cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: టైటానిక్‌ అంటే ఏమిటి?

ఎమ్బీయస్‌: టైటానిక్‌ అంటే ఏమిటి?

టైటానిక్‌ అంటే పెద్ద ఓడ, అప్పుడెప్పుడో  ఓ వందేళ్ల క్రితం ఓ ప్రమాదంలో మునిగిపోతుంది, దానిలో ఇద్దరు ప్రేమికులుంటారు, డెక్‌ మీద చేతులు చాచి నిలబడతారు, అదీ.. ` అనవచ్చు కొందరు. అది సరే, ఓడకు ఆ పేరెందుకు పెట్టారు అన్నది ప్రశ్న. ఆ ఓడ చాలా పెద్దగా కట్టారు కాబట్టి ‘పేద్ధది’ అనే అర్థం వచ్చే పేరు పెడదామనుకున్నారు. మన ఇండియాలో అయితే ‘విరాట్‌’ అనో ‘మేరువు’ అనో పెట్టి వుండేవారు. యూరోప్‌ కాబట్టి ‘టైటానిక్‌’ అని పెట్టారు.

ఎందుకంటే వాళ్ల పురాణాల ప్రకారం టైటాన్‌ అనే జాతి గతంలో ఉండేది. వాళ్లు మహాకాయులు, అమిత బలవంతులు. అందువలన ఆ పేరు పెట్టారు. ఇప్పటికీ మనం ఇంగ్లీషులో జాతీయంగా వాడుతూంటాం. ఏ ప్రకాశం గారి గురించో రాయాలంటే ‘హీ వజ్‌ ద లాస్ట్‌ టైటాన్‌ ఆఫ్‌ ఆంధ్రా పొలిటీషియన్స్‌’ అని రాస్తాం.  ఆయన తర్వాత అంత స్టేచర్‌ ఉన్న తెలుగు నాయకుడు ఎవరూ లేరు అనే అర్థంలో. ఈ టైటాన్లలో ఒకడి పేరు మనందరికీ చిరపరిచితం. అతని గురించి చెప్పుకునే ముందు టైటాన్ల గురించి చెప్పుకుందాం.

గ్రీకు పురాణ గాథల్లో సృష్ట్యాదిలో ఉన్న (ప్రిమార్డియల్‌) దేవతల- అంటే యురేనస్‌ (ఆకాశం), జియా (భూమి)` - పిల్లలు టైటాన్లు. వీళ్లు 12 మంది ఉన్నారు. ఆరుగురు మగ, ఆరుగురు ఆడ. వీరు కాక ఆ జంటకు ఏకాక్షులైన సైక్లోప్స్‌, శతబాహువులైన హెకాటన్‌చైర్స్‌ అనే యితర జాతుల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లను యురేనస్‌ భార్యకు తెలియకుండా వేరే చోట ఖైదీలుగా దాచేశాడు. దాంతో జియాకు భర్తపై కోపం వచ్చి ఆఖరి కొడుకైన క్రోనస్‌ను తండ్రిపై తిరగబడమని, దండించమని ఒక పెద్ద కొడవలి తయారుచేసి యిచ్చింది. తల్లి ప్రోద్బలంతో కోరస్‌ తండ్రిని పదవీభ్రష్టుణ్ని చేసి సింహాసనం ఎక్కాడు. తన సోదరీసోదరులను తన అనుచరులుగా పెట్టుకుని ఏలాడు.

అతను తన అక్క రియాను పెళ్లాడి పిల్లలను కన్నాడు. ‘నీ సంతానమే నిన్ను గద్దె దింపుతుంది చూసుకో’ అని తండ్రి శాపం యివ్వడంతో, పిల్లలు పుట్టగానే మింగేయడం మొదలెట్టాడు. అలా ముగ్గురు కూతుళ్లను, ఇద్దరు కొడుకులను మింగేసిన తర్వాత అతని భార్య జ్యూస్‌ అనే కొడుకుకి జన్మ నిచ్చినపుడు అతన్ని తల్లితండ్రులు (వాళ్లే అత్తమామలు కూడా) సహాయంతో వేరే చోట దాచేసి, ఓ రాయిని గుడ్డలో చుట్టి యిచ్చింది. అదే తన కొడుకనుకుని క్రోనస్‌ మింగేశాడు. కొంతకాలానికి జ్యూస్‌ పెరిగి పెద్దవాడై తండ్రిని ఎదిరించాడు. అతనికి ఓ ఔషధం యిచ్చి కక్కించి, తన సోదరీసోదరులను బతికించుకున్నాడు.

