Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: 'ఆచార్య' వైఫల్యానికి కారణం ఇదా!?

ఎమ్బీయస్‍: 'ఆచార్య' వైఫల్యానికి కారణం ఇదా!?

భారీ అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి ‘‘ఆచార్య’’ సినిమాకు పాసు మార్కులు రాలేదు. దానికి కారణాలేమిటి అనే దానిపై అనేకమంది సమీక్షకులు, విమర్శకులు వివరణలు యిచ్చారు. అందరి కంటె పరుచూరి గోపాలకృష్ణ గారు తన ‘‘పరుచూరి పాఠాలు’’లో చేసిన విశ్లేషణ నాకు బాగా నచ్చింది.  

ఆయన మంచి రచయిత మాత్రమే కాదు, సినీ కథాగమనం ఎలా ఉండాలి, తెలుగు సినిమాల్లో పాత్రధారి బట్టి పాత్రను మలుచుకోవలసిన అవసరం ఎలా పడుతుంది, పొరపాట్లు ఎలా జరుగుతూంటాయి.. యిలా అనేక విషయాలపై విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా బోధిస్తూంటారు.

రచయితలందరూ బోధకులు కాలేరు. ఒకవేళ బోధించినా, తక్కినవారి గురించి నిష్పక్షపాతంగా చెప్పినా, తమ తప్పుల దగ్గరకి వచ్చేసరికి ఒప్పుకోకుండా సమర్థించుకో చూస్తారు. కానీ ఆయన నిష్కపటంగా చెప్పేస్తారు. ఏ విధంగా మెరుగు పరుచుకోవచ్చో సూచిస్తారు.

తక్కిన భాషల్లో యిలాటి కార్యక్రమం ఉందో లేదో నాకు తెలియదు కానీ సినిమాలలో పని చేద్దామను కునేవారే కాదు, ఆ కళపై ఆసక్తి ఉన్నవారందరూ చూడాల్సిన వీడియో పాఠాలవి. ‘‘ఆచార్య’’ గురించి ఆయన ఏం చెప్పారో నేనిక్కడ రాయటం లేదు. అది కావాలంటే చూడండి. నా ఫోకస్ వేరే దానిపై ఉంది.

అనుభవజ్ఞుడైన జర్నలిస్టు, పత్రికాధిపతి, టీవీ ఛానెలాధిపతి, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఉండడమే కాక, వారిలో పలువురిని యింటర్వ్యూ చేస్తూ తన సినిమా పరిజ్ఞానం తక్కువేమీ కాదని నిరూపించుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆగస్టు 28 నాటి ‘‘కొత్త పలుకు’’లో రాసేదాకా, ‘‘ఆచార్య’’ ఫెయిల్యూరుకి కారణమిది అని తెలుసుకోలేక పోయాను.

తెర వెలుపల చిరంజీవి ప్రవర్తనే ఆ సినిమా వైఫల్యానికి కారణమని రాధాకృష్ణ తేల్చారు. జగన్‌పై ప్రజలకు వ్యతిరేకత ఉంది. చిరంజీవి అంతటివాడు ఆయన వద్ద చేతులు జోడించి వేడుకోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఆయన నటించిన ‘‘ఆచార్య’’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా దెబ్బ తినడానికి యీ వ్యతిరేకతా ఒక కారణమైంది – అని రాధాకృష్ణ సెలవిచ్చారు.

అనేకమంది నటులు రాజకీయాల్లోకి దిగి చూశారు. ప్రేక్షకులు వారి సినిమాలను ఆదరించినా, వారి రాజకీయాలను ఆమోదించని సందర్భాలు హీరోలు శివాజీ గణేశన్ వంటి వారి విషయంలో చూశాం. మరి విలన్‌గా నటించినా కోట శ్రీనివాసరావును ఎమ్మెల్యే చేశారు, సత్యనారాయణను ఎంపీ చేశారు. జగ్గయ్యగారిని రాజకీయ నాయకుడిగా ఆదరించి, ఎంపీగా ఎన్నుకున్నా, ఆయన్ని హీరోగా పెట్టి సినిమాలు తీస్తే చూడలేదు.

