Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఆత్మహత్యనూ వదలనంత దిగజారాలా?

ఎమ్బీయస్: ఆత్మహత్యనూ వదలనంత దిగజారాలా?

ఎవరిదైనా సరే, ఆత్మహత్య దురదృష్టకరం. దేవుడు ప్రతి ప్రాణిని ఏదో ఒక ప్రయోజనంతో సృష్టిస్తాడు. బిడ్డ పుట్టడం ఆలస్యమైతే భార్యాభర్తలు సమస్త దేవతలకు మొక్కుతారు. ఎంతో ఖర్చు పెడతారు. అంత కష్టపడి బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ తన ప్రాణాలు తనే తీసుకుంటే వారి ఆవేదన చెప్పతరం కాదు. పెరిగి పెద్దవాళ్లయినవాళ్లు ఆత్మహత్య చేసుకున్నా, వారి జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, బంధుమిత్రులు కానీ దుఃఖసముద్రంలో మునుగుతారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చేనేత కార్మికులు చేసుకున్నారు, ఇటీవల లోన్ యాప్ బాధితులు చేసుకుంటున్నారు అంటే అయ్యోపాపం ఆర్థికబాధలు అంత తీవ్రంగా ఉన్నాయన్న మాట అనుకుని జాలిపడతాం. పరీక్ష తప్పడం, ప్రేమ వైఫల్యం వంటి కారణాలతో యువత చేసుకుంటే జీవితం విలువ తెలియక చేసుకున్నారని విలవిల లాడతాం. మానసిక కారణాలతో చేసుకోవడం మరీ బాధిస్తుంది. సహజ మరణం తప్పదని అందరికీ తెలుసు. కానీ యిలాటి మరణం కోరుకున్నారంటే ఎంతటి మానసిక వేదన అనుభవించి ఉండాలి అనే ఆలోచనే మనల్ని వేధిస్తుంది. అలాటి బాధకు గురైన వాళ్లు కూడా కొన్నాళ్లకు ఆత్మహత్యకు సిద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవితాన్ని మథించిన మేధావులు, మార్గదర్శకులు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయి. కారణాలు ఏమిటో వారికే తెలియాలి. కారణాలేమైనా కానీయండి, ఎవరైనా తన ప్రాణాన్ని తనే తీసుకుంటే అయ్యో అనుకోవాలి తప్ప, దాన్ని వేరే రకంగా వాడుకుందామని చూడడం దుర్మార్గం, నీచం!

ఉమామహేశ్వరి ఆత్మహత్యపై చేసిన ప్రకటన ద్వారా విజయసాయి మరీ దిగజారిపోయారు. మరీ అని ఎందుకంటున్నానంటే యిప్పటికే ఆయన వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయి. ఆయన చదువుకున్నవాడు, తెలివైనవాడు, సమాజాన్ని చూస్తున్నవాడు. వీధి రౌడీయిజం చేసి రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. అలాటి వాడు ట్విటర్‌లో వ్యాఖ్యలు, వాడే భాష చూస్తే విస్మయం కలుగుతుంది. ఒకవేళ అటువంటి ఛండాలపు పదప్రయోగాలు, దరిద్రపు ఊహలు తనకే వచ్చినా తన పేరు మీద కాకుండా మరో కార్యకర్త పేరున వెలువరించినా బాగుండేది కదా అనిపిస్తుంది. అధినాయకుడి మెప్పు పొంది ఏదైనా పదవి పొందాలని చూసే కార్యకర్త ఓవరాక్షన్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. విజయసాయికి యిప్పటికే అర్హతకు మించిన పదవులు దక్కాయి. ఆయన రాజ్యసభలో ఎంపీ.  ఓ పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి చైర్మన్. వైసిపికి జాతీయ జనరల్ సెక్రటరీ. ఇంకా ఏం కావాలని యింత అతి చేయాలి? కాస్తయినా హుందాగా ప్రవర్తించాలి కదా!

