దేశం వాక్సిన్ వేయించుకోవద్దని చెప్పడం కాదు. ఏ వాక్సిన్ వేయించుకుంటారో, ఎప్పడు వేయించుకుంటారో, అసలు వేయించుకుంటారో లేదో అది మీ యిష్టం. వాక్సిన్ వేయించుకున్నాం కదాని అశ్రద్ధగా, ఏమరుపాటుగా వుండకండి అని చెప్పడానికే యిది రాస్తున్నాను. వాక్సిన్ వేయించుకున్నారంటే బాహుబలి అయిపోతారు అని మోదీగారు అన్నారని నమ్మేయకండి. అవి చమత్కారాలు, శబ్దాలంకారాలు. వినడానికి గొప్పగా అనిపించే ఆత్మనిర్భర్, స్వదేశీ, స్వచ్ఛభారత్ లాటి పదాల లాగానే యీ బాహుబలి పోలికను కూడా విని, సరేలే అనుకోవాలి. వాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా ఆస్పత్రి పాలవుతున్నవారు మన చుట్టూ కనబడుతూనే వున్నారు. దేశంలో రెండు డోసులూ వేయించుకున్నవారి శాతం 7 అయితే కేరళలో 17! అయినా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కదా!

కేరళ, తమిళనాడులలో ఆరోగ్యవసతులు చాలా చక్కగా వుంటాయని గణాంకాలు చెపుతున్నాయి. అందువలననే కాబోలు మరణాల రేటులో జాతీయ సగటు 1.3% అయితే కేరళలో 0.5%ట! (ఈ అంకెల్ని యీ మధ్య నమ్మడం మానేశారు కానీ ట్రెండ్ అయితే తెలుస్తుంది కదా!) కానీ మన రాష్ట్రాలలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, దొరికినా ‘చచ్చే’టంత ! అందువలన రోగం సోకితే తేలతామో, మునుగుతామో తెలియదు కాబట్టి మనం మరీ జాగ్రత్తగా వుండాలి. 

అమెరికా జనాభాలో 50% మందికి రెండు డోసులూ పడినా, 57% మందికి ఒక డోసు పడినా, డెల్టా వేరియంట్ వాళ్లని వణికించేస్తోంది. రోజుకి 90 వేల కేసులు వస్తున్నాయి. చికెన్ పాక్స్ అంత సర్వసాధారణంగా వ్యాపించేస్తోంది జాగ్రత్త అని సిడిసి (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) డాక్యుమెంట్ చెప్పిందని యివాళ్టి పేపర్లో వచ్చింది. రోగాన్ని సంక్రమింప చేయడంలో వాక్సిన్ వేసుకున్నవాళ్లకి, లేనివాళ్లకీ తేడా లేదట. మాస్కులు తీసేయకండి బాబూ అని పౌరులకు చెప్తున్నారు. కోవిడ్‌ను జయించేశామనుకున్న చైనాలో డెల్టా వేరియంట్ 16 ప్రావిన్సులకు, 26 నగరాలకు వ్యాపించింది. లాక్‌డౌన్ విధిస్తున్నారు.

మన దేశంలో అయితే కరోనా సెకండ్ వేవ్ వెళ్లలేదు. థర్డ్ వేవ్ ముంగిట్లో వుందంటున్నారు. కేసులు ఒక రోజు తగ్గినా మర్నాటికల్లా పుంజుకుంటున్నాయి. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అదుపు చేయలేక సతమతమవుతున్నాయి. రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కోవిడ్ సులభంగా వ్యాపించగలదు. ఒకసారి రోగం సోకాక దాని తీవ్రత ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేకుండా వున్నారు. రోగం తగ్గినా కీళ్లనొప్పులు, మరితర బాధలు చాలాకాలం వేధిస్తున్నాయి. ప్రస్తుతానికి రోజుకి 40 వేల దరిదాపుల్లో కేసులు వస్తున్నాయి. ఓ రోజు పెరగడం, మళ్లీ తగ్గడం, మళ్లీ పెరగడం అలా వుంది. జులై 14 హిందూ ప్రకారం ఆ నాటికి కేసుల్లో 80% 90 జిల్లాల్లో ఉన్నాయి. వాటిలో 14 జిల్లాలు ఈశాన్య రాష్ట్రాలలోనే వున్నాయి. అక్కడకి విహారయాత్రలకు వెళ్లేవారి వలన దేశమంతా వ్యాపిస్తుందన్న భయం వేస్తోంది. 66 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10కి పైనే ఉంది. సెకండ్ వేవ్‌లో మధ్యవయస్కులు చాలామంది చనిపోయి తీవ్రనష్టం జరుగుతోంది.