ఎమ్మెల్యేగా చేసిన చల్లా రామకృష్ణారెడ్డి జంధ్యాల డైరక్షన్‌లో తను హీరోగా ‘‘సత్యాగ్రహం’’ తీస్తే ప్రజలు చూడమనేశారు. చిరంజీవి తెరపై మెగాస్టార్. రాజకీయాల్లో అంతంతమాత్రం. పవన్‌ను తెరపై విరగబడి చూస్తారు, ఓట్లు అడిగితే మాత్రం వేయరు. దీన్ని బట్టి అర్థమౌతున్నదేమిటి? సినిమాలను, రాజకీయాలను ప్రజలు కలగలిపి చూడటం లేదు. అవి వేరే, యివి వేరే అని వాటి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి, విరక్తి చెంది, సినిమాలకు తిరిగి వచ్చినా ఆయన సినిమాలను హిట్ చేశారు. కమలహాసన్‌ రాజకీయాల్లోకి వచ్చి ఫెయిలయినా ‘‘విక్రమ్’’ను హిట్ చేశారు. ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వెలుగుతూ జాతీయ నాయకుల సమక్షంలో షూటింగు ప్రారంభించిన ‘‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’’ను ఫ్లాప్ చేశారు.

రాజకీయ నాయకులనే కాదు, యితర రంగాల్లో రాణించినవార్ని కూడా సినిమాల్లో ఆదరించిన సందర్భాలున్నాయి, తిరస్కరించిన సందర్భాలున్నాయి. క్రికెటర్‌గా పేరు గడించిన సలీం దురానీ ‘‘చరిత్ర’’ (1973)లో హీరోగా వేస్తే సినిమా ఫ్లాపయింది. శరవణా స్టోర్స్‌లో వస్తువులు సరసమైన ధరలకు యిస్తున్నాడు కదా పాపమని అరుళ్ హీరగా వేసిన ‘‘లెజెండ్’’ (2022) సినిమాని జనం చూడలేదు.

ఒకే హీరో సినిమాలు కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు. జయాపజయాలకు కథ, కథనం, అభినయం, సంగీతం.. యిలా అనేక కారణాలుంటాయి. సినిమాకు సంబంధించని విషయాల ప్రభావం వాటిపై ఎందుకు పడాలి?

రాధాకృష్ణ గారి లాజిక్ ప్రకారమైతే ‘‘ఆచార్య’’ తెలంగాణలో ఆడాలి కదా! ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువాళ్లు చూసే నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ కావాలి కదా! దాని హిందీ డబ్బింగు అధిక రేట్లకు అమ్ముడు పోవాలి కదా! ఆంధ్రలో వైసిపి వ్యతిరేకుల కంటె అభిమానులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టే వైసిపి ఎన్నికలు గెలుస్తోంది. అబ్బే యిప్పుడు ప్రజాదరణ తగ్గిపోయింది అనుకున్నా, కనీసం 40 శాతం మంది ఓటర్లు వైసిపికి ఉన్నారనుకోవాలి. మా నాయకుడికి చిరంజీవి ‘ఒంగిఒంగి దణ్ణాలు పెట్టాడు’ అనే సంబరంతోనైనా వాళ్లు చిరంజీవి సినిమాని విరగబడి చూసి ఆంధ్రలోనైనా ఆ సినిమాను ఎబౌ యావరేజి చేయాలి కదా!

