Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: వాక్సిన్ కన్‌ఫ్యూజన్ – 1/2

ఎమ్బీయస్: వాక్సిన్ కన్‌ఫ్యూజన్ – 1/2

వాక్సిన్‌ల గురించి నేను గతంలో రాసినదానికి లెంపలేసుకోవాలి అని కొంతమంది వ్యాఖ్యలు పెడుతున్నారు. నా వాక్సిన్ వ్యాసాల్లోంచి ఉటంకిస్తూ నేను రాసినదానిలో తప్పేముందో వాళ్లను చెప్పమని ప్రార్థన. అంతేకాదు, యీ వ్యాసంలో నేను సాంకేతిక పరమైన పొరపాట్లు చేస్తే, అవగాహనలో లోపం కనబడితే, ఎత్తి చూపించమని కోరుతున్నాను. ‘మీ వరప్రసాద్ ఇప్పట్లో వాక్సిన్ రాదని అన్నారు, వచ్చిందిగా’ అని మరి కొందరి ఎత్తిపొడుపు ఒకటి. వచ్చినది పూర్తి స్థాయి వాక్సిన్ అయితే ‘ఎమర్జన్సీ యూజ్’ అనే క్లాజ్ ప్రభుత్వాలు పెట్టేవే కావు. వాక్సిన్ వేసుకున్నా ఏదో ఒక స్థాయిలో కరోనా వస్తోందని అందరికీ తెలుసు. పైగా యిది ఐదు నెలలా, ఆరు నెలలా ఎంతకాలం రక్షణ యిస్తుందో ఎవరూ గ్యారంటీ యివ్వటం లేదు. మామూలు వాక్సిన్‌లు యీ తరహాలో వుంటాయా? ఉండవు కదా. అందువలన వీటిని ‘వాక్సిన్‌ లాటివి’ అనాలి తప్ప, అసలైన వాక్సిన్ అనడానికి లేదు.

వాక్సిన్ అంటే మాటలు కాదు. 60, 70 వరకు ఔషధాలు చేసే కంపెనీలు కూడా 4,5 వాక్సిన్‌లు మించి చేయలేవు. చాలా జబ్బులకు వాక్సిన్‌లు లేవందుకే! క్షీరసాగరమథనంలో అమృతం ఓ పట్టాన రాలేదు. మొదట్లో మంచీ, చెడూ చాలా వచ్చాయి. వాటికి భయపడక, వాటితో తృప్తిపడక మథనం సాగించబట్టే అమృతం లభించింది. ఇక్కడ నాయకులు వాక్సినేషన్ క్యాంపుల బ్యానర్ల మీదా, వాక్సిన్ సర్టిఫికెట్ల మీదా తమ ఫోటోలు వేసుకుని మురిసిపోతున్నారు కానీ అవతల సైంటిస్టులు యిప్పటికీ అంకెకు రాని కరోనా రక్కసితో పోరు సలుపుతూనే వున్నారు. అది అనేక అవతారాల్లో వచ్చి అడలగొడుతోంది. ఏ రోగానికైనా ఔషధం ముందు రావాలి, తర్వాత వాక్సిన్ రావాలి. కోవిడ్ విషయంలో అందరూ వాక్సిన్ కోసం అల్లాడారు. ప్రపంచం మీద వంద కంపెనీలు వాక్సిన్‌లకై ప్రయోగాలు చేస్తే పదుల సంఖ్యలోనే, అదీ యీ మేరకే సఫలీకృతమయ్యాయి. అది కూడా గొప్పే. పరిమితులతోనైనా ఏదో ఒకటి పట్టుకువచ్చినందుకు సైంటిస్టులకు అభినందనలు. కృతజ్ఞతలు.

కరోనాకు యిప్పటిదాకా సరైన మందు లేకున్నా, యిప్పుడు డిఆర్‌డిఓ ఔషధం వచ్చిందంటున్నారు. ఫలితాలు బాగుండి. ఆక్సిజన్ సమస్య తీరుతోందంటున్నా ఎమర్జన్సీ యూజ్ కిందే లైసెన్స్ యిచ్చారు. దీనివలన కోవిడ్ చికిత్స సాధ్యమైతే వాక్సిన్‌లపై ఒత్తిడి తగ్గిపోతుంది. ‘ఇప్పుడున్న వాక్సిన్ ప్రణాళిక ప్రకారమైతే దేశమంతా వాక్సిన్‌లు వేయడానికి మూడున్నరేళ్లు పడుతుంది. అప్పటిదాకా జనం చచ్చిపోతూనే వుండాలా?’ అని వెక్కిరిస్తున్నారు కొందరు. మందంటూ పని చేస్తే వాక్సిన్‌లు ఎవరడుగుతారు? మనం ఎన్ని రోగాలకు వాక్సిన్‌లు వేయించుకుంటున్నాం? వచ్చినపుడు మందు తీసుకుందాంలే అని వూరుకుంటాం. కొత్త వేరియంట్స్ వచ్చినా ఆ మందుకు మరో మందు కలిపి వాడి చూస్తారు. కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా వున్నవాళ్లే ఎందుకైనా మంచిదని వాక్సిన్ వేసుకుంటారు.