విజయసాయి గారు పార్లమెంటులో కేంద్రం, రాష్ట్రానికి ఏమీ చేయటం లేదంటూ లెక్కలు బాగా చెప్పాడని సంతోషించాను. కానీ వెంటనే యీ ట్వీట్లు చూస్తే రోత పుట్టింది. బాబు పట్ల యీయన వాడే భాష చూస్తే బాబు యీయనకింత లోకువై పోయాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ పదప్రయోగం సరిగ్గా ఉండాలి. బాబు ముఖ్యమంత్రిగా చేసినవాడు. దశాబ్దాల పాటు జాతీయస్థాయిలో చక్రం తిప్పినవాడు. విజయసాయి సొంతంగా కౌన్సిలరుగా కూడా నెగ్గలేనివాడు. జగన్ చాటు నాయకుడు. రేపేదైనా తేడా వచ్చి జగన్ పక్కన పెట్టేస్తే ఉప్పూపత్రీ లేకుండా పోతాడు. ఆ మాత్రానికి యింత మిడిసిపాటా? అయినదానికీ, కానిదానికీ బాబుపై యిష్టమొచ్చినట్లు వ్యాఖ్యలా? లోకేశ్‌పై అయితే చెప్పనే అక్కరలేదు. స్కూలుపిల్లల స్థాయిలో పప్పు, పప్పు అంటూ ట్వీట్లా? రాజ్యసభ అంటే పెద్దల సభ అంటారు. దానిలో సభ్యుడై ఉండి, యీయన యిలాటి భాష వాడుతున్నాడంటే సిగ్గు చేటు. 

ఉమామహేశ్వరి ఆత్మహత్యపై యీయన వ్యాఖ్య చూశాక యీయనకు దిగజారడానికి మెట్లు లేవు అనిపించింది. ఆవిడకు చంద్రబాబుకి బంధుత్వం లేకపోయి వుంటే యీయన యిలా మాట్లాడేవాడా? ఎన్టీయార్ కూతురు అనే విషయం పక్కన పెట్టినా, ఆవిడ ఒక భద్రమహిళ. ఇల్లాలు. పాపం తొలి వివాహం భగ్నమైంది. జీవితంపై ఆశ ఉన్న వ్యక్తి కాబట్టి ద్వితీయ వివాహం చేసుకుంది, పిల్లల్ని కంది. వాళ్లకు పెళ్లిళ్లు చేసింది. ఏదో ఒక కారణం చేత ఆత్మహత్య చేసుకుంది. అయ్యో అనుకుని ఊరుకోవాలి తప్ప దాన్ని అడ్డుపెట్టుకుని రాళ్లేయడమా? చంద్రబాబు కారణంగానే చేసుకుందేమో అనడం, మధ్యలో లోకేశ్‌ను లాగడం, ఏమిటిదంతా? లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, సిబిఐ చేత విచారణ జరిపించాలనడం.. యివన్నీ అవసరమా? మీ కోడికత్తి సంఘటనపై చంద్రబాబు సరిగ్గా విచారణ జరిపించలేదు సరే, మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. మీరు చేయించారా? అది జరిగినప్పుడు ఎయిర్‌పోర్టులో క్యాంటీన్ యజమానికి, లోకేశ్‌కు లింకుందంటూ కథనాలు వండి వార్చారు. ఇప్పుడు అన్ని ఏజన్సీలు మీ చేతిలో ఉన్నాయి. కనిపెట్టారా?