వీళ్లంతా కలిసి ఒలింపియా పర్వతం స్థావరంగా క్రోనస్‌పై, అతని టైటాన్‌ జాతి వారిపై యుద్ధం చేశారు. టైటాన్ల స్థావరం ఒథ్రైస్‌ పర్వతం. తొమ్మిదేళ్లయినా విజయం దక్కకపోవడంతో పదో సంవత్సరంలో జియా సలహాతో జ్యూస్‌ అప్పటిదాకా బందీలుగా ఉండిపోయిన తన బాబాయిలు ఏకాక్షులను, శతబాహువులను విడిపించాడు. వాళ్లు అతనికి ఒక పెద్ద వజ్రాయుధం (థండర్‌బోల్ట్‌) తయారుచేసి యిచ్చారు. దాని సహాయంతో అతను టైటాన్లను ఓడించి, అధోలోకాలకు తరిమివేసి శిక్షలు విధించాడు. అప్పణ్నుంచి ఒలింపియన్‌ దేవతల శకం ప్రారంభమైందన్నారు. యూరోపియన్‌ పురాణాలన్నిటిలో యీ జ్యూస్‌ దేవాధిదేవుడిగా పరిగణింపబడ్డాడు. ఇతన్ని జూపిటర్‌ అని కూడా అంటారు. జారత్వంతో సహా మన దేవేంద్రుడితో చాలా పోలికలు కనబడతాయి.

శిక్షింపబడిన టైటాన్లలో అట్లాస్‌ ఒకడు. అట్లాస్‌ సైకిళ్ల ద్వారా అతని పేరు మనందరికీ తెలుసు. కొన్ని బొమ్మల్లో అతను భూగోళాన్ని (గ్లోబ్‌ను) మోస్తున్నట్లు ఉంటుంది కానీ నిజానికి పురాణాల ప్రకారం అతన్ని మోయమన్నది ఆకాశంలోని స్వర్గాన్ని. భూమికి తూర్పు, పడమర అంచులపై నిలబడి తన భుజస్కంధాలపై స్వర్గాన్నే మోయగల బలిష్టుడు కాబట్టి దృఢత్వానికి అతన్ని ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే అట్లాస్‌ సైకిలు తయారీదారులు అతన్ని లోగోగా పెట్టుకున్నారు.

ఇతనికి మహాబలశాలి, శూరుడు, మహావీరుడు ఐన హెర్క్యులస్‌తో జరిగిన ఒక సంఘటన ప్రసిద్ధమైనది. దాని పూర్వాపరాలు ఏమిటంటే `  గ్రీకు పురాణాల ప్రకారం అతని పేరు హెరాక్లిస్‌. రోమన్‌ పురాణాలు అతన్ని హెర్క్యులస్‌గా పేర్కొన్నాయి. మనకు హెర్క్యులస్‌ పేరే చిరపరిచితం కాబట్టి (ఆ పేరు మీదా సైకిలుంది) అదే వాడదాం. అతని తల్లి మానవమాత్రురాలు. దేవాధిదేవుడు జ్యూస్‌ ఆమెపై ఆశపడి, ఆమె భర్త వేషంలో వచ్చి ఆమెను అనుభవించడం చేత యితను సగం దేవుడిగా, సగం మనిషిగా పుట్టాడు. అమిత శక్తిమంతుడు అయ్యాడు.

