Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: వాల్మీకి ఉపమానాలు

ఎమ్బీయస్‍: వాల్మీకి ఉపమానాలు

ఆదికవి వాల్మీకి ఉపమానాలకు ప్రసిద్ధి. ఆ తర్వాతనే కాళిదాసు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో చాలామంది రాశారు కానీ ఉపమానాలను హైలైట్ చేస్తూ ముళ్లపూడి శ్రీదేవి గారు ‘రమణీయ శ్రీ రామాయణం’ పేర పుస్తకం రాశారు. ఆవిడ ముళ్లపూడి వెంకటరమణ గారి శ్రీమతి. ప్రఖ్యాత జర్నలిస్టులు, పండితులు అయిన నండూరి రామమోహనరావుగారు, పార్థసారథి గార్ల సోదరి. స్వయంగా అభిరుచి గల పాఠకురాలు. ఇటీవల రచనలు కూడా చేస్తున్నారు. ‘‘నెమరేసిన మెమరీస్’’ పేర చిన్ననాటి జ్ఞాపకాలను పుస్తకంగా రాశారు. ‘‘కొసరుకొమ్మచ్చి’’లో రమణగారితో జీవితాన్ని గ్రంథస్తం చేశారు. ఇప్పుడీ 217 పేజీల పుస్తకం కథాప్రపంచం ప్రచురణగా 2019లో వెలువడింది.

శ్రీనివాస శిరోమణిగారు అనేక వాల్మీకి రామాయణాల వెర్షన్లను పరామర్శించి, ఆంధ్రపత్రికకై సీరియల్‌గా రాసే రోజుల్లో రమణగారు ఉద్యోగాల వేటలో వుంటూ ఆయన వద్ద వ్రాయసకాడుగా పనిచేశారు. అప్పుడే రమణగారికి వాల్మీకి పట్ల ఎనలేని అభిమానం కుదురుకుంది. వాల్మీకి ఘనతను తెలుగు పాఠకులకు చెప్పాలని అనుకుంటూనే కాలం చేశారు. ఇప్పుడు శ్రీదేవి గారు రామాయణాన్ని రమ్యమైన రీతిలో కథగా చెపుతూ, ఉపమాలంకారాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రచన చేశారు. వర్ణనలను బోల్డు టైపులో వేసి, మనం మిస్ కాకుండా చూశారు. ఇప్పుడు నేను ఆ పుస్తకంలోని కొన్ని వర్ణనలను ఏరి, మీకోసం ఉటంకిస్తాను. పుస్తకం గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. నా వ్యాఖ్యానాలేవీ జోడించటం లేదు. కొన్ని సంస్కృతపదాలకు అర్థం తెలియకపోయినా సందర్భం బట్టి బోధపడుతుంది, పద సౌందర్యం ఆస్వాదించగలం.

వాల్మీకి రాముడి గురించి చెపుతూ ‘సూర్యుడు తన అనంతకిరణాలతో తేజరిల్లినట్లు, లోకోత్తర గుణాలతో రాముడు తేజరిల్లాడు. అతడు దయాసముద్రుడు. ప్రజల సంతాపాన్ని పోగొట్టటంలో పర్జన్యుడి వంటివాడు. పరాక్రమానికి యమశుక్రుల వంటివాడు. బుద్ధికి బృహస్పతి వంటివాడు. ధైర్యానికి మేరుపర్వతం వంటివాడు. క్షమాగుణానికి భూమి వంటివాడు’ అంటాడు. దశరథుడు కైక మందిరంలోకి వెళ్లేసరికి ఆమె ‘కోపగృహంలో కత్తితో తెగవేసిన పూలతీగవలె, పుణ్యక్షయం అయి నేలకూలిన దేవకన్య వలె, క్రింద పడత్రోసిన కిన్నరాంగనవలె, దేవలోకం నుంచి జారిపడిన అప్సరాంగన వలె, పసచెడి నేలకూలిన మోహినీదేవత వలె, కట్టిపడవేసిన లేడిపిల్ల వలె, అలసిసొలసి పడిపోయిన ఆడుగుర్రం వలె, అడవిలో వేటకాడు వేసిన విషలిప్తబాణానికి నేలకూలిన ఆడుఏనుగు వలె’ ఉందంటాడు.

