cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఎవరు గెలిస్తే మనకు లాభం?

ఎమ్బీయస్: ఎవరు గెలిస్తే మనకు లాభం?

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు ఎటూ తేలటం లేదు. ట్రంప్ కోర్టుకి వెళ్లడం ఖాయమని, శనివారానికి కానీ అంతిమఫలితం రాదంటున్నారు. జో బైడెన్ గెలుపు నల్లేరు మీద బండినడక అని అక్కడి సర్వేలు, మన మీడియా చెప్పినది తప్పనే విషయం మాత్రం స్పష్టమైంది. ‘ట్రంప్ ఓడిపోతాడా?’ అని నేను రాసిన వ్యాసం కింద వ్యాఖ్యలు చేసిన కొందరు పాఠకులు అనుకున్నట్లు, ఆశించినట్లు ట్రంప్ ఢంకా బజాయించి గెలవటం లేదు. గెలుస్తానని గట్టి నమ్మకం వుండి వుంటే, పోస్టల్ ఓట్లు లెక్కించకూడదంటూ పేచీ మొదలుపెట్టేవాడే కాదు. ఇద్దరి భవిష్యత్తూ అటూయిటూ ఊగిసలాడుతోంది. ప్రస్తుతానికి చూస్తే ఎవరైనా గెలవవచ్చు, ఎవరైనా ఓడవచ్చు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో నేను చాలా వ్యాసాలే రాశాను. అప్పట్లో కూడా అక్కడి సర్వేలు, మన మీడియా అంతా హిల్లరీ క్లింటన్ గెలుపు ఖచ్చితమంటూ వ్యాసాలు దట్టిస్తూంటే నాకు అనుమానం తోచి, అమెరికా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అక్కడి మాగజైన్లు, వార్తా పత్రికలు అవీ చదివి కొంతమేరకు ఆకళింపు చేసుకుని, ట్రంప్ గెలిచినా గెలవవచ్చు అని రాశాను. అప్పుడు కొందరు నావి చదివి నవ్వారు. ట్రంప్‌పై ఆరోపణలు, అతను చేసిన మోసాలు అన్నీ రాస్తూనే సాధారణ అమెరికన్ యివేమీ పట్టించుకోకుండా అతనికి ఓటేసే అవకాశం వుందనే చెప్పాను నేను. చివరకు అదే నిజమైంది. కొద్ది తేడాతో ట్రంప్ గెలిచేశాడు.

ఈసారి కూడా అమెరికా ఎన్నికల గురించి రాయండి అని కొందరు అడిగారు. వాటి గురించి వార్తలు చదువుతున్నాను కానీ అంత కన్విన్సింగ్‌గా తోచలేదు. కరోనాతో వ్యవహరించిన తీరు తర్వాత కూడా ట్రంప్ గెలుస్తాడేమోనని నాకు ఓ అనుమానం. కానీ సర్వేల ప్రకారం చూస్తే బైడెన్ 8 నుంచి 10 పాయింట్ల దాకా ముందున్నాడు. మన తెలుగు మీడియా ట్రంప్‌ను తిట్టిపోస్తోంది. టీవీ చర్చలకు వచ్చిన నిపుణుల్లో చాలామంది, ఆల్మోస్ట్ అందరూ, ట్రంప్ ఓటమి ఖాయం అంటున్నారు. మన వ్యక్తిగత రాగద్వేషాలతో పరిస్థితిని ఎనలైజే చేయకూడదు కదా! నా వరకు వస్తే మా పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేయరు. వీసా నిబంధనల వలన ప్రభావితమయ్యే కుటుంబం కాదు మాది. అందువలన ట్రంప్‌కు శాపనార్థాలు పెట్టవలసిన అవసరం లేదు.