జ్యూస్‌ సోదరి, దరిమిలా భార్య అయిన హేరా తన భర్త అక్రమసంతానమైన హెర్క్యులస్‌పై పగబట్టింది. అనేక కష్టాలు పెట్టింది. ఒకసారి అతనికి మతి భ్రమింపచేసి తన పిల్లల్ని తన చేతే చంపించేసింది. హెర్క్యులస్‌కు తర్వాత వివేకం మేల్కొని తన పనికి చింతించాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే తన కంటె తక్కువ స్థాయి వాడు, తనకు బంధువే అయిన యూరీస్థియస్‌ అనే రాజును పన్నెండేళ్ల పాటు సేవించుకోవాలని దైవవాణి చెప్పింది. ఆ రాజు హెర్క్యులస్‌ని 12 సాహసకృత్యాలు చేయమని పురమాయించాడు. వాటినే లేబర్స్‌ ఆఫ్‌ హెర్క్యులస్‌ అంటారు. వాటిల్లో ఒకటి హేరా తోటలోని బంగారు ఆపిల్‌ చెట్టు నుంచి పళ్లు తీసుకురావడం!

ఆ చెట్టును హేరా పెళ్లి వేళ జియా బహూకరించింది. అందువలన ఆమెకు అది చాలా ప్రియమైనది. హేరా దానికి  హెస్పెరైడ్స్‌ అనే సంధ్యాసుందరులను కాపలా పెట్టింది. వారికి సాయంగా ఒక డ్రేగన్‌ని కూడా ఉంచింది. అసలే హేరాకు తనంటే పడదు, యిక ఆమె తోటకు వెళ్లి ఆపిల్‌ పళ్లు తేవడం ఎలా అని హెర్క్యులస్‌ ఆలోచనలో పడ్డాడు. అతనికో ఐడియా వచ్చింది. ఈ సంధ్యాసుందరుల తండ్రి అట్లాస్‌. అతను వెళ్లి అడిగితే వాళ్లు యివ్వవచ్చు అనుకుని హెర్క్యులస్‌ ఆకాశాన్ని మోస్తున్న అట్లాస్‌ వద్దకు వెళ్లి సాయపడమని కోరాడు.

ఆకాశాన్ని మోసిమోసి  అట్లాస్‌ విసుగెత్తి ఉన్నాడు. ఎవడైనా దొరికితే యీ భారాన్ని వాడి నెత్తిన మోపి పారిపోదామని చూస్తున్నాడు. కానీ అంతటి బలశాలి దొరకడం ఎలా? దొరికినా ఒప్పుకుంటాడని నమ్మకం ఏమిటి? అనుకోకుండా యిలాటి బలశాలి తనే చెంతకు వచ్చాడు. అట్లాస్‌ ‘‘దానికేముంది, మా అమ్మాయిలే కదా కాపలా కాస్తున్నది, నేనడిగితే కాదనరు. వెళ్లి తెచ్చేస్తాను. కానీ యీలోపుగా దీన్ని మోసేదెవరు?’’ అని అడిగాడు. హెర్క్యులస్‌ వెంటనే ‘నేను మోస్తా’ అంటూ సిద్ధపడ్డాడు. అట్లాస్‌ అన్నమాట ప్రకారం వెళ్లి పళ్లు తెచ్చాడు కానీ వాటిని హెర్క్యులస్‌ చేతికి యివ్వకుండా ‘నువ్వలాగే మోస్తూ ఉండు. నేనే వెళ్లి నీ తరఫున ఆ బంగారు పళ్లను మీ రాజుకి యిచ్చి వస్తా’ అన్నాడు.

అతను మళ్లీ తిరిగి రాడని హెర్క్యులస్‌కు అర్థమైంది. కపటాన్ని కపటంతోనే జయించాలని ‘‘సరే, అలాగే కానీ, కానీ నువ్వు వచ్చేసరికి చాలా టైము పడుతుంది కాబట్టి భుజాల మీద యీ భారాన్ని సరిగ్గా సర్దుకోనీ. నువ్వు కాస్త పట్టుకో. భుజం మీద తుండు గుడ్డ ఒత్తుగా పెట్టుకుని అప్పుడు చెప్తాను. నువ్వు కుదురుగా పెడుదువుగాని. ఇప్పుడున్న స్థితిలో ఎప్పుడు ఒరిగిపోతుందోనని భయంగా ఉంది.’’ అన్నాడు. అట్లాస్‌ బంగారు పళ్లు నేల మీద పెట్టి, హెర్క్యులస్‌ నుండి భారాన్ని మళ్లీ తీసుకున్నాడు. వెంటనే హెర్క్యులస్‌ ఆ పళ్లని పట్టుకుని అతి వేగంగా పరిగెట్టేశాడు. భుజాల మీద భారంతో అట్లాస్‌ ఎప్పటికీ అలాగే ఉండిపోయాడు.