వనవాసం వెళ్లబోయే ముందు సీత కౌసల్యతో ‘నా భర్త ఎక్కడ వుంటే అక్కడే నాకు సుఖం. చంద్రుడిని వెన్నెల ఎన్నడూ వదిలిపెట్టదు. అలాగే నేను నా ధర్మాన్ని ఎన్నడూ వదిలిపెట్టను. తీగలు లేని వీణ మ్రోగదు. చక్రాలు లేని రథం నడవదు. నూరుగురు కొడుకులు ఉన్నా భర్త వెంట ఉండని స్త్రీ సుఖపడదు. నేను నా భర్తని ఎన్నడూ అలక్ష్యం చేయను.’ అని చెప్పింది. రాముడు అరణ్యవాసానికై వెళుతూండగా దారిలో తారసిల్లిన గంగను వాల్మీకి యిలా వర్ణించాడు – ‘ఆ గంగాజలాలు రాళ్లమీద పడుతూ ఉంటే ప్రౌఢ స్త్రీ చేతులు చరచి చప్పట్లు కొడుతున్నట్లుగా తోస్తుంది. అది తెల్లని నురుగులు విరజిమ్ముతూ ఉంటే చల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నట్లు కనిపిస్తుంది. అది నిమ్నోన్నతశిలల మీదనుంచి పడుతూ ఉంటే పొడుగాటి నల్లటిజడ వేలాడుతున్నట్లు అగుపిస్తుంది. అది సుళ్లు తిరుగుతూ వుంటే నాభివలె గోచరిస్తుంది.’

రాముడు వెళ్లిపోయాక దశరథుడు కౌసల్యతో చెప్పాడు. ‘కౌసల్యా! నేను శోకసముద్రంలో మునిగిపోతున్నాను. రాముడి ఎడబాటే ఆ మహాసముద్రం. దూరమైపోతున్న దాని ఒడ్డే సీతావియోగం. నా నిట్టూర్పులే సముద్రంలోని సుడిగుండాలు. నా కన్నీళ్లే దాని కెరటాల నురుగు. కొట్టుకుంటున్న నా చేతులే దానిలో చేపలు. నా రోదనమే దాని మహా ఘోషము. విరబోసుకున్న నా తలవెండ్రుకలే దానిలో నాచు. కైకయే దానిలో బడబాగ్ని. నా కన్నీటిధారలే దాని నిర్ఝర ప్రవాహము. మంథర దుర్బోధలే దానిలో మహాగ్రాహాలు. కైకేయి కోరిన వరమే దాని పోటు. కన్నకొడుకుని వెళ్లగొట్టటమే దాని అంతులేని లోతు. ఆ మహాసముద్రాన్ని ఇప్పుడు రాముడు లేకుండా దాటటం ఎలా?’ ఈ సందర్భంలో కౌసల్య ‘రాముడు పధ్నాలుగేళ్లు వనవాసం చేసి వచ్చాక భరతుడు రాజ్యాన్ని రాముడికి అప్పగిస్తాడా? అప్పగించినా రాముడు స్వీకరిస్తాడా? ఎద్దు కొరికిన గడ్డిపరకలు ఆబోతు ముట్టుకుంటుందా? వేరే జంతువు తిన్న మాంసాన్ని పెద్దపులి ముడుతుందా? ఒక యజ్ఞంలోని హవిస్సునూ, ఆజ్యాన్నీ, పురోడాశాలనూ యూపస్తంభాలనూ మరొక యజ్ఞానికి వాడరు. మద్యసారాన్ని ఒకరు పుచ్చుకున్న తరువాత మిగిలిన మడ్డిని మరొకరు వాసన అయినా చూడరు.’ అని వాపోయింది.

