Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : చిరాగ్ దీపానికి నూనె పోస్తున్నదెవరు?

ఎమ్బీయస్ :  చిరాగ్ దీపానికి నూనె పోస్తున్నదెవరు?

బిహార్ ఎన్నికల గురించి రాసేందుకు చాలానే వుంది కానీ అందరి కంటె ఆసక్తికరమైన పాత్ర చిరాగ్ (దీపం అని అర్థం) పాస్వాన్‌ది. అతను జాతీయస్థాయిలో ఎన్‌డిఏలో భాగస్వామి. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్‌డిఏలో భాగస్వామి ఐన నీతీశ్ పార్టీ ఐన జెడియును వ్యతిరేకిస్తున్నాడు. 

నీతీశ్ అసమర్థుడు, అవినీతిపరుడు, మేం అధికారంలోకి వచ్చాక అతన్ని జైలుకి పంపుతాం అంటున్నాడు. అతన్ని ముఖ్యమంత్రి చేసి తీరతాం అంటున్న అతని భాగస్వామి బిజెపిని మాత్రం పన్నెత్తి మాట అనటం లేదు సరి కదా, నేను మోదీజీకి హనుమంతుడి వంటివాణ్ని, రాష్ట్రంలో బిజెపి నాయకుణ్ని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోను అంటున్నాడు. 

తన లక్ష్యమంతా జెడియును ఓడించడమే అంటున్నాడు. ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటో ఎవరికీ అంతుపట్టటం లేదు. మహారాష్ట్ర అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, బిజెపియే అతన్ని వెనక్కాల నుంచి ఆడిస్తోందా అని కొందరి అనుమానం.

చిరాగ్ పాస్వాన్ యిటీవలే దివంగతుడైన రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు. రాజకీయాలకు రాను, సినిమాల్లోనే వుంటానంటూ ఒక సినిమాలో హీరోగా వేశాడు కూడా. అది ఫ్లాపయ్యాక, తండ్రి కోరికపై పార్టీలోకి వచ్చి యిటీవలే పార్టీ పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుతం ఆరా నియోజకవర్గం నుంచి ఎంపీగా వున్నాడు. వీధి రాజకీయాలు వంటపట్టాయో లేదో తెలియదు. 

బిహార్‌లో చూడబోతే అందరూ కాకలు తీరిన యోధులు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్ యిద్దరూ భీష్ముల వంటి వారు. బిజెపి నాయకుడు సుశీల్ మోదీకి మరీ అంత స్టేచర్ లేకపోయినా, యిటీవలి కాలంలో పార్టీ బలోపేతమైంది. కాంగ్రెసు లాలూ వెంటనంటే తిరుగుతూ, తన ఉనికిని చాటుకుంటోంది. లాలూ జైల్లోనే వున్నా అతని రెండో కొడుకు తేజస్వి, యువనాయకుడిగా ప్రజల్లోకి దూసుకుని వెళుతున్నాడు. ఇలాటి పరిస్థితుల్లో తికమక గేమ్ ఆడుతున్న చిరాగ్ నెగ్గుకు రాగలడా?

అతని నేపథ్యం తెలియాలంటే అతని తండ్రి గురించి, వాళ్ల పార్టీ గురించి చెప్పుకోవాలి. 1946లో పుట్టిన రామ్ విలాస్ పాస్వాన్ బిహార్‌లో దళిత కులాలలో ప్రముఖమైన వాటిల్లో ఒకటైన పాస్వాన్ అనే కులానికి చెందినవాడు. ఎంఏ, ఎల్ఎల్‌బి చదివాడు. సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరి 1969లో 23 ఏళ్లకే శాసనసభ్యుడయ్యాడు. 1974లో జాట్ నాయకుడు చౌధురీ చరణ్ సింగ్ లోకదళ్ పార్టీ పెట్టినపుడు దానిలోకి మారాడు. 

1975లో ఎమర్జన్సీ విధించినపుడు దాన్ని వ్యతిరేకించిన చరణ్ సింగ్ జైలుపాలయ్యాడు. తనతో పాటే పాస్వాన్ కూడా. 1977 ఫిబ్రవరి వరకు జైల్లో వుండి, బయటకు వచ్చి జనతా పార్టీ తరఫున ఎన్నికలలో హాజీపూర్ పార్లమెంటు సీటుకై పోటీ చేస్తే ఏకంగా 4.24 లక్షల మెజారిటీ వచ్చింది. అదే నియోజకవర్గం నుంచి 1980, 1989, 1996, 1998, 1999, 2004, 2014లలో నెగ్గాడు.