ఎన్టీయార్ కూతురు బేలగా ఆత్మహత్య ఎలా చేసుకుంటుంది? అందుకే అనుమానించాల్సి వస్తోంది అనడం అర్థరహితం. ఎవరైనా చేసుకోవచ్చు. తెరపై ధీరోదాత్తుడిగా కనిపించిన వ్యక్తి నిజజీవితంలో పిరికివాడు కావచ్చు. ఎన్టీయార్ బయట కూడా ధైర్యవంతుడే అయినా ఆయన సంతానం ఆయనలాగానే ఉండాలని ఏముంది? పరిణతి చూపించి, జీవితసత్యాల గురించి చక్కటి కవితలుగా చెప్పిన నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? ఆ క్షణంలో జీవితం వ్యర్థం అనిపించి ఉండవచ్చు. ఎన్నో చక్కటి సినిమాలు తీసిన హిందీ దర్శకనిర్మాత గురుదత్ 39 ఏళ్లకే నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత కొన్నేళ్లకు కొడుకు పెద్దవాడై ‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు. ఎవరో కావాలని ఆయన తాగే మద్యపాత్రలో నిద్రమాత్రలు కలిపారు. దానిపై విచారణ కోరుతున్నాను.’ అంటూ మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు అతను కూడా అత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో చెప్పడం కష్టం.

కారణాలు తెలియనప్పుడు అయ్యోపాపం అనుకుని ఊరుకోవాలి తప్ప దాన్ని అడ్డు పెట్టుకుని ఎవరో హత్య చేశారు, చేయించారు అనే అనుమానాలు వెలిబుచ్చడం అన్యాయం. నిజంగా అలాటిది జరిగితే ఆవిడ కుటుంబసభ్యులే ఫిర్యాదు చేస్తారు. మధ్యలో మీకెందుకు? కుటుంబసభ్యులకు కూడా దొరకని ఆధారాలు మీకు దొరికితే అవి బయటపెట్టండి. మీరు బయటపెట్టినా కుటుంబసభ్యులు అవి సరైనవి కావని అనవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆత్మహత్య అనగానే ఎందుకు ఎలా అనే చర్చ వచ్చి స్కాండల్ అవుతుంది కాబట్టి కుటుంబసభ్యులు సాధ్యమైనంత వరకు సహజమరణం అని చెప్పడానికి చూస్తారు. డాక్టర్ల చేత ఆ మేరకు సర్టిఫికెట్లు యిప్పించుకుంటారు. ఇన్సూరెన్సు గొడవలు కూడా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య అని ఒప్పుకుంటారు. కోడెల విషయంలో, ఉమామహేశ్వరి విషయంలో అలాటి ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యం లేదు. వాటి గురించి ప్రస్తావించడం అనవసరం.

వేరే ఎవరైనా ప్రస్తావిస్తే తెలియక అన్నాడు అనుకోవచ్చు. కానీ తన పార్టీ ప్రెసిడెంటు బాబాయి పోయినప్పుడు ఏం జరిగిందో యీయన మర్చిపోయారా? కసితో భీకరంగా హత్య చేసి చంపేస్తే గుండెపోటుతో పోయాడని తొలిసమాచారం యిచ్చిన వ్యక్తిని యీయన ఎంత దుయ్యబట్టాలి? వివేకా హత్య అనగానే మహిళల వ్యవహారాలు, సెటిల్‌మెంటు వ్యవహారాలు బయటకు వస్తాయనే భీతితో అలా చెప్పడానికి చూశారని, కానీ కుదరక హత్య అని చెప్పాల్సి వచ్చిందని అనుకుందాం. కానీ ఆ హత్యను వైసిపి, టిడిపి రెండూ రాజకీయం చేశాయా లేదా? నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షి హెడింగులు పెట్టింది కదా! జగనే సొంత బాబాయిని చంపించాడని టిడిపి ప్రచారం చేస్తోంది. హత్య చేయడానికి జగన్‌కు మోటివ్ కనబడదు. కానీ హంతకుణ్ని కాపాడడానికి మోటివ్ కనబడుతోంది.