సీతారాములు చిత్రకూటానికి చేరిన తర్వాత మందాకినీ నదిని చూపించి సీతతో అంటున్నాడు – ‘ఓ సీతా! అటు చూడు. ఈ పర్వతాగ్రభాగాన శిఖరాలవలె ఉన్న వృక్షాలు వాయువేగానికి అటూయిటూ ఊగులాడుతూ ఈ నది అంతటా పూలూఆకులూ వెదజల్లుతూ వుంటే, నృత్యం చేయబోయేవారు చేతులు ఎత్తి చుట్టూ పూలు చల్లుతున్నట్టుగా కనబడుతున్నది. గాలికి రాలిన పూవులు రాసులురాసులుగా తెప్పలుతెప్పలుగా తేలియాడుతూ ఉంటే స్వచ్ఛజలాలు కనబడుతూ వున్నవి. ఇట్లా కొంతమేర దట్టమయిన పూలరాసులతోనూ, మరికొంతమేర పూలరాసులు అన్నీ కదలిపోయి స్వచ్ఛజలాలతో కనబడుతూంటే, ఈ మందాకినీనది ప్రియుడు లాగివేసినందువల్ల చీర సగము జారిపోయిన సుందరాంగనవలె కనబడుతున్నది.’ భరతుడు వచ్చి తండ్రి మరణవార్త గురించి చెప్పినపుడు రాముడు అతన్ని ఓదారుస్తూ ‘ఏ అడవిలో నుంచో కొట్టుకుని వచ్చిన రెండు కట్టెలు ఒక తెప్పకొయ్యగా సముద్రములో తేలిపోతూ, ఏ గాలికో ఏ కట్టెకు ఆ కట్టెగా విడివడి దేని దారిన అవి పోతాయి. అదే విధంగా, ఆలుబిడ్డలతో ధనధన్యాలతో ఒక్క సంసారంగా ఉన్నవారు, కొంతకాలానికి ఎందుకో ఒకందుకు ఒకరితో సంబంధం లేకుండా విడిపోతూ ఉంటారు. తమ్ముడా! ఆయువు ప్రవాహంవలె గబగబా జరిగిపోతూ వుంటుంది.’ అంటాడు.

రాముడు లేని అయోధ్య భరతుడికి ఎలా కనబడిందో వాల్మీకి చాలా పోలికలు చెప్పాడు. వాటిలో కొన్ని – యజ్ఞం సమాప్తం అయిన తరువాత ఋత్విజోత్తములు తమ యజ్ఞోపకరణాలను అన్నిటినీ తీసుకొనిపోగా వేదఘోష ధ్వనులు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న యజ్ఞవేదికలా, ఆబోతులను తీసుకునిపోతే దానిని గురించే ఆలోచిస్తూ కొట్టములో పచ్చగడ్డి అయినా మేయకుండా ఉన్న ఆవుల మంద వలె, కుండలతో మద్యం అంతా పాడయిపోయి, తాగే పిడతలు అన్నీ పగిలిపోయి, తాగిన జనం అంతా పడి వున్న అనాచ్ఛాదిత పానశాలలా, నేల బీటలువారి, జలభాండాలన్నీ పగిలిపోయి, జలమంతా నేలపాలు అయిన చలివేంద్రంలా, నీళ్లు అన్నీ యిగిరిపోయి చేపలూ, తాబేళ్లూ మొదలైన జలచరాలన్నీ బయటపడి, కమలాలన్నీ కమిలిపోయి, గట్లన్నీ విరిగి పడిపోయిన నడబావిలా...

హేమంతఋతువు గురించి రాముడు చెప్తున్నాడు – సూర్యుడు యిప్పుడు దక్షిణదిక్కుకు తిరుగుతూ ఉన్నందువల్ల, ఉత్తరదిక్కు నుదుట బొట్టులేని స్త్రీవలె కనబడుతున్నది. నిట్టూర్పులకు మాసిపోయిన అద్దం వలె, చంద్రుడు యిప్పుడు కావిరంగుతో కనబడుతున్నాడు. మంచు పడటం చేత అడవులలో పచ్చిక బయళ్లు తడిసి, లేత ఎండకు మంచుబిందువులు వజ్రాలవలె తళతళలాడుతూ కనబడుతున్నాయి. అడవిలో చెట్లన్నీ పొగమంచుకు దుప్పటి కప్పుకున్నట్లుగానూ, పూలు లేనందువల్ల కళ్లు మూసుకున్నట్లు గానూ, మంచునీటికి ఆకులు చిగుళ్లు ముడుచుకుని నిద్రపోతున్నట్లుగానూ కనిపిస్తున్నాయి.’ సీతాపహరణ ఘట్టంలో రావణుడు సన్యాసి వేషం వదలి, నిజరూపం చూపించి తనతో రమ్మనమని అడిగినప్పుడు సీత ‘నువ్వు రాముడి భార్యను అపహరించ దలచుకోవటం సూదులతో కళ్లు తుడుచుకున్నట్లు అవుతుంది, కత్తివాదరను నాలుకతో నాకినట్లవుతుంది, మెడలో పెద్దరాయి కట్టుకుని సముద్రంలో ఈదడానికి ప్రయత్నించటమవుతుంది. భగభగమండే అగ్నిహాత్రాన్ని బట్టలో మూటకట్టినట్లవుతుంది. రాముడు విల్లమ్ములతో నీ మీదకు వస్తే, నువ్వు నన్ను అపహరించినప్పటికీ, నెయ్యితాగే ఈగవలె అనుభవించలేవు, చచ్చిపోతావు జాగ్రత్త’ అని హెచ్చరించింది.

