Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: విశాఖ స్టీలుపై మాత్రమే నిరసన ఎందుకు?

ఎమ్బీయస్: విశాఖ స్టీలుపై మాత్రమే నిరసన ఎందుకు?

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటు పరం అయిపోతుందనగానే ఉద్యోగులే కాదు, అక్కడి జనాలూ ఆందోళన చేయసాగారు. అన్ని పార్టీల స్థానిక రాజకీయనాయకులు దానికి వత్తాసు పలుకుతున్నారు. ఇది నాకు వింతగా వుంది. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరం చేయడం యివాళ ప్రారంభమైందా? ఇటీవల జోరు పెరిగిందంతే. అప్పుడంతా నోరు మూసుకుని కూర్చుని యిప్పుడు మాత్రం కుదరదు అంటే ఎలా? సోము వీర్రాజు గారు ఆందోళన చేస్తారట. ఆయన పార్టీ విధానమే అది. దాన్ని మెచ్చే ఆయన పార్టీలో చేరాడు, ప్రముఖ స్థానంలో వున్నాడు. 

పవన్ కళ్యాణ్ దిల్లీ వెళ్లి మోదీతో చెడామడా మాట్లాడేసి వస్తాట్ట. ప్రయివేటేజేషన్ వంటి బిజెపి సిద్ధాంతాలు నచ్చే కదా పొత్తు పెట్టుకున్నది! విశాఖ ఉక్కు అనేసరికి ప్రాంతీయపరమైన సెంటిమెంటా? ఇది చూసి యిక్కడ ఆపేస్తే ప్రతీ ప్రభుత్వ సంస్థ వున్న ప్రాంతంలోనూ యిలాటి గొడవ వస్తుంది. ఆంధ్రా ఎంపీలు తమను కలిసినపుడు కేంద్ర బిజెపి యీ ముక్క చెప్పి ‘ఇలా అయితే ఏదీ అమ్మలేం, దేశానికి ముందుకు తీసుకెళ్లలేం’ అంటారు. తాము చేయదలచుకున్నది చేసి తీరతారు.

ఏయే రంగాలు ప్రయివేటేజ్ చేస్తారో బజెట్‌లో నిర్మలమ్మ చదువుతూంటే, యింకేం మిగిలాయబ్బా అనిపించింది. ఏమైనా అంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగా లేదు అంటారు. నిజమే, రోగం వుంది. అయితే రోగానికి యిది సరైన మందా అని చూడాలి. కలకత్తాలో వున్నపుడు ఓ మెకానిక్ దగ్గర కెళ్లి నా స్కూటర్ మిస్‌ఫైర్ అవుతోంది చూడమంటే, చక్రం యిప్పబోయాడు వాడు. వాడికి వచ్చినది అదొకటే అని నాకర్థమైంది. అలాగే మోదీకి ప్రయివేటేజషన్ ఒక్కటే వచ్చు. గద్దెకెక్కి ఆరేళ్లన్నర అయింది కదా, ప్రభుత్వహయాంలో నడిచేవాటిని సమర్థవంతంగా నిర్వహించడం రాదు. 

నష్టాల్లో వున్న ఫలానా సంస్థను లాభాల బాట పట్టించాను చూడండి అని చెప్పుకోగా నే చూడలేదు. నష్టాలొస్తున్నాయా అయితే అమ్మేయండి అంటాడు. సార్, పొరపాటు చెప్పా, లాభాలు వస్తున్నాయండి అని పిఏ చెపితే, అదీ అమ్మేయండి అంటాడు. ఎలా వున్నా అమ్మడం అనేది మాత్రం కామన్ ఫ్యాక్టర్. ప్రభుత్వ సంస్థ నష్టాల్లో వుంటే అది కాంగ్రెసు నిర్వాకం. మరి లాభాల్లో వుంటే? ఆ ఘనత ఎవరి ఖాతాలో వేయాలి? కాంగ్రెసు హయాంలో పెరిగిన ప్రభుత్వ ఆస్తులు తెగ నమ్ముతూ లక్షల కోట్లు సొమ్ము చేసుకుంటూ, మళ్లీ కాంగ్రెసు ఏమీ చేయలేదు, దేశాన్ని తగలేయడం తప్ప అంటారు. ఇదెక్కడి లాజిక్కో తెలియదు. 