రాధాకృష్ణ గారు యింతటితో ఆగలేదు. ఆచార్య దెబ్బ తినగా, పవన్ ‘‘భీమ్లా నాయక్’’ సక్సెస్ కావడం ప్రజాభిప్రాయం సినిమాలపై ప్రతిబింబిస్తోందనడానికి ఒక నిదర్శనం అని వాక్రుచ్చారు. ఒక సక్సెస్‌ఫుల్ మలయాళీ సినిమా నుంచి కథ తెచ్చుకోవడం ‘‘భీమ్లా నాయక్’’ విజయానికి దోహదపడిందని నేననుకున్నాను. కాదన్నమాట. బయట పవన్ ‘జగన్ తాటతీస్తా’ అంటూండం చేత ఆ సినిమా ఆడిందన్నమాట.

చిరంజీవి ఆ టెక్నిక్కు తెలియక, బయట హుందాగా, మర్యాదగా ఉండి సినిమా అపజయానికి తన వంతు కృషి చేశారన్నమాట! తన సిద్ధాంతానికి వత్తాసుగా రాధాకృష్ణ యింకో దృష్టాంతం చూపారు. బాలకృష్ణ హీరోగా ఎన్టీయార్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చింది. అవి బాగున్నా బాబు అధికారంలో ఉన్నపుడు వచ్చింది కాబట్టి ప్రజలు ఆదరించలేదని ఆయన అన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే వైయస్ బయోపిక్ ‘‘యాత్ర’’ వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది అనీ రాశారు. అంటే బాబు పాలనపై కోపంతో వైయస్‌పై తీసిన సినిమాని ఆదరించారని ఆయన భావం.

ఈ మాటను టిడిపి అభిమానులు ఎంతవరకు అంగీకరిస్తారో నాకు తెలియదు. బాబు పాలన సలక్షణంగా సాగిందని, అన్న క్యాంటీన్లు, పసుపుకుంకుమ వంటి పథకాలు, జన్మభూమి కమిటీలు అద్భుతంగా పని చేసి బాబును సమర్థపాలకుడిగా ప్రజల మదిలో ప్రతిష్ఠాపించాయని, అయితే బాబు మోదీతో కజ్జం పెట్టుకోవడం చేత కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్నికల వేళ టిడిపిని అష్టదిగ్బంధం చేసి ఓటమికి కారణమైందని వారి నమ్మకం.

అంతేకాదు, బాబు యింకో ఐదేళ్లు సిఎంగా కొనసాగితే ఆంధ్ర తెలంగాణను ఎక్కడ మించిపోతుందోననే దుగ్ధతో కెసియార్ జగన్‌కు ఆర్థిక, హార్దిక సాయం చేశాడని, దానికి ప్రతిగా జగన్ బందరును తెలంగాణ డ్రైపోర్టుగా ధారాదత్తం చేసేస్తానన్నాడని (ఇప్పటిదాకా యిది జరిగినట్లు లేదు) అందువలననే తెరాస టిడిపిని దెబ్బ తీసిందని వారంటారు.

ఇటువంటి అభిప్రాయాన్ని రాధాకృష్ణ కూడా పలుమార్లు తన వ్యాసాల్లో వ్యక్తపరిచారు. ఇప్పుడు మాత్రం ఎన్నికలకు కొన్ని నెలలకు ముందే ఆంధ్ర ప్రజల్లో బాబుపై వ్యతిరేకత, వైసిపిపై అభిమానం ఏర్పడిందని, అవే ఎన్టీయార్ బయోపిక్ విఫలం కావడానికి, వైయస్ బయోపిక్ సఫలం కావడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఆయన పవన్ సినిమాలను ప్రస్తావించలేదు కానీ వాటినీ యీ వాదనకు వత్తాసుగా వాడుకుని ఉండవచ్చు.

2016-18 మధ్య పవన్ నటించిన ‘‘సర్దార్ గబ్బర్‌సింగ్’’, ‘‘కాటమరాయుడు’’, ‘‘అజ్ఞాతవాసి’’ ఫ్లాపయ్యాయి. ఆ కాలంలో ఆయన ఆంధ్రలోని టిడిపి-బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నాడు. ఆ పార్టీల పరిపాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఆ సినిమాలను ఫ్లాప్ చేశారని రాధాకృష్ణ తన థీసిస్‌కి అనుబంధంగా రాసుకోవచ్చు.