లక్ష్మణుడితో మాట్లాడుతూ రాముడు వర్షాకాలాన్ని యిలా వర్ణించాడు – ‘గర్భధారణ కోసం మేఘాల వెంట పరుగులు తీస్తూన్న కొక్కెరపక్షులు, ఆకాశానికి వేలాడగట్టితే గాలికి ఊగులాడుతూన్న తెల్లతామర పూలదండల వలె కనబడుతున్నాయి, లేతపచ్చిక బయళ్లలో మధ్యమధ్యను కనపడుతూ ఉన్న ఆర్ద్రపురుగులతో యీ భూమి, ఎర్రచుక్కలు దిద్దిన చిలుకరంగు శాలువా కప్పుకొన్నట్లుగా వుంది. రసమయమైన నేరేడు పండ్లు నేరేడుచెట్ల కొమ్మలమీద మూగిన తుమ్మెద గుంపుల వలె కనబడుతున్నాయి.’ శరత్కాలం వచ్చాక దాని గురించి ‘ఈ శరదృతువు తన ఐశ్వర్యాన్ని నక్షత్రాలకూ, సూర్యచంద్రులకూ పంచిపెట్టినట్టుగా వుంది. శరత్కాలలక్ష్మి సూర్యోదయానికి వికసించే రకరకాల రంగురంగుల పద్మాల మీద తాండవ మాడుతున్నట్లుగా ఉంది. అదివరకు ధనికులుగా ఉండి కాలవిపర్యం వల్ల దరిద్రులైనవారు, కొత్తగా ధనవంతులైనవారు చేసే అవమానాలకు ఏమీ చేయలేక దీనులయిపోయినట్లు, నెమళ్లు వాటివాటి ఉత్తమాభరణాలైన పింఛాలను వదిలిపెట్టి నదీతీరానికి పోతే, వాటిని చూసి బెదరిస్తున్నట్లు శరత్కాలగర్వంతో హంసలు కేకలు వేస్తూ ఉంటే, ఆ నెమళ్లు గర్వం ఉడిగి, దీనలై తలలు వంచుకుని పోతున్నాయి.’

హనుమంతుడు సముద్రలంఘన సమయంలో పర్వతం పైనుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడు రాసినదిది - హనుమంతుడు ఎగిరిన ఉరవడికి ఆ పర్వతం మీద ఉన్న చెట్లన్నీ పెల్లగిలి ఆకాశానికి ఎగిరి, దూరదేశానికి పోయే బంధువును సాగనంపటానికి వెంటపోయే బంధువుల వలె, హనుమంతుడిని ఒక్క ముహూర్తంసేపు వెంబడించాయి. మద్దిచెట్లూ, ఇతర వృక్షాలూ రాజువెంట పోయే సైన్యాలవలె ఆ హనుమంతుడి వెంట వెళ్లినాయి. దేవేంద్రుడికి భయపడి పర్వతాలు సముద్రంలో పడిపోయినట్లు, చేవతో బరువెక్కిన ఆ చెట్లు గభాలున ఆ సముద్రంలో పడిపోయాయి. అశోకవనంలో హనుమంతుడు సీతను చూసిన ఘట్టాన్ని వాల్మీకి ‘భాషాసంస్కారం లేనందువల్ల ఒక అర్థానికి మారుగా మరొక అర్థాన్ని స్ఫురింపజేసే వాక్కువలె, అలంకారాదులు చేసుకోనందువల్ల మారుచూపు పడిపోయిన ఆ సీతాదేవిని హనుమంతుడు పరిశీలించి చూశాడు.’ అని వర్ణించాడు.

