Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: నీతీశ్‌ వ్యూహం ఏమిటి?

నీతీశ్‌ లాలూతో విడిపోయి బిజెపితో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలా ఎందుకు చేసినట్లు? బిహార్‌ ప్రజలు బిజెపితో చేతులు కలపమని  నీతీశ్‌కు ఓటేయలేదు. బిహార్‌ ఎన్నికలకు ముందు మోదీ ఎన్ని కోట్ల నిధులను కళ్లముందు ఆడించినా, దేశమంతా మోదీని రథంపై పెట్టి ఊరేగిస్తున్నా, అబ్బే మాకు మాత్రం అక్కరలేదు అంటూ మొత్తం 243 సీట్లలో బిజెపి కూటమికి 58 సీట్లు మాత్రం యిచ్చి నీతీశ్‌-లాలూ కూటమినే గెలిపించారు. నిజానికి నీతీశ్‌కు మొదటి టెర్మ్‌లో వచ్చిన పేరు రెండో టెర్మ్‌లో రాలేదు. లాలూ సంగతి చెప్పనే అక్కరలేదు, బిహార్‌లో జంగిల్‌ రాజ్‌ నెలకొల్పాడు. అవినీతికి మారుపేరుగా పేరుబడ్డాడు.

విచారణ పూర్తయిన కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. పొత్తులో మూడో భాగస్వామి ఐన కాంగ్రెసుకు దేశంలో ఎక్కడా ఉప్పూపత్రీ పుట్టకుండా అయిపోయింది. అయినా నీతీశ్‌ లాలూతో, కాంగ్రెసుతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే దాన్నే అధిక సంఖ్యాకులు ఆమోదించారు. బిజెపి విధానాలను ఆమోదించే మాటైతే దానికే ఓట్లేసేవారు. సరే ఏడాదిన్నర గడిచింది. ఇప్పుడు నీతీశ్‌కు లాలూతో తెగతెంపులు చేసుకుందామనుకున్నాడు. ఉపముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో 'మహా గఠ్‌బంధన్‌తో కొనసాగడానికి నా అంతరాత్మ ఒప్పుకోవటం లేదు' అంటూ తనే రాజీనామా చేశాడు. అంతవరకు బాగుంది.

తన ప్రభుత్వాన్ని రద్దు చేశాక, బిజెపితో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని, మళ్లీ ఎన్నికలకు వెళ్లి, తను చేస్తున్న పనిపై ప్రజాభీష్టం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇతను రాజీనామా చేశాక, గవర్నరు అధిక సంఖ్యాకుల పార్టీని పిలవలేదు. ఎన్‌డిఏ హయాంలో గోవా వంటి యితర రాష్ట్రాలలో చేసిన అడ్డగోలుతనమే యిక్కడి గవర్నరూ ప్రదర్శించాడు.

నీతీశ్‌ ఎందుకిలా చేసినట్లు? లాలూ అవినీతిపై ఏహ్యతతో అని మాత్రం అనలేం. అలా అయితే 2015లో పొత్తు పెట్టుకునేవాడా? నెగ్గాక అతని ఓ కొడుక్కి ఉపముఖ్యమంత్రి పదవి, మరో కొడుక్కి హోం మంత్రి పదవి యిచ్చేవాడా? లాలూ అవినీతి యివాళ్టిది కాదు. నీతీశ్‌ ప్రభుత్వంలో వుంటూ లాలూ కొడుకులు అవినీతికి పాల్పడినట్లు తేలితే అదో దారి. 'మీ చేష్టల వలన నాకు అపఖ్యాతి తెస్తున్నారు. మీరు దిగిపోతారా? నన్ను దిగిపొమ్మంటారా?' అని అడిగితే ముచ్చటగా వుండేది. కానీ యివి లాలూ రైల్వేమంత్రిగా వున్నప్పటి వ్యవహారంపై కేసులు.