ఇక మన భారతదేశానికి మేలు కలుగుతుందా లేదా అన్న విషయం గురించి మాట్లాడితే – ఇండియాకేది మంచిదో చూసి ఆ ప్రకారం ఓటేయాలని అమెరికన్ ఓటరు అనుకోడు కదా! వాడి లెక్కలు వాడి కుంటాయి. అక్కడున్న భారతీయమూలాల వారు కూడా తమకు వ్యక్తిగతంగా ఏది లాభదాయకమని ఆలోచించి ఓటేస్తారు తప్ప, ఇండియాపై యుద్ధం ప్రకటించినా పట్టించుకోరు. సంఖ్యాపరంగా మొత్తం ఓటర్లలో మనవాళ్లు 1 శాతం కూడా లేరన్నపుడు మన ఓట్లు ఎటు పడినా పెద్దగా తేడా వుండదు. అయితే మనవాళ్లు యిచ్చిన ఫండ్స్ ఓట్లను ప్రభావితం చేయగలవని ఒప్పుకోవాలి. ఇన్నాళ్లూ ఆర్థిక శక్తిగా ఉంటూ వచ్చిన ఎన్నారైలు యీసారి రాజకీయశక్తిగా కూడా ఎదుగుదామని చూస్తున్నారు. దాదాపు 200 మంది వివిధ పదవులకు పోటీ చేశారట.

కొందరు అడిగారు – ఎవరు గెలిస్తే ఇండియాకు లాభమని? ఎవరు గెలిచినా యించుమించుగా అమెరికా విదేశాంగ విధానాలు ఒకలాగే వుంటాయి. ఒక పాఠకుడు రాశాడు. అమెరికాలో 100 సంస్థలుండి విధాననిర్ణయాలు చేస్తూ వుంటాయి, అధ్యక్షుడి వలన పెద్ద మార్పేమీ రాదని. దాన్నే ద డీప్ స్టేట్ అంటారనుకుంటాను. నిజానికి ట్రంప్ వచ్చిన కొత్తల్లో కాస్త కొత్త తరహాగా ఆలోచించబోయాడు. కానీ యీ డీప్ స్టేట్ అతని చేతులకు బేడీలు వేసింది. దాని మీద ఒక ఆర్టికల్ రాశాను కూడా.

మేం హైస్కూలులో వున్నపుడు జాన్ ఎఫ్. కెనెడీ అమెరికా అధ్యక్షుడిగా వుండేవాడు. అతనంటే చాలా యిక్కడ కూడా గ్లామర్. అతని ఫోటోలు షాపుల్లో తగిలించేవారు. అతని పేర స్కూళ్లు కూడా వెలిశాయి. హత్యకు గురి కావడంతో యిమేజి మరీ పెరిగిపోయింది. అతని మీద పుస్తకాలు కూడా చదివేశాను. చాలా మంచివాడనే అభిప్రాయం పాతుకుపోయింది. తర్వాత తర్వాత రాజకీయాలు తెలుస్తున్న కొద్దీ వియత్నాం యుద్ధంలో, క్యూబాపై యుద్ధంలో, సిఐఏ కార్యకలాపాల్లో అతని పాత్ర గణనీయంగా వుందని బోధపడింది. చూపులు, మాటలు మెత్తగా వున్నంత మాత్రాన ఉదారవాది కాడని తెలిసి ఉసూరుమన్నాను. వాళ్లకు వాళ్ల దేశప్రయోజనాలే ముఖ్యం.

అమెరికా దేశప్రయోజనాలంటే ప్రపంచమంతా యుద్ధాలు రేకెత్తించి, యిరు పక్షాలకూ ఆయుధాలు అమ్ముకోవడం, తన విధానానికి మద్దతు పలికే యితర దేశాధినేతలు నియంతలైనా, నీచులైనా సరే డబ్బులు, సైన్యాన్ని యిచ్చి ఆదుకోవడం, తమ విధానాలను వ్యతిరేకించినవారిని అప్రదిష్ఠపాలు చేయడం, సిఐఏ ద్వారా చంపించడం, పదభ్రష్టులను చేయడం, పెట్రోలు కోసం అవి ఉత్పత్తి అయ్యే దేశాలన్నిటిలో సంక్షోభాలు సృష్టించడం, అవసరమని తోస్తే అబద్ధాలు చెప్పడం, యుద్ధాలు చేయడం – యిదీ అమెరికా పాలసీ. తామే గొప్పవాళ్లమనీ, ప్రపంచమంతా తమ పెత్తనం కింద వుండాలనీ దాని కాంక్ష. తనకు వత్తాసు పలికేవాళ్ల పట్లనే అది ఆపేక్ష చూపుతుంది.