జగన్‌కు చిరంజీవి చేతులు జోడించారనే రాధాకృష్ణ ఫీలయ్యారు. పవన్ ఏకంగా మాయావతికి పాదాభివందనమే చేశారు. అయితే దానికీ. ‘‘వకీల్ సాబ్’’కీ మధ్య రెండేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, యీ మధ్యలో ప్రజలు యీ వందనాలు మర్చిపోయారు కాబట్టి వకీలుగారు కేసు గెలిచారు.

ఈ సిద్ధాంతం ప్రకారం పవన్ యికపై కథ, స్క్రీన్‌ప్లే, హీరోయిన్ ఎంపిక, అంటూ నెలల తరబడి సమయాన్ని వృథా చేసుకోనక్కరలేదు. సినిమా రిలీజుకు వారం రోజుల ముందు జగన్‌పై తిట్ల దండకం ప్రారంభించవచ్చు. ఒకవేళ బాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన్నీ తిట్టాలి. తన సినిమాలు తెలంగాణలో కూడా ఆడాలంటే కెసియార్‌నూ తిట్టాలి.

రేపు బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితే ఆయన్నీనూ..! మన తెలుగు హీరోలు పాన్-ఇండియా పేరుతో బహుభాషా చిత్రాలలో నటిస్తున్నారు. అక్కడ కూడా ఆడాలంటే అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తిట్ల దండకం వల్లించాలి. వాళ్లెదురైనా తల ఎగరేసి పోవాలి తప్ప, నమస్కారాలు, హాయ్‌లు పనికి రావు. ఆ యా భాషలలో డబ్బింగ్ చెప్పేటప్పుడే స్థానిక భాషలో తిట్లు, దూషణలు రికార్డు చేసుకుని పెట్టుకోవాలి. ప్రి రిలీజ్ మార్కెటింగు టైములో వీటితో టీజరు చేయాలి. పాన్ ఇండియా అంటే ఆ మాత్రం కష్టాలు పడక తప్పదు.

ఇవన్నీ పక్కకు పెట్టి సీరియస్‌గా మాట్లాడుకోవాలంటే ఎన్టీయార్ బయోపిక్ ఫెయిలవడానికి ప్రధాన కారణం రెండు భాగాలుగా తీయడం. రెండిటిని కలిపి ఒక దానిలో చూపించేస్తే ఏదో త్వరత్వరగా నడిచిన ఫీలింగు కలిగేది. పైగా ఎన్టీయార్ గురించి అనేక దశాబ్దాలుగా అన్ని రకాల మాధ్యమాల్లో చెపుతూనే ఉన్నారు కాబట్టి అందరికీ అన్నీ తెలుసు. తెలిసున్న విషయాలనే తెర మీద చూశాం తప్ప కొత్తదేమీ కనబడలేదు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని విషయాలను కూడా పెద్ద గొప్ప విషయాలుగా సాగదీసి చూపించారు.

‘‘మహానాయకుడు’’లో బాలకృష్ణ అభినయం చాలా గొప్పగా ఉంది కానీ అక్కడా ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నామన్న ఫీలింగే. రెండు సినిమాలూ కలిపి, ఎమోషన్ కలిగించిన సీన్లు రెండు, మూడున్నాయంతే. ‘‘యాత్ర’’ సినిమాలో కథ చిన్నది. ఒక ఏడాది కాలాన్ని మాత్రమే తీసుకుని సినిమాగా మలిచారు. డాక్యుమెంటరీగా తీయవలసిన దానిలో ఎమోషన్లు గుప్పించారు. పైగా మమ్ముట్టి మహాద్భుతంగా నటించారు.

రెండిటికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఎన్టీయార్ బయోపిక్‌కి విపరీతమైన హైప్ యిచ్చి అంచనాలు పెంచి నిరాశ పరిచారు. వైయస్ బయోపిక్ (పూర్తి జీవితం చూపలేదు కాబట్టి బయోపిక్ అనడానికి లేదు) ఏ అట్టహాసం లేకుండా వచ్చి ముందు నిలబడింది. మెప్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్య నటుడి బయటి ప్రవర్తన పట్ల వ్యతిరేకత ఉంటే అతని సినిమా ఫ్లాపవుతుందని తీర్మానించడం తప్పు.

మమ్ముట్టిపై మనకు ప్రేమా లేదు, వ్యతిరేకతా లేదు. ఇక బాలకృష్ణ వరకు వస్తే బాబు పాలించే రోజుల్లోనే వచ్చిన ‘‘జైసింహా’’ వంటి హిట్స్ ఉన్నాయి. ఎన్టీయార్ సంగతి చూడండి. 1989-94 మధ్య వచ్చిన వాటిల్లో మోహన్‌బాబుతో కలిసి వేసిన ‘‘మేజర్ చంద్రకాంత్’’ మాత్రమే హిట్. తనే హీరోగా వేసిన ‘‘విశ్వామిత్ర’’, ‘‘సామ్రాట్ అశోక’’, ‘‘శ్రీనాథ’’ ఫ్లాప్స్. అయినా 1994 ఎన్నికలలో ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. రాజకీయాలను, సినిమాలను విడివిడిగా చూడాలని ప్రజలకు స్పష్టంగా తెలుసు. పాత్రికేయులే గందరగోళ పడుతున్నారు.

చిరంజీవి విషయానికి వస్తే ‘చేతులు జోడించి వేడుకోవడం’ అనే వర్ణన అన్యాయం. వేడుకోవాల్సిన ఖర్మ ఆయనకేముంది? జగన్‌కు వేడుకుంటే సినిమా ఒక్కసారిగా బాగుపడిపోయి హిట్ అయిపోతుందా? టిక్కెట్ల ధర అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఆ సినిమా విడుదల కాకుండా జగన్ ఏమీ అడ్డుకోలేదే! పరిశ్రమ మొత్తానికి ఏది మంచిదని అప్పుడనుకున్నారో (తర్వాత అభిప్రాయాలు మారాయి) వాటి గురించి అడగడానికి, పరిశ్రమ ప్రతినిథిగా వెళ్లారు చిరంజీవి. జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను అడిగారు. బాబు ఉంటే ఆయన్నే అడిగేవారు. అంతమాత్రం చేత వేడుకోవడం అయిపోతుందా? చేతులు జోడించి.. అని సాగదీస్తున్నారు. చేతులు జోడించకపోతే అది నమస్కారం ఎలా అవుతుంది?

మనం వెళ్లి చిరంజీవికి దణ్ణం పెట్టినా తిరిగి ఆయనా రెండు చేతులూ కలిపే నమస్తే అంటాడు. బాక్స్ బద్దలు కొడతా అంటూ పిర్ర మీద చరచడు. అది సినిమాలో వేసిన వేషమంతే! పవన్ కళ్యాణ్ యిది అర్థం చేసుకోకుండా తన అన్నగారికి ఘోరావమానం జరిగినట్లు రచ్చ చేసి అన్నగారికి వేదన కలిగిస్తున్నాడు. ఇప్పుడీ రాధాకృష్ణగారూ మొదలుపెట్టాడు. పైగా దానివలన ‘‘ఆచార్య’’ పోయిందని తీర్మానిస్తున్నాడు. రేపు చిరంజీవి ‘‘గాడ్‌ఫాదర్’’ సినిమా హిట్టయితే అప్పుడు యీయన ఏం రాస్తాడు? చంద్రబాబుతో కలిసి నవ్వుతూ మాట్లాడినందువలననే.. అని అంటాడా?

ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?