సిబిఐ కేసులు పెట్టింది కాబట్టి నీతీశ్‌కు వేడి పుట్టింది, తేజస్వి రాజీనామా చేయలేదు కాబట్టి అతని రాజధర్మానికి గ్లాని కలిగింది అందామా? సిబిఐ కేసులున్న ఉమాభారతి వంటి కేంద్ర మంత్రులపై, మధ్యప్రదేశ్‌లో నరోత్తమ్‌ మిశ్రా వంటి బిజెపి మంత్రులెందరిపైనో చార్జిషీట్లున్నాయి. విచారణ జరిగి శిక్షలు పడితే తప్ప వాళ్లు దిగనక్కరలేదనే వాదనతో వాళ్లందరూ నెట్టుకొస్తున్నారు. మరి వాళ్లందరికీ లేని రూలు తేజస్వికి మాత్రమే నీతీశ్‌ వర్తింపచేయగలడా? 'తేజస్వి చేసిన అపరాధమేమిటో సిబిఐ యిప్పటిదాకా చెప్పకపోయినప్పుడు, అతను తన తరఫు వివరణ ఎలా యివ్వగలడు?' అంటున్నారు ఆర్జెడి నేతలు.

పోనీ ప్రస్తుతం నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ తన కాళ్ల కింది తివాచీ లాగేయబోతున్నాడా? అలాటిది ఏదీ లేదే. పోనీ 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వున్న కాంగ్రెసు యితనికి మద్దతు ఉపసంహరిస్తానని బెదిరించి లాలూ కొడుకుని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతానందా...? అదీ లేదు. మరెందుకీ హడావుడి? ఏదో ఒక లెక్క వేసుకుని వుండాలి. ఏమిటది?

నీతీశ్‌ ఉన్నంతలో సమర్థపాలకుడు, అవినీతి మచ్చ అంటనివాడు. అయినా అవకాశవాది అనడంలో తప్పేమీ లేదు. లాలూకి అనుచరుడిగా మొదలై, బిజెపి గూటికి చేరాడు, వాజపేయి హయాంలో ఎన్‌డిఏలో పదవులు అనుభవించాడు, మూడో కూటమికీ ఆమోదయోగ్యుడైన తటస్థుడిగా తయారవుతున్న కాలంలో, 2013 జూన్‌లో మోదీని బిజెపి తన ముఖ్యప్రచారకుడిగా ప్రకటించింది. తదుపరి మెట్టు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే! మోదీ ఉదారవాది ఐన వాజపేయి లాటి వాడు కాదని నీతీశ్‌కు తెలుసు. పైగా మోదీ హిందూత్వ విధానాలతో జట్టు కడితే తనకున్న ముస్లిం ఓటు బ్యాంకు హరించుకుపోతుందని భయం.

అందుకని వారం తిరక్కుండా మోదీని విపరీతంగా దుయ్యబట్టి, 17 ఏళ్ల ఎన్‌డిఏ అనుబంధాన్ని తెంపుకుని 'స్వచ్ఛ' యిమేజి కాపాడుకున్నాడు. మోదీ ఎదుగుతున్న కొద్దీ విమర్శిస్తూ పోయాడు. బిహార్‌లో సొంతంగా యిమేజి పెంచుకున్నా, మోదీ ఉప్పెన ముందు తనెందుకూ చాలడని 2014 ఎన్నికలు చాటాయి. దాంతో గద్దె దిగిపోయి, తన అనుచరుణ్ని కూర్చోబెట్టాడు. అతను తోక ఝాడించేసరికి, దింపేసి మళ్లీ పగ్గాలందుకున్నాడు. 2015 ఎన్నికలు వచ్చేసరికి బిజెపితో తలపడడానికి తనకున్న కొద్దిపాటి బలం చాలదని అర్థమయ్యి, గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన లాలూతో, కాంగ్రెసుతో చేతులు కలిపాడు.

ఎన్నికల్లో నెగ్గాక, లాలూ కోరిక మేరకు అతని పార్టీ ఎమ్మెల్యేలలో 12 మందిని మంత్రుల్ని చేశాడు. రెండేళ్లు తిరక్కుండా యిప్పుడు మళ్లీ వాళ్లను విదిల్చేసుకుని బిజెపి కౌగిట్లోకి చేరాడు. ఇదంతా రాజకీయవాదులకు సహజమైన క్రీడ. తప్పు పట్టవలసినదేమీ లేదు. పట్టీ ప్రయోజనం లేదు. అయితే వాళ్లీ క్రీడ ఎలా ఆడుతున్నారో వూహించాలంటే కొన్ని విషయాలు పరిగణించాలి. 