రష్యా కూడా కాస్త ఎక్కువతక్కువగా అదే పనిలో వుండేది. ప్రపంచం యీ రెండు క్యాంపులుగా చీలిపోయినప్పుడు తటస్థ దేశాలు కొన్ని అలీన (నాన్-ఎలైన్‌డ్) విధానాన్ని అవలంబించాయి. వాటిలో ఇండియా ప్రముఖపాత్ర వహించింది. అందువలన మనకు యిరు పక్షాల నుంచి, తగుమాత్రపు సహకారం మాత్రమే లభించేది. అమెరికాతో పోలిస్తే రష్యాయే తొలిదశలో ఎక్కువ సాయపడింది. అమెరికాకు ముందునుంచీ పాకిస్తాన్ పక్షపాత ధోరణి వుంది. బైడెన్ పాక్ పక్షపాతి అంటూ కొందరు రాశారు. అమెరికా పాలకుడిగా ఎవరు వచ్చినా పాక్ పక్షానే వుంటారు. ఎందుకంటే పాక్‌తో వాళ్లకు సైనిక సంబంధాలున్నాయి. వాళ్ల ద్వారానే వాళ్లు అఫ్గనిస్తాన్‌లో రష్యాను తరిమివేయగలిగారు. పాక్ పాలకులు నియంతలైనా, సైనికపాలకులైనా అమెరికా వాళ్లను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు.

ఇటీవల అమెరికాలో ఇస్లాం వ్యతిరేక ధోరణి వచ్చింది కానీ బ్రిటన్ వాళ్లకు, అమెరికా వాళ్లకూ ఎప్పుడూ హిందువులు ఆధిపత్యం ప్రదర్శిస్తారని, వాళ్ల పాలనలో మైనారిటీలకు రక్షణ వుండదని గట్టి నమ్మకం. హిందూదేశం తన పొరుగు ముస్లిం దేశం పాకిస్తాన్‌ను కబళించివేస్తుందని వాళ్లకు పాపం జాలి. అమెరికా విధాన నిర్ణయాలు తీసుకునేవారిలో పాక్ లాబీ చాలా గట్టిగా పనిచేస్తుంది. పాకిస్తాన్ సైజుకి, వారికి రకరకాలుగా అందించే సాయాన్ని, ఇండియా అంకెలతో పోల్చి చూస్తే వాస్తవాలు బోధపడతాయి. కశ్మీరు ఇండియాలో భాగమే, దాని జోలికి వెళ్తే ఖబర్దార్ అని అమెరికా పాక్‌కు ఎన్నడూ చెప్పినది లేదు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పాక్‌కు మద్దతుగా యుద్ధనౌకను కూడా పంపింది. ఇండియా స్వతంత్ర భావాలు, ఎదుగుదల అమెరికాకు ఎప్పుడూ రుచించలేదు. 50, 60 ఏళ్ల క్రితం యిక్కడి నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడినవారి సంఖ్య కూడా గణనీయంగా ఏమీ లేదు. భారతీయులు వాళ్ల రాజకీయ విధానాల్లో మార్పు తెచ్చే శక్తి కలిగి వుండేవారు కారు.

ఇలాటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ వచ్చింది. ప్రపంచపు హద్దులు చెరిపేస్తున్నాం, యికపై స్వేచ్ఛావాణిజ్యమే, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి సేవలందించవచ్చు అనే పేర యితర దేశాల మార్కెట్లో చొరబడడానికి అమెరికా ప్రణాళిక రచించింది. యురోప్‌లోని అభివృద్ధి చెందిన దేశాలు దానికి మద్దతు నిచ్చాయి. తృతీయ ప్రపంచ దేశాల మెడలు వంచి ప్రపంచ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయించారు. అయితే దీనివలన వారు ఊహించని ఫలితాలు సంభవించాయి. ఆసియన్ దేశాలు లాభపడసాగాయి. ఉత్పాదక రంగమంతా చైనా, కొరియాలకు వెళ్లిపోగా, సేవారంగంలో భారతీయులు, చైనీయులు, యితర ఆసియన్లు దూసుకువెళ్లారు. తమ మేధోబలంతో భారతీయులు దేశవిదేశాలలో, ముఖ్యంగా అమెరికా కోటలో, పాగా వేశారు. ఇది అమెరికా సమాజంలో పెనుమార్పు తెచ్చింది.

అనాదిగా భారతదేశం, చైనా వ్యాపారవాణిజ్య రంగాలలో, యంత్రాల వాడకంలో ముందుండేవి. ఇతర దేశాల నుంచి విజ్ఞానాన్ని, ఆధునీకరణను యిచ్చి పుచ్చుకుంటూ వుండేవి. అయితే 1760 నుంచి 1840ల వరకు యూరోప్‌లో పెద్ద ఎత్తున యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ (ఇండస్ట్రియల్ రివల్యూషన్) జరిగినప్పుడు యీ దేశాలు వెనకబడ్డాయి. ఇండియా అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయి, బలహీనమై పోయింది. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఎక్కడికక్కడ రాజ్యాలు ఏర్పడి అంతఃకలహాల్లో మునిగాయి. అదే అదనుగా ఈస్ట్ ఇండియా కంపెనీ యంత్రాలు, ఆధునిక ఆయుధాల సహాయంతో వీటిని ఓడించి, క్రమేపీ దేశం మొత్తాన్ని ఆక్రమించింది.

చైనాలో చక్రవర్తుల పాలన అస్తవ్యస్తంగా వుండడంతో వారు కూడా ఆధునికీకరణ ఫలాలు అందుకోలేక పోయారు. పారిశ్రామికీకరణ కాలంలో వెనకబడిన ఇండియా, చైనాలు గ్లోబలైజేషన్ కాలంలో ముందుకు వెళ్లాయి. అమెరికా దెబ్బ తింది. ఎందుకిలా జరిగింది? చిరకాలంగా అమెరికా విద్యకు, ప్రతిభకు పెద్ద పీట వేసింది. ప్రపంచంలోని మేధావులందరూ తమ ప్రజ్ఞ చూపుకోవడానికి అమెరికా వచ్చే వాతావరణాన్ని కల్పించింది. సరస్వతిని గౌరవిస్తే లక్ష్మి ఆటోమెటిక్‌గా కరుణిస్తుంది. సంపద పెరిగింది. దాంతో ప్రజలు సుఖాలు మరగసాగారు. సమాజంలో కొన్ని వర్గాల వారు విద్యను నిర్లక్ష్యం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ చౌకగా సరుకులు తయారుచేసి, అమ్ముతూ వుంటే వాటిని కొనుక్కుంటూ, సొంతంగా తయారుచేయడం తగ్గించుకున్నారు. పోనుపోను చదువులు మధ్యలో ఆపేసి, చిరుద్యోగాల్లో చేరిపోయి, జీవితాన్ని ఏదో రకంగా గడిపేయడం అలవాటు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.