ఒక విషయం మనందరం గమనించాలి. వాక్సిన్‌లు కానీ, మందులు కానీ అన్నీ ప్రస్తుతానికి ప్రయోగదశలోనే వున్నాయి. అప్పుడే సిలబస్ అయిపోయిందంటూ చప్పట్లు కొట్టేయడాలు, కాలరు ఎగరేయడాలూ కూడదు. రోజురోజుకి కొత్తకొత్త ప్రకటనలు వస్తున్నాయి. ఈ రోజు వచ్చినదానికి మర్నాడు సవరణ వస్తోంది. ప్లాస్మా థెరపీ అద్భుతం అన్నారు. ఇప్పుడు అబ్బే దానివలన లాభం లేదు, పైగా నష్టం కలుగుతోందన్న అనుమానం కూడాను అంది ఐసిఎమ్మార్ నిన్న. రెమ్‌డెసివిర్ దివ్యౌషధం అంటూ లక్షలు లక్షలు పెట్టి కొనిపించారు. ఇవాళ దానితో యిబ్బందులు వున్నాయి సుమా అంటున్నారు. కొత్త వేరియంట్లు ఎంత ప్రమాదకరమైనవి అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు. ఈలోగా చికిత్స గురించి, వాక్సిన్‌ల గురించి రోజంతా టీవీలు మోత మోగిస్తున్నాయి. యూట్యూబ్‌లలో ఎవరో ఏదో ఒకటి మాట్లాడడాలూ, మన హితైషులు వాటిని వాట్సాప్‌లలో పంపడాలూ జరుగుతోంది.

ప్రాక్టీసు చేస్తే డాక్టర్లు రోగచికిత్స గురించి, కొత్తగా కనబడుతున్న రోగలక్షణాల గురించి మాట్లాడితే భావ్యంగా వుంటుంది. వాక్సిన్‌ల గురించి మాట్లాడవలసినది దాని తయారీలో పాలు పంచుకునే సైంటిస్టులు, క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న డాక్టర్లు. వాళ్లు ఏమీ మాట్లాడటం లేదు. క్లినిషియన్స్ ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడి కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరి దగ్గరా డేటా వుండటం లేదు. ముఖ్యంగా మన దేశంలో దానిపై శ్రద్ధ పెట్టటం లేదు. అందువలన ఎవరు ఏం మాట్లాడినా చెల్లిపోతోంది. ఇండియా టుడే ఏప్రిల్ 19 సంచిక ప్రకారం – ‘కేంద్ర ఆరోగ్య శాఖ 2020 డిసెంబరులో ఇన్‌శాకాగ్ (ఇండియన్ సార్స్ కోవి2 జినామిక్స్ కన్సార్టియమ్) అని ఏర్పరచి ప్రతీ రాష్ట్రం నుంచి కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 5% వాటిని తీసుకుని జినోమ్ సీక్వెన్సింగ్ చేయమంది. జనవరి – మార్చి 18 మధ్య 1 % కంటె తక్కువగా, కరక్టుగా చెప్పాలంటే 51 వేల కేసుల బదులు 7700 కేసులు మాత్రం సీక్వెన్స్ చేశారు. నిజానికి దీని కింద పనిచేసే 10 సంస్థల్లో నెలకు 30 వేల శాంపుల్స్ సీక్వెన్స్ చేయగల సామర్థ్యం వుంది. ఈ సీక్వెన్సింగ్ జరగకపోవడానికి తగిన స్థాయిలో నిధులు అందలేదనే మాట కూడా వుంది.’ గణాంకాలు లేకుండా అందరూ మాట్లాడడంతో కన్‌ఫ్యూజన్ పెరుగుతోంది.

