Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అమరావతి ఏమౌతుంది?

 ఎమ్బీయస్‌: అమరావతి ఏమౌతుంది?

వైసిపి నెగ్గగానే ముందుగా అందరికీ వచ్చిన సందేహం - అమరావతి రాజధానిగా ఉంటుందా? లేక జగన్‌ తనకు కావలసిన చోటకి తరలించుకుని పోతాడా? ఇక్కడే ఉండి చంద్రబాబు కన్న ప్రపంచ స్థాయి రాజధాని కలను తను సాకారం చేస్తాడా? ఉమ్మడి రాజధానిగా యింకో ఐదేళ్ల పాటు హక్కున్న హైదరాబాదుకు రాజధానిని పట్టుకుపోతాడా? అమరావతికై భూములిచ్చిన రైతులకు బాబు చేసిన హామీలను నెరవేరుస్తాడా? రాజధానికై బాబు గీయించిన ప్లానులు, డ్రాయింగులు పరిగణిస్తాడా? లేక అవి అటకెక్కించి కొత్తగా గీయిస్తాడా? అనేక సంస్థలకు ఎకరాలకు ఎకరాలు చౌకగా కట్టపెట్టిన ఒప్పందాలను గౌరవిస్తాడా? లేకా కేటాయింపులు రద్దు చేస్తానంటాడా? భూములివ్వని రైతులపై పెట్టిన కేసులు కొనసాగిస్తాడా? లేక ఉపసంహరించుకుంటాడా? 'బాబైతే రాజధాని కట్టగలడన్న నమ్మకంతో భూములిచ్చాం. నీపై మాకు ఆ నమ్మకం లేదు. వెనక్కి యిచ్చేయ్‌' అనే రైతుల మాట మన్నిస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు.

వీటికి తక్షణ సమాధానం వైసిపి దగ్గర కూడా ఉందని అనుకోను. ఎందుకంటే బాబు తీసుకున్న భూములలో చాలావాటి స్వస్వరూపాలను మార్చేసి ఉంటారు. అన్నీ కలిపేసి ముద్ద చేసేసి ఎవరిది ఏదో తెలియకుండా చేసేసి ఉంటారు. పైగా ఆ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టేసి, ఆ డబ్బును సంక్షేమ పథకాలకు, తాత్కాలిక భవనాలకు ఖర్చుపెట్టేశారనే మాట వినబడుతోంది. తనఖా విడిపించుకుందామంటే ఖజానా ఖాళీ. ఇప్పటికే ప్రభుత్వం పోస్ట్‌-డేటెడ్‌ చెక్కులిస్తోంది. ఎవరి భూములు వాళ్లకు యిచ్చేద్దామంటే బ్యాంకులు మా సంగతేమిటంటాయి.

ఇలా చిక్కుపడిపోయిన దారాన్ని సరిచేయడం చాలా కష్టం. ఏదోలా సెటిల్‌ చేద్దామన్నా అది యిష్టం లేనివాళ్లు కోర్టు కెళ్లి లిటిగేషన్‌లో యిరికించి, సమయం వృథా చేయవచ్చు. అధికారం చేపట్టి, యథాతథ స్థితి ఏమిటో తెలుసుకుంటే తప్ప వైసిపి కూడా దాని గురించి ఏ ప్రణాళికా వెలువరించలేదు. దానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఈ లోగా మన ఊహలు మనం చేయవచ్చు.