మధ్యతరగతివారికి, మేధావి వర్గానికి కొన్ని అంచనాలు వుంటాయి. వాళ్లు కొన్ని గీతలు గీసి, లోకమంతా ఆ గీతల్లోనే నడవాలని, నడుస్తుందని భావిస్తారు. జయలలిత నియంతగా పాలించింది కాబట్టి, బాహాటంగా అవినీతికి పాల్పడి కేసుల పాలైంది కాబట్టి ప్రజలు ఆమెను తిరస్కరించాలని ఆశిస్తారు. తిరస్కరిస్తారని ఊహిస్తారు. కానీ నిత్యజీవితంలో అలా జరగదు. ఓటర్ల అవగాహన వేరేలా వుంటుంది. అదేమిటో తెలిస్తే ఏ నాయకుడూ ఓడిపోడు. ప్రేక్షకుల అభిరుచి తెలిస్తే ఏ సినిమా ఫెయిలవదు. అలాగే యిదీనూ. లాలూ అంటే పేపరు చదివే జనాభా అంతా అసహ్యించుకుంటాం. ఎగతాళి చేస్తాం. కానీ బిహారు ఓటర్లు అలా అనుకోలేదు.

నీతీశ్‌ పార్టీ అయిన జెడియుకు, లాలూ పార్టీ ఐన ఆర్జేడీకు సమానంగా చెరో 101 టిక్కెట్లు యిస్తే లాలూ పార్టీకి 80 సీట్లు వచ్చాయి. నీతీశ్‌ పార్టీకి 71 మాత్రమే వచ్చాయి. అయినా లాలూ తను వెనక్కి తగ్గి నీతీశ్‌నే ముఖ్యమంత్రిని చేశాడు. చేయడంతో ఆగలేదు, ఆ మాట మాటిమాటికీ గుర్తు చేయసాగాడు. నీతీశ్‌కు యిది మింగుడు పడలేదు. ఓటింగు సరళి గురించి లోకనీతి సెంటర్‌ అనే సంస్థ సర్వే చేసింది. జెడియు ఓటర్లు తమ అభ్యర్థి లేని చోట ఆర్జెడికి ఓట్లేసినంతగా, ఆర్జెడి ఓటర్లు జెడియుకు వేయలేదని తేలింది. ఆర్జెడికి ప్రధానమైన ఓటు బ్యాంకు ఐన యాదవుల్లో 75% మంది ఆర్జెడి అభ్యర్థికి వేశారు.

అదే జెడియు అభ్యర్థి ఐతే 59% మందే ఓట్లు వేశారు. జెడియు ఓటు బ్యాంకు లైన కూర్మీలు, మహాదళితుల విషయంలో యీ తేడా అతి స్వల్పంగా వుంది. లాలూ నీతీశ్‌తో 'ఈసారికి నువ్వే ముఖ్యమంత్రి వయినా, పైసారికి మా అబ్బాయి' అని చెప్పినట్లుంది. పార్టీ శ్రేణులకు ఆ సంకేతం కోసమే ఉపముఖ్యమంత్రి చేయించాడు. తర్వాత అతను జనంలో తిరగడం మొదలు పెట్టాక, ఆశ్చర్యకరంగా ప్రజాదరణ పొందసాగాడట. ముందులో ఏదో తబ్బిబ్బు పడినా లాలూ యిద్దరు కొడుకులూ మంత్రులుగా బాగానే పనిచేస్తున్నారట. తేజస్వీ యాదవ్‌ వెళ్లిన చోట 'హమారా నేతా కైసా హో, తేజస్వీ యాదవ్‌ జైసా హో' నినాదాలు హోరెత్తి పోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రి భోగం 2020 వరకు మాత్రమే అని నీతీశ్‌కు తేలిపోయింది. 

అలాటి పరిస్థితుల్లో బిహార్‌లో వుండడం దండగ. జాతీయ రాజకీయాలకు వెళ్లి అక్కడ ఏ కేంద్రమంత్రో కావాలి. 2019 ఎన్నికలలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే బిజెపియేతర పక్షాలన్నీ ఏకమై ప్రధానిగా అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తికోసం వెతికితే తను కంటికి ఆనాలి. ఎందుకంటే తనకు అవినీతి మచ్చలు లేవు. బిహార్‌ వంటి క్లిష్టమైన రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి బాట పట్టించిన అనుభవం వుంది. బిహార్‌ ఎన్నిక జాతీయ రాజకీయాలను మలుపు తిప్పి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశించాడు. అందుకే మహాగఠ్‌బంధన్‌ ఏర్పరచాడు. అయితే బిహార్‌, దిల్లీ ఎన్నికల తర్వాత బిజెపి జాగ్రత్త పడింది.

