Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కమల్‌నాథ్‌ ఎందుకు?

ఎమ్బీయస్‌: కమల్‌నాథ్‌ ఎందుకు?

కాంగ్రెసులో పాత తరాన్ని తప్పించి కొత్త రక్తం తెస్తానని రాహుల్‌ గాంధీ అనేక సార్లు చెప్పారు. అప్పుడప్పుడు యువకులను (అనగా 60 కంటె తక్కువ వయసున్నవారని అర్థం) కొన్ని ముఖ్యమైన పోస్టులలో నియమించడం కూడా జరుగుతోంది. త్వరలో ఎన్నికలు రాబోతున్న మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా  యువకుడైన జ్యోతిరాదిత్య సింధియాను ఎంపిక చేసి అతనికే రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగిస్తారని అతనితో సహా అందరూ అనుకుంటూ ఉండగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 71 ఏళ్ల కమల్‌నాథ్‌ను నియమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాష్ట్ర అధ్యక్షుడు కావడమంటే ముఖ్యమంత్రి కావడానికి దారి సుగమం చేసినట్లే. ఎందుకంటే టిక్కెట్ల పంపిణీలో అతనిదే ప్రధాన భూమిక అవుతుంది. ఎన్నికల అనంతరం కాంగ్రెసు ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. రాష్ట్రంలోని ఓటర్లలో 30 సం.ల కంటె తక్కువ వయసున్న యువకులు 25% మంది ఉన్నారు. వారు కమల్‌ నియామకంతో ఉసూరుమన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరి రాహుల్‌ ఎందుకు యీ పని చేసినట్లు అంటే వేదికలపై ప్రసంగాలు యివ్వడం వేరు, క్షేత్రస్థాయిలో కఠోర వాస్తవాలు ఎదుర్కోవడం వేరు అని సమాధానం వస్తుంది. 

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసును గెలుపు పలకరించి 15 ఏళ్లయింది. 1998లో 172 సీట్లున్న కాంగ్రెసు రాష్ట్రవిభజన తర్వాత 2003లో 38 సీట్లకు పడిపోయింది. తర్వాతి ఎన్నికలలో 71, 58 తెచ్చుకుంది. అవే ఎన్నికలలో బిజెపి 173, 143, 165 తెచ్చుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం యీ మూడు ఎన్నికలలో 9%, 5%, 8% ఉంది. వరుస ఓటముల కారణంగా కాంగ్రెసు గుణపాఠాలు నేర్చుకుని నాయకులందరూ సంఘటితం కావటం లేదు. ముఠాలుగా విడిపోయి ఉన్నారు. అటు బిజెపి తరఫున చూస్తే ఈ 15 సం.లు శివరాజ్‌ చౌహాన్‌ ఏకధాటీగా పాలించుకుంటూ పోతున్నాడు.

వచ్చేసారికి కూడా బిజెపి తరఫున అతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ఉండేట్లున్నాడు. ఈ దీర్ఘపాలన వలన ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడం సహజం కాబట్టి దాన్ని అధిగమించడానికి అతను చేయిని గిమ్మిక్కు లేదు. ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ సంక్షేమ పథకాల జోరు మరీ పెంచేశాడు. సగటున వారానికి ఒకటి చొప్పున పథకాలు వెలువడుతున్నాయి. అసంఘటిత కార్మి వర్గాన్ని ఆకర్షించడం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చుతో పథకాలు ప్రవేశపెట్టారు. గర్భం ధరించిన స్త్రీకి 4,000 రూ.లు యిస్తారు. ప్రసవం తర్వాత 12,500 యిస్తారు.

ఈ పథకం కింద రిజిస్టర్‌ చేసుకున్న కుటుంబాలలో ఇంటి యజమాని మరణిస్తే పరిహారం, వైద్యచికిత్స, గృహవసతి, డాక్టరేటు స్థాయి వరకు పిల్లల చదువుల భారం, వాళ్లకు కోచింగు ఫీజు, సొంత వ్యాపారం మొదలుపెట్టడానికి ఋణాలు -యివన్నీ ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే 2 కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఏప్రిల్‌ 16 న ప్రకటించిన మరో పథకం ప్రకారం గోధుమ, వరి పండించినవారికి క్వింటాల్‌కు రూ.200 రూ.ల చొప్పున బోనస్సు, అదీ పాత తేదీల నుండి, యిస్తామన్నారు. దీనికి గాను రూ.1,670 కోట్ల ఖర్చు. అదే నెలలో 97 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలు మూడున్నర రెట్లు పెంచారు. ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 చేశారు. జర్నలిస్టులకు రూ.4 లక్షల వరకు యిన్సూరెన్సు, వాళ్లు తీసుకున్న గృహఋణాలకు సబ్సిడీ.