ఇన్ని తెలిసి కూడా పాలకులు పండుగలు అనుమతించేస్తున్నారు. ప్రజలు యిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. నగరంలోనే మాస్కులు పెట్టుకోనివారు పుంఖానుపుంఖాలుగా కనబడుతున్నారు. రాజకీయ ర్యాలీలలో సామాజిక దూరమనేదే కనబడటం లేదు. నాయకులు మాస్కులు లేకుండానే ఫోటోలు దిగుతున్నారు. ఏమిటీ ధీమా? టీకా వేయించేసుకున్నామనా? ఆ టీకా సామర్థ్యం గురించి మీకు ఐడియా వుందా? మీకు సోకే కోవిడ్ ఏ వేరియంటో మీకు తెలుసా? దాన్ని యీ టీకా ఎదుర్కోగలదన్న నమ్మకం వుందా? లభిస్తున్న టీకాల సామర్థ్యం గురించి ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెప్తున్నారని గమనించారా? అనే ప్రశ్నలు సంధిస్తూ నేను సేకరించిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

మొదటగా గమనించవలసినది – మామూలు టీకాలకు, యీ కోవిడ్ టీకాలకు చాలా వ్యత్యాసం వుంది. మామూలు టీకాలను అనేకరకాల పరీక్షలకు గురి చేసి, అప్పుడు మార్కెట్లో వదులుతారు. మరి ఇవి? ఎమర్జన్సీ యూసేజి కింద అనుమతించినవి. ప్రభుత్వం ఆ విషయం స్పష్టంగా చెప్పి మరీ యిస్తోంది. లేని బావ కంటె గూనిబావ మేలు అనే రీతిలో యిస్తున్నాం తప్ప, యిదే దివ్యౌషధం అని యివ్వడం లేదు సుమా! అని. 65 ఏళ్లు దాటిన వాళ్లలో టీకా రెండు డోసులు వేసుకున్నా 50% రక్షణ మాత్రమే వుంటోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పింది. (జ్యోతి జూన్3). వాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్నాక కూడా రోగం వస్తోంది అంటేనే తెలుస్తోంది యివి వాక్సిన్ లాటివి తప్ప వాక్సిన్‌లు కావు అని. ఎందుకంటే మరే యితర వాక్సిన్ విషయంలోనూ ఈ స్థాయిలో జరగదు. 

కొన్ని వాక్సిన్‌ల విషయంలో బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయంటే ‘దానికి కారణం గుచ్చడంలో లోపం, పైపైన గుచ్చితే అలా అవుతుంది’ అనే సంజాయిషీ కూడా వినిపిస్తున్నారు. గతంలో ఏ వాక్సిన్ విషయంలోనైనా యిలాటివి విన్నామా? ‘వాక్సిన్ తీసుకున్నా యాంటీబాడీలు ఉత్పత్తి కావటం లేదా? నిజానికి బూస్టర్‌గా మూడో డోసు కూడా వేసుకుంటేనే మాది ఎక్సలెంట్‌గా పని చేస్తుంది’ అని చెప్తున్నారు. ఇదీ వింతగానే వుంది. ఇజ్రాయేలు 60 సం.ల వయసు దాటిన పౌరులందరికీ మూడో డోసు వేయిస్తోంది. దాని అర్థం యిస్తున్న టీకాలు చాలటం లేదనేగా!

వాక్సినానంతరం వచ్చే కరోనాను బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ అంటారు. దానిపై వెల్లూరులోని సుప్రసిద్ధ సిఎంసి (క్రిస్టియన్ మెడికల్ కాలేజి) అధ్యయనం జూన్ 11 జ్యోతిలో వచ్చింది. అక్కడున్న డా. గగన్‌దీప్ కాంగ్ చాలా నిక్చచ్చి మనిషి కాబట్టి వారి గణాంకాలు నమ్మవచ్చు. ఆ స్టడీ ప్రకారం జనవరి 21- ఏప్రిల్ 30 కాలంలో 9 వేల మంది హెల్త్ వర్కర్లకు టీకా (94% మంది కోవిషీల్డు) యిచ్చారు. 7 వేల మంది రెండు డోసులూ వేయించుకున్నారు. వారిలో 0.5 % మందికి రెండు వారాల తర్వాత, 9.6% మందికి 47 రోజుల తర్వాత కోవిడ్ వచ్చింది. సింగిల్ డోసు తీసుకున్నవారినీ కలుపుకుంటే ఫిబ్రవరి 21-మే 19 మధ్య 15% మందికి అంటే 1350 మందికి వచ్చింది. ఇక్కడ గమనించవలసినది స్డడీలో పాల్గొన్నవారు హెల్త్ వర్కర్లు. నిత్యం రోగులతో మసలుతారు కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువగా వుంటుంది వాళ్లకు. ఇమ్యూనిటీ తక్కువగా వుండే మనబోటి వాళ్లపై కరోనా ప్రభావం యింకా తీవ్రంగా వుండవచ్చు. పైగా యీ అధ్యయనం జరిగేనాటికి డెల్టా వేరియంట్ రాలేదు. అది వచ్చిన తర్వాత టీకాలిచ్చే రక్షణ మరింత తగ్గింది.