ఇలాటి పరిస్థితులు ఏర్పడుతూండగానే రష్యాను నియంత్రించడానికి నిక్సన్ చైనాతో సఖ్యత పెంచుకున్నాడు. వారికి చేయూత నిచ్చాడు. వారు ఆ అవకాశాన్ని చక్కగా అంది పుచ్చుకుని, తమకున్న వ్యవస్థాబలంతో, కష్టించే స్వభావంతో, క్రమశిక్షణతో చకచకా ఎదిగారు. ప్రపంచీకరణ వచ్చేసరికి వాళ్లు ఉత్పత్తివైపు మరలారు. చౌకగా సరుకులు తయారుచేసి అమెరికా మార్కెట్లను ముంచెత్తారు. పోనుపోను అమెరికన్లు ఉత్పత్తిదారులుగా కంటె ఉపభోక్తలుగా (కన్స్యూమర్లు) మారారు. అక్కడి ఫ్యాక్టరీలు మూతపడసాగాయి. ఉద్యోగాలు ఊడసాగాయి. ఇక సర్వీసు రంగంలో భారతీయులు, చైనావారు, మెక్సికన్లు.. యిలా రకరకాల స్థాయిల్లో వచ్చి సేవలందించసాగారు. వారితో నైపుణ్యంలో ఓ మేరకు పోటీ పడగలిగినా చౌక జీతాల్లో పోటీ పడలేక అమెరికన్లు వెనకబడ్డారు. కంపెనీల పెట్టుబడిదారులు అమెరికన్లే అయినా వారికి లాభార్జనే ముఖ్యం కాబట్టి తక్కువ ధరల్లో పని చేయించుకోవడానికి అమెరికనేతరులకు అవకాశాలు కల్పించారు. ఇది కూడా వారిలో నిరుద్యోగాన్ని పెంచింది.

అమెరికన్లలో మేధావులు, నిపుణులు లేరని అనడం లేదు. కానీ వారికీ, సామాన్యులకూ అంతరం పెరిగిపోయింది. ధనికులకు, దిగువ మధ్యతరగతికీ, పేదలకీ వ్యత్యాసం బాగా వచ్చేసింది. ఈ కారణాల వలన కొన్ని వర్గాలలో తమ పూర్వతరం కంటె తక్కువ స్థాయి జీవితం గడపవలసి వస్తోంది. ఇండియా, చైనా, యితర ఆసియా దేశాల్లో మన ముందుతరం కంటె మనం ఎక్కువగా ఆర్జిస్తున్నాం. మన తర్వాతి తరం మనకంటె బాగుండే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ అమెరికాలో రివర్స్‌లో నడుస్తోంది. మన తరమే యిలా ఉద్యోగాలు లేక అఘోరిస్తూ వుంటే మన పిల్లల గతి ఏమిట్రా అనే భయం పట్టుకుంది వాళ్లకు. పైగా వాళ్ల కళ్ల ముందే భారతీయులు, చైనావారు, యితరులు వచ్చి బాగుపడిపోతున్నారు. తాము ఆస్తులు అమ్ముతూంటే వాళ్లు కొనుక్కుంటున్నారు. ఇది వారిలో కడుపుమంట రగిలించింది.

గతంలో నల్లవాళ్లు సమాజం పట్ల, ఉన్నతవర్గాల పట్ల కసిగా వుండేవారు. ఇప్పుడు శ్వేతజాతీయుల్లో కొందరు కూడా వారితో చేరారు. వీళ్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వున్నారు. ప్రపంచీకరణ తర్వాత తమ వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర రావటం లేదని, విదేశీ వస్తువుల తాకిడికి తాము తట్టుకోలేక పోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. దిగుమతులు ఆపేసి, ప్రొటక్షనిజం (స్వదేశీ ఉత్పత్తిదారులను కాపాడుకోవడం) వైపు మరలాలని, విదేశీ పనివారిని రానివ్వకూడదని వాళ్లు కోరుతున్నారు. ప్రపంచీకరణను ప్రారంభించిన అమెరికాకు దాన్ని తిరగదోడడం అంత సులభం కాదు. అందుకే పాలకులు తటపటాయిస్తున్నారు. ఆ తటపటాయింపు వారిలో నిస్పృహను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ట్రంప్ సరిగ్గా ఆ వర్గాల నాడినే పట్టుకున్నాడు. వారి అభద్రతాభావానికి ఆజ్యం పోశాడు. ‘ఈ భారతీయులు, చైనావారు, మెక్సికన్లు వీరంతా మీకు శత్రువులు, మీకు ఉపాధి దొరక్కుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా అమెరికాను పాలించినవారు వారిని బుజ్జగిస్తూ వచ్చారు. మీ తరఫున నేను వారితో పోరాడి, వీళ్లను తరిమివేస్తాను. మీ ఉపాధి మీకు కల్పిస్తాను, మన శ్వేతజాతి అమెరికా పతాకాన్ని మళ్లీ ఎగరేస్తాను’ అన్నాడు. దీనికి తోడు యిటీవల అమెరికాలో పెరిగిన ముస్లిం వ్యతిరేకతను కూడా జోడించాడు. నల్లజాతి వారిని నిరసనగా చూడడం ఎలాగూ వుంది. ఈ జాతులందరినీ ట్రంప్ అనుమానించాడు, వెక్కిరించాడు, అవమానించాడు.