పంజాబ్‌లో తప్ప ప్రతి చోటా తన రికార్డు మెరుగుపరుస్తూ పోయింది. సుదూర భవిష్యత్తు మాట ఎలా వున్నా 2019 నాటికి మాత్రం ప్రతిపక్షాలు మోదీని ప్రతిఘటించలేవని అనేకమందితో బాటు నీతీశ్‌కు అర్థమైంది.  తన పార్టీ గుర్తయిన బాణాన్ని గాలి ఎటువుంటే అటే తిప్పడం మంచిదనుకున్నాడు. అయితే ఆది నుంచి మోదీని ఎదిరిస్తూ, నిందిస్తూ వచ్చి హఠాత్తుగా పార్టీ ఫిరాయిస్తే ఎబ్బెట్టుగా వుంటుంది. పైగా తను వద్దామనుకున్నా మోదీ రానిస్తాడన్న గ్యారంటీ ఏముంది? అందుకని తెల్లజండా కొద్దికొద్దిగా వూపసాగాడు. ప్రభుత్వం ఏర్పరచిన నెల్లాళ్లకే 2015 క్రిస్మస్‌ రోజున మోదీ, నవాజ్‌ షరీఫ్‌ హఠాత్తుగా సమావేశమైతే భేష్‌ అన్నాడు.

అతని పార్టీ నాయకుడు, పూర్వ దౌత్యాధికారి అయిన పవన్‌ వర్మ 'ఇద్దరు దేశాధినేతలు అన్ని ఏర్పాట్లు చేసుకునే సమావేశం కావాలి, ఇలాటి రహస్యసమావేశాల వలన ఉపయోగం వుండదు' అన్నాడు. చివరకి అదే నిజమైంది.

మళ్లీ బిజెపితో సఖ్యత అంటే జెడియుకు అధ్యక్షుడిగా వున్న శరద్‌ యాదవ్‌కు యిష్టం లేదు. అది గ్రహించిన నీతీశ్‌ అతన్ని పార్టీ అధ్యక్షుడిగా 2016 ఏప్రిల్‌ లో వదుల్చుకుని తనే పార్టీ అధ్యక్షుడయ్యాడు. బిహార్‌ నిధుల కోసం అంటూ అరుణ్‌ జేట్లీతో డిన్నర్‌ సమావేశాలు, ప్రధాని మోదీతో మర్యాద పూర్వక సమావేశాలు అంటూ వాళ్లకు చేరువయ్యాడు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగినపుడు బిజెపి అది చరిత్రలో కనీవినీ ఎరుగని విషయమన్నట్లు ప్రచారం చేసింది. ప్రతిపక్షాల వారు 'ఇటువంటివి యింతకుముందూ జరిగాయి. ఇలాటి మిలటరీ ఆపరేషన్స్‌ను బాహాటంగా చెప్పుకోవటం పొరబాటు.' అని వాదించారు.

కానీ నీతీశ్‌ మాత్రం వాటి విషయంలో బిజెపి లైనే తీసుకున్నాడు. అలాగే నోట్ల రద్దు విషయంలో కూడా. ఆ చర్యతో ఉగ్రవాదం, తీవ్రవాదం, కశ్మీరులో వేర్పాటువాదం, నల్లధనం, ద్రవ్యోల్బణం అన్నీ మాయం అని బిజెపి ఊదరగొట్టింది. 'అదేమీ జరగదు. పైగా అభివృద్ధి కుంటుపడి, చిన్న తరహా వ్యాపారాలన్నీ కుదేలై, మాన్యుఫేక్చరింగ్‌ రంగం, నిర్మాణరంగం పూర్తిగా దెబ్బ తింటాయి' అని ప్రతిపక్షాలు వాదించాయి. నీతీశ్‌ దీనిలోనూ బిజెపి లైనే తీసుకున్నాడు. రాజస్థాన్‌, యుపిలలో గోరక్షకుల ఆగడాలు మితిమీరినప్పుడు తక్కిన ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి, చివరకు మోదీ కూడా వారి చర్యలను ఖండించాడు కానీ నీతీశ్‌ నోరు మెదపలేదు. 