చేతనైతే కాంగ్రెసు పాడు చేసినవాటిని బాగు చేసి చూపించండి. అప్పుడు మెచ్చుకుంటాం. గడించినవాడు గొప్పవాడు, ఖర్చుపెట్టినవాడు కాదు. ఏదైనా సంస్థ లాభసాటిగా, సమర్థవంతంగా నడిచిందంటే ఆ సంస్థకు నేతృత్వం వహించినవారికి, అంకితభావంతో పని చేసిన సిబ్బందికి సలాం కొట్టాలి. ఆ సమయంలో అధికారంలో వున్న ప్రభుత్వానికి ఆ ఘనతలో కొద్దిపాటి వాటాయే! ఆ సంస్థకు సరైన వ్యక్తిని అధినేతగా నియమించినందుకు, అతన్ని సరిగ్గా పనిచేయనిచ్చినందుకు! మొత్తమంతా ప్రభుత్వానిదే గొప్పతనం అంటే మరి అన్ని సంస్థలూ బాగా నడవాల్సి వుంది. నడవటం లేదుగా!

ప్రభుత్వ సెక్టార్ అయితే నాశనం, ప్రయివేటు సెక్టార్ అయితే అద్భుతం అని కొందరు వాదిస్తారు. ప్రభుత్వం అన్నీ తెగనమ్ముతూంటే చప్పట్లు కొడతారు. మరి ప్రయివేటు ఎయిర్‌లైన్స్ ఎందుకు కుప్పకూలినట్లు? వాళ్లు తక్కువ రేట్లకే విమానమెక్కించారు భేష్ అని కొందరంటారు. మనల్ని విమానం సరే, వాళ్లు బ్యాంకులను టేకెన్ ఫర్ ఏ రైడ్. అంతిమంగా మనల్ని గాడిద ఎక్కించారు. చిన్నస్థాయి ఋణగ్రస్తులనైతే ఆస్తులు వేలం వేస్తామని బెదిరిస్తాడు బాంకు మేనేజర్. విజయ మాల్యా, నీరవ్ మోదీ లాటి వాళ్లయితే చైర్మన్, ఎండీ లెవెల్లోనే నిర్ణయాలు అయిపోతాయి. 

మేనేజరు నోరెత్తడానికి వీల్లేదు. వీళ్లు దోచినది ఎవర్ని? బ్యాంకులని అంటే డిపాజిటర్లను. అంటే మనల్నే. ఎన్‌పిఏలు (నిరర్ధక ఆస్తులు) గతంలో యీ స్థాయిలో వున్నాయా? మన్‌మోహన్ సింగ్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అప్పులిచ్చారు. అవన్నీ యిప్పుడు తిప్పలయ్యాయి. ఇవ్వడం యిప్పుడూ మానలేదు, అందుకే ఎన్‌పిఏలు మేట వేసుకుని పోతున్నాయి. పబ్లిక్ సెక్టార్ సంస్థలు అమ్మి వాటి తరఫున అప్పులు తీరుస్తున్నారు.