నా ఉద్దేశంలో - జగన్‌ అమరావతిని రాజధానిగా కొనసాగించవచ్చు. ఆ మేరకు గతంలో హామీ యిచ్చినట్లు గుర్తు. దాన్ని నిలబెట్టుకోవచ్చు. తన పార్టీ ఆఫీసు కూడా అక్కడ పెట్టుకున్నారు కదా! హైదరాబాదుకి మళ్లీ వెనక్కి రాకపోవచ్చు. ఎందుకంటే చాలా డబ్బు వృథా చేసి ఉద్యోగులను అక్కడకి తరలించారు. వాళ్లీ పాటికి అక్కడ కుదురుకుని ఉంటారు. మళ్లీ వెనక్కి వస్తే అదో ఖర్చు. ఖజానాకు భారం. జగన్‌ ఆలోచనాధోరణి ఎలా ఉందో తెలియదు కానీ అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా కాక, రాష్ట్రస్థాయి రాజధానిగా కడితే చాలు అనే ఆలోచన తెచ్చుకోవడం అతనికీ, రాష్ట్రానికీ మంచిది. బాబు చేసిన అతి పెద్ద పొరపాటు - అమరావతి అనే మాయాబజారు. అదేమిటో ఆయనకు ఎప్పుడూ నిర్మాణాలపైనే ఆసక్తి. రాష్ట్రం విడిపోయిందని ఆంధ్రులందరూ ఏడుస్తూ ఉంటే ఆయన '..అయితే కొత్త రాజధాని కట్టడానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలివ్వాలి.' అని డిమాండ్‌ చేశారు. విభజన తర్వాత అది ఆయన తొలి స్టేటుమెంటు! 

ఎవరిస్తారండి లక్షల కోట్లు? తెలుగువాళ్లు తమలో తాము తన్నుకులాడుకుని విడిపోతే, దానికి కేంద్రం మూల్యం చెల్లించాలా? రాష్ట్రవిభజన కార్యం వారి చేతుల మీదుగా సాగింది కాబట్టి వారు కొత్త రాజధాని కట్టుకోవడానికి తప్పకుండా యిచ్చి తీరతారు. ఎంత? గతంలో విడిపోయిన రాష్ట్రాలకు ఎంత యిచ్చారో ఆ స్థాయిలో! 'నేను అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతాను, నువ్వు డబ్బులియ్యి' అంటే యిస్తారా? బాబుకి ఆ యింగితం లేకపోయింది.

సరే, అప్పుడేదో ఆవేశంలో అనేశారు, అధికారంలోకి వచ్చి 'విభజన అన్యాయంగా జరిగి, ఆంధ్రకు అప్పులు మిగిలాయి. లోటు బజెట్‌లో ఉంది.' అనే విషయం గ్రహింపులోకి వచ్చాకైనా తగ్గారా? లేదే! అప్పులు చేసయినా సరే, పెద్దది కట్టి తీరతాను అని భీష్మించారు. ఆయన పాలనాకాలంలో చాలా సమయం అమరావతికే కేటాయించారు. సింగపూరు డిజైన్‌, లండన్‌ డిజైన్‌, రాజమౌళి డిజైన్‌.. అంటూ ఊరికే శక్తియుక్తులు వృథా చేశారు. ఎమ్మెల్యేలను, రైతులను సింగపూరు పంపించి చూసి రమ్మన్నారు. చివరకి భ్రమరావతి మాయలో పడి, పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంటూ వచ్చిన లోపాలను సరి చేసుకోలేక ఘోరంగా ఓడిపోయారు.

దీని నుంచి జగన్‌ పాఠం నేర్చుకోవాలి. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న రాష్ట్రానికి ఆ స్థాయి రాజధాని అక్కరలేదు, ఏదో సంసారపక్షంగా ఉంటే చాలు అనుకోవాలి. 'దాన్ని టూరిస్టు స్పాట్‌గా తయారుచేస్తాం, టూరిజం వలన ఆదాయం వచ్చేస్తుంది' వంటి బాబు కబుర్లు నమ్మకూడదు. టూరిజంకై ఎవరూ రాజధానికి వెళ్లరు. అమెరికా వెళ్లి నయాగరా జలపాతం చూస్తారు తప్ప వాషింగ్టన్‌ డిసి ఎక్కడుందాని వెతుక్కుంటూ వెళ్లరు. తిరుపతిని రాజధాని చేయకపోయినా జనాలు అక్కడకు వెళతారు - వెంకన్న గుడి వుంది కాబట్టి!