ఈ కథకి యింకో వెర్షన్‌ కూడా ఉంది. హెర్క్యులస్‌ అట్లాస్‌కి ప్రత్యుపకారంగా రెండు స్తంభాలను అటూయిటూ పాతి, వాటిపై స్వర్గాన్ని నిలబెట్టాడని, అట్లాస్‌కు ఆ చాకిరీ నుంచి విముక్తి కలిగించాడని చెప్తారు. ఉత్తర ఆఫ్రికా సముద్రతీరంలో  జిబ్రాల్టర్ జలసంధికి అటూయిటూ రెండు పర్వతాలను ‘పిల్లర్స్  ఆఫ్‌ హెర్క్యులస్‌’గా పిలుస్తారని జనశ్రుతి. ఉత్తరం వైపు స్తంభం అబిలీ మాన్స్‌ అంటారు కానీ దక్షిణం వైపు స్తంభం ఎక్కడుంది  అనే విషయంలో స్పష్టత లేదు.

కొన్ని పురాణాల ప్రకారం అట్లాస్‌ ఒక రాజు.  అతని వద్దకు జ్యూస్‌ మరో కొడుకైన పోలియాడస్‌ వచ్చి ఆశ్రయం కోరాడు. జ్యూస్‌ కొడుకు ఒకడు వచ్చి ఆపిల్‌ పళ్లు దొంగిలిస్తాడని ఎవరో జ్యోతిష్కుడు తనను ముందే హెచ్చరించడం చేత అతనే యితననుకుని అట్లాస్‌ నిరాకరించాడు. (నిజానికి అది హెర్క్యులస్‌ అని తర్వాత తెలుస్తుంది) దానితో పోలియాడస్‌కు కోపం వచ్చి నువ్వొక మహా పర్వతంగా మారిపోమని శాపం యిచ్చాడు. వాయువ్య ఆఫ్రికాలో మొరాకో యిత్యాది దేశాల్లో అట్లాస్‌ పర్వతశ్రేణి ఉంది.

వాటికి అనుకుని యూరోప్‌, ఆఫ్రికాల నుంచి ఉత్తర, దక్షిణ అమెరికాల వరకు మధ్యనున్న మహాసముద్రాన్ని ‘అట్లాంటిక్‌ ఓషన్‌’ అంటారు. భూమిలో 20% ఉపరితలాన్ని అదే ఆక్రమించింది. పై భాగాన్ని నార్త్‌ అట్లాంటిక్‌ అని, కింద భాగాన్ని సౌత్‌ అట్లాంటిక్‌ అనీ అంటారు. శాపానికి ముందు అట్లాస్‌కు వేదాంతం, గణితం, ఖగోళశాస్త్రం.. అన్నీ వచ్చు. ఆకాశమండలంలో నక్షత్రాలు ఎక్కడ ఏవి వున్నాయో మ్యాప్‌ గీసినవాడు అతనే అంటారు. అది దృష్టిలో పెట్టుకుని 16 వ శతాబ్దంలో బెల్జియం దేశానికి చెందిన భూగోళశాస్త్రవేత్త జిరార్డస్‌ మెర్కేటర్‌ తను గీసిన మ్యాప్‌ల సంకలనానికి ‘అట్లాస్‌’ అని పేరు పెట్టాడు.

ఆ విధంగా అట్లాస్‌ అనే టైటాన్‌ పేరు మనకు స్కూలు రోజుల్నించి తెలుసు. మళ్లీ టైటానిక్ సినిమా వద్దకు వస్తే ఆ ఓడ ఇంగ్లండు నుంచి బయలుదేరి అమెరికాకు చేరాల్సింది. అంటే ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రం దాటే వెళ్లాలి. అది అట్లాస్‌ పేర వెలసిన జలరాశి కాబట్టి దాన్ని దాటడానికి అట్లాస్‌ జాతి పేరైన టైటాన్‌ మీదుగా ఆ ఓడకు టైటానిక్‌ అని పేరు పెట్టారు. కానీ చివరకు మాట దక్కలేదు.

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020) 
   mbsprasad@gmail.com