ఆరోజు చౌకగా విమానం ఎక్కినందుకు సంతోషించాలా? ఈ రోజు బ్యాంకు మూతపడినందుకు ఏడవాలా? అలాగే సెల్‌ఫోన్ చార్జీలు. అతి తక్కువ చార్జీల కిస్తున్నామంటూ చివరకు బాంకులకు బొప్పణం పెట్టారు. అనిల్ అంబానీ చూడండి, అన్ని హంగులూ చేసి యీరోజు దివాళా తీసి కూర్చున్నాడు. నష్టం ఎవరికి? బాంకులకు. అంటే డబ్బు దాచుకున్న మీకూ నాకూ! ప్రయివేటు సెక్టార్ అంత అద్భుతమైతే, అనేక కంపెనీలు హెచ్చు వడ్డీ రేట్ల గేలం వేసి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, ముంచేయెందుకు? అనేక కార్పోరేట్లు ప్రయివేటు బాంక్స్ పెట్టి మంది దగ్గర డబ్బు తీసుకుని తమవాళ్లకు ఋణాలిచ్చి వసూలు చేయక, మునిగితే వాటి భారం పబ్లిక్ సెక్టార్ బాంక్స్‌ను మోయమంటోంది ప్రభుత్వం. అప్పుడు మాత్రం పబ్లిక్ సెక్టార్ కావలసి వచ్చింది.

ఆర్థిక సంస్కరణల వలన దేశం అన్ని విధాలా బాగుపడింది, మోదీ మరింత వేగంగా సంస్కరణలు చేస్తున్నాడు, మెచ్చుకోవేం? అని అడుగుతున్నారు కొందరు. రిఫార్మ్స్ వలన దేశం బాగుపడిందా? అయితే కాంగ్రెసును మెచ్చుకోవాలిగా. అలా అడిగితే అబ్బే, వారి హయాంలోనే దేశం అధ్వాన్నమై పోయింది అంటారు. అదైనా ఒప్పుకోండి, యిదైనా ఒప్పుకోండి. సంస్కరణలు వచ్చాక దేశీయ పరిశ్రమలు సర్వనాశనమై పోయింది. బాంకులు అప్పిస్తానన్నా ఏ ఫ్యాక్టరీ తీసుకోవటం లేదు, ఎవరూ దేశీయ ఉత్పత్తులు కొనటం లేదు, మొత్తమంతా దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం అని నేను మాట్లాడితే, కొందరు కన్స్యూమరిజం గురించి మాట్లాడుతున్నారు. 

దూరదర్శన్‌లో పాడిపంటా చూపించేవారు, ప్రయివేట్ ఛానెల్స్ వచ్చాకనే మిడ్‌నైట్ మసాలా చూడగలిగాం అంటున్నారు. నేను మాట్లాడేది ఉత్పాదనశక్తి పోగొట్టుకోవడం గురించి, పరిశోధనలకు మంగళం పాడడం గురించి. మీరు రకరకాల బూట్లు కొనుక్కోవచ్చు, ఖరీదైన వాచీలు కొనుక్కోవచ్చు గురించి. ఇలాటి కన్స్యూమరిజం వలననే మధ్యతరగతికి ఆశలు పెరిగి, అప్పుల పాలై ఆత్మహత్యలు పెరిగాయి. గ్లోబలైజేషన్ వలన చైనా బాగుపడింది కానీ మనం బాగుపడలేదెందుకు? అమెరికా ఎందుకు బాగుపడలేదు? ఆలోచించండి మీకే తడుతుంది.

కొన్ని రంగాల్లో ప్రభుత్వ సెక్టార్ సంస్థలు మాత్రమే వున్నపుడు మొనోపలీ గురించి అందరూ మాట్లాడేవారు. ఇప్పుడు ప్రయివేటు సెక్టార్‌లో మాత్రం ఏమవుతోంది? చిన్న చేపలను పెద్ద చేపలు మింగితే, పెద్ద చేపలను ఒకటి రెండు తిమింగలాలు తినేసి, మోనోపలీ చలాయిస్తున్నాయి. పోనుపోను కన్స్యూమర్‌కు ఛాయిస్ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా వారి విశ్వరూపమే. ఈ తిమింగలాలు యిప్పుడే తయారయ్యాయని నేననటం లేదు. ఎవరు ప్రభుత్వంలో వున్నా వాళ్లు బలుస్తూనే వున్నారు. ఎటొచ్చీ గత ఆరేళ్లగా వాళ్ల రేట్ ఆఫ్ గ్రోత్ విపరీతంగా వుంది. అది గమనించాలి. ఇక సంస్కరణల వలన దేశం బాగుపడిందా లేదా అంటే, మంగలివాడి బంగారు గుడ్డు కథ గుర్తుకు వస్తుంది.