రాజధాని అంటే సెక్రటేరియట్‌, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు, కొన్ని ముఖ్యమైన ఆఫీసులు.. యివి చాలు. కానీ బాబు షాపింగు కాంప్లెక్సులు కడతాం, గేమింగు జోన్‌లు కడతాం, స్టేడియంలు కడతాం, నైట్‌ క్లబ్బులు కడతాం.. అంటూ అలవికాని భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు. దాని కోసం 33 వేల ఎకరాలను సేకరించారు. హైదరాబాదులో మొత్తం ప్రభుత్వాఫీసులన్నీ ఉన్న స్థలం 250 ఎకరాలట! మరి యిక్కడ అన్నెందుకు? పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60% మాత్రమే మిగిలిన భాగానికి!

దీనికంతా కారణం - హైదరాబాదు సిండ్రోమ్‌! 'మేం హైదరాబాదు డెవలప్‌ చేశాం, దాన్ని మాకు కాకుండా చేశారు. హైదరాబాదును తలదన్నే రాజధాని కట్టి చూపిస్తాం' అనే అహంకారం. ఆంధ్రులు డెవలప్‌ చేసేటంత సామర్థ్యాన్నే కనబరచి ఉంటే ఆంధ్రలో నగరాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు? వాళ్లు చేసేదేమిటంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టి లాభపడతారు. అంతకు ముందు మద్రాసు, బెంగుళూరులలో పెట్టుబడులు పెట్టి బాగు పడ్డారు. ఎన్టీయార్‌ హయాంలో హైదరాబాదు కుదటపడడంతో యిక్కడా పెట్టవచ్చు అనుకుంటూ పెట్టుబడులు పెట్టారు. అలా పెట్టినది ఆంధ్రులు ఒక్కరే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలే కాదు, యితర రాష్ట్రాల వారు కూడా! మరి ఆంధ్రులు ఒక్కరే వ్యథ చెందడం దేనికి?

హైదరాబాదు నేర్పిన గుణపాఠం మరొకటి ఉంది. అన్నీ పట్టుకుని వచ్చి ఒక్క చోటే పెడితే అక్కడి వాళ్లకు మదమెక్కి అన్నీ మావే అంటారు. బాబు తన హయాంలో హైదరాబాదులో ఎన్నో సంస్థలు పెట్టారు, కేంద్రం చేత పెట్టించారు. అంతకు ముందు కూడా కేంద్రం ఎన్నో సంస్థలు అక్కడే పెట్టింది. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు.. అన్నట్లు కెసియార్‌ వాటికి ముందు 'టిఎస్‌' తగిలించేసి, అన్నీ తనవే అంటూ వాటిలో ఆంధ్రకు రావలసిన వాటా కూడా యివ్వలేదు. అలాగే అమరావతి కూడా తయారయ్యేది. అన్నీ అక్కడే పెడితే, స్థానికులు అవన్నీ తమ సొంతం అనేవారు. కరువు సీమ రాయలసీమ, వెనకబడిన ఉత్తరాంధ్ర మాకెందుకు? కావాలంటే విడిగా పొమ్మనమను అనేవారు. ఉమ్మడి రాష్ట్రపు ఆదాయంతో కట్టినవన్నీ ఒక ప్రాంతపు ఆస్తులుగా మారిపోయేవి. 

నా దృష్టిలో జగన్‌ చేయవలసిన పని - వికేంద్రీకరణ! అన్నీ అమరావతి చుట్టూనే బాబు ప్లాను చేశారు. అది తక్కిన జిల్లాల వారి కడుపు మండించింది. అలా అని రాజధాని ప్రాంతంలోనూ బాబుకి ఆదరణ లేదు. గతంలో ఆయన సైబరాబాదు అభివృద్ధి చేశానని చెప్పుకున్నాడు. 2004 ఎన్నికలలో అక్కడా ఓడిపోయాడు. కానీ ఆయన ఏమీ నేర్చుకోలేదు. పదేళ్ల తర్వాత మళ్లీ ఓ సారి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. రాయలసీమకు అన్యాయం చేశాడన్న ఫీలింగు అక్కడ బాగా వచ్చేసింది. అందుకే టిడిపి అక్కడ ఘోరంగా దెబ్బ తింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలను అక్కున చేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. హైకోర్టు రాయలసీమకు తరలించి తీరాలి. గతంలో ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయినపుడు రాజధాని (కర్నూలు) రాయలసీమ కిస్తే, హైకోర్టును కోస్తాకు (గుంటూరు)కు యిచ్చారు. ఆనాటి తూకం యీనాడూ పాటించాలి. అసలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను అన్ని జిల్లాలకు పంచేయాలి. 