ఎంపీగా నెగ్గడమే కాదు, 1989 నుంచి చనిపోయేవరకూ కేంద్రంలోని అనేక ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశాడు. పివి హయాంలో(1991-96) తప్ప! ఈలోపున ఎన్ని ఫ్రంట్ ప్రభుత్వాలు వచ్చాయో, ఎన్ని ఎలయన్స్ ప్రభుత్వాలు వచ్చాయో గుర్తు చేసుకోండి. లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరితోనూ కాపురం చేయగలిగాడాయన. ప్రతిసారీ మంచి మంచి మంత్రిత్వ శాఖలు దక్కాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఒకసారి ఆయన్ని గాలి ఎటు వీస్తుందో ముందే తెలుసుకోగల ‘‘రాజకీయ వాతావరణ శాస్త్రజ్ఞుడు’’ అని వెక్కిరించాడు.

2000 సం.రంలో సొంతంగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) పెట్టుకున్నాడు. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో చాలా ఎగుడుదిగుళ్లే చూసింది. అభ్యర్థులలో తన కుటుంబసభ్యులు, బంధువులు ఎక్కువగా వుండేట్లు చూసుకునేవాడు. 2002లో వాజపేయి కాబినెట్‌లో మంత్రిగా వుండగా గోధ్రా సంఘటన జరిగింది.

నరేంద్ర మోదీని పదవిలోంచి తీసేయకుండా కొనసాగించడాన్ని ఆక్షేపిస్తూ రాంవిలాస్ కాబినెట్‌లోంచి వైదొలగాడు. దాంతో కాంగ్రెసు దృష్టిలో హీరో అయిపోయాడు. యుపిఏ హయాంలో (2004-2014)లో మంత్రి అయిపోయాడు. అయితే 2014 నాటికి యుపిఏ ప్రభ కొడిగట్టింది. ఇటు చూస్తే మోదీ దూసుకువస్తున్నాడు. కానీ గతంలో తను అతనితో వైరం పూని వున్నాడు. మళ్లీ దగ్గరకి వెళితే ఛీ కొట్టవచ్చు. కిం కర్తవ్యం? అని మథన పడుతున్న వేళ అతని కొడుకు చిరాగ్ గీతోపదేశం చేశాడు.

చిరాగ్ తండ్రి బిహారీ దళితుడైతే, తల్లి రీనా శర్మ పంజాబీ బ్రాహ్మణి. దిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబిలీ ఇన్‌స్టిట్యూట్‌లో హైస్కూలు చదువు సాగింది. ఆర్మీ యూనివర్శిటీలో బి.టెక్ లో చేరాడు కానీ అతని స్నేహితులు ‘‘అందంగా వుంటావు కదా, సినిమాల్లో చేరరాదా?’’ అని ప్రోత్సహించడంతో, చదువు వదిలేసి తలిదండ్రుల అనుమతితో తన 20వ యేట ముంబయి వెళ్లి హిందీ సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నించాడు.

8 ఏళ్ల తర్వాత అతని కలలు ఫలించి ‘‘మిలే న మిలే హమ్’’ అనే సినిమాలో కంగనా రనౌత్ సరసన హీరోగా వేషం దొరికింది. 2011 నవంబరులో ఆ సినిమా విడుదలై ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత మూడేళ్లు ప్రయత్నించినా, అతనికి వేషాలు రాలేదు.

అప్పటిదాకా రాజకీయాల జోలికి వెళ్లనని శపథం చేస్తూ వచ్చిన అతను గత్యంతరం లేక మూడేళ్ల తర్వాత  యిక లాభం లేదని సినిమా రంగాన్ని విడిచిపెట్టేసి, రాజకీయాల్లోకి దిగాడు. అప్పటికి తండ్రి కూడా అగమ్యగోచర స్థితిలో వున్నాడు. అప్పుడు చిరాగ్ ‘‘నేను బిజెపి వాళ్లతో మాట్లాడి, నిన్ను భాగస్వామిగా తీసుకునేట్లు ఒప్పిస్తాను. నువ్వు మారుమాట్లాడకుండా ఎన్‌డిఏలో చేరిపో. సరేనా?’’ అని ధైర్యం చెప్పి ప్రయత్నాలు చేశాడు. 