ఈ కాక్‌టైల్ శ్వేతజాతి దిగువ తరగతి వాళ్లకు మత్తెక్కించింది. నిజానికి 2016లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కారణంగా గెలవలేదు. ఇదిగో యీ విపరీత జాతీయవాదానికి ప్రతినిథిగా గెలిచాడు. అమెరికా ఘనతను చాటుదాం అని అతనంటే మన శ్వేతజాతి ఘనత.. అనే వాళ్లు అర్థం చేసుకున్నారు. ట్రంప్ ఎందరో ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడన్నా, అనేక ఆర్థిక అక్రమాలు చేశాడన్నా అవేమీ వారికి పెద్ద విషయాలుగా తోచలేదు. అయితే ట్రంప్ అభిమానులమని వాళ్లు బాహాటంగా చెప్పుకోవడానికి దడిశారు. ఎందుకంటే అమెరికన్లు ఉదారవాదులనే పేరు బడసినవారు. ట్రంప్‌ది అందులో యిమిడే యిమేజి కాదు.

అందువలన పైకి ట్రంప్‌ను విమర్శిస్తూనే చాటుగా ఓటేసి వస్తున్నారు. శ్వేతజాతి, గ్రామీణ, మగవారి ఓట్లు అతనికే బాగా పడుతున్నాయి. సర్వేల వాళ్లు వచ్చినపుడు వాళ్లు తమ మనసులో మాట చెప్పకుండా మిస్‌లీడ్ చేస్తున్నారు. అందుకే కితం సారి సర్వేలు తప్పాయి, యీసారీ తప్పాయి. చివరికి ట్రంప్ గెలిచినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేకుండా వుంది. అయితే యీ నాలుగేళ్లలో ట్రంప్ ఏం చేశాడు? వాళ్ల ఆశలు నెరవేర్చాడా? నెరవేరిస్తేనే కదా, వాళ్లు మళ్లీ ఓటేసి వుండాలి.

నా వద్ద గణాంకాలు వెంటనే లేవు కానీ, నాకు అర్థమైనవరకు ట్రంప్ ఓ గమ్మత్తు చేశాడు. విదేశీ ఉద్యోగులను పెట్టుకోవద్దని అంటే అమెరికన్ కంపెనీలు ఒప్పుకోవు. అంతర్జాతీయ విపణిలో పోటీ పడలేం అంటాయి. ఇతనికి నిధులివ్వడం మానేస్తాయి. అందుకని యితను ‘మీరు పై స్థాయి ఉద్యోగాలలో వారిని తీసుకోండి.’ అని ఒప్పుకుంటూనే కింది స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకు వచ్చేట్లు చేశాడు.