ఓ రాజు గారు తన పాలనలో ప్రజలెలా బతుకుతున్నారో తెలుసుకోవాలని క్షవరం చేయడానికి వచ్చే మంగలిని అడిగేవాడట. ‘అందరూ సుఖంగా వున్నారు మహాప్రభో, ఒక్కోళ్ల దగ్గర కోడిగుడ్డంత బంగారం వుంటోంది’ అనేవాట్ట. ఎప్పుడడిగినా యిలాగే చెప్తున్నాడేమిట్రాని సైనికులను పంపి రహస్యంగా సోదా చేయిస్తే అతని యింట్లో ఓ బంగారపు కోడిగుడ్డు వుంది. ఎత్తుకుని వచ్చేయమన్నాడు రాజు. మర్నాడు రాజుగారు ఎలా వుంది దేశం అని అడగ్గానే ‘చాలా దరిద్రంగా వుంది ప్రభో, ఎవరి దగ్గరా చిన్నమెత్తు బంగారం కూడా లేదు’ అన్నాట్ట. మన అనుభవం బట్టి మన అభిప్రాయా లుంటాయని యీ కథ చెప్తుంది. రిజర్వేషన్లనో, మరోటనో ఉద్యోగాలు రాక అవస్థపడేవాళ్లకి సంస్కరణల వలన ఉద్యోగాలు వచ్చి బాగుపడిన కుటుంబాలను అడిగితే సంస్కరణలు అద్భుతం అంటారు. కానీ సమాజం మొత్తం మీద పరిస్థితి ఎలా వుంది అనేది చూడాలి.

సంస్కరణలకు పూర్వం, యిప్పటికి పోల్చి చూస్తే సమాజంలో పేదవర్గాలలో అభ్యున్నతి కనబడిందా? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి జారారా? ధనికులు మరింత ధనికులు అయ్యారా? ధనికులకు, పేదలకు మధ్య అంతరం పెరిగిందా? ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది? దేశం యొక్క ఋణభారం ఎంత పెరిగింది? బాలన్స్ ఆఫ్ ట్రేడ్ (ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం)లో మార్పేమిటి? ఉత్పాదక రంగం ఎలా వుంది? ఉద్యోగాలు, ముఖ్యంగా అసంఘిత రంగంలో ఉద్యోగాలు ఏమయ్యాయి? మామూలుగా వుండే అభివృద్ధి కంటె దీనివలన మరింత అభివృద్ధి జరిగిందా? – అనే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రపంచీకరణను చైనా బాగా వాడుకుని తన మార్కెట్‌ను ప్రపంచమంతా వ్యాపింపచేసుకుంది. మనం చేసుకోలేదు కదా! సర్వీసులు అందిస్తూ కొన్ని కుటుంబాలు బాగుపడి, భూములు కొని భూమి రేట్లు పెరగడానికి దోహదపడ్డాయి. కానీ అది అభివృద్ధి కాదు. విద్య, వైద్య, పరిశోధన, ఉత్పత్తి, ఉద్యోగకల్పన, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో ప్రగతి మాత్రమే అసలైన సూచిక. ఇవన్నీ చూశాక ప్రపంచీకరణ మన దేశానికి ఎంత మేలు చేసిందో అర్థమవుతుంది. ప్రపంచీకరణ ఒరవడిలోనే ప్రయివేటీకరణ కూడా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి సుజనా చౌదరి చెప్తున్నారు, ఉద్యోగాలు ఎక్కువ వచ్చేస్తాయట.