మద్యనిషేధం విధించాలనే సాహసోపేతమైన నిర్ణయాన్ని నీతీశ్‌ ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ ఆ చర్య మోదీని మెప్పించింది. ఎందుకంటే గుజరాత్‌ ఒక్కటే మద్యనిషేధాన్ని పూర్తిగా నమ్మిన రాష్ట్రం. తక్కిన రాష్ట్రాలు కొంతకాలం తడిగా, కొంతకాలం పొడిగా వుంటాయి. నీతీశ్‌ సహచరుడిగా కొంతకాలం పనిచేసి, తరువాతి రోజుల్లో ప్రత్యర్థిగా మారిన సుశీల్‌ కుమార్‌ మోదీ నీతీశ్‌కు, నరేంద్ర మోదీకి మధ్య మధ్యవర్తిగా పనిచేశాడు. బిహార్‌ గవర్నరుగా పని చేసిన కోవింద్‌ కూడా మధ్యవర్తిగా వుండి నీతీశ్‌ సయోధ్య పెంచాడు. కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే ఊరికి ముందే నీతీశ్‌ నా మద్దతు కోవింద్‌కే అని చెప్పేశాడు.

తర్వాత మీరా కుమార్‌ ప్రతిపక్ష అభ్యర్థిగా నిలబడగానే లాలూ 'ఆవిడ మన బిహార్‌ ఆడపడుచు, మనం ఎంతో గౌరవించే జగ్జీవన్‌ రామ్‌ కూతురు' అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయబోయినా బెసకలేదు. అప్పుడే అనుమానం మొదలైంది - నీతీశ్‌ బిజెపివైపు గెంతుతాడని. అయినా లాలూ, కాంగ్రెసు నీతీశ్‌కు మద్దతు ఉపసంహరించలేదు. ఉపసంహరిస్తే ఫిరాయించడానికి నీతీశ్‌కు మంచి మార్గం దొరికేది. ఉత్తిపుణ్యాన అటు దూకేస్తే బాగుండదనుకున్నారు లాగుంది. సిబిఐను లాక్కుని వచ్చారు. సిబిఐ పని తీరు అందరికీ తెలుసు.

కేంద్రం పగ్గాలేస్తే స్టాఫ్‌ లేరని కారణాలు వల్లిస్తూ విచారణ ఆపేస్తుంది. ఎవరిపై, ఎంతకాలం ఉసి కొలిపితే అంతకాలం మీద పడుతుంది. మళ్లీ హోల్డాన్‌ అంటే ఏళ్లూపూళ్లూ గడిపేస్తుంది. ఇప్పుడు యుపిఏ హయాంలో రైల్వే మంత్రిగా వున్నపుడు లాలూ హోటళ్ల కిచ్చిన కాంట్రాక్టులు అక్రమమంటూ కేసులు పెట్టి లాలూ కుటుంబంపై విరుచుకు పడింది. ఆ సంగతి ముందే తెలుసేమో అనారోగ్యమంటూ నీతీశ్‌ పట్నా విడిచి వెళ్లిపోయాడు.

సిబిఐ దాడుల తర్వాత యిది రాజకీయ కక్షసాధింపు చర్య అని మరో భాగస్వామి కాంగ్రెసు విమర్శించినా, యితను కిమ్మనలేదు. సరిగ్గా చెప్పాలంటే దాని కోసమే వేచి వున్నట్లు నీతీశ్‌ విడాకులు యిచ్చేసి బిజెపి సరసన చేరాడు. 'మాపై కేసు పెట్టగానేే యింత ఓవరాక్షనా? యోగి ఆదిత్యనాథ్‌పై కేసులు లేవా? నీతీశ్‌పై మాత్రం ఏకంగా హత్య కేసే వుందిగా' అంటూ తేజస్వి గుర్తు చేస్తున్నాడు. బిహార్‌ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడంటున్నారు. నీతీశ్‌ది పెద్దమనిషి పంథా కాబట్టి సమాధానాలు చెప్పకుండా సరిపెడుతున్నాడు. బిజెపితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాడు. రేపు కర్మకాలి ఏ బిజెపి మంత్రిపైనో ఆరోపణలు వస్తే ఏం చేస్తాడో చూడాలి.