ప్రభుత్వ కార్యాలయాలు కూడా అన్నీ ఒకే చోట ఉండాల్సిన పని లేదు. ఇవి ఈ-గవర్నెన్స్‌ రోజులు. ఎక్కడో అమెరికాలో కొంతమంది స్టాఫ్‌, ఆస్ట్రేలియా మరి కొంతమంది, సింగపూరులో యింకొంతమంది, బెంగుళూరులో యింకాస్త మంది కలిసి ఒక టీముగా వ్యవహరిస్తున్న రోజులివి. ప్రభుత్వ ఆఫీసులన్నీ రాజధానిలో, ఖరీదైన ప్రాంతంలో ఉండి తీరాల్సిన పని లేదు. రాష్ట్రం మొత్తంలో భూమి ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడ ఓ ఆఫీసు పెట్టవచ్చు. అక్కడ జీవనవ్యయం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగులు సంతోషిస్తారు. అన్ని అరిష్టాలకు కారణం నగరీకరణ. అన్నీ పట్టుకుని వచ్చి ఒకే చోట పెట్టడం, దాంతో రాష్ట్రమంతటి నుంచి ఉపాధి కోసం జనాలు అక్కడకు వచ్చిపడడం జరుగుతోంది. పట్టణాలు వెలవెల బోతున్నాయి, గ్రామాలు బావురుమంటున్నాయి. ఇక్కడ నగరాలలో అనేక సమస్యలు. నీటి ఎద్దడి, కాలుష్యం, పర్యావరణ విధ్వంసం, ట్రాఫిక్‌లో గంటల తరబడి సమయం వృథా కావడం..! నగర నిర్వహణ కూడా ప్రభుత్వాలకు తలకు మించిన భారమౌతోంది. 

దీన్ని రివర్స్‌ చేయాలి. చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు వేర్వేరు చోట్ల పెట్టాలి. దాన్ని ఆవరించుకుని ప్రయివేటు పెట్టుబడులు వచ్చిపడతాయి. ప్రభుత్వం ఒక బస్‌స్టాండు కట్టిందనుకోండి. చుట్టూ లాడ్జిలు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, బుక్‌ స్టాళ్లు, పళ్ల దుకాణాలు, మందుల షాపు, ఫ్యాన్సీ వస్తువుల షాపు యివన్నీ వాటంతట అవే మొలుచుకు వస్తాయి. ఎటొచ్చీ అవి యిష్టమొచ్చినట్లు కట్టేయకుండా స్థానిక మునిసిపాలిటీ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. బాబు చేసిన పొరపాటేమిటంటే - రాజధాని కట్టడంతో ఆగకుండా పైన చెప్పిన షాపులన్నీ తనే కడతానని తలలెట్టారు. ఐదేళ్ల తర్వాత కూడా 'తాత్కాలిక'తో ఆగిపోయారు. అసలు ఆ ప్రాంతమంతా పల్లపు భూములు. నేల మెత్తగా ఉంటుంది. ఏదైనా పెద్ద బిల్డింగు కట్టాలంటే చాలా లోతుకి వెళ్లి పునాదులు తీయాలి. ఎంత వేస్టు. కాస్త యివతలికి వస్తే మెరక భూములున్నాయి. నిజానికి ప్రతి జిల్లాలో మెరకభూములున్నాయి. అక్కడే కట్టవచ్చు. మల్టీ స్టోరీడ్‌ బిల్డింగులు, షాపింగు కాంప్లెక్సులు కట్టే పని ప్రయివేటు రంగానికి వదిలేస్తే వాళ్ల తంటాలు వాళ్లే పడతారు. 