పబ్లిక్ సెక్టార్‌లోంచి ప్రైవేట్ సెక్టారుకి వెళ్లిన తర్వాత ఉద్యోగుల సంఖ్య ఎక్కువైన సంస్థలేవో ఆయన చెప్తే సంతోషిస్తాను. షేర్‌హోల్డర్లకు మరింత లాభాలు రావాలనే ప్రయివేటీకరణ చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. మరి ఆయన సొంత కంపెనీల్లో షేర్‌హోల్డర్లకు ఎంతెంత లాభాలు చేకూర్చారో మరి! ఆ క్రమంలో ఎన్ని బాంకులు లూటీకి గురయ్యాయో! రాయపాటి సాంబశివరావు గొప్ప వ్యాపారవేత్త అని మొన్నటిదాకా బాజా. ఇప్పుడు చూస్తే ఎన్నో అక్రమాలు చేసినట్లు ఆరోపణ. బాంకులకు వేలాది కోట్లలో డబ్బు ఎగవేసినవారు ప్రయివేటు కార్పోరేట్లు కాదా? ఆ జాబితా విడుదల చేయమంటే ప్రభుత్వానికి తగని మొహమాటం.

సాగు బిల్లుల గురించి రాస్తూ వుంటే కొందరు పాఠకులు కార్పోరేట్లను అనుమానించడం దేనికి? వాళ్లకు రైతులను మోసం చేస్తారన్న భయం దేనికి? రైతుతో కుదుర్చుకునే ఒప్పందంలో రైతుకు రక్షణ వుండాలనడం దేనికి? అని అడుగుతున్నారు. కార్పోరేట్లన్నీ చెడ్డవని నేనెలా అనలేనో (అనను కూడా) అన్నీ మంచివని వారూ అనలేరు. వాళ్లకు కళ్లాలు వేయకపోతే రైతులు మోసపోయే ప్రమాదం వుందనే నేను వాదిస్తున్నాను. మోసపోయిన రైతు కార్పోరేట్‌తో తలపడలేడని కూడా చెప్పాను. పెప్సికో ఉదంతం గురించి రాశాను.

జెమినీగణేశన్ వ్యాసం నా ఐపి (మేధోసంపత్తి) దాన్ని ‘‘మిసిమి’’ వాళ్లు పుణ్యానికి వాడేసుకున్నారు, నా పేరు హరించి వేరే వాళ్లకు కట్టబెడితే, నేనేమీ చేయలేకపోయాను, వాళ్లు మోతుబర్లు కాబట్టి! పెప్సికోకు పేటెంటు వున్న బంగాళాదుంప విత్తనాలను రైతులు వేస్తే అది వారిపై కోటి రూ.ల జరిమానా వేసి, వసూలుకై కోర్టుకి వెళ్లింది. వాళ్లు ఆ పంటను అమ్ముకోకపోతే శిక్షార్హులు కాదని చట్టాన్ని కోట్ చేశాను కూడా. అయినా కంపెనీ కోర్టుకి వెళ్లింది. అక్కడ అది నెగ్గిందని ఒక పాఠకుడు వాదించారు. నెగ్గలేదు. రైతుల పక్షాన సామాజిక సంస్థలు, ప్రభుత్వాలూ కూడా నిలబడడంతో గతి లేక కేసులు విత్‌డ్రా చేసుకుంది.