‘అమెరికాకు కావలసినది నిపుణులు. వారు నిపుణులైతే లక్ష డాలర్లకు తక్కువ జీతం రాదు కదా, ఆ జీతం తెచ్చుకునేవారిని రానిద్దాం. తక్కువ వస్తోందంటే చిల్లరమల్లర ఉద్యోగాల వాళ్లన్నమాట, పెద్దగా నైపుణ్యం లేనివాళ్లన్నమాట, వాళ్లెందుకు మనకి, తరిమేద్దాం. వాళ్ల స్థానంలో స్థానికులకే యిద్దాం.’ అని వాదిస్తున్నాడు. దీనిలో తప్పుపట్టడానికి పెద్దగా ఏమీ లేదు. ఒక నిపుణుడిని రానిస్తే అతనితో బాటు అతని కుటుంబసభ్యులు యావన్మందీ ఎందుకు వచ్చేయాలి? వాళ్లకు మనం పౌరసత్వం ఎందుకివ్వాలి? మనతో బాటు సమానంగా సౌకర్యాలు ఎందుకివ్వాలి? అనేది కూడా మంచి ప్రశ్నే! ఈ లాజిక్‌ను ట్రంప్ తన ఓటు బ్యాంకు మెదడులో బాగా ఎక్కించాడు. వాళ్లు దానికి ఫిక్సయ్యారు.

బైడెన్ ఉదారవాదం, సంక్షేమరాజ్యం, అందరికీ ఆహ్వానం అని ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు. ఒకవేళ నెగ్గితే మాత్రం ట్రంప్ లేవనెత్తిన ప్రశ్నలకు అతను సమాధానమెలా చెప్పగలడు? ట్రంప్ ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలోనే వున్నారని తేలుతోంది కదా! వారిని విస్మరించలేడు, వారి అభద్రతాభావం పోగొట్టాలంటే ఎంతో కొంత ప్రొటెక్షనిజం అవలంబించాలి. అందువలన ఒబామా నాటి ఓపెన్ డోర్ పాలసీ మళ్లీ వస్తుందని అనుకోవడం కష్టం. ఇదీ మనవాళ్ల వీసా సమస్యల గురించి నాకున్న ఊహ.

ఇక ఇండియాతో సఖ్యం గురించి. ప్రస్తుతం అమెరికాతో చైనాకు పడటం లేదు. అందువలన ఇండియాను మంచి చేసుకుందామని చూస్తోంది. చైనా వ్యతిరేక కూటమిలో మనల్ని చేర్చుకుంది. మనం కూడా అలీనవిధానానికి స్వస్తి చెప్పి, అమెరికా చెప్పినట్లు ఆడుతున్నాం. ఇరాన్ వంటి వాళ్ల శత్రువులను మన శత్రువులుగా చూస్తున్నాం.

నా దృష్టిలో యిది కొంతకాలమే నడుస్తుంది. అమెరికా, చైనాలు పరస్పరాశ్రితాలు. చైనాకు అమెరికా మార్కెట్ కావాలి, అమెరికాకు చైనా వస్తువులు, పెట్టుబడులు కావాలి. ఇవాళ్టికివాళ అమెరికాలో వస్తువులు ఉత్పత్తి కావు. అందువలన వాళ్లు మళ్లీ చేతులు కలపవచ్చు. కలిపితే అప్పుడు ఇండియాను సైడ్‌లైన్ చేయడం ప్రారంభమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా యిది జరుగుతుంది. అందువలన ట్రంప్, బైడెన్ ఎవరు నెగ్గినా అమెరికా మౌలిక విధానం ఒకేలా వుంటుంది. కాస్త కాస్మెటిక్ ఛేంజెస్ మాత్రమే కనబడతాయి. తేడా అల్లా వినోదంలో వస్తుంది. ట్రంప్ మాదిరి వినోదాన్ని బైడెన్ కాదు కదా, వేరెవ్వరూ అందించలేరు!

ఈ వ్యాసంలో నా సమాచారంలో కానీ,అవగాహనలో కానీ, వాదనలో కానీ పొరబాట్లు వుంటే చెప్పగోర్తాను.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×