ఏమిటీ వేరియంట్? సృష్టిలో ప్రతి జీవి పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే వుంటుంది. మనల్ని అటవీ ప్రాంతానికి పంపారనుకోండి, అక్కడ మూలికలు, ఆకు పసరులూ తిని బతకడం నేర్చుకుంటాం. అర్ధరాత్రి జంతువుల అరుపులు వినివిని ప్రమాదాన్ని అంచనా వేయడం నేర్చుకుంటాం. ఎడారి ప్రాంతానికి బదిలీ చేశారనుకోండి. నీళ్లు దొరక్క ఇసుకతో స్నానం చేయడం నేర్చుకుంటాం. ఒంటెపాలతో టీ తాగడం అలవాటు పడతాం. పరిస్థితులు అనుకూలంగా వుంటే బలపడతాం, ప్రతికూలంగా వుంటే కాస్త బలహీనపడి, కొత్త పరిస్థితులకు తగినట్లు మారాక బలం పుంజుకుంటాం. బాగా ఎత్తయిన హిమాలయ ప్రాంతాలకు పంపారనుకోండి, ఊపిరాడక జీవచ్ఛవాలౌతాం, అల్పప్రాణులమైతే జీవం పోయి శవాలౌతాం. వైరస్సూ మనలాటి ప్రాణే. ఎలాగోలా బతకడం తెలుసు దానికి.

ఈ కరోనా వైరస్సే కాదు, ఏ వైరస్ అయినా తన జన్యు, ప్రొటీన్ పదార్థాల జెనటిక్ సీక్వెన్సును మార్చుకుంటూనే వుంటుంది. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. మారిన రూపాన్ని వేరియంట్ అంటారు. మారిన ప్రతీసారీ బలపడుతుందన్న గ్యారంటీ లేదు. కాస్త పట్టించుకోదగిన రూపాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ (విఓఐ) అంటారు. ప్రమాదకరంగా మారుతుందనే భయాన్ని కలిగించిన దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (విఓసి) అంటారు. ఈ విఓసిలు త్వరగా వ్యాప్తి చెందవచ్చు, శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను తప్పించుకోవచ్చు, మందులకు లొంగకపోవచ్చు. ఈ వేరియంట్లకు ముందులో దేశాల పేర్లు పెట్టారు కానీ అవి నిరసన తెలపడంతో ఆల్ఫా, బీటా, గామా.. అంటూ గ్రీకు ఎ,బి,సిల పేర్లు పెట్టారు. ‌డెల్టా పేరు బాగానే వింటూనే వున్నాం. ఇప్పుడు ల్యామ్డా వేరియంట్ కూడా వచ్చింది. 2020 ఆగస్టులో పెరూలో తొలిసారి కనబడి, తర్వాత 30 దేశాలకు విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఏడవ విఓఐగా జూన్‌లో గుర్తించింది. యూరోప్‌లో వుంది. ఆసియాలో ఇజ్రాయేల్‌లో వుంది.

మన దేశంలో ఆల్ఫా, బీటా రకాలు కూడా వున్నా డెల్టా వేరియంటే (సాంకేతిక నామం బి 1.617)భయపెడుతోంది. మనల్నే కాదు, యుకెను, యుఎస్‌ను కూడా. ప్రస్తుతానికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ వుంది. దీనిలో కూడా స్వల్పమైన మార్పులు కనబడడంతో వాటిని సబ్ వేరియంట్లగా గుర్తించి పేర్లు పెట్టారు. కప్పా (బి1.617.1), లాంబ్డా (బి1.617.3) వెరైటీలను విఓఐ అన్నారు. డెల్టా ప్లస్ (బి1.617.2) వెరైటీని విఓసిగా ప్రకటించారు. ఊపిరితిత్తులకు అతుక్కునే లక్షణం దీనికి ఎక్కువ. కరోనా ఫస్ట్ వేవ్ కంటె సెకండ్ వేవ్ భయంకరంగా మారడానికి యీ డెల్టా ప్లస్సే కారణమట. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో లభిస్తున్న వాక్సిన్లన్నీ ఈ మ్యుటేషన్ జరగడానికి ముందుగానే రూపొందించినవి. అందువలన దీనిపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అనేదే పెద్ద ప్రశ్న అయిపోయింది. మేం చేయించిన అధ్యయనాలు వీటి మీద కూడా బాగా పనిచేస్తున్నాయి అని కొన్ని కంపెనీలు చెప్పుకుంటున్నాయి. కొన్ని స్వతంత్ర అధ్యయనాలు వేరేవేరేగా చెప్తున్నాయి.