ప్రభుత్వం నాకేం అని వూరుకుంటే ఏమయ్యేది? అయినా కార్పోరేట్లు మోసాలు చేయవా? నేను క్రైమ్ శీర్షికలో జయంతి షిప్పింగ్ కంపెనీతో సహా అనేక కార్పోరేట్ మోసాల గురించి రాశాను. ఇప్పటికి కూడా విజయ మాల్యా చేయలేదా? రాన్‌బాక్సీ చేయలేదా? సత్యం చేయలేదా? ఎన్నో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ప్రమోటర్లు నిధులు మళ్లించలేదా? 1990లలో ఓ కంప్యూటర్ కంపెనీ (పిసిఎల్ అని గుర్తు) 25 వేలకు కంప్యూటర్ యిస్తానని ప్రామిస్ చేస్తే నేను డబ్బు కట్టాను. తర్వాత కంపెనీ ఎత్తేశామన్నారు. చిదంబరం హస్తం దానిలో వుందని పుకార్లు వచ్చాయి. నాలా ఎందరు పోగొట్టుకున్నారో! కార్పోరేట్లలో కొన్ని ప్రజల్ని మోసం చేయడమే కాదు, ఒకరినొకరు కూడా మోసం చేస్తూంటాయి. తాజా ఉదంతం ‘‘హెరిటేజ్ ఫ్రెష్’’ను చంద్రబాబు కుటుంబం నుంచి కొనేసిన ఫ్యూచర్ గ్రూపుది.

కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ మార్కెటింగ్‌లో రారాజు. ‘సెంట్రల్’, ‘బిగ్ బజార్’ ‘‘ఎఫ్‌బిబి’’, ‘‘ఫుడ్‌హాల్’’ ‘‘ఈజీ డే’’, ‘‘హెరిటేజ్ ఫ్రెష్’’, ‘‘డబ్ల్యుఎచ్ స్మిత్’’ ‘‘బ్రాండ్ ఫ్యాక్టరీ’’ వగైరా బ్రాండ్‌లన్నీ వాళ్లవే. దేశంలో 1550 స్టోర్స్ వున్నాయి. 2019లో ఫ్యూచర్ కూపన్స్‌ అనే అనుబంధ సంస్థలో అమెజాన్ రూ. 2 వేల కోట్లు పెట్టి 49శాతం వాటా తీసుకుంది. అప్పుడు ఫ్యూచర్ అమెజాన్‌కు ‘ఫస్ట్ కాల్’ ఆప్షన్ యిచ్చింది. ఇప్పుడు ముకేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి 13.14శాతం వాటాను రూ. 24,713 కోట్లకు 2020 ఆగస్టులో అమ్మింది. ఆ వాటాతో బాటు గ్రూపుకి వున్న రూ.12,500 కోట్ల ఋణం కూడా తీరుస్తానంది రిలయన్స్. ఇది పెట్టుకుని ఈ కామెర్స్‌లో అమెజాన్‌తో పోటీ పడాలని వాళ్ల ఆలోచన. అయితే దీనికి అమెజాన్ అడ్డుకట్ట వేసింది. తమతో గతంలో ఒప్పందం చేసుకున్నపుడు తమ ప్రత్యర్థి (రిస్ట్రిక్టెడ్ పర్శన్) ఐన ముకేశ్ అంబానీతో ఎలాటి బేరాలు పెట్టుకోకూడదని స్పష్టంగా చెప్పామని, తమను సంప్రదించకుండా రిలయన్స్‌కు వాటా అమ్మివేయడమేమిటని సింగపూర్‌లోని సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ (ఎస్‌ఐఏసి)కి ఫిర్యాదు చేసింది.

లాక్‌డౌన్ టైములో షాపులు మూసేయడం వలన నాకు చాలా నష్టాలు వచ్చేశాయి. డబ్బిచ్చి ఆదుకోమంటే అమెజాన్ ఆదుకోలేదు. అందుకే రిలయన్స్‌కు అమ్మేశాను అంటాడు కిశోర్ బియానీ. ఆ ముక్క ముందు మాకు చెప్పాలిగా, మన ఒప్పందంలో వున్న ప్రకారం నువ్వు అమ్మదలచుకుంటే తొలిగా కొనుక్కునే ఛాన్స్ మాకు యిచ్చి, మేం కాదంటే అప్పుడు యింకొకరి దగ్గరకు వెళ్లాలి. మా భాగస్వామిగా వుంటూ, మా పోటీదారుతో చేతులు కలిపితే ఎలా? అని అమెజాన్ వాదించింది. ఇద్దరి వాదనలూ విన్న ఎస్‌ఐఏసి అక్టోబరులో ఫ్యూచర్-రిలయన్స్‌ డీల్‌పై స్టే విధించింది. ఫ్యూచర్ తన ఆస్తులను రిలయన్స్‌కు బదిలీ చేయకూడదంది. ఆ తీర్పు తమకు ప్రతికూలంగా వుండడంతో సింగపూర్‌లో జరిగినదాన్ని మా దేశంలో ఆమోదించవలసిన అవసరం లేదంటూ ఫ్యూచర్ ముందుకు వెళ్లింది.

ఎస్‌ఐఏసి స్టే వుంది కాబట్టి ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందాన్ని అంగీకరించవద్దని అమెజాన్ సెబికి, బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజికి, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజికి రాస్తానంది. కాదూ కూడదని అంగీకరిస్తే ప్రఖ్యాతి వహించిన ఎస్‌ఐఏసి ఆదేశాలు ఇండియా అమలు చేయడం లేదని అంతర్జాతీయ కంపెనీలన్నీ భావిస్తాయని, దాంతో ఇండియాకు చెడ్డపేరని రాసింది. అలా రాయడానికి వీల్లేదంటూ ఫ్యూచర్ గ్రూప్ దిల్లీ హైకోర్టుకి వెళితే, కోర్టు అమెజాన్ పక్షం వహించి ఎస్‌ఐఏసి యిచ్చిన ఆదేశం చెల్లుతుందని, ఫ్యూచర్ తన ఆస్తులను రిలయన్స్‌కు బదిలీ చేయడానికి వీల్లేదనీ, సెబి వంటి ఏజన్సీలు చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ఇటు చూస్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. 

జాతీయంగా పలుకుబడి వున్న రిలయన్స్ నెగ్గుతుందా, అంతర్జాతీయంగా పలుకుబడి వున్న అమెజాన్ నెగ్గుతుందా వేచి చూడాలి. ఇలా వుంటాయి కార్పోరేట్ల వ్యవహారాలు. వాళ్లంతా సచ్ఛీలురని సర్టిఫికెట్లు యిచ్చేవారు అమాయకులు. వాళ్లు రైతులతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు రైతుల దగా పడకుండా సరైన రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వైజాగ్ స్టీల్ ప్లాంటే సంగతికి తిరిగి వస్తే ఎల్‌ఐసి వంటి ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటు చేస్తానన్నపుడు అది దాని ఉద్యోగుల సమస్య మాత్రమే, మనది కాదు అని పాలసీ హోల్డర్లతో సహా ప్రజలంతా ఉదాసీనత చూపడం వలననే మోదీ ప్రభుత్వం తెగబడుతోంది. కంటికి కనబడ్డవన్నీ అమ్మేస్తోంది. దీన్ని అరికట్టాలంటే రైతులనే ఆదర్శంగా తీసుకోవాలి. 

పంజాబ్, హరియాణా, పశ్చిమ యుపి రైతులు తిరగబడితేనే ప్రభుత్వం సాగు చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేస్తానంది. అది అర్థం చేసుకునే భాష పోరుబాట ఒక్కటే. కార్మికుల హక్కులు దశలవారీగా హరించివేస్తున్నారు. యూనియన్లు బలహీనపడడం వలన ప్రతిఘటన లేదు. ఇప్పుడు వైజాగ్ ఆందోళన బలపడితే, యితర ప్రాంతాలకు వ్యాపిస్తే అప్పుడేమైనా ప్రయివేటీకరణ స్పీడు మందగిస్తుందేమో చూడాలి.  లేకపోతే యిది కొన్నాళ్ల పాటు కాలక్షేపం న్యూస్ గానే మిగులుతుంది. మోదీ జగన్నాథ రథచక్రాల కింద పబ్లిక్ సెక్టార్ నలిగి, ఆయన గద్దె దిగేలోపున కనుమరుగౌతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?