హైదరాబాదు ఎదిగిందంటే దానికి కారణం - ఊళ్లో బిల్డింగులన్నీ ప్రభుత్వం కట్టడం కాదు! ప్రభుత్వం తనకు కావలసినది తను కట్టుకుంటే అక్కడి వాణిజ్యావసరాల బట్టి ప్రయివేటు రంగం తనకు కావలసినట్లుగా విస్తరించింది. ఎక్కడైనా యిదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు అమరావతిలో కూడా షాపింగు జోన్‌, గ్రీన్‌ జోన్‌, ఇండస్ట్రియల్‌ జోన్‌ యిలా నిర్ధారించి వదిలేస్తే చాలు. అక్కడ కడదామనుకున్నవాళ్లు ఎలాగోలా కట్టుకుంటారు. హైదరాబాదు విస్తరణకు మరో కారణం ఏమిటంటే - అక్కడ నిజాం భూములు ఉత్తినే లభించాయి. స్థానికులు కూడా నిస్సంకోచంగా, చౌకగా భూములమ్మారు. ఎందుకంటే అవి సారవంతమైనవి కావు. కానీ ఆంధ్రలో పరిస్థితి అది కాదు. సారవంతమైన భూములు ఎక్కువ ధర పలుకుతాయి. పైగా అక్కడ లిటిగేషన్‌ ఎక్కువ. నన్ను అమ్మమంటున్నాడంటే వాడికి ఎంత లాభం వస్తోందో ఏమో అనే ఆలోచన ప్రథమంగా వస్తుంది. ఈ గొడవల వలనే ప్రభుత్వ భూములున్నచోటే రాజధాని కట్టండి అని శివరామకృష్ణ కమిటీ దగ్గర్నుంచి అందరూ నెత్తినోరూ కొట్టుకుని చెప్పారు. కానీ బాబు పెడచెవిన పెట్టి పెద్ద భారాన్ని తలకెత్తుకుని, నిభాయించలేక బోర్లా పడ్డారు.

ఇప్పుడు జగన్‌ కొత్త భవనాలన్నీ రాష్ట్రమంతటా ఉన్న ప్రభుత్వ భూముల్లోనే కడితే మంచిది. వసతులు వాటంతట అవే ఏర్పడతాయి. బిజెపి ప్రభుత్వం రోడ్ల విస్తరణపై శ్రద్ధ పెట్టింది కాబట్టి అనేక ప్రాంతాలకు దారులు ఏర్పడ్డాయి. కనెక్టివిటీ పెరిగింది. ప్రణాళికాబద్దంగా కొత్త పట్టణాలు ఏర్పడతాయి. బాబు చాలా డాబు కబుర్లు చెప్పారు - ప్రతి జిల్లాకు ఎయిర్‌పోర్టు అంటూ! ఎయిర్‌పోర్టు పెట్టగానే సరి కాదు, దానికి ట్రాఫిక్‌ ఉండాలి, అది కమ్మర్షియల్‌గా వయబుల్‌ కావాలి. గిట్టుబాటు అయ్యే చోటే విమానాశ్రయం పెట్టి, వివిధ ప్రాంతాల నుంచి దాన్ని మూడు, నాలుగు గంటల ప్రయాణంలో చేరుకునేట్లా వుంటే చాలు. పరిశ్రమలు కూడా రాష్ట్రం నలుమూలలా పెట్టేట్లా చూడాలి. తమిళనాడు చూడండి, కోయంబత్తూరు, సేలం, మధురై.. యిలా రాజధాని కాకుండా అనేక చోట్ల పరిశ్రమలు విస్తరించాయి. అక్కడి జనాభా అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవచ్చు, మద్రాసు వచ్చే పని లేదు. 