మూడేళ్లగా అధికారంలో ఉంటూ నిందితుణ్ని పట్టించే ప్రయత్నాలు చేయకపోవడం చూస్తే హత్యను తేల్చే ఉద్దేశం కనబడటం లేదు. పెద్దింటి హత్యలెప్పుడూ యింతే. బాలకృష్ణ యింట్లో కాల్పులు, వాచ్‌మన్ మరణం వెనుక మిస్టరీ తేలిందా? అలాగే దీన్నీ నాన్చి, నాన్చి చివరకు ఏ కారు డ్రైవరుకో శిక్ష వేస్తారు. వాడు రెండు, మూడేళ్లలో క్షమాభిక్ష తెచ్చుకుని బయటకు వచ్చేస్తాడు. వివేకా కేసు సిబిఐ చేతిలో ఉంది అని చెప్పవచ్చు. సిబిఐ కేంద్రం కనుసన్నల్లో ఉంటుందని, కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు లోబడే కేసుల విచారణ వేగం పెంచడం, తగ్గించడం చేస్తుందని అందరికీ తెలుసు. జగన్‌పై కేసుల్లోనూ జాప్యం, వివేకా హత్య కేసులోనూ జాప్యం, జగన్‌కు కేంద్రంతో సత్సంబంధాలు, మూడూ కలిపి చూస్తే విషయం అర్థం కాదా?

వివేకా హత్య గురించి చర్చ జరగడం అసహజం కాదు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే వగైరా. కానీ ఉమామహేశ్వరి రాజకీయ వ్యక్తి కాదు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి. సవతి తల్లి పట్ల ఔదార్యం కనబరచిన మంచి వ్యక్తి కూడా అంటున్నారు. అలాటి వివాదరహితురాలి మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడడం హేయం. వివేకా కూతురు తన తండ్రి హత్య విచారణ గురించి అనేక సంశయాలు వెలిబుచ్చుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, వైసిపి నాయకులు స్పందించటం లేదు. కానీ ఉమామహేశ్వరి కుటుంబసభ్యులు మౌనంగా ఉన్నా విజయసాయి ఆవిడ మరణం గురించి యాగీ చేయాలని చూస్తున్నారు. కోడెల రాజకీయనాయకుడు. కేసుల్లో యిరుక్కున్న వ్యక్తి. ఆయననూ, ఉమామహేశ్వరిని ఒకే గాటకు కట్టారు విజయసాయి. ఆ గాట ఏమిటంటే చంద్రబాబుకు సన్నిహితులట.

చంద్రబాబుకి సన్నిహితులందరూ యిలా పోతున్నారా? ఎన్టీయార్ కుటుంబం చాలా పెద్దది. అందరూ యీయనకు సన్నిహితులా? ఎందరితోనో కలవడం, విడిపోవడం, బహిరంగంగా తిట్టుకోవడం జరిగాయి. ఈవిడ చంద్రబాబుకి కానీ, ఆయన కుటుంబానికి కానీ సన్నిహితంగా ఉంటుందని ఏమైనా రుజువుందా? ఆవిడ ఆత్మహత్య లేఖ రాస్తే బాబు దాచేశారని కొందరు వైసిపి నాయకులంటున్నారు.  అంటే కుటుంబసభ్యులకు ఏ పాత్రా ఉండదా? లేఖ ఉండకపోవచ్చు. ఉన్నా దాని వలన వివాదాలు, చర్చలు వస్తాయనే భయంతో కుటుంబం దాచివేసి ఉండవచ్చు. మధ్యలో బాబు ఎక్కణ్నుంచి వచ్చారు? పైగా లోకేశ్‌ను కూడా లాగడమా? మీ పిన్ని, చున్నీ అంటూ ప్రాసలతో వెక్కిరింతలా? ఏవిటీ దరిద్రం! జరిగినది విషాదం. ఒకరికి భార్య పోయింది. ఇద్దరికి తల్లి పోయింది. కొందరికి సోదరి పోయింది. ఆ విషాదాన్ని యిలా వాడుకోవడమా? వీళ్లంతా నాయకులు, భావితరాలను ఉద్ధరిస్తారు అనుకుంటేనే జలదరింపు కలుగుతోంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

mbsprasad@gmail.com

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను