Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అడ్డదారిలో పోటీ వచ్చిన విపి సింగ్

ఎమ్బీయస్: అడ్డదారిలో పోటీ వచ్చిన విపి సింగ్

నాదెండ్ల ప్రయోగం జరిగిన రెండు నెలలకే ఇందిర హత్యకు గురయ్యారు. రాజీవ్ ప్రధాని అయ్యారు. ఇందిర దారుణహత్య కారణంగా పెల్లుబిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి 1984 డిసెంబరులో రాజీవ్ పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే కనీవిని ఎరగని విధంగా 415 స్థానాలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వెన్నుపోటుకు గురైన ఎన్టీయార్‌పై సానుభూతి రాజీవ్ సానుభూతిని ఎదుర్కొంది. 30 సీట్లలో టిడిపి గెలిచింది. రాజ్యసభలో 10 మంది టిడిపి వాళ్లుండేవారు. దాంతో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి వుంది. దాని ఆఫీసులో ప్రతిపక్ష నాయకులందరూ చేరి మంతనాలు సాగించేవారు. ఎన్టీయార్ తరచు దిల్లీ వస్తూ పోతూ వుండడంతో ఎపిభవన్ ప్రతిపక్ష కార్యకలాపాలకు కేంద్రబిందువైంది.

నాదెండ్ల తిరుగుబాటు సమయంలో మీ పక్షాన వున్నాం కదా, మరి మాకేమిటి లాభం? అని ఎమ్మెల్యేలందరూ అడగడంతో ఎన్టీయార్‌కు తిక్కపుట్టి, అసెంబ్లీ రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరపమని సిఫార్సు చేశారు. 1985 మార్చిలో ఎన్నికలు జరిగాయి. టిక్కెట్ల ఎంపికలో చంద్రబాబు ముఖ్యపాత్ర వహించారు. సిటింగ్ ఎమ్మెల్యేలలో 75 మందికి మళ్లీ టిక్కెట్లు యివ్వలేదు. వారు నాదెండ్ల చూపిన ప్రలోభాలకు లొంగనివారు. వారు వచ్చి మొత్తుకోగా తను వారి తరఫున వెళ్లి ఎన్టీయార్‌తో వాదించానని, చివరకు ఆయన అయిష్టంగానైనా 38 మందికి టిక్కెట్లు యివ్వడానికి ఒప్పుకున్నారని ఉపేంద్ర రాసుకున్నారు. అభ్యర్థి ఎవరైనా, ఎన్టీయార్‌పై సానుభూతితో జనాలు ఓట్లేశారు. 202 స్థానాలు వచ్చాయి. రాజీవ్ ఘనవిజయంతో చేష్టలుడిగి కూర్చున్న జాతీయ ప్రతిపక్ష నాయకులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

కానీ రాజీవ్, ఇందిర కంటె భిన్నం. రాష్ట్రాలకు అధికారాన్ని పంచడంలో ఉదారంగానే ఉన్నాడు. దానితో ‘భారతదేశం’ అనే పార్టీని పెడతానని ప్రకటించినా ఎన్టీయార్‌ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ప్రతిపక్షాలకు ఆశ చావలేదు. 1986లో హైదరాబాదులో జరిగిన మహానాడులో వాళ్లంతా పాల్గొన్నారు. నేషనల్ ఫోరమ్ పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ లోపున ఎన్టీయార్ తనను తాను జాతీయ నాయకుడిగా ప్రొజెక్టు చేసుకోసాగారు. ఈ సమయంలోనే ‘‘తుగ్లక్’’ పత్రికలోని ప్రశ్నోత్తరాల శీర్షికలో ‘ఎన్టీయార్ యిప్పుడేం చేస్తున్నారు?’ అనే ప్రశ్నకు సమాధానంగా చో రామస్వామి ‘‘చిల్లర పోగుచేస్తున్నారు.’’ అని సమాధాన మిచ్చారు. అది సరైన వ్యాఖ్యానమే.

ఎందుకంటే రాజీవ్‌కు ఇందిర అంత రాజకీయచాకచక్యం లేదు కాబట్టి, వచ్చే ఎన్నికలలో అతనికి ప్రత్యామ్నాయంగా ఎదిగే ఛాన్సు తమకుందని విశాలమైన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ వగైరా నాయకులు అనుకుంటూండగా, దక్షిణాది నుంచి తనకే ఛాన్సుందని అనుకున్న ఎన్టీయార్‌ తన చూపు చిన్న రాష్ట్రాలపై సారించారు. మారుమూల ఈశాన్య రాష్ట్రాలలో కూడా తన గురించి అందరికీ తెలియాలని అనుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేశారు. విద్యార్థి సంఘంగా పలు సంవత్సరాలు ఆందోళన జరిపి, తొలిసారిగా 1985లో ఎన్నికలలో పాల్గొన్న అసాం గణ పరిషత్‌ (ఎజిపి) తరఫున ప్రచారం చేయడమే కాక, ఆర్థికసాయం కూడా అందించారని చెప్పుకున్నారు. 1986 డిసెంబరులో నాగాలాండ్‌కు వెళ్లి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. 1987లో హరియాణాలో రైతు నాయకుడు దేవీలాల్‌కు మద్దతుగా ప్రచారం చేసి ఆయన గెలుపుకు దోహదపడ్డారు. హరియాణా కూడా చిన్న రాష్ట్రమే.

అయితే ఈ ఆశావహులందరినీ నెట్టుకుంటూ, అనూహ్యంగా విపి సింగ్ తెరపైకి వచ్చి సడన్‌గా హీరో అయిపోయారు. నిజానికి విపి సింగ్ అంత రాజకీయ కపటి మరొకరు లేరు. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకున్న తీరు అపూర్వం, అన్యులకు అసాధ్యం. నాబోటి వాళ్లం ఆయనను కొంతకాలం ఆరాధించాం. తర్వాత ప్రధాని కావడానికి వేసిన ఎత్తుగడలు అసహ్యం కలిగించాయి. ప్రధాని అయ్యాక ఆయన చేపట్టిన మండల్ రాజకీయాలు, దాన్ని ఎదుర్కోవడానికి బిజెపి అవలంబించిన కమండల్ రాజకీయాలతో దేశం భ్రష్టు పట్టిందని నా ఆవేదన. విపి సింగ్ అనుభవంతో నేను తెనాలి రామలింగడి పిల్లిలా అయిపోయాను. ఎవరు గొప్పగా చేస్తానని చెప్పుకున్నా అనుమాన దృక్కులతోనే చూస్తున్నాను.

జెపి లోకసత్తా ఉద్యమాన్ని రాజకీయపార్టీగా మార్చినపుడు, అన్నా హజారే ఉద్యమం గురించి దేశమంతా వూగిపోయినప్పుడు, నేను వాళ్లనుకున్నంత పాజిటివ్‌గా స్పందించలేదని చాలామంది పాఠకులు నొచ్చుకున్నారు. కానీ పర్యవసానాలు ఎలా వున్నాయో అందరూ చూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినపుడు నెలా రెండు నెలలపాటు ఆశపడ్డాను. తర్వాత దిగాలు పడ్డాను. పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం విని ముచ్చటపడ్డాను, మలి ప్రసంగానికే నీరు కారాను. నిజానికి వీళ్లు స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయగలిగే స్థితిలో వున్నారు. కానీ చేయలేదు. రాజకీయాల్లో వాగ్దానాలు విని మోసపోకూడదు. ఎంత మేధావైనా కావచ్చు, ఎన్ని ప్రణాళికలైనా చూపవచ్చు. ఆచరణలోకి వచ్చేసరికి ఏం చేయగలిగారు అన్నదే ముఖ్యం.

విపి సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. రాజీవ్ తనను కేంద్ర కాబినెట్‌లో తీసుకున్నాడు. రాజీవ్‌కు అప్పట్లో ఉన్న మిస్టర్ క్లీన్ యిమేజి చెడగొట్టడానికి విపి సింగ్ చేయని హడావుడి లేదు. తనను తాను పెద్ద హీరోగా చూపుకోవడానికి అండర్ ఇన్‌వాయిసింగ్ చేశారంటూ 84 ఏళ్ల పారిశ్రామిక వేత్త కిర్లోస్కర్‌ను అరెస్టు చేయించడం వంటి డ్రామాలు చాలా ఆడి, మధ్యతరగతి ప్రజల్లో హీరో అయిపోయాడు. ప్రధానిని యిరకాటంలోకి నెట్టేవాడు. రాజీవ్ రాజకీయాల్లోకి రాగానే బంధువైన అరుణ్ నెహ్రూ, స్నేహితుడైన అరుణ్ సింగ్‌లను సలహాదార్లుగా పెట్టుకున్నాడు. ప్రధాని కాగానే వాళ్లకు పదవులు యిచ్చాడు. రక్షణశాఖ సహాయమంత్రిగా వున్న అరుణ్ సింగ్ ప్రధానికి చెప్పకుండానే మిలటరీ కవాతులు నిర్వహించి, పాకిస్తాన్‌ను రెచ్చగొట్టబోయాడు. ఇటు విపి సింగ్ ఆర్థికశాఖా మంత్రిగా యిబ్బందులు పెడుతున్నాడు.

అందుకని 1987 జనవరిలో రాజీవ్ అరుణ్ సింగ్‌ను తీసేసి, ఆ స్థానంలో విపి సింగ్‌ను వేశాడు. రక్షణ శాఖ మంత్రిగా వుండగానే విపి సింగ్ దృష్టికి ఓ విషయం వచ్చింది. జర్మనీకి చెందిన ఎచ్‌డిడబ్ల్యు నుంచి సబ్‌మెరీన్ల కొనుగోలు వ్యవహారంలో 7 శాతం కమిషన్ యిచ్చారని జర్మనీలో భారత రాయబారి ఓ రహస్య టెలిగ్రాం పంపించారు. డిఫెన్స్ ఒప్పందాలలో మధ్యవర్తుల ప్రమేయం వుండకూడదని రాజీవ్ విధానమైనా మరి యీ కమిషన్ ఎలా చెల్లించారో కనిపెట్టండి అంటూ విపి సింగ్ దర్యాప్తుకు ఆదేశించాడు. ఆదేశించడానికి ముందు తనకు చెప్పకపోవడంతో రాజీవ్‌కు కోపం వచ్చింది.

ఇప్పుడు భారత్-రఫేల్ డీల్‌లో కూడా కమిషన్లు చెల్లించారని ఫ్రెంచి మీడియాలో వచ్చింది. కానీ ప్రభుత్వంలోని పెద్దలందరూ కలిసి అదేం లేదని కొట్టి పారేస్తున్నారు. ఇది ఎప్పుడూ జరిగేదే, కానీ విపి సింగ్ ఎవరికీ చెప్పకుండా విచారణకు ఆదేశించి, రాజీవ్‌ను, కొనుగోలు చర్చల్లో పాల్గొన్న సహచర మంత్రులను దోషులుగా చూపించడానికి ప్రయత్నించారని తేలడంతో వాళ్లంతా కత్తికట్టారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరగడంతో రాజీవ్ జ్యుడిషియల్ కమిషన్ వేసి, విపి సింగ్‌ను కూడా విచారించమన్నారు. ఇది నడుస్తూండగానే 1987 ఏప్రిల్‌లో బోఫోర్స్ కంపెనీ శతఘ్నుల ఒప్పందంలో రూ. 64 కోట్లు మధ్యవర్తులకు చెల్లించినట్లు స్వీడిష్ రేడియో ప్రకటించింది. అది రాజీవ్‌కు యిచ్చిన లంచమే అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దెబ్బకి రాజీవ్ మిస్టర్ క్లీన్ యిమేజి ఎగిరిపోయింది. అప్పటిదాకా అతనితో అంటకాగిన విపి సింగ్, శకునిలా దగ్గరే వుండి సలహాలు యిచ్చిన అరుణ్ నెహ్రూ యిత్యాదులు బయటకు వచ్చేసి అవినీతినిర్మూలన ఛాంపియన్లగా అవతార మెత్తారు.

నాకు పదవులపై ఆశ లేదు అన్న విపి సింగ్ మాటలు విశ్వసించిన ఎన్టీయార్, 1987 జులైలో ఆయన్ను హైదరాబాదు పిలిపించి రాజీవ్ రహస్యాలు బయటపెట్టి, రాబోయే ఎన్నికలలో ఓడించడానికి సహకరించమని కోరారు. అయితే విపి సింగ్ ఐడియాలు వేరే వున్నాయి. 1987 అక్టోబరులో అరుణ్ నెహ్రూ, యితరులతో కలిసి జన మోర్చా అనే పేరు రాజకీయేతర సంస్థగా ఏర్పడ్డారు. అంతా ఉత్తిదే. అతి త్వరలోనే రాజకీయ సంస్థగానే ఆపరేట్ చేశారు. ఇలహాబాద్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపయెన్నికలో నిలబడి లాల్ బహదూర్ శాస్త్రి కుమారుణ్ని ఓడించారు. ఎన్టీయార్ వెళ్లి విపి సింగ్ పక్షాన ప్రచారం చేశారు కానీ అభ్యర్థి బొమ్మ లేకుండా తన బొమ్మతో పోస్టర్లు వేయించి నియోజకవర్గమంతా అంటింపించారు. తనకు హంగుగా పచ్చచొక్కాల దళాన్ని తీసుకెళ్లి ‘‘ఎల్లో బ్రిగేడ్’’ పేరుతో ఊరంతా తిప్పారు. ఇంత చేసినా ఉత్తర ప్రదేశ్‌కు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి విపి సింగ్‌కే బాగా పేరు వచ్చి ఆయనే రాజీవ్‌ను ఎదుర్కోగల సమర్థుడని అందరూ అనుకోసాగారు.

మధ్యేవాద పార్టీలతో ఫ్రంట్ ఏర్పరచి, దానికి కమ్యూనిస్టుల నుంచి, బిజెపి నుంచి బయటి మద్దతు సంపాదించాలని విపి సింగ్ ఆలోచన. దానికి కొంత టైము పట్టింది. చివరకు 1988 జూన్‍లో జనతా పార్టీ, లోక్ దళ్, జన మోర్చా, టిడిపి, డిఎంకె, ఎజిపి, కాంగ్రెస్ (ఎస్)ల 30 మంది ప్రతినిథులు దిల్లీలో బిజూ పట్నాయక్ నివాసంలో సమావేశమై నేషనల్‍ ఫ్రంట్‍గా ఏర్పడ్డారు. దానిలో రామారావును పక్కకు నెట్టాలని చూసారు ఉత్తరాది నాయకులు. ఫ్రంట్‍కు కన్వీనర్‍ పదవి ఒకటి చాలని, దాన్ని విపి సింగ్‍కు అప్పగిస్తే చాలని బిజూ పట్నాయక్‍ అన్నారు. దానికి జనతా పార్టీ, జనమోర్చా, లోకదళ్ (దేవీలాల్ పార్టీ) సమర్థించగా, తక్కినవారు, ఎన్టీయార్ సాయం ఎంతగానో పొందిన ఎజిపితో సహా, మౌనంగా వున్నారు.

కన్వీనరుతో పాటు ఛైర్మన్‍ పదవి కూడా వుండాలని, దాన్ని ఎన్టీయార్‌కు యివ్వాలని, అలా అయితేనే జాతీయ పార్టీకి, దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు సామరస్యం వుంటుందని అప్పటి తెలుగుదేశం నాయకుడు ఉపేంద్ర పట్టుబట్టారు. రాత్రి ఒంటిగంటైనా తేలలేదు. సమావేశం మర్నాటికి వాయిదా పడింది. మర్నాడు ఉదయం ఉపేంద్ర తనింట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏర్పరచి ఎజిపి, డిఎంకె, కాంగ్రెస్ (ఎస్)లను పిలిచి విపి సింగ్ ఒక్కరే పదవిలో వుంటే ఫ్రంట్ ఉత్తరాది ఫ్రంట్ అయిపోతుందని వాదించి ఒప్పించారు. వి.పి.సింగ్‍ పర్శనాల్టీ కల్ట్ పెంచుకుంటున్నాడన్న అసూయతో వున్న  అరుణ్ నెహ్రూ ఉపేంద్రను సమర్ధించారు. ‘రామారావు సేవలను గుర్తించాలిగా’ అన్నాడు మధు దండవతే. బిజూ పట్నాయక్‌కు లొంగక తప్పలేదు. అప్పటి విశేషాలన్నీ ఉపేంద్ర తన ‘గతం-స్వగతం’లో గ్రంథస్థం చేసారు.

ఇలా వుంటాయి జాతీయ రాజకీయాలు. ప్రతిపక్షాల ఐక్యతకు ఎంతో శ్రమించిన ఎన్టీయార్‌కు పదవి యివ్వడానికి కూడా బ్రహ్మప్రయత్నం చేయాల్సివచ్చింది. సొంత రాష్ట్రం పనులు పట్టించుకోకుండా, మూలమూలల వున్న రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసినందుకు ఎన్టీయార్‌కు దక్కిన గౌరవం అది. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న డామేజిని కూడా గుర్తించలేక పోయాడాయన. ఎన్టీయార్‌ కథ పూర్తిగా తెలిసి కూడా చంద్రబాబు 2019కు ముందు అదే పని చేశారు. సొంత రాష్ట్రంలో బలం క్షీణిస్తున్న విషయాన్ని పసి గట్టకుండా, కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడాలు, దిల్లీ, కలకత్తా, లఖ్‌నవ్‌లకు వెళ్లి మోదీకి వ్యతిరేకంగా జాతీయనాయకులను కూడగట్టడాలు యిలాటివన్నీ చేసి, మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి, ఆయన ఆగ్రహాన్ని మూటగట్టుకుని ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. (ఫోటో- హరియాణా ఎన్నికలలో ఎన్టీయార్ ప్రచారం) (సశేషం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?