లంకాదహనాన్ని వర్ణిస్తూ అగ్నిహోత్ర శిఖలు ఒకచోట మోదుగు పూలలా, ఒకచోట బూరుగు పూలలా, ఒకచోట కుంకుమ పూలలా తేజరిల్లాయి అన్నాడు. లంకాదహనం చేశాక ఆ మంటల్లో సీతకూడా కాలిపోయిందేమోనన్న భయం కలిగిన హనుమంతుడు ‘నేను కోపంతో లంకను తగలబెట్టాను. పాము ఎంతో ఓర్పుతో కుబుసాన్ని వదులుతుంది. అదేవిధంగా ఓర్పుతో కోపాన్ని వదిలిపెట్టాలి. కానీ చపలత్వంతో సీత గురించి ఆలోచించకుండా యీ పని చేశాను.’ అని వగచాడు. అప్పుడు ఆకాశవాణి సీత భద్రంగా వుందని చెప్పడంతో ఊరడిల్లాడు.

‘రాముడితో యుద్ధం వద్దు, సీతను యిచ్చివేసి సఖ్యం కోరు’ అని విభీషణుడు చెప్పిన హితవు విని రావణుడు కోపంతో ‘తామరాకులో పడిన నీటిబిందువులు ఒకదానితో ఒకటి కలియవు. అలాగే ఎంత స్నేహం చేసినా జ్ఞాతి అయినవాడు దుష్టుడైతే తనవారితో కలిసి వుండడు. తుమ్మెదలు పూలలో నుంచి తమకు కావలసిన తేనె తాగుతాయి. ఆ తరువాత ఆ పూలను వదిలి వెళ్లిపోతాయి. అదేవిధంగా నువ్వు నానుంచి సమస్త సౌఖ్యాలూ అనుభవించావు. ఇప్పుడు తుమ్మెదవలె ప్రవర్తిస్తున్నావు. ఏనుగు ముందుగా స్నానం చేస్తుంది. ఆ తర్వాత తొండంతో దుమ్ము తీసుకుని ఒంటినిండా జల్లుకొంటుంది. అదే విధంగా దుష్టుడు ముందుగా స్నేహం చేస్తాడు. ఆ తరువాత ఆ స్నేహాన్ని వాడే చెడగొట్టుకుని పోతాడు. శరత్కాలంలో మేఘాలు వాన కురిసేటట్లు ఉరుములు చినుకులు పడతాయి గాని నేలమీద తేమ అయినా వుండదు. అలాగే దుష్టుడు ఉపకారం చేస్తూ ఉన్నట్లు ఆర్భాటం చేస్తాడు గాని నిజంగా ఉపకారం చేయడు.’ అని ఈసడించాడు.

రాముడికి, రావణుడికి భీకరంగా యుద్ధం జరుగుతూంటే దేవతలు అనుకున్నారట – ‘ఆకాశం వంటిది ఆకాశమే. అటువంటిది మరి ఒకటి లేదు. సముద్రం వంటిది సముద్రమే. అటువంటిది మరి ఒకటి లేదు. అదేవిధంగా రామరావణుల వంటివారు రామ రావణులే. అటువంటివారు మరి ఎవరూ లేరు. రామరావణ యుద్ధం వంటిది రామ రావణ యుద్ధమే. అటువంటిది మరి ఒకటి జరుగదు.’ అని. రావణమరణం తర్వాత విభీషణుడు అన్నను చూసి ‘ధైర్యమే చిగురుటాకుగానూ, సాహసమే పుష్పంగానూ, తపస్సే బలంగానూ, శౌర్యమే దృఢమైన మానుగానూ పెరిగిన రాక్షసరాజు అనే మహావృక్షం, రణరంగంలో రాముడు అనే పెద్దగాలికి విరిగి పడిపోయింది. పరాక్రమమే దంతాలుగానూ, పితృపితామహాది వర్గమే వెన్నెముకగానూ, కోపమే దేహంగానూ, అనుగ్రహమే తొండముగానూ యథేష్టంగా తిరిగిన రావణుడు అనే మదపుటేనుగు రాముడు అనే సింహం చేతచిక్కి నేలకూలింది.’ అని వాపోయాడు.

వాల్మీకి అనేక ఘట్టాల వద్ద ఉపమానాలు గుప్పించాడు. శ్రీదేవిగారి పుస్తకంలో అవన్నీ ఉన్నాయి. ఏడెనిమిది పోలికలు వున్నచోట నేను రెండు, మూడు మాత్రమే తీసుకుని మీకు రుచి చూపించాను. పూర్తిగా ఆస్వాదించాలంటే పుస్తకం కొని చదవండి. బాపుగారి బొమ్మలు అదనపు ఆకర్షణ.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?