సింగిల్ డోస్ టీకా ప్రభావం డెల్టా వేరియంట్‌పై అంతంత మాత్రమే అని ఫ్రాన్స్‌కి చెందిన ప్రఖ్యాత వాక్సిన్ సంస్థ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చెప్పింది. (జ్యోతి 230721) ఫైజర్, మోడెర్నా వంటి ఎమ్‌ఆర్ఎన్ఏ వాక్సిన్లు ఆల్ఫా వేరియంట్‌పై 89% ప్రభావం చూపిస్తుండగా డెల్టా వేరియంట్‌పై 79% ప్రభావం మాత్రమే చూపిస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది. రెండు డోసులు పూర్తి చేసిన 14 రోజుల అనంతరం కరోనా పాజిటివ్ వస్తే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌గా భావించాలని అమెరికాకు చెందిన సిడిసి అంటోంది. అలా పాజిటివ్ వచ్చి ఆస్పత్రి పాలైన వారిని మాత్రమే సిడిసి లెక్కిస్తోంది. జులై 19 నాటికి అమెరికాలో యిలాటివి 6 వేలున్నాయి. వాటిలో 27% కేసుల్లో లక్షణాలు కనబడలేదు. 10% మందికి కరోనాతో పాటు యితర సమస్యలున్నాయి. 2% మంది మరణించారు. (సాక్షి జులై 31).

మరి మన జనాభాలో బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఎంత? మే 30 సాక్షిలో డా. ముఖర్జీ రాస్తూ కోవాక్సిన్, కోవిషీల్డు 80% లోపు రక్షణే యిస్తున్నాయి కాబట్టి టీకాలు తీసుకున్న వారిలో 20% మందికి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం వుందన్నారు. డెల్టా వేరియంట్ వస్తే..? అని అడిగిన ప్రశ్నకు బదులుగా దాని విషయంలో కోవిషీల్డు 65% రక్షణే యిస్తోందిగా అన్నారు. అంటే 35% మందికి మళ్లీ వచ్చే ప్రమాదం వుందన్నమాట. ఇది రెండు నెలల కిందటి సమాచారం. ఇప్పుడు డెల్టా వేరియంట్ ఉధృతంగా రావడంతో మరింత స్పష్టత వచ్చింది. మన దేశంలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ సగటున 39 రోజుల తర్వాత వస్తోంది. వారిలో 70% మందికి లక్షణాలు కనిపించటం లేదు. అలాటి కేసుల్లో 86% డెల్టా వేరియంట్ ద్వారానే వచ్చిందని ఐసిఎమ్మార్ అంది. వచ్చిన వారిలో 22% మంది ఆసుపత్రి పాలవుతున్నారు. 0.4% మరణిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారిలో 43% మంది ఆస్పత్రి పాలవుతున్నారు. (హిందూ జులై 17)

ఎలా చూసుకున్నా టీకాలు వేసుకున్న వారిలో 35-40% మందికి మళ్లీ కరోనా వచ్చే ప్రమాదమైతే వుంది. అలా అని టీకాలు వేయించుకోకుండా వుండవద్దని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే టీకా వేయించుకోవడం వలన ఆస్పత్రిపాలు, మరణంపాలు అయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి అని నొక్కి చెపుతున్నారు. టీకా వచ్చే ముందు కూడా కరోనా ఒక్కొక్కలా తన ప్రభావాన్ని చూపింది. మరి అలాటప్పుడు ‘టీకా వలన యితమిత్థంగా జరిగిన మేలు యిది అని ఎలా చెప్పగలరు? ఆ మాట కొస్తే టీకా కంటె కరోనా వచ్చి తగ్గితే మరింత రక్షణ లభిస్తోంది అంటున్నారు కదా’ అని అడిగేవాళ్లుంటారు. వారి కోసం యాంటీబాడీల లెక్క చూపిస్తూ వచ్చారు. ఈ యాంటీబాడీల గురించిన గందరగోళం గురించి వచ్చే వ్యాసంలో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

mbsprasad@gmail.com

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×