ఉదాహరణకి, ఆక్స్‌ఫర్డ్ వారి టీకా (మన దేశంలో కోవిషీల్డ్) వలన తక్కువ శాతం మందిలోనైనా బ్లడ్ క్లాటింగ్ (మెడికల్ పరిభాషలో సివిడి అంటారు) జరుగుతోందని కొన్ని దేశాలు మేం వాడం అంటున్నాయి. అదేం లేదు, అని యూరోపియన్ యూనియన్ కొన్నాళ్లు అంది. సమస్య వుంది అంటే అటువంటి టీకా యిచ్చినందుకు ప్రభుత్వంపై అందరూ కేసులు పెట్టగలరన్న భయమేమో! అయితే యుకె డ్రగ్స్ రెగ్యులేటర్ మార్చి నెలాఖరు దాకా చేసిన అధ్యయనం తర్వాత ఏప్రిల్ 8న 30 సం.ల లోపు వారికి అది కాకుండా వేరే టీకా వేస్తే మంచిది అని సిఫార్సు చేసింది. ప్రభుత్వం అమలు చేస్తానంది. మార్చి 30న జర్మనీ 60 ఏళ్ల లోపు వాళ్లకు అది యివ్వనంది. మే 9న ఫ్రాన్స్ 55 ఏళ్ల లోపువాళ్లకు యివ్వకూడదంది. కెనడా కూడా మార్చి 31నే అలా అంది. అమెరికా అయితే యిప్పటిదాకా దానికి అనుమతి యివ్వలేదు. దీనికే కాదు, యిలాటి సమస్యే వస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వారి టీకాకు కూడా యివ్వలేదు. ఇవన్నీ రిసెర్చి పరంగా మన కంటె చాలా ఎదిగిన దేశాలు.

ఆ దేశాల్లో ఎలా వుందో అనవసరం, మన దేశప్రజలపై ఎంత బాగా పనిచేస్తుంది అన్నది పరిశీలించాలి. పుతిన్ మా స్పుట్నిక్ అమోఘం అంటే నమ్మామా? మా దగ్గర ట్రయల్స్ చేస్తే తప్ప అనుమతి యివ్వం అన్నాం. కానీ కోవిషీల్డ్ విషయంలో ఇక్కడ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతి యిచ్చేసి ప్రజల్లో విడుదల చేసేశారు. ‘మాది వట్టి నీళ్లతో సమానమంటున్నారు, కోవిషీల్డ్‌ను వంద మంది మీదే ప్రయోగాలు చేశారు’ అని భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ చెప్పేశారు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుందేమో, సైలంటు అయిపోయారు. వాళ్లూవాళ్లూ రాజీ పడవచ్చు కానీ ‘ఇండియాలో మూడోదశ ప్రయోగాలు పూర్తయ్యాయి, వాక్సిన్ సామర్థ్యం యింత’ అనే రిపోర్టు నేను చూడలేదు. మార్చి మూడోవారంలో సీరమ్ యిచ్చిన ప్రకటనలో ‘యుకె, బ్రెజిల్‌లలో 62% సామర్థ్యం వుంది కానీ యుఎస్‌లో రెండు డోసుల మధ్య వ్యవధి 4-12 వారాలు వుండటం చేత 53-90% సామర్థ్యం వుంది.’ అని యిచ్చారు. మరి ఇండియాలో పరీక్షా ఫలితాల సంగతేమిటి? వాళ్ల వెబ్‌సైట్‌లో కూడా నాకు కనబడలేదు. మీక్కనబడితే చెప్పండి.

ఇక కోవాక్సిన్ దగ్గరకు వస్తే – ఆక్స్‌ఫర్డ్‌ దానికి వేరే దేశాల్లోనైనా మూడో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి కానీ దీనికి ఎక్కడా పూర్తి కాకుండానే ఎమర్జన్సీ యూసేజ్ కింద దీనికీ అనుమతి యిచ్చేశారు. బ్యాక్ అప్ వాక్సిన్ అన్నారు, దీన్ని తీసుకునేవాళ్లు క్లినికల్ ట్రయల్స్‌లో వాలంటీర్లతో సమానం, అందువలన అనుమతి పత్రంపై సంతకం పెట్టి మరీ టీకా వేయించుకోవాలి అన్నారు. దాంతో జనాలు ముందుకు రాలేదు. కొన్నాళ్లు ఆగి మూడోదశ ప్రయోగాల గడువు అయిపోగానే, ప్రయోగాలు అయిపోయాయి, సామర్థ్యం బాగుంది, అనుమతి పత్రాలమీద సంతకాలు అక్కరలేదు అన్నారు. అప్పణ్నుంచి, టీకా వేయించుకోవడానికి జనాలు ముందుకు వచ్చారు. అయితే యిక్కడ గమనించాల్సింది ఏమిటంటే మూడో దశ ప్రయోగాలు ఓ పక్క జరుగుతూండగానే మరో పక్క వాక్సిన్ తయారు చేసేశారు. అందువలన మొదటి విడతలో వాక్సిన్ వేయించుకున్నవాళ్లు వాలంటీర్ల వంటి వాళ్లే.