ఇలా ఎన్నికల సంవత్సరంలో ధారాళంగా వరాలు కురిపిస్తున్నాడు. పైగా 'కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తున్న జ్యోతిరాదిత్య రాజవంశీకుడు, నేను సామాన్యుణ్ని. నాకు సామాన్యుల కష్టాలు తెలుసు. అందుకే యివన్నీ..' అని చెప్పుకుంటున్నాడు. 15 ఏళ్లగా ఎందుకు చేయలేదు అని అడిగితే సమాధానం రాదనుకోండి. 

ఇతన్ని జ్యోతిరాదిత్య ఒక్కడూ ఎదుర్కోవడం అంత సులభమైన పని కాదని రాహుల్‌కు అర్థమైంది. అందుకే కమలనాథ్‌ను రంగంలోకి దించాడు. కమల్‌ది కలకత్తాకు చెందిన ధనిక వ్యాపార కుటుంబం. కాన్పూరులో పుట్టాడు. డూన్‌ స్కూలులో సంజయ్‌ గాంధీతో బాటు చదివాడు. అనేక వ్యాపారాలు చేస్తాడు. ఎన్నికలకు ముందు యిచ్చిన అఫిడవిట్‌ ప్రకారం అతని ఆస్తి రూ.187 కోట్లు. సంజయ్‌ తను రాజకీయాల్లోకి వచ్చాక యితన్నీ లాక్కుని వచ్చాడు.

అతనికి ఏ మాత్రం పరిచయం లేని గిరిజనులు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే నియోజకవర్గంలో 1980లో పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాడు. ఇందిరా గాంధీ వచ్చి 'ఇతను నా మూడో కొడుకు, గెలిపించండి' అని ప్రచారం చేసింది. ఇతను గెలిచాడు. అప్పణ్నుంచి వరుసగా గెలుస్తూనే వచ్చాడు. 37 ఏళ్లగా, 9 సార్లు గెలిచిన రికార్డు యితనిదే. అనేక సార్లు మంత్రిగా పని చేసి సమర్థుడిగా నిరూపించుకున్నాడు. స్వయంగా వ్యాపారస్తుడు కావడంతో అనేకమంది వ్యాపారస్తులతో సత్సంబంధాలున్నాయి. మధ్యప్రదేశ్‌ కాంగ్రెసును నిధుల కొరత వేధిస్తోంది. కమల్‌ అయితే నిధులు బాగా సేకరించగలడని అతన్ని నియమించారు అని వినికిడి.

అంతేకాదు, రాష్ట్ర కాంగ్రెసులో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ కమల్‌కు మద్దతు పలికాడు. కమల్‌కు ఎవరితోనైనా సర్దుకుపోయే మనస్తత్వం ఉంది. సంజయ్‌ అనుచరుడిగా ఉన్నా, రాజీవ్‌కు సన్నిహితుడయ్యాడు. ఆ తర్వాత పివి కాబినెట్‌లోనూ పనిచేశాడు. పివి అంటే పడని సోనియాకూ దగ్గరయ్యాడు. ప్రతిపక్షాల వారితో బేరసారాలకు సోనియా కమల్‌నే పంపేది. 2016లో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుణ్ని పంపడానికి ఇద్దరు ఎమ్మెల్యేల సాయం పడింది. సోనియా చెప్పగా కమల్‌ మాయావతితో చెప్పి ఏర్పాటు చేశాడు. ప్రతి సారి 5% ఓట్లు గెలుస్తున్న బిఎస్పీ రాబోయే ఎన్నికలలో కాంగ్రెసుకు అక్కర రావాలంటే కమల్‌ ఉపయోగం ఎంతైనా ఉంటుంది. 

కులాల సమీకరణలు కూడా రాజకీయాల్లో ముఖ్యమే. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 15%, ఎస్టీలు 20%, ఒబిసిలు 51% ఉన్నారు. జ్యోతిరాదిత్య, కమల్‌ యిద్దరూ అగ్రకులాలకు చెందిన వారే కాబట్టి, బాలా బచ్చన్‌ అనే ఎస్టీని, సురేంద్ర చౌదరి అనే ఎస్సీని, జీతూ పట్వారీ, రామ్‌నివాస్‌ రావత్‌ అనే ఒబిసిలని, మొత్తం నలుగురు యితర కులాల వాళ్లను వర్కింగ్‌ ప్రెసిడెంట్లగా నియమించారు. జ్యోతిరాదిత్యను వదిలేయకుండా అతన్ని ప్రచార కమిటీకి అధినేతగా నియమించారు. ఇద్దరూ కలిసి ట్రక్కులో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ పదవుల గురించి ఆశపడలేదు అని కమల్‌ అంటున్నా, కమల్‌ అంటే నాకు చాలా గౌరవం అని జ్యోతిరాదిత్య అంటున్నా ఫలితాల అనంతరం ఏమవుతుందో ఎవరికీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?