సుశీల్‌ మోదీతో కాపురం అంత సులభమేమీ కాదు. పైగా యిప్పటి బిజెపి అప్పటి బిజెపి కాదు. కేంద్రంలో దన్నుంది. 2020 ఎన్నికలలో సొంతంగా అధికారంలోకి రావాలి అని అమిత్‌ షా తన క్యాడర్‌ను యిప్పణ్నుంచి హుషారు చేస్తూ వుండవచ్చు. అలా రావాలంటే ఆంధ్రలో చేసినట్లే 'కేంద్రం యిచ్చిన నిధులకు సరైన లెక్కలు చెప్పటం లేదు, ఎంతో సాయం చేసినా తన దాన్ని వినియోగించుకోవడం రాదు' లాటి ఆరోపణలు రాష్ట్రప్రభుత్వంపై చేయాలి. లాలూ దాష్టీకాన్ని సహించలేక యిటు వచ్చిన నీతీశ్‌ బిజెపి దాష్టీకాన్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి.

తమకు బలం పెరుగుతోందని తోచిన రోజున బిజెపి నిమిషాల్లో నీతీశ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి, ఆ సమయంలో నిధులు కుమ్మరించి, ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చు. నీతీశ్‌ ఏమీ చేయలేడు. అలా జరక్కుండా 2020 వరకు యీ సంకీర్ణ ప్రభుత్వమే నడిచి, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని గెలిచినా మళ్లీ నీతీశ్‌ను ముఖ్యమంత్రి చేస్తారనుకోవడం అవివేకం. సుశీల్‌ కుమార్‌కో, మరొకరికో యివ్వాలంటుంది బిజెపి. అలా చూసినా 2020 నాటికి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు నీతీశ్‌కు కనబడటం లేదు. ఎందుకంటే నీతీశ్‌కు అప్పటికి ఓటు బ్యాంకు తరిగిపోతుంది. 30% ఓట్లున్న ముస్లిములు, యాదవులు పూర్తిగా లాలూ వైపు తిరిగిపోతారు. అగ్రవర్ణ హిందువులు బిజెపివైపు నిలిస్తే యిక నీతీశ్‌ పక్షాన నిలిచే కులాలెన్ని? గెలిచే సీట్లెన్ని? 

లాలూతో వుంటే 2020లో మళ్లీ ముఖ్యమంత్రి కాలేమనే భయంతోనే నీతీశ్‌ ఫిరాయించారనుకుంటే బిజెపితో వున్నా ఆ కల సఫలం కాదు. అందువలన 2019 ఎన్నికల సమయానికి ముఖ్యమంత్రి గద్దెను బిజెపికి అప్పగించి పార్లమెంటుకి పోటీ చేసి, కేంద్రమంత్రి పదవికి ప్రయత్నించవచ్చు అనుకోవాలి. అదే నిజమైతే నీతీశ్‌ పెద్దగా సాధించేది ఏదీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే యిప్పటికే అతను కేంద్రమంత్రిగా చేసి వున్నాడు. మోదీ కాబినెట్‌లో పదవి అంటే చెప్పుకోదగ్గది ఏమీ కాదు. స్వేచ్ఛ తక్కువ. వ్యక్తిగతంగా పేరుప్రతిష్ఠలు రావు. అన్నీ మోదీకే పోతాయి.

పైగా మోదీకి జ్ఞాపకశక్తి ఎక్కువ. చంద్రబాబు గతంలో తనపై చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేకనే ఆంధ్రపై శీతకన్ను వేశాడనే టాక్‌ వుంది. మరి నీతీశ్‌ను వదిలేస్తాడా? బిజెపి చెలిమితో నీతీశ్‌ బలం పెరుగుతుం దనుకోవడానికి లేదు. బిజెపితో చేతులు కలపడం జెడియు నాయకులు కొందరికీ యిష్టం లేదు. వీరేంద్ర కుమార్‌ నాయకత్వంలోని కేరళ యూనిట్‌ అప్పుడే టాటా చెప్పేసింది. వాళ్లు శరద్‌ యాదవ్‌ కొత్తగా పెడతానంటున్న పార్టీలో చేరిపోవచ్చు. అప్పుడు నీతీశ్‌ బలం మరింత క్షీణిస్తుంది. అప్పుడు ఎవరు గౌరవిస్తారు? ఏ రాజకీయ నాయకుడైనా నానాటికి ఎదగాలని ఆశిస్తాడు. మరి నీతీశ్‌ ఏం ఆశించి యీ స్టెప్‌ తీసుకున్నాడో తెలియటం లేదు. ఆ ఆశ నెరవేరుతుందో లేదో అస్సలు తెలియటం లేదు.

(ఫోటో - నీతీశ్‌, లాలూ, సుశీల్‌ మోదీ)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com