జగన్‌ ఎదుట ఉన్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే - రైతుల నుంచి సేకరించిన భూమి విషయంలో ఎలా వ్యవహరించాలి? అని. కొంత మంది యిష్టపూర్వకంగా యిచ్చారు, కొందరు ఏదో ఆశ పెట్టుకుని యిచ్చి భంగపడ్డారు, కొందరు బెదిరింపులకు లొంగి యిచ్చారు. గత ప్రభుత్వం వీళ్లందరికీ వాళ్లిచ్చిన భూమికి దామాషాలో కమ్మర్షియల్‌ స్పేస్‌ యిస్తానంది. ఇప్పుడు ఆ మయసభ ఏర్పడటం లేదు కాబట్టి, తమ భూములు తమకు యిచ్చేయమని అడిగినవాళ్లకు వెనక్కి యిచ్చేయడమే మేలు - దాని మీద ఏ తాకట్టూ లేకపోతే! అసలది మూడు పంటలు పండే భూమి. దాన్ని లాక్కుని, వాళ్లకు ఉపాధి లేకుండా చేసి, నెలకింత వూరికే యిస్తామనడం అన్యాయం. వాళ్లకు వచ్చినదే వ్యవసాయం. రికామీగా కూర్చుని డబ్బు తీసుకుంటూ ఉంటే దుర్వ్యసనాల పాలవుతారు. వాళ్లకు మళ్లీ వ్యవసాయం చేసుకునే వీలు కల్పించాలి.

ప్రభుత్వం యిప్పటికే గట్లు, సరిహద్దులు తీసేసి ఊరంతా ఏకాండీ ముక్కగా తయారు చేసి ఉంటుంది. దాన్ని విడగొట్టడం, దానిలో అక్రమాలు జరగడం - యిదో పెద్ద రామాయణం. ఇలాటి పరిస్థితుల్లో రైతు సహకార సంఘాలు ఏర్పరచి భూములను సంఘాలకు అప్పగిస్తే మంచిది. రైతులకు గతంలో యిచ్చిన భూముల నిష్పత్తిలో వాటాలు కేటాయించవచ్చు. అక్కడ మళ్లీ పంటలు పండిస్తే రైతులకు వ్యాపకమూ ఉంటుంది, ఆదాయమూ ఉంటుంది. డెయిరీ పరిశ్రమలో సహకార సంఘాలు పని చేస్తున్నాయి కాబట్టి యిదీ ఆచరణ సాధ్యమే అనుకుంటున్నాను. విజ్ఞులు చెప్పాలి. అయితే ఆ పొలాలను తమకు తాకట్టు పెట్టారంటూ బ్యాంకులు అడ్డుపడితే ఎలా అనేదే ప్రధాన సమస్య. అప్పుడు దాన్ని సొసయిటీ పేర ఋణంగా మార్చి, దానికి ప్రభుత్వం హామీ యిచ్చి, వ్యవసాయం చేసుకోనివ్వాలి. అక్కడ నుంచి వచ్చిన ఆదాయంలోంచే బ్యాంకు ఋణం క్రమంగా తీర్చివేయగలగాలి. తాకట్టు పెట్టిన డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది కాబట్టి అదే అంతిమంగా ఋణాలు తీర్చాలి. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిస్తే తప్ప వీటి సాధ్యాసాధ్యాల సంగతి తెలియదు. 

నాకు ఉసుర్లు, పిల్లిశాపాలు యిలాటివాటిపై నమ్మకాలు లేవు కానీ కవితాత్మకంగా చెప్పాలంటే అమరావతి పేరు చెప్పి పచ్చని పంటపొలాలు నాశనం చేసిన చంద్రబాబుకి ప్రకృతి మాత శాపం, రైతుల ఉసురు తగిలి ఉంటుంది. లేకపోతే రాజధాని ప్రాంతంలో కూడా ఆయన ఓడిపోవడమేమిటి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా జగన్‌ దీన్ని నమ్మాలి. అప్పుడే అతను ప్రకృతి, పర్యావరణం జోలికి వెళ్లడు. లేకపోతే ప్రతీ పాలకుడు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసేవాడే! చెట్లు కొట్టేసేవాడే కానీ నాటేవాడు కనబడటం లేదు. అందుకే యీ స్థాయి కరువు కాటకాలు. ఇజ్రాయేలు ఎడారిలో పచ్చటి తివాచీని సాధించగలిగింది. తలచుకుంటే రాయలసీమలో పచ్చదనం తీసుకురాలేరా? ఇప్పుడు పూనుకుంటే ఏ 10, 15 ఏళ్లకో అది సాధ్యపడుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?