మోదీ సరేననడంతో 12 ఏళ్ల తర్వాత రాంవిలాస్ మళ్లీ ఎన్‌డిఏలో చేరాడు. 2014 పార్లమెంటు ఎన్నికలలో రాంవిలాస్, అతని సోదరులతో బాటు అతని కొడుకు చిరాగ్ కూడా పార్లమెంటు సభ్యుడై పోయాడు. 2019 ఎన్నికలలో కూడా మళ్లీ నెగ్గాడు. కాకలు తీరిన యోధుడైన తండ్రికి కూడా లేని లౌక్యం కొడుక్కి వుందని, తండ్రి కంటె కొడుకే బిజెపికి సన్నిహితుడనీ అర్థమవుతోంది.

ఇప్పుడు చిరాగ్ ఒక ప్రత్యేకమైన వ్యూహం అవలంబించాడు. తాను బిజెపికి దోస్తునని, బిజెపి నాయకుడే రాష్ట్రముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని బాహాటంగా ప్రకటించాడు. నీతీశ్ ఓటమికి శాయశక్తులా పాటుపడతానని, అతని అభ్యర్థులు నిలిచిన చోట తన పార్టీ అభ్యర్థులను నిలిపి ఓడిస్తాననీ, బిజెపి నిలబడిన చోట ప్రతిఘటించనని ప్రతిన పూనాడు. బిజెపి నుంచి ఆరెస్సెస్ నుంచి వచ్చినవారిని, తన పార్టీలో చేర్చుకుని వారికి టిక్కెట్లిచ్చాడు. 

అంతే కాదు, పొత్తులో భాగంగా జెడియుకు సీట్లు వదిలేసిన చోట బిజెపి నాయకులు కొందరు రెబెల్ అభ్యర్థులుగా నిలబడి పార్టీ చేత బహిష్కరించబడ్డారు. వారినీ చేర్చుకున్నాడు. అంటే జెడియు బలంగా వున్న సీట్లలో మాజీ బిజెపి నాయకులు ఎల్‌జెపి అభ్యర్థుల వేషంలో నిలబడతారన్నమాట. 

బిజెపి అభిమానుల ఓటు జెడియుకి బదిలీ అయ్యే బదులు ఎల్‌జెపికి వేసే అవకాశముంది. ఆ విధంగా ఎల్‌జెపి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశముంది. ఒకవేళ అది జరగకపోయినా జెడియు భారీగా ఓడిపోయే ఛాన్సుంది. ఇది అంతిమంగా బిజెపికి లాభించవచ్చు.

బిజెపి, జెడియుల మధ్య కుదిరిన పొత్తు ప్రకారం మొత్తం 243 స్థానాల్లో 110 స్థానాలు బిజెపికి, దాని మిత్రపక్షమైన వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీకి 11 కేటాయించబడ్డాయి. తక్కిన 122లో, 115 స్థానాలు జెడియుకు, దాని మిత్రపక్షమైన హిందూస్తానీ ఆవామీ మోర్చాకు 7 స్థానాలు కేటాయించబడ్డాయి. 

సంఖ్యాపరంగా తమకు ఎక్కువ సీట్లు వచ్చినా నీతీశ్‌కే ముఖ్యమంత్రి పదవి యిస్తామని బిజెపి ఒప్పుకుంది. మోదీ దగ్గర్నుంచి అందరు బిజెపి నాయకులూ అదే మాట బహిరంగ సభల్లో చెపుతున్నారు. నీతీశ్ యిమేజికి సరితూగగల నాయకుడు తమ పార్టీలో లేరని వారి భావన కావచ్చు. అందువలన నీతీశ్ బొమ్మ చూపించే వారు ఎన్నికలకు వెళ్ల దలిచారు.

అయితే ఎన్నికల అనంతరం ఏం జరుగుతుంది అన్నదే ఆసక్తికరం. బిజెపికి ఎక్కువ సీట్లు, నీతీశ్‌కు అనుకున్న దాని కంటె తక్కువ సీట్లు వస్తే నీతీశ్‌ను పక్కనబెట్టి ఎల్‌జెపి సాయంతో బిజెపియే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. నీతీశ్ నమ్మదగ్గ వ్యక్తి కాడు. తరచు కూటమి మారుతూంటాడు. 