ఆ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వచ్చాక అవసరమైతే వాక్సిన్ తయారీలో తప్పకుండా మార్పులు, చేర్పులు చేసి వుంటారు. భారత్ బయోటెక్ చాలా వాక్సిన్లు చేసిన కంపెనీ. సవరణలు చేసుకోవడం ఎలాగో తెలిసే వుంటుంది. కానీ దానికి ఆ సమయం యివ్వలేదు. 2021 మధ్యకి వాక్సిన్ తయారుకావచ్చు అని డా. ఎల్లా కృష్ణ చెపుతూనే వున్నా, జనవరి కల్లా రప్పించేశారు. జైడస్ కాడిలా మధ్య తగిన సమయం తీసుకుంది. మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసి, ఫలితాలు అధ్యయనం చేసి యీ నెలాఖరుకి డేటా సబ్మిట్ చేసి, అనుమతి తీసుకుని జూన్‌లో మార్కెట్లోకి వస్తానంటోంది. అందువలన కాస్త ధీమా వుంది. ఇక స్పుట్నిక్ విషయానికి వస్తే, ఇండియాలో 1500 మందిపై మాత్రమే మూడో దశ ప్రయోగాలు జరిగాయి. 91% సామర్థ్యం వుందని చెప్పుకున్నారు. పారదర్శకత లేని రష్యా వాళ్లు యిస్తున్న డేటాను యూరోప్, అమెరికా శంకిస్తూనే వున్నాయి. 26 దేశాల్లో వాడుతున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ యింకా దానికి గుర్తించలేదు.  సైడ్ ఎఫెక్ట్‌స్ విషయానికి వస్తే 2021 ఫిబ్రవరి ‘‘లాన్సెట్‌’’లో ప్రచురించిన వ్యాసం ప్రకారం 16 వేల మందిలో 45 మందికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, హెమరేజిక్ స్ట్రోక్, హైపర్‌టెన్షన్ వచ్చాయన్నారు.

బ్రెజిల్ దేశం 2 కోట్ల కోవాక్సిన్ డోసులకు ఆర్డరిచ్చింది. వాళ్ల ఆరోగ్య నియంత్రణ సంస్థ ‘అన్విసా’ టీము మార్చి మొదటివారంలో భారత్ వాళ్ల ఫ్యాక్టరీ సందర్శించి, నాణ్యత, భద్రత విషయంలో అక్కడ గుడ్ మాన్యుఫేక్చరింగ్ ప్రాక్టీసెస్ అవలంబించడం లేదని గమనించి, తమ ఆర్డరును కాన్సిల్ చేసింది. ఈ విషయం ఏప్రిల్ 1 నాటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది కూడా. వీళ్లడిగిన డాక్యుమెంట్లు కంపెనీవాళ్లు యివ్వలేదు. అన్నిటికంటె పెద్ద యిబ్బందేమిటంటే, వాళ్లు వైరస్‌ను పూర్తిగా చంపటం లేదట. చంపకపోతే, వాక్సిన్ ద్వారా వైరస్ శరీరంలో ప్రవేశించగలదు. దీనిపై వ్యాఖ్యానించమని కంపెనీని అడిగితే అది ఒక ‘మిస్‌అండర్‌స్టాండింగ్, దాన్ని సార్టవుట్ చేస్తాం.’ అన్నారు.

ఇప్పటిదాకా దానిపై సమాధానం యిచ్చినట్లు నాకు కనబడలేదు. వాక్సిన్ తయారీకి అనుమతులు యిచ్చిన భారత ప్రభుత్వం ఏజన్సీలు కూడా దీనిపై ఏమీ వ్యాఖ్యానించటం లేదు. ఇక్కడో చిక్కు వుంది. ‘హార్న్‌స్ ఆఫ్ డైలమా’ అని వుంది. ‘నీ భార్యను కొట్టడం మానేశావా? ఔనో కాదో ఒక్క ముక్కలో చెప్పు’ అని కోర్టులో అడిగితే భార్యను ఎప్పుడూ కొట్టనివాడు సమాధానం చెప్పడం కష్టం. ఔను అంటే ‘ఇన్నాళ్లూ కొట్టేవాణ్ని, యిప్పుడు మానేశాను.’ అనే చెప్పినట్లవుతుంది. కాదు అంటే యింకా కొడుతున్నాడన్న అర్థం వస్తుంది. అలాగే మేం పొరపాట్లు సవరించుకున్నాం అని భారత్ బయోటెక్ ప్రకటించిందనుకోండి, ఇన్నాళ్లూ వైరస్‌ను పూర్తిగా చంపకుండానే, జనాల మీదకు వదిలాం అనే అర్థం వస్తుంది. అందుకని రెండు కోట్ల ఆర్డరు పోతే పోయింది, యిక్కడే బోల్డు డిమాండు వుందని, బ్రెజిల్ వాళ్లకు స్పందించడం మానేసి వుంటారు. (సశేషం) 

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?