లాలూ పార్టీకి సీట్లు ఎక్కువగా వస్తే తేజస్వితో ‘మనిద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, నీకు ఉపముఖ్యమంత్రి పదవి యిస్తాను’ అని బేరాలాడుకుని బిజెపిని దగా చేయవచ్చు. మహారాష్ట్రలో శివసేన అదే చేసింది కదా! ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి బిజెపియే చిరాగ్‌ను దువ్వుతోంది అని అనుమానాలున్నాయి.

ఇలాటి ఎత్తులు రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఆంధ్ర ఎన్నికలలో టిడిపి-జనసేన బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు. ‘పెట్టుకోవచ్చుగా అని చంద్రబాబును అడిగాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పనికివస్తుంది. ఎన్నికల తర్వాత అవసరమైతే అప్పుడే చూసుకోవచ్చని ఆయన అన్నారు.’ అని ఒక టిడిపి నాయకుడు చెప్పారు. 

పవన్ కళ్యాణ్‌కు, బాబుకు లోపాయికారీ ఒప్పందం వుందని, ప్రభుత్వ ఏర్పాటుకై టిడిపికి సీట్లు తక్కువ పడితే 20-25 సీట్లతో జనసేన దాన్ని ఆదుకుంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు బిహార్‌లో టిడిపి పాత్రను బిజెపి, పవన్ పాత్రను మరో నటుడు చిరాగ్ పోషిస్తున్నారని ఊహిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎన్నికల అనంతర పరిణామాలే నిరూపిస్తాయి.

ఎందుకంటే టిడిపి, జనసేనకు లోపాయికారీ పొత్తు వున్నా, లేకపోయినా అది బయటపడే అవసరం రాలేదు. రెండు పార్టీలూ ఘోరంగా దెబ్బతిని ప్రభుత్వం ఏర్పాటుకై ప్రయత్నించే అవకాశమే లేకుండా చేసుకున్నాయి. మరి బిహార్‌లో బిజెపికి ‘బి’ టీము ప్లాను ఉపయోగపడుతుందా?.

ఉపయోగపడాలంటే ఎల్‌జెపికి విజయావకాశాలు బాగా వుండాలి. ఉన్నాయా? లాలూ పార్టీకి ప్రధానమైన ఓటు బ్యాంకు ముస్లిములు, యాదవులు కాగా,  ఎల్‌జెపికి ప్రధానబలం కొన్ని దళిత కులాలు. బిహార్ ఓటర్లలో దళితుల ఓట్లు 15 శాతం. మొత్తం 22 దళిత కులాల్లో 69 శాతం జనాభా పాస్వాన్ యిత్యాది నాలుగు కులాలకు చెందినవారే. వీరు పాస్వాన్‌కు మద్దతుగా నిలుస్తారు. 

తక్కిన 31 శాతం జనాభాను మహాదళిత కులాలంటారు. వీటిని నీతీశ్ బాగా ఆకట్టుకుని తన ఓటుబ్యాంకుగా మలచుకున్నాడు. ఈ కులాలకు ప్రాతినిథ్యం వహించే హిందూస్తానీ ఆవామీ మోర్చాతో పొత్తు పెట్టుకుని 7 సీట్లు వారికి కేటాయించి ఆ ఓట్లు చీలిపోకుండా చూసుకుంటున్నాడు.

తన పార్టీ విజయం సాధించాలంటే దళిత కులాల ఓట్లు సరిపోవని చిరాగ్‌కు తెలుసు. యువతను ఆకర్షించాలి. అవతల తేజస్వి 10 లక్షల ఉద్యోగాలంటూ వారికి ఎర వేస్తున్నాడు. అందుకని యితను ‘బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నాడు. అతని తల్లి పంజాబీ కాబట్టి, తను చాలాకాలం బిహార్‌కు బయటే ఉన్నాడు కాబట్టి తాను పక్కా బిహారీని అని చాటుకోవాల్సిన అవసరం అతనికి పడింది. 

సోషల్ మీడియాలో తన పేరుకు ముందు ‘యువ బిహారీ’ అని అర్జంటుగా చేర్చుకున్నాడు. ఎల్‌జెపి 134 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత అసెంబ్లీలో ఆ పార్టీకున్న సీట్లు 2. ఈసారి ఎన్ని గెలుస్తాడో చూడాలి. పెద్ద సంఖ్యలో గెలిస్తే రాజకీయపు టెత్తుల్లో తండ్రిని మించిన తనయుడు చిరాగ్ అనాలేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?